సాక్షి, అమరావతి: సోదాలు చేస్తున్న కొద్దీ అక్రమాల పుట్టగా బయటపడుతున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంలో అరెస్టులకు తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్న సీఐడీ అధికారులు... నలుగురు బ్రాంచి మేనేజర్లను అరెస్టు చేసి ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇప్పటికే ఏ1గా రామోజీరావును, ఏ2గా చెరుకూరి శైలజను, ఎ3గా బ్రాంచి మేనేజర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సీఐడీ... ఫోర్‌మన్లుగా పిలిచే కామినేని శ్రీనివాసరావు (విశాఖ– సీతమ్మధార బ్రాంచి), సత్తి రవి శంకర్ (రాజమండ్రి), బి.శ్రీనివాసరావు (విజయవాడ– లబ్బీపేట), గొరిజవోలు శివ రామకృష్ణ (గుంటూరు)లను అరెస్టు చేసి ఆయా ప్రాంతాల్లో న్యాయమూర్తుల ఎదుట హాజరుపరిచారు.
వీరిలో కొందరికి 24 వరకూ రిమాండు విధించారు. ఈ సందర్భంగా వెలుగుచూసిన అక్రమాలు అధికారులను సైతం దిగ్భ్రాంతికి గురిచేశాయి. చిట్ సభ్యుల స్థానంలో వేల చిట్లలో తమ పేరే రాసేసుకున్న మార్గదర్శి సంస్థ... నిబంధనల మేరకు దానికి పూర్తి మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు!!. చిట్లలో తనకు వచ్చే కొద్ది పాటి డిస్కౌంట్ల మొత్తాన్నే దాదాపు అన్ని చిట్లలోనూ డూప్లికేట్ చేసి చూపించి... దాన్నే తమ సొమ్ముగా పేర్కొనటంతో, ఇదంతా పచ్చి “గొలుసు’ వ్యవహారంగా మారిపోయింది. గొలుసులో ఏ చిన్న లింకు తెగినా... ఇది సంస్థ దివాలాకు దారితీసే ప్రమాదముంది.
అదే జరిగితే చిట్ సభ్యుల సొమ్ము వాళ్లకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతోపాటు చిట్లలకు వేర్వేరు బ్యాంకు ఖాతాలను నిర్వహించాల్సి ఉండగా... అన్నిటికీ ఒకే ఖాతాను నిర్వహిస్తూ వాటిలో డబ్బును ఇష్టం వచ్చినట్టుగా మళ్లించటం కూడా విస్మయం కలిగిస్తోంది. ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో గ్రూపు సంస్థల్లోకి కోట్లాది రూపాయలు మళ్లిస్తుండటంతో పాటు... హైరిస్క్ ఉండే మ్యూచ్‌వల్ ఫండ్స్‌లోకి కూడా ఈ ఖాతా నుంచి చిట్ సభ్యుల సొమ్మును మళ్లించటం గమనార్హం.
వీటన్నిటితో పాటు... చట్ట విరుద్ధ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థను మూసేసినా డిపాజిట్లు తీసుకోవటం మాత్రం రామోజీరావు ఆపలేదని తాజా సోదాల్లో వెల్లడయింది. చిట్ సభ్యుల నుంచి అక్రమంగా డిపాజిట్లు తీసుకుంటూ... బ్యాంకుల్లో అయితే వాటిపై టీడీఎస్ (ఆదాపు పన్ను) చెల్లించాలని, తమ దగ్గరైతే అలాంటిదేమీ ఉండదని నమ్మబలుకుతుండటం మోసాలకు పరాకాష్టగా అధికారులు చెబుతున్నారు. ఆ అక్రమాల వివరాలివీ...
ఒక్క రూపాయి చెల్లించకుండా...తమపేరిట చిట్టీలు
సాధారణంగా ప్రతి చిట్‌కూ నిర్ణీత చందాదారుల సంఖ్య ఉంటుంది. కొన్ని గ్రూపుల్లో తక్కువ మంది సభ్యులు (టికెట్లు) చేరితే కొన్ని ఖాళీగా ఉండిపోతాయి. ఆ ఖాళీ టికెట్స్‌ను కంపెనీ తీసుకోవాలి. వాటి చందాను కంపెనీ చెల్లించాలి. తరవాత కొత్త చందాదారులు చేరితే ఆ మేరకు టికెట్స్ భర్తీ చేయొచ్చు. చిట్‌ఫండ్ చట్టంలోని 27, 32 సెక్షన్లలో నిర్దేశించిన ఈ నిబంధనలను మార్గదర్శి ఏనాడూ పట్టించుకోలేదు. గరిష్ఠంగా ఒకో గ్రూపులో 50 శాతం వరకూ టికెట్లు కంపెనీవే ఉన్నాయి.
కానీ వాటికోసం మార్గదర్శి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. చిట్లపై తమకు వచ్చే డిస్కౌంట్ల మొత్తాన్ని డూప్లికేట్ చేసి అన్నిచోట్లా రికార్డుల్లో చూపిస్తోంది. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలించి కొన్ని గ్రూపుల్లో చిట్ల సభ్యులు తమ చందా చెల్లించలేకపోతే... ఇక మిగతా వాళ్లకు చిట్లు పాడుకున్నా సరే డబ్బులు రావటం కష్టం. ఎందుకంటే కంపెనీ పేరిట ఉన్న వేటికీ డబ్బులు లేవు కాబట్టి!!.
ఇదిగో ఉదాహరణ.... ఎంసీఎఫ్ గుంటూరు బ్రాంచిలో 45 గ్రూపుల చిట్టీలు వేశారు. వాటిలో మొత్తం 2,040 టికెట్లు (చందాదారులు) ఉన్నాయి. 858 టికెట్లు మార్గదర్శివే. వాటి చందాగా మార్గదర్శి రూ.16.96 కోట్లు చెల్లించాలి. కానీ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని బ్రాంచి మేనేజర్(ఫోర్‌మేన్) అంగీకరించారు. కేవలం రికార్డుల్లో ఎంట్రీలను అటూ ఇటూ జంబ్లింగ్ చేసి చూపిస్తోంది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ మొత్తంగా 2,300 చిట్టీలను నిర్వహిస్తోంది. వాటిలో లక్షమందికిపైగా చందాదారులున్నారు. వాటిలో కొన్ని వేల టికెట్లు మార్గదర్శివే. కానీ సంస్థ యాజమాన్యం తన వాటాగా ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. గొలుసు కట్ట మాదిరిగా ఒక చిట్ సొమ్మును వేరే చోట సర్దుబాటు చేస్తూ... కొందరికి ష్యూరిటీల పేరిట ఆలస్యం చేస్తూ... మరికొందరికి డిపాజిట్ల పేరిట తరవాత ఇస్తామని చెబుతూ రోజులు నెట్టుకొస్తోంది. అదీ కథ.
ఒక్క బ్యాంకు ఖాతా చాలట!!
చిట్‌ఫండ్ సంస్థలు తమ నిర్వహించే ప్రతి చిట్టీకీ సంబంధిత బ్యాంకు ఖాతా వివరాలివ్వాలి. మార్గదర్శి దీన్ని పట్టించుకుంటే ఒట్టు. చిట్టీల ఒప్పందాల్లో బ్యాంకు పేరును చెబుతోంది తప్ప ఖాతాల నంబర్లు, ఇతర వివరాలను ఇవ్వటమే లేదు. ప్రతి చిట్టీకీ ఒక ప్రత్యేక బ్యాంకు ఖాతా ఉండాల్సి ఉండగా... దాన్నీ పాటించటం లేదు. అన్నీ ఒకే బ్యాంకు ఖాతాలో భారీగా పోగేస్తోంది. నిజానికిదో పెద్ద ఆర్థిక కుట్ర.
నిబంధనల ప్రకారం చిట్టీల బ్యాంకు ఖాతాలపై సదరు బ్రాంచి మేనేజర్ (ఫోర్‌మేన్)కు చెక్ పవర్ ఉండాలి. ఆ మేనేజరే అన్నీ చూడాలి. కానీ మార్గదర్శిలో ఏ బ్రాంచి మేనేజర్‌కూ చెక్ పవర్ లేదు.
అంతా హైదరాబాద్ హెడ్ ఆఫీస్ నుంచే నడిపిస్తున్నారు. అక్కడ ఒకరికే చెక్ పవర్ కల్పించడం వెనుక గూడుపుఠాణి ఏమంటే... ఆ ఖాతా నుంచి నిధులు మళ్లించటం ఈజీ కనక. మ్యూచువల్ ఫండ్స్, ఇతర స్టాక్ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడి పెట్టడం నేరమైనా... మార్గదర్శి చేస్తున్నది అదే. తమ గ్రూపు సంస్థ ఉషోదయ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో 88.5శాతం వాటాను మార్గదర్శి చిట్స్ కొనుగోలు చేసింది.
ఇతర సంస్థల్లోకీ అక్రమంగా నిధులు మళ్లించింది. హైరిస్క్ ఉన్న వీటిలో పెట్టుబడులు పెడుతున్నట్లు చందాదారులకు కనీసం తెలియకుండా... దశాబ్దాలుగా రామోజీ సాగిస్తున్న ఆర్థిక దోపిడీ ఇది.
డిపాజిట్లు సేకరించటం నేరమే అయినా...
చిట్టీ పాడిన చందాదారుడికి చిట్టీ మొత్తం చెల్లించినట్టుగా చిట్స్ రిజిస్ట్రార్‌కు చూపిస్తున్న మార్గదర్శి... ఆ చందాదారుడికి పూర్తిగా చెల్లించకపోవటం గమనార్హం. ష్యూరిటీలు సరిగా లేవన్న కారణాలతో పలువురు చందాదారుల నుంచి ఫ్యూచర్ సెక్యూరిటీ పేరిట మిగిలిన కాలానికి చెల్లించాల్సిన చందాను తమ వద్దే ఉంచుకుంటున్నారు. దానికి ఓ రశీదు ఇస్తున్నారు. దానిపై 4–5 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇలా డిపాజిట్లు సేకరించటం చట్టప్రకారం నేరం. రామోజీ మాత్రం అదేమీ పట్టించుకోవటం లేదు. దానికి ఇదిగో ఉదాహరణ...
ఒకే వ్యక్తి నుంచి రూ.కోటికిపైగా అక్రమ డిపాజిట్లు
మార్గదర్శిలో ఓ చందాదారునికి 24 చిట్టీలున్నాయి. ఆయన నుంచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ “రశీదు’ రూపంలో రూ.కోటికుపైగా డిపాజిట్టు వసూలు చేసింది. దీనిపై ఆ సభ్యుడిని విచారించగా విస్మయకర అంశాలు వెల్లడయ్యాయి. టీడీఎస్ మినహాయించుకోకుండా తాము డిపాజిట్లు సేకరిస్తున్నామని మార్గదర్శి చిట్స్ తనకు చెప్పిందని ఆయన తెలిపారు. బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే టీడీఎస్ చెల్లించాలి. అదే మార్గదర్శిలో అయితే టీడీఎస్ అవసరం లేదని చెప్పి ఆయన్ని ఆకర్షించారు. ఇది ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం నేరం.
నిజానికి గతంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట ఎలాంటి అనుమతులూ లేకుండా రూ.2,600 కోట్లు డిపాజిట్లుగా వసూలు చేశారు. దీన్ని నాటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ బయటపెట్టడంతో కేసులు నమోదయ్యాయి. విచిత్రమేంటంటే కేసులు కొనసాగుతుండగా... నేరాన్ని కప్పిపుచుకోవటానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను రామోజీరావు మూసేశారు. ఇలా డిపాజిట్లు సేకరించటం ఐటీ చట్టం ప్రకారం నేరం.
ఎంత సేకరిస్తే అంత మొత్తాన్ని పన్ను రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.ఈ మేరకు ఐటీ కూడా రామోజీకి నోటీసులు జారీ చేసింది. దానిపైనా పలు కేసులు నడుస్తున్నాయి. అలాంటి సమయంలో సంస్థను కుట్రపూరితంగా మూసేయటమే కాక... ఇపుడు చిట్స్ ముసుగులో రకరకాల పేర్లతో డిపాజిట్లు సేకరిస్తుండటం గమనార్హం.
మేనేజర్ల పేరిట మరో పన్నాగం... (బాక్స్)
– తన అక్రమాలకు వారిని బలి చేసే కుతంత్రం
– న్యాయస్థానాన్నీ తప్పుదోవపట్టించేందుకు యత్నం
అవినీతి బాగోతం బయటపడే సమయంలో దానికి సాంకేతిక కారణాలు చూపించి తప్పించుకోవటంలో రామోజీది అందెవేసిన చెయ్యి. అదే తరహాలో చిట్స్ విషయంలోనూ ఈ ఉల్లంఘనలన్నింటినీ తమ బ్రాంచి మేనేజర్లు(ఫోర్‌మెన్) నెత్తిన రుద్దీ తప్పించుకునే దుర్మార్గానికి తెరతీశారు రామోజీ.
కానీ స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు ఈ కేసును శాస్త్రీయంగా అధ్యాయనం చేసి... తగిన ఆధారాలు సేకరించడం ద్వారా రామోజీ ఎత్తును చిత్తు చేశారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలు బయటపడగానే రామోజీరావు తన ఈనాడు పత్రికలో అరపేజీ ప్రకటన ఇచ్చారు.
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు సంబంధించి అన్ని వ్యవహారాలు బ్రాంచి మేనేజర్లే(ఫోర్‌మెన్) మాత్రమే చూస్తారు ...సర్వాధికారాలు వారివేనని అందులో పేర్కొన్నారు. అంతేకాదు తెలంగాణ న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌లో అదే మాట చెప్పారు.
తద్వారా బ్రాంచి కార్యాలయాల్లో అక్రమాలతో తనకు సంబంధం లేదని చేతులు దులిపేసుకునే ప్రయత్నం చేశారు. కానీ స్టాంపులు– రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ విభాగాలు రామోజీరావు కుట్రను సమర్థంగా తిప్పికొట్టాయి. ఎందుకంటే మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి మేనేజర్లు కేవలం నిమిత్త మాత్రులు.
వారికి తమ బ్రాంచిలోని ఖాతాలకు సంబంధించి కనీసం చెక్ పవర్ కూడా లేదు. అంటే వారికి సర్వాధికారాలు ఉన్నాయని రామోజీ ఇచ్చిన ప్రకటనలో గానీ న్యాయస్థానంలో వేసిన పిటిషన్‌లో గానీ చెప్పినవన్నీ అబద్ధాలేనన్నది స్పష్టమైంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో అన్ని అక్రమాలకు రామోజీరావు, ఆయన కోడలు శైలజే పూర్తి బాధ్యులనేది సుస్పష్టం.
తవ్విన కొద్దీ... ‘చీట్స్’
Published Mon, Mar 13 2023 3:04 AM | Last Updated on Mon, Mar 13 2023 3:06 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment