సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్ కంపెనీలో భారీ అవకతవకలు, మోసాలు జరిగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్, ఐజీ వి.రామకృష్ణ వెల్లడించారు. చందాదారులు పాడుకున్న చిట్టీల సొమ్మును డిపాజిట్లుగా సేకరించి ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్, ఇతర కంపెనీలకు మళ్లించినట్లు తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి చెందిన చిట్టీల రికార్డులు, ఖాతాలను సక్రమంగా నిర్వహించడం లేదని, ఆ కంపెనీ వ్యవహారాలన్నీ అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పారు. కనీసం కంపెనీ బ్యాలెన్స్ షీట్లను కూడా అధికారులకు చూపడం లేదన్నారు.
మార్గదర్శితోపాటు 35 కంపెనీల్లో మూడు విడతలుగా తనిఖీలు నిర్వహించి పలు ఉల్లంఘనలను గుర్తించినట్లు తెలిపారు. తనిఖీలకు మార్గదర్శి ఫోర్‌మెన్లు ఏమాత్రం సహకరించలేదన్నారు. ఉల్లంఘనలు, మోసాలపై మార్గదర్శి సహా ఇతర కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. సమాచారం ఇవ్వకుండా సహాయ నిరాకరణ చేసిన మార్గదర్శి కంపెనీలో ప్రత్యేకంగా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌లోని ఆ కంపెనీ హెడ్‌క్వార్టర్‌లోనూ తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం ఆయన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు కమిషనర్ ఉదయభాస్కర్‌తో కలిసి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.
అందుకే మూడు రోజులు..
మార్గదర్శిలో ఏపీలోని 37 బ్రాంచిలకు ఒక్కో వ్యక్తిని ఫోర్‌మెన్‌గా నామినేట్ చేశారు. వారికి ఎటువంటి అధికారాలు, చెక్ పవర్ ఇవ్వలేదు. బ్రాంచిల బ్యాంక్ అకౌంట్ల వివరాలు కూడా వారికి తెలియవు. ఆ బ్రాంచిల సొమ్ము ఎక్కడికి బదిలీ అవుతుందో తెలియదు. బ్రాంచి లావాదేవీలు ఏవీ వారికి తెలియదు. తనిఖీల సమయంలో ఏది అడిగినా మాకు తెలియదు.. హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నాయని సమాధానం చెప్పారు. వారి నుంచి ఎలాంటి సహకారం అందలేదు.
అక్కడ దొరికిన డాక్యుమెంట్ల గురించి అడిగినా చెప్పలేదు. వాటికి సంబంధించిన స్టేట్‌మెంట్లపై సంతకాలు చేసేందుకు చేయడానికి నిరాకరించారు. అందుకే ఆ సంస్థలో తనిఖీలకు మూడు రోజుల సమయం పట్టింది. అవసరమైన సమాచారం, వివరాలు ఇవ్వలేదు. అక్కడ దొరికిన కొంత సమాచారాన్ని మాత్రమే తీసుకోగలిగాం.
వడ్డీ ఆశ చూపి డిపాజిట్లు సేకరించారు
మార్గదర్శిలో వడ్డీ ఆశ చూపించి సెక్యూరిటీ డిపాజిట్లు సేకరించడం పెద్ద ఉల్లంఘనగా గుర్తించాం. డిపాజిట్లు కట్టిన వారికి ఒక రశీదు మాత్రమే ఇస్తున్నారు. ఆ రశీదు గురించి బ్రాంచి ఫోర్‌మెన్‌కి సమాచారం కూడా లేదు. రశీదులో 6–12 నెలలకు నాలుగు శాతం వడ్డీ, 12 అంతకంటె ఎక్కువ నెలలైతే ఐదు శాతం వడ్డీ ఇస్తామని పేర్కొన్నారు. సెక్యూరిటీ సొమ్ముపై వడ్డీ ఎలా చెల్లిస్తారు? అదేమీ బ్యాంకులో వేసిన డిపాజిట్ కాదు. దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పడంలేదు.
సెక్యూరిటీ సొమ్మును ఎక్కడ ఉంచుతున్నారు? ఏ బ్యాంక్ ఖాతాలో ఉంచారు? వాటి లావాదేవీల గురించి ఫోర్‌మెన్‌కి తెలియదు. ఇది చాలా సీరియస్ ఉల్లంఘన. సెక్యూరిటీ రూపంలో డిపాజిట్లు సేకరించడం అనుమానాస్పదం. వడ్డీ ఆశ చూపుతున్నారంటే ఆ సొమ్మును ఎక్కడో పెట్టుబడి పెట్టినట్లు అర్థమవుతోంది. దీన్నిబట్టి ఆ సొమ్మును వేరే దానికి వాడుతున్నారు. ఇది పూర్తిగా మోసం.
వేరే వ్యాపారానికి ఉపయోగించకూడదు
చిట్‌ఫండ్ సొమ్మును వేరే వ్యాపారాలకు ఉపయోగించకూడదు. దీనిపై చూస్తూ ఊరుకోం. కఠినమైన చర్య తీసుకుంటాం. ఆ సెక్యూరిటీ సొమ్మును రాష్ట్రంలోని అన్ని బ్రాంచీల వారీగా ప్రత్యేకంగా డిపాజిట్ చేయాలని ఇప్పటికే మార్గదర్శికి సూచించాం. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాపై ఉంది. అన్నింటికీ ఒకే అకౌంట్ ద్వారా ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నారు. కొత్త చిట్‌ఫండ్‌కి, పాత చిట్‌ఫండ్‌కి, పాట పాడుకున్న వారికి ఒకే అకౌంట్ చూపిస్తున్నారు. ఫోర్‌మెన్ కట్టిన చందాకు మిగతా చందాదారుల మాదిరిగానే సెక్యూరిటీ చూపించి అది వేరే ప్రత్యేక అకౌంట్‌లో ఉంచాలి. కానీ అలా చేయడంలేదు.
మార్గదర్శి ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు
అత్యవసరమైన రికార్డులను కూడా మార్గదర్శి నిర్వహించడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రత్యేకంగా బ్యాలెన్స్ షీట్ ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేయకపోవడం వల్ల ఫండ్స్ ఎక్కడున్నాయి? ఆ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? సక్రమంగా నిర్వహిస్తున్నారో లేదో తెలియడం లేదు. వీటిపై చాలా అనుమానాలున్నాయి. మార్గదర్శి ఆర్థిక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం అవతున్నాయి. ప్రతి చిట్‌కి వివరాలు ఇవ్వాలి. కానీ ఇవ్వడం లేదు. బ్యాలెన్స్ షీట్లు ఇవ్వకపోవడం వల్ల వారి పెట్టుబడుల గురించి తెలియడంలేదు.
ఇది పెద్ద మోసం..
పబ్లిక్ డొమైన్‌లో ఉన్న వివరాల ఆధారంగా మార్గదర్శి సొమ్ములు ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్, ఉషాకిరణ్ మూవీస్ ఇతర కంపెనీల్లో ఉన్నట్లు గుర్తించాం. చిట్‌ఫండ్ సొమ్మును ఇతర కంపెనీలు మళ్లించినట్లు స్పష్టమైంది. ఇది పెద్ద మోసం. ప్రజల సొమ్మును రిస్కులో పెట్టారు. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం బ్యాలెన్స్ షీట్స్, ప్రత్యేక బ్యాంక్ అకౌంట్స్ లేవు. లావాదేవీలు, పెట్టుబడుల వివరాలు లేవు.
ఇవన్నీ సీరియస్ ఉల్లంఘనలు. తనిఖీల సమయంలో మా అధికారులు చాలా ఓపిగ్గా వ్యవహరించారు. సహనంగా సమాచారం సేకరించేందుకు ప్రయత్నించినా వారు సహకరించలేదు. సమాచారం ఇవ్వకపోగా అధికారులు తమను ఇబ్బంది పెట్టారని, డజన్ల సంఖ్యలో అధికారులు వచ్చారని పత్రికల్లో కథనాలు రాశారు. జీఎస్టీ ఉల్లంఘనలు కూడా ఉన్నందున తనిఖీల్లో ఆ అధికారులు కూడా భాగస్వాములయ్యారు. వీటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇప్పటికే మార్గదర్శికి నోటీసులిచ్చినట్లు మా దృష్టికి వచ్చింది.
స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తాం
చిట్‌ఫండ్ కంపెనీలు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టానుసారంగా నిర్వహిస్తుంటే చూస్తూ ఊరుకోం. ప్రజల సొమ్మును రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం. 7 నుంచి 10 రోజుల్లో పూర్తి స్థాయి షోకాజ్ నోటీసు ఇస్తాం. వారిచ్చిన సమాధానాన్ని బట్టి తదుపరి చర్య ఉంటుంది. అకౌంట్స్ నిర్వహణ సక్రమంగా లేదు కాబట్టి మార్గదర్శిలో స్పెషల్ ఆడిట్ నిర్వహిస్తాం.
ఫోరెన్సిక్ తరహాలో జరిగే ఈ ప్రత్యేక ఆడిట్‌లో అన్ని అకౌంట్స్, అన్ని లావాదేవీలు, డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి ఒక్కటీ హైదరాబాద్ హెడ్‌క్వార్టర్‌లో ఉంటుందని మార్గదర్శి ఫోర్‌మెన్స్ చెబుతున్నారు కాబట్టి తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సహకారంతో అక్కడ కూడా తనిఖీలు చేస్తాం. ఇన్ని ఉల్లంఘనలు జరిగిన దృష్ట్యా మార్గదర్శి, ఇతర కంపెనీల్లో కొత్త చిట్స్‌ను అన్ని పరిశీలించాకే అనుమతి ఇస్తాం.
గతంలో ఇతర సంస్థల్లోనూ..
చిట్‌ఫండ్ సంస్థల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చిట్టీలు కట్టేముందు ఆ కంపెనీలకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవాలి. తనిఖీల్లో ఎలాంటి వివక్ష లేదు. ఫిర్యాదులు వచ్చిన అన్ని కంపెనీల్లో తనిఖీలు చేశాం. 2018లోనే కపిల్ చిట్స్‌లో ఈ తరహా తనిఖీలు చేసి చర్యలు తీసుకున్నాం. 2019 నుంచి 2022 వరకు ఆ కంపెనీకి కొత్త చిట్స్‌ను వేసే అవకాశం ఇవ్వలేదు. 2018లోనే మార్గదర్శి సంస్థ బ్యాంకు స్టేట్‌మెంట్స్ చూపించడం లేదని అప్పటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ గుర్తించారు. సెకండ్ అకౌంట్స్ వివరాలు ఇప్పటికీ ఇవ్వలేదు. ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటాం.
Comments
Please login to add a commentAdd a comment