పది ఔషధాల ధర తగ్గింపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా పది ఔషధాల ధరలను తగ్గించింది. అలాగే మరో ఎనిమిదికి పైగా ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చింది. ఔషధ ధరలపై నియంత్రణ ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఒక నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఔషధ ధరల నియంత్రణ సంస్థ ఎన్‌పీపీఏ తాజాగా పదికి పైగా మందుల ధరలను 4.8-23.3% మధ్యలో తగ్గించింది.
అలాగే ఇది తొలిసారి పారాసిటమాల్ సహా పలు యాంటీ బయాటిక్స్‌ను ధరల నియంత్రణ పరిధిలోకి తెచ్చింది. వీలైనంత త్వరగా దాదాపు 800కు పైగా ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి తెస్తామని ఎన్‌పీపీఏ చైర్మన్ భుపేంద్ర సింగ్ తెలిపారు. ప్రస్తుతం కేంద్రం 467 ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలో ఉంచింది. తప్పనిసరి ఔషధాల జాబితాలో 900 మందులు ఉన్నాయి.