కాకినాడ లీగల్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖలో గతంలో డిఐజీపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శాఖాపరమైన విచారణ చేసేందుకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్‌శాఖ జాయింట్ ఐజీ జి.సుబ్బారాయుడు జిల్లాకు వచ్చినట్టు ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఈయన రెండు రోజులుగా రాజమహేంద్రవరం, కాకినాడలలో సబ్‌రిజిస్ట్రార్లతో గోప్యంగా విచారణ జరిపుతున్నట్టు తెలిసింది. గతంలో రిజిస్ట్రేషన్‌శాఖ విశ్రాంత డీఐజీ లక్ష్మీకుమారి అక్రమాలకు పాల్పడుతున్నారని, నెలవారి మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ రిజిస్ట్రేషన్‌శాఖ ఐజీ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లో ‘స్టాంప్ డ్యూటీకి రూ.5.50 కోట్లుకు గండి’ అంటూ ‘సాక్షి’లో 2017 మే మూడో తేదీన కథనం కూడా ప్రచురితమైంది.
గతంలో అందిన ఫిర్యాదు, సాక్షిలో వచ్చిన కథనం, అక్రమ రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలపై జాయింట్ ఐజీ జి. సుబ్బారాయుడు విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈయన మంగళవారం రాజమహేంద్రవరం జిల్లా పరి«ధిలో ఉన్న 18 మంది సబ్ రిజిస్ట్రార్లను విచారణ చేపట్టారు. అనంతరం బుధవారం కాకినాడ డీఐజీ కార్యాలయానికి చేరుకుని కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న 14 మంది సబ్‌రిజిస్ట్రార్లతోపాటు, డీఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులను ఆరా తీసినట్టు ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులపై డీఐజీ వేధింపులకు పాల్పడడం, అకారణంగా తిట్టడం వంటివి చేస్తుండడంతో అప్పట్లో చాలా మంది ఉద్యోగులు మూడునుంచి ఆరు నెలల వరకు సెలవుల్లోకి వెళ్లినట్టు ఉద్యోగులు విచారణలో చెప్పారు. అలాగే జిల్లాలో ఒక మెట్ట ప్రాంతానికి చెందిన సబ్‌రిజిస్ట్రార్ ఆర్థిక లావాదేవీలు, అక్రమ రిజిస్ట్రేషన్లకు డీఐజీకి అండగా ఉంటూ అక్రమ లావాదేవీలు జరిపేవారని చెప్పినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment