పన్ను ‘పంచాయితీ’
పన్ను ‘పంచాయితీ’
Published Thu, Jan 19 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 1:37 AM
పన్ను వసూలు లక్ష్యం రూ.22కోట్లు
- మార్చి 31 నాటికి ముగియనున్న గడువు
- ఇప్పటి వరకు 10 శాతం కూడా దాటని వసూళ్లు
- గ్రామ పంచాయతీల్లో కొరవడిన ప్రణాళిక
- కరువు నేపథ్యంలో పన్ను చెల్లించలేని పరిస్థితి
కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు గడువు ముంచుకొస్తోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో 2015–16 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఈలోపు జిల్లాలోని 889 గ్రామ పంచాయతీల నుంచి రూ.22 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలనేది లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 10 శాతం కూడా వసూలు కాకపోవడంతో నిర్ణీత సమయంలోగా వంద శాతం వసూలు సాధ్యామా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా పన్ను వసూలుపై పక్కా ప్రణాళికలు లేని కారణంగా నేటి వరకు మెజారిటీ గ్రామ పంచాయతీల్లో పన్ను వసూలులో శ్రద్ధ చూపనట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తగినంత మంది పంచాయతీ కార్యదర్శులు లేని కారణంగా కూడా ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలులో పురోగతి కనిపించనట్లు తెలుస్తోంది. 889 గ్రామ పంచాయతీలకు గాను 460 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరిలో కూడా ఒక్కో పంచాయతీ కార్యదర్శి రెండుకు మించి గ్రామ పంచాయతీలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న కారణంగా పన్నుల వసూలుపై దృష్టి సారించలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామ పంచాయతీల్లో 50 శాతాని కంటే తక్కువ వసూలు చేస్తే సంబంధిత కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అధికారం సంబంధిత ఉన్నతాధికారులకు ఉంది. అలాగే 25 శాతానికంటే తక్కువ వసూలు అయితే సీసీఏ నిబంధనల మేరకు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒక వైపు నిబంధనలు కఠినతరంగా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూలు మందకొడిగా సాగుతోంది. పెద్ద నోట్ల రద్దు.. గ్రామీణ ప్రాంతాల్లో నగదుకు ఏర్పడిన తాత్కాలిక కరువు కూడా పన్నుల వసూలుపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఇంటి, కుళాయి, లైటింగ్, డ్రైనేజీ తదితరాలకు పన్ను వసూలు చేయాల్సి ఉంది. అలాగే పన్నేతరముల కింద కుళాయి ఫీజులు, షాపింంగ్ కాంప్లెక్స్‌ల అద్దెలు, వివిధ మార్కెట్లకు సంబంధించిన వేలాలకు సంబంధించిన మొత్తాలను వసూలు చేయాల్సి ఉంది.
వలసల కారణంగా..
జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రధానంగా పడమటి ప్రాంతాలైన ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లోని మెజారిటీ గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు అధిక శాతం మంది గ్రామాల్లో పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ కారణం వల్ల కూడా ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నులు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమానులతో పాటు కుటుంబ సభ్యులందరూ వలసలు వెళ్లడంతో ఇళ్ల వద్ద ఎవరూ లేని కారణంగా వసూళ్లకు వెళ్లిన వారికి తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి.
చిన్న పంచాయతీల్లో కొంత కష్టమే..
పన్ను వసూళ్లకు సంబంధించి పలు కారణాల వల్ల చిన్న పంచాయతీల్లో కొంత కష్టంగా ఉంటుంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీల్లో నిర్ణీత సమయానికి నూటికి నూరు శాతం వసూలు చేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పన్ను వసూలుపై అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన వసూలు చేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు.
- కె.ఆనంద్, జిల్లా పంచాయతీ అధికారి
Advertisement
Advertisement