ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 ఎస్‌ను మార్గదర్శి ఉల్లంఘించింది
అందుకు మార్గదర్శి, రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలి
నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి
మార్గదర్శి సేకరించిన రూ.2,600 కోట్లకుపైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే
తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్‌బీఐ
చట్ట ఉల్లంఘనకు రెండేళ్ల జైలు లేదా రెండింతల జరిమానా విధించొచ్చు
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యక్తుల సమూహం పరిధిలోకే వస్తుంది
వ్యక్తుల డిపాజిట్ల వసూలు నిరోధానికే చట్ట సవరణ
అందువల్ల వారు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టేయండి
రామోజీ మరణంతో కిరణ్‌ను హెచ్‌యూఎఫ్ కర్తగా చేరుస్తూ అనుబంధ పిటిషన్
20న తదుపరి విచారణ
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ను అడ్డు పెట్టుకుని రామోజీరావు సాగించిన ఆర్థిక అక్రమాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎట్టకేలకు బహిర్గతం చేసింది. రామోజీ నిస్సందేహంగా ఆర్థిక ఉగ్రవాదేనని రుజువైంది. చట్ట విరుద్ధంగా దశాబ్దాల తరబడి ఆర్థిక దోపిడీకి తెగించారని తేటతెల్లమైంది. 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ ప్రజల నుంచి చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తెలంగాణ హైకోర్టుకు ఆర్బీఐ తాజాగా నివేదించింది. ఆర్బీఐ చట్టం సెక్షన్ 45 (ఎస్)ను మార్గదర్శి యథేచ్ఛగా ఉల్లంఘించిందని తెలిపింది.
చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందుకు రామోజీరావు, మార్గదర్శి ఫైనాన్షి యర్స్‌ను ప్రాసిక్యూట్ చేయాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం సీఆర్‌పీసీ సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన ప్పుడు ఆరోపిత నేరాలకు ప్రాథమిక ఆధారాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆర్బీఐ చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలున్న నేపథ్యంలో తమపై దాఖలైన కేసు కొట్టివేయాలంటూ మార్గదర్శి, రామోజీ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాలని హైకోర్టును ఆర్బీఐ అభ్యర్థించింది.
సుప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు పునర్విచారణ...
చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గ దర్శి, దాని కర్త రామోజీరావులపై డిపాజిటర్ల పరి రక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టి వేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31న తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
అంతకు ముందు హైకోర్టు తీర్పులో కొంతభాగంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ మార్గదర్శి, రామోజీరావు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై ఈ ఏడాది ఏప్రిల్ 9న విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. హైకోర్టు తీర్పు ను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును తప్పుబట్టింది. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. కేసు లోతు ల్లోకి వెళ్లి అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టం చేసింది.
సీనియర్ న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించాలని స్పష్టం చేసింది. పునర్విచారణను ఆరు నెలల్లో ముగించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు ఇటీవల ఈ విచారణ మొదలు పెట్టింది. హైకోర్టులో నెంబర్ టూ స్థానంలో ఉన్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్బీఐని ప్రతివాదులుగా చేర్చి కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఆర్బీఐ పూర్తి వివరాలతో తాజాగా కౌంటర్ దాఖలు చేసింది. ఆర్బీఐ కౌంటర్‌లో ముఖ్యాంశాలివీ...
సెక్షన్ 45 ఎస్‌ను సుప్రీంకోర్టు గతంలోనే సమర్థించింది...
‘1997లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట సవరణలో భాగంగా సెక్షన్ 45 ఎస్‌ను కూడా సవరించాం. ఓ వ్యక్తి వ్యక్తిగతంగా, సంస్థగా, వ్యక్తుల సమూహంతో కూడిన అన్ ఇన్‌కార్పొరేటెడ్‌లు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడాన్ని పూర్తిగా నిషేధించాం. చట్ట సవరణ వల్ల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల వ్యాపారాన్ని సమర్థంగా నియంత్రించేందుకు మాకు అధికారం లభించింది. కంపెనీలు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ లావాదేవీలు చేపట్టాలంటే మా నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
సెక్షన్ 45 ఎస్ చట్టబద్ధతను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 2000లో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు సెక్షన్ 45 ఎస్‌ను సమర్థించింది. చట్టం ప్రకారం వ్యక్తులు, అన్ ఇన్ కార్పొరేటెడ్ కంపెనీలు చేసే వ్యాపారాన్ని సెక్షన్ 45 ఎస్ కింద ఆర్‌బీఐ నిషే«ధించలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఆన్ ఇన్ కార్పొరేటెడ్ సంస్థలు తమ స్వీయ నిధులతో లేదా బంధువుల వద్ద రుణంగా తీసుకున్న నిధులతో లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న నిధులతో వ్యాపారం చేసుకోవచ్చు. అంతేగానీ ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసి వాటి ద్వారా వ్యాపారం చేయడానికి వీల్లేదు’ అని ఆర్బీఐ తన కౌంటర్‌లో తేల్చి చెప్పింది.
రెండేళ్ల జైలు.. రెండింతల జరిమానా
‘చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారని భావించినప్పుడు ఆర్బీఐ లేదా రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొంది ఆ డిపాజిట్ల వసూలు తాలుకూ డాక్యుమెంట్లన్నింటినీ తనిఖీ చేసే అధికారాన్ని సెక్షన్ 45 టీ కట్టబెడుతోంది. సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్లు తేలితే ఆ వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు లేదా వసూలు చేసిన డిపాజిట్ల మొత్తానికి రెండింతల జరిమానా విధించవచ్చు.
చట్టవిరుద్ధంగా డిపాజిట్ల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అధీకృత అధికారి సంబంధిత కోర్టులో ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుంది. మార్గదర్శి వ్యవహారంలో కూడా అధీకృత అధికారి అలాగే ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదునే గతంలో హైకోర్టు కొట్టేసింది. దానిపైనే ఇప్పుడు హైకోర్టు విచారణ జరుపుతోంది’ అని ఆర్‌బీఐ పేర్కొంది.
హెచ్‌యూఎఫ్‌కు సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది...
హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) లీగల్ పర్సన్ కాదు. ఇది కొందరు వ్యక్తుల సమూహం. కర్త ద్వారా ఈ హెచ్‌యూఎఫ్ పని చేస్తుంటుంది. దీన్ని వ్యక్తుల సమూహంగానే పరిగణించాల్సి ఉంటుంది. అందువల్ల హెచ్‌యూఎఫ్‌కు ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 45 ఎస్ వర్తిస్తుంది. వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం ఏ రకమైన వ్యాపారం, కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న దానిపై సెక్షన్ 45 ఎస్ వర్తింపు ఆధారపడి ఉంటుంది. వ్యాపారం చేసేందుకు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం ఈ సెక్షన్ కింద నిషిద్ధం.
హెచ్‌యూఎఫ్ ఇలా డిపాజిట్లు వసూలు చేస్తే అది ఆర్‌బీఐ చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్లే అవుతుంది. ఈ కేసులో మొదటి ప్రతివాది అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్‌గా ఆర్‌బీఐ చట్ట నిబంధనలకు తిలోదకాలు ఇచ్చింది. సెక్షన్ 45 ఎస్‌లో హెచ్‌యూఎఫ్‌ను చేర్చలేదని, తాము ఆ సెక్షన్ పరిధిలోకి రామని చెప్పడం సరికాదు. ప్రజల నుంచి డిపాజిట్ల స్వీకరణ నిషేధాన్ని ఆర్‌బీఐ పరిధిలోకి తేవడమే శాసనకర్తల ప్రధాన ఉద్దేశం. అందుకే ఆర్‌బీఐ చట్టంలో చాప్టర్ 3 బీ, 3 సీలను చేర్చింది’ అని రిజర్వ్ బ్యాంక్ తన కౌంటర్‌లో తెలిపింది.
చట్ట విరుద్ధమన్న విషయాన్ని గతంలో హైకోర్టు పట్టించుకోలేదు
హెచ్‌యూఎఫ్‌గా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించడం చట్ట విరుద్ధమన్న విషయాన్ని హైకోర్టు గతంలో పట్టించుకోలేదు. హెచ్‌యూఎఫ్ వ్యక్తుల సమూహం పరిధిలోకి వస్తుందన్న విషయాన్ని కూడా విస్మరించింది. ఇవన్నీ మార్గదర్శి, రామోజీరావు సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించారన్న విషయాన్ని రూఢీ చేస్తున్నాయి. చట్ట విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేసినందుకు వీరికి సెక్షన్ 45ఎస్ (1), 45 ఎస్ (2) వర్తిస్తాయి.
చట్టవిరుద్ధంగా వ్యవహరించారనేందుకు ఇవన్నీ ప్రాథమిక ఆధారాలే. సెక్షన్ 45 ఎస్‌కు విరుద్ధంగా వ్యవహరించినందుకు వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ఈ వివరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని మార్గదర్శి, రామోజీరావు దాఖలు చేసిన ఈ క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయాలి’ అని ఆర్‌బీఐ కౌంటర్‌లో అభ్యర్థించింది. కాగా రామోజీరావు ఇటీవల మరణించిన నేపథ్యంలో హెచ్‌యూఎఫ్ కర్తగా ఆ స్థానంలో ఆయన కుమారుడు చెరుకూరి కిరణ్‌ను చేర్చాలని (సబ్‌స్టిట్యూట్) కోరుతూ మార్గదర్శి ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 20న చేపట్టనున్నట్లు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది.
అక్రమాలు బయటపడినందునే చెలరేగిన ‘ఈనాడు’
రామోజీ అక్రమ ఆరి్థక సామ్రాజ్యానికి ‘మార్గదర్శి’ పునాది కాగా.. ‘ఈనాడు’ ఆ అరాచకాలకు రక్షణ కవచంలా నిలుస్తోంది. మరి అలాంటి ‘మార్గదర్శి’ అక్రమాలను బట్టబయలు చేస్తే ఈనాడు సహిస్తుందా? అందుకే నాడు దివంగత వైఎస్సార్‌పై.. నేడు జగన్‌పై కట్టుకథలు అల్లుతూ దు్రష్పచారం చేస్తోంది.
అక్రమాల సినిమాలో ఆయన త్రిపాత్రాభినయం
ప్రజల సొమ్ము దోచుకునేందుకు రామోజీరావు త్రిపాత్రాభినయం చేశారు. ఆయన హెచ్‌యూఎఫ్ కర్తగా, ప్రొప్రైటర్‌గా, చైర్మన్‌గా మూడు వేర్వేరు పాత్రలలో అవసరాలకు తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఆర్‌బీఐకి మస్కా కొట్టారు.
18 ఏళ్లుగా నెట్టుకొచ్చారు
మార్గదర్శి ఫైనాన్షియర్స్, రామోజీరావుపై చర్యలు కోరుతూ 2006 నవంబర్ 6న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తొలి ఫిర్యాదు అందింది. నాంపల్లి కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మొట్టికాయలు వేసినా.. ఆర్బీఐ తప్పుబట్టినా రామోజీరావు మాత్రం 18 ఏళ్లుగా తన అక్రమ దందాను కొనసాగిస్తూ వచ్చారు.
సొంత ఆడిట్ కుదరదు.. ఎప్పుడో చెప్పిన సుప్రీంకోర్టు
‘డిపాజిట్‌దారులకు సొమ్మును చెల్లించేశాం... మా ఆడిటర్లు లెక్క తేల్చేసి నివేదిక ఇచ్చారు’ అంటూ కనికట్టు చేసేందుకు యత్నించారు. ఆ కుతంత్రాన్ని పసిగట్టిన సుప్రీంకోర్టు.. ‘నేరం నాదే... దర్యాప్తు నాదే... తీర్పు నాదే’ అంటే కుదరదని, నిజాలు నిగ్గు తేలాల్సిందేనని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment