సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 150 ఏళ్ల నుంచి ఉన్న పాత రికార్డులను డిజిటలీకరణ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దస్తావేజులు, వాటికి సంబంధించి మొత్తం 15 కోట్ల పేజీలను స్కానింగ్ చేసి కంప్యూటరైజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1850 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థ అమల్లో ఉంది. 1999 వరకు రిజిస్టర్ అయిన ప్రతి డాక్యుమెంట్‌ను ఒక పెద్ద వాల్యూమ్‌లో (పుస్తకం) ఎత్తిరాసి ఒరిజినల్ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఇచ్చేవారు.
అమ్మినవాళ్లు, కొన్నవాళ్ల వివరాలను ఇండెక్స్ పుస్తకాల్లో నమోదు చేసేవారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వాల్యూమ్, ఇండెక్స్ పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. మరోవైపు.. 1999 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణ జరిగింది. దస్తావేజులను స్కాన్‌చేసి ఒరిజినల్స్‌ను వినియోగదారులకు ఇస్తున్నారు.
శిథిలమైన 150 ఏళ్ల నాటి రికార్డులు
ఇక అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ల ఈసీ నకలు కాపీ కావాలని అడిగితే ఈ వాల్యూమ్‌లో వెతికి ఇస్తున్నారు. ఇది చాలా క్లిష్టతరంగా మారింది. 150 ఏళ్ల నాటి రికార్డు కావడంతో అవన్నీ పాతపడిపోయాయి. వాల్యూమ్‌లు పట్టుకుంటే పేజీలు చిరిగిపోతూ, చిల్లులు పడి, పొడిపొడి అయిపోతూ అస్తవ్యస్తంగా తయారయ్యాయి.
వాటిని భద్రపరచడం కూడా చాలాకష్టంగా మారిపోయింది. భూముల విలువ పెరిగిన నేపథ్యంలో వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజులుపోతే వాటిని తీసి చూడడం కూడా సాధ్యంకాని పరిస్థితి. అన్నింటికీ మించి ఎవరైనా తమ పాత దస్తావేజు నకలు కావాలని అడిగితే దాన్ని గుర్తించే పరిస్థితి లేకుండాపోయింది. ఆ వాల్యూమ్ నెంబర్, పేజీ నెంబర్ చెబితే తప్ప వెతికి ఇచ్చే పరిస్థితిలేదు.
ఐడీఎంఆర్‌ఎస్ విధానంలో డిజిటలీకరణ
ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం బ్రిటీష్ కాలం నుంచి 1999 వరకు రిజిస్టర్ అయిన దస్తావేజులు, ఇతర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 269 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పని వేగంగా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు జోన్లుగా విభజించి డిజిటలీకరణ కోసం టెండర్లు పిలిచారు.
రైటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు జోన్ల టెండర్లు దక్కించుకుని పని మొదలుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ రికార్డ్ సిస్టమ్ (ఐడీఎంఆర్‌ఎస్) విధానంలో డిజిటలీకరణ చేస్తున్నారు. మొదట అన్ని కార్యాలయాల్లో పాత రికార్డులను స్కానింగ్ చేసి ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరిస్తున్నారు. ఆర్నెలల్లో మొత్తం రికార్డుల డిజిటలీకరణ పూర్తయ్యే అవకాశమున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు.
డిజిటలీకరణ తర్వాత వెంటనే ఈసీ నకలు
ఇక డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ చెప్పగానే దానిని వెంటనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈసీ నకలును ప్రజలు సులభంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే, విలువైన ఆస్తుల రికార్డులు భద్రంగా ఉంటాయి. ఈ పని వేగంగా జరుగుతోంది.
– వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ
Comments
Please login to add a commentAdd a comment