సాక్షి, అమరావతి/హైదరాబాద్: నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లను సేకరించి చిట్టీల సొమ్మును ఇతర సంస్థల్లోకి మళ్లించిన మార్గదర్శి చిట్‌ఫండ్‌కు చెందిన హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ పోలీసుల సహకారంతో ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఐదు బృందాలతో ఈ సోదాలను నిర్వహించారు. ఉదయం నుంచి దాదాపు తొమ్మిది గంటలపాటు తనిఖీలు నిర్వహించి పలు రికార్డులను పరిశీలించారు.
గురువారం కూడా ఇవి కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మార్గదర్శి ముసుగులో ఆర్థిక అక్రమాలు, నిధుల మళ్లింపు లాంటి అవకతవకలకు పాల్పడటంపై ఆరా తీస్తున్నారు. చిట్టీల డబ్బులను అక్రమంగా దారి మళ్లించి ఇతర సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన మార్గదర్శి యాజమాన్యం ఎనిమిదేళ్లుగా ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. తనిఖీల సందర్భంగా చిట్టీదారుల వివరాలు, వారి నుంచి సేకరించిన డిపాజిట్లపై ఆరా తీస్తున్నారు.
పక్కా ఆధారాలతోనే..
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.
ఎంత మంది డిపాజిట్ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల సమాచారం.
రాత్రి వరకు తనిఖీలు..
ఉదయం పదిన్నర గంటలకు మొదలైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎంత మొత్తం డిపాజిట్లు సేకరించారు? ఎక్కడెక్కడ ఎంత మళ్లించారు? చిట్టీలు పాడిన వారికి సకాలంలో చెల్లిస్తున్నారా? డబ్బులు డిపాజిట్ చేయాలని ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? డబ్బు చెల్లిస్తున్న వారికి ఎలాంటి గ్యారంటీ ఇస్తున్నారన్న అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం.
క్షుణ్నంగా దర్యాప్తు.. ప్రత్యేక ఆడిట్
ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది చందారులతో 2,345 చిట్టీలను నిర్వహిస్తున్న మార్గదర్శి ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. ఏపీలో చందాదారుల నుంచి చిట్టీ డబ్బులు వసూలు చేస్తున్నందున కంపెనీ కార్యకలాపాలు, బ్యాలెన్స్ షీట్లు వివరాలు ఇవ్వాల్సిందేని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అడిగిన సమాచారం ఇవ్వకుండా, ఏటా వివరాలు సమర్పించకుండా అక్రమాలకు పాల్పడుతున్న మార్గదర్శిపై మరింత లోతైన దర్యాప్తు చేపట్టనున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సోదాల అనంతరం మార్గదర్శికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు నిపుణులతో మార్గదర్శిలో ప్రత్యేక ఆడిట్ నిర్వహించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. మార్గదర్శి ఒక్కటే కాకుండా చిట్‌ఫండ్ కంపెనీలలో అవకతవకలపై అధికారులు ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేశారు.
మీడియాపై మార్గదర్శి సిబ్బంది దురుసుతనం..
స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సోదాల కోసం వచ్చారనే సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులపై మార్గదర్శి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నామని చెబుతున్నా వినిపించుకోకుండా సంస్థ ఉద్యోగులు, సెక్యూరిటీ సిబ్బంది దుర్భాషలాడుతూ మీడియాను గెంటేసేందుకు ప్రయత్నించారు.
Comments
Please login to add a commentAdd a comment