Seemandhra Strike
-
ఔట్‌పేషెంట్ సేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రిలో సూపరింటెండెంట్‌గా నియమితులైన సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని పక్కకు తొలగించి బలవంతంగా మరో వ్యక్తిని ఆ కుర్చీలో కూర్చోబెట్టడంపై సీమాంధ్రలో వైద్యుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. సమైక్యాంధ్ర ఉద్యమంతో అట్టుడుకుతున్న 13 జిల్లాల్లో ఈ ఘటన అగ్నికి ఆజ్యం పోసింది. ఆ జిలాలన్నింట్లోనూ ఔట్‌పేషెంట్ సేవలు నిలిపివేశారు. సాధారణ శస్త్రచికిత్సలను కూడా ఆపేశారు. ఎమర్జన్సీ సేవలు మినహా ఎక్కడా రోగులకు సేవలు అందలేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, బోధనాసుపత్రుల్లో ఎక్కడా కూడా ఒక్క రోగిని కూడా ఓపీలో చూడలేదు. దాంతో బుధవారం ప్రభుత్వాసుపత్రుల్లో రోగులు తీవ్ర బాధలు పడ్డారు. ఆంధ్రా వైద్య కళాశాల, కర్నూలు వైద్య కళాశాలతో పాటు రిమ్స్ల్లో పరిస్థితి దారుణంగా పరిణమించింది. సుమారు 25వేల మందికి ఓపీ సేవలు అందలేదు. ఉస్మానియా ఘటనకు బాధ్యులను సస్పెండ్ చేయకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం హెచ్చరించింది. సీమాంధ్ర వైద్యులు హైదరాబాద్‌లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారనేందుకు ఉస్మానియా ఘటనే తార్కాణమని సంఘం అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వం అధికారికంగా నియమించిన వ్యక్తిని అడ్డుకున్నారంటే తెలంగాణ వైద్యుల దౌర్జన్యకాండ ఏ రకంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చునన్నారు. -
వైఎస్ విజయమ్మ దీక్షపై పోలిసులు దాడి
-
విజయమ్మ దీక్ష భగ్నం
-
విజయమ్మ దీక్ష భగ్నం
* నేడు సీమాంధ్ర బంద్‌కు వైఎస్సార్సీపీ పిలుపు * గుంటూరులోని దీక్షా శిబిరానికి అర్ధరాత్రి దూసుకొచ్చిన పోలీసులు * ప్రతిఘటించిన విజయమ్మ, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. తీవ్ర ఉద్రిక్తత * విజయమ్మను బలవంతంగా పోలీసు వ్యాన్‌లో ఆస్పత్రికి తరలించిన ఖాకీలు సాక్షి, గుంటూరు: రాష్ట్ర విభజనంటూ జరిగితే అన్ని ప్రాంతాలవారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులో విజయమ్మ చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారం ఐదో రోజు పూర్తి చేసుకున్న నేపథ్యంలో అర్ధరాత్రి దాటాక పోలీసు బలగాలు శిబిరంలోకి దూసుకొచ్చాయి. ఐదు రోజులుగా నిరాహార దీక్షతో నీరసిం చిన విజయమ్మను తమతోపాటు రావాలని, ఆస్పత్రికి తరలిస్తామని పోలీసులు కోరారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు దీక్షవిరమించేది లేదని విజయమ్మ తేల్చి చెప్పారు. ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి, వాసిరెడ్డి పద్మ, శోభానాగిరెడ్డి సహా పార్టీ నేతలు పోలీసులను అడ్డుకున్నారు. జై జగన్, జై సమైక్యాంధ్ర నినాదాలతో దీక్షా ప్రాంగణం హోరెత్తింది. కనీసం అంబులెన్స్ కూడా తీసుకురాని పోలీసులు 1.55 గంటలకు బలవంతంగా ఆమెను పోలీసు వ్యాన్లోనే గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. కొందరు నేతలను పోలీసులు వేదికపై నుంచి ఎత్తి పడేశారు. కోటంరెడ్డి శ్రీధరరెడ్డిని వేదిక పైనుంచి కిందికి తోసేశారు. దీంతో ఆయన కాలికి గాయమయింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ విజయమ్మ ఆస్పత్రి నుంచి బయటికి వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. 20 నిమిషాల తర్వాత వైద్యులు వచ్చి ఆమెను ఐసీయూలోకి తరలించారు. కాగా, సర్కారు తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ శనివారం సీమాంధ్ర బంద్‌కు పిలుపునిచ్చింది. అయితే ఆస్పత్రిలోనూ విజయమ్మ దీక్షను కొనసాగిస్తున్నారని వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఐవీ ప్లూయిడ్స్ తీసుకునేందుకు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని వెల్లడించారు. మహానేత సతీమణిని అమానుషంగా తరలించిన తీరుకు నిరసనగా బంద్ కు పిలుపునిస్తున్నట్టు చెప్పారు. బంద్ కు అందరూ సహకరించాలని కోరారు. అధికార కాంగ్రెస్ కు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు. -
విద్యార్థులు ఆందోళన చెందొద్దు: ఎంసెట్ కన్వీనర్ రమణారావు
సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సమస్యలు, ఇబ్బందులు ఎదురైన మాట వాస్తవమేనని ఎంసెట్ కన్వీనర్ రమణారావు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆయన 'సాక్షి టీవీ'తో మాట్లాడారు. సీమాంధ్రలోని పలు జిల్లాల్లో కౌన్సెలింగ్‌కు సమైక్య వాదుల నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని, పాలిటెక్నిక్ లెక్చరర్లు కూడా ఆందోళన చేస్తుండటంతో చాలాచోట్ల కౌన్సెలింగ్ జరగలేదని ఆయన తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈరోజు కౌన్సెలింగ్ జరగని వారందరికీ సర్టిఫికెట్ల పరిశీలనకు మరోసారి అవకాశం ఇస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్రలో పరిస్థితులను ప్రభుత్వానికి తెలియజేస్తామని, కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని రమణారావు అన్నారు. అయితే.. మరోవైపు ఉన్నత విద్యామండలి మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించింది. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను నిలిపివేసే ప్రసక్తే లేదని మండలి తెలిపింది. కౌన్సెలింగ్ విషయంలో విద్యార్థులకు సహకరించాలని విద్యార్థి సంఘాలకు, ఉద్యమకారులకు విజ్ఞప్తి చేసింది. కాగా, సీమాంధ్రలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ఏమాత్రం సజావుగా సాగట్లేదు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్యసెగ తగిలింది. విద్యార్థి జేఏసీ నాయకులు కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకున్నారు. దీంతో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియను సిబ్బంది నిలిపివేశారు. -
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు సమైక్య సెగ తాకింది. సీమాంధ్ర జిల్లాల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు తీవ్ర విఘాతం కలిగింది. ఒకటి రెండు చోట్ల మినహా దాదాపు ఎక్కడా కౌన్సెలింగ్ సజావుగా సాగట్లేదు. పాలిటెక్నిక్ అధ్యాపకుల సంఘం ఇప్పటికే సమ్మె చేస్తుండటంతో వారంతా కౌన్సెలింగ్ విధులను బహిష్కరించారు. మరికొన్ని చోట్ల ఇతర సిబ్బంది కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించబోయినా... జేఏసీ నాయకులు, విద్యార్థులు తదితరులు అడ్డుకోవడంతో ఏమాత్రం ముందుకు సాగట్లేదు. హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో సాయంత్రం వరకు యథాతథంగా కౌన్సెలింగ్ జరుగుతుందని, సీమాంధ్రలో కొన్ని చోట్ల కౌన్సెలింగ్ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఎంసెట్ కన్వీనర్ రఘునందన్ తెలిపారు. ప్రస్తుతానికి కౌన్సెలింగ్ షెడ్యూలులో ఎలాంటి మార్పు లేదని, తుది నిర్ణయం మాత్రం ప్రభుత్వానిదేనని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం వరకు కౌన్సిలింగ్ ప్రక్రియపై స్పష్టత వస్తుందని ఆయన చెప్పారు. విశాఖలో ఎంసెట్ కౌన్సెలింగ్ విధులను అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బహిష్కరించారు. విశాఖలో ఎంసెట్ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద ఏపీ ఎన్జీవోలు, ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ఎంసెట్ -2013 కౌన్సెలింగ్‌లో భాగంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం కోసం విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నేటి నుంచి మొదలు అవుతోంది. కాగా విజయవాడలోని పాలిటెక్నిక్ కేంద్రంలో ఎంసెట్ కౌన్సెలింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. కడపలోనూ ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకున్నారు. తిరుపతిలోని ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణకు అధ్యాపకులు గౌర్హాజరు కావటంతో కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేశారు. గుంటూరు అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖల్లోనూ కౌన్సెలింగ్‌కు ఆటంకాలు ఎదురయ్యాయి. ఎంసెట్ కౌన్సెలింగ్‌ను సమైక్యవాదులు అడ్డుకోవటంతో సెంటర్ల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పాలిటెక్నిక్ కాలేజీకి బదులు డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ ఏర్పాట్లు చేయడంతో తొలుత ఉదయం బాగానే ప్రారంభమయ్యింది. ముందుజాగ్రత్తగా బీఎస్ఎఫ్ బలగాలతో అక్కడ భద్రత ఏర్పాటుచేశారు. జేఏసీ వర్గాలు కౌన్సెలింగ్‌ను అడ్డుకోడానికి ప్రయత్నించినా, పోలీసులు వారిని నిరోధించారు. అయితే, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ జరగకపోవడం, కొన్నిచోట్ల మాత్రమే జరుగుతుండటంతో మొత్తం వ్యవహారం గందరగోళంగా మారింది. ఆగిపోయిన చోట్ల మళ్లీ ఎప్పుడు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది, వారికి ఆప్షన్ల నమోదు అవకాశం ఎప్పుడు ఇస్తారోనన్న ఆందోళన విద్యార్థుల తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఈ మొత్తం విషయంపై విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. -
సీమాంధ్రలో స్తంభించిన ట్రెజరీ
* వారంలో రూ.1,000 కోట్ల రాబడి బంద్ * 13 జిల్లా ట్రెజరీ, 194 ఉప ట్రెజరీలకు తాళం సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో ఈనెల 13 నుంచి ట్రెజరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. 13 జిల్లాల ఖజానా కార్యాలయాలతోపాటు 194 ఉప కార్యాలయాలు గత వారం రోజులుగా తెరవడం లేదు. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కార్యాలయాలకు తాళాలు వేశారు. దీని ప్రభావం సర్కారు రాబడిపై తీవ్రంగా పడింది. ఈ 13 జిల్లాల నుంచి రోజూ రాష్ట్ర సర్కారుకు రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు రాబడి వస్తుంది. సమ్మె కారణంగా వారం రోజులుగా సుమారు రూ.వెయ్యి కోట్ల మేర రాబడి నిలిచిపోయింది. ట్రెజరీ కార్యాలయాలు పనిచేయకపోవడంతో సుమారు రూ. 1,200 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి రాబడులు, చెల్లింపులు నిలిచిపోయినప్పటికీ ఉద్యోగుల సమ్మె విరమించిన తర్వాత రాబడులు వస్తాయి. చెల్లింపులు కూడా సాగుతాయి. అయితే ఇప్పుడు రాబడులు లేకపోవటం ప్రభుత్వ వ్యయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం వచ్చేనెల ఉద్యోగులకు జీతాల చెల్లింపు, ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపుపై పడుతుందని వివరించారు. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ. 1,800 కోట్ల రుణాన్ని సేకరించిందని, అత్యవసరాలకు ఆ నిధులను వినియోగించుకుంటామని, వచ్చేనెలలో కూడా ఇదే పరిస్థితులు కొనసాగితే కష్టమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. -
సమైక్య సమ్మెతో 13 జిల్లాల్లో స్తంభించిన పాలన
* మూతపడ్డ ప్రభుత్వాఫీసులు... నిలిచిన పౌరసేవలు * రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు.. బోసిపోయిన బస్టాండ్లు * తిరుమలకూ తిరగని బస్సులు.. పుణ్యక్షేత్రం వెలవెల * తెరుచుకోని విద్యా సంస్థలు.. పనిచేయని బ్యాంకులు * అన్ని జిల్లాల్లో భారీగా ఉద్యోగుల ధర్నాలు, ర్యాలీలు * సోనియా, దిగ్విజయ్, కేసీఆర్‌ల దిష్టిబొమ్మలు దహనం * ఆర్టీసీకి రోజుకు రూ. 13 కోట్ల మేర ఆదాయ నష్టం * రాజధానిలో పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ఎన్జీవోలు ఇచ్చిన సమ్మె పిలుపుతో మంగళవారం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సకలం బంద్ అయ్యాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. సీమాంధ్ర పూర్తిగా స్తంభించిపోయింది. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్టాండ్లు బోసిపోయాయి. పంచాయతీ మొదలు జిల్లా కేంద్రం వరకూ ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మునిసిపాలిటీల్లో పౌరసేవలు ఆగిపోయాయి. ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డెక్కలేదు. విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. పెట్రోల్, డీజిల్ బంకులు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రభుత్వానికి రావాల్సిన దాదాపు రూ. 150 కోట్ల రాబడి నిలిచిపోయింది. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర సేవలు మినహా మిగతా సేవలకు అంతరాయం కలిగింది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో వివిధ ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా ర్యాలీలు, నిరాహార దీక్షలు నిర్వహించాయి. ఆందోళనకారులు కూడళ్లలో మానవహారాలు, రహదారులపై వంటావార్పులు, ఆటపాటలు, వినూత్న నిరసనలతో హోరెత్తించారు. సోనియాగాంధీ, దిగ్విజయ్‌సింగ్, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మొదటి రోజు సమ్మె పూర్తిగా విజయవంతం అయింది. బంద్ ప్రభావం రైలు ప్రయాణంపై కూడా కనిపించింది. సమ్మె వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీగా సమ్మెలో పాల్గొన్న టీచర్లు... ఉపాధ్యాయ సంఘాలు సమ్మెలో పాల్గొనే విషయంలో ఇంకా నిర్ణయం ప్రకటించకపోయినప్పటికీ టీచర్లు సైతం పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారు. దీంతో అన్ని జిల్లాల్లో పాఠశాలలు మూతపడ్డాయి. జూనియర్, డిగ్రీ కళాశాలలు, విశ్వవిద్యాయాల బోధన, బోధనేతర సిబ్బంది సమ్మెలో ఉండటంతో తరగతులు జరగలేదు. పలు జిల్లాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు కూడా మూతపడ్డాయి. పదమూడు జిల్లాల్లోనూ బ్యాంకులు మూతపడటంతో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. ఎస్పీ కార్యాలయాల్లోని మినిస్టీరియల్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. ఫలితంగా పోలీసు కార్యాలయాల్లో పాలనా కార్యకలాపాలకు విఘాతం కలిగింది. ఆర్టీసీలోని ప్రధాన యూనియన్లు.. ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ సమ్మెలో ఉండటంతో 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తిరుపతి, తిరుమల మధ్య కూడా ఆర్టీసీ బస్సులు తిరగలేదు. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సమ్మెకు మద్దతు ప్రకటించకపోవటంతో.. నెల్లూరులో మంగళవారం 102 బస్సులు నడిచాయి. సీమాంధ్రలో ఉద్యమం వల్ల ఇప్పటి వరకు ఆర్టీసీ రూ. 98 కోట్ల రాబడిని కోల్పోయిందని.. ఇప్పుడు సమ్మె వల్ల 13 జిల్లాల్లో బస్సులు పూర్తిగా నిలిచిపోతే రోజూ రూ. 13 కోట్ల రాబడి కోల్పోతామని, ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించాలని ఆ సంస్థ ఎండీ ఎ.కె.ఖాన్ విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో సమ్మె సంపూర్ణం విశాఖ జిల్లాలో 40 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రీజియన్‌లో సుమారు 1,060 బస్సులు నిలిచిపోయాయి. బ్యాంకుల్లో కార్యకలాపాలు నిలిచిపోవటంతో మంగళవారం ఒక్క రోజే సుమారు రూ. 350 కోట్ల మేరకు ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 24 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొనగా.. 482 బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి, ప్రైవేట్ వాహనాలు కూడా చాలావరకు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విజయనగరం జిల్లాలో 17 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. విజయనగరం జోన్ పరిధిలో 2,800 బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ సుమారు రూ. 2.7 కోట్ల ఆదాయం కోల్పోయింది. పశ్చిమగోదావరి జిల్లాలో 615 ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయూరుు. జిల్లా వ్యాప్తంగా కూరగాయల ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవటంతో రూ. 25 లక్షల మే ర టర్నోవర్ నిలిచిపోయింది. తూర్పుగోదావరిలో 45 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటుండగా, మరో 19 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. రాజమండ్రిలో నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. విజయవాడలో వంద శాతం ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో మొత్తం 1,200 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సిబ్బంది జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటుచేశారు. గుంటూరు జిల్లాలో 25,200 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. గుంటూరు కలెక్టరేట్ ఆవరణలోని తెలుగుతల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి భారీ మానవహారంతో నిరసన తెలిపారు. కోల్డ్‌స్టోరేజీల బంద్‌తో మిర్చియార్డులో వ్యాపార లావాదేవీలు జరగలేదు. ప్రకాశం జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బంది ఏపీఎన్జీవోలతో కలసి భారీ ర్యాలీ నిర్వహించారు. దర్శిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కాగడాల ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో వరుసగా 14వ రోజు మంగళవారం బంద్ పాటించారు. అనంతపురం జిల్లాలో 870 బస్సులు రోడ్డెక్కలేదు. వైఎస్సార్ కడపలో ఆర్టీసీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 29 వేల మందికి పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని ఆరు జిల్లాల్లో పనిచేసే 10వేల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించారు. 1,350 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. పుణ్యక్షేత్రాలు వెలవెల ఉద్యోగుల సమ్మె ప్రభావం ఆధ్యాత్మిక క్షేత్రాలపై తీవ్రంగా కనిపించింది. నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల కొండ బోసిపోయింది. శ్రీవారి ఆలయం, మాడవీధుల్లో ఎక్కడా సందడి కనిపించలేదు. శ్రీవారి సర్వదర్శనం మూడు గంటల్లోనే లభిస్తోంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి, కాణిపాకం, పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల కూడా వెలవెలబోయాయి. పదుల సంఖ్యలో కూడా భక్తులు రాలేదు. భీమవరంలోని మావుళ్లమ్మ, నిడదవోలులోని కోట సత్తెమ్మ, జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి తదితర క్షేత్రాలు నిర్మానుష్యంగా కనిపించారుు. హైదరాబాద్ సమ్మెలో స్వల్ప ఉద్రిక్తత సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె ప్రభావం హైదరాబాద్‌లో స్వల్పంగానే కనిపించింది. అన్ని శాఖాధిపతుల కార్యాలయాలు మంగళవారం యథావిధిగా పనిచేశాయి. కొన్ని శాఖాధిపతుల కార్యాలయాల్లో కొద్ది సంఖ్యలో సీమాంధ్ర ఉద్యోగులు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేయటానికే పరిమితమయ్యారు. శిశుసంక్షేమ శాఖ కమిషనరేట్‌లో 30 మంది సీమాంధ్ర ఉద్యోగులు కాసేపు నిరసన ప్రదర్శనలు చేశారు. నాంపల్లిలోని గృహకల్ప, జలసౌధ, డీఎంహెచ్ఓ కార్యాలయాల వద్ద సీమాంధ్ర ఉద్యోగులు చేపట్టిన నిరసన ప్రదర్శనల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోటాపోటీ నినాదాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆయా ప్రాంతాలు దద్దరిల్లాయి. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. విద్యుత్‌సౌధలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు వేర్వేరుగా భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి: సీఎం సమ్మె నేపథ్యంలో విద్యుత్, నీటి సరఫరా, వైద్య సేవలు, రవాణా, పౌర సరఫరా.. తదితర శాఖల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్ తదితరులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సమ్మె పరిస్థితులపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమ్మె చేస్తే కఠిన చర్యలు: ప్రభుత్వం సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ఈ నెల 8న మెమో (నంబర్ 25994) జారీ చేశారు. ‘నో వర్క్.. నో పే’ అంటూ 2011 ఏప్రిల్ 13న జారీ చేసిన 177 జీవో అమల్లో ఉందని, జీవోలోని అంశాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. సమ్మె జరిగే రోజుల్లో జిల్లాలో పరిస్థితిని వివరిస్తూ రోజువారీ నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ ఆదేశాలపై సీమాంధ్ర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ‘‘ప్రభుత్వానికి ముందస్తుగా నోటీసు ఇచ్చి సమ్మెలో పాల్గొనే హక్కు ఉద్యోగులకు ఉన్న ప్రజాస్వామిక హక్కు. సమ్మెలో పాల్గొనే ఉద్యోగుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయటం అణచివేత చర్యే. వెంటనే ఈ నల్ల ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి’’ అని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. -
12 అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్
విశాఖపట్నం/గుంటూరు, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూని యన్ (ఈయూ) మద్దతు ప్రకటించింది. ఈ నెల 12 అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలో బస్సులు తిరగకుండా నిలిపేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూనియన్ నేతలు బుధవారం ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.రామకృష్ణను బీచ్‌రోడ్ క్యాంప్ కార్యాలయంలో కలసి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా ఈయూ సమైక్యాంధ్ర పోరాట కమిటీ కన్వీనర్ వలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ, మంగళవారం ఒంగోలులో చేసిన తీర్మానం మేరకు జోనల్ ఈడీలకు బుధవారం సమ్మె నోటీసులిచ్చినట్టు చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 123 డిపోల్లో 70 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారన్నారు. ఆర్టీసీలో ఎన్ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులను కలుపుకొని ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం వెనక్కుతీసుకునే వరకూ పోరాడతామన్నారు. సమైక్యాంధ్ర సాధనకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు తమ పదవులకు రాజీనామాచేసి ప్రజలతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. జోనల్ అధ్యక్ష, కార్యదర్శులు పెదమజ్జి సత్యనారాయణ, కె.శ్రీనివాసరాజు మాట్లాడుతూ, జోన్లో ఉన్న 27 డిపోల్లో, జోనల్ వర్క్‌షాపుల్లో నిరవధిక సమ్మెను విజయవంతం చేస్తామని తెలిపారు. బుధవారం నుంచి అన్ని డిపోల్లో ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, 10న పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, మానవహారాలు, 13న కలెక్టరేట్ వద్ద మహాధర్నా చేపడతామన్నారు. కాగా, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్ఎంయూ) నాయకులు ఈనెల 12 నుంచి సమైక్య ఉద్యమాన్ని చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకునేందుకు సీమాంధ్రలోని 13 జిల్లాల యూనియన్ నాయకులు బుధవారం గుంటూరులో అత్యవసరంగా సమావేశమయ్యారు. గురువారం అన్ని జోనల్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లకు సమ్మె నోటీసులను అందజేయాలని నిర్ణయించారు. అదేరోజున సీమాంధ్రలోని 123 డిపోల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. 11న నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనప్రదర్శన జరపాలనీ, 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఏపీ ఎన్జీవోలతో కలసి జేఏసీగా ఏర్పడి ఉద్యమాల్లో పాల్గొనాలని తీర్మానించారు. ఇందుకోసం సీమాంధ్రలోని నాలుగు జోన్లలోని ఎన్ఎంయూ కార్యదర్శులను స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేశారు. -
నిషేధం జీవోలు సీమాంధ్ర ఉద్యోగులకు వర్తించవా?
ప్రభుత్వ కార్యాలయాల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించరాదంటూ సకల జనుల సమ్మె సమయంలో నల్ల జీవోలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు సీమాంధ్ర ఉద్యోగులకు వాటిని ఎందుకు వర్తింప జేయట్లేదని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రశ్నించింది. తెలంగాణ పట్ల వివక్షతకు ఇంతకంటే నిదర్శనం ఉండబోదని పేర్కొంది. జేఏసీ కార్యవర్గ అత్యవసర సమావేశం మంగళవారం టీఎన్జీవో భవన్లో దేవీప్రసాద్ అధ్యక్షతన జరిగింది. అనంతరం జేఏసీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, విఠల్‌తో కలిసి దేవీప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల్లో తెలంగాణ ఉద్యోగులకు న్యాయమైన వాటా దక్కలేదని తాము చాలాసార్లు చెప్పామని, ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలను చూస్తేనే.. సీమాంధ్ర ఉద్యోగుల సంఖ్య ఎంత ఉందనేది అర్థమవుతోందన్నారు. సీమాంధ్రులు అభివృద్ధి పేరిట హైదరాబాద్‌లో వాటా అడగడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలు తిరుమల వెళ్లి స్వామివారికి ముడుపులు చెల్లిస్తారని, అందువల్ల తిరుమల క్షేత్రాన్ని అభివృద్ధి చేశామంటూ తెలంగాణవారు వాటా అడిగితే ఇస్తారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో వాటా కావాలంటూ సీమాంధ్రులు వితండవాదం చేస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో సభ పెడితే.. తాము కూడా అదేరోజున లక్షలాది మందితో శాంతి ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర ఉద్యోగులు ఇచ్చిన సమ్మె నోటీసుపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయడానికి 12న సమావేశం కానున్నామని తెలిపారు. సీమాంధ్ర ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ఉద్యోగులను రెచ్చగొడుతున్నారని దేవీప్రసాద్ ఆరోపించారు. అయినప్పటికీ సంయమనం పాటించాల్సిందిగా తెలంగాణ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. విభజన నిర్ణయం నుంచి కేంద్రం వెనుకడుగు వేస్తే సమ్మె కంటే తీవ్ర ఉద్యమం నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు.