సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లాంటి కుంభకోణం ఇప్పటివరకు జరగలేదు, ఇకపై జరగబోదని ఏపీ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. ‘మార్గదర్శి’కి సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉందని వెల్లడించింది. మార్గదర్శి కేసు దర్యా ప్తు వివరాలను సీఐడీ అధికారులు మీడియాకు వెల్లడిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని కోరుతూ చెరు కూరి రామోజీరావు, శైలజ, మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రై. లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఏపీ ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ గోవిందరెడ్డి వాదనలు వినిపించారు. మార్గదర్శి అక్రమ మార్గాల్లో తరలించిన సొమ్మంతా ఖాతాదారులదేనని చెప్పారు. ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం విచారణ వివరాలు తెలుసుకునే ప్రాథమిక హక్కు వారికి ఉందన్నారు. ఈ రకమైన ఓ కుంభకోణం జరగడం ఇదే తొలిసారిని చెప్పారు. ఇదే విజ్ఞప్తిపై గతంలోనూ ఇదే హైకో ర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అప్పుడు పిటిషనర్‌కు అనుకూలంగా ఎలాంటి ఉపశమన ఆదేశాలు ఇవ్వలేదని గుర్తుచేశారు. ఈ పిటిషన్‌ను కూడా కొట్టివేయాలని కోరారు. అసలు మార్గదర్శి వేసిన పలు పిటిషన్లపై విచారణ జరిపే అర్హత ఈ కోర్టుకు ఉందా అన్న అంశంపై విచారణ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని చెప్పారు. ఈ పిటిషన్ జూలై 18న విచారణకు రానుందని, అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూలై 20కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment