రోజుకు సగటున రాష్ట్రంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ల లెక్క ఇది
తెలంగాణ ఏర్పాటైన పదేళ్లలో కోటిన్నర క్రయవిక్రయాలు.. రూ.76 వేల కోట్ల ఆదాయం
2023–24లో 18.41 లక్షల లావాదేవీలు.. రూ.14,588 కోట్ల రాబడి.. 2021–22లో ఏకంగా 20 లక్షలు దాటిన డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు
పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వృద్ధి రేటు తక్కువే
కేరళ మినహా ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల్లో మనకంటే ఎక్కువ లావాదేవీలు
సాక్షి, హైదరాబాద్: భూములు, ఆస్తుల క్రయ విక్రయాలు సర్వసాధారణంగా జరిగేవే. భూమిని అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రభుత్వ కార్యాలయంలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. హక్కుల రికార్డు మ్యుటేషన్ జరగాల్సిందే. ఇలాంటి రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో రోజుకు ఎన్ని జరుగుతాయో తెలుసా.. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో రోజుకు సగటున 4 వేల వరకు క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతున్నాయి.
ఈ లావాదేవీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు సగటున రూ.20.8 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ పదేళ్లలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి మొత్తం 1,46,18,601 లావాదేవీలు జరగ్గా, వీటిద్వారా రూ.76,201.17 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన 2014–15 సంవత్సరంలో 8,27,374 లావాదేవీల ద్వారా రూ. 2,746 కోట్ల ఆదాయం రాగా, ఇటీవల ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 18,41,324 లావాదేవీల ద్వారా రూ.14,588.06 కోట్ల ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పదేళ్లలో అత్యధికంగా 2021–22లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ ఏడాదిలో 20 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరగడం గమనార్హం. కాగా, మన పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వృద్ధి కొంచం తక్కువగానే కనిపిస్తోంది.
తెలంగాణలో టాప్ 30 సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలివే..
రిజిస్ట్రేషన్ల విషయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచే సింహభాగం లావాదేవీలు జరుగుతాయి. ఆదాయం కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తుందని గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 144 సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో 30 చోట్ల ఎక్కువగా లావాదేవీలు జరుగుతుంటాయి.
ఈ జాబితాలో రంగారెడ్డి (ఆర్‌వో), గండిపేట, పఠాన్‌చెరు (ఆర్‌వో), కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్ (ఆర్‌వో), కూకట్‌పల్లి, వరంగల్ (ఆర్‌వో), మహేశ్వరం, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్‌బీనగర్, ఎస్‌ఆర్‌నగర్, చంపాపేట, ఆజంపుర, గోల్కొండ, నారపల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభ్‌నగర్, కీసర, శంకర్‌పల్లి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం (ఆర్‌వో), చేవెళ్ల ఉన్నాయని వార్షిక నివేదిక వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment