ఈనెల 18 నుంచి పెంపు ప్రక్రియ మొదలు... జూలై 24న తుది ఆమోదం... అభ్యంతరాల నమోదుకు ప్రజలకు 15 రోజుల గడువు
బహిరంగ మార్కెట్ విలువల సేకరణలో తప్పులు జరగొద్దు... జాతీయ,రాష్ట్ర రహదారులు వెళ్లే గ్రామాలకు ప్రాధాన్యం
అర్బన్ ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రదేశాల విలువలు వేర్వేరుగా నిర్ణయించాలి
మున్సిపాలిటీల్లో కలిసిన గ్రామాల విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాల ఆధారంగా విలువలు
మాస్టర్‌ప్లాన్, జోనల్ ప్లాన్‌ల ఆధారంగానే పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణ... మార్కెట్ విలువల సవరణ మార్గదర్శకాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు కొత్త ప్రభుత్వ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈనెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూలై 31 నాటికి పూర్తి కానుంది. అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త ప్రభుత్వ విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు, ఆస్తుల విలువలను మరోమారు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇరు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, విలువల సవరణ ప్రక్రియ షెడ్యూల్‌తో కూడిన ఈ మార్గదర్శకాలను ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ సంబంధిత అధికారులకు పంపారు. వీటి ప్రకారం సవరించిన విలువలను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజులు గడువు ఇవ్వనున్నారు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే అధికారంగా కొత్త విలువలను నమోదు చేయనున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సవరణ ప్రక్రియ ఇలా...
⇒ వ్యవసాయేతర వినియోగానికి అనువుగా (ప్లాట్లు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమలు, సెజ్‌లు, వినోద సౌకర్యాల ఏర్పాటు) జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లోని భూముల విలువను అధికంగా పెంచాలి.
⇒ ఈ క్రమంలో గ్రామపటాలను తీసుకుని ఇప్పటికే ఇంటి స్థలాలుగా మారిన సర్వే నంబర్లు, మారే యోగ్యత ఉన్న సర్వే నంబర్లు, జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లను వేర్వేరుగా గుర్తించాలి.
⇒ సబ్‌రిజి్స్ట్రార్, జిల్లాల రిజి్స్ట్రార్లు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా వెళ్లి సమాచారం సేకరించాలి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, రెవెన్యూ పంచాయతీ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో భూములు, ఆస్తులకు ఉన్న విలువను గుర్తించాలి.
⇒ బహిరంగ మార్కెట్ విలువలను సేకరించే విషయంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దు. రియల్ ఎస్టేట్ కంపెనీల బ్రోచర్లు, భూసేకరణ పరిహారం, బ్యాంకులు, రెవెన్యూ వర్గాలు నిర్వహించిన వేలం లాంటి వివరాలను విలువల నిర్ధారణకు వాడుకోవచ్చు. బహిరంగ మార్కెట్ విలువలను సేకరించిన తర్వాత ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువలతో పోల్చుకుని సవరించాల్సిన విలువలను ప్రతిపాదించాలి.
⇒ 5–6 కిలోమీటర్ల రేడియస్‌లోని గ్రామాల్లో ఉండే తేడాలను జాగ్రత్తగా గమనించాలి. ఆ వ్యాసార్థంలోని గ్రామాల్లో ఏ పాయింట్‌లో ఎంత విలువ ఉంది, ఏయే పాయింట్‌కు ఎంత మారుతోందనే అంశాలను జాగ్రత్తగా గమనించాలి.
⇒ ఒకే గ్రామంలో ఉన్నా వేర్వేరు చోట్ల ఉన్న భూములు, ఆస్తులకు రెండు కంటే ఎక్కువ విలువలను కూడా ప్రతిపాదించవచ్చు.
⇒ వ్యవసాయ భూముల విషయంలో ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువలను రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి.
⇒ గతంలో పొరపాటుగా బహిరంగ మార్కెట్ విలువల కంటే ప్రభుత్వ విలువలను ఎక్కువగా నమోదు చేసి ఉంటే వాటిని వ్యక్తిగతంగా డీఐజీ స్థాయి అధికారులు పరిశీలించి కమిటీ ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయ భూముల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.
పట్టణ ప్రాంతాల్లో ఇలా...
⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అధికారికంగా నిర్ధారించిన ప్రాంతాల వివరాలను సేకరించి నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు వేర్వేరుగా ఆ ప్రాంతం మొత్తానికి ఒకే విలువ నిర్ధారించాలి. సదరు ప్రాంతాల్లో కొన్ని కాలనీలు, వీధులను కలపాల్సి వచి్చనా విలువలు మాత్రం ఒకేలా ఉండాలి.
⇒ రోడ్డుకిరువైపులా ఉన్న ఆస్తులకు ఒకే విలువ ప్రతిపాదించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి తాజా డోర్ నంబర్ల వివరాలను ఫామ్–2లో పొందుపరచాలి.
⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనం చేసిన గ్రామాల్లో విలువల ప్రతిపాదన కసరత్తు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగినట్టు ఉండాలి. ఈ గ్రామాలను ఆనుకుని ఇప్పటికే వార్డులు, బ్లాక్‌లుగా ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లో విలువలు ఆయా గ్రామాలకు సమీపంగా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు.
⇒ నివాస ప్రాంతాల్లో ఉన్న డోర్ నంబర్లను వాణిజ్య ప్రాంతాలుగా పొరపాటున నమోదు చేసినా, వాణిజ్య ప్రాంతాల డోర్ నంబర్లను నివాస ప్రాంతాలుగా నమోదు చేసినా వాటిని సవరించాలి.
⇒ గ్రౌండ్ ఫ్లోర్, ఇతర ఫ్లోర్‌లకు వేర్వేరు విలువలు నిర్ధారించే అంశాన్ని కేవలం ప్రధాన రహదారుల పక్కన ఉండే నివాస సముదాయాలకు మాత్రమే వర్తింపజేయాలి.
సాధారణ మార్గదర్శకాలు:
⇒ భారత స్టాంపుల చట్టం–1899లోని సెక్షన్ 47(ఏ) ప్రకారం ఆస్తుల విలువలను సవరించే సమయంలో క్రమానుగుణంగా జరిగిన ప్రక్రియ, విలువలను పరిగణనలోకి తీసుకుని సవరణ విలువలను ప్రతిపాదించాలి. (అంటే ఒకేసారి పెద్ద ఎత్తున పెంపు, తగ్గింపు ఉండకూడదు.)
–గ్రామీణ ప్రాంతాల డేటా, రికార్డులను తహశీల్దార్లు, గ్రామపంచాయతీల నుంచి తీసుకోవాలి.
⇒ ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువల కంటే ఎక్కువ విలువలతో ఒక ప్రాంతంలో పలు లావాదేవీలు జరిగి ఉంటే ఆ విలువను సవరణకు ప్రాతిపదికగా తీసుకోవచ్చు.
⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో జోనల్ అభివృద్ధి మ్యాప్‌లను, మిగిలిన పట్టణ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మాస్టర్‌ప్లాన్‌లను విలువల సవరణకు ప్రాతిపాదికగా తీసుకోవాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment