Digitized
-
పేర్లు.. పింఛను వెతలు...
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కోల్‌మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సీఎంపీఎఫ్) విధించిన కొత్త నిబంధన కొందరు రిటైర్డ్ సింగరేణి కార్మికులకు ఇబ్బందిగా మారింది. వాస్తవానికి విశ్రాంత కార్మికుల సంక్షేమానికి సీఎంపీఎఫ్ బతికిఉన్న ప్రతీ కార్మికుడు, అతడి భార్య వివరాలు డిజిటలైజేషన్ చేయాలని ఇటీవల నిర్ణయించింది. కొందరు సింగరేణి కార్మికుల భార్యలు మరణించగా, రెండో వివాహం చేసుకున్నారు. ఇలాంటి వారి వివరాలు ఇంతవరకూ డిజిటలైజ్ కాలేదు. అందుకే, భార్యల ప్ర యోజనాలు కాపాడేందుకు, వితంతువులకు పింఛన్ ఇవ్వాలన్న సదుద్దేశంతో సీఎంపీఎఫ్ ఈ కార్యక్రమాన్ని కొద్దిరోజులుగా కోల్‌బెల్ట్‌లో మొదలుపెట్టింది. రిటైరైన కార్మికులంతా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి, ఆధార్ వివరాలు సమర్పిస్తున్నారు. ఇందుకోసం బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు. తమకోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నా రు. సింగరేణి వ్యాప్తంగా రిటైర్డ్ కార్మికులు 84,808 మంది ఉన్నారు. న్యాయపరమైన చిక్కులతోనే... సింగరేణిలో చాలామంది కార్మికులు గతంలో అలియాస్ పేర్లతో విధులు నిర్వర్తించేవారు. అప్పట్లోయాజమాన్యం కూడా దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వాల దృష్టిలో ఉన్నదే. తెలంగాణ ఆవిర్భవించాక రెండుపేర్లు ఉన్న కార్మికుల ప్రయోజనాలు పరిరక్షిస్తామని సీఎం హామీ ఇచ్చినా..న్యాయపరమైన చిక్కుల వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే, ఇప్పుడు సీఎంపీఎఫ్ విధించిన కొత్త నిబంధనలు రెండు పేర్లున్న సింగరేణి కార్మికుల పాలిట ప్రతికూలంగా మారాయి. రెండు రోజులుగా తిరుగుతున్నా జీడీకే–2గనిలో కోల్‌ఫిల్లర్‌గా పనిచేసి తొమ్మిదేళ్ల కిందట రిటైర్డ్ అయ్యా. అప్పటి నుంచి పెన్షన్ తీసుకుంటున్నా. పాత రామగుండం నుంచి 2 రోజులుగా బ్యాంకుకు వచ్చి వెళ్తున్నా. ఇంకా పని కాలేదు. ఇద్దరికి బ్యాంకు అకౌంట్లు ఉండాలంటున్నారు. తర్వాతే జాయింట్ చేస్తామని చెబుతున్నారు. - ఈదునూరి శంకర్ రిటైర్డ్ కార్మికుడు గర్రెపల్లి నుంచి వచ్చా జీడీకే–2ఏ గనిలో పనిచేసి 11 ఏళ్ల కిందట రిటైర్డ్ అయ్యా. మళ్లీ అన్ని పేపర్లు అడుగుతున్నారు. చేతకాకున్నా మనుమడిని పట్టుకొని బ్యాంకుకు వచ్చా. గంటల తరబడి లైన్లో కూర్చోవాల్సి వచ్చింది. మళ్లీ పేపర్లు అన్నీ నింపి ఫొటోలు ఇవ్వాల్సి రావడం ఆలస్యం అవుతోంది. - పిట్టల గంగయ్య రిటైర్డ్ కార్మికుడు 20 శాతం మారుపేర్లతోనే... సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయిన కార్మికుల్లో సుమారు 20శాతం మంది మారుపేర్లతో పనిచేశారు. వీరికి సింగరేణిలో ఒకపేరు, సొంత గ్రామంలో మరోపేరు ఉంది. వీరందరికీ మొన్నటి వరకూ రెండు ఆధార్‌కార్డులు కూడా ఉన్నాయి. కరోనా తర్వాత కేంద్రం రెండు పేర్లతో ఉన్న ఆధార్‌కార్డుల తొలగింపు మొదలుపెట్టింది. దీంతో వందలాదిమంది సింగరేణి కార్మికులు తమ ఆధార్‌కార్డులు కోల్పోవాల్సి వచ్చింది. కొందరు మారుపేరు కార్డు కోల్పోగా, మరికొందరు సొంత పేరుతో ఉన్న కార్డులు కోల్పోయారు. ప్రస్తుతం ఇదే ఇబ్బందిగా మారింది. వితంతువులకు కూడా ఇది ఇబ్బందికరంగా మారింది. అందుకే, మారుపేర్లతో ఉన్న కార్మికులను అలియాస్ పేరుతో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అసలు తమకు వచ్చేది అరకొర పింఛన్ అని, దానికి ఇన్ని తిప్పలు పెట్టి తమ పొట్టకొట్టొద్దని వేడుకుంటున్నారు. ఊర్లో ఉన్న ఆస్తులు రైతుబంధు, రైతుబీమా వివిధ సంక్షేమ పథకాలకు సొంతపేరుతో ఉన్న ఆధార్‌కార్డు లింక్ అయ్యాయని, ఇప్పుడు తామేం చేయాలో తెలియని అయోమయ స్థితి నెలకొందని వాపోతున్నారు. యాల్సి వచ్చిందని విలపించారు. -
వేగంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ
సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 150 ఏళ్ల నుంచి ఉన్న పాత రికార్డులను డిజిటలీకరణ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దస్తావేజులు, వాటికి సంబంధించి మొత్తం 15 కోట్ల పేజీలను స్కానింగ్ చేసి కంప్యూటరైజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1850 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థ అమల్లో ఉంది. 1999 వరకు రిజిస్టర్ అయిన ప్రతి డాక్యుమెంట్‌ను ఒక పెద్ద వాల్యూమ్‌లో (పుస్తకం) ఎత్తిరాసి ఒరిజినల్ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఇచ్చేవారు. అమ్మినవాళ్లు, కొన్నవాళ్ల వివరాలను ఇండెక్స్ పుస్తకాల్లో నమోదు చేసేవారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వాల్యూమ్, ఇండెక్స్ పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. మరోవైపు.. 1999 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణ జరిగింది. దస్తావేజులను స్కాన్‌చేసి ఒరిజినల్స్‌ను వినియోగదారులకు ఇస్తున్నారు. శిథిలమైన 150 ఏళ్ల నాటి రికార్డులు ఇక అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ల ఈసీ నకలు కాపీ కావాలని అడిగితే ఈ వాల్యూమ్‌లో వెతికి ఇస్తున్నారు. ఇది చాలా క్లిష్టతరంగా మారింది. 150 ఏళ్ల నాటి రికార్డు కావడంతో అవన్నీ పాతపడిపోయాయి. వాల్యూమ్‌లు పట్టుకుంటే పేజీలు చిరిగిపోతూ, చిల్లులు పడి, పొడిపొడి అయిపోతూ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిని భద్రపరచడం కూడా చాలాకష్టంగా మారిపోయింది. భూముల విలువ పెరిగిన నేపథ్యంలో వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజులుపోతే వాటిని తీసి చూడడం కూడా సాధ్యంకాని పరిస్థితి. అన్నింటికీ మించి ఎవరైనా తమ పాత దస్తావేజు నకలు కావాలని అడిగితే దాన్ని గుర్తించే పరిస్థితి లేకుండాపోయింది. ఆ వాల్యూమ్ నెంబర్, పేజీ నెంబర్ చెబితే తప్ప వెతికి ఇచ్చే పరిస్థితిలేదు. ఐడీఎంఆర్ఎస్ విధానంలో డిజిటలీకరణ ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం బ్రిటీష్ కాలం నుంచి 1999 వరకు రిజిస్టర్ అయిన దస్తావేజులు, ఇతర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 269 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పని వేగంగా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు జోన్లుగా విభజించి డిజిటలీకరణ కోసం టెండర్లు పిలిచారు. రైటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు జోన్ల టెండర్లు దక్కించుకుని పని మొదలుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ రికార్డ్ సిస్టమ్ (ఐడీఎంఆర్ఎస్) విధానంలో డిజిటలీకరణ చేస్తున్నారు. మొదట అన్ని కార్యాలయాల్లో పాత రికార్డులను స్కానింగ్ చేసి ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరిస్తున్నారు. ఆర్నెలల్లో మొత్తం రికార్డుల డిజిటలీకరణ పూర్తయ్యే అవకాశమున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. డిజిటలీకరణ తర్వాత వెంటనే ఈసీ నకలు ఇక డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ చెప్పగానే దానిని వెంటనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈసీ నకలును ప్రజలు సులభంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే, విలువైన ఆస్తుల రికార్డులు భద్రంగా ఉంటాయి. ఈ పని వేగంగా జరుగుతోంది. – వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ -
‘రేషన్’.. డిజిటలైజేషన్
సాక్షి, హైదరాబాద్: ప్రజాపంపిణీ వ్యవస్థ సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల పంపిణీకి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని అమలుపర్చేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ‘4 జీ’ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి రేషన్ దుకాణాలను డిజిటలీకరణ చేసేందుకు చర్యలు చేపట్టింది. బ్లూటూత్ సాయంతో ఈ– పాస్ యంత్రాన్ని తూకం వేసే యంత్రానికి అనుసంధానం చేసి లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. మే నెల నుంచి హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ చౌకదుణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందుకోసం æసరికొత్త యంత్రాలను ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరవేసింది. తప్పుడు తూకాలకు చెక్ చౌక ధరల దుకాణాల్లో తప్పుడు తూకాలకు చెక్ పడనుంది. లబ్ధిదారులు తీసుకునే సరుకులు మాత్రమే డ్రా కానున్నాయి. వాస్తవంగా ఇప్పటి వరకు బయోమెట్రిక్‌కు సంబంధించిన ఈ–పాస్ యంత్రం, తూకం వేసే వెయింగ్ మెషీన్ వేర్వేరుగా ఉండేవి. లబ్ధిదారుడి బయోమెట్రిక్ తీసుకుని అవసరమైన సరుకులను తూకం మెషీన్ ద్వారా అందించి మిగతా సరుకులు డీలర్లు నొక్కేయడం ఆనవాయితీగా మారింది. తూకంలో సైతం తేడా ఉండేది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ– పాస్ యంత్రానికి, తూనికల యంత్రం అనుసంధానమై ఉంటుంది. లబ్ధిదారు వేలి ముద్ర నిర్ధారణ అయిన వెంటనే బ్లూటూత్‌తో తూనికల యంత్రానికి సిగ్నల్ వెళ్తుంది. లబ్ధిదారుడి కుటుంబంలో ఎన్ని యూనిట్లు, రేషన్, ఇతర కోటా సమాచారం వెళ్తుంది. దీని ఆధారంగా రేషన్ పంపిణీ జరుగుతుంది. ఇదంతా ఆటోమేటిక్‌గా రికార్డు అవుతుంది. సేవలు వేగవంతం కావడంతో పాటు లబ్ధిదారుకు హెచ్చు తగ్గులు లేకుండా రేషన్ పంపిణీ అవుతుంది. (చదవండి: పరీక్షల హాజరుకు మాస్కు తప్పనిసరి) -
ఆ వార్తల్లో నిజం లేదు.. మణిరత్నం సినిమాలు భద్రపరుస్తాం
‘దళపతి’ (1991), ‘రోజా’ (1992), బొంబాయి (1995), ‘యువ’ (2004).. ఇలా ఎన్నో అద్భుత చిత్రాలను అందించారు దర్శకుడు మణిరత్నం. ఇప్పటివరకూ ఆయన 26 సినిమాలు తీశారు. వాటిలో ‘క్లాసిక్’ అనదగ్గవి చాలా ఉన్నాయి. ఆ క్లాసిక్స్‌ని భద్రపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయం గురించి ఈ ప్రాజెక్ట్‌తో అసోసియేట్ అయిన శివేంద్ర సింగ్ మాట్లాడుతూ– ‘‘క్లాసిక్ సినిమాలను ఇప్పటి సాంకేతికతో భద్రపరచడం, మెరుగులు దిద్దడం వంటి అంశాలపై 2017లో చెన్నైలో వర్క్‌షాప్ చేశాం. అప్పుడు మణిరత్నంతో మాట్లాడాను. ఆయన సినిమాల్లో కొన్ని ప్రింట్స్, నెగటివ్స్ మెరుగైన స్థితిలో లేవు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి ఆణిముత్యాలను ‘ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్’ (ఎఫ్‌హెచ్‌ఎఫ్)లో ఎలా భద్రపరుస్తామో వివరించాం. మణిరత్నం సానుకూలంగా స్పందించారు. సినిమాలను 8కె రిజల్యూషన్‌లో భద్రపరుస్తాం. ఇప్పుడు అందరూ 4కె రిజల్యూషన్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. పాత ప్రింట్స్, నెగటివ్‌లను జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ఈ డిజిటలైజేషన్ ప్రాసెస్‌లో ప్రసాద్ కార్పొరేషన్ సహకారం ఉంది. అలాగే మేం ఒక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ కోసం ఇలా చేస్తున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని పేర్కొన్నారు. -
గ్రూప్-2 జవాబు పత్రాల డిజిటైజేషన్
- భవిష్యత్తు అవసరాల కోసం జేపీజీ ఫార్మాట్లోకి మార్పు - రేపటికల్లా పూర్తికానున్న ప్రక్రియ, ఆ తరువాతే ప్రాథమిక ‘కీ’ విడుదల సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 1,032 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఈ నెల 11, 13 తేదీల్లో నిర్వహిం చిన రాత పరీక్ష జవాబు పత్రాల డిజిటైజేషన్‌కు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది. భవిష్యత్తు అవసరాలు, రిఫరెన్స కోసం అభ్యర్థుల జవాబు పత్రా లను జేపీజీ ఫార్మాట్లోకి మారుస్తోంది. పరీక్ష రాసేందుకు 7,89,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 63 శాతం మంది హాజరయ్యారు. వారందరికి సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియ చేపడుతోంది. దీంతో భవిష్యత్తులో మూల్యాంకనానికి సంబంధించిన సమస్యలు తలెత్తినా డిజిటలైజ్ చేసిన జవాబు పత్రాలను చూసుకునేలా వాటిని టీఎస్పీఎస్సీ సర్వర్‌లో భద్రపరుస్తోంది. తద్వారా పారదర్శకతకు పెద్దపీట వేయవచ్చని భావిస్తోంది. ఈ ప్రక్రియ బుధవారం నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తరువాతే గ్రూప్-2 రాత పరీక్ష ప్రాథమిక ‘కీ’ని టీఎస్పీఎస్సీ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తగిన చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఆ తరువాతే చేపట్టి ఫలితాలను ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ వెల్లడించారు.