నేటి నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ | Engineering Counseling From Today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌

Published Thu, Jul 4 2024 4:38 AM | Last Updated on Thu, Jul 4 2024 4:38 AM

Engineering Counseling From Today

12 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ , స్లాట్‌ బుకింగ్‌ 

8 నుంచి వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ 

పెండింగ్‌లోనే కాలేజీల అఫ్లియేషన్‌.. తేలని సీట్ల లెక్క 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే కౌన్సెలింగ్‌ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. 4వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. ఇందుకు 12వ తేదీ వరకు అవకాశం ఉంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వెబ్‌ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. https://tgeapcet.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్‌ అయి రిజిస్ట్రేషన్ , స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాలని ఈఏపీసెట్‌ కౌన్సెలింగ్‌ క్యాంప్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 

ఈ ఏడాది జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఇంజనీరింగ్‌ విభాగం నుంచి 1,80,424 మంది అర్హత సాధించారు. వీళ్ళంతా కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ర్యాంకు ఆధారంగా కన్వినర్‌ కోటా సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది లెక్కల ప్రకారం కన్వీనర్‌ కోటా సీట్లు 90 వేల వరకూ ఉన్నాయి. స్లాట్‌ బుక్‌ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 8వ తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 

8 వరకు ఆల్‌ క్లియర్‌! 
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలు ఇంతవరకూ క్యాంపు కార్యాలయానికి అందలేదు. ఈ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే విద్యా ర్థులు వెబ్‌ ఆప్షన్లపై కసరత్తు చేయడానికి వీలుటుంది. ఈ వివరాలు ఈ నెల 8వ తేదీ నాటికి అందుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అఫ్లియేషన్‌ రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వీసీలు తమ పదవీ కాలం ముగిసేలోపే ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు చేపట్టారు. 

ఫ్యాకల్టీ, మౌలిక వసతులు పరిశీలించారు. అయితే అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి కాలేజీల తనిఖీలు చేయాలని కొత్తగా వీసీలుగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్‌ అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే సీట్ల వివరాలు అందలేదని తెలుస్తోంది. దీంతో పాటు డిమాండ్‌ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గించి, సీఎస్‌ఈ సీట్లు పెంచాలని పలు కాలేజీలు కోరుతున్నాయి. 

ఈ ప్రతిపాదనలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి లభించింది. కానీ యూనివర్సిటీల నుంచి అనుమతి రావాల్సి ఉంది. దీంతో ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ ప్రక్రియ అంతా విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చే సమయానికి పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.  

ఇంజనీరింగ్‌ తొలి దశ కౌన్సెలింగ్‌ ఇలా.. 
4–7–24 నుంచి 12–7–24        రిజిస్ట్రేషన్, స్లాట్‌ బుకింగ్‌ 
6–7–24 నుంచి 13–7–24        ధ్రువపత్రాల పరిశీలన 
8–7–24 నుంచి 15–7–24        వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడం 
19–7–24                                సీట్ల కేటాయింపు 
19–7–24 నుంచి 23–7–24      సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement