ఎంసెట్ కౌన్సెలింగ్కు సమైక్య సెగ | Engineering counselling hampered by seemandhra strike | Sakshi
Sakshi News home page

ఎంసెట్ కౌన్సెలింగ్కు సమైక్య సెగ

Aug 19 2013 11:10 AM | Updated on Sep 1 2017 9:55 PM

ఎంసెట్ కౌన్సెలింగ్కు సమైక్య సెగ

ఎంసెట్ కౌన్సెలింగ్కు సమైక్య సెగ

ఎంసెట్ కౌన్సెలింగ్కు సమైక్య సెగ తాకింది. సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు తీవ్ర విఘాతం కలిగింది.

ఎంసెట్ కౌన్సెలింగ్కు సమైక్య సెగ తాకింది. సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్కు తీవ్ర  విఘాతం కలిగింది. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు ఎక్కడా కౌన్సెలింగ్ సజావుగా సాగట్లేదు. పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం ఇప్పటికే సమ్మె చేస్తుండటంతో వారంతా కౌన్సెలింగ్ విధులను బహిష్కరించారు. మరికొన్ని చోట్ల ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించబోయినా... జేఏసీ నాయకులు, విద్యార్థులు తదితరులు అడ్డుకోవడంతో ఏమాత్రం ముందుకు సాగట్లేదు.

హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం వరకు యథాతథంగా కౌన్సెలింగ్ జరుగుతుందని, సీమాంధ్రలో కొన్ని చోట్ల కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఎంసెట్ కన్వీనర్ రఘునందన్ తెలిపారు. ప్రస్తుతానికి కౌన్సెలింగ్ షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం వరకు కౌన్సిలింగ్ ప్రక్రియపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు.

విశాఖలో ఎంసెట్ కౌన్సెలింగ్ విధులను అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బహిష్కరించారు. విశాఖలో ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు.  ఎంసెట్ -2013 కౌన్సెలింగ్లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నేటి నుంచి మొదలు అవుతోంది.

కాగా విజయవాడలోని పాలిటెక్నిక్ కేంద్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కడపలోనూ ఎంసెట్ కౌన్సెలింగ్ను సమైక్యవాదులు అడ్డుకున్నారు.  తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు అధ్యాపకులు గౌర్హాజరు కావటంతో కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. గుంటూరు అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖల్లోనూ కౌన్సెలింగ్కు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ను సమైక్యవాదులు అడ్డుకోవటంతో సెంటర్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పాలిటెక్నిక్ కాలేజీకి బదులు డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేయడంతో తొలుత ఉదయం బాగానే ప్రారంభమయ్యింది. ముందుజాగ్రత్తగా బీఎస్ఎఫ్ బలగాలతో అక్కడ భద్రత ఏర్పాటుచేశారు. జేఏసీ వర్గాలు కౌన్సెలింగ్ను అడ్డుకోడానికి ప్రయత్నించినా, పోలీసులు వారిని నిరోధించారు.

అయితే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ జరగకపోవడం, కొన్నిచోట్ల మాత్రమే జరుగుతుండటంతో మొత్తం వ్యవహారం గందరగోళంగా మారింది. ఆగిపోయిన చోట్ల మళ్లీ ఎప్పుడు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది, వారికి ఆప్షన్ల నమోదు అవకాశం ఎప్పుడు ఇస్తారోనన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ మొత్తం విషయంపై విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement