సాయికుమారి (ఫైల్)
కార్యాలయం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
సోమవారం ఉదయం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఘటన
పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త..అతను కూడా ఈనాడు ఉద్యోగే
పూర్వాపరాలు చెప్పనివ్వకుండా అడ్డుకున్న సంస్థ సిబ్బంది
అబ్దుల్లాపూర్‌మెట్: ఈనాడు దినపత్రిక యాజమాన్యం ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ మహిళా ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడింది. సంస్థలో గత కొంతకాలంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను, అనుభవిస్తున్న మానసిక క్షోభను భర్తతో పంచుకున్నప్పటికీ.. అవి మరింత తీవ్రతరం కావడంతో తనకిక చావే శరణ్యం అనుకుంది. తాను పనిచేస్తున్న ఈనాడు కార్యాలయ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలు, మృతురాలి భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. పెద్దఅంబర్‌పేట మున్సిపల్ పరిధిలోని కుంట్లూర్ రెవెన్యూ గజ్జి స్వామియాదవ్ కాలనీలో నివాసముండే ఎర్రగొల్ల శ్రీనివాస్, సాయికుమారి (34)కి పదేళ్ల క్రితం వివాహం అయ్యింది. శ్రీనివాస్ పదిహేనేళ్లుగా, సాయికుమారి తొమ్మిదేళ్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోని ఈనాడు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఈనాడు కాల్ సెంటర్‌లో పనిచేసే సాయికుమారికి కొంతకాలంగా సంస్థలో ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో తరచూ ఇబ్బంది పడుతుండేది. భర్తకు చెప్పుకుని బాధ పడేది.
ఆదివారం సరదాగా గడిపి..
ఈ క్రమంలోనే భార్యకు మానసిక ధైర్యాన్నిచ్చేందుకు శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి తిప్పాడు. ఇద్దరూ సరదాగా గడిపారు. సోమవారం విధుల్లో భాగంగా రామోజీ ఫిల్మ్‌సిటీకి బయలుదేరిన సాయికుమారిని ఉదయం 6 గంటలకు తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జాతీయ రహదారి వద్ద దిగబెట్టి ఇంటికి వచ్చాడు. అయితే 9 గంటల సమయంలో ఈనాడు హెచ్‌ఆర్ విభాగం నుంచి శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. సాయికుమారి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకి చనిపోయిందని చెప్పడంతో హుటాహుటిన ఫిల్మ్‌సిటీకి వెళ్లాడు. అప్పటికే తలకు తీవ్ర గాయమైన సాయికుమారి మృతి చెందింది. శ్రీనివాస్ ఇచ్చింన ఫిర్యాదు మేరకు అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురికీ తరలించారు.
ఈనాడు సిబ్బంది అత్యుత్సాహం
ఈనాడు సంస్థ ఒత్తిళ్ల కారణంగా తన భార్య ఆత్మహత్యకు పాల్పడిందని శ్రీనివాస్ పోలీసులకు ఇచ్చింన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పీఎస్‌లో ఉన్న శ్రీనివాస్ నుంచి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. అయితే అతని చుట్టూ కంచెలా ఉన్న ఈనాడు సిబ్బంది అడ్డుకున్నారు. తన భార్య మృతికి దారితీసిన పరిస్థితులను మీడియాకు వివరించేందుకు సిద్ధమవుతున్న శ్రీనివాస్‌ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment