చెప్పకుండా శైలజ దేశం దాటారు | Lookout Notices to Shailaja | Sakshi
Sakshi News home page

చెప్పకుండా శైలజ దేశం దాటారు

Published Sun, Sep 17 2023 3:03 AM | Last Updated on Sun, Sep 17 2023 11:04 AM

Lookout Notices to Shailaja - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ది భారీ కుంభకోణమని, ఈ కేసులో వేలాది చందాదారుల ప్రయోజనాలు కాపాడటం తమ బాధ్యత అని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. ఇంత పెద్ద స్కాంలో నిందితులుగా ఉన్న రామోజీరావు(ఏ–1), శైలజ (ఏ–2) దర్యాప్తునకు ఏమాత్రం సహకరించడంలేదని  తెలిపింది.

మూడుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదని చెప్పింది. దర్యాప్తు అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, రికార్డులు చూపించడంలేదని తెలిపింది. అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శైలజ దేశం దాటి వెళ్లారని, అందుకే ఆమెపై లుక్‌ అవుట్‌ నోటీసులు (ఎల్‌వోసీ) జారీ చేయాలని కేంద్రాన్ని కోరామని వెల్లడించింది. దర్యాప్తు నుంచి తప్పించుకోవడానికే అమెరికా పర్యటనను సాకుగా ఎంచుకున్నారని పేర్కొంది.

కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ లుక్‌ ఔట్‌ నోటీసులు జారీ చేశారని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ఆ సంస్థ ఎండీ సీహెచ్‌ శైలజ వేర్వేరుగా దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్లపై జస్టిస్‌ కె.సురేందర్‌ విచారణ చేపట్టారు. ఈ పిటిషన్లలో ఏపీ సీఐడీ కౌంటర్లు దాఖలు చేసింది. అనంతరం వాదన­ల­కు పిటిషనర్ల తరపు న్యాయ­వాది రెండు వారాల  సమయం కోరడంతో న్యాయ­మూర్తి విచారణను ఈ నెల 29కి వాయిదా వేశారు. కౌంటర్‌లో ఏపీ సీఐడీ వెల్లడించిన కీలక వివరాలు..

సొంత ప్రయోజనాల కోసం వేల కోట్లు మళ్లించారు
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని 37 బ్రాంచ్‌ల్లో ఆ సంస్థ రూ.25 వేల నుంచి రూ.కోటి వరకు చిట్‌లు నడుపుతోంది. వీటిలో చందాదారులు పెద్దఎత్తున పెట్టుబడి పెట్టా­రు. మార్గదర్శి చైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజ, బ్రాంచ్‌ మేనేజర్లు వసూలు చేసిన వేల కోట్ల రూపాయల్ని అక్రమ మార్గాల్లో సొంత సంస్థల్లోకి, మ్యూచ్‌వల్‌ ఫండ్స్‌లోకి మళ్లిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. చందాదారులకు చెల్లింపుల్లో విఫలమ­య్యా­రు.

ఇవన్నీ నేరపూరిత కుట్ర, విశ్వాస ఉల్లంఘన, మోసం కిందికే వస్తాయి. మార్గదర్శి ఎండీ శైలజపై సీఐడీ ఏడు క్రిమినల్‌ కేసులు నమోదు చేసింది. దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ కేసులో మరి­న్ని వివరాలు, కీలక ఆధారాలు తెలుసుకో­వడానికి శైలజ విచారణ ప్రధానం. దర్యాప్తు సంస్థ ముందు హాజరై ఆమె వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఏప్రిల్‌ 6న విచారణలో ఆమె సహకరించలేదు.

అంతేకాదు అధికారులు అడిగిన ఆర్థిక లావాదేవీల రికార్డులు, డాక్యుమెంట్లు తీసుకురాలేదు. ఆమెకు రాజకీయంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో ఉన్న పరిచయాలతో అధికార దుర్వినియోగానికి పాల్ప­డు­తూ చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చే­సు­్తన్నారు. దేశం విడిచి పారిపోయే అవకాశం కూడా ఉంది. ఇదే జరిగితే చందాదారులకు కోలు­కోలేని దెబ్బ తగులుతుంది. వేలాది చందాదారుల ఆర్థిక ప్రయోజనాల పరిరక్షణకు శైలజను అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు అప్పగించాలని ఇమ్మిగ్రేషన్‌ అధికారులను కోరాల్సివచ్చింది.

సీఆర్‌పీసీ సెక్షన్‌ 160 కింద ఏప్రిల్‌ 27న విచారణకు హాజరుకావాలని ఏప్రిల్‌ 22న నోటీసు­లు జారీ చేశాం. కుటుంబ వ్యవహారాల్లో పాల్గొనా­ల్సి ఉన్నందున ఏప్రిల్‌ 27 నుంచి మూడు నాలుగు వారాలు హాజరుకాలేనని ఏప్రిల్‌ 23న సమాధానం ఇచ్చారు. అనంతరం మే 12న, మే 22న రెండు సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె నిరాకరించారు. ఆమె ఇంట్లోనే విచారణ చేపడతా­మని చెప్పినా అంగీకరించలేదు. అధికారులకు ఇచ్చిన సమాధానంలో ఎక్కడా అమెరికా వెళ్తున్న విషయం చెప్పలేదు. ఆ సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా దాచి ఉంచారు.

విచారణలో సహకరించకపోవడం, నోటీసు­ల­కు సమాధానం ఇవ్వకపోవడం, సమాచారం లేకుండా దేశం దాటి వెళ్లడం.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎల్‌ఓసీ జారీ చేయాల్సి వచ్చింది. శైలజ చర్యలు రిజర్వు బ్యాంకు చట్టాలకు విరుద్ధం. బ్రాంచిలలో సోదాల సందర్భంగా అధికా­రు­లు పలు ఎలక్ట్రానిక్‌ ఎవిడెన్స్‌ను స్వాధీనం చేసు­కు­న్నారు. వీటిపై శైలజ నుంచి వివరణ తీసుకోవ­డం అత్యంత కీలకం. ఇంత పెద్ద ఆర్థిక అవకత­వకలపై దర్యాప్తు సాగుతుంటే.. విదేశాలకు వెళ్లడాని­కి ఆమె చెప్పిన కారణం ఓ సాకు మాత్రమే. ఈ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదు అని సీఐడీ కౌంటర్‌లో తెలిపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement