ఏపీ ఆదాయం అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను, పన్నేతర ఆదాయం గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలతో పోల్చితే అదనంగా రూ.3,247 కోట్లు వచ్చింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం రూ.17,708.26 కోట్ల ఆదాయం లభించింది. దాదాపు అన్ని రంగాల్లో ఆదాయం పెరిగింది. అన్ని రంగాలు ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించాయి.
విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా డివిజన్లలో వ్యాట్ ఆదాయం అత్యధికంగా లభించింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మద్యం ఆదాయం భారీగా పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆదాయం ఆర్జించే శాఖల ప్రగతిపై సమీక్షించారు. విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ఆదాయం అత్యధికంగా వచ్చింది.
కృష్ణా, విశాఖ జిల్లాల్లో రవాణా రంగం ద్వారా ఆదాయం అధికంగా లభించింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వ్యాట్ ద్వారా విశాఖపట్నం డివిజన్‌లో అత్యధికంగా రూ.3,636 కోట్ల ఆదాయం వచ్చింది. ఏలూరు డివిజన్‌లో రూ.3,204 కోట్ల ఆదాయం లభించింది. కృష్ణా డివిజన్‌లో రూ.2,536 కోట్ల ఆదాయం వ్యాట్ ద్వారా లభ్యమైంది. మద్యం ద్వారా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అత్యధికంగా గుంటూరు జిల్లాలో రూ.538 కోట్లు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో రూ.535 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆగస్టు వరకు అత్యధికంగా విశాఖ జిల్లాలో రూ.246 కోట్ల ఆదాయం రాగా గుంటూరు జిల్లాలో రూ.212 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.208 కోట్ల ఆదాయం లభించింది. రవాణా రంగం ద్వారా ఆగస్టు వరకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా రూ.139 కోట్లు రాగా విశాఖ జిల్లాలో రూ.108 కోట్ల ఆదాయం వచ్చింది. రంగాల వారీగా ఆదాయ వృద్ధి శాతాలను ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్ల సమీక్షలో వెల్లడించింది.