ఆన్‌లైన్ గండం
=నిధుల వివరాల కంప్యూటరీకరణకు సిబ్బంది ఆపసోపాలు
=పంచాయతీల్లో కానరాని సదుపాయాలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: ప్రభుత్వ నిర్ణయాలు గ్రామ పంచాయతీలకు సంకటంగా మారాయి. మౌలిక సదుపాయాలు కల్పించకుండా గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలు ఆ శాఖపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పంచాయతీల్లో అక్రమాలకు చెక్ చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ మాటను నెత్తికెత్తుకుంది. నిధులు పక్కదారి పట్టకుండా వాటికి సంబంధించిన మాస్టర్ ఎంట్రీలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓచర్ల సంఖ్య వివరాలను 2013 మార్చి నెలాఖరు వరకు పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించింది. అయితే ఈ ప్రక్రియ ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తేనే 13వ ఆర్థిక సంఘం నిధులిస్తామని చెప్పిన ప్రభుత్వం.. కంప్యూటరీకరణకు అవసరమైన స దుపాయాలను మాత్రం కల్పించకపోవడం గమనార్హం.
అన్నీ లోటే.. : జిల్లాలో 920 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత పాలకవర్గాల పదవీ కాలం ముగిశాక 2011 ఆగస్టు నుంచి ఆగిపోయిన 13వ ఆర్థిక సంఘం(టీఎఫ్‌సీ) నిధులు గత నెలలో 2011-12కు సంబంధించి విడుదలయ్యాయి. ఇక నుంచి కూడా రెగ్యులర్‌గా విడుదల కావాలంటే పంచాయతీ పద్దులు, ఆదాయ, వ్యయాలు, కావాల్సిన నిధులు తదితర వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలి. అయితే 920 పంచాయతీలకు 660 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో కార్యదర్శికి నాలుగు ఐదు పంచాయతీల బాధ్యతలను అప్పగించారు.
వారిపై అధిక పని భారం ఉంటోంది. ప్రధానంగా ఏజెన్సీ 11 మండలాల్లో తొమ్మిదింటికి ఈఓపీఆర్‌డీలు లేరు. దీంతో ఆయా మండలాల్లో పంచాయతీల పర్యవేక్షణ సక్రమంగా లేదు. ఈ పరిస్థితుల్లో కంప్యూటరీకరణ అంశం సిబ్బందిని మరింత ఇబ్బందుల్లోకి నెడుతోంది. డివిజనల్ పంచాయతీ అధికారుల కార్యాలయాల్లో కూడా కంప్యూటర్లు లేకపోవడం ఇక్కడ విశేషం. ఇటువంటి పరిస్థితుల్లో అధికారులు, సిబ్బంది ఏ రకంగా వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు.
ఇంటర్నెట్ సెంటర్లలో నమోదు
ఇప్పటి వరకు 2011-12కు సంబంధించిన మైదాన పంచాయతీల వివరాలను 80 శాతం వరకు మాత్రమే ఆన్‌లైన్‌లో పొందుపరిచారు. ఏజెన్సీలోని పంచాయతీలకు సంబంధించి అసలు ప్రక్రియ ముందుకు సాగలేదు. 2012-13 వివరాలను ఇంకా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంది. కార్యాలయాల్లో కంప్యూటర్, ఇంటర్నెట్ సదుపాయాలు లేకపోవడంతో ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని అధికారులు పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లారు.
ప్రైవేటు, ఇంటర్నెట్ సెంటర్ల నుంచి డీటీపీకి అనుమతివ్వాలని కోరడంతో రెండు రోజుల క్రితమే ఉన్నతాధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈమేరకు సిబ్బంది సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్లి సొంత ఖర్చులతో డీటీపీ ఆపరేటర్ల సాయంతో వివరాలను కంప్యూటరీకరిస్తున్నారు. ఏజెన్సీలో కొన్ని ప్రాంతాల్లో కనీసం ఇంటర్నెట్ సెంటర్లు కూడా లేకపోవడంతో వారు మైదాన ప్రాంతాలకు వచ్చి ఆ ప్రక్రియను చేపడుతున్నారు.