స్టెంట్ల ఉత్పత్తి, సరఫరా తప్పనిసరి
అత్యవసర నిబంధనను అమల్లోకి తెచ్చిన కేంద్రం
న్యూఢిల్లీ: స్టెంట్ల ఉత్పత్తి, సరఫరాను తప్పనిసరి చేస్తూ.. ఆ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగించాలంటూ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. ఆ మేరకు ఔషధాల ధరల నియంత్రణ చట్టంలోని అత్యవసర నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. మార్కెట్లో స్టెంట్ల కొరత ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ‘ స్టెంట్ల లభ్యతపై ప్రస్తుత పరిస్థితిని చర్చించడంతో పాటు.. ప్రభుత్వం వద్ద ఉన్న ప్రత్యామ్నాయాల్ని పరిశీలించాం. కరోనరీ స్టెంట్ల సరఫరాను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్(డీపీసీఓ) 2013 చట్టంలోని సెక్షన్ 3 (జీ)ను అమలు చేసేందుకు నిర్ణయించాం’ అని కేంద్ర ఔషధ తయారీ విభాగం వెల్లడించింది.
ఈ సెక్షన్ కింద స్టెంట్ల పంపిణీని నియంత్రించడంతో పాటు... ఉత్పత్తి పెంచమని తయారీదారుల్ని ప్రభుత్వం ఆదేశించవచ్చు. అలాగే వివిధ సంస్థలు, ఆస్పత్రులు, ఏజెన్సీలకు అత్యవసర సమయాల్లో స్టెంట్లను అమ్మేందుకు వీలు కలుగుతుంది. స్టెంట్ల ఉత్పత్తి, దిగుమతి, సరఫరాను తయారీదారులు యథాప్రకారం కొనసాగించడంతో పాటు ఉత్పత్తి, సరఫరాకు సంబంధించి వారం వారం నివేదిక సమర్పించాలని ఔషధ తయారీ విభాగం సూచించింది. సవరించిన స్టెంట్ల ధరల్ని అందరికీ కనిపించేలా ఆస్పత్రుల్లో ప్రదర్శించాలని నేషనల్ ఔషధ ధరల నియంత్రణ సంస్థ(ఎన్‌పీపీఏ) ఆదేశించింది. అలాగే స్టెంట్ల వాపసు లేదా కొరత ఉంటే తయారీ, దిగుమతిదారులు తనకు తెలియచేయాలని సూచించింది.