engineering counselling
-
సీట్లొచ్చినా.. చేరేదెవరు?
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల పెంపు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సీట్ల పెంపును ప్రభుత్వం అడ్డుకుంటే, కాలేజీలే సీట్లు భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అనుమతించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. క్లాసులు కూడా మొదలయ్యాయి. విద్యార్థులంతా ఇంజనీరింగ్, డిగ్రీ, లేదా ఇతర రాష్ట్రాల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుతో పెరిగే దాదాపు 3 వేల సీట్లు ఎలా భర్తీ అవుతాయనేది అర్థం కావడం లేదు. కోర్టు తీర్పు రాగానే ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లు చేపట్టాయి. ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటున్నాయి. విద్యాజ్యోతి కాలేజీలో 120 సీట్లు పెరిగితే 15 మంది స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరారు. మిగతా మూడు కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత మేర జరిగాయి. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సీట్ల పెంపును అడ్డుకునేందుకు ప్రభుత్వం.. ఎలాగైనా సీట్లు పెంచుకునేందుకు ప్రైవేటు కాలేజీలు న్యాయపోరాటానికీ వెనుకాడటం లేదు.వచ్చే ఏడాదిపైనే ఆశడిమాండ్ లేని ఇతర కోర్సుల్లో సీట్లు తగ్గించుకుని కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ప్రైవేటు కాలేజీలు సీట్లు పెంచుకున్నాయి. అనుమతులూ తెచ్చుకున్నాయి. దీనికి ప్రభుత్వం ససేమిరా అనడం, వివాదం కోర్టు మెట్లెక్కడం తెలిసిందే. ఆలస్యంగా తీర్పు వచ్చినా ప్రైవేటు కాలేజీలు సీట్లపై ఎందుకు ఆసక్తి చూపుతున్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. కాలేజీలు ఈ సంవత్సరాన్నే దృష్టిలో పెట్టుకోలేదు.ఇప్పుడు సీట్లు పెరిగితే, వచ్చే ఏడాదీ ఇది కొనసాగుతుంది. ఈ ఏడాది ప్రవేశాలు కాకున్నా, కంప్యూటర్ సీట్లు కావడం వల్ల వచ్చే ఏడాది అన్నీ భర్తీ అయ్యే వీలుంది. ఒక్కో బ్రాంచీలో 120 సీట్లు ఉంటే, మేనేజ్మెంట్ కోటా కింద దాదాపు 33 సీట్లు ఉంటాయి. కంప్యూటర్ సైన్స్‌లో ఒక్కో సీటు రూ.16 లక్షలపైనే పలుకుతుంది. డిప్లొమా కోర్సుల ద్వారా రెండో ఏడాదిలోనూ ఇంజనీరింగ్ సీట్లు కేటాయిస్తారు. ఇందులోనూ మేనేజ్మెంట్ కోటా సీట్లు పెంచుకునే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వంపై న్యాయ పోరాటానికి కాలేజీలు సిద్ధపడుతున్నాయి.ప్రభుత్వం పట్టుదల ఎందుకు?హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే స్పాట్ ద్వారా చేరిన విద్యార్థులకు ఇబ్బంది తప్పదని అధికార వర్గాలు అంటున్నాయి. సీట్ల పెంపును అడ్డుకోవడాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రైవేటు కాలేజీలపై నియంత్రణ దిశగా వెళ్లాలనుకుంటున్న ప్రభుత్వానికి ఈ విషయం కీలకమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు సీట్ల పెంపును అనుమతిస్తే, భవిష్యత్‌లో ప్రతీ కాలేజీ సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకునే ప్రమాదం ఉందని, సీఎస్ఈ దాని అనుబంధ కోర్సులే ఉండే అవకాశముందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగానే సీట్ల పెంపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు వరకూ పోరాడుతోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు.ఇది ప్రభుత్వం కక్షేమౌలిక వసతులన్నీ ఉండటం వల్లే సీట్ల పెంపును కోరాం. ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్ అనుమతించింది. కోర్టు కూడా పెంచుకోవచ్చని తెలిపింది. అయినా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం దారుణం. విద్యారంగంలోకి రాజకీయాలను తీసుకురావడం మంచిది కాదు. సీఎస్ఈ సీట్ల కోసం విద్యార్థుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో సీట్లు లేకుండా చేయడం సమంజసం కాదు. - సూర్యదేవర నీలిమ (ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ నిర్వాహకురాలు) -
ముగిసిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ దాదాపు పూర్తయింది. స్లైడింగ్‌లో బ్రాంచీలు మారిన విద్యార్థులు రిపోర్టు చేసే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ దశలోనూ మిగిలిన 11,836 సీట్లకు ప్రతి కాలేజీ స్పాట్ అడ్మిషన్లు చేపడతాయి. యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లను కాలేజీలు నింపేశాయి. వాటిల్లో వాస్తవాలను పరిశీలించిన తర్వాత అధికారులు ర్యాటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకూ సన్నాహాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ కొన్ని కాలేజీలు ర్యాటిఫై కోసం ఉన్నత విద్యా మండలికి వస్తాయి. మొత్తం మీద ఈ నెలాఖరు నుంచి అన్ని కాలేజీలు క్లాసులు మొదలు పెడతాయని అధికారులు చెబుతున్నారు. ప్రధాన కాలేజీల్లో 100 శాతం కనీ్వనర్ కోటా కింద 175 కాలేజీల్లో ఈ ఏడాది 86,943 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. స్లైడింగ్ పూర్తయ్యాక 75,107 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 11,836 సీట్లు మిగిలాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటాసైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ సహా పలు కంప్యూటర్ అనుబంధ కోర్సుల్లో 61,587 సీట్లు అందుబాటులో ఉండగా ఇప్పటివరకు 57,637 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 3,950 సీట్లు మిగిలాయి. అందులో సీఎస్ఈలో 1,305 సీట్లు, ఐటీలో 385, డేటా సైన్స్‌లో 712, ఏఐఎంఎల్‌లో 787 సీట్లు మిగిలాయి. అవన్నీ చిన్న కాలేజీల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లోని టాప్ కాలేజీల్లో కంప్యూటర్ సీట్లన్నీ భర్తీ అయ్యాయి. స్పాట్ అడ్మిషన్లలోనూ మిగిలిన సీట్లకు డిమాండ్ ఉండదని అధికారులు చెబుతున్నారు. ఆ మూడు కోర్సులకు కనిపించని ఆదరణ బీటెక్ సివిల్, మెకానికల్, ఈఈఈ కోర్సుల్లో ఈ ఏడాది దాదాపు 10 వేల సీట్లు తగ్గాయి. వాటి స్థానంలో సీఎస్సీ, ఇతర కంప్యూటర్ కోర్సులకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. అయితే అందుబాటులో ఉన్న సీట్లలోనూ విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో 1,708 సీట్లు, ఈఈఈలో 2,162, సివిల్‌లో 1,442, మెకానికల్‌లో 1,803 సీట్లు మిగిలాయి. తొలి కౌన్సెలింగ్ నుంచి స్లైడింగ్ వరకు ఈ బ్రాంచీల్లో ఇదే ట్రెండ్ కనిపించింది. స్లైడింగ్ సమయంలో దాదాపు 5 వేల మందికి బ్రాంచీలు మారాయి. అందులో 3,500 మందికి కంప్యూటర్, అనుబంధ బ్రాంచీల్లో సీట్లు లభించాయి. యాజమాన్య కోటాపై నిఘా యాజమాన్య కోటా కింద 30 శాతం సీట్లను కాలేజీలు భర్తీ చేస్తాయి. 15 శాతం జేఈఈ, ఈఏపీసెట్ ర్యాంకర్లకు కేటాయించి ఆ తర్వాత ఇంటర్ మార్కులను ప్రామాణికంగా తీసుకోవాలి. మిగిలిన 15 శాతం సీట్లను ప్రవాస భారతీయులు స్పాన్సర్ చేసిన వారికి ఇస్తారు. అయితే యాజమాన్య కోటా సీట్లలో కాలేజీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయనే ఫిర్యాదులొచ్చాయి. ర్యాంకర్లను పట్టించుకోకుండా ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికే సీట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించి ప్రతి దరఖాస్తునూ ర్యాటిఫై చేసేప్పుడు సాంకేతిక, ఉన్నత విద్యామండలి అధికారులు నిశితంగా పరిశీలించాలి. కానీ ఏటా ఇది నామమాత్రపు తంతుగా నడుస్తోంది. ఈసారి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, అనర్హులకు సీట్లు ఇస్తే ర్యాటిఫై చేయొద్దని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ర్యాటిఫికేషన్‌కు ఈసారి యంత్రాంగాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. -
టాప్ 27కే టిక్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపునకు నిర్వ హించిన రెండోదశ కౌన్సెలింగ్‌లో ఆప్షన్ల ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. గడువు ముగిసే సమయానికి మొత్తం 58 వేల మంది 61 లక్షల వరకూ ఆప్షన్లు ఇచ్చారు. ఎక్కు వ మంది విద్యార్థులు టాప్ 27 కాలేజీలకే తొలి ఆప్షన్లు ఇచ్చారు.45 వేల మంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఏఐఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్ లాంటి కోర్సులను ఎక్కువగా కోరుకున్నారు. జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ చుట్టుపక్కలున్న సాధారణ కాలేజీలకు తక్కువ ఆప్షన్లు వచ్చాయి. ఈ కాలేజీల్లో కంప్యూటర్ బ్రాంచీలున్నా మెజారిటీ విద్యార్థులు ప్రాధాన్యతనివ్వలేదు. ఫలితంగా టాప్ 50 కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులకు పోటీ కని్పస్తోంది. మిగతా కాలేజీల్లో తేలికగా సీట్లు వచ్చే వీలుంది. ఈసారైనా ‘కంప్యూటర్’సీటు వచ్చేనా? రెండో దశ కౌన్సెలింగ్‌లో కనీ్వనర్ కోటా కింద 7,024 సీట్లు భర్తీ చేస్తారు. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 22,753 సీట్లు మిగిలిపోయాయి. పెరిగిన సీట్లతో కలుపుకొంటే 29,777 సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే తొలి దశలో సీట్లు వచి్చనా ఈసారి ఎక్కువ మంది టాప్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. సివిల్, మెకానికల్ బ్రాంచీల్లో సీట్లు వచి్చన వాళ్ళూ కంప్యూటర్ కోర్సులకు రెండో దశలో ఆప్షన్లు ఇచ్చారు. ఈ సంవత్సరం 176 కాలేజీలు కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి.మొత్తం 1,11,480 సీట్లు అందుబాటులోఉన్నాయి. అయితే గత ఏడాది 1,10,069 సీట్లు అందుబాటులో ఉండటాన్ని బట్టి చూస్తే మొత్తంగా 1,411 సీట్లు మాత్రమే పెరినట్టయ్యింది. కాగా మొత్తం సీట్లలో 70 శాతం కనీ్వనర్ కోటా కింద భర్తీ చేయాల్సి ఉండగా కనీ్వనర్ కోటా సీట్లలో 75 శాతం కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. దీంతో విద్యార్థులు రెండో దశ కౌన్సెలింగ్‌లో కంప్యూటర్ బ్రాంచీ సీట్లు వస్తాయని ఆశిస్తున్నారు. ఆశలు పెట్టుకున్నారు. ఆశలు పెంచుతున్న కటాఫ్ రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించి కటాఫ్ ఈ సంవత్సరం పెరిగింది. సీట్లు పెరగడం, కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు రావడమూ దీనికి కారణం. దీంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో సీట్లు పొందే ర్యాంకుల్లో తేడా కని్పస్తోంది. మొదటి దశ కౌన్సెలింగ్‌లో ఇది స్పష్టమైంది.ఉస్మానియా యూనివర్సిటీలో గత ఏడాది బాలురకు 1,391 ర్యాంకుకు సీటు వస్తే, ఈ సంవత్సరం 1,850వ ర్యాంకరుకు కూడా సీటు వచి్చంది. బాలికల్లో గత ఏడాది 1,598గా ఉన్న ర్యాంకు ఇప్పుడు 1,850వ ర్యాంకుకు పెరిగింది. జేఎన్టీయూహెచ్ సుల్తాన్‌పూర్‌లో గత ఏడాది బాలురకు 8,471 ర్యాంకుకు సీటు వస్తే, ఈ సంవత్సరం 12,046కు కూడా సీటు వచి్చంది. రెండో దశ కౌన్సెలింగ్‌లో కొత్త సీట్లు రావడంతో ఎక్కువ ర్యాంకు వచ్చినా సీట్లు పొందే అవకాశం ఉందేని భావిస్తున్నారు. జాడలేని టాపర్లు ఈఏపీసెట్‌లో వెయ్యిలోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు మొదటి కౌన్సెలింగ్‌లో సీటు కోసం ముందుకు రాలేదు. ఓపెన్ కేటగిరీలో 200 ర్యాంకు వరకూ కేవలం ఒక్కరే సీటు పొందారు. 500 లోపు వాళ్ళు 10 మంది, వెయ్యిలోపు ర్యాంకు వాళ్ళు 74 మంది సీట్లు పొందారు. 10 వేల లోపు ర్యాంకు వాళ్ళు 1,786 మంది సీట్లు పొందారు. అయితే ఐఐటీలు, జాతీయ ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఆయా సంస్థల్లో సీట్లు ఆశించినా రాని ఎక్కువ మంది రాష్ట్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం ప్రయతి్నంచే వీలుంది. దీంతో రెండోదశ సీట్ల కేటాయింపుపై ఆసక్తి నెలకొంది. -
త్వరలో తొలిదశ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తొలి దశ కౌన్సెలింగ్ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఆప్షన్లకు ఇచ్చిన గడువు ముగిసింది. 96 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. వివిధ కాలేజీలు, బ్రాంచీలకు మొత్తం 62 లక్షల ఆప్షన్లు అందినట్టు అధికారు లు తెలిపారు. వాస్తవానికి ఆప్షన్ల గడు వు 15వ తేదీతో ముగిసింది. కొత్తగా 2,640 సీట్లు పెరగడంతో గడువును 18 వరకు పొడిగించారు. 19న సీట్ల కేటాయింపు చేపట్టాల్సి ఉంది. కానీ ఆప్షన్ల గడువు పొడిగించడంతో ఈ తేదీలో మార్పు చోటు చేసుకుంది. అందిన ఆప్షన్లపై సాంకేతిక విద్యా విభాగం కసరత్తు చేస్తోంది. ఒకటి రెండురోజుల్లో సీట్ల కేటాయింపు చేపట్టే వీలుందని సంబంధిత అధికారులు తెలిపారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో 11 వేల సీట్లను ప్రైవేటు కాలేజీలు రద్దు చేసుకున్నాయి. వీటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో సీట్లు పెంచాలని కోరాయి. కానీ ప్రభుత్వం దీనికి అనుమతించలేదు. ఈ సీట్లపై మొదటి కౌన్సెలింగ్ వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 75 శాతం సీఎస్ఈ ఆప్షన్లేరాష్ట్రంలోని 173 కాలేజీలు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. ఇప్పటివరకు 1,01,661 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కన్వీనర్ కోటాలో తొలి విడత 72,741 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులోనే పెరిగిన 2,640 సీట్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఆప్షన్లలో 75 శాతం విద్యార్థులు మొదటి ప్రాధాన్యతగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులనే ఎంచుకున్నారు. ఎంసెట్‌లో వందలోపు ర్యాంకులు వచ్చిన విద్యార్థులంతా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలు, టాప్ 5లో ఉన్న ప్రైవేటు కాలేజీలకు సీఎస్సీ, ఇతర కంప్యూటర్ బ్రాంచీలకే తొలి ప్రాధాన్యత ఇచ్చారు. జేఈఈ ద్వారా ‘నిట్’లో సీట్లు పొందిన వాళ్లు కూడా టాప్ కాలేజీలకు ఆప్షన్లు ఇచ్చారు. అయితే ఇందులో 80 శాతం విద్యార్థులు సీట్లు వచ్చినా చేరే అవకాశం ఉండదు. -
నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. 4వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు 12వ తేదీ వరకు అవకాశం ఉంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. https://tgeapcet.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అయి రిజిస్ట్రేషన్ , స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఈఏపీసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఇంజనీరింగ్ విభాగం నుంచి 1,80,424 మంది అర్హత సాధించారు. వీళ్ళంతా కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ర్యాంకు ఆధారంగా కన్వినర్ కోటా సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది లెక్కల ప్రకారం కన్వీనర్ కోటా సీట్లు 90 వేల వరకూ ఉన్నాయి. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 8వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 8 వరకు ఆల్ క్లియర్! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలు ఇంతవరకూ క్యాంపు కార్యాలయానికి అందలేదు. ఈ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే విద్యా ర్థులు వెబ్ ఆప్షన్లపై కసరత్తు చేయడానికి వీలుటుంది. ఈ వివరాలు ఈ నెల 8వ తేదీ నాటికి అందుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అఫ్లియేషన్ రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వీసీలు తమ పదవీ కాలం ముగిసేలోపే ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు చేపట్టారు. ఫ్యాకల్టీ, మౌలిక వసతులు పరిశీలించారు. అయితే అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి కాలేజీల తనిఖీలు చేయాలని కొత్తగా వీసీలుగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే సీట్ల వివరాలు అందలేదని తెలుస్తోంది. దీంతో పాటు డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గించి, సీఎస్ఈ సీట్లు పెంచాలని పలు కాలేజీలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి లభించింది. కానీ యూనివర్సిటీల నుంచి అనుమతి రావాల్సి ఉంది. దీంతో ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ ప్రక్రియ అంతా విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చే సమయానికి పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్ తొలి దశ కౌన్సెలింగ్ ఇలా.. 4–7–24 నుంచి 12–7–24 రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ 6–7–24 నుంచి 13–7–24 ధ్రువపత్రాల పరిశీలన 8–7–24 నుంచి 15–7–24 వెబ్ ఆప్షన్లు ఇవ్వడం 19–7–24 సీట్ల కేటాయింపు 19–7–24 నుంచి 23–7–24 సెల్ఫ్ రిపోర్టింగ్ -
‘గుర్తింపు’నకు గ్రహణం!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27 నుంచి జరగాల్సిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త షెడ్యూల్‌ను సాంకేతిక విద్య విభాగం మంగళవారం విడుదల చేసింది. ఈ మార్పునకు కారణాలేంటనేది అధికారులు వెల్లడించలేదు. కొన్ని కాలేజీలు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అను మతి పొందాల్సి ఉందని మాత్రమే చెబుతున్నారు. కానీ వాస్తవానికి రాష్ట్ర యూనివర్సిటీల నుంచి ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు రాలేదు. ఇది వస్తేనే ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయనేది తెలుస్తుంది. కౌన్సెలింగ్ వెబ్సైట్లో కాలేజీలు, కోర్సుల వివరాలు ఉంటేనే విద్యార్థులు ఆప్షన్లు ఇవ్వగలుగుతారు. ఏటా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోంది. కానీ ఈ ఏడాది ముందే పూర్తయింది. మే 21తో 10 విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల పదవీకాలం ముగిసింది. అయితే వారు ఆలోగానే కాలేజీల్లో తనిఖీలు పూర్తి చేశారు. కానీ కాలేజీలకు అఫిలియేషన్ ఇచ్చే సమయంలో తనిఖీలపై ఫిర్యాదులొచ్చాయి. దీంతో కాలేజీలకు ఇప్పుడే గుర్తింపు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం ఆదేశించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మే 21 తర్వాత వీసీల పదవీకాలం ముగియడంతో ప్రతి వర్సిటీకి ఐఏఎస్ అధికారులను ఇన్చార్జి వీసీలుగా ప్రభుత్వం నియమించింది. పాత వీసీలు చేపట్టిన తనిఖీలపై వారికి అనుమానాలు రావడంతో ప్రక్రియను నిలిపివేసినట్లు తెలుస్తోంది. గోల్మాల్ జరిగిందా? రాష్ట్రంలో 178 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 17 కాలేజీలు ప్రభుత్వ అ«దీనంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నాయి. మిగిలిన 161 కాలేజీలు ప్రైవేటువి. ఇంజనీరింగ్ కాలేజీల్లో బ్రాంచీలు, సెక్షన్లు, సీట్లకు సంబంధించి యాజమాన్యాలు ముందుగా ఏఐసీటీఈ నుంచి అనుమతి తీసుకోవాలి. 33 కాలేజీలు మినహా మిగతా కాలేజీలన్నీ ఏఐసీటీఈ అనుమతి తీసుకున్నాయి. అంటే 128 కాలేజీలు తమ పరిధిలోని విశ్వవిద్యాలయం నుంచి గుర్తింపు పొందాల్సి ఉంటుంది. అయితే వర్సిటీల అధికారులు తనిఖీల సందర్భంగా ఇష్టానుసారం వ్యవహరించారని, ప్రైవేటు కాలేజీలకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఫ్యాకల్టి, మౌలికవసతులు లేకున్నా సక్రమంగానే ఉన్నట్లు నివేదికలు ఇచ్చినట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్చార్జి వీసీలుగా నియమితులైన ఐఏఎస్ అధికారులు తనిఖీల్లో అవకతవకలపై విచారణ మొదలుపెట్టారు. దీంతో అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోందని అధికారులు అంటున్నారు. ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న కాలేజీ యాజమాన్యాలు ఏదో విధంగా గుర్తింపు తెచ్చుకోవడానికి పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో బేరసారాలకు ఆస్కారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీట్ల లెక్క ఇలా.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 1.22 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉండగా వాటిలో 83 వేల సీట్లు కన్వీనర్ కోటా కింద ఉన్నాయి. అందులోనూ 58 శాతం సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇతర కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా డిమాండ్ లేని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచీల్లో సీట్లను, సెక్షన్లను ప్రైవేటు కాలేజీలు తగ్గించుకుంటున్నాయి. వాటి స్థానంలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో సీట్లు పెంచాలని కోరుతున్నాయి. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో 80 కాలేజీల నుంచి దరఖాస్తులు వచ్చాయి. గతేడాది బ్రాంచీ మార్చుకున్నవి, కొత్తగా మంజూరైన కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు ఉన్నాయి. పెరిగిన సీట్లను ఆఖరి కౌన్సెలింగ్‌లోకి తెచ్చారు. ఏయే కాలేజీల్లో, ఏ బ్రాంచీల్లో సీట్లు పెరుగుతాయి? ఎందులో తగ్గుతాయి? అనే వివరాలతో ముందే కౌన్సెలింగ్ కేంద్రంలో సాఫ్ట్వేర్ రూపొందించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అనుబంధ గుర్తింపే కాలేజీలకు రాకపోవడంతో సీట్లపైనా అధికారులకు స్పష్టత రావడం లేదు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ జాప్యం?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఈ ఏడాది ఇంకా ఆలస్యమయ్యే అవకాశం కని్పస్తోంది. వచ్చే నెల 27 నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ఇంజనీరింగ్ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి గుర్తింపు రాలేదు. అసలు ఇందుకు సంబంధించిన ప్రక్రియ కూడా ఇంకా మొదలు కాలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కౌన్సెలింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సంబంధిత యూనివర్సిటీలు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తాయి. అయితే దీనికన్నా ముందు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐసీటీఈ 2024–25 విద్యా సంవత్సరానికి క్యాలెండర్‌ను ప్రకటించింది. దీని ప్రకారం జూన్ 10వ తేదీకల్లా అన్ని కాలేజీలకు అనుమతినివ్వాలి. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకునే కాలేజీలకే అనుమతి లభిస్తుంది. జూన్ 10కల్లా అనుమతి రాని కాలేజీలు.. సౌకర్యాలు కల్పించుకుని మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పింస్తారు. ఈ ప్రక్రియను జూన్ 30 నాటికి ముగించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కాలేజీలు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే జూన్ 10 నాటికి అనుమతి లభించడం కష్టమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కోర్సుల చేరిక వల్లే ఆలస్యం జాతీయ స్థాయిలో విద్యా విధానంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టు భారత్‌లోనూ క్రెడిట్ విధానం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. టెన్త్ వరకూ కొన్ని క్రెడిట్స్, ఇంటర్ తర్వాత కొన్ని, డిప్లొమా కోర్సులకు, ఇంజనీరింగ్ కోర్సులకు ఇలా.. క్రెడిట్స్ విధానం తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రొఫెషనల్ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలో చేరుస్తున్నారు. ఇప్పటివరకూ బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ వంటి కోర్సులు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ పరిధిలో ఉండేవి. తాజాగా ఏఐసీటీఈ పరిధిలోకి తెస్తూ అన్ని కోర్సులకు కలిపి ఒకే దరఖాస్తు విధానం తీసుకొచ్చారు. అంటే బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కోర్సులతో పాటు ఇంజనీరింగ్ కోర్సులు కూడా ఇదే దరఖాస్తు విధానంలోకి వచ్చాయన్న మాట. ఈ మేరకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపొందించడానికి కాస్త సమయం పట్టే అవకాశం కని్పస్తోందని అధికార వర్గాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలేజీలకు గుర్తింపు ఆలస్యమయ్యే వీలుందని చెబుతున్నాయి. జోసా కౌన్సెలింగ్ నాటికి జరిగేనా? ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంద్ర ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెలలో కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష పూర్తయింది. త్వరలో జోసా (జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) కౌన్సెలింగ్ తేదీలనూ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఆరు దశలుగా ఉంటుంది. జోసా కౌన్సెలింగ్ చివరి తేదీని బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ చివరి దశ చేపడతారు. విద్యార్థులు తొలి దశలో రాష్ట్ర కాలేజీల్లో చేరి, చివరి దశలో జాతీయ కాలేజీల్లోకి వెళ్తారు. ఇలా ఖాళీ అయిన సీట్లను చివరి దశలో భర్తీ చేస్తారు. కానీ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇప్పటికీ రాకపోవడంతో రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. ఈలోగానే అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం రాష్ట్ర ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్ణయించిన తేదీల్లోనే కొనసాగుతుంది. ఈలోగా ఏఐసీటీఈ అనుమతి వస్తుందని ఆశిస్తున్నాం. ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్‌ను కూడా ప్రకటించింది. బీబీఏ, బీసీఏ, బీఎంఎస్ కాలేజీలను ఏఐసీటీఈ పరిధిలోకి కొత్తగా తేవడం వల్ల కొంత ఆలస్యమవుతున్నట్టు తెలుస్తోంది. – ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్) -
లక్షకు చేరువలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రి య తుదిదశకు చేరుకుంది. ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టు చేసే గడువు బుధవారంతో ముగిసింది. కన్వినర్‌కోటా కింద మొత్తం 75 వేలమంది సీట్లు పొందినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. యాజమాన్యకోటా కింద మరో 25 వేలకుపైగా సీట్లు భర్తీ అయినట్టు తెలిసింది. అయితే పూర్తి గణాంకాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 58 శాతానికిపైగా కంప్యూటర్‌సైన్స్ ఇంజనీరింగ్, దాని అనుబంధ కోర్సుల్లోనే భర్తీ అయినట్టు అధికారులు తెలిపారు. సెపె్టంబర్ 1 నుంచి కాలేజీల్లో ఇంటర్నల్ స్లైడింగ్ చేపడుతున్నారు. ఒక బ్రాంచ్ నుంచి వేరొక బ్రాంచ్‌కు మారేవారు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. కాలేజీల్లో మిగిలిన సీట్ల వివరాలు ప్రతీ కాలేజీ సెప్టెంబర్ 1న వెల్లడించాలని సాంకేతికవిద్య కమిషనరేట్ ఆదేశించింది 3,4 తేదీల్లో స్పాట్ అడ్మిషన్ల ద్వారా ఖాళీలు భర్తీ చేస్తారు. ఎంసెట్ అర్హులు నేరుగా కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు పొందే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 18,815 సీట్లు మిగిలిపోయే వీలుందని అధికారులు అంచనా వేశారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు చివరి చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కన్వినర్ సీటు కౌన్సెలింగ్ ద్వారా పొందడానికి ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు కోసం ప్రయత్నించని వారు ఉంటే ఈ నెల 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో సీటు వచ్చిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లను ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్ల పేరిట ఆన్లైన్లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం విడుదల చేయాల్సి ఉంది. అందుబాటులో 19 వేల సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్సీలోనే 3,034 సీట్లు మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 2,505, ఈసీఈలో 2,721, ఈఈఈలో 2,630, ఐటీలో 1,785, మెకానికల్‌లో 2,542 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు మరో 7 వేల సీట్లు కొత్తగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో పెరిగాయి. మొత్తంగా కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు పెరిగాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నా అక్కడ చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు 90 శాతం వరకూ భర్తీ అయ్యాయి. లక్షకు చేరువలో చేరికలు ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు చేరే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 174 కాలేజీలుంటే, వీటిలో 83,766 కన్వినర్ కోటా సీట్లు, మరో 33 వేలు యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో ఇప్పటికే 65 వేల మంది వరకూ చేరారు. ప్రత్యేక కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో 6 వేల మంది వరకూ చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్య కోటా కింద దాదాపు 30 వేల వరకూ భర్తీ అయ్యే వీలుందని భావిస్తున్నారు. -
‘బి’ గ్యాంగ్ బేరాల జోరు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంది. మూడో దశలో కన్వీనర్ కోటాలో చేరే గడువు ఆదివారంతో ముగిసింది. ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ ఉంటుంది. కన్వీనర్ కోటా కింద రాష్ట్రవ్యాప్తంగా 83,766 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకూ 70,627 కేటాయించారు. ఇంకా 13,139 సీట్లు ఉన్నాయి. మూడో దశ కౌన్సెలింగ్ తర్వాత కూడా సీట్లు మిగిలితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కౌన్సెలింగ్‌లో మిగిలిపోయే సీట్లను ప్రైవేటు కాలేజీలు స్పాట్ అడ్మిషన్లుగా భర్తీ చేయడం సర్వసాధారణం. వాస్తవానికి వీటిని ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజులతోనే భర్తీ చేయాలి. కానీ కౌన్సెలింగ్‌లో సీటు రాని విద్యార్థులకు ఎక్కువ మొత్తం తీసుకుంటూ సీట్లు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు యాజమాన్య కోటా సీట్లు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 33 వేల వరకూ ఉంటాయి. ఇందులో సగం బి కేటగిరీ కింద, మిగతా సగం ఎన్ఆర్ఐ కోటా కింద ఉంటాయి. వీటితో కాసుల పంట పండించుకునేందుకు యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. రంగంలోకి ఏజెంట్లు, కన్సల్టెన్సీలు ప్రధాన ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్య కోటా సీట్లు దాదాపు భర్తీ అయ్యాయి. అయితే టాప్ టెన్ కాలేజీలను మినహాయిస్తే మిగతా కాలేజీల్లో సీట్లు మిగిలిపోతుంటాయి. వీటిని ఈ నెలాఖరు వరకూ భర్తీ చేయాల్సి ఉంటుంది. దీంతో కాలేజీలు ఏజెంట్లను, కన్సల్టెన్సీలను భారీగా కమీషన్లు ఆశచూపి రంగంలోకి దించుతున్నాయి. ఏజెంట్లు, కన్సల్టెన్సీల ప్రతినిధులు ఎంసెట్ అర్హుల జాబితా ఆధారంగా వారి ఫోన్ నంబర్లు సంపాదించి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తున్నారు. ఏదో రకంగా నమ్మబలుకుతూ తమకు అనుకూలమైన కాలేజీల్లో చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు ఏజెంట్లు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి సీట్లు అయిపోతున్నాయని, త్వరగా అప్రమత్తం కావాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఒక్కసారి కాలేజీ యాజమాన్యం వద్దకు వచ్చి మాట్లాడాలని చెబుతున్నారు. కంప్యూటర్ కోర్సుకు గిరాకీ రాష్ట్రంలో కన్వీనర్ కోటా కింద 56,811 కంప్యూటర్ సైన్స్ సీట్లున్నాయి. మేనేజ్మెంట్ కోటాలో 19 వేల వరకు సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో 53,034 సీట్లు భర్తీ చేశారు. ఇంకా 3,777 సీట్లు మిగిలిపో యాయి. ఇవన్నీ టాప్‌టెన్ కాని కాలేజీల్లోనే ఉన్నా యి. ఇతర బ్రాంచీల్లో సీట్లు వచ్చిన వాళ్ళు, కోరు కున్న కాలేజీలో, కోరుకున్న బ్రాంచీలో సీట్లు రాని వారు మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం ప్రయత్ని స్తున్నారు. సీఎస్సీ కోసం పెద్ద ఎత్తున డిమాండ్ ఉందంటూ కాలేజీల యాజమాన్యాలు, ఏజెన్సీలు, కన్సల్టెన్సీలు కృత్రిమ డిమాండ్ సృష్టిస్తున్నాయి. ఒక్కో సీటు రూ.12 నుంచి రూ.16 లక్షలకు అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇందులో రూ.2 లక్షల వరకూ కన్సల్టెన్సీలకు కమీషన్లుగా ఇస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి బి కేటగిరీ సీట్లను ఎఫ్ఆర్సీ నిర్ణయించిన ఫీజుకు, మెరిట్ ప్రకారమే ఇవ్వాలి. ఈ నిబంధన ఎక్కడా పాటించడం లేదని తెలుస్తోంది. ఎన్ఆర్ఐ కోటా సీట్లు ఉన్నా ఫీజు ఎక్కువగా ఉండటంతో అవి మిగిలిపోతున్నాయి. వీటిని కూడా భారీగా డబ్బులు తీసుకుని ఎన్ఆర్ఐ కోటా మాదిరి పత్రాలు సృష్టించి అమ్మేస్తున్నారని, యాజమాన్య కోటా సీట్ల దందా అపాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
నవంబర్ నుంచే.. ఇంజనీరింగ్ క్లాసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం క్లాసులను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కాలపట్టికను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వాస్తవానికి అక్టోబర్ 25 నుంచే 2022–23 విద్యా సంవత్సరం ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పేర్కొంది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవ్వలేదు. మొదటి దశ సీట్ల భర్తీ జరిగినా రెండో దశను గత నెల 27న పూర్తి చేయాలని తొలుత భావించారు. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంలో ఎఫ్ఆర్సీ ఎటూ తేల్చకపోవడంతో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను ఈ నెల 11 నుంచి మొదలు పెట్టారు. ఈ నెల 16వ తేదీన సీట్ల కేటాయింపు చేపడతారు. ఈ దశలో కూడా మిగిలిపోయిన సీట్లకు నెలాఖరులోగా ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ఈ నెల 25లోగా పూర్తి చేసి. ఆ తర్వాత కాలేజీల్లో ఐదు రోజుల పాటు పరిచయ కార్యక్రమాలు నిర్వహించి, నవంబర్ 1 నుంచి బోధన చేపట్టాలని భావిçÜ్తున్నారు. జాతీయ స్థాయిలోనూ... ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో కూడా ఈ నెల 16తో సీట్ల భర్తీ కార్యక్రమం పూర్తవుతుంది. దీంతో జాతీయ స్థాయిలో కూడా నవంబర్ మొదటి వారంలోనే క్లాసులు మొదలయ్యే వీలుంది. జోసా కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ ముగించాలని ఉన్నత విద్య మండలి రెండేళ్ళుగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. జేఈఈ ర్యాంకు ద్వారా జాతీయ కాలేజీల్లో సీట్లు రాని అభ్యర్థులు రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందేందుకు ప్రయత్నిస్తారు. ఈలోగానే సీట్ల భర్తీ ముగిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే కాస్త ఆలస్యంగానే ఎంసెట్ కౌన్సెలింగ్ పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఇతర కోర్సులూ నవంబర్లోనే ఎంటెక్, ఎంబీఏ, బీఈడీ, న్యాయవాద కోర్సుల్లో కామన్ పరీక్ష ఫలితాలు ఇప్పటికే వెల్లడించారు. ఎంటెక్, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. ఇది మరో పది రోజుల్లో ముగిసే వీలుంది. బీఈడీ సీట్ల భర్తీ కూడా త్వరలో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లాసెట్ ముగిసినప్పటికీ నేషనల్ బార్ కౌన్సిల్ గుర్తింపు ప్రక్రియ ఇంకా పూర్తి కారణంగా లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో జాప్యం ఉండొచ్చని భావిస్తున్నారు. దోస్త్ ద్వారా డిగ్రీ సీట్ల భర్తీ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లక్షన్నర మంది డిగ్రీ కోర్సుల్లో చేరారు. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ తర్వాత మరో 50 వేల మంది డిగ్రీ కోర్సుల్లో చేరే వీలుందని భావిస్తున్నారు. మొత్తం మీద నవంబర్ మొదటి వారంలో ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కోర్సులు మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలో షెడ్యూల్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధనకు సంబంధించిన కాలపట్టికను త్వరలోనే విడుదల చేస్తాం. ఇప్పటికే దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాం. జోసా కౌన్సెలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంజనీరింగ్ సీట్ల భర్తీ చేపడుతున్నాం. – ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
తొలివిడత వదిలేస్తే మలివిడతలో చాన్స్
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ సైన్స్ కోర్సులో పెరగబోయే సీట్లు తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై ప్రభావం చూపాయి. చాలా మంది విద్యార్థులు తొలివిడత కౌన్సెలింగ్‌లో ఆయా కోర్సుల్లో సీటు వదిలేస్తే, మలివిడతలో నచ్చిన సీటు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. కాలేజీల విషయంలోనూ ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు కన్పిస్తోంది. సీట్లు పెరగడంతో మరో కాలేజీలో ఈసారి సీటు వస్తుందనే ఆశ వారిలో కన్పిస్తోంది. అదీకాక ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు పొందినవారు ఎంసెట్ కౌన్సెలింగ్ నుంచి తప్పుకునే వీలుంది. ఈ రకంగానూ కొంత సానుకూల వాతావరణం ఉంటుందని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. ఈసారి అదృష్టం పరీక్షిద్దాం రాష్ట్రంలో తొలివిడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అన్ని రకాల కోర్సులకు కలిపి మొత్తం 71,286 సీట్లు కన్వీనర్ కోటా కింద సిద్ధంగా ఉన్నాయి. వీటిల్లో 60,208 సీట్లు కేటాయించారు. ఈ నెల 13 నాటికి కేవలం 43 వేలమంది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు. 17 వేల మందికి సీట్లు వచ్చినా అది తమకు నచ్చలేదని భావించి రిపోర్టింగ్‌కు దూరంగా ఉన్నారు. ఇలాంటివారిలో ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ, ఆఖరుకు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సుల్లో సీట్లు ఆశపడుతున్నవారే. తొలి దశలో పెంచిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు 9,240 అందుబాటులోకి రాలేదు. 25 వేల లోపు ర్యాంకు వచ్చిన విద్యార్థులు కూడా మెరుగైన కాలేజీ, సీటు కోసం తొలి దశలో వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టారు. కొంతమంది కంప్యూటర్ సైన్స్(సీఎస్సీ)లో సీటు వచ్చినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి కోర్సుల కోసం ఎదురుచూస్తూ మొదటి విడతలో చేరలేదు. ఆప్షన్ల ఎంపికలో సానుకూలత రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 28న మొదలవుతుంది. కొత్తగా 12 వేలకుపైగా సీట్లు పెర గడం, జేఈఈ ర్యాంకర్లు ఈసారి ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పెద్దగా పోటీ పడకపోవడం వల్ల రా ష్ట్రస్థాయి విద్యార్థులకు అవకాశాలు కలిసి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 40 వేలలోపు ర్యాంకు విద్యార్థులు ఆచితూచి ఆప్షన్లు ఇచ్చుకోవడం మంచిదని అంటున్నారు. 5 వేలలోపు ర్యాంకుల్లో ఉన్న విద్యార్థులు ఎక్కువమంది ఈసారి పోటీలో ఉండరని, 10 వేల లోపు ర్యాంకు విద్యార్థుల్లో 50 శాతం మాత్రమే పోటీ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. కాబట్టి 40 వేల లోపు ర్యాంకు విద్యార్థులు కోరిన కాలేజీ, సీటు కోసం పోటీపడేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ఆ పై ర్యాంకు విద్యార్థులు కాలేజీ విషయం పక్కన పెట్టినా, కోరుకున్న సీటును ఎక్కడైనా పొందేందుకు ప్రయత్నించి సఫలం కావచ్చని చెబుతున్నారు. -
పైసలిస్తేనే 'ప్రవేశం'
ట్యూషన్ ఫీజు ముందే ఇవ్వాలంటున్న కళాశాలలు ♦ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో తీవ్ర జాప్యం ♦ డబ్బులు వచ్చాక తిరిగితీసుకోవాలని స్పష్టీకరణ ♦ విధి లేని పరిస్థితుల్లో చెల్లిస్తున్న విద్యార్థులు ♦ తలకు మించిన భారమంటూ తల్లిదండ్రుల ఆందోళన నరేష్ ఇటీవల ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో ఘట్కేసర్లోని ఓ ప్రముఖ కళాశాలలో సీటు సాధించాడు. ప్రభుత్వ కోటాలో సీటు రావడంతో ఫీజు కట్టాల్సిన పనిలేదనే ధీమాతో కాలేజీలో ప్రవేశం కోసం వెళ్లి తెల్లబోయాడు. ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే చేర్చుకుంటామని, రీయింబర్స్మెంట్ నిధులొచ్చాక తిరిగి తీసుకోవచ్చని కాలేజీ యాజమాన్యం స్పష్టం చేయడంతో నరేష్ ఆలోచనలో పడ్డాడు. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో అప్పుచేసి ఫీజు చెల్లించాడు. జిల్లాలో పలు కళాశాలల్లోనూ ట్యూషన్ ఫీజులు చెల్లించాలంటూ యాజ మాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. సకాలంలో నిధులివ్వకపోవడంతో నిర్వహణ భారమవుతున్న నేపథ్యంలో ఇలా ఫీజులు వసూలు చేస్తున్నట్లు యాజమాన్యాలు చెబుతున్నప్పటికీ.. విద్యార్థుల తల్లిదండ్రులకు మాత్రం తలకుమించిన భారంగా మారుతోంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా : పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సర్కారు జాప్యం చేయడం విద్యార్థులకు శాపంగా మారింది. గతేడాదికి సంబంధించి విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజురీయింబర్స్‌మెంటు నిధుల విడుదల ఊసెత్తడంలేదు. దీంతో తాజా విద్యాసంవత్సరంలో కొత్తగా ఇంజినీరింగ్ తదితర కోర్సులలో చేరే విద్యార్థులకు యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఫీజు డబ్బులు చెల్లిస్తేనే కాలేజీలో చేర్చుకుంటామని తేల్చిచెబుతున్నాయి. దీంతో ఆయా విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జిల్లాలో 124 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో ఈ ఏడాది కొత్తగా 35వేల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ సీట్లు సాధించి ప్రవేశాలు పొందుతున్నారు. కౌన్సెలింగ్ ద్వారా సీటు దక్కించుకోవడంతో ఉచితంగా విద్యనభ్యసించవచ్చు. వీరికి సంబంధించిన ఫీజు ప్రభుత్వమే రీయింబర్స్ చేస్తుంది. కానీ ఇప్పుడు భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ఏళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో.. ఆ భారం విద్యార్థులపై పడుతోంది. కోర్సుకు సంబంధించిన ఫీజు విద్యార్థి చెల్లిస్తేనే అడ్మిషన్‌కు అనుమతిస్తున్నారు. ఘట్కేసర్లోని ప్రముఖ కాలేజీతో పాటు ఇబ్రహీంపట్నంలోని మరో కాలేజీలో దాదాపు వందమందికి పైగా విద్యార్థులు రీయింబర్స్‌మెంట్‌కు అర్హత సాధించినప్పటికీ.. సొంతంగా ఫీజులు చెల్లించి ప్రవేశాలు పొందారు. గత బకాయిలు రూ. 465కోట్లు..! 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ముగిసింది. దీంతో అధికారులు వాటి పరిశీలన ప్రక్రియ మొదలుపెట్టారు. వాస్తవానికి గతేడాది ఆగస్టు నాటికే దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన ముగియాల్సి ఉండగా.. ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. దీంతో కోర్సు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించింది. 2014-15 విద్యాసంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, వికలాంగ కేటగిరీలకు సంబంధించి పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 1,09,610 మంది ఫ్రెషర్స్ అర్హత సాధించారు. అదేవిధంగా రెన్యువల్ విద్యార్థులు 1,57,845 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా వీరికి ఫీజు రీయింబర్స్ కింద రూ. 465 కోట్లు చెల్లించాల్సి ఉంది. విద్యాసంవత్సరం ముగిసినప్పటికీ ప్రభుత్వం నిధుల ఊసెత్తకపోవడంతో ఇప్పటికే కోర్సు పూర్తిచేసుకున్న పలువురు విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు పొందడం గమనార్హం. -
సీట్లు రాని విద్యార్థులకు మరో అవకాశం!
* మరో దఫా ఇంజనీరింగ్ ప్రవేశాలపై కసరత్తు * ‘మిగులు సీట్ల భర్తీ’ పేరుతో కౌన్సెలింగ్ * తేలాల్సి ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారం * సీఎంతో చర్చించాకే తుది నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు రాని విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో కౌన్సెలింగ్ నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఆగస్టు 1 నుంచి క్లాసులు ప్రారంభం కావాలి. అప్పటికేమైనా సీట్లు మిగిలితే ప్రకటన ద్వారా నోటిఫై చేసి ఆగస్టు 15లోగా వాటిని భర్తీ చేయొచ్చన్న సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కౌన్సెలింగ్ పేరుతో కాకుండా ‘మిగులు సీట్ల భర్తీ’ పేరుతో ఈ ప్రవేశాలను చేపట్టే అవకాశం ఉంది. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో జరిగిన సమావేశంలో దీనిపై చర్చించినట్లు తెలిసింది. దా దాపుగా కౌన్సెలింగ్ నిర్వహణకు ఓ అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఫీ జు రీయింబర్స్‌మెంట్‌తో ఇది ముడిపడి ఉన్నం దున సీఎంతో చర్చించాకే అధికారికంగా నిర్ణయం ప్రకటించాలని భావిస్తున్నారు. 6 వేల వరకు అర్హులు మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు రాని విద్యార్థులు 9,321 మంది ఉండగా, చివరి దశ కౌన్సెలింగ్‌లో 7,675 మందికి సీట్లు వచ్చాయి. మరో 1,646 మందికి సీట్లు రాలేదు. మరోవైపు మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చినా కాలేజీల్లో చేరని విద్యార్థులు, మొదటి, చివరి దశ కౌన్సెలింగ్‌లో సీట్లే రాని వారు మరో 4 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రవేశాలు చేపట్టేందుకు ఉన్నత విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి వెబ్ కౌన్సెలింగ్ అనే పేరు మాత్రం ఉండదు. కానీ ప్రవేశాల ప్రక్రియలో మొత్తం అదే విధానాన్ని అమలు చేస్తారు. తద్వారా పారదర్శకంగా ఇంజనీరింగ్ ప్రవేశాలను పూర్తి చేయడంతోపాటు ఆప్షన్లు సరిగ్గా ఇచ్చుకోలేక నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టారు. నేడు లేదా రేపు పూర్తిస్థాయి షెడ్యూలు మిగులు సీట్ల భర్తీకి పూర్తిస్థాయి షెడ్యూలును బుధ లేదా గురువారం ప్రకటించే అవకాశం ఉంది. విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవాల్సిన తేదీలు, సీట్ అలాట్మెంట్ తేదీ, సెల్ఫ్ రిపోర్టింగ్ గ డువు ఖరారుపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికే కాలేజీల్లో చేరి, సర్టిఫికెట్లు అందజేసిన విద్యార్థుల పరిస్థితిపై స్పష్టత రాలేదు. ఇదివరకే సీట్లు వచ్చి, ఫీజులు చెల్లించి, సర్టిఫికెట్లను అందజేసిన విద్యార్థులకు ఇపుడు కాలేజీని లేదా బ్రాంచీని మార్చుకునే (స్లైడింగ్) అవకాశం ఇస్తారా? కేవలం సీట్లు రాని విద్యార్థులకే ఈ అవకాశాన్ని కల్పిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. -
ముగిసిన ఏపీ ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్
కన్వీనర్ కోటాలో 76,928 మందికి ఇంజనీరింగ్, ఫార్మసీ సీట్లు భర్తీకాని సీట్లు 36,324 సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది విడత కౌన్సెలింగ్ గురువారం ముగిసింది. తొలి, మలి విడతల్లో రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో 76,928 మందికి కన్వీనర్ కోటా కింద సీట్లు కేటాయించారు. మలివిడత కౌన్సెలింగ్‌లో సీట్ల కేటాయింపు వివరాలను ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ కన్వీనర్ బి.ఉదయలక్ష్మీ ప్రకటించారు. రాష్ట్రంలోని 13 యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలు, 304 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, 14 యూనివర్సిటీ ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ముగిసింది. ఎంసెట్-2015లో 1,28,580 మంది అర్హత సాధించారు. మొత్తం కన్వీనర్ కోటా సీట్లు 1,12,525 కాగా అందులో తొలివిడత కౌన్సెలింగ్‌లో 73,817 మందికి సీట్లు కేటాయించారు. ఇక మలివిడత కౌన్సెలింగ్‌లో 38,220 మంది 7,44,825 వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. కన్వీనర్ కోటా కింద రెండో విడతలో అదనంగా 162 సీట్లను కేటాయించారు. దీంతో మొత్తం కన్వీనర్ కోటా సీట్ల సంఖ్య 1,12,687కు పెరిగింది. తొలి విడత అనంతరం 38,870 సీట్లను మలివిడత కౌన్సెలింగ్‌కు అందుబాటులో ఉంచారు. మలివిడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న వారిలో 12,511 మంది కొత్త అభ్యర్థులు కాగా 28,761 మంది తొలివిడతలో సీట్లు వచ్చి మార్పు కోరుకున్నవారు ఉన్నారు. రెండు విడతల కౌన్సెలింగ్‌లో 76,928 మంది సీట్లు పొందగా 36,324 సీట్లు మిగిలిపోయాయి. ఇందులో 32,836 ఇంజనీరింగ్, 3,488 ఫార్మసీ సీట్లు ఉన్నాయి. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ విధానంలో లేదా హెల్ప్‌లైన్ కేంద్రాల్లో రిపోర్టు చేయాలని కన్వీనర్ ఉదయలక్ష్మీ సూచించారు. ఈ నెల 25వ తేదీలోగా అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను కాలేజీల్లో సమర్పించాలని పేర్కొన్నారు. -
ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదా
-
తెలంగాణలో ఇంజినీరింగ్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు ఈనెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియను వాయిదా వేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడించారు. కోర్టును ఆశ్రయించిన ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు అన్నింటిని వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై బుధవారం డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో 8 నుంచి ప్రారంభించాల్సిన వెబ్ ఆప్షన్లు, 23 నుంచి చేపట్టాల్సిన రెండో దశ కౌన్సెలింగ్ వాయిదా వేసినట్లు వివరించారు. తీర్పుపై చర్చలు.. హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు విషయంలో తలెత్తిన వివాదం కోర్టుకు చేరిన సంగతి తెలిసిందే. అనుబంధ గుర్తింపుపై ఇటీవల జేఎన్టీయూహెచ్ 220 కాలేజీల్లో పలు కోర్సులకు కోత విధించింది. ఫలితంగా దాదాపు 70 వేల వరకు సీట్లు తగ్గిపోయాయి. దీంతో పలు కాలేజీ యాజమన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై మంగళవారం హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చారు. అంతకుముందు ఉదయమే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు సమావేశమై ఈ అంశంపై చర్చించారు. కోర్టు తీర్పు జేఎన్టీయూకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి? కాలేజీలకు అనుకూలంగా వస్తే ఏం చేయాలన్న అంశాలపై చర్చించారు. కాలేజీలను కౌన్సెలింగ్ జాబితాలో చేర్చాలని సింగిల్ జడ్జి తీర్పు వెలువరించడంతో ఉన్నతాధికారులు మరోసారి సమావేశమై చర్చించారు. అడ్వొకేట్ జనరల్‌ను సంప్రదించారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో చర్చించి, డివిజన్ బెంచ్ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లాలని నిర్ణయించారు. -
సర్వం సిద్ధం
సాక్షి, చెన్నై : ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు రిజర్వుడు కోటా సీట్ల భర్తీ సాగనుంది. జులై ఒకటో తేదీ నుంచి జనరల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న ఉన్నత విద్యావిధానం మేరకు ఇంజనీరింగ్ కోర్సుల సీట్ల భర్తీ ప్రక్రియను ప్రతి ఏటా అన్నావర్సిటీ నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఆ మేరకు రాష్ట్రంలోని 538 ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రభుత్వ కోటా సీట్లు రెండు లక్షలకు పైగా ఉన్నాయి. దీంతో ఈ సీట్ల భర్తీకి ప్రతి ఏడాది వలే ఈ సారి కూడా దరఖాస్తులను ఆహ్వానించారు. కొన్నేళ్లుగా దరఖాస్తుల పర్వానికి స్పందన కరువు అవుతుండడంతో సీట్ల భర్తీ పూర్తి స్థాయిలో జరిగేది అనుమానంగా మారింది. ఈ ఏడాది 1.90 లక్షల దరఖాస్తులు విక్రయించగా, 1.54 లక్షల దరఖాస్తులు తిరిగి వచ్చాయి. ఈ దరఖాస్తులకు ర్యాండం నెంబర్లను ప్రకటించారు. ప్లస్‌టూ మార్కుల ఆధారంగా ర్యాంకుల జాబితా వెలువడింది. ర్యాండం నెంబర్ల ఆధారంగా విద్యార్థులను కౌన్సెలింగ్‌కు ఆహ్వానించే పనిలో అన్నావర్సిటీ ప్రత్యేక విభాగం వర్గాలు నిమగ్నం అయ్యాయి. సర్వం సిద్ధం: ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పర్వం ఆరంభం అవుతుండడంతో విద్యార్థుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని ఆయా ఇంజనీరింగ్ కళాశాలలు, వివరాలు, సీట్ల సంఖ్య, తదితర అంశాలను విద్యార్థులకు వివరించే రీతిలో అక్కడక్కడ ఎల్ఈడీ టీవీలను ఏర్పాటు చేశారు. అలాగే, పలు బ్యాంక్‌లకు సంబంధించిన విభాగాలు ఏర్పాటు అయ్యాయి. విద్యార్థుల సౌకర్యార్థం క్యాంటీన్, మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించారు. పోలీసు బూత్, అగ్నిమాపక వాహనాలను సైతం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. కౌన్సెలింగ్ వివరాలను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో తెలియజేయడానికి ఏర్పాట్లు చేశారు. ఇక, సుదూర ప్రాంతాల నుంచి కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వ బస్సుల్లో రాయితీ ప్రకటించి ఉన్నారు. అలాగే, చెన్నై కోయంబేడు బస్టాండ్, తాంబరం పరిసరాల నుంచి అన్నా వర్సిటీ మీదుగా ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి కౌన్సెలింగ్: ఆదివారం నుంచి కౌన్సెలింగ్ పర్వం ఆరంభం కానున్నది. తొలి రెండు రోజులు రిజర్వుడు కోటా సీట్ల భర్తీ సాగనుంది. తొలుత వికలాంగుల కోటా, తదనంతరం క్రీడా కోటా సీట్ల భర్తీ నిర్వహిస్తారు. అనంతరం మాజీ సైనికోద్యుగుల పిల్లలకు సీట్ల కేటాయింపు జరుగుతుంది. చివరగా జులై ఒకటో తేదీ నుంచి జనరల్ కోటా సీట్ల భర్తీ సాగుతుంది. ఈ ఏడాది సీట్ల సంఖ్య అధికంగా ఉండడం, దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉండడంతో అందరికీ సీట్లు దక్కడం ఖాయం. అయితే, ప్రధాన కళాశాలల్లో కీలక కోర్సుల సీట్లను కైవసం చేసుకోవడంలోనే విద్యార్థుల మధ్య పోటీ సాగనుంది. -
రెండో కౌన్సెలింగ్ పైనే ఆశలు
ప్రొద్దుటూరు : ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి సగం సీట్లే భర్తీ అయ్యాయి. మరికొన్ని కళాశాలలు సింగిల్ డిజిట్‌తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరంతా రెండో కౌన్సిలింగ్‌పైనే ఆశలు పెట్టుకున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం విద్యార్థులకు సీట్ అలాట్మెంట్ చేస్తూ సెల్ ద్వారా సమాచారం అందించారు. ఇదిలావుండగా చాలా మంది విద్యార్థులు తమ సెల్‌కు మెసేజ్ రాలేదని కౌన్సిలింగ్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చారు. వెబ్ ఆప్షన్ల నమోదుపై సరైన వగాహన లేని కారణంగా చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. గత ఏడాదిని దృష్టిలో ఉంచుకుని 10-15 వేల మధ్యలో ర్యాంక్ వచ్చిన విద్యార్థులు తక్కువ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. వారికి సీటు రాకపోవడంతో తొలివిడత కౌన్సెలింగ్‌లో నష్టపోయారు. వాస్తవానికి ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుగా ప్రారంభం కావడంతోపాటు ఎన్ఐటీ, ఐఐటీ కౌన్సెలింగ్ కూడా జరగకపోవడంతో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ విషయంపై సరైన అవగాహన లేని విద్యార్థులు తమ ర్యాంక్‌కు సీటు వస్తుందని భావించి తక్కువ ఆప్షన్లు ఇచ్చుకుని నష్టపోయారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు వచ్చిన ఓ విద్యార్థి ఈ విషయంపై మాట్లాడుతూ తనకు 10వేలకుపైగా ర్యాంక్ వచ్చిందని, తాను బీసీ కేటగిరికి చెందిన వాడిని కావడంతో ఆరు కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చుకోగా ఎక్కడా సీటు అలాట్ కాలేదన్నారు. దీనిపై హెల్ప్ లైన్ సెంటర్ అధికారులు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 3 వేల వరకు ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం ఉందని, సరైన అవగాహన లేకపోతే నష్టపోతారన్నారు. రెండో కౌన్సెలింగ్‌లోనైనా జాగ్రత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. సగం సీట్లే భర్తీ జిల్లాలోని ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి తొలివిడత కౌన్సెలింగ్‌లో దాదాపు సగం సీట్లే భర్తీ అయ్యాయి. ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీ, పులివెందులలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రమే పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అయ్యాయి. ఇవికాక జిల్లాలోని 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో సుమారు 10 వేల సీట్లు ఉన్నాయి. కడప, రాజంపేట పరిధిలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రమే బ్రాంచిల వారిగా 3 అంకెల సంఖ్యలో విద్యార్థులు చేరారు. మరో 3, 4 కళాశాలలకు సంబంధించి బ్రాంచిల వారిగా సింగిల్ డిజిట్‌కు పరిమితం కావడం గమనార్హం. ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఓ బ్రాంచికి రెండు, మరో రెండు బ్రాంచిలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం నలుగురు విద్యార్థులు మాత్రమే ఆప్షన్లు ఇచ్చుకున్నారు. మరికొన్ని కళాశాలల్లోని బ్రాంచిలకు సంబంధించి ఒక్క విద్యార్థి కూడా చేరకపోవడంతో వెబ్సైట్లో అలాంటి వివరాలే కనిపించలేదు. కాగా సీట్లు ఎక్కువగా భర్తీ అయిన కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి అధికంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు ముందు రూ.50 వేలు చెప్పారని, ప్రస్తుతం ఈ మొత్తాన్ని రూ. 70 వేలకు పెంచారని ఓ విద్యార్థి తండ్రి శుక్రవారం తెలిపారు. మెకానికల్, ఈసీఈ, సీఎస్ఈ, సివిల్ బ్రాంచిలపై విద్యార్థులు ఎక్కువగా దృష్టి సారించారని అధ్యాపక వర్గాలు తెలిపాయి. -
నేటి నుంచి తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్
హైదరాబాద్ : తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభంకానుంది. నేటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 20 హెల్ప్‌లైన్ సెంటర్లలో ధృవ పత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఎంసెట్ కౌన్సింగ్‌కు 90,556 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులు హాల్‌టికెట్లు, ర్యాంక్ కార్డు, ఆదాయ పత్రం, ఇంటర్ మార్క్ మెమో, కుల ధృవీకరణ పత్రాలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
పిల్లల భవిష్యత్ పట్టదా?
* ఎంసెట్‌పై పట్టువిడుపులు లేని ఇరు రాష్ట్రాలు * ఏపీ సర్కారు ఒంటెత్తు పోకడ * మెట్టుదిగని తెలంగాణ ప్రభుత్వం * వేర్వేరుగానే పరీక్షల నిర్వహణకు రెండు రాష్ట్రాల పంతం * ఎవరికీ పట్టని విభజన చట్టం నిబంధనలు * భవిష్యత్తుపై విద్యార్థుల్లో భయాందోళనలు సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అనుసరిస్తున్న వైఖరి విద్యార్థులకు తలనొప్పిగా మారింది. ఇరు ప్రభుత్వాలు దేనికదే ఏకపక్షంగా వ్యవహరిస్తుండటంతో తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకూ ఆందోళన తప్పడం లేదు. రెండు రాష్ట్రాల నిర్ణయాలతో లక్షలాది మంది విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల నిర్వహణకు వేర్వేరు తేదీలు ప్రకటించిన ఇరు ప్రభుత్వాలు.. తాజాగా ఎంసెట్ నూ వేర్వేరుగా నిర్వహిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాది మే 10వ తేదీన ఎంసెట్‌ను నిర్వహిస్తామని ఏపీ ఉన్నత విద్యా మండలి సోమవారం ప్రకటించగా, అంతకంటే వారం పది రోజుల ముందే తాము నిర్వహించే ఎంసెట్ ఉంటుందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి పోటీ ప్రకటన చేసింది. పరీక్షల విషయంలో షెడ్యూళ్లను ప్రకటిస్తున్నాయే తప్ప విద్యార్థుల ప్రయోజనాలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. వచ్చే పదేళ్ల పాటు, రాష్ట్ర విభజనకు ముందున్న ప్రవేశాల విధానమే కొనసాగించాలన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలను ఏ రాష్ర్టమూ పాటించడం లేదు. పదో షెడ్యూల్లోని ఉమ్మడి సంస్థలు ఇరు రాష్ట్రాల వారికి సమానంగా సేవలు అందించాలని మాత్రమే విభజన చట్టం స్పష్టం చేసింది. కానీ, సదరు సంస్థల నియంత్రణపై ఇరు రాష్ట్రాలు పట్టుదలగా ఉండటంతో గందరగోళానికి, ఆదిపత్య పోరుకు దారితీస్తోంది. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నుంచి మొదలు.. మొన్నటి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ సందర్భంగా ఇరు రాష్ట్రాల మధ్య గొడవ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం ఏపీ ఉన్నత విద్యా మండలి తెలంగాణ ప్రభుత్వ నేతృత్వంలో పని చేయాలి. కానీ ఆ నిబంధనకు విరుద్ధంగా ఏపీ వ్యవహరించింది. సుప్రీం ఆదేశాల మేరకు గడువులోగా ప్రవేశాలను పూర్తిచేయడం కష్టమని తెలంగాణ సర్కారు చెప్పినా.. ఏపీ మండలి అందుకు భిన్నంగా ముందుకెళ్లింది. ఫలితంగా రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. ఏపీ కౌన్సిల్ తీరుతో మండిపడిన తెలంగాణ ప్రభుత్వం సొంతంగా తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసింది. మొత్తానికి రెండో విడత అడ్మిషన్లు లేకపోవడంతో వేలాదిమంది విద్యార్థులు నష్టపోయారు. ఇంటర్ విషయంలోనూ అదే తీరు చట్టం ప్రకారం ఇంటర్ బోర్డు కూడా తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పని చేయాలి. కానీ బోర్డుపై అధికారాన్ని వదులుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఇష్ట పడలేదు. బోర్డును తమకు అప్పగిస్తే రెండు రాష్ట్రాల్లో పరీక్షలను నిర్వహిస్తామని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. అయినా ఏపీ సర్కారు అందుకు ఒప్పుకోలేదు. కానీ ఇంటర్ పరీక్షలను ఉమ్మడిగానే నిర్వహించాలని ఏపీ పట్టుబట్టింది. పైగా ఎంసెట్ తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 శాతం వెయిటేజీ విషయంలో సమస్యలు వస్తాయని పేర్కొంది. అయితే ఇందుకు ఐఐటీ తరహాలో పర్సంటైల్ నార్మలైజేషన్‌ను పాటిద్దామని, వేర్వేరుగానే పరీక్షలు నిర్వహించుకుందామని తెలంగాణ చెప్పింది. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో ఏ రాష్ర్టమూ పట్టువిడుపులను ప్రదర్శించలేదు. చివరకు తెలంగాణ మంత్రితో మాట్లాడకుండానే మార్చి 11 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తామని ఏపీ విద్యా శాఖ మంత్రి ప్రకటించారు. దీంతో ఆగ్రహం చెందిన తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఇంటర్ బోర్డును ఏర్పాటు చేసుకుని మార్చి 9వ తేదీ నుంచే పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించుకుంది. తాజాగా ఎంసెట్ విషయంలోనూ.. పదేళ్లపాటు ఉమ్మడి ప్రవేశాల విధానం అమలు చేయాల్సి ఉన్నందున ఎంసెట్‌ను ఉమ్మడిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం వాదించింది. అయితే తామే ఎంసెట్‌ను నిర్వహిస్తామని, ఏపీ ప్రభుత్వం అంగీకరిస్తే రెండు రాష్ట్రాలకు కలిపి ఒకే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామని తెలంగాణ సర్కారు స్పష్టం చేసింది. ఈ విషయం ఎటూ తేలకుండానే సోమవారం ఉన్నట్టుండి మే 10న ఎంసెట్‌ను, ఇతరత్రా ఉమ్మడి ప్రవేశ పరీక్షలను రెండు రాష్ట్రాలకు తామే నిర్వహిస్తామంటూ ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి ప్రకటించారు. తెలంగాణ కౌన్సిల్‌కు చట్టబద్ధత లేదన్నారు. దీంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి కూడా మీడియా సమావేశం పెట్టి.. తాము నిర్వహించబోయే ఎంసెట్ తదితర పరీక్షల షెడ్యూలును జనవరి 5వ తేదీన ప్రకటిస్తామని చెప్పారు. ఏపీ ఎంసెట్ కంటే వారం పది రోజుల ముందుగానే తమ ఎంసెట్ ఉంటుందని, తెలంగాణలోని విద్యా సంస్థల్లో ఓపెన్ కోటా కింద 15 శాతం సీట్లలో ప్రవేశాల కోసం ఏపీ విద్యార్థులు కూడా తమ ఎంసెట్ రాయవచ్చని పేర్కొన్నారు. విభజన చట్టం నిబంధనల ప్రకారం తాము ఏపీ విద్యార్థులకు ఓపెన్ కోటాలో మెరిట్ ఆధారంగా సీట్లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికైనా ఏపీ సర్కారు ముందుకు వస్తే రెండు రాష్ట్రాలకు ఒకే ఎంసెట్ నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఈ పరిణామాలతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో ఎక్కువగా ఉండగా, మెడిసిన్ సీట్లు ఏపీలో ఎక్కువగా ఉన్నాయి. వాటిల్లో ఓపెన్ కోటాలో సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారంతా గందరగోళంలో పడ్డారు. విభజన చట్టంలో ఏముంది? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని పదో షెడ్యూలులో ఇంటర్మీడియట్ బోర్డును, ఏపీ ఉన్నత విద్యా మండలిని చేర్చింది. పదో షెడ్యూలులో ఉన్న ఈ సంస్థలు రెండు రాష్ట్రాలకు సేవలు అందించాలి. ఏడాదిలోగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం చేసుకొని, వాటి సేవలను కొనసాగించాలా లేక విభజించుకోవాలా అన్నది తేల్చుకోవాలి. ఇక సెక్షన్ 95 ప్రకారం పదేళ్ల పాటు రెండు రాష్ట్రాల్లోని విద్యార్థులకు సమాన విద్యావకాశాలు అందించాలి. రెండు రాష్ట్రాల్లోని ప్రైవేటు, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో రాష్ట్ర విభజనకు ముందున్న ప్రవేశాల కోటా, రిజర్వేషన్లు, ప్రవేశాల విధానాన్ని పదేళ్ల పాటు అమలు చేయాలి. అలాగే సెక్షన్ 75 ప్రకారం పదో షెడ్యూలులోని సంస్థలు భౌగోళికంగా ఏ రాష్ట్ర పరిధిలో ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే పని చేయాలి. పొరుగు రాష్ట్రానికి అంతకుముందు అందించిన విధంగానే సేవలను కొనసాగించాలి. సేవల్లో ఎలాంటి వివక్ష చూపడానికి వీల్లేదు. ఈ మేరకు విద్యా రంగ ం విషయంలో విభజన చట్టంలో పేర్కొన్నారు. -
పరిష్కారానికి చొరవ చూపేదెవరు?
* ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై పీటముడి * స్లైడింగ్‌కైనా అవకాశం తప్పనిసరి * ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు స్పందిస్తేనే విద్యార్థులకు న్యాయం * ఇంజనీరింగ్ రివ్యూ పిటిషన్‌పైనే ఆశలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ వ్యవహారంలో విద్యార్థులకు మేలు జరగాలంటే కనీసం స్లైడింగ్‌కైనా (కాలేజీ, బ్రాంచీ మార్చుకునే) అవకాశం కల్పించాల్సి ఉంది. ఇందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కలసి స్పందిస్తేనే ఫలితం ఉంటుంది. అయితే ఎవరు చొరవ తీసుకుంటారన్నదే ఇపుడు సమస్య. ప్రవేశాలు ఆలస్యం అవుతున్నాయంటూ కోర్టుకు చెప్పిన ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై మిన్నకుండిపోగా, తాము ప్రవేశాల గడువు పెంచాలని కోరినా ఏపీ సర్కారే వద్దన్నదంటూ తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదు. దీంతో కన్వీనర్ కోటాలో తమకు ఇష్టంలేని బ్రాంచీల్లో మెరిట్ మేరకు సీట్లు పొందిన విద్యార్థుల పరిస్థితి గందరగోళంలో పడింది. వేలమందికి నిరాశ.. ఇంజనీరింగ్‌లో 1.16 లక్షల మందికి అధికారులు సీట్లు కేటాయించారు. అందులో 1.12 లక్షలమంది విద్యార్థులు కాలేజీల్లో చేరారు. ఇంకో నాలుగువేల మంది స్లైడింగ్ ఉంటుందనే ఆశతో ఇష్టంలేని కాలేజీల్లో చేరలేదు. కాగా, కాలేజీల్లో చేరిన వారిలో చాలా మంది స్లైడింగ్‌లో మరో కాలేజీలో.. మరో బ్రాంచీకి మారవచ్చనే ఆలోచనతో ఉన్నారు. అయితే గురువారంనాటి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో వారి ఆశలు అడియాసలయ్యాయి. తల్లిదండ్రులు కూడా తీవ్రఆవేదన చెందుతున్నారు. 35 వేల మందికి ఇష్టమైన బ్రాంచీలో సీటు రానందునే! మేనేజ్మెంట్ కోటా విషయంలో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చనే భావన అధికారుల్లో ఉంది. మేనేజ్మెంట్ కోటా కోసం ఏపీ ఉన్నత విద్యా మండలి గత నెల 22న నోటిఫికేషన్‌ను జారీ చేసినా, అంతుకుముందుగానే యాజమాన్యాలు సీట్లు భర్తీ చేసుకున్నాయని తెలుస్తోంది. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కన్వీనర్ కోటాలో మంచి బ్రాంచీల్లో సీట్లు రాకపోవడంతో మేనేజ్మెంట్ కోటాలో పేరున్న కాలేజీలో, ఇష్టమైన బ్రాంచీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇలా దరఖాస్తు చేసుకున్న వారు 35 వేలమంది ఉంటారు. వీరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనికితోడు బీటెక్ బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లో బైపీసీ స్ట్రీమ్ ద్వారా ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న మరో 3 వేల మందికి కౌన్సెలింగ్ ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక వారంతా నేరుగా కాలేజీలను సంప్రదించి అనధికారింగా చేరాల్సి ఉంది. అయితే అసలు నోటిఫికేషనే జారీ చేయనపుడు ప్రవేశాలు చేపట్టడమూ కుదరకపోవచ్చనే వాద న ఉంది. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలప్రభుత్వాలు, రెండు ఉన్నత విద్యా మండళ్లు పట్టిం పులు వీడాలని నిఫుణులు పేర్కొంటున్నారు. విద్యార్థులకు మేలు చేసేందుకు ఉమ్మడి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. -
కౌన్సెలింగ్‌పై సుప్రీం తీర్పును అమలుచేస్తాం: టీ సర్కారు
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీం తీర్పును అమలుచేస్తామని తెలంగాణ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. కౌన్సెలింగ్‌లో ఏ విద్యార్ధులైనా పాల్గొనవచ్చని, ఫీజులు మాత్రం తెలంగాణ విద్యార్ధులకే చెల్లిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీ విద్యార్ధులకు అక్కడి ప్రభుత్వమే ఫీజులు చెల్లించాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకనే చంద్రబాబు తమపై అనవసర విమర్శలు చేస్తున్నారని, తెలంగాణలో జరిగే సర్వే గురించి టీడీపీ నేతలకెందుకని ఆయన అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పోటీ పడలేకనే టీడీపీ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని మహేందర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను విమర్శించే హక్కు లేదని అన్నారు. ఆంధ్రా మంత్రులు హైదరాబాద్‌లోనే ఉండి పాలనను ఎందుకు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్
-
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు లైన్ క్లియర్
న్యూఢిల్లీ : ఎంసెట్ కౌన్సిలింగ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఎంసెట్ అడ్మిషన్లు ఆగస్టు 31కల్లా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే కౌన్సెలింగ్ నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉమ్మడి ప్రవేశాల నిబంధనలనే పాటించాలని స్పష్టం చేసింది. భవిష్యత్తుతో రాజకీయాలు వద్దన్న సుప్రీంకోర్టు ... స్థానికతపై 1956 వాదన సరికాదని అభిప్రాయపడింది. రాష్ట్ర విభజన అనేది రాజకీయ నిర్ణయమని, విభజన పేరుతో విద్యార్థులను తొలగించటం సరైంది కాదన్ని న్యాయస్థానం అభిప్రాయపడింది. కౌన్సెలింగ్ పొడిగింపు కోరటం సమంజసం కాదని, అది అనేక సమస్యలకు దారి తీస్తుందని, విద్యార్థులకు ఫీజులు చెల్లించవద్దు అనుకుంటే చెల్లించకండి అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది హరీష్ సాల్వే అంగీకరించారు. కేసు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. కాగా ఈనెల ఏడో తేదీన ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించడం, దీన్ని తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి విధివిధానాలను నిర్ణయించేందుకు సమయం కావాలని, అందువల్ల అక్టోబర్ ప్రాంతంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని టీ సర్కారు వాదిస్తోంది. మరోవైపు అంత ఆలస్యం అయితే విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని ఆంద్రప్రదేశ్ సర్కారు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌పై సుప్రీంలో విచారణ వాయిదా
ఎంసెట్ కౌన్సెలింగ్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ సోమవారం మధ్యాహ్నానికి వాయిదా పడింది. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే అందుబాటులో లేకపోవడంతో ఉదయమే జరగాల్సిన విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. ఈ కేసులో సాల్వే తెలంగాణ రాష్ట్రం తరఫున వాదనలు వినిపించనున్నారు. ఈనెల ఏడో తేదీన ఎంసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించడం, దీన్ని తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడానికి విధివిధానాలను నిర్ణయించేందుకు సమయం కావాలని, అందువల్ల అక్టోబర్ ప్రాంతంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని టీ సర్కారు వాదిస్తోంది. కానీ అంత ఆలస్యం అయితే విద్యార్థులు విలువైన విద్యా సంవత్సరాన్ని కోల్పోతారని ఆంద్రప్రదేశ్ సర్కారు అంటోంది. ఈ విషయమై సుప్రీంకోర్టులో వివాదం నడుస్తోంది. -
ఎంసెట్ కౌన్సెలింగ్ యథాతథం
విద్యార్థులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఎంసెట్ కౌన్సెలింగ్ విషయమై చర్చ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించినా సరే.. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను ఆలస్యం చేయడం సరికాదని, అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఉన్నత విద్యామండలి భావిస్తున్నట్లు సమాచారం. ఆలస్యంగా విద్యాసంవత్సరం మొదలైతే.. భవిష్యత్తులో వాళ్ల పీజీ కోర్సుల దగ్గర నుంచి ఉద్యోగ నియామకాల వరకు అన్నింటిలోనూ ఇబ్బంది అవుతుంది. ఈ ఉద్దేశంతోనే కౌన్సెలింగ్ ప్రక్రియను యథాతథంగా కొనసాగించాలని మండలి భావిస్తోంది. సాయంత్రం 5 గంటల తర్వాత మీడియా సమావేశం ఏర్పాటుచేసి, తెలంగాణ ప్రభుత్వం కూడా కౌన్సెలింగ్‌కు సహకరించాలని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ వేణుగోపాలరెడ్డి కోరనున్నట్లు సమాచారం. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నెలాఖరులో!
' 16వ తేదీన తేలనున్న స్థానికత! ' 20 నాటికి నోటిఫికేషన్ ... ఏర్పాట్లపై అధికారుల దృష్టి ' ‘స్థానికత’ ఆలస్యమైతే ఆపై మరోవారం ఆలస్యం సాక్షి, హైదరాబాద్: పన్నెండు లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహణకు మార్గం సుగమం అవుతోంది. ఈ నెల మూడోవారంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలాఖరులో కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవహారంలో స్థానికత నిర్ధారణ అంశం కూడా కొలిక్కి వస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, అధికారులు చాలాసార్లు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. స్థానికతకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన కటాఫ్ సంవత్సరాలతో (1956 లేదా 1974) రెండు రకాల ప్రతిపాదనలకు మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిసింది. ఈనెల 16న జరిగే కేబినెట్ సమావేశంలో ఆ రెండింటిలో ఏదో ఒక దాన్ని స్థానికతకు ప్రామాణికంగా తీసుకుని విధాన నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాసి, ప్రవేశాల కోసం దాదాపు 12 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో విద్యార్థుల పరిస్థితిపైనా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఈ అంశాన్ని తేల్చేందుకే ప్రయత్నిస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే సాంకేతికంగా, న్యాయపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిబంధనలను రూపొందించే క్రమంలోనే కొంత ఆలస్యం అవుతుందే తప్ప మరేమీ లేదని చెబుతున్నారు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా ఇటీవల లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రామాణికంగా తీసుకునే స్థానికత అంశంపై ఈనెల 16న ప్రకటన వెలువడిన వెంటనే ఇంజనీరింగ్ తదితర కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్లను జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు తాత్కాలిక షెడ్యూలును కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 16వ తేదీన స్థానికతపై ప్రకటన వెలువడితే ఏయే తేదీల్లో ఏమేం చేయాలనే వివరాలతో ప్రణాళికలు రూపొందించుకున్నట్లు తెలిసింది. ప్రకటన వెలువడిన వెంటనే 20వ తేదీ నాటికి ఇంజనీరింగ్‌లో మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా భర్తీకి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ తరువాత ఒకటి రెండు రోజుల్లో ఇతర ప్రవేశాలపై నోటిఫికేషన్ జారీ చేస్తారు. నోటిఫికేషన్ జారీ తరువాత వారం రోజులు గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ నెలాఖరుకు ప్రవేశాల కౌన్సెలింగ్ (సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఆప్షన్ల నమోదు ప్రారంభం) ప్రారంభించే అవకాశం ఉంది. ఒకవేళ 16వ తేదీన కనుక స్థానికతపై ప్రకటన వెలువడకపోతే మరో వారం రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కొన్ని కోర్సుల్లో మిగిలింది సీట్ల కేటాయింపే.. ఇంజనీరింగ్ కోర్సులకు కౌన్సెలింగ్‌ను ప్రారంభించకపోయినా ఇతర కోర్సులకు సంబంధించిన కౌన్సెలింగ్ ఇప్పటికే పూర్తయింది. ఫీజు రీయింబర్స్మెంట్ అంశం తేలకపోవడంతో సీట్ల కేటాయింపును నిలిపివేశాయి. పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు జూన్ 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు గత నెల 20 నుంచి ఈనెల 5వ తేదీవరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇక్కడా సీట్లను మాత్రం కేటాయించలేదు. ఇక డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్‌సెట్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ను చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న వారిలో ఎంసెట్ ఇంజనీరింగ్ రాసిన వారు 2,15,336 మంది, ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ రాసిన వారు 98,292 మంది ఉన్నారు. డైట్‌సెట్‌లో అర్హులు 2,25,000 మంది, ఎడ్‌సెట్‌లో 1,48,188 మంది, ఐసెట్‌లో 1,19,756 మంది, ఈసెట్‌లో 43,446 మంది, లాసెట్‌లో 18,085 మంది, పీజీలాసెట్‌లో 1,596 మంది, పీఈసెట్‌లో 15,236 మంది, పీజీఈసెట్‌లో 97,642 మంది, పాలీసెట్‌లో 1,67,360 మంది అర్హత సాధించినవారు ఉన్నారు. -
దరఖాస్తులకు శ్రీకారం
సాక్షి, చెన్నై:ప్లస్ టూ పరీక్షా ఫలితాలు మరికొద్ది రోజుల్లో వెలువడనున్నాయి. దీంతో ఉన్నత చదువులను అంది పుచ్చుకోవాలన్న ఆశతో ఏ కోర్సులను ఎంపిక చేసుకోవాలి, ఏ కళాశాలలో చేరాలన్న ప్రయత్నాల్లో విద్యార్థు లు నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సులైన బీఈ, బీటెక్‌ల ప్రవేశ నిమిత్తం అన్నా వర్సిటీ నేతృత్వంలో ఉన్నత విద్యా శాఖ కౌన్సెలింగ్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. దీంతో విద్యార్థుల దృష్టి ఆ వర్సిటీ పరిధిలోని కళాశాల మీద పడింది. ఏ కళాశాలలో నాణ్యమైన విద్య అందుతోంది, అక్కడి పరిస్థితుల ఎలా ఉన్నయన్న విషయూలపై ఆరా తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పరిధిలోని 525కు పైగా కళాశాలల్లో ఇంజనీరింగ్ ప్రవేశం నిమిత్తం దరఖాస్తుల పంపిణీకి అన్నా వర్సిటీ శ్రీకారం చుట్టింది. శనివారం 8.30 గంటలకు దరఖాస్తుల విక్రయానికి సమయం నిర్ణయించారు. అయితే, వేకువ జామునే పెద్ద ఎత్తున విద్యార్థుల ఆ వర్సిటీకి పోటెత్తారు. దీంతో 5.30 గంటలకే దరఖాస్తుల విక్రయాలను ప్రారంభించారు. 60 కేంద్రాల్లో: ఇంజనీరింగ్ చదవాలన్న కాంక్షతో ఉన్న విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, దరఖాస్తులను సులభంగా స్వీకరించే విధంగా అన్నా వర్సిటీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 కేంద్రాల్లో దరఖాస్తులను విక్రయిస్తోంది. అన్నావర్సిటీలో 20 కౌంటర్లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ప్రత్యేక క్యూ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వెనుకబడిన తరగతుల విద్యార్థులకు ప్రత్యేక కౌంటర్ సిద్ధం చేశారు. పురసై వాక్కం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, బ్రాడ్ వే భారతీ మహిళా కళాశాలలోనూ దరఖాస్తులను విక్రయించేందుకు చర్యలు తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన తరగతుల విద్యార్థులు కులధృవీకరణ పత్రం చూపించడంతోపాటుగా రూ.250 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర తరగతుల విద్యార్థులు రూ.500 చెల్లించి దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంటుంది. జూన్‌లో కౌన్సెలింగ్ : దరఖాస్తుల ప్రక్రియకు శ్రీకారం చుట్టడంతో కౌన్సెలింగ్ జూన్‌లో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఉదయం దరఖాస్తుల పంపిణీకి శ్రీకారం చుట్టినానంతరం విలేకరులతో అన్నా వర్సిటీ వీసీ రాజారాం విలేకరులతో మాట్లాడారు. తమ వర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో ఇంజనీరింగ్ కళాశాలలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఆయా కళాశాలల్లో కల్పించిన మౌళిక వసతులు, విద్యా వ్యవహారాలకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే సేకరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కోటాగా రెండు లక్షల సీట్లు ఉన్నట్టు వివరించారు. జూన్ మొదటి వారంలో ర్యాండమ్ నెంబర్ల జాబితాను, అనంతరం ర్యాంకుల జాబితాను వెలువరించనున్నామన్నారు. జూన్ మూడో వారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించి జూలై 30న ముగించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ దరఖాస్తులు 32 జిల్లాల్లో 60 సెంటర్లలో ఈనెల 20వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు వరకు విక్రయించనున్నామన్నారు. అదే రోజున దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా పేర్కొన్నారు. ఆన్లైన్ దరఖాస్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. గత ఏడాది 2,35,211 దరఖాస్తులు ముద్రించామని, ఈ ఏడాది అదనంగా 14,789 దరఖాస్తులు ముద్రించి, మొత్తం 2.5 లక్షలు సిద్ధం చేశామని వివరించారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగు లక్ష్యంగా పాఠ్యాంశాల్లో సరికొత్త మార్పులు చేసి ఉన్నట్టు పేర్కొన్నారు. గత ఏడాది లక్షా 90 వేల 850 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో లక్షా 84 వేల 930 మంది ఎంపిక చేసినట్టు వివరించారు. సెలవు దినాల్లో మినహా తక్కిన అన్ని రోజుల్లో ఉదయం తొమ్మిదిన్నర నుంచి ఐదున్నర గంటల వరకు దరఖాస్తుల విక్రయం, స్వీకరణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య, కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు కుమార్ జయంత్, రైమన్ ఉదయ కృష్ణ రాజ్‌లు పాల్గొన్నారు. -
2 లక్షల సీట్లు ఖాళీయే !
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మొత్తం 2 లక్షల వరకు ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. తొలి విడత ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ పూర్తయ్యేసరికి రాష్ట్రంలో కన్వీనర్ కోటాలోనే లక్ష సీట్లు మిగిలిపోయాయి. బీ ఫార్మసీలో కేవలం 558 సీట్లు మాత్రమే భర్తీ కాగా ఇంకా 7,927 సీట్లు ఖాళీ ఉన్నాయి. మంగళవారం సాయంత్రం సీట్ల కేటాయింపు వివరాలను సాంకేతిక విద్యా శాఖ వెల్లడించింది. విద్యార్థులకు ఎస్.ఎం.ఎస్. ద్వారా తెలియజేసింది. ఈఏడాది ఎంసెట్‌లో 2,18,893 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అనేక అడ్డంకుల నడుమ ఆగస్టు 19న ప్రారంభమై ఈనెల 3న ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కేవలం 1,30,290 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. వీరిలో 1,28,724 మంది వెబ్ఆప్షన్లు ఇవ్వగా.. 1,26,390 మందికి సీట్లు లభించాయి. ఎంపీసీ విభాగంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో మొత్తం 2,34,488 సీట్లు అందుబాటులో ఉండగా.. రెండింట్లో కలిసి 1,08,098 సీట్లు మిగిలాయి. ఇంజనీరింగ్‌లో 99,802, ఫార్మసీ(ఫార్మా-డితో కలుపుకొని)లో 8,296 సీట్లు మిగిలాయి. మరోవైపు యాజమాన్య కోటాలో లక్షా 10 వేల సీట్లు అందుబాటులో ఉండగా దాదాపు లక్ష సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది. అంటే ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది మొత్తం రెండు లక్షల సీట్లు మిగిలిపోతాయన్నమాట. తుది విడత కౌన్సెలింగ్ పూర్తయినా పరిస్థితి పెద్దగా మెరుగయ్యే అవకాశాల్లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలావుండగా సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 23లోగా ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వెబ్సైట్లో ‘క్యాండిడేట్స్ లాగిన్’ అనే లేబుల్‌ను క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నంబరు, హాల్‌టికెట్ నంబరు, పాస్వర్డ్, పుట్టిన తేదీ వివరాలను టైప్ చేయడం ద్వారా సీటు కేటాయింపు పత్రాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు బోధన రుసుం చెల్లించాల్సిన కేటగిరీలో ఉంటే బ్యాంకు చలానా ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సీటు కేటాయింపు పత్రంలో పేర్కొన్న బోధన రుసుమును చలానా ద్వారా ఇండియన్ బ్యాంకులోగానీ, ఆంధ్రా బ్యాంకులోగానీ చెల్లించి రశీదు పొందాల్సి ఉంటుంది. ఆ రశీదును కళాశాలలో చూపించాల్సి ఉంటుంది. సీటు వద్దనుకున్నా లేదా రానిపక్షంలో..: తొలివిడతలో సీటు లభించినా చేరేందుకు ఆసక్తిలేని విద్యార్థులు తదుపరి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవద్దనుకుంటే తాము రిజిస్ట్రేషన్ చేసుకున్న హెల్ప్‌లైన్ సెంటర్‌ను ఆశ్రయించి సీటును రద్దు చేసుకుని సర్టిఫికెట్లు వెనక్కితీసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ సీటు మాత్రమే రద్దు చేసుకోవాలనుకుంటే రద్దు చేసుకుని సర్టిఫికెట్లు అక్కడే ఉంచి తదుపరి విడతల్లో కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. సీటు రానివారు తదుపరి కౌన్సెలింగ్‌లో పాల్గొనదలిస్తే సర్టిఫికెట్లను హెల్ప్‌లైన్ సెంటర్లోనే ఉంచాలి. ఏదైనా ఇతర సమస్యలు ఉంటే సమీపంలోని హెల్ప్‌లైన్ సెంటర్‌ను సంప్రదించవచ్చు. అక్కడినుంచి విన్నపాలు కన్వీనర్‌కు చేరుతాయి. 24 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ఈనెల 24 నుంచి 27 వరకు తుది విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ తెలిపారు. 29న సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు. 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఒకటి నుంచి చివరి ర్యాంకుల వరకు ఎవరైనా వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలివిడతలో సీట్లు పొంది రిపోర్ట్ చేసిన విద్యార్థుల వివరాలను కళాశాలల ప్రిన్సిపల్స్ 01.10.2013లోగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ జాయినింగ్ రిపోర్ట్ అయ్యిందా? లేదా అన్న వివరాలను వెబ్సైట్లో చూడొచ్చు. తొలి విడతలో సీట్లు పొందిన విద్యార్థులు మంచి అవకాశం కోసం తుది విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకుంటే తుదివిడతలో వచ్చే సీటును మాత్రమే పొందుతారు. ఇప్పటివరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకానివారు ఈనెల 24 నుంచి 27 వరకు హెల్ప్‌లైన్ సెంటర్లలో హాజరుకావొచ్చు. ఆ తరువాత వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఈసీఈకే ఎక్కువ డిమాండ్ ఇంజనీరింగ్‌లో ఈ ఏడాది ఈసీఈ బ్రాంచికే ఎక్కువ ఆదరణ లభించింది. ఆ తరువాతి స్థానం కంప్యూటర్ సైన్స్‌కు దక్కింది. మెకానికల్ బ్రాంచి మూడోస్థానంలో ఉంది. ఐటీని పట్టించుకున్నవారే లేరు. ఈసీఈలో 55 శాతం సీట్లు నిండగా.. ఆ తరువాత అత్యధిక సీట్లు అందుబాటులో ఉన్న సీఎస్ఈలో కేవలం 48 శాతం సీట్లు నిండాయి. మెకానికల్ బ్రాంచీలో తక్కువ సీట్లే ఉన్నప్పటికీ 68 శాతం సీట్లు నిండాయి. ఇక సివిల్‌లో కూడా తక్కువ సీట్లే ఉన్నప్పటికీ దీనిలోనూ 70 శాతం సీట్లు నిండాయి. -
రెండోరోజూ అదే తీరు
* పలు కేంద్రాల్లో నిలిచిపోయిన ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ * పెరిగిన విద్యార్థుల హాజరు * నేటినుంచి మరో 3 కొత్త కేంద్రాలు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ధ్రువపత్రాల తనిఖీ ప్రక్రియ మంగళవారం కూడా అనేక కేంద్రాల్లో కొనసాగలేదు. సీమాంధ్రలో మొత్తం 34 సహాయక కేంద్రాలు ఏర్పాటుచేయగా సమైక్య ఉద్యమం కారణంగా తొలిరోజు కేవలం 15 కేంద్రాల్లోనే ఈ ప్రక్రియ సజావుగా సాగింది. రెండోరోజు మరో కేంద్రంలో కూడా ధ్రువపత్రాల తనిఖీ నిలిచిపోయింది. అయితే ఈ ప్రాంతంలో సర్టిఫికెట్ల తనిఖీకి హాజరైన విద్యార్థుల సంఖ్య కొంతమేర పెరిగింది. రెండోరోజు సీమాంధ్రలో 14 కేంద్రాల్లో 3,529 మంది సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యారు. అలాగే తెలంగాణలో 22 కేంద్రాలకు గాను 5,268 మంది హాజరయ్యారు. కౌన్సెలింగ్ ప్రక్రియను సమీక్షించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ పి.జయప్రకాశ్‌రావు నేతృత్వంలో మంగళవారం రాత్రి మండలిలో సమావేశం జరిగింది. ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్‌మిశ్రా, మండలి కార్యదర్శి సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి కె.రఘునాథ్ పాల్గొన్నారు. అజయ్‌మిశ్రా సీమాంధ్ర జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి కౌన్సెలింగ్ ప్రక్రియ సక్రమంగా సాగేందుకు మరింత తోడ్పాటు అందించాలని కోరారు. కాగా బుధవారం నుంచి అదనంగా మరో 3 సహాయక కేంద్రాలను అందుబాటులోకి తేనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అంబేద్కర్ వర్సిటీ, విజయనగరం జిల్లాలోని జేఎన్టీయూ కళాశాల, ఒంగోలులోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను హెల్ప్‌లైన్ సెంటర్లుగా వినియోగించనున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటివరకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదని, కొత్త కేంద్రాల ఏర్పాటు ఆ జిల్లాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందని మండలి చైర్మన్ తెలిపారు. ఈ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరవ్వాల్సిన ర్యాంకర్లకు షెడ్యూలును వెబ్సైట్లో పొందుపరిచారు. సీమాంధ్ర కు పొరుగున ఉన్న మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని, ఇవి గురువారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అలాగే హైదరాబాద్‌లో కూడా కొత్తగా కొన్ని కేంద్రాలు ఏర్పాటుచేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. సర్టిఫికెట్ల తనిఖీ జరగని విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈనెల 30లోపు ఎప్పుడు ఈ ప్రక్రియలో పాల్గొన్నా సరిపోతుందని వివరించారు. -
ఆన్లైన్లోనే యాజమాన్య కోటా భర్తీ
* ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలకు స్పష్టం చేసిన హైకోర్టు * ఎన్నారై కోటా 15 శాతం భర్తీకి అనుమతి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్లను ఆన్లైన్ ద్వారానే భర్తీ చేయాలని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ జీవో 66ను సమర్థించింది. విద్యార్థుల ప్రయోజనం కోసం జారీ చేసిన ఈ జీవో విషయంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అయితే సీట్ల భర్తీకి సంబంధించి యాజమాన్యాలకు ధర్మాసనం కొన్ని వెసులుబాటులు ఇచ్చింది. విద్యార్థులకు నేరుగా కూడా దరఖాస్తులు అందుబాటులో ఉంచడంతో పాటు వారి నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించాలని స్పష్టం చేసింది. అలా నేరుగా, మరోవైపు ఆన్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నీ కలిపి మెరిట్ జాబితా తయారుచేయాలని ఆదేశించింది. విద్యార్థుల సర్టిఫికేట్ల పరిశీలనతో పాటు, వారి స్థితిగతులు, ప్రవర్తన తదితర విషయాలను యాజమాన్యాలు తెలుసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఒకవేళ ఎవరైనా విద్యార్థి ప్రవేశాన్ని తిరస్కరిస్తే, అందుకు సహేతుక కారణాలను తెలియజేయాలని, అలాగే ఆ విద్యార్థితో పాటు ఉన్నత విద్యామండలికి సమాచారం ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించింది. అలాగే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పూరించే సమయంలో విద్యార్థులు పలు కాలేజీల్లో సీట్లను రిజర్వ్ చేసుకునే (మల్టిపుల్ బ్లాకింగ్) అంశంపై యాజమాన్యాలు వ్యక్తంచేసిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి అటు యాజమాన్యాలు, ఇటు ఉన్నత విద్యామండలి అధికారులు పరస్పరం చర్చించుకుని, పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలని సూచించింది. ప్రవాస భారతీయులు (ఎన్నారై) కోటాను 15 నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. గతంలో ఉన్నట్లుగానే 15 శాతం మేర భర్తీ చేసుకోవచ్చునని యాజమాన్యాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శ్రేయాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రేయాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ అనంతుల వినయ్‌కుమార్‌రెడ్డి, మరికొందరు దాఖలుచేసిన పిటిషన్లను పరిష్కరిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణిలతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ‘ఏపీసెట్ దరఖాస్తుల్లో తప్పులు దిద్దుకోండి’ హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర అర్హత పరీక్ష(ఏపీసెట్-2013) దరఖాస్తుల్లో దొర్లిన తప్పులు సరిచేసుకునేందుకు అభ్యర్థులకు అవకాశం కల్పించినట్టు ఏపీసెట్ సభ్య కార్యదర్శి ఆచార్య రాజేశ్వరరెడ్డి తెలిపారు. సవరించిన దరఖాస్తులను ఈ నెల 31లోపు ఉస్మానియా యూనివర్సిటీలోని ఏపీసెట్ కార్యాలయంలో లేదా, మెయిల్, లెటర్స్ ద్వారా తమకు అందజేయాలని కోరారు. www.apset.org/apset 2012@gmail.com అనే వెబ్సైట్ ద్వారా తప్పులు సరిదిద్దుకోవచ్చని తెలిపారు. -
సీమాంధ్రలో రెండోరోజూ కౌన్సెలింగ్‌కు అడ్డంకులు
సీమాంధ్ర ప్రాంతంలోని పలు జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు వరుసగా రెండోరోజు కూడా ఆటంకాలు ఎదురయ్యాయి. పశ్చిమగోదావరి, చిత్తూరు లాంటి జిల్లాల్లో మాత్రం పటిష్ఠమైన పోలీసు బందోబస్తు మధ్య సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ఉదయం నుంచి కొనసాగుతోంది. 15 వేలకు పైబడి ర్యాంకులు వచ్చినవారికి మంగళవారం నాడు సర్టిఫికెట్ల పరిశీలన జరగాల్సి ఉంది. అయితే, పలు సెంటర్లలో సమైక్యవాదులు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని ఆశగా వచ్చిన విద్యార్థులు వెనుదిరగాల్సి వచ్చింది. విజయవాడ, విశాఖపట్నం, తూర్పుగోదావరి లాంటి జిల్లాల్లో ఎక్కడా అస్సలు కౌన్సెలింగ్ ఊసన్నదే లేదు. విజయవాడలో సమైక్యాంధ్రకు మద్దతుగా సిబ్బంది విధులు బహిష్కరించారు. -
విద్యార్థులు ఆందోళన చెందొద్దు: ఎంసెట్ కన్వీనర్ రమణారావు
సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సమస్యలు, ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమేనని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన 'సాక్షి టీవీ'తో మాట్లాడారు. సీమాంధ్రలోని పలు జిల్లాల్లో కౌన్సెలింగ్‌కు సమైక్య వాదుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని, పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా ఆందోళన చేస్తుండటంతో చాలాచోట్ల కౌన్సెలింగ్ జరగలేదని ఆయన తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈరోజు కౌన్సెలింగ్ జరగని వారందరికీ సర్టిఫికెట్ల పరిశీలనకు మరోసారి అవకాశం ఇస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేస్తామని, కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని రమణారావు అన్నారు. అయితే.. మరోవైపు ఉన్నత విద్యామండలి మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిలిపివేసే ప్రసక్తే లేదని మండలి తెలిపింది. కౌన్సెలింగ్ విషయంలో విద్యార్థులకు సహకరించాలని విద్యార్థి సంఘాలకు, ఉద్యమకారులకు విజ్ఞప్తి చేసింది. కాగా, సీమాంధ్రలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఏమాత్రం సజావుగా సాగట్లేదు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్యసెగ తగిలింది. విద్యార్థి జేఏసీ నాయకులు కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకున్నారు. దీంతో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను సిబ్బంది నిలిపివేశారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ తాకింది. సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు తీవ్ర విఘాతం కలిగింది. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు ఎక్కడా కౌన్సెలింగ్ సజావుగా సాగట్లేదు. పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం ఇప్పటికే సమ్మె చేస్తుండటంతో వారంతా కౌన్సెలింగ్ విధులను బహిష్కరించారు. మరికొన్ని చోట్ల ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించబోయినా... జేఏసీ నాయకులు, విద్యార్థులు తదితరులు అడ్డుకోవడంతో ఏమాత్రం ముందుకు సాగట్లేదు. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం వరకు యథాతథంగా కౌన్సెలింగ్ జరుగుతుందని, సీమాంధ్రలో కొన్ని చోట్ల కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఎంసెట్ కన్వీనర్ రఘునందన్ తెలిపారు. ప్రస్తుతానికి కౌన్సెలింగ్ షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం వరకు కౌన్సిలింగ్ ప్రక్రియపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. విశాఖలో ఎంసెట్ కౌన్సెలింగ్ విధులను అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బహిష్కరించారు. విశాఖలో ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ -2013 కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నేటి నుంచి మొదలు అవుతోంది. కాగా విజయవాడలోని పాలిటెక్నిక్ కేంద్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కడపలోనూ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు అధ్యాపకులు గౌర్హాజరు కావటంతో కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. గుంటూరు అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖల్లోనూ కౌన్సెలింగ్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకోవటంతో సెంటర్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పాలిటెక్నిక్ కాలేజీకి బదులు డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేయడంతో తొలుత ఉదయం బాగానే ప్రారంభమయ్యింది. ముందుజాగ్రత్తగా బీఎస్ఎఫ్ బలగాలతో అక్కడ భద్రత ఏర్పాటుచేశారు. జేఏసీ వర్గాలు కౌన్సెలింగ్‌ను అడ్డుకోడానికి ప్రయత్నించినా, పోలీసులు వారిని నిరోధించారు. అయితే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ జరగకపోవడం, కొన్నిచోట్ల మాత్రమే జరుగుతుండటంతో మొత్తం వ్యవహారం గందరగోళంగా మారింది. ఆగిపోయిన చోట్ల మళ్లీ ఎప్పుడు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది, వారికి ఆప్షన్ల నమోదు అవకాశం ఎప్పుడు ఇస్తారోనన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ మొత్తం విషయంపై విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జారీ
* ఈనెల 19 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన * 22 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు.. * సెప్టెంబర్ 2, 3 తేదీల్లో ఆప్షన్ల సవరణకు అవకాశం సాక్షి, హైదరాబాద్: ఎంసెట్(ఎంపీసీ విభాగం) విద్యార్థులకు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్ అజయ్‌జైన్ తెలిపారు. ఈనెల 22 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు ఆప్షన్ల నమోదు జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. విద్యార్థులు ర్యాంకును అనుసరించి హెల్ప్‌లైన్ సెంటర్ల లో విధిగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని, అధికారులు అందజేసే స్క్రాచ్ కార్డును భద్రపరుచుకుని వెబ్ ఆప్షన్ల నమోదుకు వినియోగించుకోవాలని సూచించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఉదయం 9 గంటలకే హెల్ప్‌లైన్ సెంటర్‌కు చేరుకోవాలి. స్పెషల్ కేటగిరీ కింద వికలాంగ, సైనికుల పిల్లలు, ఎన్సీసీ, స్పోర్ట్స్, మైనారిటీ విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో ఉంటుంది. సంబంధిత షెడ్యూలును https://apeamcet.nic.in వెబ్సైట్లో చూడవచ్చు. కళాశాలల వారీగా ఫీజుల వివరాలను సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నాటికి ఈ వెబ్సైట్లో పొందుపరుస్తారు. కళాశాలలో ఫీజు, చెల్లించగలిగే స్తోమత, ఫీజు రీయింబర్స్మెంట్ లభించే అవకాశం తదితర అంశాలను పరిశీలించి మెరుగైన కళాశాలను ఎంచుకోవాలి. యాజమాన్య కోటా భర్తీకి మార్గదర్శకాలు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో బీ-కేటగిరీ(యాజమాన్య కోటా) సీట్ల భర్తీకి ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను జారీ చేసింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాల ప్రకారం యాజమాన్యాలు బీ-కేటగిరీ దరఖాస్తులను కళాశాల నోటీసు బోర్డులో, వెబ్సైట్లో ఉంచాలని, తమకు, సంబంధిత వర్సిటీకి దరఖాస్తు ఫారం నమూనాను ఈ-మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొంది. విద్యార్థులు పూర్తిచేసిన దరఖాస్తును రిజిస్టర్డ్ పోస్టులో పంపించాలని సూచించింది. కళాశాలలు దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనూ స్వీకరించవచ్చని, వాటి వివరాలు వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించింది. కాగా, ప్రతిభాక్రమంలో ఎంపిక చేసిన విద్యార్థుల జాబితాను ఎంసెట్ అడ్మిషన్ల కన్వీనర్‌కు పంపించాల్సి ఉంటుంది. జాబితాను రెండు వారాల పాటు వెబ్సైట్లో ఉంచాలి. -
ఇంజనీరింగ్ విద్యార్థుల వలసబాట!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 700కు పైగా ఇంజనీరింగ్ కళాశాలలున్నా ఇక్కడి లక్షలాది మంది విద్యార్థులు వలసబాట పడుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఇప్పటికే లక్ష మంది ఇతర రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరినట్లు అనధికారిక సమాచారం. ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న జాప్యమే విద్యార్థులు వలసబాట పడ్డానికి కారణంగా తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ ముగిసి తరగతులు కూడా మొదలయ్యాయి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం ఇంతవరకూ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు కూడా ఖరారు కాలేదు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ కళాశాలల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. కనీసం అడ్మిషన్ల కౌన్సెలింగ్ తేదీలు కూడా ఖరారు చేయకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిని, ప్రణాళికా లోపాన్ని విద్యావేత్తలు, మేధావులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ‘విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కళాశాలలకు వెళితే ఫీజు రీయింబర్స్‌మెంటు భారం తగ్గుతుంది..’ అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంబిస్తోందనే విమర్శలూ వినిపిస్తున్నాయి. ఎంసెట్ ఫలితాలొచ్చి రెండు నెలలైనా: ఎంసెట్ ఫలితాలు వచ్చి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ ఇంజనీరింగ్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూలును ప్రభుత్వం ప్రకటించలేదు. జూన్ మొదటి వారంలో ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో సుమారు రెండన్నర లక్షల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. జూలై మొదటి వారంలోనే ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను నిర్ధారించిన ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ జారీ చేస్తే గత నెలాఖరుకే కౌన్సెలింగ్ పూర్తయి విద్యార్థులు కళాశాలల్లో చేరేవారు. ఈ నెలలో తరగతులు కూడా ఆరంభించడానికి వీలయ్యేది. అయితే ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోనందున కౌన్సెలింగ్‌కు సంబంధించిన ప్రకటన జారీలో జాప్యం జరుగుతోంది. ఆగస్టు మొదటి వారంలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేసి తరగతులు ప్రారంభించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినా వాటి అమల్లో ప్రభుత్వం విఫలమైంది. మేనేజ్మెంట్ కోటా సీట్లపైనే వివాదం: ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ఏర్పడిన వివాదం మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. మేనేజ్మెంట్ కోటా సీట్లను ఆన్లైన్లో భర్తీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాలేజీ యాజమాన్యాలు హైకోర్టులో సవాల్ చేశాయి. ఇది తేలే వరకూ మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ వీలుకాదు. గుణపాఠం నేర్వని సర్కారు: గతేడాది కౌన్సెలింగ్‌లో జాప్యం కారణంగా లక్షన్నర మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లారు. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వలసలు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యార్థులు వలసబాట పట్టడం రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు గొడ్డలిపెట్టుగా పరిణమించింది. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో సీట్లు మిగిలిపోయి కళాశాలల నిర్వహణ భారంగా మారనుంది. సీట్లు భర్తీ కాని కారణంగా గతేడాది లక్షన్నర సీట్లు మిగిలిపోయాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళితే ఫీజు రీయింబర్స్మెంట్ భారం తగ్గుతుందనే భావంతోనే ప్రభుత్వం కన్వీనరు కోటా సీట్ల భర్తీ కోసం చొరవ తీసుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.