
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జీవో 111 ఎత్తివేత ప్రభావం భూముల విలువలపై దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు, ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీల దృష్టి జీవో 111 ప్రాంతాలపై పడనుండడం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇతర ప్రాంతాల భూలావాదేవీలపై ప్రభావం చూపనుంది. ఈ జీవో ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో.. జీవో పరిధిలోనికి వచ్చే ప్రాంతాల్లో అప్పుడే భూముల ధరలకు రెక్కలు రాగా అవి చుక్కలనంటుతాయనే చర్చ జరుగుతోంది. శంకర్‌పల్లి, చేవెళ్ల, శంషాబాద్, మొయినాబాద్, రాజేంద్రనగర్, షాబాద్ మండలాల్లో ప్రస్తుతం గరిష్టంగా ఎకరం ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు పలుకుతుండగా సమీప భవిష్యత్తులోనే అది రూ.15–20 కోట్ల వరకు పెరగనుందని రియల్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రస్తుతం గజం రూ.లక్షకు పైగా పలుకుతున్న కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కోకాపేట, నార్సింగి (ఐటీ కారిడార్) వంటి ప్రాంతాలతో పాటు రాజధాని నలుదిక్కులా ఉండే ఇతర శివార్లలో కొంత స్తబ్దత నెలకొనే అవకాశముందని అంటున్నారు.
అడ్డగోలు ధరలకు తాత్కాలికంగా కళ్లెం
జీవో పరిధిలో 84 గ్రామాలు ఉండగా వీటి పరిధిలో 1,32,600 ఎకరాల భూమి ఉంది. ఇందులో 18,332 ఎకరాలు ప్రభుత్వ, 9,235 ఎకరాల అసైన్డ్, 2,660 ఎకరాల సీలింగ్, 1,256 ఎకరాల భూదాన, ఇలా.. మొత్తం 31,483 ఎకరాల ప్రభుత్వ భూము లు ఉన్నాయి. 111 జీవో ఎత్తివేయడం, సవ రించడం వల్ల ఆ భూములన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ భూములను చేజిక్కిం చుకుని తమ సంస్థలను నెలకొల్పాలని జాతీయ, అంతర్జాతీయ ఐటీ అనుబంధ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు భావిస్తున్నాయి. వాస్తవానికి హైదరాబాద్ విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు కాగా, అదే 111 జీవో పరిధిలోని భూ విస్తీర్ణం 538 చ.కి.మీ.గా ఉంది. అంటే హైదరాబాద్ విస్తీర్ణం కంటే.. జీవో ఎత్తివేత, సవరణల కారణంగా అందుబాటులోకి వచ్చే భూవిస్తీర్ణమే అధికం అన్నమాట. న్యాయపరమైన చిక్కులు లేకుండా, ఓ ప్రణాళిక బద్ధంగా, పర్యావరణహితంగా సరికొత్త మాస్టర్‌ప్లాన్‌తో ప్రభుత్వం ముందుకెళ్తే..హైదరాబాద్ లాంటి మరో అద్భుత, అహ్లాదకరమైన నగరం కళ్ల ముందు ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు పెద్దయెత్తున భూమి అందుబాటులోకి రానుండటంతో ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో అడ్డగోలుగా పెరుగుతున్న భూముల ధరలకు తాత్కాలికంగా కళ్లెం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భూముల అమ్మకంపై రైతుల్లో పునరాలోచన
జీవో కారణంగా ఈ జోన్ పరిధిలోని నిర్మాణాలపై ఆంక్షలు ఉన్నప్పటికీ..గతకొంత కాలంగా ఫాం హౌస్‌ల పేరుతో ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం సాఫీగానే సాగుతోంది. భూముల ధరలకు రెక్కలు రావడంతో శిఖం భూములన్నీ కబ్జాకు గురయ్యాయి. ఇప్పటికే ఇక్కడ అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. 426 లే అవుట్లలో 10,907 ఇళ్లు, గ్రామాల్లో 4,527 ఇళ్లు, 1,920 వాణిజ్య భవనాలు వెలిశాయి. కోర్టు ఆదేశాల మేరకు అధికారులు అప్పుడప్పుడు స్పందించి అక్రమ నిర్మాణాలు కూల్చివేసినా.. ఆగకపోగా మరింత పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు స్థానికుల డిమాండ్ నేపథ్యంలో ఈ జీఓను ఎత్తి వేయనున్నట్లు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించడంతో భూములకు మరింత డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ భూములు అమ్ముకోవడం కంటే..మరికొంత కాలం ఎదురు చూడటమే ఉత్తమని రైతులు భావిస్తున్నారు. అడ్వాన్సులు తీసుకున్న కొందరు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. గతంలో ఒక్కో డాక్యుమెంట్ రైటర్ రోజుకు సగటున 10–15 రాస్తే..ప్రస్తుతం ఒకటి, రెండు డాక్యుమెంట్లకే పరిమితమవుతుండటం ఇందుకు నిదర్శనం.