సాక్షి, హైదరాబాద్ : మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఖాతాదారుల హక్కుల పరిరక్షణ, ఆర్థిక భద్రత కోసమే ఆ సంస్థలో అక్రమాలను వెలుగులోకి తెస్తున్నామని, అది తమ బాధ్యత అని ఏపీ సీఐడీ అదనపు డీజీ సంజయ్ స్పష్టం చేశారు. మార్గదర్శి యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లిస్తుండటంతో ఖాతాదారులకు నష్టం కలగకుండా ఇప్పటికే రూ.1,035 కోట్ల విలువైన ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచ్‌వల్ ఫండ్స్ పెట్టుబడులను అటాచ్ చేసినట్టు తెలిపారు. మార్గదర్శి కంపెనీ ఏ కారణంగానైనా మూతపడితే ఖాతాదారులకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీపై ఉంటుందని తెలిపారు.
మార్గదర్శి సంస్థ ప్రతి చట్టాన్ని, నిబంధనను అతిక్రమించిందని, ఇంకా అతిక్రమిస్తూనే ఉందని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 9 బ్రాంచ్‌లలో 23 గ్రూప్ చిట్స్‌ను, వాటికి సంబంధించి రూ. 604 కోట్ల టర్నోవర్ నిలిపివేసినట్టు చెప్పారు. ఇదే తరహాలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని ఇతర బ్రాంచ్‌ల్లోనూ అక్రమాలపై ఆధారాలు లభిస్తే.. వాటిలోని చిట్ గ్రూప్‌ల టర్నోవర్ నిలిచిపోతుందని చెప్పారు. చివరకు మార్గదర్శి పడిపోతుందన్నారు.
సంజయ్ మంగళవారం ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో మూడేళ్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించి, అక్రమాలపై ఆధారాలు సేకరించామన్నారు. ఏపీతోపా టు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని 108 బ్రాంచ్‌లలో కార్యకలాపాలపై ఆరా తీస్తున్న ట్టు తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర ఏజెన్సీలకు కూడా ఈ అక్రమాల సమాచారమిచ్చామని, తెలంగాణ, ఇతర రాష్ట్రాల డీజీపీలకు సమాచారం ఇస్తున్నామన్నారు. ఏపీలో పలు ప్రాంతాల్లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, స్టాంప్స్ అండ్ రిజి్రస్టేషన్స్ శాఖ ఫిర్యాదు మేరకే ఏపీ సీఐడీ కేసు దర్యాప్తు చేస్తోందని తెలిపారు. పూర్తి నిబంధనలు పాటిస్తూనే ఈ కేసులో ఏ–1 రామోజీరావును, ఏ–2 శైలజాకిరణ్‌ను ప్రశ్నించామన్నారు.
వడ్డీ ఆశ చూపి ఖాతాదారులను మభ్యపెడుతున్నారు
మార్గదర్శి అక్రమాలపై ఖాతాదారుల నుంచి ఫి ర్యాదు లేకుండానే కేసు దర్యాప్తు చేస్తున్నారంటూ ఒక సెక్షన్ మీడియా ఆరోపణలు చేస్తోందని, ఖాతాదారులకు వడ్డీని ఆశజూపి ఆ సంస్థ నిబంధన లకు విరుద్ధంగా నిధులను మళ్లిస్తుండటాన్ని తాము వెలుగులోకి తెస్తున్నామన్నారు. ప్రజలు మోసపో యి ఫిర్యాదు చేసేకంటే ముందే తాము వారి సొమ్ము కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఏ బాధితుడి విషయంలో అయినా ఇదే పద్ధతి అని తెలిపారు.
చాక్లెట్ ఇచ్చి బాలికను కిడ్నాప్ చేస్తే.. సమాచారం అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభిస్తారు కానీ, బాధితురాలు ఫిర్యాదు ఇచ్చేవరకు కూర్చోరని.. అదే తరహాలో లక్షల మంది ఖాతాదారుల సొమ్మును కాపాడేందుకు మార్గదర్శిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ అధికారులుగా ప్రజలకు న్యాయం చేస్తుంటే మార్గదర్శిపై కక్షసాధింపు అంటూ ఆ మీడియాలో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు. తమ దర్యాప్తు చట్టానికి లోబడి ఉన్నట్టే.. చిట్‌ఫండ్స్ కంపెనీ నిర్వహణలో రామోజీ సైతం చట్టానికి లోబడి ఉండాలన్నారు.
నిబంధనలున్నా.. వారికి అనుకూలంగా వాడారు
మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ లావాదేవీలు చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారం కాకుండా రామోజీ, శైలజా కిరణ్ వారికి అనుకూలంగా కంపెనీ యాక్ట్ ప్రకారం చూపు తున్నారని దర్యాప్తులో తేలిందన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే.. తమకు ఆ నిబంధనలు వర్తించవన్న తరహాలో సమాధానాలిచ్చారన్నారు. ఖాతాదారుల నుంచి సొమ్ము వసూలుకు చిట్‌ఫండ్స్ చట్టాన్నే వాడుకొంటున్నారని చెప్పారు. ఇదే తరహాలో చీరాలలో రూ. 65 లక్షల డిఫాల్ట్ కేసులో ష్యూరిటీగా ఉన్న వ్యక్తి నుంచి రూ.6 కోట్లు విలువైన ఆస్తిని అటాచ్ చేయించా రని తెలిపారు.
ఇలాంటి ఎన్నో అంశాలు దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయన్నారు. సంస్థలోని అంతర్గత లుకలుకలు బయటపడతాయనే చిట్‌ఫండ్స్ యాక్ట్ ను అమలు చేయడంలేదన్నారు. చిట్ సెటిల్‌మెంట్‌లోనూ నిబంధనలు పాటించడంలేదన్నారు. చిట్ ముగిసిన వారి వివరాలతో, కొన్నింటిలో మానేసిన ఖాతాదారుల పేర్లు వాడి మళ్లీ చిట్‌లు నడుపుతున్నారని తెలిపారు. చిట్ డబ్బు బ్రాంచ్‌లో లేకపోవడంపై ప్రశ్నిస్తే.. మీరెవరు ప్రశ్నించేందుకు అన్న రీతిలో సమాధానాలు ఇస్తున్నారన్నారు. చట్టానికి వారు సహకరించడం లేదని చెప్పారు.
చిట్‌ఫండ్స్ చట్టం అమలు కాకుండా ఏకంగా 26 ఏళ్లు అడ్డుకున్నారు
మర్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థను చిట్‌ఫండ్ యాక్ట్ 1982 మేరకు నడపడంలేదని అన్నారు. చిట్‌ఫండ్స్ సొమ్ముతో వేరే వ్యాపారం చేయకూడదన్నారు. చిట్‌ఫండ్ యాక్ట్ ప్రకారమే బ్యాలెన్స్ షీట్లు ఫైల్ చేయాల్సి ఉన్నా.. కంపెనీ యాక్ట్స్ ప్రకారం నడుచుకుంటున్నామని ఈ కేసులో ఏ–2 శైలజాకిరణ్ అవివేకంతో కూడిన సమాధానాలు చెప్పారని తెలిపారు.
ఒక గ్రూప్ డబ్బు మరో గ్రూప్‌కు వాడొద్దని చట్టం చెబుతున్నా.. మార్గదర్శి బ్రాంచ్‌లన్నింటిలోని డబ్బు అక్రమంగా హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నట్టు అన్ని ఆధారాలు లభించాయని చెప్పారు. చిట్‌ఫండ్ యాక్ట్ రావడానికి ముందే మార్గదర్శి చిట్‌ఫండ్స్ సంస్థ ప్రారంభమైందన్న వింత వాదన తెస్తున్నారన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 1982లో చిట్‌ఫండ్ యాక్ట్ పాస్ చేస్తే.. దానిని రాష్ట్ర ప్రభుత్వాలు చట్టసభల్లో పాస్ చేయాల్సి ఉందన్నారు. కానీ 26 ఏళ్ల తర్వాత 2008లో అమలు చేశారని, ఇన్నేళ్లూ రామోజీరావు పలుకుబడితో అడ్డుకున్నారని వివరించారు.
చదవండి: #MSKPrasad: 'ఐపీఎల్ వల్ల బీసీసీఐకే నష్టం.. ఏపీలో అద్భుత సౌకర్యాలు'
Comments
Please login to add a commentAdd a comment