AP: మన కేసులు ఎత్తేద్దాం! | Chandrababu conspiracy to Remove of cases all against him | Sakshi
Sakshi News home page

AP: మన కేసులు ఎత్తేద్దాం!

Published Thu, Aug 15 2024 5:02 AM | Last Updated on Thu, Aug 15 2024 12:38 PM

Chandrababu conspiracy to Remove of cases all against him

తనపై ఉన్న కేసులన్నీ నీరుగార్చేందుకు బాబు కుతంత్రం

ముందుగా దర్యాప్తును బలహీనపరిచే ఎత్తుగడ

అనంతరం కేసుల విచారణ ఉపసంహరణకు స్కెచ్‌ 

మంత్రివర్గం ద్వారా ‘మమ’ అనిపించే ప్రణాళిక 

దర్యాప్తు అధికారులకు రోజూ ‘ప్రత్యేక క్లాసులు’ 

డీజీపీ, సీఐడీ చీఫ్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ 

సాక్ష్యాలు తారుమారు చేయాలంటూ ఒత్తిడి 

డిఫెన్స్‌ న్యాయవాదులకు సహకరించాలని ఆదేశం 

2 నెలల్లోగా పని పూర్తి కావాలని నిర్దేశం 

అధికారంలోకి రాగానే ప్రారంభమైన ఆపరేషన్‌ 

పలువురిపై లుక్‌ అవుట్‌ నోటీసుల ఉపసంహరణ  

ఆ కేసులను సీబీఐకి అప్పగించాలంటున్న నిపుణులు  

ఓ ఘరానా దొంగ భారీ దోపిడీకి పాల్పడ్డాడు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తదనంతర పరిణామాల్లో ఆ దొంగే.. పోలీసుగా ఉద్యోగంలోకి వచ్చాడు! మరి దోపిడీపై అప్పటికే నమోదైన కేసు విచారణ ఏమవుతుంది? సహజంగానే కేసును ఆ పోలీసు మూసివేస్తాడు! సక్రమంగా దర్యాప్తు జరిగితే తానే దొంగ అన్నది రుజువై శిక్ష పడుతుంది కాబట్టి! ఈ ఉదాహరణ ఊహాజనితమే కావచ్చు. కానీ రాష్ట్రంలో అదే వాస్తవ రూపం దాల్చి కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. 2014–19 మధ్య ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు యథేచ్ఛగా సాగించిన అవినీతి దందాపై సీఐడీ ఇప్పటికే కేసులు నమోదు చేయగా.. ప్రస్తుతం సీఎంగా ఉన్న అదే చంద్రబాబు ఆ కేసులను నీరుగార్చే కుతంత్రానికి తెర తీశారు!
– సాక్షి, అమరావతి 

పక్కా ఆధారాలతోనే కేసులు నమోదు..
నాటి టీడీపీ ప్రభుత్వంలో అవినీతి దందాపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు విభాగం (సిట్‌) చంద్రబాబుపై పలు కేసులు నమోదు చేసింది. రూ.241 కోట్లు కొల్లగొట్టిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో ఆయన్ను అరెస్ట్‌ చేయడంతో 52 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఇక అమరావతిలో దాదాపు రూ.5 వేల కోట్ల అసైన్డ్, ప్రభుత్వ భూముల దోపిడీ.. రూ.2 వేల కోట్ల మేర ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు.. రూ.333 కోట్లు కొల్లగొట్టిన ఫైబర్‌నెట్‌ స్కామ్‌పై సిట్‌ పూర్తి ఆధారాలతో కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో విచారణ ప్రక్రియ దిశగా చర్యలు చేపట్టింది. 

2015లో ప్రవేశపెట్టిన మద్యం విధానం ద్వారా టీడీపీ లిక్కర్‌ సిండికేట్‌ ఏటా రూ.2.50 లక్షల కోట్లు చొప్పున కొల్లగొట్టడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల పన్ను రాబడికి గండి కొట్టింది. ఇక ఉచిత ఇసుక ముసుగులో రూ.10 వేల కోట్ల దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఈ కేసుల్లో సీఐడీ గతంలోనే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. 

ఆయా కేసుల్లో ప్రధాన నిందితులుగా చంద్రబాబు, లోకేశ్‌తోపాటు పి.నారాయణ, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, చింతమనేని ప్రభాకర్, పీతల సుజాత, లింగమనేని రమేష్‌ కుటుంబ సభ్యులు, చంద్రబాబు బినామీలు, సన్నిహితులను నిందితులుగా చేర్చి సీఐడీ కేసులు నమోదు చేసింది. 

అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తనపై గతంలో సీఐడీ నమోదు చేసిన కేసుల దర్యాప్తును తొలుత నీరుగార్చి అనంతరం విచారణను ఉపసంహరిస్తూ మంత్రి మండలి ద్వారా నిర్ణయం తీసుకోవాలనే పన్నాగాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారు. అందుకోసం ఏకంగా పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ డీజీపీ, సీఐడీ చీఫ్‌ల ద్వారా కుట్ర కథను నడిపిస్తున్నారు. 

అటకెక్కిన దర్యాప్తు
జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే చంద్రబాబు తనపై ఉన్న సీఐడీ కేసులను నీరు గార్చే కుట్రకు తెర తీశారు. ముఖ్యమంత్రిగా ఆయన జూన్‌ 12న ప్రమాణ స్వీకారం చేయగా ఫలితాలు వెలువడిన రోజు నుంచే సీఐడీ కేసులను తొక్కిపెట్టే ఆపరేషన్‌ చేపట్టారు. చంద్రబాబుపై అవినీతి కేసులను విచారిస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కార్యాలయాన్ని పోలీసులు జప్తు చేశారు. తద్వారా ఆ కేసుల దర్యాప్తును అటకెక్కిస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు.

సిట్‌ కేసులు క్లోజ్‌ చేయాలనే షరతులతో 
డీజీపీ, సీఐడీ చీఫ్‌లకు పోస్టింగ్‌లు
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తనపై సిట్‌ కేసులను పక్కదారి పట్టించడమే లక్ష్యంగా పావులు కదిపారు. అందుకోసం పోలీసు వ్యవస్థను పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసేందుకు తెగించారు. ప్రధానంగా డీజీపీ, సీఐడీ చీఫ్‌ల నియామకాన్ని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. తనపై ‘సిట్‌’ గతంలో నమోదు చేసిన స్కిల్‌ స్కామ్, అసైన్డ్‌ భూముల కుంభకోణం, ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ కుంభకోణం, ఫైబర్‌ నెట్‌ కేసులను నీరు గార్చేసి అనంతరం విచారణను పూర్తిగా నిలిపివేయాలని షరతు విధించారు. దీనికి లోబడే డీజీపీ, సీఐడీ అదనపు డీజీలకు పోస్టింగ్‌లు ఇచ్చినట్లు పోలీసువర్గాలు అప్పట్లోనే వ్యాఖ్యానించాయి. తదనంతర పరిణామాలు అదే విషయాన్ని రుజువు చేస్తున్నాయి.

నిందితులపై లుక్‌ అవుట్‌ నోటీసుల ఉపసంహరణ!
2014–19 మధ్య చంద్రబాబు అవినీతి కార్యకలాపాల్లో పలువురు షెల్‌ కంపెనీల ప్రతినిధులు, ప్రైవేటు వ్యక్తులు కీలక పాత్రధారులుగా వ్యవహరించారు. సీమెన్స్‌కు తెలియకుండా ఆ కంపెనీ పేరుతో స్కిక్ల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు ముసుగులో నిధులు కొల్లగొట్టడం.. అసైన్డ్‌ భూములను కాజేసేందుకు షెల్‌ కంపెనీల ద్వారా నిధుల తరలింపు.. ఇన్నర్‌రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ అక్రమాల్లో షెల్‌ కంపెనీల ప్రతినిధుల పాత్ర... ఫైబర్‌నెట్‌ స్కామ్‌ ద్వారా నిధుల అక్రమ తరలింపులో చంద్రబాబు సన్నిహితులు, బినామీల బాగోతం.. ఇలా ఈ కుంభకోణాల్లో కీలకంగా వ్యవహరించిన వారిని సీఐడీ అధికారులు గతంలోనే గుర్తించారు. 

నిందితులు విదేశాలకు పరారు కాకుండా లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ కేసులను నీరుగార్చేందుకు ముందుగా లుక్‌ అవుట్‌ నోటీసులను లక్ష్యంగా చేసుకున్నారు. చంద్రబాబుపై నమో­దైన కేసులను విచారిస్తున్న దర్యాప్తు అధికారులను డీజీపీ, సీఐడీ అదనపు డీజీ తమ కార్యాలయానికి పిలిపించారు. ఆ కేసుల్లో జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసులను ఉపసంహరించాలని దర్యాప్తు అధికారులను ఆదేశించారు. అంటే ఆ కేసుల దర్యాప్తును ఇక పట్టించుకోవద్దని స్పష్టం చేశారు. అందులో మొదటి అడుగుగా ఆ కేసుల్లో కొందరు నిందితులపై జారీ చేసిన లుక్‌ అవుట్‌ నోటీసులను ఉపసంహరింపజేశారు.

నీరుగార్చుదాం... ఉపసంహరిద్దాం
ఇదీ చంద్రబాబు పన్నాగం
చంద్రబాబుపై అవినీతి కేసుల్లో విచారణ ప్రక్రియను పూర్తిగా ఉపసంహరించే దిశగా  కూటమి ప్రభుత్వం పథకం ప్రకారం వ్యవహరిస్తోంది. ఆ కేసుల్లో సిట్‌ అధికారులు ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిషీట్లను కూడా దాఖలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చంద్రబాబు పూర్తిస్థాయిలో కుతంత్రానికి తెరతీశారు. 

ముందుగా ఆ కేసుల్లో సీఐడీ వాదన వీగిపోవాలి..! విచారణ ప్రక్రియ సందర్భంగా సీఐడీ న్యాయవాదులు చేతులెత్తేయాలి...! న్యాయస్థానం లేవనెత్తే ప్రశ్నలకు దర్యాప్తు అధికారులు ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పకుండా ఉండిపోవాలి...! అవసరమైతే న్యాయస్థానం ఆగ్రహానికి కూడా గురి కావాలి...! కేసుల విచారణలో డిఫెన్స్‌ న్యాయవాదుల వాదనకు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు ఏమాత్రం ఎదురు చెప్పకూడదు...! కేసుల విచారణ ప్రక్రియ సందర్భంగా అన్ని  పరిణామాలు సీఐడీకి వ్యతిరేకంగా సాగాలనే లక్ష్యంతో వ్యవహరిస్తున్నారు. 

ఇది మొదటి వ్యూహం కాగా అదే అదనుగా చంద్రబాబుపై నమోదైన కేసులను ఉపసంహరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నది చంద్రబాబు రెండో వ్యూహం. సీఐడీ అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, ఆ కేసులను ఉపసంహరించుకోవడమే సరైన చర్యని న్యాయ శాఖ అభిప్రాయపడినట్టుగా ఓ నోట్‌ తయారు చేయించి అనంతరం ఈమేరకు రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ఆమోద ముద్ర వేయించుకోవాలన్నది చంద్రబాబు అంతిమ లక్ష్యం. 

ఆ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసి కేసులను పూర్తిగా మూసివేయడం ద్వారా తన అవినీతి దందాకు ప్రభుత్వ పరంగా రక్షణ కల్పించాలని చంద్రబాబు పకడ్బందీగా కుట్రను వేగంగా అమలు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement