ఆన్‌లైన్‌లో ఔషధాలు అమ్మొచ్చు: కేంద్రం
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఔషధాల అమ్మకాలు ప్రస్తుత చట్టం పరిధికి లోబడే ఉన్నాయని కేంద్రం పేర్కొంది. అయితే, ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలకు సంబంధించి కెమిస్టులు, ఈ–ఫార్మసీలకు మధ్య వివాదం నేపథ్యంలో వైద్యశాఖ దీనిపై స్పష్టత తీసుకురావాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది. దేశంలో దాదాపు 50 ఈ–ఫార్మసీలు ఉన్నాయని, ఔషధాలను ఆన్‌లైన్‌లో అమ్మకూడదు అని డ్రగ్, కాస్మొటిక్ చట్టంలో ఎక్కడా ప్రస్తావించలేదని కేంద్ర పారిశ్రామిక విధాన, ప్రోత్సహక శాఖ(డీఐపీపీ) కార్యదర్శి రమేశ్ అభిషేక్ సోమవారం ఢిల్లీలో అన్నారు. కాగా, ఆన్‌లైన్‌లో ఔషధాలు అమ్మడం చట్టవ్యతిరేకమని కెమిస్టులు వాదిస్తున్నారు. కెమిస్టులు, ఈ–ఫార్మసీల మధ్య వివాదాలకు సంబంధించి కొన్ని రాష్ట్రాల్లో పోలీసు కేసులు నమోదయ్యాయి.