Andhra Pradesh Income
-
రిజిస్ట్రేషన్ల ఆదాయం అప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం(2017–18)లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయంలో పెరుగుదల నమోదైంది. నిజానికి ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రాబడిలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెనుకబడింది. అయితే ద్వితీయ త్రైమాసికం చివరికొచ్చేసరికి లక్ష్యాన్ని మించి పదిశాతం అధిక రాబడిని సాధించింది. మొత్తంమీద ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.1,950 కోట్ల ఆదాయం సాధించాలనేది లక్ష్యం కాగా రూ.2,155.77 కోట్ల రాబడి వచ్చింది. లక్ష్యంతో పోల్చితే రాబడి 110.55 శాతం కావడం విశేషం. రూ.326.68 కోట్లతో రాబడిలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఈ జిల్లా నుంచి రూ.308.08 కోట్ల ఆదాయ లక్ష్యం కాగా రూ.326.68 కోట్లు(106.04 శాతం) సాధించింది. రూ.55.54 కోట్ల రాబడితో శ్రీకాకుళం జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. అయితే రూ.45.11 కోట్ల ఆదాయ లక్ష్యంతో పోల్చి చూస్తే మాత్రం ఇక్కడ 23 శాతం అధిక రాబడి రావడం గమనార్హం. భారీగా రిజిస్ట్రేషన్లు గతంలో రాష్ట్రంలో నెలకు సగటున లక్ష రిజిస్ట్రేషన్లు జరిగేవి కాగా.. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో మాత్రం 7,48,860 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. 99,456 రిజిస్ట్రేషన్లతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నెలకు సంబంధించి 28వ తేదీ వరకు రాష్ట్రంలో 1,00,493 రిజిస్ట్రేషన్లు జరగ్గా, ఇందులో 15,545 రిజిస్ట్రేషన్లతో గుంటూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా, 6,238 రిజిస్ట్రేషన్లతో అనంతపురం జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచింది. -
ఏపీ ఆదాయం అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను, పన్నేతర ఆదాయం గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలతో పోల్చితే అదనంగా రూ.3,247 కోట్లు వచ్చింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం రూ.17,708.26 కోట్ల ఆదాయం లభించింది. దాదాపు అన్ని రంగాల్లో ఆదాయం పెరిగింది. అన్ని రంగాలు ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించాయి. విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా డివిజన్లలో వ్యాట్ ఆదాయం అత్యధికంగా లభించింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మద్యం ఆదాయం భారీగా పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆదాయం ఆర్జించే శాఖల ప్రగతిపై సమీక్షించారు. విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ఆదాయం అత్యధికంగా వచ్చింది. కృష్ణా, విశాఖ జిల్లాల్లో రవాణా రంగం ద్వారా ఆదాయం అధికంగా లభించింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వ్యాట్ ద్వారా విశాఖపట్నం డివిజన్లో అత్యధికంగా రూ.3,636 కోట్ల ఆదాయం వచ్చింది. ఏలూరు డివిజన్లో రూ.3,204 కోట్ల ఆదాయం లభించింది. కృష్ణా డివిజన్లో రూ.2,536 కోట్ల ఆదాయం వ్యాట్ ద్వారా లభ్యమైంది. మద్యం ద్వారా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అత్యధికంగా గుంటూరు జిల్లాలో రూ.538 కోట్లు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో రూ.535 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆగస్టు వరకు అత్యధికంగా విశాఖ జిల్లాలో రూ.246 కోట్ల ఆదాయం రాగా గుంటూరు జిల్లాలో రూ.212 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.208 కోట్ల ఆదాయం లభించింది. రవాణా రంగం ద్వారా ఆగస్టు వరకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా రూ.139 కోట్లు రాగా విశాఖ జిల్లాలో రూ.108 కోట్ల ఆదాయం వచ్చింది. రంగాల వారీగా ఆదాయ వృద్ధి శాతాలను ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్ల సమీక్షలో వెల్లడించింది. -
ఏపీ ఆదాయానికి ఢోకా లేదు
-
ఏపీ ఆదాయానికి ఢోకా లేదు
* రాష్ట్రం విడిపోయాక జూలై నెలలో రూ. 5,480 కోట్లు ఆదాయం * రెండు నెలలు జీతం ఇచ్చినా లోటు రూ.124 కోట్లకే పరిమితం * రాష్ట్ర పన్ను, కేంద్ర పన్నుల వాటా వనరులు బాగానే వచ్చాయి * వ్యాట్, మద్యం ఆదాయం అదిరింది * పైసా అప్పు కూడా చేయలేదు.. భయపడాల్సిన పరిస్థితి లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ వనరులు తగ్గిపోతాయన్న అంచనాలు నిజం కాదని తేలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి ఢోకా లేదని తేటతెల్లమైంది. రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నుల వాటా ద్వారా వచ్చిన ఆదాయం మెరుగ్గా ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ముందుగా ఆందోళన చెందినట్లుగా పరిస్థితి లేదని, జూలై నెలలో ఆదాయం బాగా వచ్చిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జూలై నెలలో రాష్ట్ర సొంత పన్నులు, పన్నేతర, కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.5,480 కోట్లు ఆదాయం వచ్చింది. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు వ్యాట్ ఆదాయం 45 శాతమే వస్తుందని అంచనా వేయగా, 47 శాతం వచ్చింది. కొత్త మద్యం లెసైన్సుల విధానం కారణంగా మద్యం ద్వారా వచ్చే ఆదాయం కూడా జూలై నెలలో బాగా పెరిగింది. మోటారు వాహనాల పన్ను, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం కూడా బాగానే ఉంది. కేంద్ర పన్నుల వాటా నుంచి ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ. 1,960 కోట్లు వచ్చేవి. రాష్ట్రం విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర పన్నుల వాటా నుంచి జూలై నెలలో రూ. 1,200 కోట్లు వచ్చింది. రాష్ట్రం విడిపోయి రెండు నెలలు కావస్తున్నా ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు పైసా కూడా అప్పు చేయలేదు. జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు రెండు నెలల జీతాలు, పింఛన్ల కింద రూ.5,800 కోట్లు చెల్లించింది. అయినా ఇతర లావాదేవీలన్నీ సరిచూసిన తరువాత జూలై నెలాఖరుకు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటును 124 కోట్ల రూపాయలకే ఆర్థిక శాఖ పరిమితం చేయగలిగింది. -
సీమాంధ్రలో స్తంభించిన ట్రెజరీ
* వారంలో రూ.1,000 కోట్ల రాబడి బంద్ * 13 జిల్లా ట్రెజరీ, 194 ఉప ట్రెజరీలకు తాళం సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర జిల్లాల్లో ఈనెల 13 నుంచి ట్రెజరీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. 13 జిల్లాల ఖజానా కార్యాలయాలతోపాటు 194 ఉప కార్యాలయాలు గత వారం రోజులుగా తెరవడం లేదు. ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కార్యాలయాలకు తాళాలు వేశారు. దీని ప్రభావం సర్కారు రాబడిపై తీవ్రంగా పడింది. ఈ 13 జిల్లాల నుంచి రోజూ రాష్ట్ర సర్కారుకు రూ.140 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు రాబడి వస్తుంది. సమ్మె కారణంగా వారం రోజులుగా సుమారు రూ.వెయ్యి కోట్ల మేర రాబడి నిలిచిపోయింది. ట్రెజరీ కార్యాలయాలు పనిచేయకపోవడంతో సుమారు రూ. 1,200 కోట్ల మేర చెల్లింపులు నిలిచిపోయాయి. ప్రస్తుతానికి రాబడులు, చెల్లింపులు నిలిచిపోయినప్పటికీ ఉద్యోగుల సమ్మె విరమించిన తర్వాత రాబడులు వస్తాయి. చెల్లింపులు కూడా సాగుతాయి. అయితే ఇప్పుడు రాబడులు లేకపోవటం ప్రభుత్వ వ్యయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్థికశాఖ ఉన్నతాధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభావం వచ్చేనెల ఉద్యోగులకు జీతాల చెల్లింపు, ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపుపై పడుతుందని వివరించారు. ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ. 1,800 కోట్ల రుణాన్ని సేకరించిందని, అత్యవసరాలకు ఆ నిధులను వినియోగించుకుంటామని, వచ్చేనెలలో కూడా ఇదే పరిస్థితులు కొనసాగితే కష్టమేనని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.