Panchayat
-
లేడీ లవ్‌తో నిఖా : నటుడి పెళ్లి సందడి (ఫోటోలు)
-
పంచాయతీ సభ్యురాలికి ఘోర అవమానం
తాపీ: గుజరాత్‌లోని తాపీ జిల్లాలో పంచాయతీ సభ్యురాలిపై దాడి జరిగింది. తన భర్తతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నదంటూ ఓ మహిళ.. పంచాయతీ సభ్యురాలిపై దాడికి తెగబడింది. అంతటితో ఆగక ఆమె జుట్టును కూడా కత్తిరించింది. ఈ అమానవీయ ఘటనలో పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే సోంగాఢ్ పంచాయతీ సభ్యురాలైన ఊర్మిళ గమిత్‌పై ఒక మహిళతోపాటు మరో ముగ్గురు హాకీ స్టిక్‌లతో దాడి చేసి, ఆమె జుట్టును కత్తిరించారని సోంగాధ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. బాధిత మహిళ తన కుమార్తెతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా ఆమెపై దాడి చేశారు.పంచాయతీ సభ్యురాలు ఊర్మిళపై శోభనా గమిత్ అనే మహిళ, ఆమె కుమారుడితో పాటు వచ్చిన కొందరు వ్యక్తులు కలసి దాడి చేశారు. ఈ దాడిలో ఊర్మిళ ఎడమ చేతి ఎముక విరిగిందని, నడుము, తలపై గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న బంగారు లాకెట్‌ను నిందితులు లాక్కొని పారిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఊర్మిళను వైద్య చికిత్స కోసం పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఊర్మిళ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్నదని శోభనా గమిత్ పోలీసుల ఎదుట ఆరోపించింది. కాగా ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశామని, సంఘటనా స్థలంలో లభ్యమైన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: హస్తినలో ‘అమర’ ప్రేమికుడు! -
పంజాబ్: కట్టుదిట్టమైన భద్రత మధ్య పంచాయతీ ఎన్నికలు
చండీగఢ్: పంజాబ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈరోజు(మంగళవారం) గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 13 వేలకుపైగా గ్రామ పంచాయతీలకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం 19 వేల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచి ఓటర్ల రద్దీ నెలకొంది. ఈ ఎన్నికల్లో దాదాపు 1.05 లక్షల మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లను లెక్కించనున్నారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 3,798 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పంజాబ్‌లోని సోహల్ సైన్ భగత్ గ్రామంలో ఓటింగ్ సందర్భంగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. వారిని చికిత్స కోసం అమృత్‌సర్‌కు తరలించారు.గత నెలలో అసెంబ్లీ ఆమోదించిన పంజాబ్ పంచాయతీరాజ్ (సవరణ) బిల్లు, 2024 ప్రకారం అభ్యర్థులు రాజకీయ పార్టీల చిహ్నాలను ఉపయోగించకుండా నిషేధం విధించారు. రాష్ట్రంలో మొత్తం 1.33 కోట్ల మంది ఓటర్లు ఉండగా, వారిలో 70.51 లక్షల మంది పురుషులు, 63.46 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించామని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు తెలిపారు.ఇది కూడా చదవండి: సేంద్రియ/ప్రకృతి సేద్యంలో 3 నెలల కోర్సు -
పావురం ఎగరలేదని.. ఉద్యోగిపై క్రమశిక్షణా చర్యలు
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అని సామెత. అధికారంలో ఉన్నవాళ్లు ఎలాంటి ఆదేశాలైనా ఇస్తారనడానికి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. రాష్ట్రంలోని ముంగేలీ జిల్లాలో ఆగస్టు 15న స్వాతంత్య్ర దిన వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథి, బీజేపీ ఎమ్మె ల్యే, మాజీ మంత్రి పున్నులాల్ మోహ్లేతో పా టు కలెక్టర్ రాహుల్ దేవ్, ఎస్పీ గిరిజా శంకర్ జైస్వాల్‌లకు పావురాలు అందజేశారు. ఎమ్మె ల్యే, కలెక్టర్ వదిలిన పావురాలు రివ్వుమంటూ ఎగిరిపోయాయి. ఎస్పీ విడిచిపెట్టింది మాత్రం నేలపై పడిపోయిందట! సదరు వీడియోను సచిన్ గుప్తా అనే సోషల్ మీడియా యూజర్ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో షేర్ చేశారు. ‘‘ఛత్తీస్‌గడ్‌లో పంచాయత్–3 (వెబ్ సిరీస్) రిపీటైంది. పంద్రాగస్టు సందర్భంగా ఎస్పీ ఎగరేసిన పావు రం కింద పడిపోయింది. వీడియో చూడండి’’ అని రాసుకొచ్చారు. దాంతో తన పరువు పో యిందని భావించిన పోలీస్ బాసు, సంబంధి త అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్‌కు ఏకంగా లేఖ రాశారు! ‘‘పావురం అనారోగ్యంతో ఉండటమే దీనికి కారణం. అది ఎగరకుండా కింద పడిపోయిన వైనం సోషల్ మీడియాలో విపరీతంగా వైరలై జిల్లా యంత్రాంగం పరువు తీసింది. బాధ్యుడైన అధికారిపై కఠిన చర్యలు తీసుకోండి’’ అంటూ రాసుకొచ్చారట. 'Panchayat' Pigeon scene comes alive in ChhattisgarhThe video of the pigeon, which was released by Superintendent of Police (SP) Girija Shankar Jaiswal, went viral after it showed the bird falling to the ground instead of flying away. The event, meant to symbolize freedom and… pic.twitter.com/sc1lRJvtRO— The NewsWale (@TheNewswale) August 21, 2024 -
ముంబైలో కొత్తిల్లు కొన్న 'పంచాయత్' నటుడు
బాలీవుడ్ నటుడు దుర్గేశ్ కుమార్ కొత్త ఇల్లు కొన్నాడు. ముంబైలో ఇదే ఆయన కొనుగోలు చేసిన తొలి నివాసం. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ముంబైలో మా కొత్తిల్లు.. ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అని రాసుకొచ్చాడు. తన ఇంటి తాళాల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా నటుడిగా కొనసాగుతున్న ఈయన ఎట్టకేలకు ముంబైలో తనకంటూ ఇల్లు కొనుగోలు చేయడంతో అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇల్లు తీసుకున్నావ్.. మమ్మల్ని పిలవనేలేదు అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా దుర్గేశ్ కుమార్.. 2014లో వచ్చిన హైవే సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. సుల్తాన్, ద డ్రీమ్ జాబ్, సంజు, ధడక్, బొంబైరియా, భక్షక్, లాపతా లేడీస్ వంటి చిత్రాలతో అలరించాడు. పంచాయత్ వెబ్ సిరీస్‌లో భూషణ్ పాత్ర ద్వారా ఓటీటీ ప్రియులను మెప్పించాడు. View this post on Instagram A post shared by Durgesh Kumar (@durgesh.kumar.81) చదవండి: భారతీయుడు 2 చిత్రానికి ఓటీటీ చిక్కులు -
2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే!
బాక్సాఫీస్ వద్ద రిలీజయ్యే పెద్ద సినిమాలన్నీ కచ్చితంగా ఏదో ఒక ఓటీటీలోకి రావాల్సిందే! ఈ పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలవుతున్నాయి. వీటిమీదే ఆధారపడకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను తీసుకువస్తున్నాయి. సినిమాలు, సిరీస్‌లు, రియాలిటీ షోలతో కావాల్సినంత వినోదాన్ని పంచుతున్నాయి. అలా ఈ ఏడాది బోలెడన్ని చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేశాయి. మరి ఈ ఆరు నెలల్లో (జనవరి- జూన్) ఎక్కువమంది చూసిన సినిమాలేంటో చూసేద్దాం..ఆర్మాక్స్ నివేదికల ప్రకారం.. ఎక్కువ మంది చూసిన హిందీ ఓటీటీ కంటెంట్ ఇదే..1. పంచాయత్- సీజన్ 3 (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 2.82 కోట్లమంది వీక్షించారు.2. హీరామండి (నెట్‌ఫ్లిక్స్) -2.30 కోట్ల మంది చూశారు.3. ఇండియన్ పోలీస్ ఫోర్స్ (అమెజాన్ ప్రైమ్ వీడియో) - 1.95 కోట్ల మంది వీక్షించారు.4. కోట ఫ్యాక్టరీ సీజన్ 3 (నెట్‌ఫ్లిక్స్) - 1.57 కోట్ల మంది చూశారు.5. ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 & 4 (హాట్‌స్టార్) -1.48 మంది చూశారు.6. షో టైమ్ (హాట్‌స్టార్) - 1.25 కోట్ల మంది వీక్షించారు.7. గుల్లక్ సీజన్ 4 (సోనిలివ్) -1.21 కోట్ల మంది చూశారు.8.మహారాణి సీజన్ 3 (సోనీలివ్) - 1.02 కోట్ల మంది వీక్షించారు.9. కిల్లర్ సూప్ (నెట్‌ఫ్లిక్స్) - 92 లక్షల మంది చూశారు.10. జంనపార్ (అమెజాన్ మినీ టీవీ) - 92 లక్షల మంది చూశారు.11. కర్మ కాలింగ్ (హాట్‌స్టార్) - 91 లక్షల మంది వీక్షించారు.12. రైసింఘని వర్సెస్ రైసింఘని (సోనిలివ్) - 85 లక్షల మంది చూశారు.13. మామ్లా లీగల్ హై (నెట్‌ఫ్లిక్స్)- 81 లక్షల మంది వీక్షించారు.14. లూటెర్ (హాట్‌స్టార్) - 80 లక్షల మంది చూశారు.15. బాహుబలి : క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హాట్‌స్టార్) - 80 లక్షల మంది చూశారు.చదవండి: సింగర్‌కు అధ్భుతమైన టాలెంట్.. ట్రాన్స్‌జెండర్ అంటూ కామెంట్స్ -
మైకేల్ జాక్సన్ తీన్మార్
హిందీ ఫోక్ సాంగ్‌కు మైకేల్ జాక్సన్ ఆయన స్టైల్లోనే డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది కాదు... అసలు ఎలా వీలవుతుంది?! అంటారా. సాంకేతిక మాయాబజార్లో ఏదైనా సాధ్యమే. కామెడి డ్రామా స్ట్రీమింగ్ టీవీ సిరీస్ ‘పంచాయత్’కు సంబంధించి మీమ్స్, వైరల్ వీడియోలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒకటి మైకేల్ జాక్సన్ డ్యాన్స్ వీడియో. ఈ ఫ్యాన్–మేడ్ వీడియో 8 మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోలో ‘ఏ రాజాజీ రాజాజీ’ అనే పాటకు మైకేల్ జాక్సన్ డ్యాన్స్ చేస్తూ కనిపిస్తాడు. అయితే ఎక్కడా కృత్రిమత్వం కనిపించదు. చాలా సహజంగా ఉండడమే ఈ వీడియో వైరల్ కావడానికి కారణం అయింది. -
Pooja Singh: పూజా సింగ్ టు.. రింకీ దూబే.. బై శాన్వికా..!
కామన్ ఫీచర్స్.. ఎక్స్ట్రార్డినరీ స్కిల్స్‌తో ఆన్‌స్క్రీన్ గ్రామర్ని మార్చేసింది శాన్వికా! ఎవరీమె అనుకుంటున్న వాళ్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘పంచాయత్’ చూస్తే ఆమె ఎవరో తెలుస్తుంది.. శాన్వికా ప్రతిభ కనిపిస్తుంది. ఓటీటీ అందుబాటులో లేని వాళ్లు ఇక్కడిస్తున్న వివరాలతో ఆమెను పరిచయం చేసుకోవచ్చు.శాన్వికా అసలు పేరు పూజా సింగ్. పుట్టి, పెరిగింది మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకుంది.చిన్నప్పటి నుంచి నటన మీదే ఆసక్తి. కానీ ఇంట్లోవాళ్లకు ఆ రంగం మీద పెద్ద నమ్మకం లేదు. అందుకే యాక్టింగ్ కెరీర్‌ను వెదుక్కుంటానంటే కుటుంబం ఒప్పుకోదని.. బెంగళూరులో ఉద్యోగం దొరికిందని అబద్ధం చెప్పి ముంబై రైలెక్కేసింది శాన్వికా.అక్కడ హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న తన స్నేహితురాలి సహాయంతో అసిస్టెంట్ క్యాస్ట్యూమ్ డిజైనర్ కొలువులో చేరింది. ఆ ఉద్యోగం చేస్తూ పలు టీవీ కమర్షియల్స్‌కి ఆడిషన్స్ ఇవ్వసాగింది. అలా డామినోస్ వంటి వాటికి మోడల్‌గా ఎంపికైంది.మోడలింగ్‌తో చిన్న చిన్న యాక్టింగ్ రోల్స్ కూడా రావడం మొదలయ్యాయి. ఆ సమయంలోనే నటన పట్ల ఆమెకున్న తపన, టాలెంట్ చూసిన కొందరు యూట్యూబ్ చానెల్ ‘టీవీఎఫ్’ సిరీస్ కోసం ఆడిషన్స్‌కి వెళ్లమని సలహా ఇచ్చారు. అనుసరించింది.టీవీఎఫ్ కోసం ఆడిషన్స్ ఇస్తున్న టైమ్‌లోనే ‘పంచాయత్’ సీజన్ 1కి సెలెక్ట్ అయింది. అప్పటికే హిందీ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పూజా సింగ్ పేరుతోనే మరో నటి ఉండటంతో తన స్క్రీన్ నేమ్‌ని ‘శాన్వికా’గా మార్చుకుంది.‘పంచాయత్’లో రింకీ దూబేగా ఆమె వీక్షకులను తెగ ఆకట్టుకుంది. దాంతో తర్వాత రెండు సీజన్లలోనూ కొనసాగింది. తాజాగా మూడో సీజన్‌తో స్పెషల్ ఫ్యాన్ బేస్‌నే ఏర్పరచుకుంది.‘పంచాయత్’ చేస్తున్నప్పుడే ‘లఖన్ లీలా భార్గవా’, ‘హజామత్’ అనే వెబ్ సిరీస్‌లలోనూ అవకాశాలు వచ్చాయి. అవీ ఆమెకు మంచి పేరే తెచ్చిపెట్టాయి.శాన్వికాకు అభినయ కళలోనే కాదు స్కెచింగ్, పెయింటింగ్‌లోనూ నైపుణ్యం మెండే! ఏ కొంచెం ఖాళీ సమయం దొరికినా ఆర్ట్‌లో తన మార్క్ చూపిస్తుంటుంది."పంచాయత్ తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. కానీ మూస పాత్రలే ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే కాస్టింగ్ డైరెక్టర్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాను.. ‘వెర్సటైల్ రోల్స్ చేయగలను.. దయచేసి అలాంటి క్యారెక్టర్స్‌కి నన్ను సెలెక్ట్ చేయండ’ని! మలయాళం, బెంగాలీ వంటి రీజనల్ లాంగ్వెజెస్‌లో నంటించడానికీ నేను సిద్ధమే!" – శాన్వికాఇవి చదవండి: కారు కనిపించని ఊరు.. ఎక్కడుందో తెలుసా!? -
Abha Sharma: పెద్ద వయసులో.. పెద్ద గుర్తింపు
చిగుళ్ల వ్యాధి వల్ల 35 ఏళ్ల వయసులో పళ్లు కోల్పోయింది అభా శర్మ. 45 ఏళ్ల వయసులో ఆమెకు అవయవాలు కంపించే అరుదైన వ్యాధి వచ్చింది. అయినా నటి కావాలన్న కోరికను ఆమె చంపుకోలేదు. నాటకాల్లో పాత్రలు వేయసాగింది. ఇప్పుడు ‘పంచాయత్ 3’ వెబ్ సిరీస్‌లో పల్లెటూరి అమ్మగా నటించి దేశం మొత్తానికి అభిమాన నటి అయ్యింది. 75 ఏళ్ల వయసులో విజయాన్ని చూసిన అభా శర్మ పరిచయం.ఉత్తర ప్రదేశ్‌లోని ‘ఫుల్వారా’ అనే పల్లెటూళ్లో ఒక ముసలామె పంచాయతీ ఆఫీస్‌కు వచ్చి– ‘నా కొడుకు నన్ను ఇంట్లోంచి తరిమి కొట్టాడు. నాకో ఇల్లు మంజూరు చేయి నాయనా’ అని పంచాయతీ ఆఫీసర్ని ప్రాధేయపడుతుంది.ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రకారం ఊరికి 11 ఇళ్లు మంజూరై ఉంటాయి. వాటిని ఎవరెవరికి ఇవ్వాలనేది సర్పంచ్, పంచాయతీ ఆఫీసర్ నిర్ణయించాలి. ఈ ముసలామెకు ఇల్లు మంజూరు చేద్దామా అనుకుంటాడు ఆఫీసర్. కాని పల్లెల్లో అదంత సులభం కాదు. ‘నిజంగానే ముసలామెను కొడుకు తరిమి కొట్టాడా లేదా’ అనే ఎంక్వయిరీ జరుగుతుంది. ఊరి జనం కూడా ముసలామె ఇంటి మీద నిఘా పెడతారు. కొడుకు కాపురం ఒక గదిలో ఉంటే ముసలామె వేరొక గుడిసెలో అవస్థలు పడుతూ ఉంటుంది. ఇదంతా నిజమని భావించిన ఆఫీసర్ ముసలామెకు ఇల్లు మంజూరు చేస్తాడు. కాని ఇదంతా అబద్ధమని తేలుతుంది. ‘పేదవాడైన నా కొడుక్కి ఒక ఇల్లు ఇచ్చి వెళితే వాడు సుఖపడతాడని ఈ నాటకం అంతా ఆడాను’ అంటుంది ముసలామె. కాని ‘ఇంటి కోసమని నా కొడుకు, కోడలు, మనవణ్ణి వదిలి వేరే కుంపటి పెట్టి ఎలా బతకగలను’ అని బాధ పడుతుంది.ఒక వైపు పేదరికపు దీనత్వం, మరోవైపు బాంధవ్యాల దృఢత్వం... ఇవి ‘పంచాయత్ 3’ సిరీస్‌లోని ‘ఘర్’ అనే ఎపిసోడ్లో కనిపిస్తాయి. ఈ ఎపిసోడ్‌లోని ‘అమ్మాజీ’గా నటించిన అభా శర్మ ఇప్పుడు దేశంలో చాలామందికి అభిమాన నటిగా మారింది.75 ఏళ్ల వయసులో...అభా శర్మది లక్నో. ఇప్పుడామె వయసు 75 సంవత్సరాలు. ఈ వయసులో ఆమె ఎర్రటి ఎండల్లో మధ్యప్రదేశ్‌లో ఔట్డోర్కు వెళ్లి షూట్ చేయడమే కాదు అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకుంది. ‘నాకు చిన్నప్పటి నుంచి నటించాలనే కోరిక ఉంది. కాని మా అమ్మ పడనివ్వలేదు. నేను టీచర్‌గా పని చేస్తూ ఆ కోరికను మనసులోనే అదిమేశాను. కాని మా అమ్మ చనిపోయాక నా 47వ ఏట నటన మొదలెట్టాను. లక్నోలోని నాటక బృందాలతో నాటకాలు ఆడాను. నాకు 54 ఏళ్ల వయసున్నప్పుడు మొదటిసారి ఒక అడ్వర్టైజ్మెంట్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేశాను. కాని ఇప్పుడు పంచాయత్ 3లో నేను చేసిన వేషం ప్రపంచమంతా చూసింది. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తున్నాయి. ఎంతో ఆనందంగా ఉంది. 75 ఏళ్ల వయసులో నేను ఇంత గుర్తింపు పొందడం చూశాక– ఎవరైనా సరే తమ కలలను చివరి వరకూ నెరవేర్చుకోవడానికి ప్రయత్నించాలని చె΄్పాలనిపించింది’ అని చెప్పింది అభా శర్మ.జీవితంలో సవాళ్లుతండ్రి చనిపోయాక అభా శర్మకు తల్లిని చూసుకునే బాధ్యత వచ్చింది. ఆమె కోసం అభా శర్మ వివాహం చేసుకోలేదు. కాని 35వ ఏట ఆమెకు చిగుళ్ల వ్యాధి వచ్చి పళ్లు ఊడిపోయాయి. అంటే కాలక్రమంలో కృత్రిమ పళ్లు పెట్టడానికి కూడా వీలు కాని స్థితి. సాధారణంగా స్త్రీలు ఇలాంటి స్థితిలో నలుగురి ముందుకు రావడానికి ఇష్టపడరు. కాని అభా ఒక వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు తల్లిని చూసుకుంది. ఆమె మరణించాక నాటకాల్లోకి వచ్చింది. అయితే ఆమెకు శరీర అవయవాలు కంపించే అరుదైన వ్యాధి కూడా వచ్చింది. దాని వల్ల ఆమె మాట్లాడే విధానం చాలా స్లో అయిపోయింది. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ నటించాలనే పట్టుదలతో నటించి విజయం సాధించింది అభా శర్మ.పంచాయత్ అంటే...టి.వి.ఎఫ్. నిర్మాణ సంస్థ అమేజాన్ కోసం తీసిన కామెడీ వెబ్ సిరీస్ ‘పంచాయత్’. ఇప్పటికి రెండు సిరీస్‌లు ఘన విజయం సాధించి ఇప్పుడు మూడో సిరీస్ స్ట్రీమ్ అవుతోంది. భారతదేశంలోని చిన్న ఊళ్లలో మనుషుల అమాయకత్వం, వారి చిన్న చిన్న ఆకాంక్షలు, రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థల ద్వారా వారికి అందాల్సిన సాయాల్లో వచ్చే ఆటంకాలు... ఇవన్నీ ఈ సిరిస్‌లో సహజంగా చూపించడంతో సూపర్ హిట్ అయ్యింది. రఘవీర్ యాదవ్, నీనా గు΄్తా, జితేంద్ర కుమార్ ప్రధాన తారాగణం. -
డబ్బుల కోసం అడల్ట్ సినిమాలు చేశా: 'పంచాయత్' నటుడు
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలబడాలంటే చాలా కష్టం. ఎన్నో కష్టాలు తట్టుకోవాలి. ఈ క్రమంలోనే మనసుకు నచ్చకపోయినా సరే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. 'పంచాయత్' వెబ్ సిరీస్‌తో బోలెడంత ఫేమ్ సొంతం చేసుకున్న దుర్గేశ్ కుమార్‌ది కూడా ఇలాంటి కథే. నటుడిగా నిలదొక్కుకునే క్రమంలోనే అడల్ట్ ఫిల్మ్స్‌లోనూ నటించానని ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు.(ఇదీ చదవండి: తండ్రయిన స్టార్ హీరో.. మహాలక్ష్మి పుట్టిందని వీడియో పోస్ట్)బిహార్‌కి చెందిన దుర్గేశ్ కుమార్.. 2001లో ఇంజినీరింగ్ చేయడం కోసం దిల్లీ వెళ్లాడు. కానీ ఎగ్జామ్ కష్టంగా ఉండేసరికి.. నటనవైపు షిఫ్ట్ అయ్యాడు. ఓవైపు నాటకాల్లో నటిస్తూనే డిగ్రీ పూర్తి చేశాడు. 'నేషనల్ డ్రామా స్కూల్'లో యాక్టింగ్ కోర్సు చేశాడు. ఆ తర్వాత 'హైవే' సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'సుల్తాన్', 'ఫ్రీకీ అలీ' లాంటి చిత్రాల్లో నటించాడు కానీ ఇబ్బందులు తప్పలేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో డబ్బుల కోసం అడల్ట్ మూవీస్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇదంతా చెప్పుకొచ్చాడు.'యాక్టింగ్ చేయకపోతే నేను బతకలేదు. దీంతో నాకొచ్చిన ప్రతిదీ చేసుకుంటూ పోయాను. అలానే కొన్ని అడల్ట్ మూవీస్‌లోనూ చేయాల్సి వచ్చింది. 2016లో నేను ముంబయికి వచ్చాను. కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. మేమందరం ఎలాగైనా సరే ఇండస్ట్రీలోకి నిలబడాలనుకున్నాం. కానీ ఛాన్సుల కోసం ప్రతి క్యాస్టింగ్ డైరెక్టర్‌కి దగ్గరకెళ్లి, వాళ్ల కాళ్ల మీద పడ్డాం. ఇదంతా కూడా 'హైవే', 'ఫ్రీకీ అలీ', 'సుల్తాన్' లాంటి సినిమాల్లో నేను నటించిన తర్వాతే జరిగింది. కొన్ని చిత్రాల్లో యాక్ట్ చేసిన తర్వాత కూడా ఆడిషన్స్‌కి వెళ్లాలంటే ఏదోలా ఉంటుంది. అలా పంచాయత్ మొదటి సీజన్లో చిన్న రోల్ చేశాను. రెండున్నర గంటల్లో దీని షూట్ చేశారు' అని దుర్గేశ్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?) -
ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు.. ఆ రెండు మాత్రం స్పెషల్
మరో వారం వచ్చేసింది. చాలారోజులుగా డల్‌గా ఉన్న థియేటర్లలోకి మూడు తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'పై మంచి బజ్ ఉంది. 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' మూవీస్ కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నాయి. వీటిలో ఏవి హిట్ అవుతాయనే సంగతి పక్కనబెడితే ఓటీటీలో కూడా 19 వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి.(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాల విషయానికొస్తే ప్రస్తుతానికైతే తెలుగు సినిమాలేం లేవు. 'పంచాయత్' అనే హిందీ సిరీస్, 'వీర్ సావర్కర్' అనే హిందీ మూవీ మాత్రమే ఉన్నంతలో ఆసక్తి రేపుతున్నాయి. మరికొన్ని హిందీ చిత్రాలు-సిరీసులు ఉన్నాయి గానీ రిలీజైతే గానీ వాటి టాక్ చెప్పలేం. అలానే ఈ వీకెండ్లో తెలుగు మూవీస్ ఏమైనా సడన్‌గా స్ట్రీమింగ్కి వస్తాయేమో చూడాలి. ఇంతకీ ఈ వారం రాబోతున్న మూవీస్ ఏంటో తెలుసా?ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ మూవీస్ జాబితా (మే 27 - జూన్ 02 వరకు)అమెజాన్ ప్రైమ్పంచాయత్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 28హాట్‌స్టార్కామ్డేన్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 29ద ఫస్ట్ ఓమన్ (ఇంగ్లీష్ సినిమా) - మే 30ఉప్పు పులి కారమ్ (తమిళ సిరీస్) - మే 30జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31నెట్ఫ్లిక్స్ద లైఫ్ యూ వాంటెడ్ (ఇటాలియన్ సిరీస్) - మే 29ఎరిక్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30గీక్ గర్ల్ (ఇంగ్లీష్ సిరీస్) - మే 30ఏ పార్ట్ ఆఫ్ యూ (స్వీడిష్ సినిమా) - మే 31రైజింగ్ వాయిసెస్ (స్పానిష్ సిరీస్) - మే 31లంబర్‌జాక్ ద మానస్టర్ (జపనీస్ మూవీ) - జూన్ 01జియో సినిమాఇల్లీగల్ సీజన్ 3 (హిందీ సిరీస్) - మే 29దేద్ బిగా జమీన్ (హిందీ సినిమా) - మే 31లా అండ్ ఆర్డర్ టొరంటో (ఇంగ్లీష్ సిరీస్) - మే 31ద లాస్ట్ రైఫిల్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - మే 31ఏలీన్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 01జీ5స్వాతంత్ర్య వీర్ సావర్కర్ (హిందీ మూవీ) - మే 28హౌస్ ఆఫ్ లైస్ (హిందీ సిరీస్) - మే 31సైనా ప్లేపొంబలై ఒరుమై (మలయాళ సినిమా) - మే 31(ఇదీ చదవండి: ఓటీటీలోకి రీసెంట్ మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
ఇండియాలో హిట్ కొట్టిన వెబ్ సిరీస్.. సీజన్ 3 రిలీజ్ డేట్ ఇదే
అమెజాన్ ప్రైమ్లా బెస్ట్ వెబ్ సిరీస్‌లో లిస్ట్‌లో 'పంచాయత్' తప్పకుండా ఉంటుంది. ఇప్పటి వరకు విడుదలై రెండు సిజన్లూ సూపర్ హిట్ అందుకున్నాయి. సీజన్ 3 కోసం ఎదురుచూస్తోన్న ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్‌న్యూస్ వినిపించారు. ఓటీటీలోకి ఈ సిరీస్ ఎప్పుడు వస్తుందా..? అనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెర పడింది. మే 28 నుంచి ఈ సిరీస్ అమెజాన్‌లో విడుదల కానుంది. 2020లో మొదటి సీజన్ విడుదలైతే.. 2022లో సీజన్-2 రిలీజ్ అయింది.అభిషేక్ త్రిపాఠి అనే యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉంటాడు. అతనికి క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాదు. కానీ, కొన్ని కారణాల వల్ల స్నేహితుల సలహా మేరకు పంచాయతీ సెక్రటరీలో ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ రత్యా ఉత్తర ప్రదేశ్‌లోని ఫులేరా అనే గ్రామంలో అభిషేక్ అడుగుపెడుతాడు. భిన్న మనస్తత్వాలు కలిగిన గ్రామస్తుల మధ్య ఆయనకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అభిషేక్ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి..? ఈ క్రమంలో దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా కామెడీని పండించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఈ కామెడీ డ్రామా సిరీస్‌లో అభిషేక్ త్రిపాఠిగా నటించిన జితేంద్రకుమార్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన వెబ్‌సిరీస్‌ల లిస్ట్‌లో టాప్ ప్లేస్‌లో ఒకటిగా పంచాయత్ సీజన్ 1, సీజన్ 2 నిలిచాయి. గత సీజన్స్ లాగే సీజన్ 3 కూడా ఎనిమిది ఎపిసోడ్స్‌తో విడుదల కానుంది. మే 28 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'పంచాయత్' సీజన్ 3 ఎంట్రీ ఇవ్వనుంది.you moved the laukis, we unlocked your reward! #PanchayatOnPrime S3, May 28@TheViralFever @ArunabhKumar @StephenPoppins #ChandanKumar @uncle_sherry @vijaykoshy @Farjigulzar #RaghubirYadav @Neenagupta001 @chandanroy77 @malikfeb @Sanvikka #PankajJha pic.twitter.com/ouN5ON5hGp— prime video IN (@PrimeVideoIN) May 2, 2024 -
నేను బతికే ఉన్నాను.. రూమర్స్‌పై యువనటి క్లారిటీ
ఘోర రోడ్డు ప్రమాదం. ఈ ఘటనలో దాదాపు 10 మంది దుర్మరణం చెందారు. ఇందులో ప్రముఖ నటి అంచల్ తివారీ కూడా ఉంది. మంగవారం అంతా కూడా ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. దీంతో చాలామంది నటి అంచల్కి నివాళులు అర్పించారు. పాపం చిన్న వయసులోనే చనిపోయిందని బాధపడ్డారు. కానీ ఈమె చనిపోలేదని, చిన్న పొరపాటు వల్ల మరణ వార్తలు వైరల్ అయ్యాయని అంటున్నారు. ఇంతకీ అసలేం జరిగింది? (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా) మధ్యప్రదేశ్‌కి చెందిన అంచల్ తివారీ.. నటిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నాల్లో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన 'పంచాయత్' అనే వెబ్ సిరీస్‌లో ఓ పాత్రలో నటించి కాస్తంత పేరు తెచ్చుకుంది. సరే ఈ విషయం పక్కనబెడితే తాజాగా బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఆదివారం ఓ రోడ్డు ప్రమాదం జరగ్గా.. ఇందులో పదిమంది వరకు చనిపోయారు. అయితే ఇందులో ఓ భోజ్‌పురి నటి ఉందనే తెగ మాట్లాడుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో అంచల్ తివారీ అనే అమ్మాయి ఉన్న మాట వాస్తవమే కానీ ఆమె, నటి అంచల్ తివారీ వేర్వేరు అనే విషయం తేలింది. నటి అంచల్ స్వయంగా తన ఇన్ స్టాలో 'నేను బతికే ఉన్నాను' అని అర్థమొచ్చేలా ఉన్న ఓ పోస్ట్ పెట్టడంతో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. ఒకే పేరుతో ఉన్న ఇద్దరు వ్యక్తుల వల్ల ఇంతలా పొరపాటు జరిగిందనమాట. (ఇదీ చదవండి:కాబోయే భర్త విజయ్ దేవరకొండలా? రష్మిక ట్వీట్ వైరల్) -
అరవయ్యా.. ఇరవయ్యా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రోజురోజుకీ సమీపిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీట్ల పంపకాలను నానుస్తుండడంపై జనశ్రేణులు కత్తులు నూరుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారైనప్పటికీ ఇప్పటివరకు సీట్ల సంఖ్య తేల్చకపోవడంతో ఇదంతా అధినేతలిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగానే వారు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. క్షేత్రస్థాయిలో జనసేన–టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటిగా కలిసి పనిచేసే పరిస్థితి లేకున్నా ఉద్దేశపూర్వకంగానే వారిద్దరూ నెలల తరబడి సీట్ల విషయంలో సాగదీత వైఖరి అవలంబిస్తున్నారని వారంటున్నారు. అలాగే, పొత్తులో భాగంగా జనసేన 60కి పైగా సీట్లను కోరుకుంటుండగా టీడీపీ అతితక్కువగా అంటే 20కి అటూఇటుగా సరిపుచ్చాలనే ధోరణితో ఉంది. ఈ విషయం పవన్‌కు స్పష్టంగా తెలుసునని.. అయినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూస్తుంటే పవన్ చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారన్నది స్పష్టంగా అర్ధమవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. అసలు జనసేనకు కేటాయించే సీట్లు అరవయ్యా.. ఇరవయ్యా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబుకు పోటీగా పవన్ రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించడం కూడా పెద్ద నాటకమేనని.. అదేదో చంద్రబాబుకు కౌంటర్‌గా తాను ఆ ప్రకటన చేసినట్లుగా పవన్ బిల్డప్ ఇచ్చుకున్నారని.. ఇది పార్టీలో పెద్ద నవ్వులాటగా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ తీరుతో నిస్తేజంలో నేతలు అలాగే, పొత్తుల డ్రామాలో తాము పూర్తిగా టీడీపీ ట్రాప్‌లో పడిపోయామని జనసేన శ్రేణులు అంటున్నారు. కీలక ఎన్నికల సమయంలో పార్టీలో ఎలాంటి హడావుడి లేకపోవడం ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తోందో అందరికీ తెలిసిందేనని.. పవన్ తీరుతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులందరూ పూర్తి నిస్తేజంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడానికి అవకాశం వస్తుందో తెలీక నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉండే కొద్దిమంది అభిమానులు పూర్తి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. పవన్ ఉద్దేశపూర్వకంగానే సీట్ల కేటాయింపును తేల్చకుండా పార్టీలో నిస్తేజపూరిత వాతావరణం సృష్టిస్తున్నారని.. తద్వారా రాష్ట్రంలో జనసేన ప్రభావం పెద్దగాలేదని సాకులు చెప్పి కేవలం అరకొర సీట్లను తీసుకోవాలన్నది పవన్ ఎత్తుగడ కావొచ్చని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. నిజానికి.. ప్రస్తుత పరిస్థితుల కంటే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు జనసేన చాలా క్రియాశీలకంగా పనిచేసిందని, ఇప్పటికంటే అప్పుడే పవన్ ఎక్కువగా ప్రజల్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. జనసేన నేతల మండిపాటు ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ పవన్‌ను తమ ఎన్నికల కార్యక్రమాలకు పూర్తిగా ఉపయోగించుకుంటోందని.. ఇందుకు తమ అధినేత కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా చంద్రబాబు చెప్పింది చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇందుకు వారు పలు సంఘటనలను సైతం ఉదహరిస్తున్నారు. మొన్న డిసెంబరులో లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పవన్ స్వయంగా పాల్గొన్నారని.. అలాగే, చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామం మందడంలో సంకాంత్రి వేడుకల్లో పాల్గొన్నారని.. అంతేకాక, జనవరి 9న ఇద్దరూ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి భేటీ అయ్యారని వారు గుర్తుచేస్తున్నారు. ఇంకోవైపు.. టీడీపీ నిర్వహిస్తున్న ‘రా.. కదిలిరా’ సభల్లో పవన్ ఫొటోలను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రచారం చేసుకుంటున్నా పవన్ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు. పవన్ ప్రజల్లోకి వచ్చి 4 నెలలు ఇక జనసేన పోటీచేసే సీట్లు ఇప్పటికీ తేలకపోవడంతో నియోజకవర్గాల్లో పార్టీ నేతలు సైతం సహకరించే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో పవన్‌కళ్యాణ్ జిల్లా పర్యటనలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. గత ఏడాది అక్టోబరు రెండో వారంలో ఆఖరిసారిగా ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారాహి యాత్రలో పాల్గొన్నారు. అలాగే, డిసెంబరు చివర్లో పవన్ కాకినాడ ప్రాంతంలో పర్యటించినా, ఆ పర్యటన కేవలం పార్టీ నేతల సమావేశాలకే పరిమితమయ్యారు. మరోవైపు.. జనవరి నెలాఖరు నుంచి పవన్ ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని కూడా ఆ పార్టీ 20 రోజుల క్రితం ప్రకటించింది. అయితే, ఫిబ్రవరి మొదటివారం ముగుస్తున్నా పవన్ పర్యటనలపై పార్టీలోనే స్పష్టతలేదు. ఇదంతా దేనికి సంకేతమని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. -
పార్వతీపురంలో పంచాయతీ శిలాఫలకం ధ్వంసం
నిడమనూరు: నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని బుధవారం దుండగులు ధ్వంసం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022సంవత్సరంలో విడుదల చేసిన రూ.20లక్షల నిధులతో గ్రామంలో చేపట్టిన పంచాయతీ భవన నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. సర్పంచ్ల పదవీకాలం బుధవారంతో ముగియనుండడంతో శిలాఫలకంపై తన పేరు ఉండాలని సర్పంచ్ వంకా బ్రహ్మన్న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశాడు. ఇంకా పూర్తి కాని పంచాయతీ భవన ప్రారంభోత్సవాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం భవనం ప్రారంభోత్సవం చేసేందుకు సర్పంచ్ వచ్చే సరికి శిలాఫలకం ధ్వంసమై ఉంది. దీంతో సర్పంచ్ వంకా బ్రహ్మన్న మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి పరిశీలించారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు నిధులు విడుదల చేశామని, కాంగ్రెస్ వారు ఓర్చుకోలేకనే ఇలా శిలాఫలకాన్ని ధ్వంసం చేసారని ఆరోపించారు. శిలాఫలకాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు వేములపల్లి వెంకట్రావు, మద్దిపూడి రాంబాబు, కుంబం విజయ్, కంచి శ్రీను ధ్వంసం చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ సర్పంచ్ బ్రహ్మన్న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమతి లేకుండా ఎందుకు ప్రారంభోత్సవం చేస్తున్నారని డిగితే దూషించారని స్థానిక కాంగ్రెస్ నాయకుడు వేములపల్లి వెంకట్రావు సర్పంచ్‌తో పాటు వంకా బ్రహ్మన్న, సత్యనారాయణ, నక్క సైదులు, కృష్ణమూర్తిపై మరో ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ గోపాల్‌రావు తెలిపారు. ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. గ్రామంలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేకనే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. – వంకా బ్రహ్మన్న, సర్పంచ్, పార్వతీపురం సమాచారం లేదు పార్వతీపురం గ్రామ పంచాయతీ భవనం ప్రారంభోత్సవం గురించి అధికారికంగా సమాచారం లేదు. భవనం పూర్తి అయిన తర్వాత ప్రాంరంభిస్తాం. భవనం పూర్తయినట్లు కూడా సమాచారం అందలేదు. – ప్రమోద్‌కుమార్, ఎంపీడీఓ, నిడమనూరు -
ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్
సంక్రాంతి హడావుడి అయిపోయింది. మళ్లీ స్కూల్స్, ఆఫీస్‌లు షరా మాములే! పండక్కి రిలీజైన సినిమాల్లో 'హనుమాన్' ఇప్పటికీ దుమ్ముదులుపుతుండగా.. మిగతా వాడి సందడి మాత్రం తగ్గిపోయింది. ఈ వారం 'కెప్టెన్ మిల్లర్', 'అయలాన్' లాంటి డబ్బింగ్ మూవీస్‌తో పాటు 'ఫైటర్' అనే హిందీ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. వీటిపై పెద్దగా బజ్ అయితే లేదు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం ఏకంగా 27 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. అయితే వీటిలో 'నెరు' అనే డబ్బింగ్ మూవీ ఆసక్తి కలిగిస్తోంది. మలయాళంలో హిట్ అయిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా కోసం మూవీ లవర్స్ వెయిటింగ్. దీనితో పాటు 'ఫైట్ క్లబ్', 'సామ్ బహుదూర్' సినిమాలు.. అలానే 'పంచాయత్ సీజన్ 3' కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం. ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 22-జనవరి 28 వరకు) నెట్‌ఫ్లిక్స్ నాట్ క్వైట్ నర్వాల్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 22 జాక్వెలిన్ నోవాక్: గెట్ ఆన్ యూవర్ నీస్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 23 లవ్ డెడ్‌లైన్ (జపనీస్ సిరీస్) - జనవరి 23 గ్రీసెల్డా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 క్వీర్ ఐ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 సిక్స్ నేషన్స్: ఫుల్ కాంటాక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 బూగీమన్ (అరబిక్ మూవీ) - జనవరి 25 మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 25 బ్యాడ్ ల్యాండ్ హంటర్స్ (కొరియన్ చిత్రం) - జనవరి 26 క్రిష్, ట్రిష్, బల్టీ బాయ్ సీజన్ 2 (హిందీ సిరీస్) - జనవరి 28 అమెజాన్ ప్రైమ్ కెవిన్ జేమ్స్: ఇర్ రిగార్డ్లెస్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ) - జనవరి 23 కజిమ్యాన్ (ఇండోనేసియన్ సినిమా) - జనవరి 25 హస్లర్స్ (హిందీ సిరీస్) - జనవరి 24 ఎక్స్‌పాట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26 పంచాయత్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జనవరి 26 హాట్‌స్టార్ నెరు (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 23 ఏ రియల్ బగ్స్ లైఫ్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 24 ఫ్లెక్స్ X కాప్ (కొరియన్ సిరీస్) - జనవరి 26 కర్మ కాలింగ్ (హిందీ సిరీస్) - జనవరి 26 ఫైట్ క్లబ్ (తమిళ సినిమా) - జనవరి 27 జీ5 సామ్ బహుదూర్ (హిందీ సినిమా) - జనవరి 26 సోనీ లివ్ షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 22 బుక్ మై షో వోంకా (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 22 ఆక్వామన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 23 ఫియర్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 23 జియో సినిమా మై బిగ్ ఫాట్ గ్రీక్ వెడ్డింగ్ 3 (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 22 ఆపిల్ ప్లస్ టీవీ మాస్టర్ ఆఫ్ ద ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 26 (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) -
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంచాయతీ ఉప ఎన్నికలకు సర్వం సిద్ధం
-
ఉప ఎన్నికల్లోనూ సగానికిపైగా ఏకగ్రీవాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా 484 మండలాల పరిధిలో మొత్తం 1,033 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో సగానికి పైగా స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఆయా గ్రామాల్లో మొత్తం 66 సర్పంచ్ స్థానాలతోపాటు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. పదో తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగగా, సోమవారం సాయంత్రం మూడు గంటలకు నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ముగిసింది. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి అందిన సమాచారం మేరకు.. సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరిగే మొత్తం 66 గ్రామాల్లో 32 చోట్ల ఎన్నిక ఏకగ్రీవం కాగా, రెండుచోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. కేవలం 32చోట్ల మాత్రమే సర్పంచ్ స్థానాలకు ఈ నెల 19న పోలింగ్ జరగనుంది. మరోవైపు 1,064 వార్డు సభ్యులకు ఉప ఎన్నికలు జరుగుతుండగా.. 757 స్థానాలు ఏకగ్రీవం కాగా, 261 చోట్ల 19న పోలింగ్ జరగనుంది. 46 వార్డు సభ్యుల స్థానాలకు ఒక్కరు కూడా నామినేషన్లు దాఖలు చేయనందున ఆయా స్థానాల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. మూడురెట్లు పెరిగిన ఏకగ్రీవాలు.. రెండున్నర ఏళ్ల క్రితం... అంటే 2021 జనవరి, ఫిబ్రవరిలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో సర్పంచ్ స్థానాల్లో కేవలం 17 శాతం, వార్డు సభ్యుల స్థానాల్లో 36 శాతం ఏకగ్రీవమయ్యాయి. కానీ, ఇప్పుడు రెండున్నర ఏళ్ల తర్వాత ఉప ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. అప్పటికంటే సర్పంచ్ స్థానాల్లో దాదాపు మూడు రెట్లు ఏకగ్రీవాలు పెరగగా, వార్డు సభ్యుల స్థానాల్లో ఏకగ్రీవాలు రెట్టింపు కావడం గమనార్హం. -
70 శాతం మార్కులు వస్తేనే.! జేపీఎస్ రెగ్యులరైజేషన్‌లో సర్కార్ మెలిక
సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) రెగ్యులరైజేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకమై, నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరు మదింపులో 70 శాతం మార్కులు వచ్చిన వారినే క్రమబద్దికరించాలని నిర్ణయించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మంగళవారం మెమో జారీ చేశారు. ఈ అధికారిక మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపారు. జేపీఎస్‌ల పనితీరును మదింపు చేసేందుకు జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, ఈ కమిటీలు ఆయా జిల్లాల్లోని జేపీఎస్‌ల పనితీరును సమీక్షించి మార్కులు ఇస్తున్నాయని, కమిటీలు ఇచ్చే రిపోర్టుల్లో 70శాతం, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారిని క్రమబద్దికరిస్తూ నియామక ఉత్తర్వులు అందజేయాలని ఈ మెమో లో స్పష్టం చేశారు. ఒకవేళ 70శాతం మార్కులు రాకపోతే ఆయా జేపీఎస్‌లకు మరో ఆరునెలల గడువు ఇవ్వాలని, అప్పుడు మరోమారు పనితీరు మదింపు చేసి అప్పటి నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలి జిల్లా స్థాయిలో ఆయా కమిటీల మదింపు నివేదికలను గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేయాలని, పనితీరు సంతృప్తిగా ఉన్న జేపీఎస్‌లకు ఇచ్చే నియామక ఉత్తర్వులను కూడా ఇదే యాప్‌లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను జిల్లా అదనపు కలెక్టర్ల (స్థానిక సంస్థలు)కు అప్పగించారు. అర్హత పొందిన జేపీఎస్‌లకు ఇవ్వాల్సిన నియామక ఉత్తర్వులకు సంబంధించిన ముసాయిదాను కూడా ఈ మెమోతో జతచేసి జిల్లాలకు పంపారు. ప్రభుత్వ నిర్ణయం విడ్డూరం: టీపీఎస్ఏ పనితీరు మదింపులో 70శాతం మార్కులు వచ్చిన వారిని మాత్రమే క్రమబద్దికరిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు విడ్డూరంగా ఉన్నా యని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ (టీపీఎస్ఏ) వ్యాఖ్యానించింది. డైరెక్ట్‌గా రిక్రూట్ అయి మూడేళ్ల సర్విసు పూర్తి చేసుకున్న జేపీఎస్‌లను అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయాలని టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, ఇ. శ్రీనివాస్‌లు మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామీ ణాభివృద్ధి శాఖ జారీ చేసిన మెమో అనేక గందరగోళాలకు తావిస్తోందని, తమ డిమాండ్ ప్రకారం అందరినీ బేషరతుగా రెగ్యులరైజ్ చేయకుంటే పోరాటా నికి దిగాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. -
ఆడపిల్ల పుట్టిందని..
జమ్మికుంట: ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందంటారు. కానీ ఆమెకు ఆడపిల్ల పుట్టడమే శాపమైంది. బిడ్డతో కాపురానికి వచ్చిన ఆమెకు మెట్టినింట్లో చేదు అనుభవం ఎదురైంది. ఇంట్లోకి రానీయకుండా అత్తమామలు అడ్డుకున్నారు. కాపురానికి రావద్దని భర్త తెగేసి చెప్పాడు. ఆ ఇల్లాలు 100కు కాల్ చేయగా.. పోలీసులు వచ్చి.. గొడవలు వద్దని, పంచాయితీ చేసుకోవాలని సలహా ఇచ్చి వెళ్లిపోయారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు, బంధువుల కథనం ప్రకారం.. కనగర్తికి బండ ప్రభాకర్, పుష్పలత దంపతుల కూతురు బండ స్పందనను ఐదేళ్ల క్రితం మాచనపల్లికి చెందిన గాండ్ల శంకర్, అరుణ దంపతుల కుమారుడు కిరణ్‌కిచ్చి వివాహం చేశారు. రూ.4 లక్షల కట్నం, ఎకరం వ్యవసాయ భూమి ఇచ్చారు. కిరణ్ ప్రస్తుతం వరంగల్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 11 నెలల క్రితం స్పందన ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్ల పుట్టిందని కిరణ్ కనీసం చూసేందుకూ రాలేదు. పైగా కాపురానికి నిరాకరిస్తున్నాడు. తొమ్మిది నెలల క్రితం స్పందన తండ్రి చనిపోవడంతో ఆమెకు పెద్ద దిక్కులేకుండా పోయింది. కాపురానికి తీసుకెళ్లడం లేదంటూ పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ జరిగినా కిరణ్ మనసు మారలేదు. బంధువుల సహకారంతో స్పందన ఆదివారం మాచనపల్లికి చేరుకుంది. దీంతో అత్తమామ, భర్త, ఆడబిడ్డ ఇంట్లోకి రాకుండా అడ్డుకుని గెంటేశారు. దీంతో బాధితురాలి బంధువులు 100 కాల్ చేయగా.. సంఘటన స్థలానికి చేరుకున్న జమ్మికుంట పోలీసులు రెండురోజుల్లో పంచాయితీ చేసుకోవాలని సూచించి వెళ్లిపోయారు. స్పందన పుట్టెడు దుఃఖంతో మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. -
ఉత్తమ పంచాయతీలకు అవార్డులు.. దరఖాస్తుల ఆహ్వానం
సత్తెనపల్లి: ‘పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు’ ఇదీ.. జాతిపిత మహాత్మాగాంధీ మాట. దీనిని స్ఫూర్తిగా తీసుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తున్నాయి. గ్రామం పంచాయతీలను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నాయి. దీనిలో భాగంగానే గ్రామ పాలనలో ఉత్తమంగా నిలిచిన పంచాయతీలకు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏటా జాతీయ స్థాయిలో పురస్కారాలు అందజేస్తోంది. ఈసారి అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 9 అంశాల్లో అక్టోబరు 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనుంది. 9 అంశాలివే.. పేదరిక నిర్మూలనకు మెరుగైన జీవనోపాధి ఆరోగ్యవంతమైన గ్రామం పిల్లల స్నేహపూర్వక పంచాయతీ తాగునీటి లభ్యత హరిత, స్వచ్ఛ గ్రామం స్వయం సమృద్ధి, మౌలిక సదుపాయాలు సామాజిక భద్రత, సుపరిపాలన మహిళా స్నేహపూర్వక పంచాయతీ ప్రత్యేక పోర్టల్ ఈ అంశాల్లో చేపట్టిన అభివృద్ధి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించాలి. దీనికోసం పంచాయతీవార్డ్.జీవోవీ.ఇన్ పోర్టల్ అందుబాటులో ఉంచారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల వారీగా పనులను పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. ఒక్కో అంశానికి సంబంధించి ప్రతిబింబించే ఫొటోలు, వీడియోలు, కేస్ స్టడీస్‌తో దరఖాస్తు చేయాలి. జాతీయ స్థాయిలో అవార్డుకు ఎంపికైతే వచ్చే ఏడాది ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం రోజున అవార్డును ప్రదానం చేస్తారు. అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో చూపించే ఆదర్శ పంచాయతీలకు ఇది సదవకాశం. పరిశుభ్రత, పచ్చదనం, తాగునీరు, ఉపాధి అవకాశాల కల్పన, మౌలిక సదుపాయాలు తదితర అంశాల్లో జిల్లాలోని చాలా గ్రామాలు ప్రగతిని చూపుతున్నాయి. పల్నాడు జిల్లాలో 28 మండలాల్లో 366 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మంచి అవకాశం జాతీయ స్థాయిలో పురస్కారం అందుకునేందుకు ఇది మంచి అవకాశం. చేపట్టిన అభివృద్ధి తదితర వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఎంపికైతే పురస్కారం ద్వారా లభించే నజరానాతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. – జీవీ సత్యనారాయణ, ఎంపీడీవో, సత్తెనపల్లి -
ఇదేం విడ్డూరం! ఎన్నికైంది ఒకళ్లు... ప్రమాణ స్వీకారం చేసింది మరోకళ్లు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని గైసాబాద్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక వివాదం తెరపైకి వచ్చింది. ఈ మేరకు గైసాబాద్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మూడు అంచెల ఎన్నికలు జరిగాయి. అయితే ఆ ఎన్నికల్లో సర్పంచ్‌గా షెడ్యూల్డ్ కులానికి చెందని ఒక మహిళ ఎన్నికైంది. అంతేకాదు ఆ ఎన్నికల్లో ఆమె తోపాటు మరికొంతమంది మహిళలు పంచాయతీ సభ్యులగా ఎన్నికయ్యారు ఐతే ప్రమాణా స్వీకారోత్సవానికి ఎన్నికైన మహిళలెవరూ హాజరు కాలేదు. పైగా ఆయా మహిళల స్థానంలో వారి భర్తలే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు సంబంధిత అధికారి కూడా ఆయా మహిళల భర్తల చేత ప్రమాణ స్వీకారం చేయించినట్లు ఫిర్యాదుల వచ్చాయి. దీంతో జిల్లా యంత్రాంగం సంబంధిత అధికారులను నిజానిజాలు విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దామోహ గ్రామ పంచాయతీ ఎన్నికల చీఫ్ ఎగ్జూక్యూటివ్ ఆఫీసర్ అజయ్ శ్రీవాస్తవ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనపై వివరణాత్మక నివేదికను ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించామని, నివేదిక వచ్చిన వెంటనే పంచాయతీ సెక్రటరీ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. (చదవండి: ఎంత ఘోరం.. నాలుగో అంతస్తు నుంచి చిన్నారిని పడేసిన తల్లి!) -
నా ఫ్రెండ్‌ను చదివించండి
కౌడిపల్లి(నర్సాపూర్): తాను చదువుకుం టోంది... తన స్నేహితురాలు మాత్రం చదువు మాని ఇంటివద్దే ఉంటోంది. అది ఆమెను బాధించింది. అందుకే ‘నా ఫ్రెండ్‌ను చదివించండి’ అంటూ పాఠశాలకు వచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకుంది. మెదక్ జిల్లా మహ్మద్ నగర్‌గేట్ తండాకు చెందిన సంధ్య, కౌడిపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. అదే తరగతికి చెందిన ఆమె ఫ్రెండ్ నందిని నలుగురు ఆడపిల్లల్లో పెద్దది. ఇటీవలే ఆమె స్కూల్ మానేసి ఇంటివద్దే ఉంటోంది. స్నేహితురాలు పాఠశాలకు రాకపోవ డం సంధ్యను బాధపెట్టింది. ఈ క్రమంలో పాఠశాలలో గురువారం నిర్వహించిన ‘ఫ్రెండ్లీ పంచాయత్, లింగ వివక్ష’ అవగాహన సదస్సులో విద్యార్థులు పలు సమస్యలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంధ్య ‘నా ఫ్రెండ్ నాకంటే బాగా చదువుతుంది. కానీ తల్లిదండ్రులు వద్దని చెప్పడంతో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. నా ఫ్రెండ్‌ను చదివించండి’ అంటూ కోరింది. బాలిక అభ్యర్థనకు స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అధికారులు.. నందినిని తప్పకుండా చదివిస్తామని హామీ ఇచ్చారు. -
Panchayat season 2: మంచి మనుషులకు గట్టి దెబ్బలు
కోట్లాది అభిమానులు ఎదురు చూస్తూ వచ్చిన పంచాయత్ వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ‘ఫులేరా’ అనే పల్లెటూళ్లో పంచాయతీ ఆఫీసులో ఆ ఆఫీసు ఉద్యోగికి, ఊళ్లోని వారికి మధ్య స్నేహంతో మొదటి సీజన్ సాగితే ఇప్పుడు ముఖ్యపాత్రలకు గట్టి విరోధులు ఈ సీజన్లో కనిపిస్తారు. సహజత్వం, హాస్యం, అనుబంధంతో ఆకట్టుకుంటున్న ఈ సిరీస్ అమేజాన్‌లో మళ్లీ ఒకసారి ప్రేక్షకులను బింజ్ వాచింగ్ చేయిస్తోంది. 8 ఎపిసోడ్ల సెకండ్ సీజన్ పరిచయం ఈ ఆదివారం. అదే ఊరు. అదే పంచాయతీ ఆఫీసు. వేరే గది తీసుకోకుండా ఆ పంచాయతీ ఆఫీసులోనే నివసించే ఉద్యోగి అభిషేక్. అతన్ని అభిమానంగా చూసుకునే పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, ఆఫీసు అసిస్టెంట్ వికాస్... 2020లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ వచ్చినప్పుడు పాత దూరదర్శన్ సీరియల్స్‌లా అనిపించి దేశమంతా చూసింది. పంచాయత్ వెబ్ సిరీస్‌కు విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. సెకండ్ సీజన్ కోసం విన్నపాలు, ఒత్తిళ్లు తెచ్చారు. లాక్డౌన్ వల్ల ఆ పనులన్నీ ఆగిపోయి ఇప్పుడు పూర్తయ్యి ‘పంచాయత్ సీజన్ 2’ స్ట్రీమ్ అవుతోంది. మళ్లీ అభిమానులను అలరిస్తోంది. ఫులేరాలో ప్రత్యర్థులు ఉత్తరప్రదేశ్‌లోని ‘ఫులేరా’ అనే కల్పిత ఊరిలో జరిగినట్టుగా చెప్పే ఈ కథలో అందరూ మంచివాళ్లే. అమాయకులే. ఒకరికొకరు సాయం చేసుకునేవారే. కాని ఆ ఊరికి గ్రామ సచివాలయ ఉద్యోగిగా వచ్చిన అభిషేక్‌కు ఎం.బి.ఏ చదివి వేరే ఉద్యోగం చేయాలని ఎంట్రన్స్ టెస్ట్‌కు ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ లోపల అతనికి ఆ ఊరి సర్పంచ్‌తో, ఉప సర్పంచ్‌తో, అసిస్టెంట్‌తో మంచి స్నేహం ఏర్పడుతుంది. నిజానికి ఆ ఊరి సర్పంచ్ స్త్రీ (నీనా గుప్తా) అయినా సర్పంచ్ భర్త (రఘువీర్ యాదవ్) వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటాడు. అభిషేక్ (జితేంద్ర కుమార్) వారి ఇంటికి రాకపోకలు సాగిస్తూ ఉంటాడు. మొదటి సిరీస్‌లో సర్పంచ్ కూతురు ఉంటుంది కాని ఎక్కడా కనిపించదు. కాని ఈ సిరీస్‌లో ఆ కూతురు కనిపిస్తుంది. అభిషేక్‌తో స్నేహం చేస్తుంది. అయితే ఊరన్నాక ఒకరో ఇద్దరో ప్రత్యర్థులు ఉండకపోరు. ఈ ఊళ్లో కూడా ఒక ప్రత్యర్థి తయారవుతాడు. అతడే ఆ ఊరి టెంట్ హౌస్ ఓనర్. రాబోయే ఎన్నికలలో తన భార్యను నిలబెట్టి సర్పంచ్ భర్తగా చలాయించాలనుకుంటున్న ఆ టెంట్ హౌస్ ఓనర్ సర్పంచ్‌ను, సచివాలయ ఉద్యోగులను పరేషాన్ చేస్తుంటాడు. మరోవైపు ఆ నియోజక వర్గ ఎం.ఎల్.ఏ కూడా సర్పంచ్‌ని అవమానిస్తుంటాడు. సర్పంచ్ తన కుమార్తె కోసం సంబంధం చూస్తే ఆ పెళ్లికొడుకు సైకోలాగా మారి ఆ అమ్మాయికి తెగ ఫోన్లు చేస్తుంటాడు. వీళ్లందరూ ప్రత్యర్థులే అయినా అభిషేక్, సర్పంచ్, ఉప సర్పంచ్, అసిస్టెంట్ నలుగురూ కలిసి ఆ సమస్యలను ఎలా దాటారు అనేవే ఈ ఎపిసోడ్స్. నవ్వొచ్చే ఎపిసోడ్స్ గత సిరీస్లోలానే ఈ సిరీస్‌లో కూడా నవ్వొచ్చే ఉదంతాలు ఎన్నో ఉంటాయి. ఊరికి మరుగుదొడ్లు అలాట్ అయినా కొందరు ఉదయాన్నే బయటకు వెళుతుంటారు. అలా కనిపిస్తే ఊరుకునేది లేదని కలెక్టర్ విజిట్‌కు వస్తున్నట్టు తెలుస్తుంది. ఆమె ముందు ఊరి సర్పంచ్‌ను ఎలాగైనా బద్నామ్ చేయాలని టెంట్ హౌస్ ఓనర్ ఒకతణ్ణి నువ్వు ఎలాగైనా చెంబు పట్టుకుని పొద్దున్నే కలెక్టరుకు కనిపించు అంటాడు. కలెక్టరు విజిట్‌కు వస్తే కనిపించాలని అతను, అతణ్ణి ఎలాగైనా ఆపాలని మిత్రబృందం చేసే ప్రహసనాలు చాలా నవ్వు తెప్పిస్తాయి. గుడిలో టెంట్ హౌస్ ఓనర్ భార్య చెప్పులను పొరపాటున సర్పంచ్ భార్య తొడుక్కుని ఇంటికి వస్తుంది. తన చెప్పులు కనిపించని టెంట్ హౌస్ ఓనర్ భార్య సిసి టీవీలో చూసి సర్పంచ్ భార్యే దొంగ అని తెలుసుకుని పోలీస్ కేస్ పెడతానంటుంది. ఆ చెప్పులు ఆమె ఇంట్లో పడేయడానికి హీరో నానా విన్యాసాలు చేస్తాడు. అదీ నవ్వే. ఊరి రోడ్డు కోసం నిధులకు ఎంఎల్ఏ దగ్గరకు వెళితే ఆ ఎంఎల్ఏ ముందు ఎక్స్‌ప్రెస్ రైలును ఆపడానికి ధర్నా చేయమని పంపిస్తాడు. అక్కడ సర్పంచ్‌ను, ఉపసర్పంచ్‌ను పోలీసులు పట్టుకెళతారు. అదంతా చాలా సరదాగా ఉంటుంది. హీరోయిన్ను పెళ్లికొడుకు వేధిస్తూ ఉంటే ఆమె హీరో సాయం కోరుతుంది. అలాగే హీరోయిన్, హీరో పరిచయం పెంచుకునే సన్నివేశాలు గిలిగింతలు పెడతాయి. గంభీరమైన ముగింపు సాధారణంగా పంచాయత్ ఎపిసోడ్స్ అన్నీ సరదాగా ఉంటాయి. కాని ఈ సిరీస్‌లో చివరి ఎపిసోడ్‌ను ఒక ఉదాత్త సన్నివేశంతో గంభీరం చేశాడు దర్శకుడు. ఆ సన్నివేశంతో ప్రేక్షకులందరూ కన్నీరు కారుస్తారు. మనసులు బరువెక్కుతాయి. సంతోషంతోపాటు దుఃఖమూ మనుషుల జీవితాల్లో ఉంటుందని చెప్పడానికి కాబోలు. ఇంకా పాత్రలు, వాటి గమ్యం పూర్తిగా తేలకుండానే ఈ సిరీస్ కూడా ముగుస్తుంది. అంటే సీజన్ 3కు కథ మిగిలించుకున్నారన్న మాట. ‘పంచాయత్’ బలం అంతా దాని సహజత్వం. సున్నితత్వం. హాస్యం. మానవ నిజ ప్రవర్తనలు. వీటిని దర్శకుడు దీపక్ కుమార్ మిశ్రా, రచయిత చందన్ కుమార్ గట్టిగా పట్టుకోవడంతో సిరీస్ నిలబడింది. కథ ఉత్తరప్రదేశ్‌లో జరిగినా లొకేషన్ అంతా భొపాల్కు దగ్గరగా తీశారు. ఆ ఊరి వాతావరణమే సగం ఆకట్టుకుంటుంది. థియేటర్ చేసిన నటులు కావడం వల్ల అందరూ పాత్రలను అద్భుతంగా పండిస్తారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం. ఇలాంటి జీవితాలు, పాత్రలు తెలుగు పల్లెల్లో ఎన్నెన్నో ఉంటాయి. గతంలో తెలుగులో కూడా మంచి సీరియల్స్ వచ్చేవి. ఇలాంటి కథలతో తెలుగులో కూడా వెబ్ సిరీస్ వస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారు. పంచాయత్ చూడని వాళ్లు మొదటి సిరీస్, రెండో సిరీస్ హాయిగా చూడొచ్చు. హిందీలో మాత్రమే లభ్యం. -
అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ్యండి
మునుగోడు: ‘అయ్యా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులం, పంచాయతీ కార్మికులం.. మేము చేసిన అభివృద్ధి పనులకు ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు.. ప్రతి నెలా కార్మికులకు అందించాల్సిన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరంతా మాకు దానం చేసి ఆదుకోవాలి’ అని కోరుతూ మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్నతో పాటు, పలువురు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్మికులు సోమవారం మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. సర్పంచ్ వెంకన్న నిక్కరు వేసుకుని అర్ధనగ్న ప్రదర్శనగా డప్పు చప్పుళ్లతో వార్డు సభ్యులు, కార్మికులతో కలసి దుకాణాలు, ఇంటి యజమానుల వద్దకు వెళ్లి నగదు ఇచ్చి ఆదుకోవాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఖాతాల్లో నగదు ఉన్నప్పటికీ తాము చేసిన పనుల చెక్కులు ఎస్టీఓలో వేస్తే చెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.35 లక్షలకు పైగా అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి తీసుకొచ్చామని వీటికి నెలకు రూ.70 వేల చొప్పున వడ్డీలు కడుతున్నామన్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సరిగా అందక ఆ కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: (Hyderabad: వెస్ట్ బెంగాల్ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం) ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్ల, కార్మికుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్ పందుల పవిత్రశ్రీను, వార్డు సభ్యులు ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, మిర్యాల మధుకర్, యాట రామస్వామి, పందుల నర్సింహ, యడవల్లి సురేష్, పంచాయతీ కార్మికులు సుధాకర్, పెంటయ్య, అచ్చమ్మ, పావని, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, ఎండీ అన్వర్ తదితరులు పాల్గొన్నారు. -
మూడేళ్లైంది.. మాటిచ్చి మరచిన టీఆర్ఎస్ ప్రభుత్వం
ఎన్నికల ఖర్చు తగ్గించేందుకు ప్రభుత్వం ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు నజరానా ఇస్తామని ప్రభుత్వం మాటిచ్చింది. గత సర్పంచ్ ఎన్నికల్లో రూ.10లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడంతో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో తొమ్మిది గ్రామ పంచాయతీలు ఏకగ్రీమయ్యాయి. కట్ చేస్తే ప్రభుత్వ మాటలు, హామీలు ఒట్టి మాటలేనని ఆయా గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. మూడేళ్లయినా రూ.10లక్షల నిధులు ఇవ్వకపోవడం గమనార్హం. ప్రభుత్వం ‘ఒట్టి మాటలు కట్టిపెట్టి పంచాయతీలకు తోడు పడాలి’అని పాలకవర్గాలు కోరుతున్నారు. సాక్షి,ఘట్కేసర్(హైదరాబాద్): జిల్లాలో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమై మూడేళ్లవుతోంది. నజరానా నిధులు కోసం పాలకవర్గాలు వెయ్యి కళ్లతో ఆశగా ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనుకున్న వారి ఆశలు అడియాశలవుతున్నాయి. నిధుల కొరతతో ఏకగ్రీవ పంచాయతీల్లో చిన్న చిన్న పనులు కూడా చేపట్టలేని దుస్థితి నెలకొంది. (చదవండి: ట్రాఫిక్ పోలీసుల తీరు.. ఏపీ వాహనం ఆపాల్సిందే ) 61 పంచాయతీల్లో 9 ఏకగ్రీవం.. ► జిల్లాలో 61 పంచాయతీలు ఉన్నాయి. అందులో 9 ఏకగ్రీవం అయ్యాయి. మంత్రులు తలో మాట అంటుండటంతో ఏకగ్రీవమైన పంచాయతీలకు నిధులు వస్తాయో రావోనని పాలకవర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు.. ► ఘట్కేసర్ మండలంలో మాదారం, శామీర్‌పేట్ మండలంలో యాడారం, నాగిశెట్టిపల్లి, మూడుచింతలపల్లి మండలంలో మూడుచింతలపల్లి, కీసర మండలంలో నర్సంపల్లి, మేడ్చల్ మండలంలో డబీల్‌పూర్, లింగాపూర్, రాజబొల్లారం తండా, రాయిలాపూర్ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అభివృద్ధి చేయొచ్చని ఏకగ్రీవం.. ► అనుబంధ గ్రామాలుగా ఉన్న సమయంలో అరకొర నిధుల కేటాయింపుతో అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉందని.. ఒక మాటగా నిలచి ఏకగ్రీవం చేసుకుంటే వచ్చే నిధులుతో గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చని భావించారు. పాలకవర్గాల ఆశలు ఆవిరి.. ► ఏకగ్రీవమైన చాలా పంచాయతీలు అనుబంధ గ్రామాలుగా ఉండి నూతనంగా ఏర్పడినవే. చిన్న పంచాయతీలు కావడం.. ఓటర్లు తక్కువగా ఉండడంతో గ్రామాభివృద్ధి కోసం రాజకీయాలను పక్కనపెట్టి సమష్టి నిర్ణయంతో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకున్నారు. ఏకగ్రీవ నిధులు ఇస్తామన్న సర్కారు మాట తప్పడంతో పాలకవర్గాల ఆశలు ఆవిరయ్యాయనే చెప్పాలి. ఆదాయ మార్గాలు లేక అభివృద్ధికి దూరం.. ► జనాభా ఆధారంగా ఆర్థిక సంఘం ఇచ్చే నిధుల కేటాయింపుతో ప్రయోజనం కలగడం లేదు. ప్రస్తుతం వస్తున్న నిధుల నుంచి ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్, డీజిల్ బిల్లులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, ఇతర బిల్లులను ఏకగ్రీవ పంచాయతీలు చెల్లించకలేపోతున్నాయి. ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఈ పంచాయతీలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. సర్కారు ఇచ్చిన హామీ ప్రకారం ఏకగ్రీవ ప్రోత్సాహక నిధులు విడుదల చేయాలని వేడుకుంటున్నారు. అభివృద్ధికి సహకరించాలి... ఇచ్చిన హామీ ప్రకారం ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షల నజరానా ఇవ్వాలి. చిన్న గ్రామం కావడంతో అభివృద్ది పనులు చేపట్టలేకపోతున్నాం. హామీని నిలబెట్టుకొని అభివృద్ధికి సహకరించాలి. – యాదగిరి, మాదారం సర్పంచ్, ఘట్కేసర్ మండలం ప్రభుత్వ పెద్దలవి తలో మాట.. ఏకగ్రీవమైన పంచాయతీలకు రూ.10లక్షలు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. హామీలిచ్చి అమలు చేయకపోవడంలో తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే ముందంజలో ఉంది. హామీపై ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తలో మాట మాట్లాడటంసిగ్గుచేటు. – ప్రవీణ్‌రావు, ఘట్కేసర్ మండల బీజేపీ అధ్యక్షుడు -
18 నెలలుగా వేతనం లేదు.. ఇప్పించండి సార్
భవనేశ్వర్: జిల్లాలోని కలిమెల పంచాయతీ ఈఓగా పని చేస్తున్న తనకు గత 18 నెలలుగా వేతనం అందడం లేదని మధు హంతాల్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం సమితి కార్యాలయం ముందు బైఠాయించారు. గిరిజనుడినైన తన ఎల్‌పీసీని అధికారులు కలిమెల సమితికి పంపక పోవడంతో జీతం నిలిచి పోయిందని వాపోయారు. తనకు న్యాయం చేయాలని ఎన్ని వినతులు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయిందని, గత ఏడాదిన్నరగా అప్పులు చేసి, కుటుంబాన్ని పోషించుకోవాల్సి వస్తోందని వాపోయారు. పిల్లల చదువులు సైతం భారంగా మారిందన్నారు. తన తండ్రిని మావోయిస్టులు నాలుగేళ్ల క్రితం హత్య చేశారని, అధికారులు స్పందించకపోతే కుటంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని స్పష్టంచేశారు. -
ఐదు చెప్పు దెబ్బలు.. అత్యాచార నేరం మాఫీ!!
మైనర్ అత్యాచార ఘటనలో పంచాయితీ పెద్దలు ఇచ్చిన తీర్పుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. నిందితుడు బాధితురాలి చేతిలో ఐదు చెప్పు దెబ్బలు తినాలని తిక్క తీర్పు ఇచ్చారు ఉత్తర ప్రదేశ్‌లోని ఓ గ్రామ పెద్దలు. వివరాల్లోకి వెళ్తే... లక్నో: ఉత్తర ప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లాలోని కోతిభార్ పోలీస్ స్టేషన్‌లోని ఓ కుగ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తమ మైనర్ కూతురిపై అదే గ్రామంలోని ఓ యువకుడు అత్యాచారం చేశాడంటూ పంచాయితీని ఆశ్రయించారు తల్లిదండ్రులు. అయితే పెద్దలు మాత్రం దాష్టీకమైన తీర్పు ఇచ్చారు. బాధితురాలి చెప్పుతో నిందితుడిని ఐదుసార్లు కొట్టాలని, యాభై వేల పరిహారం తీసుకుని ఘటన మరిచిపోమ్మని బాలిక తల్లిదండ్రులకు సర్దిచెప్పబోయారు. అయితే ఆ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. న్యాయం కోసం పట్టుబట్టారు. దీంతో పెద్దలు వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక కోతిభార్ స్టేషన్లో ఘటనపై.. పంచాయితీ పెద్దల తీరుపై ఫిర్యాదు చేసింది బాధితురాలి తల్లి. మరోవైపు సోషల్ మీడియాలో పంచాయితీ తీర్పు వైరల్ అయ్యింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక వైద్య పరీక్షల నివేదిక అనంతరం.. కేసు దిశగా అడుగు వేస్తామని జిల్లా ఎస్పీ ప్రదీప్ గుప్తా వెల్లడించారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. చదవండి: దీదీకి ఝలక్.. ఐదు వేల ఫైన్! -
కులం పేరుతో అవమానం.. ఖండించిన కమల్ హాసన్
చెన్నై: కులం పేరుతో అవమానించిన వ్యవహారం విల్లుపురంలో సంచలనం కలిగించిన ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపారు. అనంతరం పోలీసులు 50 మందిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. తిరువెన్నైనల్లూరు సమీపంలోని ఒట్టందల్ గ్రామంలో రెండు కులాలకు చెందిన నివాసప్రాంతాలున్నాయి. శుక్రవారం ఒక కులం ప్రజలు ఉంటున్న ప్రాంత ఆలయంలో ఉత్సవాలు జరిగాయి. కరోనా లాక్‌డౌన్‌ను మీరి ఉత్సవాలకు ఏర్పాటు చేయడంతో మరో వర్గానికి చెందిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో తిరువెన్నైనల్లూరు పోలీసులు ఆలయం వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తమకు సమాచారం తెలిపిన యువకుడి గురించి ఉత్సవ నిర్వాహకులకు తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. దీనికి సంబంధించిన ఊరి పంచాయతీలో ఆలయ ఉత్సవ నిర్వాహకులు ముగ్గురిని మరో వర్గం కాళ్లకు మొక్కింపజేసి అవమానపరిచింది. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో సంచలనం ఏర్పడింది. దీనిగురించి విల్లుపురం జిల్లా కలెక్టర్ అన్నాదురై, ఎస్పీ రాధాకృష్ణన్ ఒట్టందల్ గ్రామానికి నేరుగా వెళ్లి విచారణ జరిపారు. ఇరువర్గాలపై తిరువెన్నైనల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటగా ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. ఆ తర్వాత ఉత్సవాలు నిర్వహించిన 50 మందిపైనా కేసు నమోదైంది. ఈ సంఘటనను సినీనటుడు కమల్ హాసన్ తీవ్రంగా ఖండించారు. చదవండి: ఇండియన్–2 షూటింగ్ ఆలస్యానికి కారణం లైకా సంస్థే: శంకర్ -
మెరిసి మురిసిన తెలంగాణ పల్లెలు
తెలంగాణ పల్లెలు మురిశాయి. పారిశుధ్యం, స్వచ్ఛత, అభివృద్ధి.. తదితర అంశాల్లో వరించిన అవార్డులతో మెరిశాయి. జాతీయ స్థాయిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ‘దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తికరణ్ పురస్కార్ (డీడీయూపీఎస్‌పీ)’ కింద ఏటా అందజేసే జాతీయ పంచాయతీ అవార్డులు 2021 సంవత్సరానికి.. తెలంగాణను ఏకంగా 12 వరించాయి. ఇందులో అత్యధికంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు లభించాయి. జాతీయ స్థాయిలో వివిధ కేటగిరీల్లో ఎంపిక చేసిన అవార్డుల్లో రాష్ట్రానికి 12 ప్రకటించగా, అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 2 మండల పరిషత్‌లు, 5 గ్రామ పంచాయతీలకే ఏడు దక్కడం విశేషం. మొత్తం అవార్డుల్లో సంగారెడ్డి జిల్లాకు ఉత్తమ జిల్లా పరిషత్ అవార్డు లభించగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, ధర్మారం మండలాలకు ఉత్తమ మండల పరిషత్ అవార్డులు దక్కాయి. మిగతా 9 గ్రామ పంచాయతీ అవార్డుల్లో ఐదు అవార్డులు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే దక్కడం విశేషం. సిద్దిపేట జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలకు ఆయా కేటగిరీల్లో అవార్డులు దక్కాయి. ఆయా అవార్డుల కింద కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో పాటు నగదు మొత్తాన్ని నేరుగా ఆయా స్థానిక సంస్థల అకౌంట్లలో జమ చేయనుంది. కేంద్ర పురస్కారాలను పొందిన మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీల ప్రత్యేకతలు.. ఏయే కేటగిరీల్లో అవార్డులు పొందాయనే వివరాలు.. మల్యాల.. మెరిసేనిలా గ్రామం: మల్యాల జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలంలోని మల్యాల గ్రామం అభివృద్ధి, పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి ప్రణాళిక తదితర అంశాల్లో గుర్తింపు తెచ్చుకుంది. ఈ గ్రామంలోని పల్లె ప్రకృతి వనం జిల్లాకే శోభ తెచ్చే స్థాయిలో ఉంది. గ్రామం మొత్తం ఆకుపచ్చని కళను సంతరించుకుంది. ఇక, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు నిర్వహించే విషయంలో ఈ గ్రామం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చక్రాపూర్కు చక్కని గుర్తింపు గ్రామం: చక్రాపూర్ జిల్లా: మహబూబ్‌నగర్ మూసాపేట(మహబూబ్‌నగర్ జిల్లా): దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారానికి ఎంపికైం/న చక్రాపూర్‌లో 286 నివాసాలు, 1,638 మంది జనాభా ఉంది. సర్పంచ్ కొండం పల్లిపల్లి శైలజ ఆధ్వర్యంలో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేశారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇచ్చారు. గ్రామంలోని ఇంటించి నుంచి చెత్తను సేకరించి సేంద్రియ ఎరువును తయారు చేసే విషయంలో ఈ గ్రామం ముందంజలో ఉంది. ఇప్పటికే ఇక్కడ మొదటి విడత తయారుచేసిన ఎరువును స్థానికంగా రైతులకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిట్టపల్లి.. మిలమిల గ్రామం: మిట్టపల్లి; జిల్లా: సిద్దిపేట సిద్దిపేట రూరల్: సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామం పారిశుధ్యం, పరిశుభ్రత, చెత్త సేకరణ, వ్యర్థాల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తోంది. ఇవే అంశాల్లో ఈ గ్రామం సశక్తికరణ్ అవార్డు అందుకుంది. అలాగే, ఇక్కడ స్వయం సహాయక సంఘాలు మంచి ఆర్థిక ప్రగతి సాధిస్తున్నాయి. వ్యర్థాల సేకరణ, నిర్వహణలో ఈ గ్రామం ప్రత్యేకంగా నిలుస్తోంది. రుయ్యాడి.. ఐక్యత దండి గ్రామం: రుయ్యాడి, జిల్లా: ఆదిలాబాద్ తలమడుగు: పారిశుధ్య పనుల సమర్థ నిర్వహణలో రుయ్యాడి గ్రామం సశక్తికిరణ్ అవార్డును దక్కించుకుంది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఇంటిపన్ను వంద శాతం వసూలు చేయడం, మియావాకి పద్ధతిలో మొక్కలు నాటడం, డంపిగ్యార్డులో చెత్తను వేరుచేసి సేంద్రియ ఎరువుగా మార్చడం, వానపాములను పెంచడం, ఆన్లైన్లో జనన, మరణ, వివాహాల ధ్రువీకరణపత్రాలు అందించడం, పంచాయతీకి వచ్చే నిధులు ఎలా ఖర్చు చేయాలి?, ఏ సమయంలో, ఎంత ఖర్చు చేయాలి? అనే అంశాలపై అధికారులు, సర్పంచ్ పోతారెడ్డి చేసిన కృషికి గాను జాతీయస్థాయిలో ఈ అవార్డు వచ్చింది. ఐక్యత విషయంలోనూ రుయ్యాడి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ముస్లింల పండుగైన మొహర్రంను గ్రామస్తులంతా కలిసికట్టుగా నిర్వహిస్తారు. వేడుకలు ముగిసే వరకు మద్యానికి దూరంగా ఉంటారు. మొహర్రం అంటేనే రుయ్యాడిగా రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిందంటే ఇక్కడ వేడుకలు ఎలా నిర్వహిస్తారో అర్థం చేసుకోవచ్చు. ధర్మారం.. పనితీరులో బంగారం మండలం: ధర్మారం (మండల పరిషత్), జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంగా పెద్దపల్లి ఆవిర్భవించిన తర్వాత మండల పరిషత్ కేటగిరీలో ఇప్పటివరకు వరసగా కాల్వశ్రీరాంపూర్, మంథని, సుల్తానాబాద్ అవార్డులను కైవసం చేసుకోగా ఈసారి కేంద్రప్రభుత్వం ప్రకటించిన జాతీయ పంచాయతీ రాజ్ అవార్డును ధర్మారం మండల పరిషత్ కార్యాలయం దక్కించుకుంది. మండల పరిధిలో ప్రభుత్వ పథకాల అమలు, పంచాయతీ రికార్డుల నిర్వహణ, తదితర అంశాలలో పనితీరు మెరుగ్గా ఉండడంతో ఈ అవార్డు దక్కింది. ధర్మారం మండల పరిషత్‌కు రూ.25 లక్షల పారితోషికం దక్కనుంది. సుందిల్ల.. డబుల్ ధమాకా గ్రామం: సుందిల్ల, జిల్లా: పెద్దపల్లి పెద్దపల్లిరూరల్: జిల్లాలోని రామగిరి మండలం సుందిల్ల గ్రామ పంచాయతీ రెండు అవార్డులను పొందింది. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ) అవార్డుతోపాటు నానాజీ దేశ్‌ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామసభ పురస్కార్ (ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ) అవార్డును దక్కించుకుంది. అప్పటి కలెక్టర్ సిక్తా పట్నాయక్, డీపీఓ సుదర్శన్ సూచనల మేరకు గ్రామ పంచాయతీ రికార్డుల నిర్వహణ, గ్రామాభివృద్ధిలో ప్రజలు ముఖ్యంగా మహిళలు, వృద్ధుల ఆలోచనల మేరకు ప్రణాళికలను రూపొందించి అమలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామాభివృద్ధికి అనుసరించిన పద్ధతులను అప్లోడ్ చేయడంతో అవార్డులకు ఎంపికైంది. జీపీడీపీ అవార్డు కింద రూ.5లక్షలు, ఎన్‌డీఆర్‌జీజీఎస్‌పీ కింద రూ.10లక్షల పారితోషికాన్ని సుందిల్ల పంచాయతీ పొందనుంది. కోరుట్ల.. అభివృద్ధి నలుదిశలా.. మండలం: కోరుట్ల (మండల పరిషత్) జిల్లా: జగిత్యాల కోరుట్ల: జగిత్యాల జిల్లా కోరుట్ల మండల పరిషత్‌కు జాతీయ స్థాయి దీనదయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కారం దక్కింది. మండల పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ భారత్, పచ్చదనం పెంపు, ఉపాధి హామీ పనుల నిర్వహణ, కూలీల జీతభత్యాల పెంపు, మహిళా స్వయం సహాయక సంఘాల పనితీరు వంటి 52 అంశాల్లో ఉత్తమ ప్రగతిని కనబరిచిన క్రమంలో ఈ మండలానికి విశిష్ట అవార్డు దక్కింది. పిల్లల అభివృద్ధి.. వికాసం గ్రామం: మోహినికుంట, జిల్లా: రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్(సిరిసిల్ల): పిల్లల అభివృద్ధి, మానసిక వికాసానికి సంబంధించిన అంశాల్లో విశేష ప్రతిభ కనబరిచినందుకు.. చిన్నారుల స్నేహపూర్వక అభివృద్ధి ప్రణాళిక విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామం జాతీయ అవార్డుకు ఎంపికైంది. పై అంశాలతో పాటు ప్రణాళికబద్ధమైన అభివృద్ధి పనులను చేపట్టినందుకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గ్రామంలో పిల్లల పార్క్, ఓపెన్ జిమ్, సమావేశాలు, స్పోకెన్ ఇంగ్లిష్, పాఠశాలలో వివిధ స్థాయిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారని ఎంపీడీవో రమాదేవి తెలిపారు. ‘సిరి’దాస్‌నగర్ గ్రామం: హరిదాస్‌నగర్ జిల్లా: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): సహజ వనరులు, హరితహారం, పారిశుధ్య నిర్వహణ, ఉపాధి హామీ పనుల నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్‌నగర్‌కు అవార్డు లభించింది. పదేళ్ల క్రితం హరిదాస్‌నగర్ జాతీయ స్థాయి నిర్మల్ పురస్కార్ అవార్డును అందుకుంది. పదేళ్లలో అభివృద్ధి పనులతో గ్రామం రూపురేఖలు మార్చడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అమలు చేయడంలో ఈ గ్రామం వంద శాతం విజయవంతమైంది. వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ అవలంబిస్తున్న నీటి నిల్వ పద్ధతులు పేరొందాయి. పర్లపల్లి.. కేరాఫ్ సమగ్రాభివృద్ధి గ్రామం: పర్లపల్లి, జిల్లా: కరీంనగర్ తిమ్మాపూర్(మానకొండూర్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లికి ఆదర్శ గ్రామంగా మరో అరుదైన గౌరవం దక్కింది. అన్ని వర్గాలు సమగ్రంగా అభివృద్ధి చెందిన పంచాయతీగా గుర్తించి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ దీన్‌దయాళ్ సశక్తి కరణ్ అవార్డుకు ఎంపిక చేసింది. గ్రామంలో 5 వేల జనాభా ఉండగా, ప్రజల జీవన స్థితిగతులు, సమగ్ర అభివృద్ధి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల సద్వినియోగం, గ్రామ సమగ్రాభివృద్ధి అంశాలను పరిశీలించి ఈ అవార్డును ప్రకటించారు. పల్లె ప్రగతిలో భాగంగా శ్మశానవాటిక, నర్సరీలు, పల్లె ప్రకృతివనం నిర్మించారు. అర్హులైన గ్రామీణులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా సర్పంచ్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిలో గ్రామస్తులు పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నట్లు కేంద్ర బృందం నిర్ధారించింది. పాలనలో భేష్.. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి (జిల్లా పరిషత్) సంగారెడ్డిఅర్బన్: అభివృద్ధి పరిపాలన విభాగం (జనరల్ కేటగిరి)లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు సంగారెడ్జి జిల్లా పరిషత్‌కు దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్ అవార్డు దక్కింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా పరిషత్ ద్వారా జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను జిల్లా పరిషత్ సిబ్బంది ఎప్పటికప్పుడు కేంద్రానికి రిపోర్టు చేయడం ఇక్కడ ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. -
ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు- పంచాయితీల డీడీఓ బాధ్యతల్ని వికేంద్రీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల్లో ఇప్పటి వరకు ఉన్న డ్రాయింగ్ ఆఫీసర్ వ్యవస్థలో మార్పులు చేస్తూ ఆదేశాలిచ్చింది. పంచాయితీ ఉద్యోగులకు పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారి.. డీడీఓగా వ్యవహరించనున్నారు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులందరికీ డీడీఓగా వీఆర్వోకు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ మొత్తం డ్రాయింగ్ అండ్ డిస్బర్స్మెంట్ అధికారి బాధ్యతల్ని కూడా పంచాయతీ ఎగ్జిక్యూటివ్ అధికారులే నిర్వర్తించారు. కాగా, ఇకపై పంచాయతీలకు, సచివాలయాలకు వేర్వేరుగా డీడీఓలు నియమించింది. పంచాయితీలకు, సచివాలయాలకు లింక్ అధికారిగా గ్రామ పంచాయితీ ఎగ్జిక్యూటివ్ అధికారిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: విద్యారంగం: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం ఏపీ చరిత్రలోనే ఇదో రికార్డు: ఎంపీ విజయసాయిరెడ్డి -
గ్రామం ఒక్కటే, పంచాయతీలు రెండు!
సాక్షి, లక్కవరపుకోట(విజయనగరం): ఆ గ్రామం పేరు కోనమసివానిపాలెం. అది రెండు పంచాయితీల పరిధిలో ఉంది. అంతేనా... మండలాలు కూడా వేర్వేరే. ఇద్దరు అన్నదమ్ములుంటే ఇద్దరూ వేర్వేరు మండలానికి చెందుతున్నారు. నలభై ఏళ్లుగా ఈ సమస్య అక్కడివారిని వేధిస్తోంది. గ్రామంలో సుమారు 2500 జనాభా, 5వందల ఇళ్లు ఉన్నాయి. 1976–77 సంవత్సరంలో తామరాపల్లి గ్రామ పంచాయతీ నుంచి విడదీసి కోనమసివానిపాలెం పంచాయితీని ఏర్పాటు చేశారు. గ్రామంలో కొంత భాగం లక్కవరపుకోట మండలం కోనమసివానిపాలెంగానూ, మరికొంత భాగాన్ని కొత్తవలస మండలం దేవాడ పంచాయతీలో మసివానిపాలెంగానూ కలిపారు. అదే అక్కడ సమస్యలకు కారణమవుతోంది. గ్రామం ఒక్కటే అయినా ప్రజలను రెండు పంచాయతీలుగా, రెండు మండలాలుగా విడగొట్టడంతో ఎవరు ఏ పంచాయతీకి చెందిన వారో తెలియక సతమతం అవుతున్నారు. ఎన్నికల సమయంలో వారు ఏ పంచాయతీ తరఫు న ఓటు వేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఆ గ్రామంలో రెండు అంగన్వాడీ కేంద్రాలు, రెండు ప్రాధమిక పాఠశాలలు, రెండు రక్షిత మంచినీటి పథకాలు, ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు, ఇద్దరు రెవెన్యూ కార్యదర్శులు. రెండు పంచాయతీ భవనాలు ఉన్నాయి. -
ఇంత అవమానమా.. ఆలస్యంగా వెలుగులోకి..
సాక్షి, చెన్నై: వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు అగ్రవర్ణాల తీరుకు అవమానాల్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితి తప్పడం లేదు. ఇటీవల తిరువళ్లూరులో ఓ మహిళా ప్రజాప్రతినిధిని జాతీయ జెండా ఎగురవేయకుండా అడ్డుకుంటే, తాజాగా, కడలూరులో ఓ మహిళా అధ్యక్షురాల్ని ఏకంగా నేలపై కూర్చోబెట్టి అవమానించడం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన అధికార వర్గాలు అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాదు, పంచాయతీ కార్యదర్శిని అరెస్టు చేయించారు. కడలూరు జిల్లా మేల్ భువనగిరి యూనియన్ పరిధిలో తెర్కుదిట్టై పంచాయతీ ఉంది. ఈ పంచాయతీ అధ్యక్షురాలుగా దళిత సామాజిక వర్గానికి చెందిన రాజేశ్వరి గెలిచారు. బాధ్యతలు స్వీకరించిన నాటిని నుంచి ఎన్నో అవమానాల్ని ఆమె చవిచూశారు. ఆమెకు ఇటీవల ఎదురైన అవమానాన్ని ఫొటో చిత్రీకరించిన ఎవరో వ్యక్తులు, దానిని శుక్రవారం సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కించడం వివాదానికి దారి తీసింది. (చదవండి: పాదరసం.. అంతా మోసం) పంచాయతీ పాలక వర్గ సమావేశంలో కుర్చీలో ఉపాధ్యక్షుడు మోహన్‌రాజ్, పంచాయతీ కార్యదర్శి సింధుజా కుర్చీలో కూర్చోగా, అధ్యక్షురాలు నేలపై కూర్చున్న ఫోటో వైరల్ అయింది. కడలూరు ఎస్పీ అభినవ్ దృష్టికి ఈ ఫొటో చేరడంతో భువనగిరి ఇన్స్పెక్టర్ రాబిన్సన్ నేతృత్వంలో బృందాన్ని రంగంలోకి దించారు. శనివారం ఆ గ్రామానికి చేరుకుని రాజేశ్వరి, ఆమె భర్త శరవణన్‌ల వద్ద విచారించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆమె ఎదుర్కొంటున్న అవమానాలు, వేధింపులు వెలుగులోకి వచ్చా యి. ఆమె నుంచి తీసుకున్న ఫిర్యాదుతో ఉపాధ్యక్షుడు మోహన్ రాజ్, కార్యదర్శి సింధుజాలపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సింధుజాను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అయితే, తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని సింధుజా పేర్కొన్నారు. శనివారం ఆమెను అరెస్టు చేశారు. మోహన్ రాజ్ కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారాల గురించి రాజేశ్వరి పేర్కొంటూ, తాను గెలిచానే గానీ, ఏ రోజూ ఆ పదవికి తగిన న్యాయం చేయలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఒకటే ఊరు.. రెండు పంచాయతీలు
భువనేశ్వర్ : ఒకే గ్రామం కానీ రెండు పంచాయతీలు. రెండు పంచాయతీలకు చాలా వరకు ఒకటే. ఒకే ఊరికింద వారంతా కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఆ గ్రామాలే మండలంలో కాశిదొరవలస, నారాయణప్పవలస పంచాయతీలు. 26 ఏళ్లక్రితం వరకు ఈ పంచాయతీలు రెండూ నారాయణప్పవలస గ్రామంపేరిట ఉండేవి. అప్పట్లో నాటి ప్రభుత్వం ఈ గ్రామాన్ని రెండు పంచాయతీలుగా విభజించింది. నారాయణప్పవలస గ్రామంలో ప్రధానవీధిలో ఓ స్తంభం వద్ద ఈ రెండు పంచాయతీలకు సరిహద్దు నిర్ణయించారు. అంతవరకు ఒకే గ్రామంగా ఉన్నవారంతా రెండు గ్రామాల వారిగా విడిపోయారు. బొబ్బిలి రూరల్ : ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు కావడంతో నారాయణప్పవలసలో రామాలయం ఉంటే, కాశిందొరవలసలో ఆంజనేయస్వామి ఆలయం ఉంది. రేషన్‌షాపు, పాఠశాల నారాయణప్పవలసలో ఉన్నాయి. ఒకే రైల్వేస్టేషన్ కాశిందొరవలసలో ఉంది. దీనిని నారాయణప్పవలస రైల్వేస్టేషన్ అంటారు. కంచరగెడ్డ రిజర్వాయర్ కాశిందొరవలసలో ఉంది. ఒకే గ్రామంలో రెండు పంచాయతీలు ఉండడంతో అంతా కలిసి వేడుకలు, సంబరాలు చేసుకుంటారు. నారాయణప్పవలస గ్రామం ఒక పంచాయతీ కాగా దీని పరిధిలో ఏ గ్రామాలూ లేవు. కాశిందొరవలస గ్రామానికి కాశిందొరవలస, దీని పరిధిలో డొంగురువలస, ఎరకందొరవలస, చిలకమ్మవలస, మోసూరువలసలు ఉన్నాయి. గ్రామంలోఅంతా కలిసి హాయిగా కలిసి మెలిసి జీవిస్తున్నారు. -
ఈ కాలపు మాల్గుడి డేస్ పంచాయత్
ఊరిలో ఏముంటాయి? పలకరించే చేలు ఉంటాయి. వసారాల పై కాసిన సొరకాయలుంటాయి. చిన్న సమస్యలకు పెద్ద బెంగలుంటాయి. పెద్ద చిక్కులకు పెక్కు నవ్వులుంటాయి. ఊరిలో ఏముంటాయి. జీవించమని చెప్పే హృదయాలుంటాయి. కసురుతూ అక్కునజేర్చుకునే గుండెలుంటాయి. అమేజాన్ ప్రైమ్‌లో ‘పంచాయత్’ వెబ్ సిరీస్ అలాంటివన్నీ వెలికి తీసింది. చూసిన ప్రేక్షకులను కట్టి పడేసింది. ఢిల్లీలో బి.టెక్ చేసి బయటికొచ్చిన అభిషేక్ త్రిపాఠికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి. పెద్ద తెలివి తేటలు లేవు. చదువులో గొప్పగా సాధించింది లేదు. కాని కంప్యూటర్ ఉద్యోగం చేయాలంటే ప్రస్తుతానికి కుదిరేలా లేదు. ఈలోపు ఏదో ఒకటి చేయాలి కనుక పంచాయితీ ఆఫీసు ఉద్యోగి పోస్టుకు అప్లై చేస్తే వచ్చింది. ఎక్కడ? ఉత్తర ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో ఫులేరా అనే చిన్న పల్లెలో. వెళ్లాలా వద్దా... వెళ్లాలా వద్దా... ఇదే మీమాంస. వెళ్లక తప్పని పరిస్థితి. మెయిన్‌రోడ్డు మీద బస్సు వదిలేసిపోతే మట్టి దారిలో బైక్ మీద సరంజామాతో చాలాసేపు ప్రయాణిస్తే తప్ప రాని ఆ పల్లెకు వెళ్లిన అభిషేక్ ఎలాంటి మనుషులను చూశాడు... ఏయే అనుభవాలను మూటగట్టుకున్నాడు అనేదే ‘పంచాయత్’ వెబ్ సిరీస్. తాళం లేదు తొలి ఉద్యోగానికి వచ్చిన కుర్రాడు అభిషేక్ ఒక ఖాళీ మైదానంలో గోపీరంగు గోడలతో ఉన్న చిన్న పంచాయతీ ఆఫీసును చూసి నీరసపడతాడు. దానికి తాళం వేసి ఉంటుంది. అతనికి స్వాగతం చెప్పడానికి వచ్చిన ఉప సర్పంచ్, ఆఫీస్ బాయ్ స్వాగతానికి తెచ్చిన నాలుగు మిఠాయిల్లో రెండు తినేసి కూచుని ఉంటారు. తాళం తేవాల్సిన సర్పంచ్ చెంబు పట్టుకొని పొలాల్లోకి వెళ్లాడని, రాగానే తాళం తీస్తామని వాళ్లు చెబుతారు. ‘అదేంటి...ఈ ఊరికి సర్పంచ్ మహిళ కదా’ అంటే ‘అది రిజర్వేషన్ కోసం మాత్రమే. గెలిచాక ఆమె భర్తే మాకు సర్పంచ్’ అని చెబుతారు. చెంబు పని ముగించుకొని వచ్చిన సర్పంచ్ జేబులో చేయి పెడితే తాళం ఉండదు. ఎక్కడైతే కూచున్నాడో అక్కడే పడేసుకొని ఉండొచ్చని అందరినీ తీసుకొని తాళం వెతకడానికి బయలుదేరిపోతాడు. ఊళ్లో దిగ్గానే ఈ తాళం గొడవ ఏమిటా అని అభిషేక్ వాళ్లతోపాటు పొలాలకు అడ్డం పడతాడు. కాని తాళం దొరకదు. తాళం పగులగొడదామంటాడు అభిషేక్. ‘అలా కుదరదు. అది మా ఆవిడ తన పుట్టింటి నుంచి తెచ్చిన తాళం. దానిని పగలగొడితే నా వీపు పగులుతుంది’ అంటాడు సర్పంచ్. ఆ తర్వాత ఏమైందనేది సరదా కలిగించే ఫస్ట్ ఎపిసోడ్. చిన్న సమస్యలు– పెద్ద బెంగలు అభిషేక్‌కు పంచాయితీ ఆఫీసులోనే ఒక గది నివాసానికి ఇస్తారు. అక్కడే ఉద్యోగం. అక్కడే వండుకు తిని పడుకోవడం. చుట్టూ చీమ చిటుక్కమనని ఖాళీ ప్రాంతం. పలకరించే మనిషి ఉండడు. ఢిల్లీలోలాగా ఉదయం తొమ్మిదికి లేస్తే ఆఫీస్ బాయ్ చాలా కంగారుపడిపోయి ‘అదేంటి మధ్యాహ్నం నిద్రలేస్తున్నారు మీరు’ అంటాడు. ఆ టైమ్‌లో లేవడం వారికి వింత. సర్పంచ్ ఊళ్లో పులేగానీ ఇంట్లో పిల్లి. దానికి తోడు రాత్రయితే చాలు కరెంటు పోతుంటుంది. ఈ ఊళ్లో ఒక్క నిమిషం ఉండేది లేదు... క్యాట్ ఎగ్జామ్ రాసి ఇక్కడి నుంచి బయటపడదామనుకుంటాడు అభిషేక్. అందుకోసం ఊరికి శాంక్షన్ అయిన సోలార్ లైట్లలో ఒకటి పంచాయతీ ఆఫీసులో ఏర్పాటు చేసుకుందామనుకుంటాడు. అది ఊరి చివర మర్రిచెట్టు దగ్గర పెట్టడానికి కేటాయించిన లైటు. అది దెయ్యాల మర్రి. అక్కడ పెట్టడం ముఖ్యం అంటాడు సర్పంచ్. లైటు కావాలంటే అక్కణ్ణుంచి దెయ్యాన్ని బయటకు పంపాలంటాడు. అభిషేక్ ఆ దెయ్యం సమస్యను ఎట్లా పరిష్కరించాడనేది రెండో ఎపిసోడ్. మాట పెళుసు– మనసు మెత్తన ఊళ్లో చాలామంది మాట పెళుసుగా ఉంటుంది. కాని అవసరం వచ్చినప్పుడు అందరిదీ మెత్తటి మనసే. ఒక రోజు పంచాయతీ ఆఫీసులో కంప్యూటర్ మానిటర్ని దొంగలు పట్టుకెళతారు. అది కథానాయకుడి మీద పడుతుంది. కాని సర్పంచ్, ఊరి మనుషులు అతణ్ణి కాపాడుతారు. వార్డు మెంబర్ ఇంట్లో ఒకాయన కుమార్తె పెళ్లి నిశ్చయమవుతుంది. పంచాయతీ వార్డు మెంబర్ ఇంట్లో పెళ్లి అంటే పంచాయతీ ఆఫీసులోని ఉద్యోగులందరూ పని చేయాల్సిన వాళ్లే. అభిషేక్ ఒళ్లు హూనమవుతుంది. ఊళ్లో ఫ్యామిలీ ప్లానింగ్ కోసం గోడల మీద నినాదాలు రాయిస్తాడు అభిషేక్. ‘ఇద్దరు పిల్లలు ముద్దు... మూడోవాడు ఎద్దు’ అనే అర్థంలో ఆ స్లోగన్స్ ఉంటాయి. ఊళ్లో చాలామందికి ముగ్గురు, నలుగురు సంతానం ఉంటారు. వాళ్లంతా తగాదాకు వస్తారు. సర్పంచే మళ్లీ కాపాడతాడు. చాలాసార్లు ఊరి ప్రజల తెలియనితనం అమాయకత్వం సమస్యలు తెస్తాయి. కాని తెలివి మీరి వచ్చే సమస్యల కంటే తెలివి తక్కువగా వచ్చే సమస్యలు సులువుగా ఉంటాయని కథానాయకుడికి అర్థమవుతుంది. ఊరిలో ప్రేక్షకుడి నివాసం ‘పంచాయత్’ అని పేరు పెడితే పంచాయతీ ఆఫీసు గొడవలు, రాజకీయాలు అనుకుంటాం. కాని ఇదో ఊరి మనుషుల మనోహర కథ. ఎపిసోడ్లు జరుగుతున్నంతసేపు ప్రేక్షకుడు ఆ ఊళ్లోనే ఉన్నట్టుగా భావిస్తాడు. ఎపిసోడ్లు ముగిశాక ఆ ఊళ్లోనే విహరిస్తాడు. నిర్మాత, దర్శక, రచయితలు అలా కథను మలిచారు. గతంలో మాల్గుడి డేస్ ఎపిసోడ్లు ఎలా ఉంటాయో ఈ సిరీస్‌లోని ఎపిసోడ్లు కూడా అలాగే ఉంటాయని చెప్పొచ్చు. అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్‌ను చూసిన వారంతా మెచ్చుకుంటూ ఉన్నారు. దానికి కారణం అత్యంత సహజమైన, నిజమైన మానవీయ ప్రవర్తనలను చూపడమే. అక్కడ అవినీతి అంటే ఎదుటివారికి సొరకాయను లంచం ఇవ్వడమే. సంపాదన అంటే పాలడబ్బులు నిక్కచ్చిగా వసూలు చేయడమే. ఊరి సౌందర్యం ఇప్పుడు ఇలా లేకపోవచ్చు. కాని ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిర్మాణం సుప్రసిద్ధ నటుడు రఘువీర్ యాదవ్ సర్పంచ్ భర్తగా, నటి నీనాగుప్తా సర్పంచ్‌గా నటించారు. వెబ్ సిరీస్ ద్వారా పేరు తెచ్చుకున్న జితేంద్ర కుమార్ హీరోగా నటించాడు. మిగిలినవారంతా కొత్తనటులే. ఈ సిరీస్‌ను భోపాల్ దగ్గర ఉన్న ఒక ఊరిలో షూట్ చేశారు. సంగీతం, ఫొటోగ్రఫీ ఎంత చక్కగా ఉంటాయో చెప్పలేము. మొదటి సీజన్ ముగిసింది. రెండో సీజన్ కోసం జనం ఎదురు చూస్తున్నారంటే ఎంత ఆదరణ పొందిందో ఊహించొచ్చు. అమేజాన్ ప్రైమ్‌లో తప్పక చూడదగ్గ సిరీస్ ఇది. -
కొత్త పంచాయతీలకు లైన్‌క్లియర్
సాక్షి , శ్రీకాకుళం: జిల్లాలో పంచాయతీల స్వరూపం మారనుంది. కొత్త పంచాయతీల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. 24 ఏళ్లుగా కొత్త పంచాయతీల ఊసే లేదు. జిల్లాల నుంచి ప్రతిపాదనలు వెళ్లడమే తప్ప నిషేధం ఉన్న కారణంగా ఇంతవరకు వాటికి మోక్షం లభించలేదు. 1995 నుంచి అమల్లో ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ జీవో జారీ చేసింది. దీంతో జిల్లాలో పంచాయతీల సంఖ్య భారీగా పెరగనుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 60కి పైగా కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం కనబడుతోంది. సుదీర్ఘ నిరీక్షణకు తెర నియోజకవర్గాల పునర్విభజన జరిగింది.. మండల ప్రాదేశిక, వార్డుల వర్గీకరణలు జరిగాయి.. పంచాయతీల విలీనాలు చోటు చేసుకున్నాయి. కానీ పాతికేళ్లుగా కొత్త పంచాయతీల ఏర్పాటు జరగలేదు. 3 వేల జనాభా, 3 కిలోమీటర్ల దూరం, తలసరి ఆదాయం రూ.3 వేలు ఉన్న గ్రామాలు పంచాయతీగా అర్హత పొందుతాయి. కానీ నిషేధం కారణంగా కొత్త పంచాయతీల ఏర్పాటు కలగా మిగిలిపోయింది. గత ప్రభుత్వాలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఆసక్తి చూపలేదు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తి వేస్తూ నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది జీవో నెంబర్ 167 జీవో జారీ చేశారు. ఫలితంగా కొత్త పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టయింది. ఇప్పటికే 13 ప్రతిపాదనలు.. కొత్తగా మరో 47..! 3 వేల జనాభా, 3 వేల తలసరి ఆదాయం, 3 కిలోమీటర్ల మధ్య దూరం ఉన్న గ్రామాలు జిల్లాలో చాలా వరకు ఉన్నాయి. కాకపోతే స్థానికంగా విజ్ఞప్తులు వెళ్లాలి. అందులో భాగంగా ఇప్పటికే ఆర్అండ్ఆర్ కాలనీలుగా ఉన్న కొత్తూరు మండలంలోని మెట్టూరు బిట్ 1, మెట్టూరు బిట్ 2, మెట్టూరు బిట్ 3, కర్లెమ్మ, గూనభద్ర ఆపోజిట్ కాలనీ, ఎల్ఎన్ పేట మండలంలోని మోదుగుల వలస, శ్యాపలాపురం, టయాంబపురం, ఆమదాలవలస మండలంలోని గాజుల కొల్లివలస, వంగర మండలంలోని శ్రీహరిపురం, కింజంగి, హిరమండలం మండలంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్, సుబైల్ కాలనీలను పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. తాజాగా నిషేధం ఎత్తివేత జీవోతో వీటికి మోక్షం కలగనుంది. అలాగే నిబంధనల మేరకు మరో 47 వరకు కొత్త పంచాయతీల ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లాలో 1141 పంచాయతీలున్నాయి. -
అమిత్ షాతో కశ్మీర్ పంచాయతీ ప్రతినిధుల భేటీ
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ పంచాయతీ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆర్టికల్ 370 రద్దు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూకశ్మీర్ విభజన నేపథ్యంలో గత నెలరోజులుగా కశ్మీర్ లోయ నిషేధాజ్ఞల నీడలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు గ్రామపంచాయతీల పెద్దలతో కూడిన ప్రతినిధుల బృందం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయంలో షాతో సమావేశమైంది. ఈ సమావేశంలో హోంశాఖ అధికారులతోపాటు, కశ్మీర్ డివిజినల్ కమిషనర్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. పూల్వామా, కశ్మీర్, జమ్మూ, లధాక్ ప్రాంతాల ప్రజలు కూడా ఈ బృందంలో ప్రతినిధులుగా ఉన్నారు. అభివృద్ధి నిధులు జమ్మూకశ్మీర్‌లోని గ్రామ పంచాయతీలకు నేరుగా అందించడం, ఆ నిధులతో గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం, గ్రామాభివృద్ధిలో పంచాతీయ పెద్దలను ప్రత్యక్ష భాగస్వాములను చేయడం తదితర అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. -
పంచాయితీల్లో డిజిటల్ లావాదేవీలు
సాక్షి, నల్లగొండ : గ్రామ పంచాయతీల్లో కొత్తగా ఎన్నికైన సర్పంచులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో ప్రజాప్రతినిధులు అయోమయానికి గురవుతున్నారు. చెక్ పవర్ వ్యవహారాన్ని తేల్చిన ప్రభుత్వం మరిన్ని సమస్యలను సృష్టించి పెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు తీసుకోవాలన్నా, నిధులు డ్రా చేసుకోవాలన్నా సర్పంచుల తల ప్రాణం తోకకు వచ్చేలా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీలో చేసిన పనులకు సంబంధించిన వివరాలన్నీ యాప్‌లోనే అప్లోడ్ చేయాలన్న నిబంధన పెట్టారు. అలా అప్లోడ్ చేశాకే ఆన్లైన్లోనే డిజిటల్ చెక్కులు పొందే విధంగా కొత్త పంచాయతీ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో గ్రామ పంచాయతీలో ఎలాంటి పనిచేసినా ఆ పనికి సంబంధించి డబ్బులు డ్రా చేయాలంటే పెద్ద తతంగమే జరగాల్సి ఉంది. డిజిటల్ చెక్కు పొందేందుకు సర్పంచ్, ఉప సర్పంచులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రభుత్వం చెక్‌పవర్ ఇచ్చినా, డిజిటల్ యాప్ అందుబాటులోకి రాని కారణంగా డబ్బులు డ్రా చేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో మొత్తం 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 837 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికలు జరిగాయి. సర్పంచులు ఆయా పంచాయతీల్లో కొలువుదీరారు. నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో 7 గ్రామ పంచాయతీలకు అప్పట్లో ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో పాత సర్పంచులే కొనసాగుతున్నారు. వీరికి వచ్చే ఏడాది జనవరి వరకు పదవీ కాలం ఉంది. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పంచాయతీ నూతన చట్టం కారణంగా పంచాయతీల్లో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయి. సర్పంచులకు చెక్ పవర్ విషయంలోనే ఆచితూచి అడుగులు వేసింది. ఈ ఏడాది జనవరిలో మూడు విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయిన విషయం తెలిసిందే. కాగా, ఆ తర్వాత నూతన పంచాయతీ పాలనపై సర్పంచులకు నాలుగు విడతల్లో జిల్లా వ్యాప్తంగా నెల రోజులపాటు శిక్షణ కూడా ఇచ్చారు. చెక్‌పవర్‌పై తర్జన భర్జనలు పంచాయతీ పాలనకు గాను తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టం ప్రకారం జాయింట్ చెక్ పవర్ ఎవరెవరికి ఇవ్వాలనే అంశంపై పెద్ద తతంగమే నడిచింది. జనవరిలో ఎన్నికలు పూర్తికాగా, ఫిబ్రవరిలో శిక్షణ కూడా నిర్వహించారు. గతంలో మాదిరిగా సర్పంచ్‌కి , కార్యదర్శికి చెక్‌పవర్ ఇవ్వాలా..? లేక సర్పంచ్, ఉప సర్పంచ్‌కి కలిపి ఇవ్వాలా అనే అంశంపై ప్రభుత్వం పలు విధాలుగా తర్జనభర్జనలు చేసింది. ఇక, 14వ ఆర్థిక సంఘం నిధులు గత పాలకవర్గాల హయాంలోనే మంజూరయ్యాయి. కాని ప్రభుత్వం ఫ్రీజింగ్పెట్టి నిలిపివేసింది. ఆ పాలకవర్గాలు ఆ నిధులను డ్రా చేయలేక పోయాయి. కొత్తగా ఎన్నికైన సర్పంచులు సైతం తాము ఎన్నికై నాలుగు నెలలు గడిచినా, అందుబాటులో నిధులు ఉన్నా, చివరకు వేసవిలో అత్యవసర పనులకు కూడా నిధులు డ్రా చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. గ్రామంలో అత్యవసరమైన తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు వంటి వాటికి కొందరు సర్పంచ్‌లు అప్పులు చేసి, మరికొందరు సొంత డబ్బులు ఖర్చు చేశారు. నిధులు ఉన్నా, ప్రభుత్వం చెక్‌పవర్ విషయం తేల్చని కారణంగా అప్పులు చేసి పనులు చేయాల్సి వచ్చింది. గత నెల 22వ తేదీన తేలిన చెక్ పవర్ గత నెల 22వ తేదీన ప్రభుత్వం చెక్ పవర్ అంశాన్ని తేల్చేసింది. సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ ఇస్తూ గెజిట్ జారీ చేసింది. జిల్లా పంచాయతీ అధికారి జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీలకు చెక్ పవర్‌పై ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 3వ తేదీన ఇచ్చారు. వాటన్నింటినీ జిల్లా ట్రెజరీ కార్యాలయానికి పంపడంతో పాటు జిల్లాలోని 31 మండలాల ఎంపీడీఓలకు చెక్ పవర్ ప్రొసీడింగ్స్‌ను పంపించారు. చెక్ పవర్ వచ్చినా .. డిజిటల్ కిరికిరి ప్రభుత్వం ఎట్టకేలకు సర్పంచ్, ఉప సర్పంచులకు జాయింట్ చెక్ పవర్ ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాప్‌ను నేటికీ విడుదల చేయలేదు. దీంతో చెక్ పవర్ వచ్చినా అది ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ఆయా గ్రామాల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఆన్లైన్లో మీ–సేవా కేంద్రం నుంచి అప్లోడ్ చేయాలి. ప్రభుత్వం విడుదల చేసే ఆ యాప్‌ను డౌన్లోడ్ చేయాలి. అందులోకి వెళ్లి ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన కోడ్‌ను నమోదు చేయాలి. సంబంధిత పని వివరాలకు సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ పనికి సంబంధించి ఎంబీ రికార్డు నంబర్‌ను నమోదు చేయాలి. ఆ పని ఎంత విలువైందో ఆ మొత్తాన్ని కూడా అందులో నమోదు చేయాలి. అప్పుడు ఆ అప్లికేషన్ పూర్తయినట్లవుతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో సర్పంచ్, ఉపసర్పంచ్ సంతకాలతో కూడిన డిజిటల్ చెక్కు బయటికి వస్తుంది. ఆ చెక్ రాగానే సర్పంచ్, ఉప సర్పంచ్ సెల్‌ఫోన్ నంబర్లకు ఓటీపీ నంబర్ వెళ్తుంది. దాన్ని తీసుకొని డీటీఓ, ఎంపీడీఓల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ఎంపీడీఓ వద్దకు వెళ్లి సర్పంచ్, ఉపసర్పంచ్లు మూడు మూడు సంతకాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆ కాగితంపై ఎంపీడీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ కలిసి వచ్చి తన ముందే సంతకాలు చేశారని ధ్రువీకరిస్తూ ఎస్టీఓకు లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ తీసుకొని ఎస్టీఓ వద్దకు వెళ్లాలి. ఎస్టీఓ సర్పంచ్, ఉపసర్పంచ్ సెల్‌లకు వచ్చిన ఓటీపీ నంబర్లను అడుగుతారు. ఎంపీడీఓ ఇచ్చిన లెటర్‌ను తీసుకొని దానిపై ఎస్టీఓ ముందు మళ్లీ సర్పంచ్, ఉపసర్పంచ్ ఇరువురూ రెండు చొప్పున సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో బిల్లుకోసం ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది. ఎస్టీఓ ఆ బిల్లును పాస్ చేస్తాడు. ప్రస్తుతం చెక్ పవర్ విషయంలో ఇప్పటికే డీపీఓ ఎస్టీఓ, ఎంపీడీఓలకు పంపిన ప్రొసీడింగ్ల ఆధారంగా అన్ని గ్రామాల్లోని సర్పంచ్, ఉప సర్పంచుల డిజిటల్ సంతకాలను తీసుకుంటున్నారు. ఆ సంతకాలే డిజిటల్ చెక్ మీద రానున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ఓ పక్క చెక్‌పవర్ ఇచ్చినా, ఈ డిజిటల్ యాప్ రాని కారణంగా చెక్‌పవర్ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ డిజిటల్ విధానంతో సర్పంచులకు డబ్బుల డ్రా విషయంలో కిరికిరి తప్పేలా లేదు. చెక్ పవర్‌పై పునరాలోచన చేయాలి గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం పునారాలోచన చేయాలి. ఉప సర్పంచ్‌కు బదులు కార్యదర్శిని భాగస్వాములను చేస్తే భయం ఉంటుంది. ఖర్చులు చేయడంలో సర్పంచ్‌కు ధైర్యం ఉంటుంది. ఇద్దరు ప్రజాప్రతినిధులకు చెక్‌పవర్ ఇవ్వడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, పంచాయితీలు ఎక్కువవుతాయి. ఈ విషయంలో సర్కార్ పునరాలోచన చేయాలి. – పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి, సర్పంచ్, నకిరేకల్ చెక్ పవర్లేక అప్పుల పాలయ్యాను మునుగోడు: ఆరు నెలల క్రితం సర్పంచ్‌గా ఎన్నికైన నేను ప్రజలకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటుకు అప్పులు తెచ్చా ను. దాదాపు రూ. 20 లక్షలకు పైగా అప్పు చేశా. సాధ్యమైనంత త్వరగా చెక్ పవర్ అంది స్తే బాగుండు. పేరుకు సర్పంచ్లమైనా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడంతో ప్రజలతో ఇబ్బందులు పడుతున్నాం. – మిర్యాల వెంకన్న, సర్పంచ్, మునుగోడు -
పంచాయితీలు కార్పోరేషన్లో విలీనం
సాక్షి, అల్గునూర్: కరీంనగర్ కార్పొరేషన్ సమీపంలోని 8 గ్రామాల్లో పంచాయతీ శకం ముగిసింది. గురువారం నుంచి కార్పొరేషన్ పాలన మొదలైంది. ఇక ఆ పంచాయతీల్లో అన్నిసేవలు, పనులు కరీంనగర్ కార్పొరేషన్ నుంచే అందనున్నాయి. దీనిపై కొందరు విముఖత వ్యక్తం చేసిన కోర్టు తీర్పుతో తిమ్మాపూర్ మండలంలోపాటు 8 పంచాయతీలు కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం పూర్తయింది. దీంతో కరీంనగర్ కార్పొరేషన్ పరిధి పెరగడంతోపాటు సేవలు విస్తృతం కానున్నాయి. విలీన పంచాయతీలో కరీంనరగ్ నగరపాలక సంస్థలో విలీనం అయ్యాయి. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అనుసరించి ప్రభుత్వం విలీనంపై స్పష్టమైన ఉత్తర్వులు జారీచేసింది. దీంతో నగరపాలక సంస్థ అధికారులు విలీన పంచాయతీల్లోని రికార్డులను గురువారం స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్, తిమ్మాపూర్, కొత్తపల్లి, మానకొండూర్ మండలాల్లోని 8 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. పంచాయతీ పేరిట ఉన్న బోర్డులను తొలగించి కార్పొరేషన్ బోర్డులు ఏర్పాటుచేశారు. హైకోర్టు తీర్పుతో ముగిసిన ప్రక్రియ.. తెలంగాణ ప్రభుత్వం స్థానిక ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఏకపక్షంగా తమ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందని, 8 గ్రామాల ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు విలీనంపై కొంతకాలం స్టే విధించింది. విలీన ప్రక్రియపై ప్రభుత్వం, పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని ఈనెల 8న స్పనష్టం చేసింది. వ్యతిరేకిస్తూ దాఖలైన పిలిషన్లను కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును అనుసరించి విలీన గ్రామాలను కార్పొరేషన్లో విలీనం చేయడాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంటనే విలీనం ప్రక్రియ పూర్తి చేశారు. రికార్డులు స్వాధీనం.. ప్రభుత్వం నుంచి అందిన ఉత్తర్వుల ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు 8 పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ భవనాలకు కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని కార్యాలయాలని బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ పాలన ప్రారంభం.. తిమ్మాపూర్ మండలం అల్గునూర్, మానకొండూర్ మండలం సదాశివపేటతోపాటు మిగతా ఆరు గ్రామాల్లో కరీంనగర్ నగరపాలక సంస్థ పాలన గురువారం నుంచి ప్రారంభమైంది. ఇక నుంచి ఈ ఎనిమది గ్రామాలు పంచాయతీలుగా కారకుండా నగరపాలక సంస్థ పరిధిలోని ప్రాంతాలుగానే పరిగణిస్తారు. విలీన ప్రక్రియ ముగియడంతో కార్పొరేషన్ పాలన మొదలైంది. పన్నులు పెరగవు.. గతంలో ఉన్న విధంగానే విలీన గ్రామాల్లో పన్నులు వసూలు చేసి ఆయా విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయడం జరుగుతుందని అల్గునూర్ ప్రత్యేక అధికారి వందనం తెలిపారు. పన్నుల వసూలు బాధ్యతను బిల్ కలెక్టర్లు చూస్తారని పేర్కొన్నారు. టౌన్ ప్లానింగ్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే డీపీఎంఎస్‌కు నివేదిక అందించామన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్‌ను డీసీఎంఏకు రాసి ఆన్లైన్ విధానంలోనే పన్నులు తీసుకుంటామని వివరించారు. ఈ విషయాల్లో అపోహలు నమ్మొద్దని సూచించారు. ఏమైనా అనుమానాలు ఉంటే కరీంనగర్ నగరపాలక సంస్థలో సంప్రదించాలని సూచించారు. కార్పొరేషన్‌లోని వార్డులతో సమానంగా, విలీన గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. -
పంచాయతీలు 920 కార్యదర్శులు 502 మంది..
విజయనగరం రూరల్: పల్లెలే ప్రగతికి పట్టుగొమ్మలు.. గ్రామాల అభివద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ అత్యంత కీలకం.. గ్రామీణ ప్రజలకు ప్రభుత్వపరంగా ఎటువంటి అవసరం వచ్చినా అందుబాటులో ఉండాల్సింది పంచాయతీ కార్యదర్శులే.. అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య వారధిగా కీలకమైన పనులు నిర్వహించడంలో గ్రామ పంచాయతీ కార్యదర్శులదే ప్రధానపాత్ర. అయితే పంచాయతీల్లో కార్యదర్శల కొరత వేధిస్తుండడంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించడంతో కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో లేకుండాపోతున్నారు. సగం మంది కూడా లేరు.. జిల్లాలోని 920 గ్రామ పంచాయతీలుంటే 502 గ్రామ పంచాయతీలకే గ్రామ కార్యదర్శులు ఉన్నారు. దీంతో ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగిస్తున్నారు. రెండేసి పంచాయతీల్లో విధులు నిర్వహించడంతో కార్యదర్శులపై పనిభారం పడుతోంది. దీంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు, పింఛన్ల పంపిణీ, గ్రామ పంచాయతీల్లో నిర్వహించే ప్రతీ పనినీ ఆన్లైన్ చేయడం, మండల పరిషత్ కార్యాలయంలో సమావేశాలతో వీరిపై మరింత పనిభారం పడుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్కో కార్యదర్శి గ్రామ పంచాయతీలు, వార్డుల్లో బీఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్నారు. రెండేసి గ్రామాల్లో విధులు నిర్వహించాల్సి రావడంతో ఒక్కోసారి గ్రామాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండే అవకాశమే ఉండడం లేదు. పనిభారంతో కనీసం కుటుంబ సభ్యులతో గడపలేకపోతున్నామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు.. ఒకపక్క పనిభారంతో ఎలాగోలా నెట్టుకొస్తున్న పంచాయతీ కార్యదర్శులపై అధికార పార్టీ నాయకులు, జన్మభూమి కమిటీ సభ్యులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేయాలని టీడీపీ నాయకులు ఒత్తిడి తీసుకువస్తుండడంతో పంచాయతీకార్యదర్శలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారు కావడంతో వారు కూడా ఏమీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. పడకేస్తున్న పారిశుద్ధ్యం పంచాయతీల్లో ఈ పాలన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.ఈ మేరకు కంప్యూటర్లు, ప్రింటర్లు కూడా కేటాయించారు. అయితే నెట్ సౌకర్యం లేకపోవడంతో కార్యదర్శులు ప్రతి పనికీ మండల పరిషత్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. కార్యదర్శులు గ్రామాల్లో అందుబాటులో ఉండకపోవడంతో పారిశుద్ధ్య అధ్వానంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన ఉన్నా పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కొరత వాస్తవమే.. జిల్లాలో 920 పంచాయతీలకు 502 మంది కార్యదర్శులే ఉన్నారు. వాస్తవంగా జిల్లాలో 489 క్లస్టర్లు ఉన్నాయి. క్లస్టర్ ప్రకారంగా పంచాయతీ కార్యదర్శుల కొరత లేనట్టే. దీంతోపాటు పంచాయతీలకు 357 మంది ప్రత్యేకాధికారులున్నారు. పంచాయతీ కార్యదర్శులకు పింఛన్ల పంపిణీ, మరుగుదొడ్లు, శ్మశాన వాటికల నిర్మాణ బాధ్యతల పర్యవేక్షణతో పాటు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి పలు ధ్రువపత్రాలు అందించాల్సి ఉంటుంది. ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల విధుల్లో భాగంగా బీఎల్ఓల బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. అయినా రెండు రోజులకోసారైనా పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శిస్తున్నారు. పారిశుద్ద్య నిర్వహణపై ఫిర్యాదులు ఉంటే సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. – బలివాడ సత్యనారాయణ, డీపీఓ, విజయనగరం -
పవర్ లేని ప్రథమ పౌరులు
సాక్షి, ముత్తారం(మంథని): దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు. వాటిని పాలించే వారే ప్రథమ పౌరులు. పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులైంది. గ్రామాలను ప్రగతి బాటలో నడపాలని.. గత సర్పంచుల దీటుగా అభివృద్ధి చేయాలని ఎంతో ఉత్సాహంగా కొత్త సర్పంచులు బాధ్యతలు స్వీకరించారు. తమపై నమ్మకంతో ఓటు వేసిన ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలనుకున్నారు. పంచాయతీల ఖాతాల్లో నిధులు కూడా పుష్కలంగా ఉండడంతో పనులు ప్రారంభించడమే తరువాయి అనుకున్నారు. నెల రోజులైనా ప్రభుత్వం చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో ఏం చేయాలో తొచని పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. మరోవైపు కొత్త పాలకవర్గం కొలువు తీరితే సమస్యలు పరిష్కారమవుతాయనుకున్న ప్రజలు నెలరోజులైనా ఏ పని ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందతున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు గత జనవరిలో మూడు విడతల్లో జరిగాయి. 21, 25, 30 తేదీల్లో ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. ఎన్నికలు చాలా గ్రామాల్లో రసవత్తరంగా జరిగాయి. గెలుస్తాం అనుకున్న వారు ఓటమి పాలయ్యారు. ఓడిపోతారు అనుకున్నవారు గెలిచారు. కొత్త సర్పంచులు ఫిబ్రవరి 2న సర్పంచులు ప్రమాణస్వీకారం చేశారు. బాధ్యతలు స్వీకరించి నెల రోజులు గడిచినాఇప్పటికీ అధికారాల బదలాయింపు జరుగలేదు. కొత్త సర్పంచులకు అన్ని గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 263 పంచాయతీలు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు పంచాయతీల ఖాతాల్లో మూలుగుతున్నాయి. గ్రామాల్లో తాగునీరు, పారిశుధ్య సమస్యలు లేకుండా చేయాలని, మొదటగా మహిళల వద్ద మెప్పులు పొందాలనుకున్న సర్పంచులకు నిరాశే మిగిలింది. ప్రజలు వివిధ సమస్యలపై కొత్త స ర్పంచులను ఆశ్రయిస్తున్నారు. చెక్‌పవర్ లేకపోవడంతో సర్పంచులు దిగాలు చెందుతున్నారు. పాత పంచాయతీలు - 228 కొత్త పంచాయతీలు - 65 ఎనిమిది నెలలుగా కుంటుపడిన అభివృద్ధి గత సర్పంచుల పదవీకాలం 2018, జూన్‌లో ము గిసింది. ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా సర్పంచుల స్థానంలో ప్రత్యేక అధికారులను నియమించింది. తమ విధుల్లోనే బిజీగా ఉన్న అధికారులు పల్లెలవైపు కన్నెత్తి కూడా చూడలేదు. వెళ్లినవా రు కూడా ఎలాంటి పనులు చేయించలేదు. కనీ సం డ్రెయినేజీలు కూడా శుభ్రం చేయించలేదు. ప్రత్యేక అధికారులు శాఖా పరమైన విధులకే పరి మితమయ్యారు తప్ప గ్రామాలపై దృష్టి సారించలేదు. పారిశుధ్య లోపం, దీర్ఘకాలిక సమస్యలు, ఎనిమిది నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులు మొదలుకాక సతమతమైన ప్రజలు కొత్త పాలకులపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కొత్త సర్పంచ్‌లు పాత సమస్యలు వెక్కిరిస్తున్నాయి. తాజాగా ఎండలు కూడా ముదురుతుండతో చెరువులు, కుంటలలో నీరు అడిగంటుతోంది. బోర్లు వట్టిపోతున్నా యి. చేతిపంపులు పనిచేయడంలేదు. పల్లెల్లో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. సర్పంచులకు అధికారాల బదలాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు, మార్గదర్శకాలు విడుదల చేయలేదు. మొదలు కాని స్వయం పాలన జిల్లాలో ప్రస్తుతం 263 పంచాయతీలు ఉన్నాయి. గతంలో 228 పంచాయతీలు మాత్రమే ఉండగా, జిల్లాల పునర్విభజన, నూతన పంచాయతీరాజ్ చ ట్టం ప్రకారం ప్రభుత్వం గత ఆగస్టులో 500పైగా జనాభా ఉన్న అనుబంధ గ్రామాలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో జిల్లాలో 65 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. పాత పంచాయతీలతోపాటు కొత్త పంచా యతీలకు ఇటీవల ఎన్నికలు నిర్వహించింది. ఇన్ని రోజులు అనుబంధ గ్రామాలుగా, తండాలు గా ఉన్న పల్లెలో స్వయం పాలన మొదలవుతుం దని ప్రజలు సంతోషపడ్డారు. కానీ సర్పంచులకు చెక్‌పవర్ ఇవ్వకపోవడంతో పాత పంచాయతీలతోపాటు కొత్త పంచాయతీల్లో ఇప్పటికీ పాలన మొదలు కాలేదనే చెప్పవచ్చు. పవర్‌పై స్పష్టత లేకనే.. కొత్త సర్పంచులకు చెక్ పవర్‌పై స్పష్టత రాలేదు. పంచాయతీల్లో ఏ పని చేసినా వాటికి సంబంధిం చి నిధులు విడుదల చేయడానికి గతంలో సర్పం చి, కార్యదర్శి పేరిట బ్యాంకులో ఖాతా ఉండాలి. ప్రస్తుతానికి ప్రత్యేకాధికారుల పేరు మీద ఉన్న ఖాతాలు మార్పిడి చేసి సబ్ ట్రేజరీ కార్యాలయం (ఎస్టీవో) కార్యాలయంలో నివేదించారు. ఇప్ప టి వరకు చెక్ పవర్ ఎవరికి ఇవ్వాలనే స్పష్టత లేక పోవడంతో చెక్ పవర్ కేటాయింపులో జాప్యం జ రుగుతోందని సమాచారం. నూతన చట్టం ప్రకారం సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరికీ ఖాతా ఉంటుందని గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. తాగునీటి సమస్య మొదలైంది గ్రామాలలో ఇప్పటికే తాగునీటి సమస్యలు ప్రారంభమయ్యాయి. గతంలో వేసిన బోర్లు, చేతి పంపుల్లో నీరు అడుగంటి పోయింది. కొన్ని చేతి పంపులు మరమ్మతుకు నోచుకోవడంలేదు. విద్యుత్ మోటార్లు కూడా కాలిపోతున్నాయి. చెక్ పవర్ లేక ఏ పని చేయించలేకపోతున్నాం. –సముద్రాల రమేశ్, సర్పంచ్, ఖమ్మంపల్లి సమాధానం చెప్పలేకపోతున్నం గ్రామాలలో సమస్యలను ప్రజలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. గ్రామాలలో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకు పోయాయి. పారిశుధ్యం లోంపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెక్ పవర్ ఇవ్వకపోవడంతో పనులు చేయలేక పోతున్నాం. ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నాం. –తూటి రజిత, సర్పంచ్, ముత్తారం -
నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం
ఇల్లంతకుంట: ఐదేళ్ల పాటు కొనసాగే పంచాయతీ పాలకులపై పల్లె ప్రగతి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి గ్రామాల రూపురేఖలు మార్చేందుకు కృషి చేస్తామని కొత్త సర్పంచులు చెబుతున్నారు. కాని కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనలు కఠినతరంగా ఉండటంతో నిధులు, విధుల్లో ఏమాత్రం తేడా వచ్చిన, నిర్లక్ష్యం చేసినా సర్పంచ్‌తో పాటు పాలకవర్గానికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు కొత్త సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. ఏళ్లకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలన్నీ కొత్త సర్పంచులు పరిష్కారం చేస్తారనే కొండంత ఆశతో గ్రామీణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత, కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఉన్న నిబంధనలు సర్పంచులకు ఐదేళ్ల పాలన సాగించాలంటే కత్తిమీద సాముల మారుతోంది. గ్రామాల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తూ.. 2015 ఆగస్టు 17న తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రణాళిక తయారు చేసి సిద్ధంగా ఉంచారు. వాటి అమలుకు గ్రామస్థాయిలో వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాధాన్యత క్రమం బట్టి గ్రామాల్లో పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. కానీ నేటి వరకు గ్రామజ్యోతి అమలుకు నోచుకోలేదు. కొత్త పంచాయతీల పాలనలోనైనా గ్రామజ్యోతి పథకాన్ని అమలు చేస్తే పల్లెల్లో ప్రగతి కాంతులు నిండే అవకాశం ఉంది. గతంలో సర్పంచులకు అధికారాలే తప్ప నిధులు, బాధ్యతలు ఆశించిన స్థాయిలో ఉండేవి కావు. సర్పంచులకు లక్ష్యాలు ఇలా.. తెలంగాణ సర్కారు కొత్త పంచాయతీ చట్టం వచ్చిన తర్వాత అనే లక్ష్యాలను నిర్ధేశించారు. నిర్ధేశించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేకపోయినా, కేటాయించిన నిధులు నిబంధనల మేరకు సక్రమంగా ఖర్చు చేయలేకపోయినా సర్పంచ్ పదవి తొలగింపుతో పాటు పాలకవర్గాన్ని రద్దు చేసే అవకాశాన్ని కొత్త చట్టంలో పొందుపరిచారు. సర్పంచులకు అధికారాలతో పాటు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు, పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నియమాలు రూపొందించారు. పాత చట్టం ప్రకారం ఉపసర్పంచ్‌పై నాలుగేళ్లకు పైగా అవిశ్వాసం ఉండగా ప్రస్తుతం రెండేళ్లకు కుదించారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురైనా కూడా పాలకవర్గం రద్దు చేసే పరిస్థితి ఉంది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసినా కూడా రూ.500 జరిమానా విధించనున్నారు. గ్రామాల్లో ప్రధాన సమస్యలివి.. ∙ కొత్త పంచాయతీల్లో కనిపించని వీధి దీపాలు ∙ గ్రామాల్లో ఇంటింటికి మరుగుదొడ్ల నిర్మాణాలు ఆయా పంచాయతీల్లో అసంపూర్తిగా నిలిచిపోయాయి. ∙ ఇంకా ఇంటింటికి పూర్తి కాని మిషన్‌భగీరథ నల్లా కనెక్షన్లు ∙ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు, గ్రామాల్లో ఉప ఆరోగ్య కేంద్రాల నిర్వహణ, సమయపాలన పాటించేలా చూడడం. ∙ పాత పంచాయతీల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించి కొత్త భవనాలు నిర్మించడం, కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో జీపీ భవనాల నిర్మాణాలు ∙ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి ∙ ప్రతీ గ్రామంలో శ్మశానవాటిక నిర్మించాలి ∙ డంపింగ్ యార్డులను నిర్మించాలి ∙ గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలను పూర్తి చేయాలి బాధ్యతలు పెరిగాయి కొత్త పంచాయతీ చట్టంతో సర్పంచులకు బాధ్యతలు పెరిగాయి. సర్పంచులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ నిధులను పారదర్శకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా పాలకవర్గాలపై చర్యలు తప్పవు. – అమరేందర్‌రాజు, ఎంపీడీవో, ఇల్లంతకుంట -
పల్లెల్లో పాట్లు
పాల్వంచరూరల్: నూతన గ్రామపంచాయతీలు సమస్యల లోగిళ్లుగా మారాయి. గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు, కనీస వసతులు లేవు. పంచాయతీ కార్యాలయాలకు పక్కా భవనాలు లేక పలు గ్రామాల్లో అద్దె భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ఇటీవల కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కొలువుదీరినా.. అభివృద్ధి పనులు చేయడం వారికి సవాల్‌గానే మారింది. దీనికి తోడు గ్రామ కార్యదర్శుల కొరత కూడా వేధిస్తోంది. జిల్లాలో 479 గ్రామ పంచాయతీలు ఉండగా.. కార్యదర్శులు 88 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో ఒక్కొక్కరు మూడు, నాలుగు గ్రామాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. ఫలితంగా ఏ గ్రామంలోనూ వారు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. అభివృద్ధి కోసమే పునర్విభజన... చిన్న పంచాయతీలు అయితేనే అభివృద్ధి మరింతగా సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం పంచాయతీల పునర్విభజన చేసింది. 500 మంది జనాభా ఉన్న తండాలు, చిన్న గ్రామాలను కూడా ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లాలో గతంలో 203 (భద్రాచలం, సారపాక మినహా) గ్రామ పంచాయతీలు ఉండగా.. పునర్విభజన తర్వాత 479కి పెరిగింది. అన్ని గ్రామాలకు ఈనెల 2వ తేదీన కొత్త పాలకులు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. గ్రామాల్లో కనీస సౌకర్యాలు లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటున్నాయి. కొత్త పంచాయతీలకు భవనాలు కరువు.. జిల్లాలో నూతనంగా ఆవిర్భవించిన 276 గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు కరువయ్యాయి. పాత వాటిలోనూ 43 గ్రామాల్లో సరైన కార్యాలయాలు లేవు. కొత్తగా ఏర్పడిన వాటిలో 20 పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త పంచాయతీల ఏర్పాటుపై శ్రద్ధ చూపిన ప్రభుత్వం..పక్కా భవనాల నిర్మాణంలో పట్టనట్టుగా వ్యవహరిస్తోందని పలువురు సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు మంజూరు చేసిన నిదులను కొత్త పంచాయతీలకు కూడా జమ చేయాలని, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమ స్యలు పరిష్కరించాలని వారు కోరుతున్నారు. వేధిస్తున్న కార్యదర్శుల కొరత... గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వ అధికారిగా వ్యవహరించే కార్యదర్శులు ప్రతి పంచాయతీకి ఒకరు ఉండాలి. కానీ జిల్లాలో 387 గ్రామాల్లో కార్యదర్శు లు లేరు. జిల్లా వ్యాప్తంగా 88 మంది మాత్రమే ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఏ అభివృద్ధి జరగాలన్నా కార్యదర్శులు పర్యవేక్షించాలి. వీధి లైట్లు, పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరపరా, ఇంటి పన్నుల వసూళ్లు, జనణ, మరణ ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు ఇతర సంక్షేమ పథకాల అమలు బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. అయితే అన్ని గ్రామాల్లో కార్యదర్శులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
‘విలీనం’పై ముగిసిన వాదనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు మునిసిపాలిటీల్లో పంచాయతీల విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ పంచాయతీల జాబితా నుంచి రామన్నగూడెం తండాతోపాటు మరో ఎనిమిది తండాలను తొలగించడాన్ని సవాలు చేస్తూ రమావత్ ప్రదాస్ నాయక్, రమావత్ నాగేశ్వర నాయక్‌లు గత ఏడాది పిటిషన్ దాఖలు చేశారు. రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లో గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలయ్యాయి. పంచాయతీరాజ్, మునిసిపాలిటీ చట్ట నిబంధనలను సవాలు చేస్తూ మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా దాదాపు 100 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రజాభిప్రాయాలను తెలుసుకోలేదు పంచాయతీల విలీనంపై చట్టం నిర్దేశించిన విధి విధానాలకు అధికారులు తిలోదకాలు ఇచ్చారని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు తెలిపారు. విలీనంపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, గ్రామసభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలు తేలుసుకోవాల్సి ఉండగా, అధికారులు ఆ పని చేయకుండా ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. పంచాయతీలను మునిసిపాలిటీల్లో విలీనం చేయడం వల్ల ఎదురయ్యే పరిణామాల గురించి ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. అధికారుల తీరు వల్ల పెద్ద సంఖ్యలో గ్రామీణులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం కింద లభిస్తున్న ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ అన్ని విషయాలపై అధ్యయనం చేసిన తరువాతనే విలీన నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు పంచాయతీలు మునిసిపాలిటీల్లో కలిసిపోయి ఉన్నాయని, ఆ గ్రామాలకు కరెంటు, తాగనీరు ఆ మునిసిపాలిటీల ద్వారానే అందుతోందని తెలిపారు. పంచాయతీల విషయంలో నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. -
వైరా ఎమ్మెల్యేకు చేదు అనుభవం
-
అక్రమ లే అవుట్లకు అనుమతిస్తే కొరడా
సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత నిబంధనల ప్రకారం లేని లే అవుట్లకు అనుమతి ఇస్తే గ్రామపంచా యతీ పాలకవర్గాన్ని రద్దు చేసే నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చేర్చింది. నగరాలు, పట్టణాల శివారుల్లోని గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు విచ్చలవిడిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 2018 మార్చి 31 వరకు ఉండే లే అవుట్ల జాబితాలను కొత్త పాలకవర్గాలు ప్రకటించి.. అనంతరం వాటిపై చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లోని వ్యవసాయ భూమిని ఇళ్ల స్థలాలుగా మార్చే ముందు వ్యవసాయ భూమి చట్టం కింద రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇలా భూ మార్పిడి ప్రక్రియ తర్వాతే లే అవుట్ ప్రతిపాదన దరఖాస్తును గ్రామపంచాయతీలకు ఇవ్వాలి. గ్రామపంచాయతీలు దీన్ని 7 రోజుల్లో జిల్లా టౌన్, కంట్రీ ప్లానింగ్(డీటీసీపీ) అనుమతి జారీ చేసే సంస్థలకు పంపాలి. ఈ గడువులోపు గ్రామపంచాయతీ నిర్ణయం తీసుకోకున్నా అనుమతి ఇచ్చినట్లుగానే పరిగణించాల్సి ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. లే అవుట్లలో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వ్యవస్థ ఏర్పాటు చేయాలని సాంకేతిక కమిటీ లే అవుట్ నిర్వాహకులకు చెబుతుంది. అనంతరం లే అవుట్ పరిధిలోని సామూహిక స్థలాలు, రోడ్లను గ్రామపంచాయతీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలి. అన్నింటినీ పరిశీలించి డీటీసీపీ నెలలోపు ఆమోదించాల్సి ఉంటుంది. లే అవుట్ నిర్వాహకులు విక్రయానికి ప్రతిపాదించే మొత్తం స్థలంలో 15 శాతాన్ని గ్రామపంచాయతీకి తనఖా పెట్టాలి. గ్రామ కంఠం స్థలానికి ఈ నిబంధనలు వర్తించవు. లే అవుట్లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాన్ని ఎవరికైనా విక్రయిస్తే మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. డీటీసీపీ కమిటీ ఆదేశాలు లేకుండా లే అవుట్‌కు అనుమతి ఇస్తే గ్రామపంచాయతీ పాలకవర్గం రద్దవుతుంది. చట్టంలో క్రమబద్ధీకరణ అంశం.. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ అంశాన్నీ చట్టంలో పొందుపరిచారు. లే అవుట్లో నిర్దేశిత అవసరాలకు అనుగుణంగా వసతులు లేనప్పుడు అది అక్రమం అవుతుంది. నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించిన తర్వాత లే అవుట్లను క్రమబద్ధీకరిస్తారు. లే అవుట్‌కు వినియోగించే స్థలానికి అప్పటి మార్కెట్ విలువతో పోల్చితే పది శాతం గ్రామపంచాయతీకి చెల్లిస్తే క్రమబద్ధీకరించేందుకు అవకాశం ఉంటుంది. అక్రమ లే అవుట్లో వసతులు కల్పించే విషయంలో విఫలమైతే దాన్ని అక్రమంగానే నిర్ధారిస్తారు. ఎంత మొత్తం చెల్లించినా దీన్ని క్రమబద్ధీకరించే అవకాశం ఉండదు. -
బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ రద్దు చేయాలి
హైదరాబాద్: పంచాయతీల్లో బీసీ రిజర్వేషన్ తగ్గింపు ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. 34 శాతం ఉన్న రిజర్వేషన్ 22కు తగ్గించడం హేయమైన చర్య అని విమర్శించారు. బీసీలను అణగదొక్కేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఆదివారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం, ఇతర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్‌పై 15 రోజులుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. అఖిలపక్ష నాయకులు, న్యాయనిపుణులతో 10 నిమిషాలు మాట్లాడే సమయం కూడా సీఎంకు లేదా అని ప్రశ్నించారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాకే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిందని, దానిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్‌పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు వి.జి.ఆర్. నారగోని మాట్లాడుతూ కేసీఆర్ బీసీలను దుర్మార్గమైన పరిస్ధితుల్లోకి నెట్టివేస్తున్నారని విమర్శించారు. 94 పంచాయతీరాజ్ చట్టంలో 34 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉందని, ఈ హక్కును తీసేసి కేసీఆర్ బీసీల ద్రోహిగా మారారని సామాజికవేత్త ఉ.సాంబశివరావు అన్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నాయకులు ఎ.ఎల్.మల్లయ్య, లెల్లెల బాలకృష్ణ, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రామగౌడ్, ఓయూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు జాజుల లింగం, ప్రొఫెసర్ వెంకటేశ్, ఎం.జీతయ్య, ఎం. రాజేందర్, డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. -
పైరవీల్లో స్పెషల్
పంచాయతీ ప్రత్యేకాధికారుల నియామకం పక్కదారిపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకు పంచాయతీలను కేటాయించినట్లు తెలుస్తోంది. అనుకూలురైన అధికారులకు నాలుగైదు పంచాయతీలు కట్టబెట్టడం, లేని వారికి ఒకటి రెండు పంచాయతీలతో సరిపెట్టడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. చిత్తూరు ఎడ్యుకేషన్: జిల్లాలో పంచాయతీ ప్రత్యేకాధికారుల నియామకాల్లో పైరవీలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు టీడీపీ నేతలు తమకు అనుకూలంగా ఉన్న అధికారులకు ఎక్కువ పంచాయతీలు కట్ట బెట్టాలని హుకుం జారీ చేసినట్లు సమాచారం. అనుకూలంగా లేని అధికారులకు మొక్కుబడిగా ఒకటి రెండు పంచాయతీలను అప్పజెప్పారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కేటాయింపులు పరి శీలిస్తే పైరవీలు ఏ స్థాయిలో జరిగాయో ఇట్టే అర్థమవుతోంది. నిబంధనలు ఇలా.. జిల్లాలో సర్పంచ్ల స్థానంలో స్పెషలాఫీసర్ల నియామకాలకు కలెక్టర్ అధ్యక్షతన ముందుగా కమిటీలు వేయాలి. ఎవరినైతే స్పెషలాఫీసర్లుగా నియమిస్తున్నారో ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్ సూచించే వ్యక్తులు కమిటీ సభ్యులుగా ఉండాలి. ఆ కమిటీలో సభ్యులు నిబంధనల ప్రకారం స్పెషలాఫీసర్లను కేటాయించాల్సి ఉంటుంది. జరిగింది ఇలా.. కమిటీలో ఎవరున్నారో స్పెషలాఫీసర్లకు తెలియదు. అలాంటప్పుడు ఎలా నియమించారో చెప్పాల్సి ఉంది. ఏ ప్రాతిపాదికన కేటాయించారో ఎవ్వరికీ అంతుపట్టని పరిస్థితి. జిల్లా పంచాయతీ అధికారి స్థాయిలో టీడీపీ ప్రజాప్రతినిధులు చెప్పిన విధంగా ఈ నెల 3న స్పెషలాఫీసర్లను ఇష్టానుసారం నియమించారు. ఆ నివేదికలను కలెక్టర్‌కు ఈ ఆఫీసులో పంపి ఆమోదముద్ర వేయించుకున్నారు. ఆపై అదే రోజు రాత్రి ఆగమేఘాలపై ఎంపీడీఓల మెయిల్‌కు స్పెషలాఫీసర్ల ఎంపిక వివరాలను పంపారు. మాజీలకు పంగనామాలు.. సర్పంచ్ల పదవీ కాలం ఈనెల రెండో తేదీన ముగిసింది. ఎన్నికలకు టీడీపీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది. ప్రత్యేకాధికారుల నియామకానికి పచ్చజెండా ఊపింది. పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా తమనే నియమిస్తారనుకున్న మాజీలకు భంగపాటు తప్పలేదు. ప్రత్యేకాధికారులకు స్థానిక సమస్యలు ఎలా తెలుస్తాయని పలువురు రుసరుసలాడుతున్నారు. నమ్ముకున్న పార్టీయే నట్టేట ముంచేస్తోందని ఆవేదన చెందుతున్నారు. పైరవీల జోరు.. ఈనెల రెండో తేదీన పంచాయతీ సర్పంచ్ పాలన ముగిసింది. అదేరోజు పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులను విడుదల చేసింది. మండల కేడర్ ఉన్న అధికారులను ప్రత్యేకాధికారులుగా నియమించుకోవాలని ఆదేశించింది. ఈ నెల 2న కలెక్టర్‌కు బాధ్యతలు అప్పజెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ మూడో తేదీ నుంచి బిజీ అయిపోయారు. ప్రొటోకాల్ నిబంధనల మేరకు ఈ నెల మూడున శ్రీలంక ప్రధాని, నాలుగో తేదీ సీఎం చంద్రబాబు జిల్లాకు విచ్చేయడంతో ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే అదునుగా టీడీపీ నేతలు కొందరు మండల స్థాయి నుంచే పైరవీలకు తెరలేపారు. తాము చెప్పిన అధికారికి తమ పంచాయతీలను అప్పజెప్పాలని హుకుం జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకే నియామకాలు జరిగా యన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర్వుల జాడేలేదు.. పంచాయతీల ప్రత్యేకాధికారుల నియామకాలకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. పంచాయతీల కేటాయింపులు మాత్రమే స్థానికంగా జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తర్వులు వెలువడిన వెంటనే తామనుకున్న పంచాయతీలకు, తాము సూచించిన అధికారులు వస్తారని కొందరు టీడీపీ నేతలు సంకలు గుద్దుకుంటున్నట్టు సమాచారం. ఎంపీడీఓలకే ఎక్కువ పంచాయతీలు.. జిల్లాలో 65 మంది ఎంపీడీఓలు ఉన్నారు. వీరికే అధిక పంచాయతీలు కేటాయించినట్లు తెలుస్తోంది. సీఎం ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లెలో 18 గ్రామపంచాయతీలకు గాను ఐదుగురు అధికారులను నియమించారు. ఇందులో ఎంపీడీఓకు గుడుపల్లె, అగరం, బెగ్గిలిపల్లె, శెట్టిపల్లె, కంచిబందార్లపల్లె పంచాయతీలను కేటాయించారు. అదే మండల ఎంఈఓకు సోడిగానిపల్లె, చీకటిపల్లి రెండు పం చాయతీలను అప్పజెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ములకలచెరువులో ఎంపీడీఓకు ఐదు పంచాయతీలు, అక్కడ పనిచేస్తున్న ఎంఈఓకు ఒక (సోంపల్లె) పంచాయతీకి బాధ్యతలిచ్చా రు. ఇలా జిల్లాలోని చాలా పంచాయతీల్లో టీడీపీ ప్రజాప్రతినిధులు పైరవీలు చేసి స్పెషలాఫీసర్ల నియామకాలను వారి చేతుల్లోకి తీసుకున్నారని మాజీ సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపాలన కష్టమే.. జిల్లాలోని 1,353 పంచాయతీలకు 346 మంది స్పెషలాఫీసర్లను నియమించారు. పశువైద్యులకు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్లకు గ్రామాల అభివృద్ధి ఏమి తెలుస్తుందని మాజీ సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ఫ్యాన్ల కింద కూర్చునే అధికారులకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. గ్రామాభివృద్ధి శూన్యమే నిత్యం పని ఒత్తిడిలో ఉండే అధికారులను స్పెషలాఫీసర్లగా నియమించారు. వారు ఏ విధంగా గ్రామ సమస్యలపై దృష్టి పెడతారో అర్థం కావడం లేదు. మా పదవీ కాలం ముగిసిన వెంటనే ఎన్నికలు పెట్టకుండా ప్రభుత్వం కుట్ర పన్నింది. స్థానిక సమస్యలు మాకు తప్ప అధికారులకేం తెలుసు? ఒక్కో అధికారికి మూడు, నాలుగు పంచాయతీలను అప్పజెప్పారు. సమస్యలు వారెలా పరిష్కరిస్తారో...? – బాబు, చిన్నతయ్యూరు మాజీ సర్పంచ్ -
నాగులవంచ గ్రామంలో కులపంచాయతీ
-
పంచాయతీలకు ‘విద్యుత్’ షాక్..!
ఓపైపు నిధుల లేమి, మరోవైపు ఖర్చుల భారంతో విలవిలలాడుతున్న పంచాయతీలపై విద్యుత్ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో ఉపయోగిస్తున్న వీధిలైట్ల కరెంట్ బిల్లులను చెల్లించాలంటూ ట్రాన్స్–కో అధికారులు పంచాయతీలకు నోటీసులు పంపిస్తున్నారు. 2006 నుంచి విద్యుత్ బకాయిలు సక్రమంగా చెల్లించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా భారీగా బకాయిలు పేరుకుపోయాయి. మదనపల్లె రూరల్: జిల్లా వ్యాప్తంగా పంచాయతీల్లో విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలోని 66 మండలాలు, 1363 గ్రామ పంచాయతీల్లో సుమారు రూ: 7.50 కోట్ల వరకు విద్యుత్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు పంచాయతీ సర్పంచ్‌లు, ఎంపీడీఓలపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో కొన్ని గ్రామ పంచాయతీలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి విద్యుత్ కనెక్షన్లు తొలగించిన దాఖలాలు కూడా లేకపోలేదు. పంచాయతీలు బిల్లులు చెల్లించకుండా మొండి వైఖరి ప్రదర్శిస్తే విద్యుత్ కనెక్షన్లను తొలగించాలని ట్రాన్స్‌కో నిర్ణయం తీసుకోనుంది. పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు కావడంతో కనీసం అందులోంచి తమ బకాయిలను రాబట్టేందుకు ఆశాఖ అధికారులు నడుం బిగించారు. గ్రామ తాగునీటి అవసరాలు తీర్చే విద్యుత్ మోటార్ల బకాయిలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీధిలైట్లు, నీటి పథకాల విద్యుత్ బకాయిలు చెల్లించాలని ట్రాన్స్‌కో అధికారులు ఇప్పటికే పలుమార్లు పంచాయతీ శాఖ అధికారులకు, సర్పంచ్‌లకు నోటీసులు జారీ చేశారు. బకాయి వసూళ్లకు స్పెషల్ డ్రైవ్ డివిజన్లో విద్యుత్ బకా యిల వసూళ్లకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని మండలాల ఎంపీడీఓలు, సర్పంచ్‌లతో ప్రత్యేకంగా సమావేశమై బకాయిలు చెల్లించాలని కోరుతున్నాం. బకాయిలు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో నష్టాల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మండల శాఖా« దికారులు, సర్పంచ్‌లు సమన్వయంతో వ్వవహరించి పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉంది.–భాస్కర్‌నాయుడు, ట్రాన్స్‌కో డీఈ, మదనపల్లె -
డమ్మీ స్టార్
అభివృద్ధిలో పంచాయతీలు పోటీ పడాలని ప్రభుత్వం స్టార్ రేటింగ్స్‌ని ప్రకటిస్తోంది. అందుకు సరిపడా నిధులను మాత్రం అందించలేకపోతోంది. ఒకవేళ నిధులిచ్చినా జన్మభూమి కమిటీల అవినీతికి అడ్డుకట్ట వేయలేకపోతోంది. ఒకవైపు సర్పంచ్ల చెక్ పవర్ రద్దయ్యింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్వీర్యమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దశలో గ్రామాలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎక్కడికక్కడ అభివృద్ధి కుంటుపడుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం క్షేత్ర స్థాయి వాస్తవాలతో సంబంధం లేకుండా ‘డమ్మీ స్టార్స్’తో లేని అభివృద్ధి ఉన్నట్టు ప్రజలు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. సాక్షి, అమరావతి బ్యూరో/ఎస్వీఎన్కాలనీ: గ్రామ పంచాయతీల అభివృద్ధిని ప్రభుత్వం స్టార్ రేటింగ్స్‌తో సూచిస్తోంది. కానీ వాస్తవ పరిస్థితులకు, వచ్చిన రేటింగ్స్‌కు ఏ మాత్రం పొంతన ఉండట్లేదు. వివిధ శాఖల అనుసంధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేసి, మౌలిక వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం స్టార్ రేటింగ్స్ అంటూ మభ్యపెడుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ల అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. జన్మభూమి కమిటీలకు అధికారాలను కట్టబెట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక అంతా టీడీపీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండటంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రేడింగ్‌లు ఇలా... గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి సాధించాయో స్టార్ల రూపంలో ప్రభుత్వం రేటింగ్ ఇస్తోంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వల నుంచి నిధులు విడుదల అవుతున్నా, క్షేత స్థాయిలో ఆశించిన మేర అభివృద్ధి కనిపించడం లేదని ప్రభుత్వం పంచాయతీలకు గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ అంశాలపై ఈ రేటింగ్ విధానం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. రేటింగ్ ఇలా.. పంచాయతీల మధ్య స్నేహపూర్వక పోటీ పెంచేందుకు 11 అంశాల్లో సాధించిన పురోగతి ఆధారంగా స్టార్ రేటింగ్ ఇస్తారు. 11 స్టార్లు సాధించిన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించి సముచిత రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుంది. దశల వారీగా అన్ని గ్రామ పంచాయతీల్లో మిషన్ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబరు 2 నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓపెన్ డెఫకేషన్ ఫ్రీ గ్రామంగా ఉండాలి ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామాల్లో వీధి దీపాలు ఎల్ఈడీలుగా మార్పు ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ ఉండాలి సురక్షిత తాగునీరు అందాలి, ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్ పారిశుద్ధ్యాన్ని మొరుగుపరిచేందుకు ఘన, వ్యర్థాల నిర్వహణ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు ప్రయాణాలకు అనువైన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం కో నాలెడ్జ్ సొసైటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంటికి పైబర్ నెట్ ప్రతి పేద మహిళ పొదుపు సంఘంలో ఉండేలా చూడటం. వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఆదాయ వనరులు చూపించాలి. బడిఈడు పిల్లలందరూ పాఠశాలకు హాజరు కావడం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ఫైబర్ నెట్ ఏర్పాటు చిన్నారులకు వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు, వంద శాతం ఆస్పత్రి ప్రసవాలు, వంద శాతం పోషకాహారం అందాలి. మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితకు కృషి. లింగ సమానత్వం, గృహ హింస రహిత గ్రామాలు ఇదీ జిల్లా సంగతి.. జిల్లాలో మొత్తం 1011 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం అభివృద్ధి విషయంలో ఒక్కో పంచాయతీకి 10 వరకు స్టార్ రేటింగ్ ఇస్తోంది. ఈ లెక్కన జిల్లాలోని పంచాయతీలు 10,110 స్టార్లు సాధించాలి. కానీ ఇంత వరకు 5,624 స్టార్ రేటింగ్స్‌ను మాత్రమే సాధించాయి. ప్రభుత్వం పేర్కొన్న అంశాల ప్రకారం స్టార్లు 55.89 శాతం మాత్రమే వచ్చాయి. అంటే జిల్లాలో ఎక్కువ శాతం పంచాయతీలు చాలా అంశాల్లో వెనుకబడి ఉన్నాయి. అధికారులు పూర్తి స్థాయిలో గ్రామాలు అభివృద్ధి చెందాయని చెబుతునప్పటికీ , క్షేత్ర స్థాయిలో అందుకు పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా కేంద్రం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకనిధులు అందటం లేదు. విద్యుత్తు, రక్షిత మంచినీటి ప«థకాల నిర్వహణకు కూడా చిన్న పంచాయతీల్లో నిధులు సరిపోని పరిస్థితి నెలకొంది. అభివృద్ధి ఆధారంగానే రేటింగ్ గ్రామ పంచాయతీల్లో ఓడీఎఫ్, విద్యుత్తు, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, పౌరసేవలు వంటి అంశాల ఆధారంగా రేటింగ్‌లు ఇచ్చారు. గ్రామ పంచాయతీలను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక దృష్టి సారించి గ్రామాలు అభివృద్ధిలో స్టార్ రేటింగ్ మెరుగుపరచుకునేలా చర్యలు తీసుకుంటాం.–అరుణ, జిల్లా పంచాయతీ అధికారి -
అన్యాయం.. బాధితురాలినే శిక్షించారు
జైపూర్ : బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి తిరిగి వారికే శిక్ష విధించిన సంఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్ చిత్తోర్‌ఘడ్‌కు చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన యువకుడు మత్తు మందు ఇచ్చి ఆమెను అసభ్యకర రీతిలో వీడియో తీసాడు. అనంతరం ఆ వీడియోలను బయటపెడతానంటూ బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన గురించి బాధుతురాలు ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు నిందితునిపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు వాపసు తీసుకోవాలని బాధితురాలిని పంచాయతీ పెద్దలు వత్తిడి చేశారు. ఆమె నిరాకరించడంతో బాధితురాలి కుటుంబాన్ని ఊరు నుంచి బహిష్కరించారు. బాధితురాలి కుటుంబంతో ఎవరూ మాట్లడవద్దని, వారికి ఎటువంటి సహాయం చేయవద్దని కనీసం తిండి గింజలు కూడా ఇవ్వద్దని ఆదేశించారు. అంతేకాక పంచాయతీ తీర్పును పాటించనందుకు గాను బాధితురాలి కుటుంబానికి 11 వేల రూపాయల జరిమాన విధించారు. పంచాయతీ జారీ చేసిన ‘దిక్తిత్’ గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి కుటుంబం తమకు రక్షణ కల్పించాల్సిందిగా విన్నవించుకుంది. ఈ విషయంలో బాధితులకు రక్షణ కల్పించి, గ్రామస్తుల మీద కేసు నమోదు చేయాల్సిందిగా ఎస్పీని ఆదేశించినట్లు రాజస్థాన్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు సుమన్ శర్మ తెలిపారు. -
రేప్ కేసు.. గుంజీలు తియ్యమంటే తగలబెట్టేశాడు
రాంచీ: జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన ఓ యువతి(18)కి నిప్పటించిన ఘటన కలకలం రేపింది. పంచాయితీ పెద్దల తీర్పును జీర్ణించుకోలేని నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఛాత్రా జిల్లా రాజకెందువా గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... తల్లిదండ్రులు బంధువుల వివాహానికి వెళ్లగా యువతి(18) ఇంట్లో యువతి ఒంటరిగా ఉంది. అది గమనించిన నలుగురు యువకులు గురువారం రాత్రి ఆమెపై గ్యాంగ్ రేప్‌కి పాల్పడ్డారు. మరుసటి ఉదయం విషయం తెలిసిన యువతి తండ్రి పంచాయితీలో ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడికి 30 వేల రూపాయల జరిమానా.. వంద గుంజీలు తీయాలని పంచాయితీ పెద్దలు హేయమైన తీర్పు ఇచ్చారు. దీంతో యువకుడు ఆగ్రహంతో యువతి ఇంటిపై దాడికి పాల్పడ్డాడు. ఆమె తల్లిదండ్రులను చితక్కొట్టి ఆపై యువతికి నిప్పటించాడు. ఘటన తర్వాత యువకుడు పారిపోగా.. కాలిన గాయాలతో యువతి ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. యువతి బంధువుల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతికి ప్రధాన నిందితుడికి పాత పరిచయాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని స్థానిక ఎస్సై వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని.. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ఆయన చెప్పారు. -
రాష్ట్రంలో 1,13,380 వార్డులు
సాక్షి, హైదరాబాద్: కొత్త పంచాయతీలు, వార్డుల సంఖ్యపై రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. పునర్విభజన ప్రకారం జిల్లాల వారీగా గ్రామపంచాయతీలు, వార్డుల సంఖ్యను పేర్కొంటూ తాజా సమాచారాన్ని శనివారం వెల్లడించింది. అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 12,751 గ్రామపంచాయతీలు, 1,13,380 వార్డులు ఉన్నాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 844, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాల్లో అతి తక్కువగా 61 గ్రామపంచాయతీలు ఉన్నాయి. గతంలో ఒక గ్రామపంచాయతీలో ఒకటి, అంతకంటే ఎక్కువ రెవెన్యూ గ్రామాలు ఉండేవి. పునర్విభజన తర్వాత ఒక రెవెన్యూ గ్రామంలో ఒకటి కంటే ఎక్కువగా గ్రామాలు ఉన్నాయి. గతంలో 500 జనాభాకంటే ఎక్కువ ఉన్న ఆవాసాలు మాత్రమే గ్రామపంచాయతీలుగా ఉండేది. భౌగోళిక పరిస్థితుల ఆధారంగా గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 300 కంటే తక్కువ జనాభా ఉన్న ఆవాసాలు సైతం గ్రామ పంచాయతీలుగా మారాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం 26 గ్రామ పంచాయతీలలో 300 కంటే తక్కువ జనాభా ఉంది. ఈ గ్రామాల్లో 210 నుంచి 230 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే ఈ గ్రామ పంచాయతీలలో ఐదుగురు మాత్రమే వార్డు సభ్యులు ఉంటారు. వీరిలోనే ఒకరు ఉపసర్పంచ్‌గా ఎన్నికవుతారు. -
‘తండాలను పంచాయతీలు చేసినం’
కౌడిపల్లి(నర్సాపూర్): టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు సీఎం కేసీఆర్ తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే మదన్ర్రెడ్డి తెలిపారు. శుక్రవారం మడలంలోని రాజిపేట పంచాయతీ జాజితండాను కొత్తగా పంచాయతీగా ఏర్పాటు చేయడంతో సర్పంచ్ మహ్మపాష ఆధ్వర్యంలో తండాలో టీఆర్ఎస్పార్టీ జెండా అవిష్కరణ, పార్టీలో చేరిక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా హాజరుకాగా వెంకట్రావ్‌పేట్ గేట్ నుంచి తండా వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతోపాటు కొత్త పథకాలను సైతం ప్రవేశపెడుతూ ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. తండాలను పంచాయతీలుగా చేస్తామన్న ఎన్నికల హామీ మేరకు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం పదేళ్లపాటు రిజర్వేషన్ల అమలు ఉండేలా చట్టం తెచ్చిందన్నారు. దీంతో ఎన్నికైన సర్పంచ్‌లు అభివృద్ధికి పాటు పడుతారని తెలిపారు. తండాలలో సర్పంచ్ల కోసం ఎన్నికల్లో పోటిపడటానికి మంచి వ్యక్తులను చూసి ఏకగ్రీవం చేసుకోవాలని కోరారు. సమైఖ్యంగా ఉండి అభివృద్ధి చేసుకునే వీలుంటుందని చెప్పారు. తండాలో టీఆర్ఎస్పార్టీ జెండాను ఎగురవేశారు. ఎమ్మెల్యే పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. టీఆర్ఎస్లో చేరిక ః జాజి, జగ్య, జయరాం, రామాలయం తండాలకు చెందిన మాజీ సర్పంచ్ పత్తినాయక్, వార్డుసభ్యులు అంబిబాయ్, అంబుర్యనాయక్, మాజీ వార్డు సభ్యులు వాల్య, రాములు నాయక్‌తోపాటు లక్ష్మన్, కిషన్, హీర్య, రెడ్య, విఠల్, హర్య, కాశ్య, గోపాల్, జీవుల, రాజు, వాల్య, గోప్య, గేమ్య తదితర వంద మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సార రామాగౌడ్, సర్పంచ్ ఎండీ పాష, నాయకులు లింగంగౌడ్, గణేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త ‘పంచాయితీ’!
సాక్షి, హైదరాబాద్ : పంచాయతీరాజ్ చట్టంలో వస్తున్న మార్పులతో సరికొత్త ‘పంచాయితీ’మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ అంశం గ్రామ రాజకీయాల్లో కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో రాజకీయ పోరు ఉధృతం అవుతుందని, రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయనే భావన వస్తోంది. చెక్‌పవర్ ఉన్న కారణంగా గ్రామ పాలనా వ్యవహారాల్లో ఉప సర్పంచ్ల జోక్యం పెరిగే అవకాశముంది. మరోవైపు గ్రామ కార్యదర్శులు నామమాత్రంగా మిగిలిపోనున్నారు. కార్యదర్శులకు కత్తెర వేసి.. ప్రస్తుతం గ్రామ పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, వేతనాలు, ఇతర పనుల కోసం నిధుల ఖర్చు అంశం సర్పంచ్, గ్రామ కార్యదర్శులకు ఉంది. వారిద్దరూ సంతకాలు చేస్తేనే నిధులు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సాధారణంగా గ్రామ సభ నిర్ణయం మేరకు నిధులు ఖర్చు చేస్తారు. అయితే అత్యవసర పనులు, కార్యక్రమాలకు గ్రామ కార్యదర్శి, సర్పంచ్ల ఆమోదంతో నిధులు విడుదల చేస్తారు. కానీ ఇక ముందు కార్యదర్శులు గ్రామ ప్రణాళికల రూపకల్పన, పన్నుల వసూలు, ధ్రువపత్రాల జారీ, గ్రామసభల నిర్వహణ విధులకు పరిమితం కానున్నారు. గ్రామ రాజకీయాల్లో కొత్త మార్పు సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ ఇవ్వడం గ్రామ రాజకీయాల్లో మార్పులు తెచ్చే పరిస్థితి ఉందని సర్పంచ్ల సంఘం రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు. గ్రామాల్లో ఇన్నాళ్లు సర్పంచ్ ఎన్నికలకు మాత్రమే పోటీ ఉండేదని, ఇప్పుడు ఉప సర్పంచ్ పదవి కోసం పోరు ఉంటుందని అంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో మార్పులు చేయనందున.. ప్రస్తుతమున్నట్టుగానే సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నిక ప్రత్యక్ష పద్ధతిలో జరుగుతుంది. ఎన్నికలు నిర్వహించిన రోజే ఫలితాలు వస్తాయి. అదే రోజు వార్డు మెంబర్లలో ఒకరిని ఉప సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. ఇప్పటివరకు ఉప సర్పంచ్ పదవికి పెద్దగా పోటీ ఉండేదికాదు. కానీ చెక్‌పవర్ రానుండడంతో సర్పంచ్ పదవితో సమానంగా పోటీ పెరగనుంది. ఆధిపత్య పోరుకు అవకాశం..! జాయింట్ చెక్‌పవర్ కారణంగా సర్పంచ్‌గా ఎన్నికైనవారికి, ఉప సర్పంచ్‌గా ఎన్నికైన వారికి మధ్య ఆధిపత్య పోరు నెలకొనే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వారి మధ్య సయోధ్య నెలకొనని పరిస్థితి ఉంటే గ్రామ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముంది. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళలు తదితర వర్గాలకు సర్పంచ్ పదవులు రిజర్వు అయిన చోట ఉప సర్పంచులు ఆధిపత్యం చెలాయించడం ఇప్పటికే జరుగుతోంది. తాజాగా చెక్‌పవర్‌తో ఇది మరింత ఉధృతమవుతుందని అంటున్నారు. ఇక సర్పంచ్ లేని సందర్భాల్లో గ్రామ పరిపాలన అంతా ఉప సర్పంచ్ చేతుల్లోనే ఉంటుంది. దీనికితోడు తాజా నిబంధనల్లో.. విధి నిర్వహణలో విఫలమైన, నిధుల దుర్వినియోగం విషయంలో సర్పంచ్‌లను తొలగించేలా నిబంధనలు చేర్చారు. ఉప సర్పంచులు దీనిని ఆసరాగా చేసుకుని సర్పంచ్‌లను తొలగించేలా ప్రయత్నాలు చేయవచ్చనే అభిప్రాయమూ వస్తోంది. తాగునీటితో స్నానం చేస్తే రూ.500 జరిమానా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, అభివృద్ధి, మెరుగైన పరిపాలన దిశగా కొత్త పంచాయతీరాజ్ చట్టంలో చాలా అంశాలను చేర్చారు. నీటి వృధాను అరికట్టడం, అక్రమ నిర్మాణాల నియంత్రణ, అల్లర్ల నిరోధం, పారిశుధ్య అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. తాగునీటిని స్నానానికి, ఇతర అవసరాలకు వినియోగిస్తే రూ.500 జరిమానా వేయాలని చట్టంలో పేర్కొన్నారు. మిషన్ భగీరథ, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థతో సరఫరా చేసే నీటిని వృథా చేయడం, స్నానానికి వినియోగించడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం, వాహనాలను శుభ్రపరచడం వంటి చర్యలకు పాల్పడితే ఈ జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో అల్లరి (నూసెన్స్) చేసిన వారికి రూ.వెయ్యి జరిమానా విధించే అధికారం గ్రామ పంచాయతీకి ఉంటుంది. లైసెన్సు లేకుండా రోడ్డు దగ్గరలో ఇసుక తీసినా, రోడ్డు తవ్వినా రూ.ఐదు వేల జరిమానా వసూలు చేస్తారు. అనుమతి లేకుండా చెట్లను నరికినా, బహిరంగంగా గొర్రెలు, మేకలు, పశువులను వధించడం చేసినా.. నాలాపై అక్రమంగా భవనాన్ని నిర్మించినా రూ. రెండు వేల అపరాధ రుసుము విధిస్తారు. నిషేధిత ప్రాంతంలో చెత్తను కాల్చడం, పారవేయడం, రోడ్డును ఆక్రమించి గోడను నిర్మించడం, ఇనుప కంచె ఏర్పాటు చేయడం వంటి ఉల్లంఘలనకు రూ.వెయ్యి జరిమానా ఉంటుంది. ఇళ్ల లేఔట్లకు ఆన్లైన్ అనుమతులు గ్రామాల్లో ఇళ్ల లేఔట్ల అనుమతుల జారీ కోసం ప్రభుత్వం కొత్తగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేస్తోంది. ఇళ్ల స్థలాల లేఔట్ల అనుమతి కోసం దరఖాస్తు చేసిన వారంలోగా సాంకేతిక మంజూరు విభాగానికి పంపాలి. అలా పంపకపోయినా పంపినట్టే పరిగణిస్తారు. సాంకేతిక విభాగం అన్ని అంశాలను పరిశీలించి 30 రోజుల్లోగా పంచాయతీకి వివరణ ఇవ్వాలి. అనంతరం ఏడు రోజుల్లోగా లేఔట్ యజమానికి గ్రామ పంచాయతీ సమాచారం ఇవ్వాలి. 300 చదరపు గజాల్లో 10 మీటర్ల ఎత్తుకు మించని జీ ప్లస్ టు భవనాల నిర్మాణానికి పంచాయతీలు అనుమతి ఇస్తాయి. దరఖాస్తు చేసిన 15 రోజుల్లోగా గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకోవాలి. లేకుంటే అనుమతి లభించినట్లుగా భావించాల్సి ఉంటుంది. -
పంచాయతీల్లో ఆకలి కేకలు..!
ఒంగోలు టూటౌన్: జిల్లాలోని పంచాయతీల్లో కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. 3 నుంచి 11 నెలల వరకు వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. కందులాపురం పంచాయతీలో 9 నెలలు, కంభం పంచాయతీలో 3 నెలలు, వై.పాలెంలో 7 నెలలు, త్రిపురాంతకంలో 6 నెలలు, దోర్నాలలో 5 నెలలు, దర్శి, కురిచేడు పంచాయతీలలో ఐదు నుంచి ఆరు నెలల వరకు కార్మికులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. అదే విధంగా కరేడు పంచాయతీలో 6 నెలలు, ఉలవపాడులో 3 నెలలు, సింగరాయకొండలో 5 నెలలు, మూలగుంటపాడులో 5 నెలలు, ఎన్జీపాడులో 4 నెలలు, బి.నిడమానూరు పంచాయతీలో 11 నెలల వరకు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు చెల్లించకపోవడంతో ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇవే కాకుండా ఇంకా జిల్లాలోని చాలా పంచాయతీల్లో పంచాయతీ కార్మికులకు నెలవారీ వేతనాలు అందటం లేదు. నెలల తరబడి జీతాలు అందకపోవడం, దుకాణాలలో బకాయిలు పెరిగిపోవడంతో అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొంది. నిద్రలేచి పంచాయతీలను శుభ్రం చేస్తున్నా కార్మికులకు నెలవారీ జీతాలు ఇవ్వకపోతే ఎలా బతుకుతారంటూ సీఐటీయూ నాయకుల పివి శేషయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని బుధవారం జిల్లా పంచాయతీ అధికారి ఎన్‌ఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌కు వినతిపత్రం ఇచ్చారు. వేతనాలపై ఫ్రీజింగ్‌ను వెంటనే ఎత్తివేయాలని కోరారు. పంచాయతీ కార్మికులకు కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం రోజు వారి వేతనం రూ.386 చెల్లించాలని డిమాండ్ చేశారు. అంటే నెలకు రూ.11, 580 చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. స్వచ్ఛభారత్ పేరుతో ప్రచార ఆర్భాటం తప్ప పారిశుద్ధ్య పనిలో ఉన్న కార్మికుల స్థితిగతుల గురించి ఆలోచించే తీరిక లేకపోవడం దారుణమని అన్నారు. కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంతో పాటు టెండర్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్న 1028 పంచాయతీలలో కార్మికుల పరిస్థితి ఇలాగే ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితి నుంచి కార్మికులను విముక్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
కొత్త పంచాయతీల ఏర్పాటుపై సమీక్ష
నిజామాబాద్ అర్బన్/ఇందూరు: నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటుపై గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో సమీక్షించారు. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ ఆవరణలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ సమావేశంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి, హన్మంత్ సింధే, గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్ రెడ్డిలతో పాటు నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు ఎం.రామ్మోహన్రావు, సత్యనారాయణ, డీపీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కొత్త పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి పంపిన ప్రతిపాదనలపై సమీక్షించారు. ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా అని మంత్రి ఎమ్మెల్యేలు, కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని కూడా చర్చించారు. -
విభజన పంచాయతీ..!
ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజన వివాదాలకు దారితీస్తోంది. ఉద్యోగుల విభజన శాస్త్రీయంగా, పారదర్శకంగా చేపట్టలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగుల కేటాయింపుల్లో జిల్లాకు అన్యాయం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిద్దిపేటకు ఎక్కువ పోస్టులు కేటాయించటంపై జిల్లా అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడంపై ఉన్నతాధికారుల తీరుపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఎస్ఈ ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఈ లేఖ ద్వారా ఉద్యోగుల కేటాయింపును మరోసారి పరిశీలించి జిల్లాకు న్యాయం చేయాలని కోరినట్లు సమాచారం. సాక్షి, మెదక్: జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 అక్టోబర్‌లో మెదక్ నూతన జిల్లా ఏర్పాటైన విషయం తెలిసిందే. జిల్లా ఏర్పడిన వెంటనే జిల్లాకు ట్రాన్స్‌కో ఎస్ఈ కార్యాలయం ఏర్పాటు కావాల్సి ఉండగా దాన్ని ఏర్పాటు చేయకుండా 2017 ఆగస్టులో కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఎస్ఈ, డీఈ, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులను మంజూరు చేసినా మిగితా సిబ్బంది నియమించలేదు. వారం రోజుల క్రితం ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజనను పూర్తి చేశారు. ఉద్యోగుల విభజన కోసం సీజీఎం ఆధ్వర్యంలో మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ఎస్ఈలతో ప్రత్యేకంగా కమిటీ వేశారు. ఈ కమిటీ అన్ని స్థాయిల్లో ఖాళీల వివరాలు, పనిచేస్తున్న సిబ్బంది వివరాలను సేకరించి ఉద్యోగుల విభజనపై నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సంగారెడ్డి జిల్లాకు 48 శాతం, మెదక్ జిల్లాకు 26 శాతం, సిద్దిపేట జిల్లాకు 26 శాతం చొప్పున ఉద్యోగులను కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం మేరకు ఉద్యోగులు కేటాయింపులు జరగకపోవటం ఇప్పుడు వివాదానికి దారితీస్తోంది. దీనికితోడు పోస్టుల కేటాయింపుపైనా ఉద్యోగులు తీవ్ర స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు. కొంత మంది ఉద్యోగులు తమకు ఇచ్చిన కొత్త పోస్టుల్లో చేరేందుకు ఆసక్తిచూపడం లేదు. ట్రాన్స్‌కో ఉద్యోగుల విభజనలో భాగంగా సబ్ ఇంజినీర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, రికార్డు అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, ఫోర్‌మెన్(గ్రేడ్ 1), సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, ఫోర్‌మెన్(ఎంఆర్టీ గ్రేడ్1), ఫోర్‌మెన్(ఎంఆర్టీ గ్రేడ్ 2) విభజించి మూడు జిల్లాలకు కేటాయించారు. విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఉమ్మడి జిల్లాలో మొత్తం 642 పోస్టులు ఉండగా 398 పోస్టులు భర్తీ కాగా 244 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాకు సబ్ ఇంజినీర్ మొదలు ఫోర్‌మెన్ వరకు 317 పోస్టులు కేటాయించారు. అందులో 48 శాతం చొప్పున 190 పోస్టులకు ఉద్యోగులను కేటాయించారు. 127 పోస్టులు ఖాళీగా చూపించారు. మెదక్ జిల్లాలోని మెదక్, తూప్రాన్ డివిజన్లకు 157 పోస్టులను కేటాయించారు. ఇందులో 70 పోస్టులను ఖాళీలు చూపి, 87 మంది ఉద్యోగులను భర్తీ చేశారు. సిద్దిపేటకు జిల్లాకు 168 పోస్టులను కేటాయించి కేవలం 47 పోస్టులను మాత్రమే ఖాళీలుగా చూపి, 121 పోస్టులను భర్తీ చేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాలకు 26 శాతం చొప్పున సమానంగా ఉద్యోగులు పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా సిద్దిపేటకు అదనంగా కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సిద్దిపేటలో హుస్నాబాద్ డివిజన్లు ఇంకా విలీనం కాకున్నా విలీనం అయినట్లు చూపి ఉద్యోగులను ఎక్కువ సంఖ్యలో కేటాయించారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్‌కోలో ఉద్యోగుల విభజన సక్రమంగా చేపట్టాలన్న డిమాండ్ ఊపందుకుంటోంది. మరోమారు పరిశీలించాలి.. పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపు తీరుపై మెదక్ జిల్లా ట్రాన్స్‌కో ఎస్ఈతో పాటు ఇతర అధికారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. విభజన, ఉద్యోగుల కేటాయింపు మరోమారు పారదర్శకంగా చేపట్టాలని ఎస్ఈ శ్రీనాథ్ ఉన్నతాధికారులకు కోరినట్లు సమాచారం. ఈ మేరకు ట్రాన్స్‌కో సీజీఎం, సంగారెడ్డి ఎస్ఈకి లేఖ రాసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్ఈ శ్రీనాథ్ వివరణ కోరగా ఉద్యోగుల కేటాయింపు అంశాన్ని మరోమారు పరిశీలించి జిల్లాకు 26 శాతం మేరకు కేటాయింపులు జరిగేలా చూడాలని లేఖ రాసినట్లు తెలిపారు. -
బలవంతంగా మూత్రం తాగించారు.. ఆ అవమానంతో...
లక్నో : ఉత్తర ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఆరోపణలతో ఓ యువకుడిపై దాష్టీకానికి పాల్పడ్డారు. పంచాయితీ పెద్దల తీర్పుతో బలవంతంగా అతనితో మూత్రం తాగించగా.. ఆ అవమాన భారంతో అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే... సహారాన్పూర్లోని ఇందిరా కాలనీకి చెందిన యువకుడికి ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపిస్తూ స్థానికులు దాడి చేశారు. ఈ క్రమంలో పంచాయితీ పెట్టగా.. పెద్దలు దారుణమైన తీర్పు ఇచ్చారు. మహిళలు అతనితో బలవంతంగా మూత్రాన్ని తాగించారు. ఘటన తర్వాత ఇంటికెళ్లిన ఆ యువకుడు ఆత్మహత్యాయత్నం చేయగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించి కాపాడారు. అసలు ఆ యువతి ఎవరో తనకు తెలీదని.. ఎంత చెబుతున్నా వినకుండా గ్రామస్థులు తనపై దాడి చేశారని అతను చెబుతున్నాడు. తనకు ప్రాణహాని ఉందని చెప్పిన అతను పోలీస్ రక్షణ కోరుతున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు -
పాలన లేని పల్లెలేల..!
సాక్షి, హైదరాబాద్: పల్లెలను ప్రగతి పథంలో నడిపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు గ్రామ పంచాయతీలను పునర్‌వ్యవస్థీకరిస్తామంటోంది. పంచాయతీల అభివృద్ధికి ప్రత్యేక నిధులిస్తామని పేర్కొంటోంది. కానీ పంచాయతీల పాలనలో కీలకమైన గ్రామ కార్యదర్శుల నియామకంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పటికీ 30 శాతం పంచాయతీల్లో కార్యదర్శుల్లేక ఎక్కడి సమస్యలు అక్కడే వెక్కిరిస్తున్నాయి. ప్రణాళిక రూపకల్పన చేసే, పథకాలు అమలు చేసే నాథుడు లేక పనులు కుంటుపడుతున్నాయి. దీనికితోడు తాజాగా 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటు ప్రతిపాదనలతో పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. గ్రామాల అభివృద్ధిపై తీవ్ర ప్రతికూల ప్రభా వం చూపబోతోంది. పన్నెండు వేలకు పెరగనున్న పంచాయతీలు రాష్ట్రంలో 8,684 గ్రామ పంచాయతీలుండగా.. 5,065 గ్రామ కార్యదర్శుల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో పాలన సౌలభ్యం కోసం పంచాయతీలను జనాభా ప్రాతిపదికన 5,500 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 3,519 మంది కార్యదర్శులే పని చేస్తుండటంతో.. క్లస్టర్లతోపాటు కొన్ని గ్రామాల బాధ్యతలనూ అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 4,122 కొత్త పంచాయతీల ఏర్పాటుకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలొచ్చాయి. ప్రతిపాదనలు ఆమోదిస్తే పంచాయతీల సంఖ్య 12,806కు పెరుగుతుంది. దీంతో సగటున 3, 4 గ్రామాలకు ఒకరు చొప్పున కార్యదర్శిగా పనిచేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే గ్రామాల పాలన ఇబ్బందిగా మారుతుంది. ప్రణాళిక రూపకల్పన, పన్నుల వసూలు, నిధుల ఖర్చు తదితరాలపై ప్రభావం పడే అవకాశముంది. దీంతో ప్రతి పంచాయతీకి ఓ కార్యదర్శి ఉంటేనే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని, ఖాళీగా ఉన్న గ్రామ కార్యదర్శుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖలో డిమాండ్ వినిపిస్తోంది. -
3 కేంద్రాల్లో సర్పంచ్ల సమ్మేళనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు కేంద్రాల్లో సర్పంచ్ల సమ్మేళనాలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్) సన్నాహాలు చేస్తోంది. ప్రతి జిల్లా నుంచి 100 మంది సర్పంచ్‌లను ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తున్నారు. వీటిలో ఉత్తమ పంచాయతీలుగా గుర్తింపు పొందిన గ్రామ సర్పంచ్ల అనుభవాలు పంచుకుంటారు. ఈ నెల 23న మహబూబ్‌నగర్‌లో, 27న వరంగల్‌లో, మార్చి 5న నిజామాబాద్‌లో సమ్మేళనాలను నిర్వహించనున్నారు. సమ్మేళనాల్లో పాల్గొనే జిల్లాలివీ.. జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, మే డ్చల్ మల్కాజ్గిరి, నల్లగొండ, రంగారెడ్డి, నాగర్‌కర్నూల్, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల సర్పంచ్ల సమ్మేళనాన్ని మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదా ద్రి భువనగిరి జిల్లాల సమ్మేళనం వరంగల్‌లో జరగనుంది. ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, కొమురంభీం ఆసిఫాబాద్, మం చిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల సమ్మేళనం నిజామాబాద్‌లో నిర్వహించనున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యే ఈ సమ్మేళ నాల్లో ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న టీశాట్ చానల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యక్రమాల ప్రసారాలను ఈ నెల 24న మంత్రి జూపల్లి ప్రారంభించనున్నారు. -
పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లు ఏ కారణంతోనైనా అనర్హతకు గురైతే అప్పిలేట్ అథారిటీగా పంచాయతీలకు ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లో వరుసగా నాలుగోరోజు గురువారం సమావేశమైంది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొందుపరచాలనుకుంటున్న పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటివరకు సర్పంచ్‌లు ఏదైనా కారణంతో అనర్హతకు గురైతే అప్పిలేట్ అథారిటీగా పంచాయతీరాజ్ శాఖ మంత్రే వ్యవహరిస్తున్నారు. అయితే మంత్రిపై రాజకీయ ఒత్తిళ్లు, ఇతర సమస్యలు వస్తున్నాయనే కారణంతో పంచాయతీలకోసం ప్రత్యేకంగా ట్రిబ్యునల్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా మరింత పారదర్శకంగా వ్యవహరించవచ్చని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా ప్రవర్తిస్తే జరిమానా విధించే హక్కును కూడా సర్పంచ్ నేతృత్వంలోని పాలకవర్గానికి కల్పించే అంశంపై చర్చించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలకు అధికారం..: రోడ్లపై చెత్తవేయడం, ఇంట్లోని మురుగునీటిని వీధుల్లోకి వదలడం, రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంవంటి 22 అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారాలను గ్రామ పంచాయతీలకే ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. చట్టాన్ని ఉల్లంఘించే వారికి పంచాయతీ పాలకవర్గమే జరిమానా విధించే అంశంపై చర్చ జరిగింది. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు అక్రమ నిర్మాణాల్లాంటివి చేపడితే వాటిని తొలగించేందుకు అయ్యే ఖర్చును కూడా కారకుల నుండే వసూలు చేసే అంశాన్ని సబ్ కమిటీ పరిశీలిస్తోంది. ఇప్పటివరకు పంచాయతీల్లో ఆడిటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యంగా జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు, దానిని సరిచేసేలా చట్టంలో మార్పులు చేయాలని సూచిస్తున్నారు. పంచాయతీల్లో జరుగుతున్న నిధుల వ్యయం, పన్నుల వసూళ్లు.. లాంటివన్నీ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలనే నిబంధనను చట్టంలో పొందుపరిచే అంశంపైనా సబ్ కమిటీ చర్చించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను నియమించుకోవాలనే అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసింది. సరిగ్గా పనిచేయని కార్యదర్శులను సరెండర్ చేసే అధికారాన్ని పాలకవర్గానికి కట్టబెట్టే దిశగానూ సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, అదనపు అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు పిల్లలున్నా పోటీ అర్హత ఉండాలి: గాంధీ నాయక్ వినతి ముగ్గురు పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హతగా ఉన్న నిబంధనను సవరించాలని గిరిజనాభివృద్ధి సంస్థ చైర్మన్ గాంధీ నాయక్ కోరారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉన్నవారికి స్థానిక సంస్థల్లో పోటీచేయడానికి వీలులేదనే నిబంధనను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. -
పక్కా లోకల్ !
-
గూడెం, తండా.. పంచాయతీలే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సమర్థవంతంగా విధులు నిర్వర్తించేలా, గ్రామాల సమగ్ర అభివృద్ధికి తోడ్పడేలా కొత్త చట్టాన్ని రూపొందించాలని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానించింది. రాజ్యాంగం చెప్పిన విధంగా నిర్ణీత గడువులోగానే గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. కొత్తగా ఎన్నికైన పంచాయతీలు కొత్త చట్టానికి లోబడి పనిచేసేందుకు వీలుగా రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. పరిపాలనలో విశేష అనుభవమున్న అధికారులు, న్యాయ కోవి దులతో సంప్రదించి కొత్త చట్టానికి రూపకల్పన చేసే అధికారాన్ని ముఖ్యమంత్రికి అప్పగించింది. గిరిజన తండాలు, కోయ, గోండు గూడేలను, చెంచు పల్లెలను గ్రామ పంచాయతీలుగా మార్చాలని... ప్రధాన గ్రామానికి దూ రంగా ఉండి పంచాయతీగా లేని పల్లెలను, శివారు గూడేలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రజలకు అత్యుత్తమ సేవలందించేలా మున్సిపాలిటీలను తీర్చిదిద్దడానికి కొత్త మున్సిపల్ చట్టాన్ని కూడా తేవాలని తీర్మానించింది. సోమవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గ భేటీ జరిగింది. మధ్యాహ్నం 3.30 నుంచి రాత్రి 11 వరకు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో.. శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించారు. ఇటీవల జారీ చేసిన పలు ఆర్డినెన్సులను ఆమోదించారు. విప్లవాత్మకంగా కొత్త చట్టం కొత్తగా తెచ్చే పంచాయతీరాజ్ చట్టం విప్లవాత్మకంగా ఉంటుందని కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులతో పాటు వారు నిర్వహించే విధుల విషయంలోనూ స్పష్టత ఇచ్చేలా కొత్త చట్టం రూపొందిస్తామన్నారు. విధులను సక్రమంగా నిర్వర్తించని పంచాయతీలపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉండేలా నిబంధనలు పొందుపరచాలని సీఎం ప్రతిపాదించగా.. మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు క్రమంలో ప్రధాన గ్రామానికున్న దూరాన్ని, శివారు పల్లెల జనాభాను, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని... కొత్త చట్టం ద్వారా గ్రామాల్లో అద్భుతమైన, గుణాత్మకమైన మార్పు రావాలని ముఖ్యమంత్రి సూచించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేసినప్పడు వ్యవహరించినట్టుగానే.. కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసేటప్పుడు కూడా ఉదారంగానే ఉండాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఉద్యోగాల భర్తీకి ఆమోదం వివిధ శాఖల్లో కొత్త ఉద్యోగాల భర్తీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ నుంచి అందిన దాదాపు పన్నెండు ఉద్యోగ సంబంధిత అంశాలను పరిశీలించింది. గతం లో ప్రభుత్వం అనుమతించిన ఉద్యోగాలకు ఆమోదంతోపాటు కొత్తగా మరికొన్ని పోస్టులకు అనుమతి తెలిపింది. బీబీనగర్ నిమ్స్‌కు 800 పోస్టులతోపాటు వైద్య, ఆరోగ్య శాఖలో 850 పోస్టులు, వీటితోపాటు నర్సాపూర్, తిర్మలాయపాలెం, జాఫర్ఘడ్, వీపనగండ్ల, మీర్జాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అప్ గ్రేడ్ చేస్తూ వాటిలో మరో 300 కొత్త ఉద్యోగాలకు మంత్రివర్గం క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో కొనసాగుతున్న భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, నీటిపారుదల ప్రాజెక్టు లు, వాటికి అవసరమైన భూసేకరణ, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పురోగతితో పాటు అసెంబ్లీలో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహంపైనా ఈ సమావేశంలో చర్చించారు. ఇటీవల జారీ చేసిన 8 ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టా దారు పాస్ పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమిం గ్ చట్టం, వ్యాట్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్డినెన్స్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు 65 అంశాలను మంత్రివర్గం చర్చించింది. కాళేశ్వరం మార్పులకు గ్రీన్‌సిగ్నల్ కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జరుగుతున్న మార్పుచేర్పులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మార్పుల కారణంగా సవరించిన అంచనాలకు ఓకే చేసింది. దీంతోపాటు కాళేశ్వరం లింక్–2 పనుల కోసం పంజాబ్ నేషనల్ బ్యాంకు కన్సార్షియం నుంచి రూ.11 వేల కోట్ల రుణం తీసుకుంటూ ఇటీవల తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల పరిధిలో ముంపు, అటవీ ప్రాం తాల కారణంగా చిన్నపాటి మార్పులు జరిగా యి. దీంతో గతంలో నిర్ణయించిన అంచనాల ను స్వల్పంగా పెంచారు. పాత ప్రాణహిత–చేవెళ్ల డిజైన్‌లో మెదక్, రంగారెడ్డి జిల్లాలో చేపట్టిన 4 ప్యాకేజీలను తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. కాళేశ్వరం ప్రాజెక్టును మిషన్ భగీరథకు అనుసంధానించి 31 పట్టణ, స్థానిక సంస్థల పరిధిలోని 9,078 గ్రామీణ ఆవాసాలకు 39.43 టీఎంసీల నీటిని అందించే ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు కేబినెట్ సబ్ కమిటీలు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయడానికి ఆర్అండ్బీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. వ్యవసాయాధికారులను సమర్థంగా వినియోగించుకోవడం, రైతులకు గిట్టుబాటు ధర రావడం కోసం రైతు సమన్వయ సమితులను వినియోగించుకునే పద్ధతులను అధ్యయనం చేసేందుకు వ్యవసాయ మంత్రి పోచారం నేతృత్వంలో మరో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. గ్రామాల అభివృద్ధిపై దృష్టి కేబినెట్ భేటీలో తొలుత శాసనసభ, మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టాల్సిన బిల్లు లు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ జరిగింది. అనంతరం సాయంత్రం 5.30 గంటల నుంచి చివరి వరకు పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు, కొత్త పంచాయతీరాజ్ చట్టం, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, శివా రు పల్లెలకు ప్రత్యేక గ్రామపంచాయతీ హోదా కల్పించడం, గ్రామాలకు నిధులిచ్చి వాటిని అభివృద్ధి చేయడం, గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చడం, వాటికి విధులు నిర్దేశించడం తదితర అంశాలపై మంత్రులు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. 8 ఆర్డినెన్స్ బిల్లులకు ఓకే ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఎనిమిది ఆర్డినెన్స్‌లను బిల్లుల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం, పీడీ చట్టం, గేమింగ్ చట్టం, వ్యాట్, దుకాణాలు – సముదాయాలు, ఆబ్కారీ చట్టాలకు సవరణ, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తదితర ఆర్డినెన్స్‌లు ఇందులో ఉన్నాయి. ఇక వీటితో పాటు 65 అంశాలను మంత్రివర్గం చర్చించింది. -
నిధుల రికవరీకి చర్యలు
- 28 పంచాయతీల్లో సర్‌చార్జీ సర్టిఫికెట్ల జారీ - స్పెషల్ డ్రైవ్‌కు స్పందించని 4 మార్కెట్ కమిటీలు - స్టేట్ ఆడిట్ జిల్లా అధికారిణి శ్యామలా జ్యోతి కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని 28 పంచాయతీల్లో దుర్వినియోగమైన నిధుల రికవరీ కోసం సర్‌చార్జీ సర్టిఫికెట్లు జారీ చేసినట్లు స్టేట్ ఆడిట్ జిల్లా అధికారిణి శ్యామలజ్యోతి తెలిపారు. మంగళవారం ఆమె సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో మాత్రమే ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 28 పంచాయతీలకు సంబంధించి రూ.13.09 లక్షలు దుర్వినియోగమైనట్లు తేలిందన్నారు. ఈ నిధులను తిరిగి రాబట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని కోరడంతో పాటు కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు జిల్లా పరిషత్, జిల్లా గ్రంథాలయ సంస్థ. సైనిక్ వెల్పేర్, ఉపాధి కల్పన సంస్థ, మార్కెట్ కమిటీలు, అఫీషియల్ రిసీవర్, ఈ-సేవలు, రైతుబజార్లలో ఆడిట్ పూర్తయిందన్నారు. నెల రోజులుగా పంచాయతీలు, మండల çపరిషత్‌ల్లో ఆడిట్ చురుగ్గా సాగుతోందన్నారు. మార్కెట్ కమిటీల్లో పేరుకుపోయిన ఆడిట్ అభ్యంతరాలను పరిష్కరించేందుకు ఇటీవలే స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, అయితే ఆత్మకూరు, ఆళ్లగడ్డ, పత్తికొండ, కర్నూలు మార్కెట్ కమిటీలు స్పందించలేదని తెలిపారు. నంద్యాల, ఆదోని, ఆలూరు, కోవెలకుంట్ల, ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీలు మాత్రం స్పందించాయని, పలు అభ్యంతరాలకు జవాబులిచ్చి పరిష్కరించుకున్నారని శ్యామలాజ్యోతి తెలిపారు. -
కుటుంబం కళ్లెదుట రేప్ చేయాలని తీర్పు
పంజాబ్ ప్రావిన్సు, పాకిస్తాన్: అన్నయ్య చేసిన తప్పుకు చెల్లెలి జీవితం బలైంది. ఉమర్ వడ్డా అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం ముజఫరాబాద్ ప్రావిన్సులోని తన స్వగ్రామం రాజ్పూర్ చెందిన ఓ అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె కుటుంబం తమకు న్యాయం చేయాలంటూ గ్రామ పంచాయితీని ఆశ్రయించింది. ఇరువర్గాల వాదనలు విన్న పంచాయితీ పెద్దలు ఉమర్ చెల్లెల్ని ఆమె కుటుంబం చూస్తుండగా రేప్ చేయాలని బాధితురాలి సోదరుడు అష్ఫాక్‌ను ఆదేశించింది. పెద్దల తీర్పును ఉమర్ తల్లిదండ్రులు ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. దీంతో అష్ఫాక్ ఆమె కుటుంబం ముందే బాలిక(16)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కళ్లెదుట కూతురిపై లైంగిక దాడికి పాల్పడుతుంటే ఏమి చేయలేకపోయామని, తప్పు చేసిన వారిని, తీర్పు చెప్పిన వారిని శిక్షించాలంటూ బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు లైంగికదాడులకు పాల్పడిన ఇరువురు వ్యక్తులను అరెస్టు చేశారు. తీర్పు చెప్పిన 30మంది గ్రామపెద్దలపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
ఆదాయం పెరిగినా.. సమస్యలే సమస్తం
- పంచాయతీల దుస్థితి - పన్నుభారం మోపినా అదే పరిస్థితి - పాలకవర్గాలు లేనిచోట మరింత అధ్వానం - పట్టించుకునే నాథుడే కరువు అమలాపురం : పంచాయతీల్లో ఇంటి పన్నుతోపాటు పనిలో పనిగా ఆస్తి విలువ కూడా పెంచిన చంద్రబాబు సర్కారు సామాన్యులపై మోయలేనంత భారం మోపింది. ఇలా పన్నులు పెంచడం ద్వారా పంచాయతీల సాధారణ నిధులు పెరుగుతాయని, చాలావరకు సమస్యలు పరిష్కారమవుతాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారు. తీరా చూస్తే పెంచిన పన్ను మొత్తాన్ని నిలబెట్టి వసూలు చేస్తున్న పంచాయతీ పాలకులు, అధికారులు.. ఆయా గ్రామాల్లో సమస్యల పరిష్కారాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నారు. కోటి రూపాయల ఆదాయం పెరిగిన పంచాయతీల్లో సహితం వేల రూపాయల్లో ఖర్చయ్యే పనులు కూడా చేపట్టడం లేదు. ప్రజారోగ్యానికి కీలకమైన తాగునీటి సరఫరా, మురుగునీటి డ్రైన్ల ఆధునికీకరణ వంటి వాటిని పట్టించుకోవడంలేదు. రోడ్ల గురించైతే చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. గోతులు పడి, కొద్దిపాటి వర్షానికే అవి బురదమయమవుతున్నాయి. చాలా గ్రామాల్లోని శివారు ప్రాంతాల్లో తాగునీరందడంలేదు. విద్యుద్దీపాలు కూడా వెలగక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలను ఆనుకొని ఉన్న పలు గ్రామాల ఆదాయం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు పట్టణాలకన్నా నగరాలను ఆనుకొని ఉన్న పంచాయతీల్లో అపార్ట్మెంట్లు, భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. హైవేలు, ప్రధాన రహదారులకు చేరువలో కమర్షియల్ కాంప్లెక్సులు సహితం ఏర్పాటవుతున్నాయి. దీంతో ఈ పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. విచిత్రంగా ఇక్కడే సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో ఆయా పంచాయతీలను విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం, దీనిని వ్యతిరేకిస్తూ కొంతమంది కోర్టులను ఆశ్రయించడంతో అక్కడ ఎన్నికలు లేకుండా పోయాయి. ఫలితంగా ఆయా పంచాయతీల్లో అధికారుల పాలనే సాగుతోంది. ప్రజల తరఫున ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో సమస్యలు పట్టించుకునేవారే లేకుండా పోయారు. అనపర్తి మేజర్ పంచాయతీ పరిస్థితి కూడా అంతే. వందలు, వేల రూపాయల పన్నులు చెల్లిస్తున్నా సమస్యలు పరిష్కారం కాకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పంచాయతీ చూసినా సమస్యలే.. - రాజమహేంద్రవరం నగరపాలక సంస్థను ఆనుకొని ఉన్న పంచాయతీల ఆదాయం రెండు మూడు రెట్లు పెరిగింది. ప్రస్తుతం నగర విస్తరణ అంతా పంచాయతీల్లోనే సాగుతోంది. ముఖ్యంగా హకుంపేట, ధవళేశ్వరం, బొమ్మూరు, కోలమూరుల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి గణనీయంగా పెరిగింది. ఇంటి పన్నులు పెంచడంతో ›ప్రతి పంచాయతీ ఆదాయం రూ.కోటికి పైగా పెరిగింది. అభివృద్ధి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ప్రధాన డ్రైన్ల నిర్మాణం జరగడం లేదు. దీంతో జనావాసాలను మురుగునీరు ముంచెత్తుతోంది. ఈ పంచాయతీలకు పాలకవర్గం లేదు. నగరంలో విలీన ప్రతిపాదనతో ఈ పంచాయతీలకు ఎన్నికలు లేవు. అధికారుల పాలనలో వీటిల్లో అభివృద్ధి అతీగతి లేకుండా పోయింది. - కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట పంచాయతీ ఆదాయం రూ.3 కోట్లకు చేరింది. ఇంద్రపాలెం, వాకలపూడి, వలసపాకల, తూరంగి పంచాయతీల ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఆదాయంతోపాటు ఈ గ్రామాల్లో సమస్యలు కూడా పెరుగుతున్నా పట్టించుకునేవారే లేరు. రమణయ్యపేటలో డ్రైనేజీ సమస్యల తీవ్రంగా ఉంది. నూతన నిర్మాణాలకు అనుగుణంగా ఇక్కడ డ్రైనేజీలను విస్తరించకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. కొద్దిపాటి వర్షం వస్తే చాలు రహదారులు ముంపునకు గురవుతున్నాయి. - అనపర్తి పంచాయతీకి ప్రస్తుతం పాలకవర్గం లేదు. దీనిని ప్రభుత్వం నగర పంచాయతీగా ప్రకటించగా, వివాదం కోర్టుకు వెళ్లడంతో ఎన్నికలు లేకుండాపోయాయి. ఒకవిధంగా ఇది మున్సిపాలిటీతో సమానం. అధికారుల పాలన పుణ్యమా అని స్థానికుల సమస్యలను పట్టించుకునేవారే లేరు. పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైంది. - సామర్లకోట మండలం వేట్లపాలెంలో పంచాయతీ ఆదాయం గతంలో రూ.52 లక్షలు కాగా, ఇప్పుడు ఆదాయం రూ.1.20 కోట్లు. ఆదాయం రెట్టింపైనా ఇక్కడ డ్రైన్లు, రోడ్లు అధ్వానంగా కనిపిస్తున్నాయి. - అమలాపురం మండలం ఈదరపల్లి పంచాయతీ ఆదాయం రూ.8 లక్షలు కాగా, ఇప్పుడు ఏకంగా ఐదురెట్లు పెరిగి రూ.40 లక్షలు అయ్యింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఇక్కడే ఉన్నాయి. కామనగరువు పంచాయతీ ఆదాయం రెండు రెట్లు పెరిగినా సమస్యలు పరిష్కారం కాలేదు. - జిల్లాలోని కీలకమై గ్రామ పంచాయతీల్లో రావులపాలెం ఒకటి. కోనసీమకు ఒకవిధంగా వాణిజ్య రాజధాని. ఈ పంచాయతీ ఆదాయం రూ.1.24 కోట్లకు పెరిగింది. ఇక్కడ ప్రధాన డ్రైన్, దాని నిర్వహణ తీరు చూస్తే ప్రజలపై పాలకులకు ఏపాటి శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. పట్టణంలో దోమలు పెరిగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. -
బెడిసిన పెద్దల పంచాయితీ
- రెండు రోజుల క్రితం వివాహిత ఆత్మహత్య - రెండు కుటుంబాల మధ్య రాజీతో గుట్టుగా ఖననం - కుమారుడి పేర పొలాన్ని రాసివ్వని భర్త కుటుంబీకులు - పోలీసులను ఆశ్రయించి మృతురాలి బంధువులు - నేడు మృతదేహానికి పోస్టుమార్టం గూడూరు: వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య ఘటనలో పెద్దల పంచాయితీ బెడిసికొట్టింది. భర్త తరపు కుటుంబీకులు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించక పోవడంతో మృతురాలి బంధువులు పోలీసులు ఆశ్రయించారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ పంచాయతీ మజరా గ్రామమైన వై.ఖానాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వై.పవన్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు.. సి.బెళగల్ మండలం కంపాడు గ్రామానికి చెందిన ఉప్పరి మల్లికార్జున, చంద్రకళ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు. పెద్ద కుమార్తె కల్యాణి (20)కి వై.ఖానాపురం గ్రామానికి చెందిన ఊరిమిండి గిడ్డయ్య మనవడు వీరేష్‌తో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాది కుమారుడు ఉన్నాడు. కల్యాణి ప్రస్తుతం మూడు నెలల గర్భిణి. అయితే భార్యాభర్తలు మధ్య మనస్పర్థలతో తరచూ ఘర్షణ పడేవారు. అలాగే భర్త, అత్త, మామ, ఆడపడుచులు వేధింపులకు గురి చేసేవారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కల్యాణి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పంచాయితీలో ఒప్పుకున్నారు.. తర్వాత కాదన్నారు.. కల్యాణి ఆత్మహత్యకు పాల్పడడంతో విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, బంధువులు వై.ఖానాపురానికి వెళ్లి గొడవకు దిగారు. అయితే కొంత మంది పెద్దలు పంచాయితీ చేసి మృతురాలి కుమారుడి పేరు మీద 8 ఎకరాల పొలం రాసి ఇవ్వాలని, నష్టపరిహారంగా ఇచ్చిన కట్నకానుకలకు అదనంగా మరికొంత ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆ మేరకు ఒప్పందం చేసుకున్నారు. అనంతరం దహన సంస్కారాలు చేశారు. అయితే ఒప్పందం మేరకు సోమవారం కుమారుడి పేరున పొలాన్ని రాసివ్వడానికి బాలుడి తండ్రి నిరాకరించడంతో మృతురాలి బంధువులు గొడవకు దిగారు. జరిగిన సంఘటనపై మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటనపై ఎస్ఐ విలేకరులతో మాట్లాడుతూ మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. దర్యాప్తులో భాగంగా తహసీల్దార్ సమక్షంలో మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
వివాహిత, ప్రియున్ని చెట్టుకు కట్టేసి..
పట్నా : వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఇద్దరిని గ్రామస్తులు చితక్కొట్టారు. గ్రామపంచాయితీ ఇచ్చిన ఆదేశాలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ జంటను చెట్టుకు కట్టేసి ఇష్టానుసారంగా కొట్టారు. ఉత్తర బిహార్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బుధవారం ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడితో ఏకాంతంగా వివాహిత ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. 100మంది వరకు గ్రామస్తులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని గోపినాథ్ పుర్ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు దాదాపు 20 గంటల వరకు బంధించారు. ఇద్దరినీ చెట్టుకు కట్టేసి కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు వారిని కాపాడారు. ఈ ఘటనపై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. వివాహిత ఇచ్చిన ఫిర్యాదుతో ఐదుగురు గ్రామస్తులపై, ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు మహిళతోపాటూ ప్రియుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 ఏళ్ల మహిళ తమ పక్క జిల్లా సితామర్హికి చెందిన 27 ఏళ్ల యువకునితో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. వివాహిత తన ప్రియుడితో కలిసి జీవించాలని అనుకుంటున్నానని చెప్పినట్టు డీఎస్పీ క్రిష్ణ మురళి తెలిపారు. ఈ రెండు ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. 8 ఏళ్ల కిందటే వివాహమైనా, గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని సదరు మహిళ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. మహిళ ఫోన్ చేస్తే ఆమె ప్రియుడు గోపీనాథ్‌పుర్ నుంచి సితామర్హికి వచ్చేవాడని పోలీసులు తెలిపారు. -
డీపీఓ కావలెను
- రెండేళ్లుగా ఇన్‌చార్జిలతోనే సరి - గుట్టలుగా పేరుకుపోతున్న ఫైళ్లు - ఏ అనుమతి కావాలన్నా కలెక్టరేట్‌కే.. - 3 నెలలుగా జీతాలు రాక అవస్థలు పడుతున్న కార్మికులు బోట్‌క్లబ్ (కాకినాడ) : పూర్తిస్థాయి జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) లేకపోవడంతో జిల్లాలో గ్రామ పరిపాలన గాడి తప్పుతోంది. ఇక్కడ డీపీఓ పని చేసిన ఆనంద్ 2015 జూలైలో బదిలీ అయ్యారు. అప్పటి నుంచీ ఈ స్థానాన్ని ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. వారు కూడా కార్యాలయానికి సక్రమంగా రాకపోవడంతో ఫైల్స్ పెండింగ్‌లో ఉంటున్నాయి ఇన్చార్జిలను సహితం మారుస్తున్నప్పటికీ పాలన గాడిలో పడడం లేదు. ఆనంద్ బదిలీ తరువాత నుంచి ఇప్పటివరకూ నలుగురు ఇన్చార్జ్ డీపీఓలుగా పని చేశారు. ఆనంద్ బదిలీ అయిన వెంటనే జిల్లా సహకార అధికారి ప్రవీణకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. సుమారు ఆరు నెలల కాలంలో ఆమె ఒక్కసారి కూడా డీపీఓ కార్యాలయంలో అడుగు పెట్టలేదు. దీంతో ఫైల్స్ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. దీనిపై అప్పట్లో ‘ఇన్చార్జి పాలనతో అవస్థలు’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి, అమలాపురం డీఎల్పీఓ శర్మను ఇన్చార్జ్గా నియమించారు. ఆయన సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో ఆరు నెలల తరువాత జెడ్పీ సీఈఓ పద్మకు ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. జిల్లా పరిషత్‌లో పని భారం ఎక్కువగా ఉండడంతో ఆమె కూడా డీపీఓ కార్యాలయంపై దృష్టి సారించలేకపోయారు. దీంతో ఆమెను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించి రంపచోడవరం గిరిజన సంక్షేమ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న టీవీఎస్‌జీ కుమార్‌ను ఇన్చార్జిగా నియమించారు. ఆరు నెలలుగా ఆయన ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పెండింగ్ ఫైళ్లకు మోక్షమెప్పుడో! జిల్లాలోని మేజర్ పంచాయతీలు మినహా మైనర్ పంచాయతీల్లో రెగ్యులర్ సిబ్బంది ఉండరు. దీంతో అక్కడ కాంట్రాక్టు సిబ్బందితో పారిశుద్ధ్యం, ట్యాంకు వాచర్లు, బిల్లు కలెక్టర్ల వంటి పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తారు. వారికి జీతభత్యాలు చెల్లించేందుకు అనుమతి కోరుతూ డీపీఓకు పంచాయతీ కార్యదర్శులు ప్రతి నెలా ఫైల్ పెడతారు. డీపీఓ అనుమతి లేనిదే వారికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇన్చార్జ్ డీపీఓ కావడంతో ప్ర ఫైలునూ కలెక్టర్ అనుమతి కోసం పంపుతున్నారు. కలెక్టర్ కార్యాలయంలో కూడా ఆ ఫైళ్లు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. ఫలితంగా జిల్లాలోని వివిధ పంచాయతీల్లో పని చేస్తున్న 500 మందికి పైగా కాంట్రాక్టు సిబ్బంది మూడు నెలలుగా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. వీరికి ఒక్కొక్కరికి ప్రతి నెలా రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకూ జీతం చెల్లించాలి. తమకు జీతాలు చెల్లించాలని పంచాయతీ అధికారులపై కాంట్రాక్టు సిబ్బంది ఒత్తిడి తీసుకు వస్తున్నారు. దీంతో ఆయా పంచాయతీల కార్యదర్శులు డీపీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఫలితం ఉండడంలేదు. వేరే శాఖ అధికారి వల్ల ఇబ్బందులు జిల్లాలో ఐదుగురు డివిజనల్ పంచాయతీ అధికారులుండగా వారికి కాకుండా వేరే శాఖకు చెందిన వారికి ఇన్చార్జి డీపీఓ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారికి గ్రామ పరిపాలనపై సరైన అవగాహన లేనందువల్లనే ఈ ఇబ్బందులు తలెత్తున్నాయన్నది సిబ్బంది వాదన. రెగ్యులర్ డీపీఓను నియమిస్తే తప్ప తమ ఇబ్బందులు తొలగవని వారంటున్నారు. ప్రస్తుతం కడప డీపీఓగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం జిల్లాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే దీనికి జిల్లాకు చెందిన ఓ మంత్రి, కొందరు ప్రజాప్రతినిధులు మోకాలడ్డుతున్నట్టు సమాచారం. -
పంచాయతీ మైనర్ ... అవినీతిలో మేజర్
- ఓ గ్రామ కార్యదర్శి లీలలు - తొట్టి రిక్షా బయట రూ.10 వేలు ... కొనుగోలు రూ 25 వేలు - రెండు గంటల గ్రామ సభకు రూ 14 వేలు వ్యయమట...! - మూడేళ్లలో రూ.3 కోట్లు దుర్వినియోగమంటూ ఆరోపణలు - నాగులాపల్లి పంచాయితీలో నిధుల దుర్వినియోగం - డీపీఓ విచారణలో లెక్కతేలని రూ.లక్షల నిధులు పిఠాపురం: రూ. 10 వేలు కూడా విలువ చేయని తొట్టి రిక్షా రూ. 25 వేలు ... రెండు గంటల గ్రామ సభకు ఖర్చు రూ.14 వేలు ... వాటర్ ట్యాంక్ క్లీనింగ్‌కు రూ. 2,400...ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ లెక్క చూసినా చుక్కలు కనిపించేలా అందినంతా దోచుకున్నారు కొత్తపల్లి మండలం నాగులాపల్లి పంచాయతీ అధికారులు. ఒక్కరు తప్ప అందరూ మహిళలే ఉన్న పాలకవర్గంగా ఉన్న ఈ పంచాయతీకి గ్రామ కార్యదర్శిగా ఉన్న వరలక్ష్మి అవినీతికి అంతూపొంతూ లేకుండా పోయిందన్న దానికి బయటపడుతున్న వ్యవహారాలే. క్రయ, వ్యయాలకు సంబంధించిన ఏ ఒక్కదానికీ రికార్డులు లేకపోవడం గమనార్హం. ఇదే విషయాన్ని కార్యదర్శిని ప్రశ్నించినా అదే సమాధానం చెబుతుండడంతో విస్తుపోవడం దర్యాప్తు అధికారుల వంతవుతోంది. రూ 3 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారని, తమ సంతకాలను సైతం ఫోర్జరీ చేసి తప్పుడు రికార్డులు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని గ్రామ పంచాయతీ పాలక వర్గం జిల్లా కలెక్టరుకు జిల్లా పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో లోగుట్టు బట్టబయలైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం డీపీఓ టీవీఎస్‌జీ కుమార్ స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. . ఏ పుస్తకం లేని వైనం... పంచాయతీ సర్పంచి సత్యరత్నం, ఉప సర్పంచి సుభాషిణి మరో 12 మంది వార్డు సభ్యులుగా ఉన్న గ్రామ కార్యదర్శి చేసిన అక్రమాలపై డీపీఓ కుమార్ అడిగిన వివరాలేవీ కార్యదర్శి అందజేయలేదు. పంచాయితీకి చెందిన మినిట్స్ బుక్‌తోపాటు ఇతర నిధుల వినియోగంపై రికార్డులను అడగ్గా లేవని ఓసారి, పోలీసులకు ఇచ్చానని మరోసారి, తన దగ్గరే ఉన్నాయని ... కొన్ని పుస్తకాలు కనిపించడం లేదని మరోసారి చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. . పొంతనలేని లెక్కలు... తొట్టిరిక్షా కొనుగోలుకు రూ.25 వేలు, పాత రిక్షా మరమ్మతులకు రూ.25 వేలకుపైగా, వాటర్ ట్యాంకు క్లీనింగ్‌కు రూ. 2,400, దండోరా వేయించడానికి రూ. వేల ఖర్చు, ఒక టెంటు వేసి రెండు గంటలపాటు నిర్వహించే గ్రామ సభకు రూ.14 వేలు ఖర్చయినట్లు రికార్డులు చూపించడం ... ఆ పుస్తకాల్లో కూడా క్రమ పద్ధతిలో కాకుండా ఖాళీ పేజీల్లో ఇరికిండచం ... మధ్య,మధ్యలో వదిలేయడంతో పలు అనుమానాలకు తావుతీస్తోంది. గ్రామ సభలే పెట్టకుండా ఖర్చులు ఎలా చూపించారని దర్యాప్తు అధికారుల ప్రశ్నకు సమాధానం లేదు. సుమారు మూడు గంటలపాటు జరిగిన విచారణలో పలు అవకతవకలు బయటపడగా విచారణ నివేదికలు జిల్లా కలెక్టరుకు అందజేస్తామని డీపీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఎం.నాగలక్ష్మి, ఎంపీడీఓ పీఎన్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి ఎస్సై సత్యనారాయణ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
జీతం మూరెడు.. చాకిరీ బారెడు
నెలలు తరబడి వేతన బకాయిలు సమస్యల నడుమ పంచాయతీ సిబ్బంది జీవితాలు నేడు డీపీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు రంగం సిద్ధం కపిలేశ్వరపురం(మండపేట): చీకటితో లేస్తారు..చీపురుతో ఊరంతా ఊడుస్తారు.. గ్రామస్తులు నిద్ర లేచే సరికి ఊరును అద్దంలా ఉంచుతారు.. వారికి అందుబాటులో తాగునీరును సిద్ధం చేస్తారు.. అధికారులు పర్యటనకు వస్తే ఉరుకులు పరుగులు తీస్తూ మర్యాదలు చేస్తారు.. ప్రభుత్వ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు.. ఇంతటి సేవ చేస్తున్న పంచాయతీ వర్కర్లను ప్రభుత్వం విస్మరిస్తోంది. కనీసం ఇచ్చే అరకొర జీతాన్ని కూడా సకాలంలో ఇవ్వకుండా నెలలు తరబడి బకాయిలు పెడుతోంది. పారిశుద్ధ్య కార్మికులు, ట్యాంక్ వాచ్మెన్, బిల్ కలెక్టర్ తదితర సిబ్బంది పుట్టెడు సమస్యలతో సతమతమవుతున్నారు. సమస్యల సాధన కోసం నేడు కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం ఎదుట ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో 1,100 పంచాయతీలు, ఏడు మున్సిపాలిటీలున్నాయి. వాటి పరిధిలో వేలాది మంది కార్మికులు క్షేత్ర స్థాయిలో విశేష సేలందిస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టు, టెండరు, ఎన్ఎంఆర్ పద్ధతుల్లో పారిశుద్ధ్య, ట్యాంక్ వాచర్, బిల్ కలెక్టరు, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు. వీరి పనిచేస్తున్న ప్రాంతాల్లో వీరి సంఖ్య పరిమితంగా ఉండటంతో ఎక్కువ పనిగంటలు, అధిక పనిభారం మోస్తున్నారు. అరకొర వేతనాలు కార్మికులకు 2014లో జారీ చేసిన జీవో 11 ప్రకారం పంచాయతీ ఆర్థిక వనరులను బట్టి జీతాలిస్తున్నారు. రూ.వెయ్యి నుంచి ఏడు వేలు లోపే చాకిరీకి జీతంగా అందుకుంటున్నారు. 2016 ఆగస్టులో జారీ చేసిన జీవో 151 ప్రకారం స్వీపర్లుకు రూ.12 వేలు, ఇతర కార్మికులకు రూ.17వేలు వరకూ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇచ్చే కొద్దిపాటి జీతం కాస్తా నెలలు తరబడి బకాయి పెడుతున్నారు. ఇంతలో కుటుంబ పోషణ కోసం బయట అప్పులు చేస్తున్నారు. వచ్చే జీతంలో అధిక మొత్తం వడ్డీలకే సరిపోతుందని సిబ్బంది వాపోతున్నారు. రిజిస్టర్లో పేరు లేకుండా వేతనాల చెల్లింపు ఇచ్చే జీతాలు చాలా పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికుని పేరున తీర్మానం చేసి ఇవ్వడం లేదు. కార్మికుల జీతాలు కోసం అంటూ మూకుమ్మడి తీర్మానాలు చేస్తున్నారు. దీంతో కార్మికులకు పంచాయతీలో పని చేస్తున్నట్టు, జీతం తీసుకుంటున్నట్టు ఆధారం లేని పరిస్థితి నెలకొంటుంది. ఈ వేతనాలను కూడా 010 పద్దు పద్ధతిలో చెల్లించాలని కోరుతున్నారు. అమలుకాని డీఎల్పీఓ అత్యవసర ఉత్తర్వులు సమస్యలపై సీఐటీయూ అనుబంధ ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో దీర్ఘకాలంగా ఉద్యమాన్ని చేస్తున్నారు. పలు అంశాలపై రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారి 956/015ఎ నంబరుతో 2015 డిసెంబర్ 16న అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీకల్లా బ్యాంక్ అకౌంట్ ద్వారా వేతనం ఇవ్వమని, వేతనాలు తీర్మానం రాసేటప్పుడు కార్మికుని పేరు ఒక్కాణించి రాయాలని, ఈఎస్ఐ, పీఎఫ్‌లను అమలు చేయాలని, పోస్ట్ శాంక్షన్ ఆర్డర్లు రెన్యువల్‌ను క్రమం తప్పకుండా పై అధికారులకు పంపించాలని, జనశ్రీ బీమా పథకం అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను చాలా పంచాయతీల్లో అమలు చేయడం లేదు. పదోన్నతులు కల్పించాలి క్షేత్రస్థాయిలో వాచ్మెన్, స్వీపరు, ఎలక్ట్రీషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్లానే పంచాయతీరాజ్ శాఖలో కూడా పదోన్నతులివ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో 2008లోని జీవో 30, 2011లోని జీఓ 1866లు ప్రకారం ఐదేళ్ల సర్వీసు ఉండి పది, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన గ్రామ సేవకులకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించారు. అదే పద్ధతిలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న తమను కూడా పంచాయతీ కార్యదర్శులుగా నియమించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమరానికి సన్నద్ధం సమస్యల పరిష్కారానికి పంచాయతీ కార్మికులు సమరానికి సన్నద్ధమవుతున్నారు. మండలస్థాయిలో నిరసన కార్యక్రమాలు అనంతరం కాకినాడ డీపీఓ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. డిమాండ్లు ఇవీ... 2012 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలను కల్పించాలి. జీఓఎంఎస్ 151 ప్రకారం జీతాలు చెల్లించాలని, జీతాలు పెంపుదలకు ఆటంకంగా ఉన్న 30 శాతం నిబంధనను తొలగించాలని, బకాయి జీతాలను వెంటనే చెల్లించాలని, ఎన్ఎంఆర్, కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, కాంట్రాక్టు కార్మికులకు పంచాయతీ పాలకవర్గాలతో సంబంధం లేకుండా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని, హైకోర్టు ఉత్తర్వులు మేరకు టెండర్ విధానాన్ని ఆపాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్, ఇఎస్ఐ, ప్రమాదబీమా సదుపాయాలు కల్పించాలని, డిగ్రీ పూర్తి చేసిన కార్మికులను పంచాయతీ కార్యదర్శిగా నియామకాలు చేపట్టాలని, పర్మినెంట్ కార్మికులకు 010 పద్దు ద్వారా జీతాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. హామీని తుంగలో తొక్కారు పంచాయతీ కార్మికులు ఏళ్ల తరబడి కాంట్రాక్టు, టెండరు, ఎన్ఎంఆర్ పద్దతుల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వారిని రెగ్యులర్ చేస్తామంటూ ఎన్నికల్లో సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. రెండున్నరేళ్లు పాలన పూర్తవుతున్నా హామీ అమలు ఊసెత్తడంలేదు. - నిమ్మకాయల భీమేశ్వరరావు, ఏపీ పంచాయతీ ఎంప్లాయీస్, అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి -
ఇటా.. అటా..
విలీన ‘పంచాయితీ’ - ఎటపాక మండలంలోని ఐదు గ్రామ పంచాయతీలపై గందరగోళం - తమకే దక్కుతాయంటున్న తెలంగాణ ప్రభుత్వం - ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు - సానుకూలంగానే ఉన్న కేంద్రం? నెల్లిపాక : రాష్ట్ర విభజన చిక్కులు ఎటపాక మండలాన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. 21 పంచాయతీలకు ఎటపాకను మండల కేంద్రంగా ప్రకటించడంతోపాటు విలీన మండలాలకు డివిజన్ కేంద్రంగా చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి రెండేళ్లు కావస్తోంది. విభజన జరిగినప్పటి నుంచి నేటివరకూ ఈ ప్రాంతం అనేక సమస్యలతో సతమతమవుతనే ఉంది. కొన్నాళ్ల నుంచి మండల వాసులను మరో సమస్య వెంటాడుతోంది. భద్రాచలం పట్టణానికి సమీపాన ఉన్న ఎటపాక, పిచుకలపాడు, కన్నాయిగూడెం, పురుషోత్తపట్టణం, గుండాల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఐదింటినీ తిరిగి తెలంగాణలో కలపనున్నారనే చర్చ ఇటీవల జోరుగా సాగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,ç ఆ రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు అనేకసార్లు చెప్పారు కూడా. ఈ ఐదు పంచాయతీలూ తెలంగాణలో తిరిగి విలీనం కానున్నాయని, ఇందుకు ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగానే ఉందని చెబుతున్నారు. తెలంగాణ సమస్య ఇదీ.. - ఎటపాక మండలంలోని ఈ ఐదు పంచాయతీలను తెలంగాణ పరిధిలోకి తీసుకురావడం ద్వారానే భద్రాచలం అభివృద్ధి సాధ్యపడుతుందన్నది ఆ రాష్ట్ర పాలకుల అభిప్రాయం. - ఈ ఐదు పంచాయతీల పరిధిలో 20 గ్రామాలున్నాయి. సుమారు 14 వేల ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ గ్రామాల జనాభా 15,041. - భద్రాచలం నుంచి తెలంగాణ ప్రాంతమైన దుమ్ముగూడెం వెళ్లాలంటే పట్టణానికి ఆనుకుని ఉన్న ఏపీలోని ఎటపాక మీదుగా కన్నాయిగూడెం దాటి 8 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఈ మార్గంలో భద్రాచలం నుంచి ఇసుక లారీలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ పరిధిలోని రహదారిపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే తెలంగాణ వాసులకు రహదారి సమస్య తలెత్తనుంది. - అంతేకాకుండా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి చెందిన 900 ఎకరాల భూమి ఈ పంచాయతీల్లో ఒకటైన పురుషోత్తపట్టణంలోనే ఉంది. రాముడు తెలంగాణలో.. ఆస్తులు ఆంధ్రాలో ఉండటం ఆ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందనేది వాదన. - భద్రాచలం పట్టణానికి ఓపక్క గోదావరి నది ఉంది. పట్టణం అభివృద్ధి చెందాలంటే రెండోపక్కనే జరగాలి. కానీ, ఇటువైపు ఉన్న ప్రాంతం ఏపీలో ఉంది. ఇది పట్టణాభివృద్ధికి అవరోధంగా మారింది. - వీటన్నింటి నేపథ్యంలో ఈ ఐదు పంచాయతీలను తిరిగి కలుపుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. ఆంధ్రా సమస్య ఏమిటంటే.. - పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దున ఉన్న అశ్వారావుపేట మండలంలోని అశ్వారావుపేట (కొంత భాగం), నారాయణపురం, గుమ్మడవల్లి, ఆసుపాక, ఊట్లపల్లి గ్రామ పంచాయతీలు తెలంగాణలో ఉన్నాయి. దీనివలన ఏపీకి రహదారి సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. - ఈ కారణంగా ఈ ఐదు పంచాయతీలను ఏపీలో కలుపుకొని, ఎటపాక మండలంలోని ఐదు పంచాయతీలను తెలంగాణకు ఇచ్చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. - మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనమైన కుకునూరు మండలం నుంచి ఐరన్ ఓర్‌ను తరలించాలంటే తెలంగాణలోని ఐదు పంచాయతీల మీదుగానే వెళ్లాలి. అక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తే ఏపీ నుంచి వెళ్లే వాహనాలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. - ఈ కారణాలతో ఏపీ ప్రభుత్వం తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునేవిధంగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. - ఈ సమస్యపై ఈ నెలలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు చెబుతున్నారు. - ఇదే నిజమైతే ఎటపాక మండలం కేంద్రం మళ్లీ నెల్లిపాకగా మారనుంది. - ఇప్పుడిప్పుడే పాలన గాడిలో పడుతుందనుకుంటున్న తరుణంలో ఈ సమస్య ముందుకు రావడంతో పాలన తిరిగి కుంటుపడే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
పన్నుల పెంపుపై లాలాచెరువుకు రాయితీ?
50 శాతమే వసూలు చేయాలన్న కోర్టు! తుది తీర్పును అనుసరించి తదుపరి చర్యలు రాజానగరం : ఇంటి పన్నులను భారీగా పెంచుతూ పంచాయతీ అధికారులు తీసుకున్న నిర్ణయం నుంచి రాజానగరం మండలం, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ వాసులకు కాస్త ఊరట లభించినట్టే. పెంచిన పన్నుల విధానాన్ని సవాల్ చేస్తూ కొంతమంది గ్రామస్తులు మాజీ సర్పంచ్ మెట్ల ఏసుపాదం ఆధ్వర్యంలో హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వారి పిటిష¯ŒSను స్వీకరించిన హైకోర్టు పెంచిన పన్నుల్లో ప్రస్తుతం 50 శాతమే కట్టించుకోవాలని ప్రాథమికంగా సూచించినట్టు కోర్టును ఆశ్రయించిన వారు చెబుతున్నారు. దీంతో కోర్టు నిర్ణయంపై లాలాచెరువు వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూమి విలువ బట్టి పెంపు ఇంటి పన్నుల పెంపు విధానం జిల్లా అంతటా ఒక విధంగా ఉంటే లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాత్రం ప్రత్యేకంగా అమలు చేశారు. పంచాయతీల ఆదాయాన్ని గణనీయంగా పెంచాలనే ఆలోచనలో భాగంగా పెరిగిన ఇంటి పన్నుల విధానంలో సబ్రిజిస్ట్రార్లు ఇచ్చిన భూమి విలువను బట్టి ఇంటి పన్నులను పెంచారు. భూమి విలువపై రూ.వెయ్యికి 13 పైసలు చొప్పున ఇంటి పన్ను లెక్కించి డిమాండ్ నోటీసులు అందజేశారు. లాలాచెరువుకు ప్రత్యేక వడ్డింపు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాత్రం 20 పైసలు చొప్పున లెక్కించి ఇంటి పన్నును నిర్ణయించడంతో సాధారణ ఇంటికి కూడా వేల రూపాయల్లో ఇంటి పన్ను వచ్చింది. మొన్నటి వరకు రాజమహేంద్రవరం మున్నిపల్ కార్పొరేష¯ŒSలో విలీన గ్రామాలుగా ఉన్న రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కోరుకొండ మండలాల్లోని 21 పంచాయతీలపై ప్రత్యేకాధికారిగా ఉన్న నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు లాలాచెరువులో భూమి గజం విలువపై రూ.వెయ్యికి 20 పైసలుగా లెక్కించినట్టు సంబంధిత అధికారి తెలిపారు. ఈ పెంపు విషయంమై స్థానిక ప్రజానీకం ధర్నాలు, ఆందోళనలు, ర్యాలీలు చేపట్టి తమ నిరసనను వ్యక్తం చేశారు. అయినా అధికారుల్లో చలనం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. లాలాచెరువుపైనే ఎందుకో.. జిల్లాలో ఏ పంచా యతీ విషయంలో లేనివిధంగా లాలాచెరువు పంచాయతీపై అధికారులు ఎందుకు ప్రత్యేక దృష్టి సారించారో జనానికి అర్థం కావట్లేదు. జాతీయ రహదారిని ఆనుకుని ఇవతల వైపు ఉన్న లాలాచెరువులో గజం రూ.5000, అవతల ఉన్న దివా¯ŒSచెరువు పంచాయతీ పరిధిలోని ఇండస్ట్రీస్ ఏరియాగా ఉన్న రూపానగర్, స్వరూపానగర్లలో రూ.3000లుగా సబ్‌రిజిస్ట్రార్ భూమి విలువను నిర్ణయించారు. జిల్లా అంతటా గజం విలువపై వెయ్యికి 13 పైసలు చొప్పున ఇంటి పన్ను వేస్తే లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో 20 పైసలు వేశారు. స్థిరమైన మార్గదర్శకాలు లేకుండా ఏవిధంగా ఈ వివక్షను చూపిస్తున్నారో అర్థం కావడం లేదు. అలాగే మా కాలనీలో అన్ని ఇళ్లకు ట్యాప్‌లు ఉన్నాయి. ప్రతి ఇంటి నుంచి వాటర్ టాక్స్ ప్రత్యేకంగా వసూలు చేస్తున్నారు. అయినా ఇంటి పన్నులో మరోసారి వాటర్ టాక్స్ వేశారు. – మెట్ల ఏసుపాదం, మాజీ సర్పంచ్, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ -
అవినీతికి చిరునామా ధవళేశ్వరం పంచాయతీ
కమర్షియల్ కాంప్లెక్స్‌లకు సాధారణ పన్నులు పేదప్రజలపై భారీగా పన్నుల మోత ఇంటి నిర్మాణ అనుమతుల్లోనూ భారీ అవకతవకలు వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి ధవళేశ్వరం : ధవళేశ్వరం పంచాయతీ అవినీతికి చిరునామాగా మారిందని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి విమర్శించారు. పార్టీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి బుధవారం ఆమె ధవళేశ్వరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని అక్కడి అవకతవకలపై కార్యదర్శి టి.శ్రీనివాసరావును నిలదీశారు. పంచాయతీ రికార్డులను పరిశీలించి డెత్ సర్టిఫికేట్ నుంచి ఇంటి పన్నుల వరకు ప్రతి దానిలోనూ అవినీతి పొంగిపొర్లుతోందని ఆరోపించారు. 48మంది పంచాయతీ కార్మికులను చూపిస్తున్నారని వీటిలోనూ భారీ అవకతవకలు జరిగాయన్నారు. లేనివారి పేరిట జీతాలు స్వాహా చేస్తున్నారని ఆమె విమర్శించారు. గ్రామంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఆశ్రమాలు, అపార్ట్మెంట్లు, థియేటర్లు, కాలేజీలు, ఫ్యాక్టరీలకు సాధారణ పన్నులు వేసి ప్రజలపై భారాన్ని వేశారని జక్కంపూడి ఆరోపించారు. కమర్షియల్ పన్నులు పడాల్సిన చోట సాధారణ పన్నులు వేసేందుకు ఎవరి వద్ద నుంచి ఎంతెంత వసూలు చేశారన్న వివరాలు తన వద్ద ఉన్నాయన్నారు. ఏడాదికి 500రూపాయలు కట్టే సామాన్య ప్రజలపై సుమారు 10రెట్లు భారం వేసి రూ.5వేలు వరకు పన్నులు పెంచేశారన్నారు. పంచాయతీ క్యాష్ బుక్‌లో ఫిబ్రవరి వరకే వివరాలు నమోదు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బిల్డింగ్ ప్లాన్లకు సంబంధించి రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌కు ఇచ్చిన నకళ్లకు కార్యాలయంలో ఉన్న వాటికి సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవుట్సోర్సింగ్ సిబ్బందికి ట్రాన్స్ఫర్లు లేనప్పటికీ ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. డెత్ సర్టిఫికేట్లకు సుమారు రూ.వెయ్యి వరకు గుంజుతున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించి సొమ్మును ఇచ్చిన వారిని తీసుకువచ్చి చెప్పించారు. రూ.6వేలు కుళాయి పన్ను వసూలు చేస్తూ రూ.5వేలకు మాత్రమే రశీదు ఇస్తున్నారని ఆరోపించారు. సాల్వెన్సీ సర్టిఫికెట్ కోసం వచ్చిన వారి వద్ద నుంచి కూడా భారీగా సొమ్మును గుంజుతున్నారన్నారు. సీనియర్ ఎమ్మెల్యేనని చెప్పుకునే గోరంట్ల నియోజకవర్గంలోనే భారీ అవినీతి చోటు చేసుకుంటోందన్నారు. ఎన్నికలకు ముందు మూడు నెలల్లో రూరల్ గ్రామాలకు ఎన్నికలు జరిపిస్తామని ఇచ్చిన హామీని తుంగలోకి తోక్కారన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారని జక్కంపూడి విమర్శించారు. జన్మభూమి కమిటీల అవినీతితో వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రూరల్ కో–ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ బిల్డింగ్ ప్లాన్లలో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సుగుణానగర్లో 14శాతం కట్టించుకోవాల్సి ఉన్నప్పటికీ కట్టించుకోకుండా అనుమతులు ఏ విధంగా ఇచ్చారని ప్రశ్నించారు. ధవళేశ్వరం పంచాయతీలో చోటు చేసుకున్న భారీ అవినీతి అక్రమాలపై గురువారం కమిషనర్, సబ్ కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు సాధనాల చంద్రశేఖర్(శివ), గరగ శ్రీనివాసరావు, గోలి దేవకుమార్, షట్టర్ బాషా, దాసరి శివ, పిన్నమరెడ్డి సూర్యచంద్రం, చంటి, ఏజీఆర్ నాయుడు, గునిపె అశోక్, పందిళ్ల భానుప్రసాద్, కేతా సాయి, పుట్టా పరేష్‌నాథ్, సత్యం వెంకటరమణ, బర్రి కామేశ్వరరావు, ప్రశాంత్‌కుమార్, మిరప రమేష్, ఏలీషా జగన్, కపూర్, యర్రంశెట్టి శ్రీరామ్, ఆకుల సూర్యప్రకాష్, తోలేటి రాజా, బలరామ్, మోహన్‌బాబు, పిల్లి కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే వేటు
– జిల్లా పంచాయతీ అధికారిణి బి.పార్వతి కర్నూలు(అర్బన్): ప్రస్తుత వేసవిలో ఈఓఆర్డీ, గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధుల్లో అలసత్వం వహిస్తే వేటు తప్పదని జిల్లా పంచాయతీ అధికారిణి బీ పార్వతి హెచ్చరించారు. గురువారం ఉదయం ఆమె తన చాంబర్లో ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు జిల్లాలోని ఈఓఆర్డీ, పంచాయతీ కార్యదర్శులు తాము పరిచేస్తున్న ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి విధుల్లో ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలు, హ్యాబిటేషన్లలో యుద్ధ ప్రాతిపదికన చలువ పందిళ్లు, చలి వేంద్రాలు ఏర్పాటు చేసి శుద్ధమైన నీటిని అందించాలన్నారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్లు మినహా, ఎట్టి పరిస్థితుల్లోను అద్దె ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేసేందుకు వీలు లేదన్నారు. ఈ మూడు నెలలు గ్రామ స్థాయిలోని సిబ్బంది ఎలాంటి సెలవులు పెట్టకుండా జాగ్రత్తగా పని చేయాలన్నారు. గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘం నిధులను కేవలం మంచినీటి సరఫరాకు ఖర్చు చేయాలన్నారు. ఏప్రెల్ 2వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డీలు పాల్గొనాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా అన్ని గ్రామ పంచాయతీల్లో 100 శాతం పన్నులను వసూలు చేసేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 10 ఎంపీటీసీ, 20 సర్పంచు, 68 వార్డు మెంబర్ల స్థానాల్లో ఎలక్ట్రోల్స్‌ను ఏప్రెల్ 7వ తేదీన ప్రచురించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కర్నూలు, ఆదోని డివిజనల్ పంచాయతీ అధికారులు విజయ్‌కుమార్, ఏలీషా, కార్యాలయ ఏఓ వీరభద్రప్ప పాల్గొన్నారు. -
వేలం పాటల్లో పోటాపోటీ
- 109 మంది పోటీ - పంచాయతీకి పెరిగిన ఆదాయం - గత ఏడాదితో పోల్చితే 30 రెట్లు అధికం దేవనకొండ : పాటదారుల ఆధిపత్య పోరు కారణంగా ఈ ఏడాది పంచాయతీకి పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. పంచాయతీ వేలం పాటలకు 109 మంది పోటాపోటీగా తలపడ్డారు. సోమవారం ఉదయం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆదోని డీఎల్పీఓ ఎలీషా, ఎంపీడీఓ భాస్కర్‌నాయుడు, ఈఓపీఆర్డీ అగస్టీన్, మేజర్ పంచాయతీ సర్పంచు లక్ష్మిదేవమ్మ ఆధ్వర్యంలో పంచాయతీకి చెందిన 17 షాపుల(సముదాయ భవనాలు)కు వేలంపాటలు నిర్వహించారు. మొత్తం 109 మంది పాటదారులు పాల్గొన్నారు. రెండుగ్రూపులకు చెందిన పాటదారులు వేలంపాటలను పెంచుతూ పోయారు. దీంతో పంచాయతీకి ఆదాయం బాగా పెరిగింది. గతేడాదితో పోల్చితే 30 రెట్లు అధికంగా పంచాయతీకి అదాయం సమకూరింది. గతేడాది 17 షాపులకు నెలసరి అద్దె వేలం పాటలు రూ.40 వేలు మాత్రమే పలకగా ఈ ఏడాది అదే షాపులకు రూ.2.23 లక్షలకు పాట పాడారు. దీంతో మొత్తం సంవత్సరానికి రూ.26.77 లక్షల ఆదాయం పంచాయతీకి సమకూరింది. 5వ దుకాణానికి సంబంధించి గతంలో నెలకు రూ.2 వేలు మాత్రమే ధర నిర్ణయించగా, ఈ ఏడాది అదే దుకాణాన్ని నెలకు రూ.60 వేల ప్రకారం పాట పాడారు. ఈ షాపుపై రెండువర్గాలు వేలంపాటల్లో ఆధిపత్యం సాగింది. ఈ ఆధిపత్యం నడుమ దేవనకొండకు చెందిన వెంకటేశ్వర్లు ఆ షాపును దక్కించుకున్నారు. 2వ షాపు నెలకు రూ.20 వేలు చొప్పున పలికింది. ఈ షాపును జయచంద్ర అనే వ్యక్తి దక్కించుకున్నాడు. వేలాలు దక్కించుకున్న పాటదారులు వచ్చేనెల 26వ తేదీలోగా ఆరు నెలల అడ్వాన్స్ చెల్లించాలని ఈఓపీఆర్డీ అగస్టీన్ సూచించారు. -
అందని పింఛన్ డబ్బులు..!
దేవనకొండ: మండలంలోని 12 గ్రామ పంచాయతీలకు శుక్రవారం పింఛన్ డబ్బులు రాలేదు. దీంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండలంలోని చెల్లిచెలిమల, వెలమకూరు, నల్లచెలిమల, కప్పట్రాళ్ల, దేవనకొండతో పాటు మరో 7 పంచాయతీలకు మార్చి నెలకు సంబంధించిన పింఛన్ డబ్బులు బ్యాంకులో జమ కాలేదు. దీంతో 3 వేల మంది పింఛన్ లబ్ధిదారులకు పింఛన్లు అందలేదు. ఉదయాన్నే పంచాయతీ కార్యాలయాలకు ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి వచ్చిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్ డబ్బులు రాలేదని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు. -
తీర్మానం ఒక్కటే... అనుమతులు 65
- లెక్కా పత్రం లేదు – కాతేరు అడ్డగోలుగా దోచేశారు – ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణ అనుమతులు – 65 దరఖాస్తులు ఎక్కడ ఉన్నాయో తెలియని వైనం – నిధుల జమా ఖర్చులు ఇప్పటికీ అప్పగించని సెక్రటరీ సత్యప్రసాద్ – చోద్యం చూస్తున్న పంచాయతీ ఉన్నతాధికారులు తీర్మానం ఒక్కటే...అనుమతులు మాత్రం 65. రాజమహేంద్రవరానికి కూతవేటు దూరంలో ఉన్న కాతేరు పంచాయతీలో లీలలివీ. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.30 కోట్లు నిధులు పక్కదారి పట్టాయని ఇటీవల చేసిన దర్యాప్తులో బట్టబయలయింది. నిధుల్లోనే కాదు ఆదాయం వచ్చే వివిధ మార్గాల్లో దారి కాచి మరీ నిధులు మింగేసిన ఘటనలు బయటపడుతున్నాయి. ఇళ్ల నిర్మాణాలకు వచ్చిన దరఖాస్తులకు అనుమతులిచ్చామని ... ఇవన్నీ ఒకే తీర్మానంతో చేశామని సంబంధితాధికారులు చెబుతుండడంతో విన్నవారు విస్తుపోతున్నారు. ఇక వసూళ్లు చేసిన పన్నులు కూడా స్వాహా చేసి చేతులు దులుపుకున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం రూరల్ మండలం కాతేరు పంచాయతీని అధికారులు, స్థానిక నేతలతో కలిసి అడ్డగోలుగా దోచేసిన వ్యవహారంలో ఇప్పటి వరకూ నిధుల జమా ఖర్చులు చెప్పలేదు. ప్రతి పనినీ నిబంధనలకు విరుద్ధంగా చేసి కోట్ల రూపాయలు జేబుల్లో వేసుకున్నారు. భవన నిర్మాణ అనుమతులు ఎన్ని ఇచ్చారో లెక్కా పత్రం లేదు. ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చారంటే పాలన ఏ విధంగా సాగుతుందో స్పష్టమవుతోంది. రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం, కొరుకొండ మండలాల్లో 21 గ్రామాలను రాజమహేద్రవరం నగరపాలక సంస్థలో కలిపే ప్రతిపాదనలు గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. నగరానికి కూత వేటు దూరంలోనే కాతేరు పంచాయతీ కూడా ఉంది. ఇక్కడ తాజాగా చేసిన ప్రజా సాధికారత సర్వే ప్రకారం 8,900 గృహాలున్నాయి. జనాభా సంఖ్య 30 వేలకు పైగా ఉంది. విలీన ప్రతిపాదన నేపథ్యం, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండడంతో పంచాయతీ పాలక వర్గ ఎన్నికలు నిర్వహించ లేదు. పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో పాలనా వ్యవహారాలు సాగుతున్నాయి. ఇంత పెద్ద పంచాయతీలో ఐదేళ్ల నుంచి పాలక మండలి లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులను అడ్డగోలుగా వాడేసి లెక్కలు కూడా రాయలేదు. ఇంటి, కుళాయి పన్నులు ఇష్టానుసారం వసూలు చేసి సొంతానికి వాడుకున్నారు. కొత్త కుళాయి కనెక్షన్ కోసం రూ.4500 నుంచి రూ.6000 వసూలు చేశారు. ఆ నిధులన్నింటినీ పంచాయతీ జనరల్ ఖాతాకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకున్నారు. గతంలో కాతేరు పంచాయతీగా పని చేసి ప్రస్తుతం రూరల్ మండలంలోనే ఓ పెద్ద పంచాయతీలో పని చేస్తున్న కార్యదర్శి కుళాయి కనెక్షన్ కోసం ఇంటి యజమానుల వద్ద రూ.2,500 వసూలు చేశారు. ఇలా వసూలు చేసిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి మందలించడంతో 70 మందికి రూ.2500 లెక్కన తిరిగి ఇచ్చేశారు. ఇప్పటికీ లెక్కలు చెప్పని సస్పెండైన కార్యదర్శి, ప్రత్యేక అధికారి... పంచాయతీలో కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన నిధులు రూ.1.30 కోట్లు గోల్మాల్ అయ్యాయన్న ఆరోపణలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. ఇందులో అధికంగా తప్పతోవ పట్టినట్టుగా తెలుస్తోంది. ట్రాక్టర్ కొనుగోలు చేసినా ఇప్పటి వరకూ అందుకు సంబంధించిన బిల్లులు పెట్టలేదంటున్నారు. ఈ వ్యవహారం దాదాపు నాలుగు నెలల నుంచి జరుగుతున్నా ఇప్పటి వరకు ఉన్నతాధికారులు పంచాయతీ కార్యదిర్శి నుంచి జమా లెక్కలు స్వాధీనం చేసుకోలేదు. చర్యలు చేపట్టామని చెప్పేందుకు తూతూ మంత్రంగా కార్యదర్శి సత్యప్రసాద్‌ను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుని చోద్యం చూస్తున్నారు. ఇన్చార్జి కార్యదిర్శిగా తొర్రేడు కార్యదర్శిని నియమించి నెలరోజులకుపైగా అవుతున్నా పంచాయతీకి సంబంధించిన రికార్డులు అప్పగించలేదు. సోమవారం రూరల్ మండలంలోని పంచాయతీల పాలనపై కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కాతేరు నిధుల వ్యవహారం చర్చకు వచ్చింది. ఇప్పటి వరకు నిధుల ఖర్చుకు సంబంధించిన రికార్డులు అప్పటి కార్యదర్శి సత్యప్రసాద్ నుంచి ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి డీఎల్పీవో వరప్రసాద్‌ను ప్రశ్నించారు. కార్యదర్శిని సస్పెండ్ చేశామని డీఎల్పీవో బదులివ్వగా అతన్ను పిలిచి రికార్డులు ఎందుకు స్వాధీనం చేసుకోలేదని, నిర్లక్ష్యం తగదని మండిపడ్డారు. ఇంటి ప్లాన్ అనుమతులు, ఆదాయం ఎంత? అన్న వివరాలు కూడా లేకపోవతే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు మాయం... కాతేరు పంచాయతీలో అధికారులు ఇష్టారాజ్యంగా పరిపాలన చేశారనడానికి ఒకే తీర్మానంపై 65 భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడమే ఓ ఉదాహరణని అన్నారు. ఇలా ఇచ్చిన 65 భవన నిర్మాణాలకు సంబంధించిన యజమానుల దరఖాస్తులు మాత్రం మాయమయ్యాయి. ఆ 65 భవనాలు ఎక్కడివో తేల్చే పనిలో ఉన్నతాధికారులు ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ అనుమతులు ఇచ్చారా? ఇస్తే ఆ భవనాలు ఎవరివో విచారణలో తేలనుంది. మెమో జారీ చేస్తున్నాం... సస్పెండైన కార్యదర్శి రికార్డులు అప్పగించాల్సి ఉంది. ఈ విషయం ప్రస్తుత ఇన్చార్జ్ కార్యదర్శి మా దృష్టికి తీసుకొచ్చారు. మిగిలిన రికార్డులు కూడా అప్పగించాల్సిందిగా కార్యదిర్శి సత్యప్రసాద్, ప్రత్యేక అధికారిగా ఉన్న ఈవోపీ ఆర్ అండ్ ఆర్డీలకు మెమో జారీ చేస్తున్నాం. 65 భవన నిర్మాణాలకు సంబంధించిన తీర్మానం పంచాయతీ కార్యాలయంలో ఉంది. కానీ 65 మంది భవన నిర్మాణదారులు దరఖాస్తులు ఉన్నాయో లేదో తెలియదు. ఈ వ్యవహారం ప్రత్యేక అధికారిగా ఉన్న నగరపాలక సంస్థ కమిషనర్ దృష్టిలో ఉంది. – వరప్రసాద్, డీఎల్పీవో, రాజమహేంద్రవరం.