computerized
-
వేగంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ
సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో 150 ఏళ్ల నుంచి ఉన్న పాత రికార్డులను డిజిటలీకరణ చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. దస్తావేజులు, వాటికి సంబంధించి మొత్తం 15 కోట్ల పేజీలను స్కానింగ్ చేసి కంప్యూటరైజ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 1850 నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవస్థ అమల్లో ఉంది. 1999 వరకు రిజిస్టర్ అయిన ప్రతి డాక్యుమెంట్‌ను ఒక పెద్ద వాల్యూమ్‌లో (పుస్తకం) ఎత్తిరాసి ఒరిజినల్ డాక్యుమెంట్‌ను రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి ఇచ్చేవారు. అమ్మినవాళ్లు, కొన్నవాళ్ల వివరాలను ఇండెక్స్ పుస్తకాల్లో నమోదు చేసేవారు. ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ వాల్యూమ్, ఇండెక్స్ పుస్తకాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. మరోవైపు.. 1999 నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కంప్యూటరీకరణ జరిగింది. దస్తావేజులను స్కాన్‌చేసి ఒరిజినల్స్‌ను వినియోగదారులకు ఇస్తున్నారు. శిథిలమైన 150 ఏళ్ల నాటి రికార్డులు ఇక అంతకుముందు జరిగిన రిజిస్ట్రేషన్ల ఈసీ నకలు కాపీ కావాలని అడిగితే ఈ వాల్యూమ్‌లో వెతికి ఇస్తున్నారు. ఇది చాలా క్లిష్టతరంగా మారింది. 150 ఏళ్ల నాటి రికార్డు కావడంతో అవన్నీ పాతపడిపోయాయి. వాల్యూమ్‌లు పట్టుకుంటే పేజీలు చిరిగిపోతూ, చిల్లులు పడి, పొడిపొడి అయిపోతూ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. వాటిని భద్రపరచడం కూడా చాలాకష్టంగా మారిపోయింది. భూముల విలువ పెరిగిన నేపథ్యంలో వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజులుపోతే వాటిని తీసి చూడడం కూడా సాధ్యంకాని పరిస్థితి. అన్నింటికీ మించి ఎవరైనా తమ పాత దస్తావేజు నకలు కావాలని అడిగితే దాన్ని గుర్తించే పరిస్థితి లేకుండాపోయింది. ఆ వాల్యూమ్ నెంబర్, పేజీ నెంబర్ చెబితే తప్ప వెతికి ఇచ్చే పరిస్థితిలేదు. ఐడీఎంఆర్ఎస్ విధానంలో డిజిటలీకరణ ఈ నేపథ్యంలో.. ప్రభుత్వం బ్రిటీష్ కాలం నుంచి 1999 వరకు రిజిస్టర్ అయిన దస్తావేజులు, ఇతర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల డిజిటలీకరణ చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 269 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ పని వేగంగా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నాలుగు జోన్లుగా విభజించి డిజిటలీకరణ కోసం టెండర్లు పిలిచారు. రైటర్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు జోన్ల టెండర్లు దక్కించుకుని పని మొదలుపెట్టింది. ఇంటిగ్రేటెడ్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ రికార్డ్ సిస్టమ్ (ఐడీఎంఆర్ఎస్) విధానంలో డిజిటలీకరణ చేస్తున్నారు. మొదట అన్ని కార్యాలయాల్లో పాత రికార్డులను స్కానింగ్ చేసి ఆ తర్వాత వాటిని కంప్యూటరీకరిస్తున్నారు. ఆర్నెలల్లో మొత్తం రికార్డుల డిజిటలీకరణ పూర్తయ్యే అవకాశమున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. డిజిటలీకరణ తర్వాత వెంటనే ఈసీ నకలు ఇక డిజిటలైజేషన్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ నెంబర్ చెప్పగానే దానిని వెంటనే ఇచ్చే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల ఈసీ నకలును ప్రజలు సులభంగా పొందే అవకాశం ఏర్పడుతుంది. అలాగే, విలువైన ఆస్తుల రికార్డులు భద్రంగా ఉంటాయి. ఈ పని వేగంగా జరుగుతోంది. – వి. రామకృష్ణ, కమిషనర్ అండ్ ఐజీ, స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ -
కంప్యూటరీకరణపై కాలయాపన
- రెండేళ్ల క్రితం రూ.2.5 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం - ఇప్పటివరకు పనులు ప్రారంభించని అధికారులు - పర్యాటకాభివృద్ధి సంస్థలో గందరగోళం సాక్షి, హైదరాబాద్: భారీ ధరలకు కొన్న పడవలను మరమ్మతుల పేరుతో వృథాగా పడేయటం.. రూ.కోట్లు వెచ్చించి నాసికరం పనులతో సౌండ్ అండ్ లైట్ షోలు పడకేసేలా చేయటం.. అడ్డగోలు బిల్లులతో హరిత హోటళ్లలో నిధులు దారి మళ్లించటం.. ఇలా పర్యాటక అభివృద్ధి సంస్థలో అధికారులది ఆడింది ఆట పాడింది పాట. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక ప్రాంతాలను ప్రధాన కార్యాలయంతో అనుసంధానించి నేరుగా పర్యవేక్షించే వెసులుబాటు కల్పించటం ద్వారా కొంతవరకు పరిస్థితిని అదులోపులోకి తెచ్చే వీలుంది. ఈ నేపథ్యంలో ప్రధాన కౌంటర్లను కంప్యూటరీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులనూ మురగబెట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. టెండర్ల పేరుతో కాలయాపన పర్యాటకుల టూర్ బుకింగ్స్, వివిధ ప్రాం తాల్లో సౌండ్ అండ్ లైట్ షో టికెట్ల విక్రయం, హోటళ్ల లెక్కలకు సంబంధించిన కీలక విషయాల్లో కంప్యూటరీకరణ సరిగా లేదు. దీంతో కంప్యూటరీకరించేందుకు ప్రభుత్వం 2015లో రూ.రెండున్నర కోట్లను మంజూరు చేసింది. అయితే ఈ నిధులతో సంబంధిత పనులు చేపట్టాల్సిన పర్యాటకాభివృద్ధి కార్పొరేషన్.. టెండర్ల పేరుతో కాలయాపన చేసింది. ఓసారి టెండర్లు పిలవగా, కేవలం ఒకే బిడ్ దాఖలైందన్న కారణంతో దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత అదే తరహాలో మరోసారి రద్దు చేశారు. మరోసారి టెండర్లు పిలిచి.. పనులు మొదలుపెట్టినా కొలిక్కి తేలేక పోయారు. ఇలా రెండేళ్లపాటు ఆ నిధులను కంప్యూటరీకరణ కోసం ఖర్చు చేయలేదు. ఈ నేపథ్యంలో నిధులను అసలు లక్ష్యం కోసం ఖర్చు చేయలేదని గుర్తించిన ఆడిట్ విభాగం.. కార్పొరేషన్ వివరణ కోరింది. ఖాళీ బిల్లులతో నిధుల దారి మళ్లింపు రాష్ట్రవ్యాప్తంగా హరిత హోటళ్లను ఏర్పాటు చేస్తున్నా చాలా చోట్ల పర్యవేక్షణ సరిగా లేక నిధులు దారిమళ్లుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఖాళీ బిల్లులను దగ్గర పెట్టుకుని వాటితో నిధులు దారి మళ్లిస్తున్నట్టు ఫిర్యాదులున్నాయి. ఇటీవల స్వయంగా పోలీసులు విచారణ జరిపి హైదరాబాద్‌లోని ప్లాజా హోటల్లో అక్రమాల నిగ్గు తేల్చారు. హుసేన్సాగర్ సహా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాల వద్ద బోటింగ్ విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యమే కనిపిస్తోంది. అధికారుల నిర్లక్ష్యం ప్లాజా హోటల్, రెస్టారెంట్ల ద్వారా వచ్చిన మొత్తాన్ని బ్యాంకు కరెంటు ఖాతాలోనే ఉంచటం వల్ల పెద్ద మొత్తంలో అదనపు ఆదాయాన్ని పర్యాటక అభివృద్ధి సంస్థ కోల్పోయింది. వేరే పద్ధతిలో ఇన్వెస్ట్ చేసి ఉంటే రూ.లక్షల్లో అదనంగా ఆదాయం సమకూరేదన్న విషయం ఇటీవల ఆడిట్ పరిశీలనతో తేలింది. కార్పొరేషన్‌కు చెందిన ఓ రెస్టారెంట్ నిర్వహణకు టెండర్లు పిలిచినా సకాలంలో దాన్ని అప్పగించక భారీ మొత్తంలో ఆదాయం కోల్పోయింది. ఇంత జరుగుతున్నా కార్పొరేషన్ ఉన్నతాధికారులు వాటిపై దృష్టి సారించలేదు. -
రైల్వే బడ్జెట్‌పై సలహాలు కోరిన మంత్రి
న్యూఢిల్లీ: రాబోయే రైల్వే బడ్జెట్‌ను పౌర ఆధారితంగా తయారు చేసేందుకు సలహాలివ్వాల్సిందిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రజలను కోరారు. పౌరులకు రైల్వేను మరింత చేరువ చేసేందుకు, ప్రజల ఇబ్బందులను మరింతగా అర్థం చేసుకునేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. రైళ్ల పొడిగింపు, కొత్త రైళ్ల ఏర్పాటు, కంప్యూటరీకరణ, నేరాల అదుపు, ఆహార సరఫరా, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర అంశాలన్నింటిపైనా సలహాలు, సూచనలు అందివ్వవచ్చని రైల్వే శాఖ తెలిపింది. ప్రజలు తమ సూచనలను ఈ నెల 16లోపు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్లో సమర్పించాలని రైల్వే శాఖ కోరింది. రైల్వే బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి వారంలో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. -
రుణమాఫీపై ఆశలు
సాక్షి, ఒంగోలు: పండగ రోజుల్లో పల్లెల్లో దైన్యం నెలకొంది. పంట రుణాల మాఫీపై రైతులు గంపెడాశతో ఉన్నారు. పీక ల్లోతు అప్పుల్లో కూరుకున్న వారు పాతరుణాలు మాఫీ అయితే.. కొత్త రుణాలొస్తాయని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం మాత్రం పథకం అమల్లో పట్టీపట్టనట్టు వ్యవహరించడంతో.. క్షేత్రస్థాయిలో బ్యాంకర్లు కూడా రైతులకు సాయం చేసేందుకు ముందుకు రావడం లేదు. రుణమాఫీ అమలు విధివిధానాల మేరకు ప్రభుత్వం సూచించిన వివరాల కంప్యూటరీకరణపై బ్యాంకులు నిర్లక్ష్యం చూపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు మండలాల నుంచి బాధిత రైతులు సోమవారం ఒంగోలులో ప్రజావాణి కార్యక్రమానికి హాజరై కలెక్టర్‌కు బ్యాంకర్లపై ఫిర్యాదులిచ్చారు. రైతుల రుణాలకు సంబంధించి సమగ్ర వివరాలను ‘ఆన్లైన్’లో పొందుపరచడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలందినా.. బ్యాంకర్ల తీరులో మార్పుకనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రతీ ఒక్క రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వరకు పంటరుణం మాఫీ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 7.5 లక్షల రైతుల రుణాల ఖాతాలుండగా, వాటిల్లో సుమారు రూ.3,600 కోట్ల రుణాలు మాఫీ అవుతాయని అధికారుల అంచనా. రైతుల పేరుతో కొంతమంది బినామీలు తీసుకున్న రుణాల్ని గుర్తించేందుకు విధాన నిర్ణయాలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఆమేరకు సమగ్ర వివరాలను అందించాలని రైతులను కోరింది. ఇందుకు జిల్లాలోని బ్యాంకర్ల నుంచి పూర్తిస్థాయి సహకారం అందడం లేదు. వివరాలను పొందుపర్చడంలో తీవ్రజాప్యం జరుగుతోంది. వీటిని పర్యవేక్షించాల్సిన లీడ్‌బ్యాంక్ అధికారుల ఆదేశాలను కొన్ని బ్యాంకులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం 53.50 శాతం మాత్రమే వివరాలను పొందుపరిచారు. లీడ్‌బ్యాంకు గణాంకాల ప్రకారం జిల్లాలో 7,5,524 మంది రైతుల పంటరుణాల ఖాతాలన్నాయి. ఇవన్నీ రుణమాఫీకి అర్హమైనవిగా గుర్తించారు. సుమారు రూ.3,600 కోట్లు వరకు రుణమాఫీ చేయాల్సి ఉంది. ఎక్కువ రుణం తీసుకున్న రైతులకు రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ వర్తిస్తోందని ప్రభుత్వం ఇప్పటికే తేల్చిచెప్పింది. రుణాలు ఇప్పటికే చెల్లించిన వారికి తిరిగి చెల్లింపులు జరుపుతారని అధికారపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నా.. వాటిల్లో స్పష్టత లేదు. మార్గదర్శకాల పేరుతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. తొలుత సమగ్ర వివరాల కంప్యూటరీకరణకు గడువు సెప్టెంబర్ 25తో ఆఖరు అని ప్రకటించినా... బ్యాంకుల జాప్యంతో వచ్చేనెల 1వ తేదీ వరకు పొడిగించారు. అయినప్పటికీ గడువులోగా కంప్యూటరీకరణ చేయడంలో బ్యాంకులెంతగా సఫలీకృతులవుతారో తెలియాల్సి ఉంది. పాతసమాచారాన్నే.. కొత్తగా పొందుపరుస్తూ.. రైతులు పంటరుణం తీసుకునే సమయంలో పట్టాదారు పాసుపుస్తకాలు తనఖా పెడతారు. టైటిల్డీడ్నూ బ్యాంకులు తీసుకుంటున్నాయి. బంగారం పెట్టినప్పుడు సేద్యం భూముల వివరాలను సమగ్రంగా పరిశీలించి రికార్డుల్లో నమోదు చేస్తారు. సర్వే నంబర్‌తో సహా పొలం విస్తీర్ణం కూడా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. రుణ అర్హతకు ఏఏ పంటలు వర్తిస్తాయనేది పరిశీలించి మరీ.. ఆయా పంటలు పండించే రైతులకే రుణాలిస్తారు. నిబంధనల ప్రకారం రైతులకు ఎలాంటి తనఖా (కుదువ) లేకుండా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే, బ్యాంకులు దీన్ని పాటించడం లేదు. కౌలు రైతులకు రుణాలు తీసుకునే సమయంలో ఎల్ఈసీ (రైతురుణ అర్హత గుర్తింపు) కార్డు ఉండాలి. పొలం సర్వేనంబర్ తప్పనిసరిగా అవసరం. అయితే, ఈ రెండింటిని మాత్రమే పరిగణలోకి తీసుకుని రుణమిచ్చిన బ్యాంకులే లేకపోవడం గమనార్హం. కంప్యూటరీకరిస్తోన్న సమగ్ర వివరాలివే.. రుణాలు తీసుకున్న రైతులు బ్యాంకుల్లో రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఇవ్వాలి. తాజాగా పట్టాదారు పాసుపుస్తకం కూడా బ్యాంకర్లకు అందజేయాలని కొత్త నిబంధన పెట్టారు. ఎంత విస్తీర్ణంలో ఏయే పంటలు సాగుచేస్తున్నారో కూడా వివరాలను అందజేయాల్సి ఉంటుంది. ఆయా భూముల సర్వే నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలంటున్నారు. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు వీఆర్వోల నుంచి ధ్రువీకరణలు తీసుకుని వాటిద్వారా రుణాలు తీసుకున్నారు. ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా తీసుకున్న పొలం అడంగల్ కాపీలు బ్యాంకర్లకు అందజేయాలి. అయితే, ప్రస్తుతం పాసుపుస్తకాలు లేని రైతులు నానాకష్టాలు పడుతున్నారు. వివాదాలు, డాట్ భూములకు సంబంధించిన రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీకావడంలో జిల్లా అధికారుల వద్ద వందల్లో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి రుణమాఫీ వర్తించడం సందిగ్ధమేనని తెలుస్తోంది. ఒకే సర్వే నంబర్‌పై పలు బ్యాంకుల్లో బంగారం తనఖా పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్న లబ్ధిదారులు అనేకమంది ఉన్నారు. ప్రస్తుతం వీటన్నింటినీ క్రోడీకరించి వీటిల్లో ఒక బ్యాంకు రుణాల్నే మాఫీచేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంకుల్లో సిబ్బంది కొరత వల్ల ఈ పనులను తాము చేయలేకపోతున్నామని బ్యాంకర్లు వివరణ ఇస్తున్నారు. అదేవిధంగా ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా అకౌంట్ల సమగ్ర జాబితా తయారు చేసుకోవడం.. తాజాగా జన్‌ధన్ యోజన కింద కొత్త బ్యాంకు అకౌంట్లు తెరవడం తదితర కారణాలతో సిబ్బంది బిజీగా మారారంటూ బ్యాంకర్లు వివరణ ఇస్తున్నాయి. -
లెక్కతేలింది..
జిల్లా జనాభా 36,18,637 ఆధార్ కార్డులు లేనివారు 6,90,684 మొత్తం కుటుంబాలు 11,28,118 సమగ్ర సర్వేలో వెల్లడి హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తయింది. జిల్లా లో మొత్తం కుటుంబా లు, జనాభా లెక్కలపై స్పష్టత వచ్చింది. సర్వే వివరాల ఆధారంగా ప్రస్తుతం జిల్లాలో మొత్తం 36,18,637 జనాభా ఉన్నట్లు తేలింది. వీరిలో మహిళలు 17,72,835, పురుషులు 17,74, 852, మిగిలిన వారిలో ఇతరులు ఉన్నారు. జిల్లాలో మొత్తం కుటుం బాలు 11,28,118 ఉన్నారుు. 29,27,953 మంది (80 శాతం) ఆధార్‌కార్డులు కలిగి ఉన్నట్లు వివరాలు నమోదు చేసుకున్నారు. మిగతా 6,90,684 మందికి ఆధార్ కార్డులు లేవు. పెరిగిన కుటుంబాలు 2,42,118 జిల్లాలో 2011 జనాభా గ ణనతో పోలిస్తే ప్రస్తుతం 2,42,118 కుటుంబాలు పెరిగాయి. 2011లో చేపట్టిన జనాభా గణనలో మొత్తం 8.86 లక్షల కుటుంబాలు, 35.12 లక్షల జనాభా ఉంది. ప్రస్తుత సర్వేలో 11,28,118 కుటుంబాలు, 36,18,637 జనాభా ఉన్నట్లు వెల్లడైంది. అంటే 2011 కన్నా 1,06,637 లక్షల జనాభా పెరిగింది. తాడ్వాయిలో తక్కువ కుటుంబాలు.. ప్రస్తుత లెక్కల ప్రకారం తాడ్వాయి మండలం 7,116 కుటుంబాలతో జిల్లాలో చివరి స్థానంలో ఉంది. మహబూబాబాద్ మండలం 35,839 కుటుంబాలతో ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాలో డేటా ఎంట్రీ కార్యక్రమం సోమవారం సాయంత్రం పూర్తయినట్లు జిల్లా సమాచార అధికారి (డీఐఓ) విజయ్‌కుమార్ తెలిపారు. -
సర్వేలో నిరాధార్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ పూర్తయింది. కుటుంబాల సమగ్ర సమాచారాన్ని కంప్యూటరీకరించే ప్రక్రియను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. శనివారం నాటికి ఈ ప్రక్రియను కొలిక్కి తెచ్చిన యంత్రాంగం.. సర్వే రోజున మిగిలిపోయిన (ప్రి విజిట్‌లో ఇంటి నంబర్లు ఇవ్వని) కుటుంబాల వివరాలను కూడా నమోదు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో సర్వే ఫారాల కొరత కారణంగా జిరాక్స్ కాపీల్లో నమోదు చేసిన వివరాలను కూడా పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీచేయడంతో అధికారయంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సర్వే కంప్యూటరీకరణలో ఆధార్ విషయమై ఆసక్తికర విషయం వెలుగు చూసింది. దాదాపు 7.89 లక్షల మంది తమ ఆధార్ వివరాలను ఇవ్వలేదు. గత నెల 19వ తేదీన సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. దీంట్లో కేవలం గ్రేటర్ పరిధి మినహా మిగతా ప్రాంతంలో సర్వే నిర్వహణ బాధ్యతలను జిల్లా యంత్రాంగం చేపట్టింది. ఈ సర్వేలో జిల్లావ్యాప్తంగా 8.41 లక్షల కుటుంబాలు వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించారు. ఈ డేటాను గత వారం రోజులుగా కంప్యూటరీకరిస్తున్న ఆపరేటర్లు.. శనివారం ఈ ప్రక్రియకు ముగింపు పలికారు. తొలినాళ్లలో రోజుకు 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నిక్షిప్తం చేసిన సిబ్బంది.. దీన్ని లక్షకు చేర్చారు. దీంతో కంప్యూటరీకరణ మూడు రోజుల ముందుగానే ముగిసింది. ఇదిలావుండగా, అనివార్య పరిస్థితుల్లో సర్వే రోజున అందుబాటులో లేని (డోర్‌లాక్) కుటుంబాలు తమ వివరాలను నమోదు చేసుకోవాలని అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాయి. లెక్కతప్పిన ఆధార్ ఆధార్ కార్డుల జారీలో రాష్ర్టంలోనే రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 110 శాతం ఆధార్ కార్డులు ఇవ్వడం ద్వారా సరికొత్త రికార్డును నెలకొల్పింది. అయితే, సమగ్ర సర్వేలో ఆధార్ వివరాలు మాత్రం లెక్క తప్పాయి. కుటుంబ సభ్యుల సంఖ్యకు ఆధార్ కార్డుల జారీకి భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. శనివారం సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలో 27,77,742 మంది వివరాలను కంప్యూటరీకరించగా, దీంట్లో 7,89,868 మంది తమ ఆధార్ వివరాలను సర్వేలో పొందుపరచలేదు. ఆధార్ సమాచారం సర్వేలో నమోదు కాకపోవడానికి జిల్లా యంత్రాంగం.. పలు రకాలుగా విశ్లేషిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 52.96 లక్షలు. అయితే, ఆధార్ కార్డులు మాత్రం దీనికి పది లక్షల మేర అదనంగా జారీ అయ్యాయి. దీంట్లో నాలుగు లక్షల కార్డులను యూఐడీఐ తిరస్కరించింది. కాగా, తాజాగా నిర్వహించిన సమగ్ర సర్వేలో ఆధార్ యూఐడీ నంబర్‌ను విధిగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఒకవేళ ఆధార్ కార్డు అందకపోతే మాత్రం ఈఐడీ నంబర్‌ను పొందుపరచవద్దని స్పష్టం చేసింది. ఇది కూడా సర్వేలో ఆధార్ సంఖ్య తక్కువ నమోదు కావడానికి ఒక కారణంగా యంత్రాంగం చెబుతోంది. గ్రామీణ మండలాల్లో కార్డులను పోగొట్టుకున్నా, ఎక్కడ భద్రపరుచుకున్నా, సమయానికి దొరకకపోయినా విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు కాకపోవచ్చని అంటోంది. అదే సమయంలో ఆధార్ కార్డు(యూఐడీ) జారీలో జరిగిన జాప్యం కూడా సర్వేపై ప్రభావం చూపే అవకాశంలేకపోలేదని పేర్కొంటోంది. ఈ కారణాల వల్లే కుటుంబసభ్యుల సంఖ్యకు ఆధార్ కార్డుల వివరాల నమోదుకు భారీ తేడా కనిపిస్తోందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. -
సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణ
అదనంగా ఆపరేటర్ల నియామకం - ఇప్పటివరకు 38.79శాతం కంప్యూట రీకరణ - గ్రామీణ మండలాల్లో నత్తనడక.. పట్టణ ప్రాంతాల్లో చకచకా సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: సమగ్ర కుటుంబ సర్వే వివరాల కంప్యూటరీకరణలో జిల్లా యంత్రాంగం వేగాన్ని పెంచింది. సేకరించిన సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు అదనంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లను రంగంలోకి దించింది. సమగ్ర సర్వేను కంప్యూటరీకరించేందుకు జిల్లావ్యాప్తంగా 22 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంట్లో రెండు వేల కంప్యూటర్లను సమకూర్చిన యంత్రాంగం.. సర్వే సమాచారాన్ని నమోదు చేయడానికి అదేస్థాయిలో ఆపరేటర్లను నియమించింది. తొలి రెండు రోజులు కేవలం 900 మంది మాత్రమే హాజరుకావడం, కంప్యూటరీకరణ ఆలస్యమవుతుండడాన్ని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే డీటీపీ ఆపరేటర్లను అందరినీ ఈ విధులకు వినియోగించుకున్నప్పటికీ, నిర్ణీత వ్యవధిలో సమాచార నిక్షిప్తం కష్టసాధ్యమని భావించింది. ఈ క్రమంలో ప్రైవేటు ఆపరేటర్లను భారీగా వినియోగించింది. ఒక్కో కుటుంబం సమాచారాన్ని ఎంట్రీ చేసేందుకు ఐదు రూపాయలు ఇచ్చింది. అయినప్పటికీ కావాల్సినంతమంది ఆపరేటర్లు దొరకకపోవడంతో దీన్ని రూ.8, ఆ తర్వాత పది రూపాయలకు పెంచింది. దీంతో ఆపరేటర్లు ఇబ్బడిముబ్బడిగా సమకూరారు. ఈ నేపథ్యంలోనే డేటా ఎంట్రీ పనులు వేగాన్ని అందుకున్నాయి. గత నెల 19వ తేదీన జిల్లావ్యాప్తంగా(జీహెచ్ఎంసీ పరిధి మినహా) 8.41 లక్షల కుటుంబాల సర్వే వివరాలు నమోదు చేయగా, దీంట్లో ఇప్పటివరకు 3.40లక్షల కుటుంబాల సమాచారం కంప్యూటరీకరణకు నోచుకుంది. ఈ నెల 10వ తేదీ నాటికీ సర్వే సమాచారాన్ని కంప్యూటర్లలో పొందుపరచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. పట్టణ ప్రాంతాల్లో వడివడిగా.... పట్టణ ప్రాంతాల్లో కంప్యూటరీకరణ వడివడి గా సాగుతున్నా.. గ్రామీణ మండలాల్లో మాత్రం నత్తనడకన నడుస్తున్నాయి. మరీ ముఖ్యంగా వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల్లో డేటా ఎంట్రీ చాలా ఆలస్యంగా జరుగుతోంది. అతి తక్కువ శాతం కుల్కచర్ల మండలంలో ఆదివారం వరకు 9.53% మాత్రమే సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. అలాగే బషీరాబాద్ 10.49%, గండేడ్ 10.88%, తాండూరు నగర పంచాయతీలో 11%, పెద్దేముల్లో 11.18%, వికారాబాద్ 11.89%, యాలాల 15.62%, మర్పల్లిలో 16 శాతం మాత్రమే డేటా ఎంట్రీ పూర్తయింది. నగర శివార్లలో మేడ్చల్, హయత్‌నగర్ మండలాల్లో ఇప్పటికే కంప్యూటరీకరణ ప్రక్రియ ముగిసింది. సరూర్‌నగర్ 92.49%, ఇబ్రహీంపట్నం 78.1%, శామీర్‌పేట 72.7%, మంచాల 72.25 శాతం పూర్తికాగా, మిగిలిన మండలాల్లో సగం కుటుంబాల సమాచారాన్ని ఇప్పటివరకు కంప్యూటరీకరించారు. -
సిబ్బంది లేరు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియలో జిల్లా యంత్రాంగానికి మరో తలనొప్పి వచ్చిపడింది. సర్వే ప్రక్రియలో సిబ్బంది కొరతతో సతమతమైన యంత్రాంగం.. చివరకు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, విద్యార్థులను వినియోగించుకుని పరిస్థితిని గట్టెక్కించింది. తాజాగా ఈ సర్వే వివరాల కంప్యూటరీకరణకు కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్లు కరువయ్యారు. వివరాల నమోదు ప్రక్రియ మొదలుపెట్టి ఐదురోజులు కావస్తున్నా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాలకు సంబంధించి మాత్రమే నమోదు పూర్తయింది. మరోవైపు సర్కారు విధించిన గడువు ముంచుకొస్తుండగా.. నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతుండడం తో జిల్లా యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆరు శాతమే! జిల్లాలోని గ్రామీణ ప్రాంతాన్ని మాత్రమే యంత్రాంగం సర్వే చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్‌లోని జిల్లా పరిధినంతా జీహెచ్ఎంసీ అధికారులు సర్వే చేశారు. అయితే గ్రామీణ ప్రాంతంలో దాదాపు ఎనిమిది లక్షల కుటుంబాలను సర్వే చేయగా.. వాటిని ప్రస్తుతం కంప్యూటర్లో వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందుకుగాను శివార్లలోని ఇంజినీరింగ్ కళాశాలలను నమోదు కేంద్రాలుగా ఎంపిక చేశారు. అక్కడ కంప్యూటర్లు అందుబాటులో ఉండడంతో ప్రక్రియ సులభతరమవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. వివరాల నమోదుకు రెండువేల కంప్యూటర్లు వినియోగించేలా ఏర్పాట్లు చేసింది. ఇంతవరకు అధికారులు విజయవంతంగా ప్రక్రియను పూర్తిచేశారు. కానీ అసలు చిక్కంతా డాటా ఎంట్రీ ఆపరేటర్ల అంశంలో వచ్చిపడింది. రెండువేల మంది ఆపరేటర్లను వినియోగించుకుని రెండువేల కంప్యూటర్ల ద్వారా నమోదు చేయాలని అధికారుల భావించినా.. కేవలం తొమ్మిది వందల మంది ఆపరేటర్లు మాత్రమే లభించారు. అందుబాటులో ఉన్న ఆపరేటర్లతో నమోదు ప్రక్రియ చేపట్టగా.. ఇప్పటివరకు కేవలం 50వేల కుటుంబాల వివరాలు మాత్రమే నమోదు చేశారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం ఆరుశాతం మాత్రమే పూర్తిచేయడంతో అధికారగణం ఆందోళన చెందుతోంది. గడువులోగా కష్టమే.. సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియంతా సెప్టెంబర్ రెండోతేదీ నాటికి పూర్తిచేయాలని సర్కారు స్పష్టం చేసింది. ఈనేపథ్యంలో ఈనెల 22 నుంచి నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించింది. అయితే జిల్లాలో మాత్రం కంప్యూటర్ల నిర్వహణలో సమస్య తలెత్తడంతో కొంత జాప్యం జరిగింది. ఫలితంగా మంగళవారం నుంచి పూర్తిస్థాయిలో నమోదు ప్రక్రియ ప్రారంభించగా.. ఇప్పటివరకు 50వేల ఫారాలను కంప్యూటరీకరించారు. సగటున రోజుకు 25వేల దరఖాస్తులు పూర్తవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సర్కారు విధించిన గడువు నాటికి కేవలం 25శాతం మాత్రమే పూర్తవుతుందని తె లుస్తోంది. మరోవైపు డాటాఎంట్రీ ఆపరేటర్ల సంఖ్య పెంచేందుకు యంత్రాంగం ప్రత్యేక తాయిలాలు ప్రకటిస్తోంది. ప్రస్తుతం డాటా ఎంట్రీ చేస్తున్న ప్రభుత్వం సంబంధిత ఉద్యోగులకు ఒక్కో దరఖాస్తుకు రూ.5 చెల్లిస్తుండగా.. ప్రైవేటు సిబ్బందికి రూ.10వరకు చెల్లిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆపరేటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సెప్టెంబర్ పదో తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేస్తామని కలెక్టర్ ఎన్.శ్రీధర్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
అవకాశాలకు ఆయువుపట్టు.. కంప్యూటర్ సైన్స్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటరీకరణ నిత్య జీవన ప్రక్రియలో ఓ భాగంగా మారింది. పాత విధానాలను ఆధునికీకరించడం ఎంత ముఖ్యమో.. అన్ని విభాగాల్లో కంప్యూటరీకరణ అంతే ప్రధానం. అభివృద్ధిలో భాగంగా వైఫై, ఆఫీస్ ఆటోమేషన్ సేవలు విస్తృతమవుతున్న తరుణంలో సంబంధిత సాంకేతిక నిపుణుల అవసరమూ ఏర్పడుతోంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రంగం నిపుణులకు పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి. మనోజ్ కుమార్... ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తిచేశాడు. క్యాంపస్ సెలక్షన్స్‌లో జరిగిన ఇంటర్వ్యూలోనే ఓ మల్టినేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. ఆశించిన ఉద్యోగం.. ఆకర్షణీ యమైన వేతనం సొంతం చేసుకున్నాడు. ‘మొదట్నుంచీ నాకు కంప్యూటర్లు, టెక్నాలజీ అంటే ఎంతో ఆసక్తి. కెరీర్లో త్వరగా స్ధిరపడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌ను ఎంచుకు న్నాను.’ అంటున్న మనోజ్... తెలుగు మీడియం నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ.. నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సులో కష్టపడి చదివి నైపుణ్యాలు మెరుగుపర్చుకున్నాడు. తొలి ప్రయత్నంలోనే కొలువును సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఇంజనీరింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు ఆసక్తి, అభిరుచికి తగిన కోర్సును ఎంచుకుంటే కెరీర్లో సులభంగా రాణించ డానికి అవకాశం ఉంటుంది. టెక్నాలజీపై ఆసక్తి, నైపుణ్యాలు ఉన్నవారికి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సరైన బ్రాంచ్. ప్రవేశం: బీఈ/బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. రాష్ట్ర స్థాయి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ ర్యాంకు ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీతోపాటు బిట్స్ తదితర విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధిత ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించాలి. ఏం చదువుతారు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో ప్రధానంగా విద్యార్థులు కంప్యూటర్‌కు సంబంధించిన భాగాలు, వాటి పనితీరు మొదలు సి, సి++, జావా తదితర ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, క ంప్యూటర్ నెట్వర్క్స్ వరకూ.. అన్ని రకాల సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ అంశాలను అధ్యయనం చేస్తారు. ‘అన్ని యూనివర్సిటీలు.. కోర్సు కాలంలో విద్యార్థి సాధించాల్సిన అన్ని నైపుణ్యాలను దృష్టిలో ఉంచుకుని కరిక్యులంను రూపొందిస్తాయి. తరగతి గదిలో చెప్పే అంశాలను క్షుణ్నంగా నేర్చుకుంటే కోచింగ్ సెంటర్లకు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు’ అని ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ఎం.వెంకట్ దాస్ సూచిస్తున్నారు. కొందరు విద్యార్థులు యాడ్ఆన్ కోర్సులకు అధిక ప్రాధాన్యతనిస్తూ బీఈ/బీటెక్ కరిక్యులంను అశ్రద్ధ చేయడమే కాకుండా తమ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘సమయాన్ని వృథా చేసుకోవద్దు. కరిక్యులానికి అనుగుణంగా ఉన్న పుస్తకంలోని మొదటి చాప్టర్ నుంచి చివరి అధ్యాయం వరకు అన్ని అంశాలపై గట్టి పట్టు సాధించాలి. విద్యార్థులు.. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్‌ను మెరుగుపరచుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారు’ అంటూ వెంకట్ దాస్ విశ్వాసం వ్యక్తం చేశారు. కావాల్సిన స్కిల్స్: సాఫ్ట్వేర్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. దాంతోపాటే ఆ రంగంలో పనిచేయాలనుకునేవారు/ పనిచేస్తున్నవారు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. టె క్నాలజీతో ఎక్కువ సమయం పనిచేయూల్సి ఉంటుంది. చిన్నపాటి పొరపాట్లకు ఎక్కువ సమయం వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లో సమయ పాలన చాలా ముఖ్యం. కాబట్టి సూక్ష్మ పరిశీలనా నైపుణ్యాలుండాలి. ప్రతి అంశాన్నీ లోతుగా అధ్యయనం చేయూలి. నిర్దేశిత ఔట్పుట్ వచ్చేంత వరకు లేదా అప్పగించిన పని పూర్తయ్యేంతవరకు ఓర్పు, సహనంతో పనిచేయగలగాలి. ఉన్నత విద్య: కంప్యూటర్స్‌లో బీఈ/బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలూ విస్తృతమే. పీజీ స్థాయిలో మాస్టర్ ఇన్ టెక్నాలజీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ వంటి టెక్నికల్ కోర్సుల్లో ఎంచుకున్న సబ్జెక్టులో నైపుణ్యాన్ని సాధించొచ్చు. ఐఐటీల్లో నేరుగా పీహెచ్డీ చేసే అవకాశమూ ఉంది. ఉన్నత అవకాశాల కోసం విదేశాల్లో ఎంఎస్ చేయొచ్చు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు/ఉద్యోగాలు కంప్యూ టర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసిన విద్యార్థులకు దేశ, విదేశాల్లో మంచి అవకా శాలున్నాయి. మెకానికల్, సివిల్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఆధారిత కంపెనీలు కూడా టెక్నాలజీ విభాగంలో పనిచేయడానికి సీఎస్ఈ విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ‘ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం తదితర సాఫ్ట్వేర్ కంపెనీలు అత్యధిక వేతనాలతో ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ప్రముఖ కంపెనీలు రూ.12 లక్షల వరకు వార్షిక వేతనం ఆఫర్ చేస్తున్నాయి. ఫ్యాకల్టీగా స్థిరపడాలనుకునే వారికీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయి’ అని వెంకట్ దాస్ వివరించారు. -
విద్యాభివృద్ధికి కృషి చేయాలి...
ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లాలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల సమగ్ర సమాచారాన్ని కంప్యూటరైజ్డ్ చేసి ఆన్లైన్లో పొందుపరచాలని కలెక్టర్ ఇలంబరితి డీఈఓను ఆదేశించారు. విద్యాభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలపై సోమవారం కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యాభివృద్ధికి కేటాయిస్తున్న నిధులను సకాలంలో, సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నిధులు సక్రమంగా ఖర్చు చేయకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజనంలో మెనూ సక్రమంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నాణ్యమైన బియ్యం, ఇతర వస్తువులను వినియోగించాలని, మధ్యాహ్న భోజన బియ్యాన్ని తనిఖీ చేస్తుండాలని డీఎస్వో గౌరీశంకర్‌ను ఆదేశించారు. బడిఈడు పిల్లలందరిని బడిలో చేర్పించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో గుర్తింపు పొందిన పాఠశాలలను తనిఖీ చేయాలని డీఈఓకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ విద్య అమలును పర్యవేక్షించాలని, కంప్యూటర్ విద్యను నేర్చుకునేలా బోధన ఉండాలని అన్నారు. బాలికా విద్యకు ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు. కస్తూర్బా గాంధీ, బాలికల పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న పనులను సత్వరమే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణంలో అలసత్వం చూపే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి వారిని తొలగించాలని అన్నారు. ఆర్వీఎం ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ప్రతి పాఠశాలకు కల్పించాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలో భాగస్వామ్యం చేయాలన్నారు. ఏజెన్సీతో పాటు ఇతరప్రాంతాల్లో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ నియామకాలపై సత్వర చర్యలు చేపట్టాలని ఆర్వీఎం పీఓను ఆదేశించారు. ఈ సమావేశంలో డీఈఓ రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్వీఎం పీఓ శ్రీనివాస్, ఏజెన్సీడీఈఓ రాజేష్, డిప్యూటీ డీఈఓలు బస్వారావు, రాములు, డైట్ ప్రిన్సిపాల్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇకపై ఈ-పంచాయతీలు
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రజలకు పారదర్శక, వేగవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా గ్రామ పంచాయతీలను ‘ఈ-పంచాయతీలు’గా మార్చేందుకు శ్రీకారం చుట్టింది. దీంతో గ్రామపంచాయతీల ద్వారా అందే అన్ని సేవలు ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే అందనున్నాయి. అలాగే పంచాయతీ ఆదాయ, వ్యయాలు, మంజూరయ్యే నిధులు, చేపట్టే పనులన్నింటినీ కంప్యూటరీకరిస్తారు. ఇందుకోసం మొదటి విడతగా జిల్లాలోని 141 గ్రామపంచాయతీలకు కంప్యూటర్లను మంజూరు చేశారు. పారదర్శక పాలన కోసం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజా పాలనలో సంస్కరణలు అవసరమవుతున్నాయి. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంత ప్రజలకు పారదర్శక పాలనను అందించేందుకు పంచాయతీలు ఈ-పంచాయతీలుగా మారుతున్నాయి. జిల్లాలో మొత్తం 866 గ్రామపంచాయతీలు ఉండగా, మొదటి విడతగా 141 కార్యాలయాలకు కంప్యూటర్లను మంజూరు చేశారు. మండల పరిషత్ కార్యాలయాలకు సైతం ఒక్కో కంప్యూటర్ను అందించారు. కంప్యూటర్‌తో పాటు ప్రింటర్‌ను కూడా అందించారు. మంజూరు చేసిన కంప్యూటర్లను ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అమర్చి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగించారు. కంప్యూటర్ ఆపరేటర్‌ను సైతం ప్రైవేటు సంస్థనే ఏర్పాటు చేయనుంది. రెండు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక ఆపరేటర్‌ను ఎంపిక చేయనున్నారు. వారంలో మూడు రోజులు ఒక గ్రామంలో, మరో మూడు రోజులు మరో గ్రామంలో ఆపరేటర్ అందుబాటులో ఉండి విధులు నిర్వహించనున్నారు. ఎన్నికల విధులు, కోడ్ అమల్లో ఉన్నందున వచ్చే నెలలో అధికారికంగా పంచాయతీల్లో కంప్యూటర్లను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
స్మార్ట్’ సాగుతో రైతుకు లబ్ధి
రైతుల వివరాలు కంప్యూటరీకరణ ఆధార్ తరహాలో వారికి గుర్తింపు సంఖ్య పారదర్శకతతో అనర్హులకు నో చాన్స్ రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాల కోసం స్మార్ట కార్డు వినియోగం తప్పనిసరి సాక్షి, బెంగళూరు : అర్హులైన రైతులకే ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడానికి వీలుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోనుంది. ఇందుకోసం మే మొదటి వారంలో ‘కే-కిసాన్’ (కర్ణాటక కృషి సమాచార సేవలు, నెట్వర్కింగ్) పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది. ఇందులో భాగంగా మొదట రాష్ట్రంలోని ప్రతి తాలూకా కేంద్రంలో ఉన్న వ్యవసాయ కార్యాలయాలను కంప్యూటరీకరిస్తారు. అనంతరం ఆయా కేంద్రాలకు వచ్చే రైతుల వివరాలను కంప్యూటర్లలో నమోదు చేస్తారు. ఇందులో రైతు ఫోన్ నంబర్, రైతుకు చెందిన భూ విస్తీర్ణం తదితర వివరాలతో పాటు నేల రకాన్ని కూడా పొందుపరుస్తారు. అనంతరం రైతు గత ఐదేళ్లుగా పండిస్తున్న పంట రకాలను కూడా నమోదు చేస్తారు. రెండోదశలో రాష్ట్రంలోని 747 హోబళీ పరిధిలోని గ్రామాల్లో ఉన్న రైతుల వివరాలను రైతు సంపర్క కేంద్రాల్లో నమోదు చేసుకుని తాలూకా వ్యవసాయ కార్యాలయం, ఆయా జిల్లా వ్యవసాయ క్యార్యాలయాలకు అనుసంధానం చేస్తారు. అటుపై రాష్ట్రంలోని ప్రతి రైతు, కౌలురైతు వ్యక్తిగత, పంట వివరాలన్నీంటినీ బెంగళూరులోని కేంద్ర కార్యాలయంలోని కంప్యూటర్ డాటాబేస్‌తో అనుసంధానం చేస్తారు. దీని వల్ల రాష్ట్రంలోని ఉన్న రైతుల, కౌలు రైతుల సంఖ్య, వ్యవసాయ భూమి విస్తీర్ణంపై ఖచ్చితమైన సమాచారం లభ్యమవుతుంది. వివరాలన్నింటినీ క్రోడికరించిన తర్వాత ప్రతి రైతు, కౌలు రైతుకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. ఒకరికి కేటాయించిన సంఖ్య ఎట్టి పరిస్థితుల్లో మరొకరికి కేటాయించరు. అటుపై ఈ సంఖ్యతో పాటు ఎలక్ట్రానిక్ చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డ్‌ను రైతులకు అందజేస్తారు. పారదర్శకత పెరిగే అవకాశం... ప్రస్తుత విధానంలో వ్యవసాయ రుణం మంజూరు చేయడంతో పాటు రుణమాఫీ, సబ్సిడీపై విత్తనాల వితరణలు చాలా వరకూ అర్హులకు దక్కడం లేదు. రైతులకు స్మార్ట్ కార్డులు అందించిన తర్వాత రుణాలు, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇచ్చే సమయంలో తప్పక ఆ కార్డును వినియోగించాల్సి ఉంటుంది. కార్డుపై ప్రత్యేక సంఖ్యతో పాటు ఎలక్ట్రానిక్ చిప్ ఉండటం వల్ల ప్రభుత్వం నుంచి ఒకరికి అందాల్సిన సంక్షేమ ఫలితాలు మరొకరు పొందడానికి వీలు పడదు. ఏ పంటకు రాష్ట్రంలోని ఏ మార్కెట్లో ఉత్తమ ధర దొరుకుతోందనే విషయాన్ని రైతులకు ఎస్.ఎం.ఎస్ రూపంలో కూడా పంపించడానికి వీలవుతుంది. ఈ విషయమై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... ‘పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో ఇప్పటికే ఇటువంటి ప్రక్రియ అమలు దశలో ఉంది. కే-కిసాన్‌కు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులకు ఇప్పటికే శిక్షణ పూర్తయింది. మే మొదటి వారంలో ఈ పథకాన్ని ప్రారంభించి మూడు నాలుగు నెలల్లోపు పూర్తి చేస్తాం’ అని పేర్కొన్నారు. -
ఆన్లైన్ గండం
=నిధుల వివరాల కంప్యూటరీకరణకు సిబ్బంది ఆపసోపాలు =పంచాయతీల్లో కానరాని సదుపాయాలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్ణయాలు గ్రామ పంచాయతీలకు సంకటంగా మారాయి. మౌలిక సదుపాయాలు కల్పించకుండా గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఆ శాఖపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పంచాయతీల్లో అక్రమాలకు చెక్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ మాటను నెత్తికెత్తుకుంది. నిధులు పక్కదారి పట్టకుండా వాటికి సంబంధించిన మాస్టర్ ఎంట్రీలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓచర్ల సంఖ్య వివరాలను 2013 మార్చి నెలాఖరు వరకు పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తేనే 13వ ఆర్థిక సంఘం నిధులిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కంప్యూటరీకరణకు అవసరమైన స దుపాయాలను మాత్రం కల్పించకపోవడం గమనార్హం. అన్నీ లోటే.. : జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత పాలకవర్గాల పదవీ కాలం ముగిశాక 2011 ఆగస్టు నుంచి ఆగిపోయిన 13వ ఆర్థిక సంఘం(టీఎఫ్సీ) నిధులు గత నెలలో 2011-12కు సంబంధించి విడుదలయ్యాయి. ఇక నుంచి కూడా రెగ్యులర్‌గా విడుదల కావాలంటే పంచాయతీ పద్దులు, ఆదాయ, వ్యయాలు, కావాల్సిన నిధులు తదితర వివరాలను ఆన్లైన్లో ఉంచాలి. అయితే 920 పంచాయతీలకు 660 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శికి నాలుగు ఐదు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు. వారిపై అధిక పని భారం ఉంటోంది. ప్రధానంగా ఏజెన్సీ 11 మండలాల్లో తొమ్మిదింటికి ఈఓపీఆర్డీలు లేరు. దీంతో ఆయా మండలాల్లో పంచాయతీల పర్యవేక్షణ సక్రమంగా లేదు. ఈ పరిస్థితుల్లో కంప్యూటరీకరణ అంశం సిబ్బందిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. డివిజనల్ పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో కూడా కంప్యూటర్లు లేకపోవడం ఇక్కడ విశేషం. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది ఏ రకంగా వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇంటర్నెట్ సెంటర్లలో నమోదు ఇప్పటి వరకు 2011-12కు సంబంధించిన మైదాన పంచాయతీల వివరాలను 80 శాతం వరకు మాత్రమే ఆన్లైన్లో పొందుపరిచారు. ఏజెన్సీలోని పంచాయతీలకు సంబంధించి అసలు ప్రక్రియ ముందుకు సాగలేదు. 2012-13 వివరాలను ఇంకా ఆన్లైన్లో నిక్షిప్తం చేయాల్సి ఉంది. కార్యాలయాల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులు పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రైవేటు, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి డీటీపీకి అనుమతివ్వాలని కోరడంతో రెండు రోజుల క్రితమే ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈమేరకు సిబ్బంది సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి సొంత ఖర్చులతో డీటీపీ ఆపరేటర్ల సాయంతో వివరాలను కంప్యూటరీకరిస్తున్నారు. ఏజెన్సీలో కొన్ని ప్రాంతాల్లో కనీసం ఇంటర్నెట్ సెంటర్లు కూడా లేకపోవడంతో వారు మైదాన ప్రాంతాలకు వచ్చి ఆ ప్రక్రియను చేపడుతున్నారు.