మార్గదర్శి కేసుపై తెలంగాణ హైకోర్టులో ఉండవల్లి
రిజిస్ట్రీ ప్రచురించిన నోటీసులను చందాదారులు చూసే అవకాశం తక్కువ
తప్పుల తడకగా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు
ఇంటిపేర్లు లేవు.. అడ్రస్‌లూ లేవు
చందాలు ఎవరికి తిరిగిచ్చారో.. ఇవ్వలేదో వివరాల్లేవు
చందాల వసూలంతా అక్రమమేనని ఆర్‌బీఐ తేల్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి
ఉన్నత న్యాయస్థానానికి తెలిపిన మాజీ ఎంపీ
అరుణ్‌కుమార్‌కు వివరాలిచ్చేలా చర్యలు చేపట్టండి
రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: చందాదారులకు చెల్లింపులు చేపట్టామంటూ సుప్రీంకోర్టుకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ 69,531 పేజీల వివరాలను అందజేసిందని.. అందులో ఇచ్చిన సమాచారమంతా తప్పుల తడక అని తెలంగాణ హైకోర్టుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. తను అడిగిన మేరకు ఆ వివరాలు బుక్ రూపంలో కాకున్నా.. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చినా అక్రమాలను తేలుస్తానన్నారు. ఆగస్టు 30న అఫిడవిట్ దాఖలు చేసినా ఇప్పటివరకు వివరాలు అందజేయలేదని వెల్లడించారు. అఫిడవిట్‌ను పరిశీలించి వివరాలు అందేలా చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది.
చట్ట నిబంధలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అ«దీకృత నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018, డిసెంబర్ 31న తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశాయి. అలాగే తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును 2024, ఏప్రిల్ 9న కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది.
ఇంటిపేర్లు, అడ్రస్‌లు లేకుండానే..
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్ పిటిషన్లపై మరోసారి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ వర్చువల్‌గా హాజరైన ఉండవల్లి మాట్లాడుతూ ‘రిజిస్ట్రీ ప్రచురించిన నోటీసులను చందాదారులు చూసే అవకాశం తక్కువ. సుప్రీంకోర్టుకు మార్గదర్శి 69,531 పేజీల వివరాలు అందజేసింది. సుప్రీంకోర్టుకు ఇచ్చినదంతా తప్పుడు సమాచారమే. చాలా మందికి ఇంటిపేర్లు లేవు.. ఇంటిపేర్లు ఉన్నా.. వారి అడ్రస్‌లు లేవు. కొందరికి నాలుగైదు అడ్రస్‌లు చూపించారు.
చందాలు తిరిగి ఎవరికి ఇచ్చారో.. ఇవ్వలేదో సరిగా వివరాల్లేవు. జ్యోతిరావు అనే వ్యక్తి రూ.35 లక్షలకు పైగా కట్టారు. ఆయన అడ్రస్‌కు సంబంధించి వివరాలు సరిగా లేవు. రిజిస్ట్రీ ప్రచురించిన పబ్లిక్ నోటీసును బాధితులు చూసే అవకాశం తక్కువ. కోర్టు నేరుగా తెలుసుకునేందుకు అవకాశం లేదు. అందుకే సుప్రీంకోర్టు నన్ను విచారణలో హైకోర్టుకు సహాయకుడిగా ఉండమని కోరింది’ అని పేర్కొన్నారు. ‘చందాల వసూలు అంతా అక్రమమేనని ఆర్‌బీఐ తేల్చిన విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవాలి.
మార్గదర్శి చందాల వసూలంతా చట్టవిరుద్ధం, అక్రమేనని.. బాధ్యులను ప్రాసిక్యూట్ చేయాలని ఆర్‌బీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాజ్‌లిస్ట్(కోర్టు విచారణ పిటిషన్ల జాబితా)లో నా పేరు ప్రచురించేలా రిజిస్ట్రీని ఆదేశించండి’ అని కోరారు. అనంతరం అరుణ్‌కుమార్ పేరు కాజ్‌లిస్ట్‌లో చేర్చాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. ఆయన అఫిడవిట్‌ను పరిశీలించి సమాచారం అందేలా చూడాలని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment