రిజిస్ట్రేషన్ విలువల సవరణ క్షేత్రస్థాయి కసరత్తు పూర్తి
అన్ని కేటగిరీల్లో కనిష్ట, గరిష్ట విలువలను ప్రతిపాదించిన కమిటీలు
త్వరలో రెవెన్యూ మంత్రితో భేటీకి అధికారుల సమాయత్తం
పొంగులేటితో కలిసి సీఎంతో జరిగే భేటీలో తుది నిర్ణయానికి చాన్స్
రెండు రోజుల్లో గ్రీన్ సిగ్నల్ వస్తుందంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు
సీఎం ఆమోదం తెలిపితే ఆగస్టు 1 నుంచే కొత్త విలువలు అమల్లోకి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ల విలువల సవరణ కసరత్తు క్షేత్ర స్థాయిలో పూర్తయింది. గత నెల 18వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తీసుకునే తుది నిర్ణయం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఎదురుచూస్తోంది. క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను కొత్త కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఇటీవల జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలతో కలిసి సమీక్షించారని, అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రతిపాదించిన కనిష్ట, గరిష్ట విలువలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు.
వీలున్నంత త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ విలువల ప్రతిపాదనలను వివరిస్తామని, ఆ తర్వాత రెవెన్యూ మంత్రితో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కావాల్సి ఉందని, ఆ భేటీలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం పూర్తి కాగానే మిగిలిన షెడ్యూల్ మేరకు ముందుకెళతామని, క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని, శాఖా పరమైన సాఫ్ట్‌వేర్‌లో అప్‌డేట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల 1వ తేదీ నుంచే సవరించిన విలువలను అమల్లోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు.
గతానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ల విలువలను ఒకేసారి సవరించారు. అప్పుడు క్షేత్రస్థాయి నుంచి కసరత్తు చేయకుండా, రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం విలువలు నిర్ణయించారు. కాగా ప్రభుత్వం మరోసారి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ల విలువల సవరణకు నిర్ణయం తీసుకోవడంతో..గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించింది. వాటి ప్రకారమే క్షేత్రస్థాయి నుంచి కసరత్తు ప్రారంభమైంది.
వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు (ఖాళీ నివాస స్థలాలు), ఆస్తుల (అపార్ట్‌మెంట్లు, వాణిజ్య భవనాలు) విలువలను క్షేత్రస్థాయిలో ఉన్న మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచాలని సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ విలువల కసరత్తు జరిగింది. ఖాళీ స్థలాలు, అపార్ట్‌మెంట్ల విషయంలో ప్రస్తుతం మార్కెట్ ధర ఎంత ఉందో చూసి అందులో సగం మేరకు విలువలను సవరించే ప్రయత్నం జరిగింది.
మూడు కేటగిరీల్లో నిర్ధారణ
వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరిల్లో నిర్ధారించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు ఒక విలువ, వెంచర్లు చేసేందుకు సిద్ధంగా ఉన్న భూములకు ఇంకో విలువ, హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూములకు మరో విలువను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలు మినహాయించి వ్యవసాయ భూమి కనిష్ట విలువ రూ.5 లక్షలుగా ప్రతిపాదించారు.
ఆపై రూ.50 లక్షల వరకు వ్యవసాయ భూముల విలువలను ప్రతిపాదించగా, వెంచర్లకు సిద్ధంగా ఉన్న భూములు, హైవేల పక్కన ఉండే భూములను అక్కడి విలువల ప్రాతిపదికన రూ.40 లక్షల నుంచి 2.90 కోట్ల వరకు ప్రతిపాదించారు. ఈ విలువల మేరకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇక నివాస స్థలాల చదరపు గజం కనీసం రూ.500, అపార్ట్‌మెంట్ల చదరపు అడుగు కనీసం రూ.1000గా ప్రతిపాదించారు.
ప్రజాభిప్రాయం లేకుండానే..?
క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం లభించిన అనంతరం ఈనెల ఒకటో తేదీ నుంచే సవరించిన విలువల వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెలువరించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్‌ల శాఖ ప్రతిపాదించిన విలువలపై ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి వాటిపై సమీక్ష చేసిన అనంతరం తుది విలువలను నిర్ధారించాల్సి ఉంది.
కానీ ఇప్పటివరకు కూడా క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను ఆన్‌లైన్‌లో పెట్టలేదు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన రెండుసార్లు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలనుకున్నా సమయం సరిపోయేలా లేదని రిజిస్ట్రేషన్‌ల శాఖ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే గడువును కుదిస్తారని లేదంటే ఈసారి కూడా ప్రజాభిప్రాయం లేకుండానే తుది విలువలను నిర్ధారించే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment