Stamps and Registrations
-
4 వేల లావాదేవీలు.. రూ.20.8 కోట్ల ఆదాయం
సాక్షి, హైదరాబాద్: భూములు, ఆస్తుల క్రయ విక్రయాలు సర్వసాధారణంగా జరిగేవే. భూమిని అమ్ముకోవాలన్నా, కొనుక్కోవాలన్నా ప్రభుత్వ కార్యాలయంలో అధికారికంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందే. హక్కుల రికార్డు మ్యుటేషన్ జరగాల్సిందే. ఇలాంటి రిజిస్ట్రేషన్లు రాష్ట్రంలో రోజుకు ఎన్ని జరుగుతాయో తెలుసా.. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో రోజుకు సగటున 4 వేల వరకు క్రయవిక్రయ లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ లావాదేవీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి రోజుకు సగటున రూ.20.8 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఈ పదేళ్లలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించి మొత్తం 1,46,18,601 లావాదేవీలు జరగ్గా, వీటిద్వారా రూ.76,201.17 కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు సమకూరింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన 2014–15 సంవత్సరంలో 8,27,374 లావాదేవీల ద్వారా రూ. 2,746 కోట్ల ఆదాయం రాగా, ఇటీవల ముగిసిన 2023–24 ఆర్థిక సంవత్సరంలో 18,41,324 లావాదేవీల ద్వారా రూ.14,588.06 కోట్ల ఆదాయం వచ్చిందని రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ పదేళ్లలో అత్యధికంగా 2021–22లో ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆ ఏడాదిలో 20 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరగడం గమనార్హం. కాగా, మన పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రిజిస్ట్రేషన్ల వృద్ధి కొంచం తక్కువగానే కనిపిస్తోంది. తెలంగాణలో టాప్ 30 సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాలివే.. రిజిస్ట్రేషన్ల విషయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచే సింహభాగం లావాదేవీలు జరుగుతాయి. ఆదాయం కూడా ఎక్కువగా ఇక్కడి నుంచే వస్తుందని గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 144 సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో 30 చోట్ల ఎక్కువగా లావాదేవీలు జరుగుతుంటాయి. ఈ జాబితాలో రంగారెడ్డి (ఆర్వో), గండిపేట, పఠాన్‌చెరు (ఆర్వో), కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, మేడ్చల్ (ఆర్వో), కూకట్పల్లి, వరంగల్ (ఆర్వో), మహేశ్వరం, బాలానగర్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఎస్ఆర్నగర్, చంపాపేట, ఆజంపుర, గోల్కొండ, నారపల్లి, సరూర్‌నగర్, వనస్థలిపురం, చిక్కడపల్లి, కాప్రా, వల్లభ్‌నగర్, కీసర, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం (ఆర్వో), చేవెళ్ల ఉన్నాయని వార్షిక నివేదిక వెల్లడించింది. -
నిర్ణయమే మిగిలింది.. రిజిస్ట్రేషన్ విలువల సవరణ క్షేత్రస్థాయి కసరత్తు పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువల సవరణ కసరత్తు క్షేత్ర స్థాయిలో పూర్తయింది. గత నెల 18వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తీసుకునే తుది నిర్ణయం కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఎదురుచూస్తోంది. క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను కొత్త కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాశ్ ఇటీవల జిల్లా రిజిస్ట్రార్లు, డీఐజీలతో కలిసి సమీక్షించారని, అన్ని కేటగిరీలు, స్థాయిల్లో ప్రతిపాదించిన కనిష్ట, గరిష్ట విలువలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. వీలున్నంత త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ విలువల ప్రతిపాదనలను వివరిస్తామని, ఆ తర్వాత రెవెన్యూ మంత్రితో కలిసి ముఖ్యమంత్రితో భేటీ కావాల్సి ఉందని, ఆ భేటీలో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయం పూర్తి కాగానే మిగిలిన షెడ్యూల్ మేరకు ముందుకెళతామని, క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం తీసుకుని, శాఖా పరమైన సాఫ్ట్‌వేర్‌లో అప్డేట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. సీఎం స్థాయిలో నిర్ణయం తీసుకుంటే వచ్చే నెల 1వ తేదీ నుంచే సవరించిన విలువలను అమల్లోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. గతానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువలను ఒకేసారి సవరించారు. అప్పుడు క్షేత్రస్థాయి నుంచి కసరత్తు చేయకుండా, రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం విలువలు నిర్ణయించారు. కాగా ప్రభుత్వం మరోసారి భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల విలువల సవరణకు నిర్ణయం తీసుకోవడంతో..గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువరించింది. వాటి ప్రకారమే క్షేత్రస్థాయి నుంచి కసరత్తు ప్రారంభమైంది. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు (ఖాళీ నివాస స్థలాలు), ఆస్తుల (అపార్ట్మెంట్లు, వాణిజ్య భవనాలు) విలువలను క్షేత్రస్థాయిలో ఉన్న మార్కెట్ ధరలకు అనుగుణంగా పెంచాలని సూత్రప్రాయంగా తీసుకున్న నిర్ణయం మేరకు రిజిస్ట్రేషన్ విలువల కసరత్తు జరిగింది. ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్ల విషయంలో ప్రస్తుతం మార్కెట్ ధర ఎంత ఉందో చూసి అందులో సగం మేరకు విలువలను సవరించే ప్రయత్నం జరిగింది. మూడు కేటగిరీల్లో నిర్ధారణ వ్యవసాయ భూముల విలువలను మూడు కేటగిరిల్లో నిర్ధారించారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు ఒక విలువ, వెంచర్లు చేసేందుకు సిద్ధంగా ఉన్న భూములకు ఇంకో విలువ, హైవేల పక్కన ఉండే వ్యవసాయ భూములకు మరో విలువను ప్రతిపాదించారు. అందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాలు మినహాయించి వ్యవసాయ భూమి కనిష్ట విలువ రూ.5 లక్షలుగా ప్రతిపాదించారు. ఆపై రూ.50 లక్షల వరకు వ్యవసాయ భూముల విలువలను ప్రతిపాదించగా, వెంచర్లకు సిద్ధంగా ఉన్న భూములు, హైవేల పక్కన ఉండే భూములను అక్కడి విలువల ప్రాతిపదికన రూ.40 లక్షల నుంచి 2.90 కోట్ల వరకు ప్రతిపాదించారు. ఈ విలువల మేరకు 7.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించే విధంగా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఇక నివాస స్థలాల చదరపు గజం కనీసం రూ.500, అపార్ట్మెంట్ల చదరపు అడుగు కనీసం రూ.1000గా ప్రతిపాదించారు. ప్రజాభిప్రాయం లేకుండానే..? క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలకు ఆమోదం లభించిన అనంతరం ఈనెల ఒకటో తేదీ నుంచే సవరించిన విలువల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాల్సి ఉంది. ఈ మేరకు గత నెల 15వ తేదీన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెలువరించిన మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ మార్గదర్శకాల ప్రకారం రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదించిన విలువలపై ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను స్వీకరించి వాటిపై సమీక్ష చేసిన అనంతరం తుది విలువలను నిర్ధారించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కూడా క్షేత్రస్థాయి కమిటీల ప్రతిపాదనలను ఆన్లైన్లో పెట్టలేదు. అయితే గతంలో రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన రెండుసార్లు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈసారి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలనుకున్నా సమయం సరిపోయేలా లేదని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే గడువును కుదిస్తారని లేదంటే ఈసారి కూడా ప్రజాభిప్రాయం లేకుండానే తుది విలువలను నిర్ధారించే అవకాశాలున్నాయని ఆ శాఖ అధికారులు చెబుతుండడం గమనార్హం. -
TG: ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలోని భూములు, ఆస్తులకు కొత్త ప్రభుత్వ విలువలు అమల్లోకి రానున్నాయి. ఈనెల 18 నుంచి ప్రభుత్వ విలువల సవరణ ప్రక్రియ ప్రారంభం కానుండగా, జూలై 31 నాటికి పూర్తి కానుంది. అనంతరం ఆగస్టు 1 నుంచి కొత్త ప్రభుత్వ విలువల ప్రకారం రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. భూములు, ఆస్తుల విలువలను మరోమారు సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విలువల నిర్ధారణకు అనుసరించాల్సిన పద్ధతులు, ఇరు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, విలువల సవరణ ప్రక్రియ షెడ్యూల్‌తో కూడిన ఈ మార్గదర్శకాలను ఆ శాఖ కమిషనర్ నవీన్‌మిత్తల్ సంబంధిత అధికారులకు పంపారు. వీటి ప్రకారం సవరించిన విలువలను ప్రజలకు అందుబాటులో ఉంచి వారి అభిప్రాయాలు, అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజులు గడువు ఇవ్వనున్నారు. ఈ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే అధికారంగా కొత్త విలువలను నమోదు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సవరణ ప్రక్రియ ఇలా... ⇒ వ్యవసాయేతర వినియోగానికి అనువుగా (ప్లాట్లు, ఇళ్ల నిర్మాణం, పరిశ్రమలు, సెజ్‌లు, వినోద సౌకర్యాల ఏర్పాటు) జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల్లోని భూముల విలువను అధికంగా పెంచాలి. ⇒ ఈ క్రమంలో గ్రామపటాలను తీసుకుని ఇప్పటికే ఇంటి స్థలాలుగా మారిన సర్వే నంబర్లు, మారే యోగ్యత ఉన్న సర్వే నంబర్లు, జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న సర్వే నంబర్లను వేర్వేరుగా గుర్తించాలి. ⇒ సబ్రిజి్స్ట్రార్, జిల్లాల రిజి్స్ట్రార్లు ఈ గ్రామాలకు ప్రత్యేకంగా వెళ్లి సమాచారం సేకరించాలి. ఆయా గ్రామాల్లోని పెద్దలు, రెవెన్యూ పంచాయతీ అధికారులతో మాట్లాడి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూములు, ఆస్తులకు ఉన్న విలువను గుర్తించాలి. ⇒ బహిరంగ మార్కెట్ విలువలను సేకరించే విషయంలో ఎలాంటి తప్పులకు అవకాశం ఇవ్వొద్దు. రియల్ ఎస్టేట్ కంపెనీల బ్రోచర్లు, భూసేకరణ పరిహారం, బ్యాంకులు, రెవెన్యూ వర్గాలు నిర్వహించిన వేలం లాంటి వివరాలను విలువల నిర్ధారణకు వాడుకోవచ్చు. బహిరంగ మార్కెట్ విలువలను సేకరించిన తర్వాత ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువలతో పోల్చుకుని సవరించాల్సిన విలువలను ప్రతిపాదించాలి. ⇒ 5–6 కిలోమీటర్ల రేడియస్‌లోని గ్రామాల్లో ఉండే తేడాలను జాగ్రత్తగా గమనించాలి. ఆ వ్యాసార్థంలోని గ్రామాల్లో ఏ పాయింట్లో ఎంత విలువ ఉంది, ఏయే పాయింట్‌కు ఎంత మారుతోందనే అంశాలను జాగ్రత్తగా గమనించాలి. ⇒ ఒకే గ్రామంలో ఉన్నా వేర్వేరు చోట్ల ఉన్న భూములు, ఆస్తులకు రెండు కంటే ఎక్కువ విలువలను కూడా ప్రతిపాదించవచ్చు. ⇒ వ్యవసాయ భూముల విషయంలో ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువలను రెవెన్యూ, పంచాయతీ అధికారుల నుంచి తీసుకోవాలి. ⇒ గతంలో పొరపాటుగా బహిరంగ మార్కెట్ విలువల కంటే ప్రభుత్వ విలువలను ఎక్కువగా నమోదు చేసి ఉంటే వాటిని వ్యక్తిగతంగా డీఐజీ స్థాయి అధికారులు పరిశీలించి కమిటీ ముందు పెట్టి నిర్ణయం తీసుకోవాలి. వ్యవసాయ భూముల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో ఇలా... ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అధికారికంగా నిర్ధారించిన ప్రాంతాల వివరాలను సేకరించి నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలకు వేర్వేరుగా ఆ ప్రాంతం మొత్తానికి ఒకే విలువ నిర్ధారించాలి. సదరు ప్రాంతాల్లో కొన్ని కాలనీలు, వీధులను కలపాల్సి వచి్చనా విలువలు మాత్రం ఒకేలా ఉండాలి. ⇒ రోడ్డుకిరువైపులా ఉన్న ఆస్తులకు ఒకే విలువ ప్రతిపాదించాలి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి తాజా డోర్ నంబర్ల వివరాలను ఫామ్–2లో పొందుపరచాలి. ⇒ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొత్తగా విలీనం చేసిన గ్రామాల్లో విలువల ప్రతిపాదన కసరత్తు క్షేత్రస్థాయి పరిస్థితులకు తగినట్టు ఉండాలి. ఈ గ్రామాలను ఆనుకుని ఇప్పటికే వార్డులు, బ్లాక్‌లుగా ఉన్న మున్సిపల్ ప్రాంతాల్లో విలువలు ఆయా గ్రామాలకు సమీపంగా ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ⇒ నివాస ప్రాంతాల్లో ఉన్న డోర్ నంబర్లను వాణిజ్య ప్రాంతాలుగా పొరపాటున నమోదు చేసినా, వాణిజ్య ప్రాంతాల డోర్ నంబర్లను నివాస ప్రాంతాలుగా నమోదు చేసినా వాటిని సవరించాలి. ⇒ గ్రౌండ్ ఫ్లోర్, ఇతర ఫ్లోర్లకు వేర్వేరు విలువలు నిర్ధారించే అంశాన్ని కేవలం ప్రధాన రహదారుల పక్కన ఉండే నివాస సముదాయాలకు మాత్రమే వర్తింపజేయాలి. సాధారణ మార్గదర్శకాలు: ⇒ భారత స్టాంపుల చట్టం–1899లోని సెక్షన్ 47(ఏ) ప్రకారం ఆస్తుల విలువలను సవరించే సమయంలో క్రమానుగుణంగా జరిగిన ప్రక్రియ, విలువలను పరిగణనలోకి తీసుకుని సవరణ విలువలను ప్రతిపాదించాలి. (అంటే ఒకేసారి పెద్ద ఎత్తున పెంపు, తగ్గింపు ఉండకూడదు.) –గ్రామీణ ప్రాంతాల డేటా, రికార్డులను తహశీల్దార్లు, గ్రామపంచాయతీల నుంచి తీసుకోవాలి. ⇒ ప్రస్తుతమున్న ప్రభుత్వ విలువల కంటే ఎక్కువ విలువలతో ఒక ప్రాంతంలో పలు లావాదేవీలు జరిగి ఉంటే ఆ విలువను సవరణకు ప్రాతిపదికగా తీసుకోవచ్చు. ⇒ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, ఖమ్మం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో జోనల్ అభివృద్ధి మ్యాప్‌లను, మిగిలిన పట్టణ ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల మాస్టర్ప్లాన్లను విలువల సవరణకు ప్రాతిపాదికగా తీసుకోవాల్సి ఉంటుంది. -
రిజిస్ట్రేషన్ల సులభతరానికే కార్డు–2.0
దొండపర్తి(విశాఖ దక్షిణ): ప్రజలకు సులభతర, సురక్షిత రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్న లక్ష్యంతోనే కార్డు–2.0 సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ రామకృష్ణ తెలిపారు. నూతన దస్తావేజుల రిజిస్ట్రేషన్ విధానం కార్డు–2.0పై ఉన్న అపోహలను తొలగించేందుకు మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన విధానం, సాఫ్ట్వేర్ పనితీరు, దాని ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1999లో అప్పటి అవసరాలకు తగినట్లుగా రూపొందించిన రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికీ వినియోగిస్తున్నామని చెప్పారు. అయితే, రిజిస్ట్రేషన్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటికీ చెక్‌పెట్టి, మెరుగైన, సులభతరమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండువేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే మరో రెండువేల గ్రామాల్లో సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పారు. ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా సులువుగా దస్తావేజుల తయారీ నుంచి రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వేచి ఉండే పరిస్థితి లేకుండా ముందుగానే అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ప్రధానంగా చిన్నచిన్న కారణాలతో దస్తావేజులను సబ్‌రిజిస్ట్రార్ తిరస్కరించే అవకాశం ఉండదని ఐజీ వివరించారు. ప్రయోగాత్మకంగా 23 చోట్ల.. ఈ కార్డు–2.0ను ప్రయోగాత్మకంగా 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిషేధిత భూములు, స్టాంప్ డ్యూటీ విలువ, మార్కెట్ విలువ, డాక్యుమెంట్ జనరేషన్, సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆటో మ్యుటేషన్ ఇలా అన్ని సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నూతన విధానం ద్వారా అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఎటువంటి ఫిర్యాదులు, ఇబ్బందులు తలెత్తలేదని ఐజీ రామకృష్ణ చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి సాఫ్ట్‌వేర్‌ను అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. విష ప్రచారాన్ని నమ్మొద్దు ఇక కార్డు–2.0పై కొంతమంది మిలిటెంట్ తరహాలో విషప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్, ఈ–సైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను తనఖా సంస్థలు, బ్యాంకులు అంగీకరించవన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 వచ్చిన తరువాత ఈ–సైన్ ద్వారా ప్రజలు దస్తావేజుల మీద సంతకాలు చేయవచ్చని తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. అదే విధంగా డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి దూరమవుతుందనడంలో నిజంలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ బాలకృష్ణ పాల్గొన్నారు. -
కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై.. అపోహలొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ల విధానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ప్రజలను కోరారు. ఈ విధానం అత్యంత సురక్షితమైంది.. పారదర్శకమైందని చెప్పారు. భౌతికంగా దస్తావేజులు ఉండవనే విషయంలో వ్యక్తమవుతున్న అభిప్రాయాల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. దస్తావేజులు భౌతికంగా కావాలనుకునే వారు ఇప్పుడు కూడా పొందే అవకాశం ఉందని ఆయనస్పష్టంచేశారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి. రామకృష్ణతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వినియోగదారులకు రెండు ఆప్షన్లు ఉంటాయని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌తోపాటు భౌతికంగా దస్తావేజులు పొందే ఆప్షన్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేసి టైమ్‌స్లాట్ బుక్ చేసుకున్న వారు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి తమకు భౌతికంగా డాక్యుమెంట్లు కావాలంటే అక్కడే వారి సంతకాలు తీసుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్లు ఇస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించిన కార్డ్ ప్రైమ్ 2.0 విధానాన్ని అత్యంత కట్టుదిట్టంగా ఎంతో అధ్యయనం చేసిన తర్వాతే రూపొందించామన్నారు. ఈ కొత్త విధానం గతం కంటే ఎంతో మెరుగైందని, సురక్షితమైనదని తెలిపారు. ప్రస్తుతం ఉన్న కార్డ్ 1.0 విధానం 1999లో రూపొందించారని.. అప్పట్లో ఏడాదికి రెండు లక్షల రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు ఏడాదికి 25 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా కొత్త టెక్నాలజీ, భద్రత, ప్రజల సౌలభ్యం వంటి అన్ని అంశాలతో కార్డ్ 2.0ను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆయన చెప్పారు. ఆటో సబ్ డివిజన్.. ఆటో మ్యుటేషన్.. కొత్త విధానంలో పబ్లిక్ డేటా ఎంట్రీ ద్వారా అమ్మేవాళ్లు, కొనేవాళ్లు తమ వివరాలను ఆన్లైన్లో పొందుపరిస్తే ఒక మోడల్ డాక్యుమెంట్ (దస్తావేజు) జనరేట్ అవుతుందన్నారు. అందులో ఇంకా అదనంగా ఏమైనా వివరాలు చేర్చాలనుకుంటే అందుకు అవకాశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సర్వే నెంబర్‌ను ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు, రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో ఎవరి పేరు ఉందో చూపిస్తుందని తెలిపారు. గతంలో నాలుగు రకాల చలానాలు కట్టే పరిస్థితి ఉండగా, ఇప్పుడు ఆన్లైన్లో ఆ సర్వే నెంబర్‌కు సంబంధించి ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలో చూపిస్తుందని.. దాన్ని వెంటనే ఆన్లైన్లోనే చెల్లించవచ్చని సాయిప్రసాద్ చెప్పారు. వ్యవసాయ భూములైతే ఈ దశలోనే సబ్ డివిజన్ అవసరమైతే ఆటోమేటిక్‌గా జరిగిపోతుందన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే మ్యుటేషన్ కూడా ఆటోమేటిగ్గా జరిగిపోతుందని, గతంలో మాదిరిగా మళ్లీ రెవెన్యూ శాఖ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. భూముల రీసర్వే అయిన గ్రామాల్లో అయితే అమ్మేవాళ్లు ముందుగానే సబ్ డివిజన్ చేయించుకోవాలని, అప్పుడే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారని చెప్పారు. ఐటీ చట్టం మార్పుతో ఇ–సైన్లు చెల్లుబాటవుతున్నాయి ఇక గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సైతం ఇ–సైన్లు చెల్లుబాటయ్యేలా ఐటీ చట్టంలో కేంద్రం మార్పులు చేసిందని సాయంప్రసాద్ గుర్తుచేశారు. ఆస్తి అమ్మేవాళ్ల నుంచి బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా ఇ–సైన్ తీసుకుంటారని, సబ్ రిజిస్ట్రార్ కూడా అదే విధంగా ఇ–సైన్ చేస్తారని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ను వినియోగదారులకు ఇస్తారని, అది ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో ఉంటుందన్నారు. ఒకవేళ ఎవరైనా భౌతికంగా తమకు డాక్యుమెంట్ కావాలంటే వాళ్లతో సంతకాలు చేయించుకుని గతంలో మాదిరిగా డాక్యుమెంట్ ఇస్తారని తెలిపారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేదన్నారు. ఆన్లైన్ డాక్యుమెంట్వల్ల కూడా ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరంలేదని, ఐటీ రిటర్నులన్నీ ఆన్లైన్లోనే జరుగుతున్నాయన్నారు. అలాగే, అనేక ప్రభుత్వ సేవలు ఆన్లైన్లోనే జెనరేట్ అవుతున్నాయని, రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు కూడా అంతేనన్నారు. ఆన్లైన్ దస్తావేజులు పొందిన వారికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని సాయంప్రసాద్ స్పష్టంచేశారు. ఆన్లైన్ ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లూ చెయ్యొచ్చు.. ఇక గతంలో దస్తావేజులు పోతే కేసులు పెట్టి అనేక అవస్థలుపడాల్సి వచ్చేదని, కొత్త విధానంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని, ఎప్పుడైనా ప్రజలు తమ ఆస్తుల డాక్యుమెంట్‌ను పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ, భౌతికంగా దస్తావేజులు కావాలనే ప్రజల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని వారికి ఆ ఆప్షన్ కూడా ఇచ్చామన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను డాక్యుమెంట్ రైటర్లు కూడా చేయవచ్చని, వారి స్కిల్‌ను అక్కడ కూడా ఉపయోగించవచ్చని చెప్పారు. ఆటోమ్యుటేషన్ విధానం నెలరోజుల్లో మున్సిపాల్టీల్లోనూ అమలుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఐజీ ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
తవ్విన కొద్దీ... ‘చీట్స్’
సాక్షి, అమరావతి: సోదాలు చేస్తున్న కొద్దీ అక్రమాల పుట్టగా బయటపడుతున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో అరెస్టులకు తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు... నలుగురు బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసి ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇప్పటికే ఏ1గా రామోజీరావును, ఏ2గా చెరుకూరి శైలజను, ఎ3గా బ్రాంచి మేనేజర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సీఐడీ... ఫోర్మన్లుగా పిలిచే కామినేని శ్రీనివాసరావు (విశాఖ– సీతమ్మధార బ్రాంచి), సత్తి రవి శంకర్ (రాజమండ్రి), బి.శ్రీనివాసరావు (విజయవాడ– లబ్బీపేట), గొరిజవోలు శివ రామకృష్ణ (గుంటూరు)లను అరెస్టు చేసి ఆయా ప్రాంతాల్లో న్యాయమూర్తుల ఎదుట హాజరుపరిచారు. వీరిలో కొందరికి 24 వరకూ రిమాండు విధించారు. ఈ సందర్భంగా వెలుగుచూసిన అక్రమాలు అధికారులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిట్ సభ్యుల స్థానంలో వేల చిట్లలో తమ పేరే రాసేసుకున్న మార్గదర్శి సంస్థ... నిబంధనల మేరకు దానికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు!!. చిట్లలో తనకు వచ్చే కొద్ది పాటి డిస్కౌంట్ల మొత్తాన్నే దాదాపు అన్ని చిట్లలోనూ డూప్లికేట్ చేసి చూపించి... దాన్నే తమ సొమ్ముగా పేర్కొనటంతో, ఇదంతా పచ్చి “గొలుసు’ వ్యవహారంగా మారిపోయింది. గొలుసులో ఏ చిన్న లింకు తెగినా... ఇది సంస్థ దివాలాకు దారితీసే ప్రమాదముంది. అదే జరిగితే చిట్ సభ్యుల సొమ్ము వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతోపాటు చిట్లలకు వేర్వేరు బ్యాంకు ఖాతాలను నిర్వహించాల్సి ఉండగా... అన్నిటికీ ఒకే ఖాతాను నిర్వహిస్తూ వాటిలో డబ్బును ఇష్టం వచ్చినట్టుగా మళ్లించటం కూడా విస్మయం కలిగిస్తోంది. ఇన్వెస్ట్మెంట్ రూపంలో గ్రూపు సంస్థల్లోకి కోట్లాది రూపాయలు మళ్లిస్తుండటంతో పాటు... హైరిస్క్ ఉండే మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి కూడా ఈ ఖాతా నుంచి చిట్ సభ్యుల సొమ్మును మళ్లించటం గమనార్హం. వీటన్నిటితో పాటు... చట్ట విరుద్ధ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థను మూసేసినా డిపాజిట్లు తీసుకోవటం మాత్రం రామోజీరావు ఆపలేదని తాజా సోదాల్లో వెల్లడయింది. చిట్ సభ్యుల నుంచి అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటూ... బ్యాంకుల్లో అయితే వాటిపై టీడీఎస్ (ఆదాపు పన్ను) చెల్లించాలని, తమ దగ్గరైతే అలాంటిదేమీ ఉండదని నమ్మబలుకుతుండటం మోసాలకు పరాకాష్టగా అధికారులు చెబుతున్నారు. ఆ అక్రమాల వివరాలివీ... ఒక్క రూపాయి చెల్లించకుండా...తమపేరిట చిట్టీలు సాధారణంగా ప్రతి చిట్కూ నిర్ణీత చందాదారుల సంఖ్య ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో తక్కువ మంది సభ్యులు (టికెట్లు) చేరితే కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆ ఖాళీ టికెట్స్‌ను కంపెనీ తీసుకోవాలి. వాటి చందాను కంపెనీ చెల్లించాలి. తరవాత కొత్త చందాదారులు చేరితే ఆ మేరకు టికెట్స్ భర్తీ చేయొచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని 27, 32 సెక్షన్లలో నిర్దేశించిన ఈ నిబంధనలను మార్గదర్శి ఏనాడూ పట్టించుకోలేదు. గరిష్ఠంగా ఒకో గ్రూపులో 50 శాతం వరకూ టికెట్లు కంపెనీవే ఉన్నాయి. కానీ వాటికోసం మార్గదర్శి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లపై తమకు వచ్చే డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్ చేసి అన్నిచోట్లా రికార్డుల్లో చూపిస్తోంది. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలించి కొన్ని గ్రూపుల్లో చిట్ల సభ్యులు తమ చందా చెల్లించలేకపోతే... ఇక మిగతా వాళ్లకు చిట్లు పాడుకున్నా సరే డబ్బులు రావటం కష్టం. ఎందుకంటే కంపెనీ పేరిట ఉన్న వేటికీ డబ్బులు లేవు కాబట్టి!!. ఇదిగో ఉదాహరణ.... ఎంసీఎఫ్ గుంటూరు బ్రాంచిలో 45 గ్రూపుల చిట్టీలు వేశారు. వాటిలో మొత్తం 2,040 టికెట్లు (చందాదారులు) ఉన్నాయి. 858 టికెట్లు మార్గదర్శివే. వాటి చందాగా మార్గదర్శి రూ.16.96 కోట్లు చెల్లించాలి. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని బ్రాంచి మేనేజర్(ఫోర్మేన్) అంగీకరించారు. కేవలం రికార్డుల్లో ఎంట్రీలను అటూ ఇటూ జంబ్లింగ్ చేసి చూపిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ మొత్తంగా 2,300 చిట్టీలను నిర్వహిస్తోంది. వాటిలో లక్షమందికిపైగా చందాదారులున్నారు. వాటిలో కొన్ని వేల టికెట్లు మార్గదర్శివే. కానీ సంస్థ యాజమాన్యం తన వాటాగా ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. గొలుసు కట్ట మాదిరిగా ఒక చిట్ సొమ్మును వేరే చోట సర్దుబాటు చేస్తూ... కొందరికి ష్యూరిటీల పేరిట ఆలస్యం చేస్తూ... మరికొందరికి డిపాజిట్ల పేరిట తరవాత ఇస్తామని చెబుతూ రోజులు నెట్టుకొస్తోంది. అదీ కథ. ఒక్క బ్యాంకు ఖాతా చాలట!! చిట్‌ఫండ్ సంస్థలు తమ నిర్వహించే ప్రతి చిట్టీకీ సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. మార్గదర్శి దీన్ని పట్టించుకుంటే ఒట్టు. చిట్టీల ఒప్పందాల్లో బ్యాంకు పేరును చెబుతోంది తప్ప ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఇవ్వటమే లేదు. ప్రతి చిట్టీకీ ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాల్సి ఉండగా... దాన్నీ పాటించటం లేదు. అన్నీ ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా పోగేస్తోంది. నిజానికిదో పెద్ద ఆర్థిక కుట్ర. నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై సదరు బ్రాంచి మేనేజర్ (ఫోర్మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే అన్నీ చూడాలి. కానీ మార్గదర్శిలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ లేదు. అంతా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచే నడిపిస్తున్నారు. అక్కడ ఒకరికే చెక్ పవర్ కల్పించడం వెనుక గూడుపుఠాణి ఏమంటే... ఆ ఖాతా నుంచి నిధులు మళ్లించటం ఈజీ కనక. మ్యూచువల్ ఫండ్స్, ఇతర స్టాక్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం నేరమైనా... మార్గదర్శి చేస్తున్నది అదే. తమ గ్రూపు సంస్థ ఉషోదయ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.5శాతం వాటాను మార్గదర్శి చిట్స్ కొనుగోలు చేసింది. ఇతర సంస్థల్లోకీ అక్రమంగా నిధులు మళ్లించింది. హైరిస్క్ ఉన్న వీటిలో పెట్టుబడులు పెడుతున్నట్లు చందాదారులకు కనీసం తెలియకుండా... దశాబ్దాలుగా రామోజీ సాగిస్తున్న ఆర్థిక దోపిడీ ఇది. డిపాజిట్లు సేకరించటం నేరమే అయినా... చిట్టీ పాడిన చందాదారుడికి చిట్టీ మొత్తం చెల్లించినట్టుగా చిట్స్ రిజిస్ట్రార్‌కు చూపిస్తున్న మార్గదర్శి... ఆ చందాదారుడికి పూర్తిగా చెల్లించకపోవటం గమనార్హం. ష్యూరిటీలు సరిగా లేవన్న కారణాలతో పలువురు చందాదారుల నుంచి ఫ్యూచర్ సెక్యూరిటీ పేరిట మిగిలిన కాలానికి చెల్లించాల్సిన చందాను తమ వద్దే ఉంచుకుంటున్నారు. దానికి ఓ రశీదు ఇస్తున్నారు. దానిపై 4–5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇలా డిపాజిట్లు సేకరించటం చట్టప్రకారం నేరం. రామోజీ మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. దానికి ఇదిగో ఉదాహరణ... ఒకే వ్యక్తి నుంచి రూ.కోటికిపైగా అక్రమ డిపాజిట్లు మార్గదర్శిలో ఓ చందాదారునికి 24 చిట్టీలున్నాయి. ఆయన నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ “రశీదు’ రూపంలో రూ.కోటికుపైగా డిపాజిట్టు వసూలు చేసింది. దీనిపై ఆ సభ్యుడిని విచారించగా విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. టీడీఎస్ మినహాయించుకోకుండా తాము డిపాజిట్లు సేకరిస్తున్నామని మార్గదర్శి చిట్స్ తనకు చెప్పిందని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాలి. అదే మార్గదర్శిలో అయితే టీడీఎస్ అవసరం లేదని చెప్పి ఆయన్ని ఆకర్షించారు. ఇది ఆర్బీఐ నిబంధనల ప్రకారం నేరం. నిజానికి గతంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట ఎలాంటి అనుమతులూ లేకుండా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేశారు. దీన్ని నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టడంతో కేసులు నమోదయ్యాయి. విచిత్రమేంటంటే కేసులు కొనసాగుతుండగా... నేరాన్ని కప్పిపుచుకోవటానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను రామోజీరావు మూసేశారు. ఇలా డిపాజిట్లు సేకరించటం ఐటీ చట్టం ప్రకారం నేరం. ఎంత సేకరిస్తే అంత మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.ఈ మేరకు ఐటీ కూడా రామోజీకి నోటీసులు జారీ చేసింది. దానిపైనా పలు కేసులు నడుస్తున్నాయి. అలాంటి సమయంలో సంస్థను కుట్రపూరితంగా మూసేయటమే కాక... ఇపుడు చిట్స్ ముసుగులో రకరకాల పేర్లతో డిపాజిట్లు సేకరిస్తుండటం గమనార్హం. మేనేజర్ల పేరిట మరో పన్నాగం... (బాక్స్) – తన అక్రమాలకు వారిని బలి చేసే కుతంత్రం – న్యాయస్థానాన్నీ తప్పుదోవపట్టించేందుకు యత్నం అవినీతి బాగోతం బయటపడే సమయంలో దానికి సాంకేతిక కారణాలు చూపించి తప్పించుకోవటంలో రామోజీది అందెవేసిన చెయ్యి. అదే తరహాలో చిట్స్ విషయంలోనూ ఈ ఉల్లంఘనలన్నింటినీ తమ బ్రాంచి మేనేజర్లు(ఫోర్‌మెన్) నెత్తిన రుద్దీ తప్పించుకునే దుర్మార్గానికి తెరతీశారు రామోజీ. కానీ స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఈ కేసును శాస్త్రీయంగా అధ్యాయనం చేసి... తగిన ఆధారాలు సేకరించడం ద్వారా రామోజీ ఎత్తును చిత్తు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు బయటపడగానే రామోజీరావు తన ఈనాడు పత్రికలో అరపేజీ ప్రకటన ఇచ్చారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించి అన్ని వ్యవహారాలు బ్రాంచి మేనేజర్లే(ఫోర్‌మెన్) మాత్రమే చూస్తారు ...సర్వాధికారాలు వారివేనని అందులో పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ న్యాయస్థానంలో వేసిన పిటిషన్లో అదే మాట చెప్పారు. తద్వారా బ్రాంచి కార్యాలయాల్లో అక్రమాలతో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేశారు. కానీ స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ విభాగాలు రామోజీరావు కుట్రను సమర్థంగా తిప్పికొట్టాయి. ఎందుకంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు కేవలం నిమిత్త మాత్రులు. వారికి తమ బ్రాంచిలోని ఖాతాలకు సంబంధించి కనీసం చెక్ పవర్ కూడా లేదు. అంటే వారికి సర్వాధికారాలు ఉన్నాయని రామోజీ ఇచ్చిన ప్రకటనలో గానీ న్యాయస్థానంలో వేసిన పిటిషన్లో గానీ చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది స్పష్టమైంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అన్ని అక్రమాలకు రామోజీరావు, ఆయన కోడలు శైలజే పూర్తి బాధ్యులనేది సుస్పష్టం. -
‘మార్గదర్శి’ సహాయ నిరాకరణ
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలపై సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన ఏపీ అధికారుల బృందానికి ఆ సంస్థ యాజమాన్యం పూర్తిగా సహాయ నిరాకరణ చేసింది. చట్ట ప్రకారం సమర్పించాల్సిన పత్రాలు, సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు, ఇతర అక్రమాలపై రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష న్లు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు జరిపిన అనంతరం నిధుల దారి మళ్లింపుపై ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్‌లో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో మూడు రోజులపాటు సోదాలు చేశారు. సోదాలు శుక్రవారం ముగిశాయి. చిట్‌ఫండ్స్ వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలు, రశీదులు, ష్యూరిటీలు తదితర వివరాలను సమర్పించాలని అధికారుల బృందం ముందుగానే నోటీసు జారీ చేసింది. అయినప్పటికీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది తమ యాజమాన్య సూచనలు, ఆదేశాలను పాటిస్తూ అధికారుల దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదు. సంస్థ సమాచారాన్ని అధికారులకు తెలపాల్సిన మార్గదర్శి డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్. వెంకటస్వామి కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయా రు. కార్యాలయంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ (అడ్మిన్) రారాజీ తనకు ఏ సమాచారం తెలీదని చెప్పడం విడ్డూరం. తాము కోరిన సమాచారాన్ని తెలిపేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ తమ ముందు హాజరవ్వాలని లేదా తగిన అధికారిని నియోగించాలని దర్యాప్తు బృందం ఆయనకు సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్‌ను సంప్రదించి చెబుతామన్న ఆయన ఆ తర్వాత ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్యాంకు లావాదేవీల సమాచారాన్ని కూడా ఇచ్చేందుకు నిరాకరించారు. సోదాల్లో తాము గుర్తించిన సమాచారం వివరాలను వెల్లడిస్తూ నమోదు చేసిన పంచనామా నివేదిక కాపీని తీసుకుని రశీదు ఇవ్వాలని దర్యాప్తు అధికారులు వైస్ ప్రెసిడెంట్ రారాజీని అడిగారు. తమ లీగల్ అడ్వైజర్‌ను సంప్రదించి అక్నాలడ్జ్మెంట్ ఇస్తామని తొలుత చెప్పిన ఆయన, కాసేపటికే అందుకు కూడా నిరాకరించారు. దీంతో పంచనామా నివేదిక ప్రతిని మార్గదర్శి కార్యాలయంలో గోడకు అతికించి దర్యాప్తు బృందం వెనుదిరిగింది. -
మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు సోదాలు
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో రెండో రోజు కూడా సోదాలు నిర్వహించారు. సుమారు 10 గంటల పాటు తనిఖీలు జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించిన మార్గదర్శి చిట్‌ఫండ్ వ్యవహారాలపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అధికారుల తనిఖీలను వీడియో కెమెరాల్లో చిత్రీకరించారు. సొంత మీడియాతో అధికారుల విధులకు మార్గదర్శి యాజమాన్యం ఆటంకం కలిగించింది. పలు కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డిస్క్ లోని సమాచారం అధికారులు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫిక్స్ డిపాజిట్లు సేకరించినట్టు అనుమానం వ్యక్తమవుతుంది. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మర్గదర్శి నిధుల మళ్లింపుపై అధికారులు ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎంత మంది డిపాజిట్ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. చదవండి: వేగులం కాదు.. ప్రజా సేవకులం -
మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో సోదాలు
సాక్షి, అమరావతి/హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించిన మార్గదర్శి చిట్‌ఫండ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ పోలీసుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఐదు బృందాలతో ఈ సోదాలను నిర్వహించారు. ఉదయం నుంచి దాదాపు తొమ్మిది గంటలపాటు తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను పరిశీలించారు. గురువారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్గదర్శి ముసుగులో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు లాంటి అవకతవకలకు పాల్పడటంపై ఆరా తీస్తున్నారు. చిట్టీల డబ్బులను అక్రమంగా దారి మళ్లించి ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మార్గదర్శి యాజమాన్యం ఎనిమిదేళ్లుగా ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. తనిఖీల సందర్భంగా చిట్టీదారుల వివరాలు, వారి నుంచి సేకరించిన డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు. పక్కా ఆధారాలతోనే.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎంత మంది డిపాజిట్ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం. రాత్రి వరకు తనిఖీలు.. ఉదయం పదిన్నర గంటలకు మొదలైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎంత మొత్తం డిపాజిట్లు సేకరించారు? ఎక్కడెక్కడ ఎంత మళ్లించారు? చిట్టీలు పాడిన వారికి సకాలంలో చెల్లిస్తున్నారా? డబ్బులు డిపాజిట్ చేయాలని ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? డబ్బు చెల్లిస్తున్న వారికి ఎలాంటి గ్యారంటీ ఇస్తున్నారన్న అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. క్షుణ్నంగా దర్యాప్తు.. ప్రత్యేక ఆడిట్ ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది చందారులతో 2,345 చిట్టీలను నిర్వహిస్తున్న మార్గదర్శి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఏపీలో చందాదారుల నుంచి చిట్టీ డబ్బులు వసూలు చేస్తున్నందున కంపెనీ కార్యకలాపాలు, బ్యాలెన్స్ షీట్లు వివరాలు ఇవ్వాల్సిందేని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా, ఏటా వివరాలు సమర్పించకుండా అక్రమాలకు పాల్పడుతున్న మార్గదర్శిపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న సోదాల అనంతరం మార్గదర్శికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు నిపుణులతో మార్గదర్శిలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. మార్గదర్శి ఒక్కటే కాకుండా చిట్‌ఫండ్ కంపెనీలలో అవకతవకలపై అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు. మీడియాపై మార్గదర్శి సిబ్బంది దురుసుతనం.. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల కోసం వచ్చారనే సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులపై మార్గదర్శి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నామని చెబుతున్నా వినిపించుకోకుండా సంస్థ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది దుర్భాషలాడుతూ మీడియాను గెంటేసేందుకు ప్రయత్నించారు. -
Margadarsi Chit Fund: అన్నీ ఉల్లంఘనలు మోసాలే!
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో భారీ అవకతవకలు, మోసాలు జరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చందాదారులు పాడుకున్న చిట్టీల సొమ్మును డిపాజిట్లుగా సేకరించి ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్, ఇతర కంపెనీలకు మళ్లించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన చిట్టీల రికార్డులు, ఖాతాలను సక్రమంగా నిర్వహించడం లేదని, ఆ కంపెనీ వ్యవహారాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. కనీసం కంపెనీ బ్యాలెన్స్ షీట్లను కూడా అధికారులకు చూపడం లేదన్నారు. మార్గదర్శితోపాటు 35 కంపెనీల్లో మూడు విడతలుగా తనిఖీలు నిర్వహించి పలు ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు. తనిఖీలకు మార్గదర్శి ఫోర్మెన్లు ఏమాత్రం సహకరించలేదన్నారు. ఉల్లంఘనలు, మోసాలపై మార్గదర్శి సహా ఇతర కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసిన మార్గదర్శి కంపెనీలో ప్రత్యేకంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఆ కంపెనీ హెడ్‌క్వార్టర్‌లోనూ తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు కమిషనర్ ఉదయభాస్కర్తో కలిసి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. అందుకే మూడు రోజులు.. మార్గదర్శిలో ఏపీలోని 37 బ్రాంచిలకు ఒక్కో వ్యక్తిని ఫోర్‌మెన్‌గా నామినేట్ చేశారు. వారికి ఎటువంటి అధికారాలు, చెక్ పవర్ ఇవ్వలేదు. బ్రాంచిల బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా వారికి తెలియవు. ఆ బ్రాంచిల సొమ్ము ఎక్కడికి బదిలీ అవుతుందో తెలియదు. బ్రాంచి లావాదేవీలు ఏవీ వారికి తెలియదు. తనిఖీల సమయంలో ఏది అడిగినా మాకు తెలియదు.. హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నాయని సమాధానం చెప్పారు. వారి నుంచి ఎలాంటి సహకారం అందలేదు. అక్కడ దొరికిన డాక్యుమెంట్ల గురించి అడిగినా చెప్పలేదు. వాటికి సంబంధించిన స్టేట్మెంట్లపై సంతకాలు చేసేందుకు చేయడానికి నిరాకరించారు. అందుకే ఆ సంస్థలో తనిఖీలకు మూడు రోజుల సమయం పట్టింది. అవసరమైన సమాచారం, వివరాలు ఇవ్వలేదు. అక్కడ దొరికిన కొంత సమాచారాన్ని మాత్రమే తీసుకోగలిగాం. వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు సేకరించారు మార్గదర్శిలో వడ్డీ ఆశ చూపించి సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించడం పెద్ద ఉల్లంఘనగా గుర్తించాం. డిపాజిట్లు కట్టిన వారికి ఒక రశీదు మాత్రమే ఇస్తున్నారు. ఆ రశీదు గురించి బ్రాంచి ఫోర్మెన్కి సమాచారం కూడా లేదు. రశీదులో 6–12 నెలలకు నాలుగు శాతం వడ్డీ, 12 అంతకంటె ఎక్కువ నెలలైతే ఐదు శాతం వడ్డీ ఇస్తామని పేర్కొన్నారు. సెక్యూరిటీ సొమ్ముపై వడ్డీ ఎలా చెల్లిస్తారు? అదేమీ బ్యాంకులో వేసిన డిపాజిట్ కాదు. దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడంలేదు. సెక్యూరిటీ సొమ్మును ఎక్కడ ఉంచుతున్నారు? ఏ బ్యాంక్ ఖాతాలో ఉంచారు? వాటి లావాదేవీల గురించి ఫోర్మెన్కి తెలియదు. ఇది చాలా సీరియస్ ఉల్లంఘన. సెక్యూరిటీ రూపంలో డిపాజిట్లు సేకరించడం అనుమానాస్పదం. వడ్డీ ఆశ చూపుతున్నారంటే ఆ సొమ్మును ఎక్కడో పెట్టుబడి పెట్టినట్లు అర్థమవుతోంది. దీన్నిబట్టి ఆ సొమ్మును వేరే దానికి వాడుతున్నారు. ఇది పూర్తిగా మోసం. వేరే వ్యాపారానికి ఉపయోగించకూడదు చిట్‌ఫండ్ సొమ్మును వేరే వ్యాపారాలకు ఉపయోగించకూడదు. దీనిపై చూస్తూ ఊరుకోం. కఠినమైన చర్య తీసుకుంటాం. ఆ సెక్యూరిటీ సొమ్మును రాష్ట్రంలోని అన్ని బ్రాంచీల వారీగా ప్రత్యేకంగా డిపాజిట్ చేయాలని ఇప్పటికే మార్గదర్శికి సూచించాం. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. అన్నింటికీ ఒకే అకౌంట్ ద్వారా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. కొత్త చిట్ఫండ్కి, పాత చిట్ఫండ్కి, పాట పాడుకున్న వారికి ఒకే అకౌంట్ చూపిస్తున్నారు. ఫోర్‌మెన్ కట్టిన చందాకు మిగతా చందాదారుల మాదిరిగానే సెక్యూరిటీ చూపించి అది వేరే ప్రత్యేక అకౌంట్లో ఉంచాలి. కానీ అలా చేయడంలేదు. మార్గదర్శి ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు అత్యవసరమైన రికార్డులను కూడా మార్గదర్శి నిర్వహించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేకంగా బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేయకపోవడం వల్ల ఫండ్స్ ఎక్కడున్నాయి? ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో తెలియడం లేదు. వీటిపై చాలా అనుమానాలున్నాయి. మార్గదర్శి ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. ప్రతి చిట్‌కి వివరాలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. బ్యాలెన్స్ షీట్లు ఇవ్వకపోవడం వల్ల వారి పెట్టుబడుల గురించి తెలియడంలేదు. ఇది పెద్ద మోసం.. పబ్లిక్ డొమైన్లో ఉన్న వివరాల ఆధారంగా మార్గదర్శి సొమ్ములు ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్ ఇతర కంపెనీల్లో ఉన్నట్లు గుర్తించాం. చిట్‌ఫండ్ సొమ్మును ఇతర కంపెనీలు మళ్లించినట్లు స్పష్టమైంది. ఇది పెద్ద మోసం. ప్రజల సొమ్మును రిస్కులో పెట్టారు. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం బ్యాలెన్స్ షీట్స్, ప్రత్యేక బ్యాంక్ అకౌంట్స్ లేవు. లావాదేవీలు, పెట్టుబడుల వివరాలు లేవు. ఇవన్నీ సీరియస్ ఉల్లంఘనలు. తనిఖీల సమయంలో మా అధికారులు చాలా ఓపిగ్గా వ్యవహరించారు. సహనంగా సమాచారం సేకరించేందుకు ప్రయత్నించినా వారు సహకరించలేదు. సమాచారం ఇవ్వకపోగా అధికారులు తమను ఇబ్బంది పెట్టారని, డజన్ల సంఖ్యలో అధికారులు వచ్చారని పత్రికల్లో కథనాలు రాశారు. జీఎస్టీ ఉల్లంఘనలు కూడా ఉన్నందున తనిఖీల్లో ఆ అధికారులు కూడా భాగస్వాములయ్యారు. వీటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇప్పటికే మార్గదర్శికి నోటీసులిచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తాం చిట్‌ఫండ్ కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా నిర్వహిస్తుంటే చూస్తూ ఊరుకోం. ప్రజల సొమ్మును రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. 7 నుంచి 10 రోజుల్లో పూర్తి స్థాయి షోకాజ్ నోటీసు ఇస్తాం. వారిచ్చిన సమాధానాన్ని బట్టి తదుపరి చర్య ఉంటుంది. అకౌంట్స్ నిర్వహణ సక్రమంగా లేదు కాబట్టి మార్గదర్శిలో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తాం. ఫోరెన్సిక్ తరహాలో జరిగే ఈ ప్రత్యేక ఆడిట్లో అన్ని అకౌంట్స్, అన్ని లావాదేవీలు, డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి ఒక్కటీ హైదరాబాద్ హెడ్‌క్వార్టర్‌లో ఉంటుందని మార్గదర్శి ఫోర్మెన్స్ చెబుతున్నారు కాబట్టి తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సహకారంతో అక్కడ కూడా తనిఖీలు చేస్తాం. ఇన్ని ఉల్లంఘనలు జరిగిన దృష్ట్యా మార్గదర్శి, ఇతర కంపెనీల్లో కొత్త చిట్స్‌ను అన్ని పరిశీలించాకే అనుమతి ఇస్తాం. గతంలో ఇతర సంస్థల్లోనూ.. చిట్‌ఫండ్ సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిట్టీలు కట్టేముందు ఆ కంపెనీలకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవాలి. తనిఖీల్లో ఎలాంటి వివక్ష లేదు. ఫిర్యాదులు వచ్చిన అన్ని కంపెనీల్లో తనిఖీలు చేశాం. 2018లోనే కపిల్ చిట్స్‌లో ఈ తరహా తనిఖీలు చేసి చర్యలు తీసుకున్నాం. 2019 నుంచి 2022 వరకు ఆ కంపెనీకి కొత్త చిట్స్‌ను వేసే అవకాశం ఇవ్వలేదు. 2018లోనే మార్గదర్శి సంస్థ బ్యాంకు స్టేట్మెంట్స్ చూపించడం లేదని అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ గుర్తించారు. సెకండ్ అకౌంట్స్ వివరాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటాం. -
‘ప్రీమియం’ రిజిస్ట్రేషన్ రెడీ
సాక్షి, అమరావతి: ఆస్తుల క్రయ విక్రయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఓ పెద్ద ప్రహసనం. అడుగడుగునా అవినీతి, డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువ. ఇటువంటి కష్టాలు, అవినీతి లేకుండా ప్రజలకు సులభంగా, అత్యాధునిక పద్ధతుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్నది సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఇందుకోసం సీఎం జగన్ నేతృత్వంలో ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్లకు అధికారులు రూపకల్పన చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రభుత్వం ప్రీమియం రిజిస్ట్రేషన్ సెంటర్లను అందుబాటులోకి తెస్తోంది. పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల తరహాలో కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఇక్కడ సేవలు అందుతాయి. తొలి దశలో 9 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా విశాఖపట్నం, శ్రీకాకుళంలో రెండు సెటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుపై ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. విశాఖ మధురవాడ సెజ్‌లోని టవర్–బిలో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియం రిజిస్ట్రేషన్ సర్వీస్ సెంటర్ ఇప్పటికే అన్ని హంగులతో సిద్ధమైంది. దీనిని త్వరలోనే ప్రారంభించనున్నారు. ఆ తర్వాత శ్రీకాకుళంలో రెండోది ఏర్పాటు చేస్తారు. అనంతరం విజయవాడ, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, తిరుపతి, కర్నూలు, కడపలో ఏర్పాటు చేస్తారు. సోమవారం దీనిపై ముఖ్యమంత్రితో అధికారులు సమావేశమవనున్నారు. ఆయన అంగీకరించిన వెంటనే విశాఖలో పైలట్ ప్రాజెక్టు మొదలు పెడతారు. ఈ సెంటర్ల పనితీరు, ప్రజల నుంచి వచ్చిన స్పందననుబట్టి దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆన్లైన్ స్లాట్ బుకింగ్.. సింగిల్ విండో రిజిస్ట్రేషన్లు ఈ సెంటర్లలో ఫ్రంట్ ఎండ్ (ముందు భాగం)లో అవుట్సోర్సింగ్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. బ్యాక్ ఎండ్‌లో సబ్ రిజిస్ట్రార్, ఇతర సిబ్బంది పనిచేస్తారు. మొదట కొద్ది రోజులు ఆఫ్‌లైన్ సేవలు అందించినా, ఆ తర్వాత అన్నీ ఆన్లైన్ సేవలే ఉండేలా వీటిని డిజైన్ చేశారు. వినియోగదారులు ఆన్లైన్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. దాని ప్రకారం సెంటర్‌కు వెళ్లి సింగిల్ విండో కింద రిక్వెస్ట్ పెడితే ఆన్లైన్లో సంబంధిత సేవా ప్రక్రియ మొదలవుతుంది. వినియోగదారులే తమ సమాచారాన్ని నమోదు (డేటా ఎంట్రీ) చేసుకోవచ్చు. అది ఆన్లైన్లోనే సబ్ రిజిస్ట్రార్‌కి వెళుతుంది. సబ్ రిజిస్ట్రార్ పరిశీలించి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. అనంతరం ప్రోపర్టీ వెరిఫికేషన్‌ను సంబంధిత ప్రభుత్వ శాఖ వెబ్సైట్ ద్వారా పరిశీలిస్తారు. అది సక్రమంగా ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వెంటనే పూర్తి చేస్తారు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఏమాత్రం ఉండదు. రిజిష్ట్రేషన్ అయిన వెంటనే చేయించుకున్న వారికి పూర్తయినట్లు మెసేజ్ వెళుతుంది. రిజిస్ట్రేషన్లు, మార్కెట్ విలువ మదింపు, ఈసీలు, సీసీలు, స్టాంపుల అమ్మకాలన్నీ ఇక్కడే జరుగుతాయి. స్టాంప్ డ్యూటీ కలెక్షన్లను స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది. ఇందుకోసం ఆ సంస్థ అక్కడ ఒక బ్రాంచిని ఏర్పాటు చేస్తుంది. దాని ద్వారా అక్కడికక్కడే ఆన్లైన్లో చెల్లింపులు చేయొచ్చు. ప్రస్తుతానికి ఇప్పటికే పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని వినియోగించనున్నారు. అవసరాన్నిబట్టి ఫ్రంట్ ఎండ్ సేవలను అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ సెంటర్లలో వినియోగదారుల కోసం విశ్రాంతి గది, కెఫెటేరియా వంటి సదుపాయాలుంటాయి. అవినీతి రహితంగా, సులభంగా రిజిస్ట్రేషన్లు అవినీతి రహిత రిజిస్ట్రేషన్ సేవలు అందించడమే ప్రీమియం సెంటర్ల ప్రధాన ఉద్దేశం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుతాయి. మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. – డాక్టర్ రజత్ భార్గవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ -
వేగంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ
సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 150 ఏళ్ల నుంచి ఉన్న పాత రికార్డులను డిజిటలీకరణ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దస్తావేజులు, వాటికి సంబంధించి మొత్తం 15 కోట్ల పేజీలను స్కానింగ్ చేసి కంప్యూటరైజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1850 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థ అమల్లో ఉంది. 1999 వరకు రిజిస్టర్ అయిన ప్రతి డాక్యుమెంట్‌ను ఒక పెద్ద వాల్యూమ్‌లో (పుస్తకం) ఎత్తిరాసి ఒరిజినల్ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఇచ్చేవారు. అమ్మినవాళ్లు, కొన్నవాళ్ల వివరాలను ఇండెక్స్ పుస్తకాల్లో నమోదు చేసేవారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వాల్యూమ్, ఇండెక్స్ పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. మరోవైపు.. 1999 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణ జరిగింది. దస్తావేజులను స్కాన్‌చేసి ఒరిజినల్స్‌ను వినియోగదారులకు ఇస్తున్నారు. శిథిలమైన 150 ఏళ్ల నాటి రికార్డులు ఇక అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ల ఈసీ నకలు కాపీ కావాలని అడిగితే ఈ వాల్యూమ్‌లో వెతికి ఇస్తున్నారు. ఇది చాలా క్లిష్టతరంగా మారింది. 150 ఏళ్ల నాటి రికార్డు కావడంతో అవన్నీ పాతపడిపోయాయి. వాల్యూమ్‌లు పట్టుకుంటే పేజీలు చిరిగిపోతూ, చిల్లులు పడి, పొడిపొడి అయిపోతూ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిని భద్రపరచడం కూడా చాలాకష్టంగా మారిపోయింది. భూముల విలువ పెరిగిన నేపథ్యంలో వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజులుపోతే వాటిని తీసి చూడడం కూడా సాధ్యంకాని పరిస్థితి. అన్నింటికీ మించి ఎవరైనా తమ పాత దస్తావేజు నకలు కావాలని అడిగితే దాన్ని గుర్తించే పరిస్థితి లేకుండాపోయింది. ఆ వాల్యూమ్ నెంబర్, పేజీ నెంబర్ చెబితే తప్ప వెతికి ఇచ్చే పరిస్థితిలేదు. ఐడీఎంఆర్ఎస్ విధానంలో డిజిటలీకరణ ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం బ్రిటీష్ కాలం నుంచి 1999 వరకు రిజిస్టర్ అయిన దస్తావేజులు, ఇతర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 269 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పని వేగంగా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు జోన్లుగా విభజించి డిజిటలీకరణ కోసం టెండర్లు పిలిచారు. రైటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు జోన్ల టెండర్లు దక్కించుకుని పని మొదలుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ రికార్డ్ సిస్టమ్ (ఐడీఎంఆర్ఎస్) విధానంలో డిజిటలీకరణ చేస్తున్నారు. మొదట అన్ని కార్యాలయాల్లో పాత రికార్డులను స్కానింగ్ చేసి ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరిస్తున్నారు. ఆర్నెలల్లో మొత్తం రికార్డుల డిజిటలీకరణ పూర్తయ్యే అవకాశమున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. డిజిటలీకరణ తర్వాత వెంటనే ఈసీ నకలు ఇక డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ చెప్పగానే దానిని వెంటనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈసీ నకలును ప్రజలు సులభంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే, విలువైన ఆస్తుల రికార్డులు భద్రంగా ఉంటాయి. ఈ పని వేగంగా జరుగుతోంది. – వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ -
నకిలీ చలాన్లలో రూ.3.38 కోట్లు రికవరీ
సాక్షి, అమరావతి: నకిలీ చలాన్ల వల్ల ప్రభుత్వానికి గండిపడిన ఆదాయంలో రూ. 3,38, 11,190 రికవరీ చేశామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ) ధర్మా న కృష్ణదాస్ తెలిపారు. విజయవాడలోని తన కార్యాలయంలో బుధవారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ ఎంవీ శేషగిరిబాబుతో ఈ అంశంపై సమీక్షించారు. ధర్మాన మాట్లాడుతూ అదనపు ఐజీ ఆధ్వర్యంలో ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం తప్పుడు చలాన్ల ద్వారా రూ. 7,13,76,148 ఆదాయానికి గండిపడిందని గుర్తించామన్నారు. అందుకు బాధ్యులను గుర్తించి ఇండియన్ స్టాంప్ చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇప్పటివరకు రూ.3.38 కోట్లు రికవరీ చేశామని, ఇంకా రూ.3.75 కోట్లు రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. అధికారుల తనిఖీలలో 11 జిల్లాల్లోని 36 సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 1,252 డాక్యుమెంట్లకు సంబంధించిన తప్పుడు చలానాలు గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఐదు కేసులు నమోదు చేసి, 9 మంది సబ్–రిజిస్ట్రార్లను విధుల నుంచి తప్పించామన్నారు. ఇందులో ప్రమేయం ఉన్న మరికొంతమంది సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. సీఎఫ్ఎంఎస్ను సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానించామని, ఇకపై అక్రమాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ధర్మాన వివరించారు. -
ఖజానాకు కరోనా ‘ఎఫెక్ట్’!
సాక్షి, హైదరాబాద్ : ఆర్థిక సంవత్సరం చివరలో రాష్ట్ర ఖజానాకు కరోనా రూపంలో అనుకోని కష్టం వచ్చిపడింది. ఈ నెల 22 నుంచి అధికారికంగా కర్ఫ్యూ, లాక్డౌన్ ప్రకటించినా, అంతకుముందు నుంచే కరోనా ప్రభావం కనిపిస్తోందని, ఈ పక్షం రోజుల్లో దాదాపు రూ.4 వేల కోట్లకు పైగా ఆదాయంలో కోతపడి ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో అమ్మకాలు, కొనుగోళ్లు పెద్దఎత్తున పడిపోవడంతో పన్ను రాబడులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జీఎస్టీతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖల ఆదాయం స్తంభించిపోయిందని, మద్యం అమ్మకాలు లేకపోవడం, పెట్రోల్, డీజిల్ విక్రయాలు కూడా తగ్గిపోవడంతో ఆయా శాఖల పరిధిలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య పన్నులు గోవిందా! రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం రోజుకు రూ.150 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అయితే, గత 8 రోజులుగా ఈ శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. కనీసం రోజుకు రూ.10 కోట్ల మేర కూడా ఆదాయం రావడం లేదని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ఒక్క శాఖ పరిధిలోనే గత పక్షం రోజుల్లో రూ.1,200 నుంచి రూ.1,500 కోట్ల వరకు నష్టం వచ్చి ఉంటుందని అంటున్నారు. దీనికి తోడు ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడం, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో జీఎస్టీ బకాయిలకు వన్ టైం సెటిల్మెంట్ ప్రకటించడంతో పరిస్థితి సజావుగా ఉంటే మరికొంత ఆదాయం వచ్చి ఉండేది. ఇక, రాష్ట్రంలోని మద్యం దుకాణాలు, బార్లు పూర్తిగా మూతపడ్డాయి. వచ్చే ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.16 వేల కోట్ల రాబడి వస్తుందన్న ప్రభుత్వ లెక్కల అంచనా ప్రకారమే ఈ ఆరు రోజుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా ఆదాయం తగ్గిపోయింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కూడా రోజుకు సుమారు రూ.20 కోట్ల చొప్పున ఈ 15 రోజుల్లో కొంచెం రూ. 250 కోట్ల వరకు ఆదాయం కోల్పోయింది. రవాణా శాఖ ద్వారా వచ్చే ఆదాయం కూడా రూ.1,000 కోట్ల వరకు నష్టపోయి ఉంటుందని అంచనా. మరోవైపు మైనింగ్, ఇసుక అమ్మకాలు తదితర పన్నేతర రాబడుల ఊసే లేకుండా పోయింది. దీంతో ఏం చేయాలో తమకు అర్థం కావడం లేదని, వచ్చే సంవత్సరం బడ్జెట్ నిర్వహణపై ఈ పరిణామాల ప్రభావం కచ్చితంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికశాఖ ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. కరువులో అధిక మాసం.. రోజువారీ రాబడులు లేకపోయినా కరోనా రూపంలో చేయాల్సిన అనివార్య ఖర్చును సర్దేందుకు ఆర్థిక శాఖ అధికారులు కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా వైద్య రంగంలో చేయాల్సిన ఖర్చులు, పేదలకు బియ్యం పంపిణీ, తెల్ల రేషన్ కార్డుదారులకు రూ.1,500 చొప్పున నగదు పంపిణీ, అవసరమైతే సరుకులు ఇళ్లకు పంపాల్సి రావడం లాంటి ఖర్చులు ఎంత తక్కువ వేసినా రూ.3 వేల కోట్లు దాటుతాయని, వీటికి తోడు ప్రభుత్వ కార్యకలాపాల నిర్వహణకు అయ్యే రోజువారీ ఖర్చులు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కత్తి మీద సాములా మారిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఆర్థిక మూలాలు బలంగా ఉండటం, ఆర్థిక క్రమశిక్షణ లాంటి సానుకూలతలను ఆసరాగా చేసుకుని ప్రజలకు అవసరమయ్యే నిధులను సమకూరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఎన్ని డబ్బులైనా సర్దుబాటు చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
రిజిస్ట్రేషన్ విలువలు పెరగనున్నాయ్!
ఉప్పల్ భగాయత్‌లో ఇటీవల జరిగిన భూముల వేలంలో గజం రూ.79 వేలకు పైగా ధర పలికింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ విలువ రూ.7 వేలు మాత్రమే. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువ కన్నా మార్కెట్ విలువ ఏకంగా 50 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని ఇటీవల అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ఆయన సూచన మేరకు ప్రాంతాలను ఆధారంగా 10 శాతం నుంచి 100 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువల పెంపు ప్రతిపాదనలను అధికారులు పంపారు. వారం రోజుల్లో దీనికి గ్రీన్ సిగ్నల్ పడనుంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఆదాయ పెంపుపై జరిగిన చర్చలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ అంశాన్ని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తెచ్చారు. ప్రజలపై అధిక భారం పడకుండా శాస్త్రీయంగా ప్రతిపాదనలు పంపాలని ఆయన ఆదేశించారు. అలాగే రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ సమక్షంలో నిర్వహించిన బిల్డర్ల సమావేశంలో కూడా రిజిస్ట్రేషన్ విలువల సవరణ అంశం చర్చకు రావడంతో ఈ ప్రక్రియ ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే వారం రోజుల్లోనే రిజిస్ట్రేషన్ విలువలు సవరించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరగని సవరణ... వాస్తవానికి, రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ 2013, ఆగస్టులో జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంతవరకు ఈ విలువలను సవరించలేదు. ఏడేళ్లు కావడంతో భూముల రిజిస్ట్రేషన్ విలువలకు, మార్కెట్ ధరలకు పొంతన లేకుండా పోయింది. ఉప్పల్ భగాయత్‌లో ఇటీవల భూముల వేలం జరగ్గా గజం రూ.79 వేలకు పైగా ధర పలికింది. కానీ, అక్కడ రిజిస్ట్రేషన్ విలువ గజం రూ.7 వేలు మాత్రమే. వ్యవసాయ భూములకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల అయితే ఏకంగా రిజిస్ట్రేషన్ ధర కన్నా మార్కెట్ ధర 50 రెట్లు ఎక్కువకు చేరింది. దీంతో రిజిస్ట్రేషన్ ధరలను సవరించడం అనివార్యంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో, బిల్డర్ల సమావేశంలో రిజిస్ట్రేషన్ విలువల పెంపు అంశం చర్చకు వచ్చింది. వీలున్నంత త్వరగా రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని రెవెన్యూ ఉన్నతాధికారులను బిల్డర్లు కోరారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు సవరణలపై మరోసారి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ప్రాంతాలను ఆధారంగా 10 శాతం నుంచి 100 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువల పెంపు ప్రతిపాదనలను అధికారులు సీఎం వద్దకు పంపారు. ప్రభుత్వం నిర్ధారించిన భూముల రిజిస్ట్రేషన్ విలువను బట్టి సాధారణ సేల్ డీడ్‌పై స్టాంపు డ్యూటీ కింది 6 శాతం ఫీజులు వసూలు చేస్తారు. రిజిస్ట్రేషన్ విలువల సవరణతో ఆ మేరకు స్టాంపు డ్యూటీ కూడా ప్రభుత్వానికి అధికంగా రానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలకు సీఎం అంగీకారం లభిస్తే ఈ వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ విలువల సవరణలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగనున్న నేపథ్యంలో దాదాపు విలువల సవరణ ఖాయమని తెలుస్తోంది. -
పబ్లిక్ డేటాఎంట్రీ.. సూపర్ సక్సెస్
సాక్షి, అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలన దిశగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రవేశ పెట్టిన పబ్లిక్ డేటాఎంట్రీ (పీడీఈ) విధానం పూర్తిస్థాయిలో విజయవంతమైంది. దస్తావేజు లేఖరుల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థిరాస్తి విక్రయ దస్తావేజులను ఎవరికి వారే భర్తీచేసి, ఆన్లైన్ ద్వారా పంపించే పీడీఈ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏకంగా 6,426 ఆన్లైన్ దరఖాస్తులు నమోదు కావడం గమనార్హం. -
ఏం జరుగుతోందిక్కడ?
కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖలో గతంలో డిఐజీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ జాయింట్ ఐజీ జి.సుబ్బారాయుడు జిల్లాకు వచ్చినట్టు ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఈయన రెండు రోజులుగా రాజమహేంద్రవరం, కాకినాడలలో సబ్రిజిస్ట్రార్లతో గోప్యంగా విచారణ జరిపుతున్నట్టు తెలిసింది. గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ విశ్రాంత డీఐజీ లక్ష్మీకుమారి అక్రమాలకు పాల్పడుతున్నారని, నెలవారి మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో ‘స్టాంప్ డ్యూటీకి రూ.5.50 కోట్లుకు గండి’ అంటూ ‘సాక్షి’లో 2017 మే మూడో తేదీన కథనం కూడా ప్రచురితమైంది. గతంలో అందిన ఫిర్యాదు, సాక్షిలో వచ్చిన కథనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలపై జాయింట్ ఐజీ జి. సుబ్బారాయుడు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈయన మంగళవారం రాజమహేంద్రవరం జిల్లా పరి«ధిలో ఉన్న 18 మంది సబ్ రిజిస్ట్రార్లను విచారణ చేపట్టారు. అనంతరం బుధవారం కాకినాడ డీఐజీ కార్యాలయానికి చేరుకుని కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న 14 మంది సబ్‌రిజిస్ట్రార్లతోపాటు, డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆరా తీసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులపై డీఐజీ వేధింపులకు పాల్పడడం, అకారణంగా తిట్టడం వంటివి చేస్తుండడంతో అప్పట్లో చాలా మంది ఉద్యోగులు మూడునుంచి ఆరు నెలల వరకు సెలవుల్లోకి వెళ్లినట్టు ఉద్యోగులు విచారణలో చెప్పారు. అలాగే జిల్లాలో ఒక మెట్ట ప్రాంతానికి చెందిన సబ్‌రిజిస్ట్రార్ ఆర్థిక లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు డీఐజీకి అండగా ఉంటూ అక్రమ లావాదేవీలు జరిపేవారని చెప్పినట్టు తెలిసింది. -
చలానాలకు మంగళం
ఈ-స్టాంపింగ్‌కు శ్రీకారం త్వరలో రిజిస్ట్రేషన్ల రుసుం చెల్లింపు విధానంలో మార్పు అనంతపురం టౌన్ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో నూతన సాంకేతికతకు పెద్దపీట వేస్తున్నారు. అదనపు వసూళ్లు అరికట్టడం, పారదర్శకత పెంచడం, నకిలీలకు అడ్డుకట్ట వేయడం వంటి కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా బ్యాంకుల్లో చెల్లించే చలానాలకు మంగళం పలికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే నగదు చెల్లించే విధానానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యూనిక్ ఐడెంటిటీ, బార్ కోడింగ్ విధానంలో ఈ-స్టాంపింగ్ ద్వారా దస్తావేజులు తయారు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు అనంతపురం జిల్లాకు చేరాయి. ఏటా రూ.కోట్లలో ఆదాయం ఏటా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రూ.కోట్లల్లో ఆదాయం సమకూరుతోంది. 2015-16 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం జిల్లాకు రూ.175 కోట్ల లక్ష్యం పెట్టింది. అనంతపురం డీఆర్ (జిల్లా రిజిస్ట్రార్) లక్ష్యం రూ. 106 కోట్లు కాగా రూ.114 కోట్లు సాధించారు. ఇక హిందూపురం డీఆర్ లక్ష్యం రూ.69 కోట్లు కాగా రూ.64.14 కోట్లు సాధించారు. మొత్తంగా చూసుకుంటే టార్గెట్‌కు మించి రూ. 178.16 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) భారీ లక్ష్యాన్నే ఉంచారు. మొత్తంగా రెండు రిజిస్ట్రార్ జిల్లాల పరిధిలో రూ. రూ.283 కోట్లను టార్గెట్ పెట్టారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు బ్యాంకు చలాన్లను సమర్పించే విధానానికి స్వస్తి పలికి..వాటి స్థానంలో సబ్ రిజిస్ట్రార్ కారాలయాల్లోనే ‘ఈ- స్టాంపింగ్’ ద్వారా చెల్లింపు విధానం త్వరలోనే అమల్లోకి రానుంది. తొలి విడతగా పది బ్యాంకులను గుర్తించినట్లు తెలిసింది. అన్ని కార్యాలయాలకూ పంపాం ఈ- స్టాంపింగ్ విధానం త్వరలోనే అమల్లోకి వస్తుంది. ఉత్తర్వులు అందాయి. అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కూ పంపించాం. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించారు. అమలుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఈ-స్టాంపింగ్ అమల్లోకి వస్తే చలాన్లను బ్యాంకులో చెల్లించే అవసరం ఉండదు. - గిరికుమార్, డీఐజీ, స్టాంప్స్‌అండ్ రిజిస్ట్రేషన్స్ -
ఏపీ ఆదాయం అదుర్స్
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను, పన్నేతర ఆదాయం గత ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలలతో పోల్చితే అదనంగా రూ.3,247 కోట్లు వచ్చింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు మొత్తం రూ.17,708.26 కోట్ల ఆదాయం లభించింది. దాదాపు అన్ని రంగాల్లో ఆదాయం పెరిగింది. అన్ని రంగాలు ఆదాయంలో రెండంకెల వృద్ధి సాధించాయి. విశాఖపట్నం, ఏలూరు, కృష్ణా డివిజన్లలో వ్యాట్ ఆదాయం అత్యధికంగా లభించింది. గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో మద్యం ఆదాయం భారీగా పెరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆదాయం ఆర్జించే శాఖల ప్రగతిపై సమీక్షించారు. విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్ల ఆదాయం అత్యధికంగా వచ్చింది. కృష్ణా, విశాఖ జిల్లాల్లో రవాణా రంగం ద్వారా ఆదాయం అధికంగా లభించింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు వ్యాట్ ద్వారా విశాఖపట్నం డివిజన్లో అత్యధికంగా రూ.3,636 కోట్ల ఆదాయం వచ్చింది. ఏలూరు డివిజన్లో రూ.3,204 కోట్ల ఆదాయం లభించింది. కృష్ణా డివిజన్లో రూ.2,536 కోట్ల ఆదాయం వ్యాట్ ద్వారా లభ్యమైంది. మద్యం ద్వారా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు అత్యధికంగా గుంటూరు జిల్లాలో రూ.538 కోట్లు, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో రూ.535 కోట్ల చొప్పున ఆదాయం వచ్చింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆగస్టు వరకు అత్యధికంగా విశాఖ జిల్లాలో రూ.246 కోట్ల ఆదాయం రాగా గుంటూరు జిల్లాలో రూ.212 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.208 కోట్ల ఆదాయం లభించింది. రవాణా రంగం ద్వారా ఆగస్టు వరకు కృష్ణా జిల్లాలో అత్యధికంగా రూ.139 కోట్లు రాగా విశాఖ జిల్లాలో రూ.108 కోట్ల ఆదాయం వచ్చింది. రంగాల వారీగా ఆదాయ వృద్ధి శాతాలను ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్ల సమీక్షలో వెల్లడించింది. -
రిజిస్ట్రేషన్లకు బ్రేక్
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్ : స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సేవలు ‘మీ సేవ’కు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దస్తావేజు లేఖకులు గురువారం నుంచి చేపట్టిన మూడు రోజుల పెన్‌డౌన్ ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్లపై పడింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 21 సబ్‌రిజిస్ట్రార్ (ఎస్ఆర్) కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రజలు లేక కార్యాలయాలు బోసి పోయాయి. లేఖకులు తమ ప్రైవేట్ కార్యాలయాలు మూసివేయడంతో ఎప్పుడూ కిటకిటలాడుతుండే ఆ ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. పెన్‌డౌన్ కారణంగా తొలిరోజున స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు రూ.50 లక్షల పైగానే ఆదాయానికి బ్రేక్ పడింది. మలి రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న పెన్‌డౌన్‌తో అనంతపురం, హిందూపురం జిల్లా రిజిస్ట్రేషన్ శాఖలకు రూ1.50 కోట్లు పైగానే ఆదాయానికి బ్రేక్‌పడుతుంది. ప్రతి రోజూ జిల్లా పరిధిలోని 21 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 900 నుంచి వెయ్యి వరకు దస్తావేజు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని రెండు ఎస్‌ఆర్‌లు, రూరల్ ఎస్ఆర్ కార్యాలయంలో ప్రతి రోజూ 100 నుంచి 200 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ఆదాయంలో అధిక శాతం ఈ రెండు కార్యాలయాల నుంచే వస్తుంది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ ఆదాయం రోజుకు రూ.15 లక్షలకు పైగా ఉంటుంది. రూరల్‌తో పాటు, జిల్లాలోని రెండు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని అన్ని ఎస్‌ఆర్‌లో రూ.35 లక్షలకు పైగానే రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వస్తుంది. భూములు, స్థలాల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో దస్తావేజు లేఖకులే కీలకంగా ఉన్నారు. ఈ వ్యవస్థ పూర్తిగా వీరి సహకారంతోనే నడుస్తుంది. ప్రజలు తమ భూముల క్రయ విక్రయాలకు సంబంధించిన ప్రక్రియ పూర్తిగా దస్తావేజు లేఖకుల ద్వారానే సిద్ధం చేయిస్తారు. లేఖకులు పెన్‌డౌన్‌కు దిగడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయి రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి బ్రేక్ పడింది. ‘రిజిస్ట్రేషన్’ ప్రైవేటీకరణ.. కడపు కొట్టే చర్య స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ సేవలను ‘మీ సేవ’కు అప్పగించాలన్న ప్రభుత్వ ఆలోచన దస్తావేజు లేఖకుల (డాక్యుమెంట్ రైటర్స) కడుపుకొట్టేలా ఉందని దస్తావేజు లేఖకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జె.ప్రసాద్ అన్నారు. తక్షణమే ఈ ఆలోచనను ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖకులు గురువారం నుంచి మూడు రోజులపాటు పెన్‌డౌన్ చేపట్టారు. ఆందోళనలో భాగంగా అనంతపురంలోని జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దస్తావేజు లేఖకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జె.ప్రసాద్ మాట్లాడుతూ దస్తావేజులు రాసే వృత్తిపై ఆధారపడి వేలాదిమంది జీవిస్తున్నారన్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ల సేవలన్నీ ‘మీ సేవ’కు అప్పగించి తమను వీధినపడేసేందుకు ప్రభుత్వం సిద్ధపడిందని ఆగ్రహించారు. తమ బాధను అర్థం చేసుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సంఘం నాయకులు హరినాథ్‌బాబు, వేణుగోపాల్, డి.కె.సుధాకర్, ప్రభాకర్‌స్వామి, బాబా, జగదీశ్వరప్రసాద్, కుమార్, రాధాకృష్ణ, నటేష్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు వస్తే రిజిస్ట్రేషన్ చేస్తాము దస్తావేజు లేఖకుల పెన్డౌన్కూ, రిజిస్ట్రేషన్లకూ సంబంధం లేదు. దస్తావేజులను ప్రజలు సిద్ధం చేసుకుని వస్తే రిజిస్ట్రేషన్ చేస్తాము. ఎవరినీ వెనక్కి పంపించం. - పెద్దన్న, జిల్లా రిజిస్ట్రార్, అనంతపురం -
వివాహ రిజిస్ట్రేషన్ల కోసం అవస్థలు..తప్పని తిప్పలు
రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది సమ్మె చేస్తుండడంతో గత నెలరోజులుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి పెళ్లి నిమిత్తం వచ్చినవారు ఈ విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. విదేశాల్లో ఉన్నవారు ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకున్నాక భార్యను తీసుకెళ్లేందుకు వీసా కోసం వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలి. శ్రావణమాసంలో శుభముహూర్తాలు ఉండటంతో గత పక్షం రోజుల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయకపోవడంతో చాలామంది ఏంచేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం కమిషనరేట్‌లో ఉన్నతాధికారుల్ని కలిసి సమస్యను ఏకరువు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏ ప్రాంతంవారైనా హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. వాస్తవానికి వధూవరుల్లో ఎవరోఒకరు నివాసముంటున్న ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే వివాహ రిజిస్ట్రేషన్లు చేయాలనే నిబంధన ఉంది. అయితే 2011లో తెలంగాణలో సకల జనుల సమ్మె సందర్భంగా 42 రోజులపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయలేదు. అప్పుడు ప్రవాసాంధ్రులు, ఇతరుల నుంచి వచ్చిన వినతుల మేరకు రాష్ట్రం లోని ఏప్రాంతంవారైనా సీఐజీ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ చేయిం చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం సీమాంధ్రలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడినందున అత్యవసర వివాహ రిజిస్ట్రేషన్ అవసరమైనవారు హైదరాబాద్‌లోని సీఐజీ కార్యాలయానికి వచ్చి వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.