కోరి కొల్చినవారికి కొంగు బంగారమై కొలువుదీరిన కలియుగ ప్రత్యక్ష దైవం చెంత తిరుపతిలో బుధవారం ఒక మహాపరాధం జరిగిపోయింది. కేవలం పాలకుల చేతగానితనంవల్ల ఆరు నిండు ప్రాణాలు బలికావటం, 43 మందికి పైగా గాయపడటం చరిత్ర ఎరుగని విషాదం. శతాబ్దాలుగా ఏడుకొండలవాడి సన్నిధిలో ఎన్నడూ ఇటువంటి దారుణ ఉదంతం చోటుచేసుకున్నట్టు నమోదు కాలేదు. రాచరికం మొదలు ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ వరకూ ఎందరెందరో పాలకులొచ్చారు.
కానీ ఎప్పుడూ ఎవరూ ఇంత చేటు నిర్లక్ష్యం ప్రదర్శించిన దాఖలా లేదు. ఇదే దారుణమనుకుంటే... దుర్ఘటన జరిగింది మొదలుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరసబెట్టి బాహాటంగా ప్రదర్శిస్తున్న అతి తెలివితేటలు ప్రజలను దిగ్భ్రాంతి పరుస్తున్నాయి.
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా గురువారం బైరాగిపట్టెడ దగ్గర కెమెరాల కోసం ‘ప్రజాకోర్టు’ నిర్వహించి అధికారులపై ముఖ్యమంత్రి చంద్రబాబు విరుచుకుపడటమైనా... మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పరామర్శకు వస్తున్నారని తెలిసి క్షతగాత్రులు కోలుకోకుండానే ఆదరాబాదరాగా ఆస్పత్రినుంచి వారిని పంపటానికి ప్రయత్నించిన తీరైనా బాబు వంచనాత్మక విన్యాసాలకు పరాకాష్ట.
ఇవే కాదు... జరిగిన ఘోరంపై టీటీడీ చైర్మన్ మొదలుకొని మంత్రుల వరకూ ఒక్కొక్కరు వినిపిస్తున్న కథలు విస్తు గొలుపుతున్నాయి. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే సమాచారం ఉన్నదని చైర్మన్‌గిరీ వెలగ బెడుతున్న బీఆర్ నాయుడు చెబుతున్నారు. మరి వీరంతా కలిసి చేసిందేమిటి?
అసలు ఏమైంది ఈ ప్రభుత్వానికి? ఎందుకింత చేష్టలుడిగిపోయింది? వైకుంఠ ఏకాదశి పర్వ దినం మొదలు వరసగా పదిరోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలకు ఉభయ తెలుగు రాష్ట్రాలనుంచి మాత్రమేకాదు... దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు పోటెత్తుతారని తెలుసు. అందుకోసం సీఎం కార్యాలయం మొదలుకొని టీటీడీలో అట్టడుగు సిబ్బందివరకూ పకడ్బందీ సమన్వయంతో ముందుకు సాగాలనీ తెలుసు.
అంతక్రితం కేవలం రెండురోజులు మాత్రమే ఉండే వైకుంఠద్వార దర్శనాన్ని భక్తుల సంఖ్య నానాటికీ పెరగటాన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పదిరోజులకు పెంచింది. భక్తులు సజావుగా దర్శనం చేసుకుని తరించటానికి వీలుగా 9 కేంద్రాల్లో పదేసి కౌంటర్లలో సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించింది. 24 గంటలముందే తెల్లారుజామున అయిదు గంటలకు టోకెన్ల జారీ మొదలయ్యేది.
కానీ దీన్నంతటినీ తలకిందులు చేసి ముందురోజు అర్ధరాత్రి నుంచీ వేచి వున్న భక్తులను ఒకచోట చేర్చి రాత్రి ఎప్పుడో టోకెన్లు ఇవ్వటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెల్లారుజాము నుంచి రాత్రి వరకూ సిబ్బంది ఏం చేసినట్టు? కనీసం టోకెన్ల కోసం ఆరుబయట పడిగాపులు పడుతున్న భక్తుల్లో పసిపిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉన్నారన్న స్పృహ... వారికి తిండీ నీళ్లూ అందించాలన్న ఇంగితజ్ఞానం ఉండొద్దా? వచ్చిన వారిని వచ్చినట్టుగా క్యూలైన్లలో పంపి, వెంటవెంటనే టోకెన్లు జారీ చేయొద్దా? ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకొచ్చాయి గనుక జిల్లాల్లోనే ఆన్‌లైన్‌లో టోకెన్లు అందించే ప్రక్రియ అమలుచేయొచ్చు. అదే జరిగితే భక్తులందరూ స్వామివారిని తనివితీరా వీక్షించి, సురక్షితంగా తమ తమ ఇళ్లకు చేరుకునేవారు. కానీ పక్షవాతం వచ్చిన చందంగా ఎవరికివారు చేష్టలుడిగి ఈ ఘోర ఉదంతానికి కారకులయ్యారు.
దీన్నంతటినీ కప్పిపుచ్చుకోవటానికి జిల్లా ఎస్సీని బదిలీ చేశారు. ఒక డీఎస్పీని సస్పెండ్ చేశారు. ఈవో, జేఈవోను వదిలేశారు. మరి శాంతిభద్రతల విభాగం దగ్గరుంచుకుని బాబు చేసిందేమిటి? ప్రమాణస్వీకారానికి ముందే తమ కనుసైగలతో ఊరూ వాడా దాడులూ, దౌర్జన్యాలూ, సామాన్య పౌరుల ఇళ్లు నేలమట్టం చేయించి మాఫియాలను తలపించే పాలనకు శ్రీకారం చుట్టిన పర్యవసానం కాదా ఈ ఉదంతం? తిరుమల లడ్డూలో జంతుకొవ్వు కలిసిందని తప్పుడు ప్రచా రానికి పాల్పడలేదా? ఈ నేపథ్యంలో ఏ జిల్లాలోనైనా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది చిత్తశుద్ధితో, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించగలుగుతున్నారా? ఎన్ని కేసులుంటే అంత గొప్పగా నెత్తెక్కించుకుంటామని అధికారంలోకి రాకముందు టీడీపీ శ్రేణుల్లో నేరస్వభావాన్ని పెంచిన ఘనత వీరిది.
ఇప్పుడు పోలీసులకూ అదే రంధి పట్టుకుంది. ఎంతమందిపై అక్రమ కేసులు పెడితే అంతగా నజరానాలు పొందొచ్చన్న దురాశ పుట్టింది. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతోపాటు, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు బనాయిస్తూ రాష్ట్రంలో ఈమూలనుంచి ఆ మూలకు తిప్పుతున్నారు. ఇక శాంతిభద్రతలు ఎటుపోతేనేం... పర్వదినాలకు వచ్చే భక్తులు ఏమై పోతేనేం! దేవుడంటే భయ భక్తుల్లేవు... ప్రజలంటే వెరపు లేదు! ఈ దుఃస్థితికి ఎన్డీయే కూటమి పాలకులు సామూహికంగా సిగ్గుపడాలి.
విశాఖలో స్టీల్‌ప్లాంట్ భవిష్యత్తుపై ఒక్క మాటైనా మాట్లాడని ప్రధాని మెప్పు పొంద టానికి బాబు, పవన్, లోకేశ్‌లు అగచాట్లు పడితే... అక్రమ కేసుల పరంపరతో ఆ ముగ్గురి దగ్గరా మార్కులు కొట్టేద్దామని అధికార యంత్రాంగం పాట్లు పడుతోంది. వెరసి ఇలాంటి దారుణాలు రివాజయ్యాయి. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడినవారి కుటుంబ సభ్యులు చెబుతున్న విషయాలు వింటే గుండె తరుక్కుపోతుంది.
2015లో తన ఏలుబడిలో, తన వల్ల, తన సమక్షంలో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తుల మరణానికి దారితీసిన ఉదంతాన్ని బాబు సోమయాజులు కమిషన్‌తో కప్పెట్టటాన్ని ఎవరూ మరిచిపోరు. కనుక తిరుపతి ఉదంతంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. టీటీడీ చైర్మన్‌తో సహా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment