
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అవకతవకలపై సోదాలు నిర్వహించేందుకు వెళ్లిన ఏపీ అధికారుల బృందానికి ఆ సంస్థ యాజమాన్యం పూర్తిగా సహాయ నిరాకరణ చేసింది. చట్ట ప్రకారం సమర్పించాల్సిన పత్రాలు, సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిధుల మళ్లింపు, ఇతర అక్రమాలపై రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష న్లు, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు జరిపిన అనంతరం నిధుల దారి మళ్లింపుపై ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్‌లో ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో మూడు రోజులపాటు సోదాలు చేశారు. సోదాలు శుక్రవారం ముగిశాయి. చిట్‌ఫండ్స్ వ్యవహారాలు, బ్యాంకు లావాదేవీలు, రశీదులు, ష్యూరిటీలు తదితర వివరాలను సమర్పించాలని అధికారుల బృందం ముందుగానే నోటీసు జారీ చేసింది.
అయినప్పటికీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది తమ యాజమాన్య సూచనలు, ఆదేశాలను పాటిస్తూ అధికారుల దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదు. సంస్థ సమాచారాన్ని అధికారులకు తెలపాల్సిన మార్గదర్శి డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్. వెంకటస్వామి కార్యాలయంలో అందుబాటులో లేకుండా పోయా రు. కార్యాలయంలో ఉన్న వైస్ ప్రెసిడెంట్ (అడ్మిన్) రారాజీ తనకు ఏ సమాచారం తెలీదని చెప్పడం విడ్డూరం.
తాము కోరిన సమాచారాన్ని తెలిపేందుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ తమ ముందు హాజరవ్వాలని లేదా తగిన అధికారిని నియోగించాలని దర్యాప్తు బృందం ఆయనకు సూచించింది. మేనేజింగ్ డైరెక్టర్‌ను సంప్రదించి చెబుతామన్న ఆయన ఆ తర్వాత ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్యాంకు లావాదేవీల సమాచారాన్ని కూడా ఇచ్చేందుకు నిరాకరించారు.
సోదాల్లో తాము గుర్తించిన సమాచారం వివరాలను వెల్లడిస్తూ నమోదు చేసిన పంచనామా నివేదిక కాపీని తీసుకుని రశీదు ఇవ్వాలని దర్యాప్తు అధికారులు వైస్ ప్రెసిడెంట్ రారాజీని అడిగారు. తమ లీగల్ అడ్వైజర్‌ను సంప్రదించి అక్నాలడ్జ్‌మెంట్ ఇస్తామని తొలుత చెప్పిన ఆయన, కాసేపటికే అందుకు కూడా నిరాకరించారు. దీంతో పంచనామా నివేదిక ప్రతిని మార్గదర్శి కార్యాలయంలో గోడకు అతికించి దర్యాప్తు బృందం వెనుదిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment