ఈనాడుకు బాబు గిఫ్ట్‌ | CM Chandrababu Gift For Eenadu On Margadarsi Chitfunds | Sakshi
Sakshi News home page

ఈనాడుకు బాబు గిఫ్ట్‌

Published Fri, Aug 30 2024 3:02 AM | Last Updated on Fri, Aug 30 2024 3:02 AM

CM Chandrababu Gift For Eenadu On Margadarsi Chitfunds

‘మార్గదర్శి’ పై అప్పీళ్లు ఉపసంహరించుకున్న సీఐడీ 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలు, నిధుల మళ్లింపుపై గతంలో పక్కాగా సాక్ష్యాలు సేకరించిన సీఐడీ

చందాదారుల ప్రయోజనాల పరిరక్షణకు రూ.1,050 కోట్ల ఆస్తుల జప్తు

జప్తు ఖరారు కోసం నాడు న్యాయ పోరాటం చేసిన దర్యాప్తు సంస్థ

చార్జిషీట్ల రూపంలో ఆధారాలన్నీ ప్రత్యేక కోర్టులకు సమర్పణ

ప్రత్యేక కోర్టుల ఉత్తర్వులపై నాడు హైకోర్టులో అప్పీళ్లు

మార్గదర్శి, శైలజా కిరణ్‌ల వాదనలతో విభేదించిన సీఐడీ

ఇప్పుడు ప్రభుత్వం మారడంతో పరిస్థితులు తారుమారు

మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ పరిస్థితి రాకుండా అడ్డుపడ్డ చంద్రబాబు

అందుకే సీఐడీ ద్వారా హైకోర్టులో అప్పీళ్ల ఉపసంహరణ

ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి నివేదించిన సీఐడీ

పరస్పర ఆర్థిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికి గానూ బాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. మార్గదర్శి విషయంలో అక్రమాలు జరిగినట్లు సీఐడీ గతంలో పక్కా ఆధారాలతో చార్జిషిట్లు వేసింది.

దీంతో తేడా వస్తే తమ ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు మార్గదర్శి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి.  

సాక్షి, అమరావతి: ‘కుమ్మక్కు బంధం’ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతటి విఘాతమో మరోసారి తేటతెల్లమైంది. పరస్పర ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఎలా పణంగా పెడతారో సీఎం చంద్రబాబు, ఈనాడు రామోజీ  కుటుంబం మరోసారి రుజువు చేసింది. వైఎస్సార్‌సీపీ సర్కారుపై ఐదేళ్ల పాటు దుష్ప్రచారం చేసిన రామోజీ కుటుంబానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కృతజ్ఞతాపూర్వకంగా ‘కానుక’ సమర్పించింది. 

అదీ రాష్ట్రంలో వేలాదిమంది మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారుల ప్రయోజనాలను కాలరాసి మరీ!! మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు ఆంధ్రప్రదేశ్‌ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 5 వర్తించదంటూ ప్రత్యేక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను, అలాగే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తుల జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలు చేసిన అప్పీళ్లను సీఐడీ ద్వారా ఉపసంహరింప చేశారు. 

ఈమేరకు సీఐడీ అదనపు డీజీ గురువారం హైకోర్టుకు నివేదించారు. దీంతో అప్పీళ్ల ఉపసంహరణకు హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ వ్యాజ్యాలు తాజాగా జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ముందు విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లక్ష్మీనారాయణ స్పందిస్తూ.. సీఐడీ కేసులన్నింటినీ తనకు అప్పగిస్తూ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ (ఈ అప్పీళ్లలో శైలజా కిరణ్‌ తరఫున వాదనలు వినిపించారు) ప్రొసీడింగ్స్‌ ఇచ్చారని నివేదించారు. 

అందువల్ల సీఐడీ తరఫున తాను హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ అప్పీళ్లను ఉపసంహరించుకోవాలంటూ సీఐడీ అదనపు డీజీ లేఖ రాశారన్నారు. దీంతో తాము తమ అప్పీళ్లను ఉపసంహరించుకుంటున్నట్లు అదనపు డీజీ రాసిన లేఖను కోర్టుకు సమర్పించారు. ఆ లేఖను పరిశీలించిన న్యాయస్థానం పీపీ లక్ష్మీనారాయణ చెప్పిన వివరాలను పరిగణనలోకి తీసుకుని నమోదు చేసింది. అప్పీళ్లను ఉపసంహరించుకున్న నేపథ్యంలో వాటిని పరిష్కరిస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్‌ జ్యోతిర్మయి అనంతరం ఉత్తర్వులు జారీ చేశారు. 

చిట్స్‌ రిజిస్ట్రార్ల ఫిర్యాదుతో రంగంలోకి సీఐడీ.. 
మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలపై చిట్స్‌ అసిస్టెంట్‌ రిజిష్ట్రార్లు గతంలో సీఐడీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా రామోజీరావు, శైలజా కిరణ్‌లతో పాటు మొత్తం 15 మందిపై ఐపీసీ, డిపాజిటర్ల పరిరక్షణ చట్టం, చిట్‌ఫండ్‌ చట్ట నిబంధనల కింద సీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్స్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. 

పలువురు ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. వారి వాంగ్మూలాలను రికార్డ్‌ చేసింది. గడువు ముగిసినా, ష్యూరిటీలు సమర్పించిన తరువాత కూడా బ్రాంచ్‌ మేనేజర్లు సకాలంలో చెల్లింపులు చేయలేదని పలువురు చందాదారులు దర్యాప్తు సంస్థకు వాంగ్మూలం ఇచ్చారు. సాకులు చెబుతూ ష్యూరిటీలను తిరస్కరించడం, అదనపు ష్యూరిటీలు సమర్పించాలని కోరడంతో పాటు ప్రైజ్‌ మొత్తాలను చెల్లించకుండా మార్గదర్శి ఇబ్బంది పెడుతోందంటూ చందాదారులు స్పష్టంగా ఫిర్యాదు చేశారు.  


పకడ్బందీ ఆధారాలతో చార్జిషీట్లు... 
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అవకతవకలపై పకడ్బందీగా అన్ని ఆధారాలను సేకరించిన సీఐడీ ప్రత్యేక కోర్టుల్లో చార్జిషిట్లు దాఖలు చేసింది. ఇదే సమయంలో ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే నిమిత్తం చట్ట ప్రకారం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన దాదాపు రూ.1,050 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఖరారు చేయాలని కోరుతూ సీఐడీ పిటిషన్లు దాఖలు చేసింది.  అయితే సీఐడీ దాఖలు చేసిన చార్జిషిట్‌లను పరిశీలించిన గుంటూరు, విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టులు వాటిని రిటర్న్‌ చేశాయి. ఆస్తుల జప్తు ఖరారు కోసం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గుంటూరు కోర్టు కొట్టివేసింది. 

మార్గదర్శి, శైలజా కిరణ్‌ వాదనలను గతంలో తీవ్రంగా వ్యతిరేకించిన సీఐడీ
ఈ అప్పీళ్లపై హైకోర్టు గత ఏడాది డిసెంబర్‌ నుంచి విచారణ జరుపుతూ వస్తోంది. ఈ అప్పీళ్ల విచారణార్హతపై రామోజీ, శైలజా కిరణ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తరఫున నాడు దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు అభ్యంతరం చెప్పారు. మొదట విచారణార్హతపై తేల్చాలని పట్టుబట్టారు. దీనిపై సీఐడీ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమ అప్పీళ్ల విచారణార్హతపై అభ్యంతరం ఉంటే ఆ విషయాన్ని అనుబంధ పిటిషన్‌ లేదా కౌంటర్‌ రూపంలో తెలియచేయాలే తప్ప మౌఖికంగా కాదంది. 

అనుబంధ పిటిషన్‌ లేదా కౌంటర్‌ దాఖలు చేసినప్పుడే అందుకు తగిన సమాధానం ఇచ్చేందుకు తమ అవకాశం ఉంటుందని తెలిపింది. దీంతో మార్గదర్శి, శైలజా కిరణ్‌ తదితరులు ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే సమయంలో జప్తు ఆస్తుల విషయంలో యథాతథస్థితి (స్టేటస్‌ కో) కొనసాగిస్తామని మార్గదర్శి తరఫున న్యాయవాది పోసాని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఆ మేర మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అటు తరువాత ఈ అప్పీళ్లపై ఇప్పటిదాకా  విచారణ జరుగుతూ వస్తోంది.

అప్పీళ్ల ఉపసంహరణతో జరిగేదిది..
తాజాగా అప్పీళ్లను సీఐడీ ఉపసంహరించుకోవడంతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు భారీ ఊరట లభించినట్లయింది. తద్వారా నామమాత్రమైన ఐపీసీ సెక్షన్ల కింద విచారణకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల మార్గదర్శి యాజమాన్యానికి వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిగి మార్గదర్శి డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 5 కింద ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలే పరిస్థితి ఉంటే దాని యాజమాన్యానికి, మేనేజర్లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా, అలాగే ఆ సంస్థకు రూ 5 లక్షల జరిమానా విధించే పరిస్థితి ఉండేది. 

ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మార్గదర్శి, దాని యాజమాన్యం బయటపడినట్లే. అదే రీతిలో రూ.1050 కోట్ల ఆస్తుల జప్తు కూడా ఉండదు. ఎందుకంటే ఆ జప్తును ఖరారు చేసేందుకు గుంటూరు కోర్టు తిరస్కరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. ఇలా ఈ మొత్తం కేసును నీరుగార్చి దాన్ని కొట్టేసేందుకు సీఐడీ ఆస్కారం కలిగించింది.

భారీ గురు దక్షిణ..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఈనాడు పత్రిక ఐదేళ్లపాటు సాగించిన విష ప్రచారానికిగానూ చంద్రబాబు ప్రభుత్వం నుంచి భారీ ప్రతిఫలాన్ని పొందింది. ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలను, కీలక ప్రాజెక్టులను అటకెక్కించేసిన సీఎం చంద్రబాబు.. రామోజీ కుటుంబం కోసం మాత్రం రంగంలోకి దిగారు. సీఐడీ దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపి కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తే మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ మాదిరిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కూడా ఇరుక్కుపోవడం ఖాయమని పసిగట్టి ఆ పరిస్థితి తలెత్తకుండా సీఐడీని రంగంలోకి దించి అనుకున్న విధంగా పనికానిచ్చేశారు. 

అంతేకాదు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఆర్ధిక మోసాలపై ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్న కేసులను క్రమంగా ఎత్తివేసే దిశగా పావులు కదులుతున్నాయి. మార్గదర్శి విషయంలో రామోజీ కుటుంబం అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ గతంలో పూర్తి ఆధారాలతో సీఐడీ కేసు నమోదు చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బాధితులు సంఘం ఏర్పాటు చేసుకుని మరీ ఆందోళనలను నిర్వహిస్తున్నారు. 

తెలంగాణతో పాటుఇతర రాష్ట్రాల్లోనూ బాధితులున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ మోసాలు నాలుగు రాష్ట్రాలకు విస్తరించడం, మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందున ఈ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దృష్టి సారించాలని సీఐడీ అధికారులు గతంలో కోరడం గమనార్హం. 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి రూ.4,600 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి చట్టపరంగా పీకల్లోతుల్లో కూరుకుపోయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ యాజమాన్యం ఇప్పుడు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహారంలో ఇరుక్కోకుండా జాగ్రత్త పడుతోంది. తేడా వస్తే దాదాపు రూ.1,050 కోట్ల ఆస్తులు జప్తు అయ్యే అవకాశం ఉండటంతో బయట పడేందుకు వ్యూహాలను అమలు చేస్తోంది. 

ఇందుకు చంద్రబాబు సర్కారు, కీలక దర్యాప్తు సంస్థలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. అందులో భాగంగా రామోజీరావు (ఇటీవల మృతి చెందారు) డైరెక్టర్‌గా, ఆయన కోడలు శైలజా కిరణ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఉన్న మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై ఆర్ధిక అవకతవకలు, తప్పుడు రికార్డుల నిర్వహణ, నిధుల మళ్లింపు, ఇతర చట్ట ఉల్లంఘనలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్న ఆరోపణలను నీరుగారుస్తోంది.

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలలో కొన్ని..
సకాలంలో చందాదారులకు చెల్లింపులు చేయకపోవడం, చెల్లించాల్సిన ప్రైజ్‌ మొత్తాన్ని డిపాజిట్‌గా తమ వద్దే అట్టిపెట్టుకోవడం, తక్కువ వడ్డీ చెల్లించడం, చెల్లింపులు ఎగవేయడం. చందాదారులకు చెల్లించాల్సిన ప్రైజ్‌మనీని చెల్లించకుండా వడ్డీ చెల్లింపు పేరుతో తమ వద్దే అట్టిపెట్టుకోవడానికి ప్రధాన కారణం చెల్లింపులు చేయడానికి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వద్ద సరిపడినంత డబ్బు లేకపోవడమే. 

తమ వద్ద డబ్బు లేదు కాబట్టి చందాదారులకు చెల్లించాల్సిన డబ్బునే భవిష్యత్తులో చెల్లించాల్సిన చందాగా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ తమ వద్దే అట్టిపెట్టుకుంది. అలా అట్టిపెట్టుకున్న మొత్తాలను రొటేషన్‌ చేస్తూ వస్తోంది. చట్ట నిబంధనల ప్రకారం చందాదారుల డబ్బును ప్రత్యేక ఖాతాల్లో ఉంచడం తప్పనిసరి. అయితే అలా ఉంచకుండా దానిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. ఈ ఉల్లంఘనలన్నీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 5 కిందకే వస్తాయి.  

నాడు సీఐడీ అభ్యంతరం.. అప్పీళ్లు దాఖలు
ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా, ప్రైజ్‌ మొత్తాల ఎగవేత జరిగినట్లు కనిపించడం లేదంటూ గుంటూరు, విశాఖపట్నం కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో సీఐడీ అభ్యంతరం తెలిపింది. ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ గత ఏడాది డిసెంబర్‌లో హైకోర్టులో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేసింది. మరికొన్ని అప్పీళ్లను ఈ ఏడాది జనవరిలో దాఖలు చేసింది. 

మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలు, ఆర్ధిక అవకతవకలు, చట్ట ఉల్లంఘనలపై పూర్తిస్థాయి ఆధారాలను చార్జిషీట్‌ రూపంలో ప్రత్యేక కోర్టుల ముందు ఉంచినా, వాటిని పట్టించుకోకపోవడం ఎంత మాత్రం సరికాదని సీఐడీ తన అప్పీళ్లలో పేర్కొంది. స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదనలు వినకుండానే అలా నిర్ధారించడం చట్ట విరుద్ధమంది. చార్జిషిట్‌లోని అంశాలపై మినీ ట్రయల్‌ నిర్వహించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాన్ని తన అప్పీళ్లలో హైకోర్టుకు వివరించింది. 

డిపాజిటర్ల పరిరక్షణ చట్టంలోని సెక్షన్‌ 5కు ప్రత్యేక కోర్టులు భాష్యం చెప్పాయని, అలా చెప్పి ఉండకూడదంది. చార్జిషిట్‌లను రిటర్న్‌ చేస్తూ ప్రత్యేక కోర్టులు జారీ చేసిన ఉత్తర్వులను, జప్తును ఖరారు చేసేందుకు నిరాకరిస్తూ గుంటూరు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement