* వారంలో రూ.1,000 కోట్ల రాబడి బంద్
* 13 జిల్లా ట్రెజరీ, 194 ఉప ట్రెజరీలకు తాళం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో ఈనెల 13 నుంచి ట్రెజరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. 13 జిల్లాల ఖజానా కార్యాలయాలతోపాటు 194 ఉప కార్యాలయాలు గత వారం రోజులుగా తెరవడం లేదు. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కార్యాలయాలకు తాళాలు వేశారు. దీని ప్రభావం సర్కారు రాబడిపై తీవ్రంగా పడింది. ఈ 13 జిల్లాల నుంచి రోజూ రాష్ట్ర సర్కారుకు రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు రాబడి వస్తుంది.
సమ్మె కారణంగా వారం రోజులుగా సుమారు రూ.వెయ్యి కోట్ల మేర రాబడి నిలిచిపోయింది. ట్రెజరీ కార్యాలయాలు పనిచేయకపోవడంతో సుమారు రూ. 1,200 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి రాబడులు, చెల్లింపులు నిలిచిపోయినప్పటికీ ఉద్యోగుల సమ్మె విరమించిన తర్వాత రాబడులు వస్తాయి. చెల్లింపులు కూడా సాగుతాయి. అయితే ఇప్పుడు రాబడులు లేకపోవటం ప్రభుత్వ వ్యయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రభావం వచ్చేనెల ఉద్యోగులకు జీతాల చెల్లింపు, ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపుపై పడుతుందని వివరించారు. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ. 1,800 కోట్ల రుణాన్ని సేకరించిందని, అత్యవసరాలకు ఆ నిధులను వినియోగించుకుంటామని, వచ్చేనెలలో కూడా ఇదే పరిస్థితులు కొనసాగితే కష్టమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
సీమాంధ్రలో స్తంభించిన ట్రెజరీ
Published Mon, Aug 19 2013 3:00 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement
Advertisement