
- ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకునే రూ. 15 వేల కోట్లు రుణమే
- ఏడీబీ, హడ్కో సహా రుణాలన్నీ రాష్ట్రమే భరించాలి
- కేంద్ర సాయం రూ. 1500 కోట్లు మాత్రమేనన్న కేంద్ర మంత్రి
- పార్లమెంట్‌లో ఎంపీ గురుమూర్తి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం
- అమరావతి కోసం గతంలో చంద్రబాబు రూ.5,335 కోట్ల అప్పు
- ఏడాదికి రూ.1,573 కోట్లు వడ్డీలు కడుతున్న ప్రభుత్వం
- ఇప్పటికే మళ్లీ అమరావతి పేరుతో మరో రూ. 37 వేల కోట్ల రుణం
- వైఎస్సార్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి
తాడేపల్లి: అమరావతి రాజధాని నిర్మాణం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నవి పచ్చి అబద్దాలేననే విషయం బట్టబయలు అయ్యిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి కోసం కేంద్రం రూ.15వేల కోట్లు ప్రపంచబ్యాంక్ ద్వారా ఇప్పిస్తోందని, ఇది పూర్తి గ్రాంట్ అంటూ ఇప్పటి వరకు చేసిన వాదనలు పూర్తి అవాస్తవాలేనని తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా అమరావతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన అంశాలతో ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు చేస్తున్న బుకాయింపులన్నీ అసత్యాలేనని బయటపడిందన్నారు కారుమూరి వెంకటరెడ్డి.
ఇంకా ఆయన ఏమన్నారంటే...
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పించేది గ్రాంట్ మాత్రమేనని, దీనిని అప్పుగా తిరిగే కట్టాల్సిన అవసరం లేదంటూ ఇప్పటి వరకు రాష్ట్రప్రభుత్వం బుకాయిస్తూ వచ్చింది. తాజాగా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రి దీనిపై ఇచ్చిన స్పష్టతతో ఇదంతా అబద్ధమేనని తేలిపోయింది. వైయస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ఈనెల 10వ తేదీన పార్లమెంట్‌లో అడిగిన క్వశ్చన్ నెంబర్ 1703కు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ప్రపంచబ్యాంకు, ఏడీబీ సహా ఇతర రుణాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల పరిధిలోకి రాని రుణాలే అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే వాటిని చెల్లించాలని కేంద్ర మంత్రి తన సమాధానంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కేంద్రం కేవలం పది శాతం మాత్రమే అంటే రూ. 1500 కోట్లు వరకే గ్రాంట్‌గా ఇస్తుందని వెల్లడించారు. అమరావతికి కేంద్ర సాయం ఒట్టిదేనని, చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇన్నాళ్లు వైయస్సార్సీపీ చెబుతూ వస్తున్నదే ఇప్పుడు నిజమైంది. కేంద్ర మంత్రి ఇచ్చిన సమాధానం ద్వారా చంద్రబాబు చేసిన ప్రచారం అబద్ధమేనని తేలిపోయింది.
రూ.5 వేల కోట్లు అప్పుకి రూ.15 వేల కోట్లు చెల్లింపు
2014-19 మధ్య కూడా అమరావతి నిర్మాణం కోసం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.5,335 కోట్లు రుణాలు తీసుకుంది. ఇందులో హడ్కో నుంచి రూ. 1,098 కోట్లు, బ్యాంకుల కన్సార్టియం నుంచి రూ. 1862 కోట్లు, అమరావతి బాండ్ల ద్వారా రూ. 2 వేల కోట్లు తీసుకుంది. ఈ అప్పులకు సంబంధించిన వడ్డీలను గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏటా రూ. 1,573 కోట్లు వడ్డీలుగానే కడుతోంది. అంటే రూ.5,335 కోట్ల రుణాలకు పదేళ్లలో రూ. 15,773 కోట్లు తిరిగి చెల్లించాల్సిన పరిస్థితిని తీసుకువచ్చారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్టు అని చెప్పుకుంటూ ప్రజాధనంను వడ్డీల రూపంలో అమరావతి కోసం దోచిపెడుతున్నారు. మళ్లీ ఇదే అమరావతి కోసం బడ్జెట్‌లో రూ. 6 వేల కోట్లు కేటాయించారు.
అమరావతి కోసం మొత్తం రూ.37 వేల కోట్ల రుణాలు
ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ నుంచి రూ.5 వేల కోట్లు .. మొత్తం రూ. 31 వేల కోట్లు మళ్లీ అప్పులు చేస్తున్నారు. వీటితోపాటు సీఆర్డీఏ ద్వారా నిధులు సమీకరించాలని చూస్తోంది. గతంలో చేసిన అప్పులు కూడా కలిపి ఇప్పటికే రూ. 37 వేల కోట్లు అప్పులు చేశారు. ఇవన్నీ ఎప్పుడు చెల్లిస్తారు.. ఎలా చెల్లిస్తారు?
అమరావతి అంటేనే ఒక దోపిడీ. రాజధాని నిర్మాణం ముసుగులో భారీ అవినీతి జరుగుతోంది. జాతీయ రహదారుల నిర్మాణానికే కిలోమీటర్‌కి రూ. 20 నుంచి రూ. 22 కోట్లు ఖర్చవుతుంటే, అమరావతి ప్రాంతంలో ఒక కిలోమీటర్ రోడ్డు వేయడానికి రూ. 53.88 కోట్లు అవుతుందట. గతంలో తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీల నిర్మాణం కోసం ఒక చదరపు అడుగు నిర్మాణానికి రూ.9400 లు ఖర్చు చేశారు. ఏ గేటెడ్ కమ్యూనిటీ నిర్మానానికి కూడా ఇంత భారీగా ఖర్చు కాదు. అమరావతి పేరుతో బినామీలకు దోచిపెట్టడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్
గతంలో 2014-19 మధ్య రూ. 40 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచి రూ. 5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందులోనూ దిగిపోయేనాటికి రూ. వెయ్యి కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టి దిగిపోయారు. ఇదే వ్యవహారం ఇప్పుడూ జరుగుతోంది. ఇదంతా ప్రజలకు తెలియకుండా అసెంబ్లీ సాక్షిగా డైవర్షన్ పాలిటిక్స్ కి తెరలేపారు. బడ్జెట్ లో ఉన్న లొసుగులపై ప్రభుత్వాన్ని వైయస్ఆర్‌సీపీ ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పే ధైర్యం లేక కేబినెట్ మీటింగులో రంగయ్య మరణంపై చర్చ పెట్టారు.
కేబినెట్ సమావేశంలో ప్రజా సమస్యలను గాలికొదిలేసి సహజ మరణాన్ని అనుమానాస్పద మరణంగా చిత్రీకరించే కుట్రకు తెరలేపారు. సుప్రీంకోర్టు డైరెక్షన్‌లో సీబీఐ దర్యాప్తు చేస్తున్న వివేకా కేసుపై కేబినెట్‌లో ముఖ్యమంత్రికి చర్చించాల్సిన అవసరం ఏంటి? అసెంబ్లీలో ఎందుకు చర్చిస్తున్నారు? ఇంత చెబుతున్న చంద్రబాబు.. వివేకాను దారుణంగా నరికి చంపానని ఒప్పుకున్న దస్తగిరి గురించి ఎందుకు మాట్లాడటం లేదు? ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్.
బాబు హయాంలోనే హత్యారాజకీయాలు
తన జీవితంలో పాలనలో హత్యారాజకీయాలు చేయలేదని, చూడలేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరం. ఆయన బావమరిది బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులు, చనిపోయిన వాచ్‌మెన్ మరణంపై విచారణ కోరండి. దీంతోపాటు మల్లెల బాబ్జి, వంగవీటి మోహనరంగ హత్య, పింగళి దశరథరామ్ హత్యలపై కూడా సిట్ విచారణ జరిపించవచ్చు కదా! ఇవన్నీ ప్రజలకు తెలియాలి.
ఎన్టీఆర్ మానసిక క్షోభకు ఎవరు కారణం? ఆయన ఎలా చనిపోయారో ఈనాటి తరానికి తెలియాలి. పార్టీ ఆఫీసు మీద జరిగిన దాడిపై కూడా చంద్రబాబు పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చుని పట్టాభి అనే వ్యక్తి నాటి సీఎం వైయస్ జగన్ గురించి అసభ్య పదజాలంతో రెచ్చిపోయినందుకు కాదా? దాడి వెనుక కారకులు తండ్రీకొడుకులు చంద్రబాబు, నారా లోకేష్ కాదా? తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్కసారైనా చంద్రబాబు నీతివంతమైన రాజకీయం చేశాడా? అడుగడుగునా అవినీతి, బంధుప్రీతి, దోపిడీ, వెన్నుపోటు రాజకీయాలు చేసిన వ్యక్తి తన మీద మరకలు లేవని చెబుతున్నాడు’అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment