చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా ? | Telangana High Court Serious on Margadarsi: TG and Ap | Sakshi
Sakshi News home page

చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేశారా? లేదా ?

Published Fri, Nov 8 2024 3:35 AM | Last Updated on Fri, Nov 8 2024 7:34 AM

Telangana High Court Serious on Margadarsi: TG and Ap

అలా వసూలు చేయడం నేరమా? కాదా? 

‘మార్గదర్శి’కి తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్న

డిపాజిట్లు వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా వసూలు చేయడం వేరు

ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.. తుది విచారణలో ఈ విషయాన్ని తేలుస్తాం

పూర్తి వివరాలతో కౌంటర్ల దాఖలుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఆదేశం

అదనపు కౌంటర్‌ దాఖలుకు ఆర్‌బీఐకి అనుమతి.. డిసెంబర్‌ 20 కల్లా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశం

తదుపరి విచారణ జనవరి 3కి వాయిదా

అదే రోజు తుది విచారణ తేదీ ఖరారు చేస్తామని వెల్లడి

సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్‌:  ఆర్‌బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి అక్రమంగా రూ.వేల కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ని ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు గురువారం కీలక, ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ప్రజల నుంచి వసూలు చేసిన ఆ డిపాజిట్లను తాము వెనక్కి ఇచ్చేశామని పలుమార్లు చెప్పిన మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి న్యాయస్థానం గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ‘డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్‌బీఐ చెబుతోంది కదా? వసూలు చేసి­న డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది.

డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయ­డం చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం...’ అని తెలంగాణ హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు సమక్షంలో గతంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌కు భౌతిక రూపంలో అందజేసిన డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో కూడా ఇవ్వాలని మార్గదర్శిని ఆదేశించింది. తాము పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవస­రం లేదన్న మార్గదర్శి వాదనను తోసిపుచ్చింది. ఈ కేసులో కోర్టుకు సహకరించేందుకు ఉండవల్లికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కోర్టుకు సరైన రీతిలో సహకరించాలంటే డిపాజిటర్ల వివరాలను పెన్‌డ్రైవ్‌లో ఇవ్వాల్సిన అవసరం ఉందంది. తద్వారా సాంకేతికత సాయంతో డిపాజిటర్ల వివరాలను క్షుణ్నంగా పరిశీలించి కోర్టుకు తగిన రీతిలో సహకరించేందుకు ఆ­స్కా­రం ఉంటుందంది.

అయినా పెన్‌డ్రైవ్‌­లో ఇవ్వా­లని చెబుతున్న సమాచారం ఏమీ కొత్తది కాదని, ఆ వివరాలను ఇప్పటికే భౌతికంగా ఉండవల్లికి అందజే శారని గుర్తు చేసింది. మార్గదర్శి పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలను ఈ కేసు కోసం మినహా మరే రకంగానూ ఉపయోగించడానికి వీల్లేదని ఉండవల్లిని హైకోర్టు ఆదేశించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ దాఖలు చేసిన వ్యా­జ్యా­ల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను ఆదేశించింది. మార్గదర్శి–ఆర్‌బీఐకి మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కోర్టు ముందుంచిన నేపథ్యంలో వాటి పూర్తి వివరాలతో అదనపు కౌంటర్‌ దాఖలు చేస్తామన్న ఆర్‌బీఐ సీనియర్‌ న్యాయ­వాది అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్‌బీఐ కౌంటర్లు దాఖలు చేయ­డం, వాటికి సమాధానం ఇవ్వడం లాంటి ప్రక్రి­య అంతా డిసెంబర్‌ 20 కల్లా పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాలను హైకోర్టు ఆదేశించింది.

ఆ తేదీ తరువాత దాఖలు చేసే ఏ డాక్యుమెంట్లనూ తీసుకోబోమని పేర్కొంటూ విచారణను 2025 జనవరి 3కి వాయిదా వేసింది. అదే రోజు ఈ వ్యాజ్యాలపై తుది విచారణ తేదీని ఖరారు చేస్తామంది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ హెచ్‌యూ­ఎఫ్‌ కర్తగా ఉన్న రామోజీరావు మరణించినందున ఆ స్థానంలో తనను కర్తగా చేర్చాలంటూ ఆ­యన కుమారుడు కిరణ్‌ దాఖలు చేసిన సబ్‌స్టిట్యూట్‌ పిటిషన్లను అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సుజోయ్‌ పాల్, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.   

వెనక్కి ఇచ్చేశాం: లూథ్రా  
మార్గదర్శి తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయ­వాది సిద్దార్థ లూథ్రా తాజాగా వాదనలు వినిపిస్తూ సేకరించిన డిపాజిట్లలో 99.8 శాతం మొత్తాలను వెనక్కి ఇచ్చేసినట్లు చెప్పారు. రూ.5.33 కోట్లను ఎవరూ క్లెయిమ్‌ చేయనందున ఎస్క్రో ఖాతాల్లో ఉంచామన్నారు. ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను న్యాయస్థానానికి సహకరించాలని మాత్రమే సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఈ సమయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కౌంటర్లు దాఖలు చేయలేదా? అని ధర్మాసనం ప్రశించడంతో తాము కౌంటర్‌ దాఖలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) పల్లె నాగేశ్వరరావు నివేదించారు. అదనపు కౌంటర్‌ దాఖలు చేస్తామని ఆర్‌బీఐ తరఫు సీనియర్‌ న్యాయవాది లక్ష్మీనారాయణన్‌ రవిచందర్‌ కోరడంతో ధర్మాసనం అంగీకరించింది.

అనంతరం లూథ్రా వాదనలను కొనసాగిస్తూ.. అప్పటి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కథనాలు రాశామని తమపై కేసు దాఖలు చేశారని, అయితే 2007 నుంచి ఏ డిపాజిటర్‌ కూడా తాము డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదు చేయలేదన్నారు. తాము వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించకుండా ఎగవేశామా? అనే విషయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు చెప్పాల్సి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఆర్‌బీఐ కౌంటర్‌ దాఖలు చేసిన తరువాత పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. వసూలు చేసిన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశామంటూ మీరు సమరి్పంచిన వివ­రాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదని, అందుకే ఈ వ్యవహారాన్ని మళ్లీ తేల్చాలని వెనక్కి పంపిందని లూథ్రానుద్దేశించి ధర్మాసనం పేర్కొంది.

ఈ సమయంలో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ జోక్యం చేసుకుంటూ చందాదారుల వివరాలను మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ పెన్‌డ్రైవ్‌లో ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు. పెన్‌డ్రైవ్‌ను ఉండవల్లికి ఇవ్వడానికి వీల్లేదంటూ లూథ్రా వాదించారు. అలా ఇవ్వడం ఐటీ చట్ట నిబంధనలకు విరుద్ధమని వాదించారు. ఇరుపక్షాల వాద­నలు విన్న అనంతరం నాలుగు వారాల్లో అదనపు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆర్‌బీఐని ధర్మాసనం ఆదే­శించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు 4 వా­రాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఆ కౌంటర్లకు సమాధానం దాఖలు చేయాలనుకుంటే చేయవచ్చునని, కానీ మొత్తం ప్రక్రియను డిసెంబర్‌ 20 నాటికి పూర్తి చేసి తీరాలని ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం తేల్చి చెబుతూ విచారణను జనవరి 3కి వాయిదా వేసింది.

ఎస్క్రో అకౌంట్‌లోని సొమ్ములు ఎవరివి?
రామోజీ చాలా శక్తిమంతుడు..
తాజా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉండవల్లి చదివారు. అసలైన పెట్టుబడిదారుల నుంచి అభ్యంతరాలను ఆహ్వానించవచ్చని హైకోర్టుకు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. డిపాజిట్లు చెల్లించేశామని చెబుతున్నారని, మరి ఎస్క్రో అకౌంట్‌లో ఉన్న రూ.5.33 కోట్లు ఎవరివి? అని ప్రశి్నంచారు. ఆ మొత్తాలను ఎవరూ క్లెయిమ్‌ చేయడం లేదని, దీన్నిబట్టి ఆ మొత్తాలు ఎవరివో సులభంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ఆ డిపాజిటర్లు ఎవరు? క్లెయిమ్‌ చేయడానికి ఎందుకు ముందుకు రావడం లేదో తేల్చాలన్నారు. చెల్లింపులు చేశామని మార్గదర్శి చెబుతున్న డిపాజిటర్లలో చాలా మంది నిజమైన డిపాజిటర్లు కాదన్న విషయాన్ని తాను నిరూపిస్తానన్నారు.

మార్గదర్శి ఇచ్చిన 59 వేల పేజీల్లో కొన్నింటిని పరిశీలిస్తేనే వారు అసలైన డిపాజిటర్లు కారన్న విషయం అర్థ­మైందని, అందుకే పూర్తిస్థాయిలో పరిశీలన చేసేందుకు పెన్‌­డ్రైవ్‌లో వివరాలు కోరుతున్నట్లు చెప్పా­రు. రామోజీ చాలా శక్తిమంతుడని, అందుకే ఆయనపై ఫిర్యాదు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ‘మార్గదర్శిని గెలిపించడం కోసం లూ­థ్రా వాదిస్తున్నారు. కానీ నేను బాధితు­లు, చట్టం తరఫున హేమాహేమీలతో యుద్ధం చే­స్తు­న్నా. సు­ప్రీం ఆదేశాల మేరకు తెలంగాణ హైకో­ర్టు విచార­ణ చేపట్టి 5 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కౌంటర్‌ దాఖ­లు చేయలేదు. 2006 నవంబర్‌ 6న మార్గదర్శి ఉల్లంఘనల­పై కేంద్రానికి ఫిర్యాదు చేశానని, బుధవారంతో 18 ఏళ్లు పూర్తయ్యాయి. అప్పటి నుంచి మార్గదర్శి ఈ  విచారణను సాగదీస్తూనే ఉంది’ అని పేర్కొన్నారు.

ఉండవల్లికి పెన్‌డ్రైవ్‌ ఇవ్వాల్సిందే
హార్డ్‌ కాపీ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్‌ ఫార్మాట్‌లో ఇవ్వటానికి ఏం ఇబ్బంది?
ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం ఇక్కడ వర్తించదు
డిసెంబర్‌ 15 కల్లా పూర్తి వివరాలతో పెన్‌డ్రైవ్‌ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారు సరే..! అసలు ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేయడమే నిబంధనలకు విరుద్ధమని ఆర్‌బీఐ చెబుతోంది కదా? వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడం వేరు.. చట్ట విరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేయడం వేరు. ఈ రెండింటికీ చాలా వ్యత్యాసం ఉంది. డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధంగా జరిగిందా.. లేదా? అలా వసూలు చేయడం నేరమా? కాదా? అన్నదే ముఖ్యం. కాబట్టి తుది విచారణలో ఈ విషయాన్ని కూడా తేలుస్తాం. – మార్గదర్శినుద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్య

‘అరుణ్‌కుమార్‌కు సుప్రీంకోర్టు చందాదారుల వివరాలతో కూడిన హార్డ్‌ కాపీలు ఇచ్చిన అంశాన్ని లూథ్రా తోసిపుచ్చలేదు. అంటే పెన్‌డ్రైవ్‌లో ఇచ్చే వివరాలేమీ కొత్తగా ఇచ్చేవి కాదు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం– 2000 నియమ నిబంధనలు ఇక్కడ వర్తించవు. రేఖా మురార్కా (సుప్రా)లో సుప్రీంకోర్టు ఇదే అంశంపై తీర్పునిచ్చింది. అంతేకాదు.. హైకోర్టుకు సాయం చేయాలని సుప్రీంకోర్టు అరుణ్‌కుమార్‌ను సుప్రీం కోరింది. ఇందుకోసం ఆయన అడిగిన విధంగా పెన్‌డ్రైవ్‌లో వివరాలు డిసెంబర్‌ 15లోగా అందజేయాలని మార్గదర్శిని ఆదేశిస్తున్నాం.

ఆయనను (ఉండవల్లి) ఎలా వినియోగించుకోవాలనేది మేం నిర్ణయిస్తాం. పెన్‌డ్రైవ్‌లో ఇచ్చిన డేటాను అరుణ్‌కుమార్‌ ఇతరులకు అందజేయకూడదు. పిటిషన్లు, కౌంటర్లు, అఫిడవిట్‌లతో రిజిస్ట్రీ ఓ ఐడెంటికల్‌ బుక్‌ తయారు చేయాలి. ఈ బుక్‌ కాపీలను పార్టీలతో పాటు అరుణ్‌కుమార్‌కు కూడా అందజేయాలి. దీనికయ్యే ఖర్చంతా మార్గదర్శి నుంచే రిజిస్ట్రీ వసూలు చేయాలి’ అని మధ్యంతర ఉత్తర్వుల్లో తెలంగాణ హైకోర్టు పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement