drough
-
ఊరెళ్లిపోతోంది!
ఉపాధి లేక వలసబాట పట్టిన 200 కుటుంబాలు నిర్మానుష్యంగా మారిన మీరాపురం గ్రామం బనగానపల్లె: స్థానికంగా పనులు లేక వసల బాట పడుతున్నారు పల్లెజనం. కరువుకు తోడు గత రెండు సంవత్సరాలుగా మైనింగ్ పనులు లేకపోవడంతో మండలంలోని మీరాపురం గ్రామానికి చెందిన సుమారు 200 కుటుంబాలు పిల్లాపాపలతో శుక్రవారం సాయంత్రం గుంటూరు జిల్లాకు బయలుదేరారు. గ్రామం పుట్టినప్పటి చూస్తే అన్ని కుటుంబాలు ఒకేసారి వలస వెళ్లడం మొదటిసారి కావడంతో ఊరు నిర్మానుష్యంగా మారింది. ఇళ్లకు తాళాలు వేసి ఉండటంతో గ్రామం ఖాళీ అయినట్టు కనిపించింది. మైనింగ్ కార్మికులు, వ్యవసాయకూలీలు, రైతులు మూల్లెమూట తలపై పెట్టుకుని వెళ్లేటప్పుడు పలువురి హృదయాలను కలచివేసింది. ప్రభుత్వం స్థానికంగా ఉపాధి కల్పించకపోవడమే వలసకు కారణమని వారు కన్నీళ్లు పెట్టుకున్నారు ఉపాధికి నాడు పుట్టినిళ్లు: గ్రామ సమీపంలోని 150 ఎకరాల మైనింగ్ ప్రాంతం స్థానికులతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపా«ధి కల్పించేది. సుమారు 1000–1500 కూలీలకు ఇక్కడ రోజు ఉపాధి పనులు లభించేవి. రెండు సంవత్సరాల క్రితం ఎద్దుల బిలుకు మైనింగ్ ప్రాంతాన్ని స్థానిక సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం లీజుకు తీసుకొని చుట్టూ కంచె ఏర్పాటు చేసింది. దీంతో నాటి నుంచి కార్మికులకు ఉపాధి కరువైంది. ఇక్కడే ఉపాధి పనులు కల్పించాలని మైనింగ్ కార్మికులు గత రెండు సంవత్సరాలుగా ఆందోళనలు చేశారు. స్పందించిన జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ సమీపంలోని అటవీ శాఖకు చెందిన భూమిలో మైనింగ్ పనులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే, అటవీశాఖ భూమిలో మైనింగ్ పనులు చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆశాఖ అధికారుల అడ్డుకోవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. తర్వాత వారి గోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు వలసబాట పట్టారు. -
పన్ను ‘పంచాయితీ’
పన్ను వసూలు లక్ష్యం రూ.22కోట్లు - మార్చి 31 నాటికి ముగియనున్న గడువు - ఇప్పటి వరకు 10 శాతం కూడా దాటని వసూళ్లు - గ్రామ పంచాయతీల్లో కొరవడిన ప్రణాళిక - కరువు నేపథ్యంలో పన్ను చెల్లించలేని పరిస్థితి కర్నూలు(అర్బన్): గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు గడువు ముంచుకొస్తోంది. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో 2015–16 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఈలోపు జిల్లాలోని 889 గ్రామ పంచాయతీల నుంచి రూ.22 కోట్లు పన్నుల రూపంలో వసూలు చేయాలనేది లక్ష్యం. అయితే ఇప్పటి వరకు 10 శాతం కూడా వసూలు కాకపోవడంతో నిర్ణీత సమయంలోగా వంద శాతం వసూలు సాధ్యామా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. కాగా పన్ను వసూలుపై పక్కా ప్రణాళికలు లేని కారణంగా నేటి వరకు మెజారిటీ గ్రామ పంచాయతీల్లో పన్ను వసూలులో శ్రద్ధ చూపనట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తగినంత మంది పంచాయతీ కార్యదర్శులు లేని కారణంగా కూడా ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలులో పురోగతి కనిపించనట్లు తెలుస్తోంది. 889 గ్రామ పంచాయతీలకు గాను 460 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు పని చేస్తున్నారు. వీరిలో కూడా ఒక్కో పంచాయతీ కార్యదర్శి రెండుకు మించి గ్రామ పంచాయతీలకు ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న కారణంగా పన్నుల వసూలుపై దృష్టి సారించలేక పోతున్నట్లు తెలుస్తోంది. ఆయా గ్రామ పంచాయతీల్లో 50 శాతాని కంటే తక్కువ వసూలు చేస్తే సంబంధిత కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అధికారం సంబంధిత ఉన్నతాధికారులకు ఉంది. అలాగే 25 శాతానికంటే తక్కువ వసూలు అయితే సీసీఏ నిబంధనల మేరకు సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒక వైపు నిబంధనలు కఠినతరంగా ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల వసూలు మందకొడిగా సాగుతోంది. పెద్ద నోట్ల రద్దు.. గ్రామీణ ప్రాంతాల్లో నగదుకు ఏర్పడిన తాత్కాలిక కరువు కూడా పన్నుల వసూలుపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయా గ్రామ పంచాయతీల్లో ఇంటి, కుళాయి, లైటింగ్, డ్రైనేజీ తదితరాలకు పన్ను వసూలు చేయాల్సి ఉంది. అలాగే పన్నేతరముల కింద కుళాయి ఫీజులు, షాపింంగ్ కాంప్లెక్స్‌ల అద్దెలు, వివిధ మార్కెట్లకు సంబంధించిన వేలాలకు సంబంధించిన మొత్తాలను వసూలు చేయాల్సి ఉంది. వలసల కారణంగా.. జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రధానంగా పడమటి ప్రాంతాలైన ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లోని మెజారిటీ గ్రామాల్లోని చిన్న, సన్నకారు రైతులతో పాటు వ్యవసాయ కూలీలు అధిక శాతం మంది గ్రామాల్లో పనుల్లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ కారణం వల్ల కూడా ఆయా గ్రామ పంచాయతీల్లో పన్నులు చెల్లించలేని పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇంటి యజమానులతో పాటు కుటుంబ సభ్యులందరూ వలసలు వెళ్లడంతో ఇళ్ల వద్ద ఎవరూ లేని కారణంగా వసూళ్లకు వెళ్లిన వారికి తాళాలు వేసిన ఇళ్లే దర్శనమిస్తున్నాయి. చిన్న పంచాయతీల్లో కొంత కష్టమే.. పన్ను వసూళ్లకు సంబంధించి పలు కారణాల వల్ల చిన్న పంచాయతీల్లో కొంత కష్టంగా ఉంటుంది. కానీ మేజర్ గ్రామ పంచాయతీల్లో నిర్ణీత సమయానికి నూటికి నూరు శాతం వసూలు చేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. పన్ను వసూలుపై అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక దృష్టి సారించాలని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాం. ఈ నేపథ్యంలోనే త్వరితగతిన వసూలు చేసేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. - కె.ఆనంద్, జిల్లా పంచాయతీ అధికారి -
వరుణుడు రాసిన కరువు శాసనం
– వెన్నాడుతున్న వర్షాభావం – పెరిగిన ఉష్ణోగ్రతలు – ఎండుతున్న పంటలు – ఊసేలేని రెయిన్గన్లు – పెట్టుబడంతా నేలపాలు – అప్పుల ఊబిలో అన్నదాతలు కర్నూలు(అగ్రికల్చర్): ఒకటి కాదు..రెండు కాదు..నెల రోజులుగా వర్షాలు లేవు. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూమిలో తేమ శాతం తగ్గిపోయింది. బోర్లలో నీటి మట్టం పడిపోయింది. కాల్వలకు నీరు విడదల నిలిచిపోయింది. ఆశల పైర్లు ఎండుతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడి మట్టిపాలవుతుండడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు 4.73 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. జూన్, జూలై నెలల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కీలకమైన తరుణమైన ఆగస్టులో చినుకు జాడ కరువైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మిమీ ఉండగా 25 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్లలో రెండు లక్షల హెక్టార్లకు పైగా పంటలు ఎండిపోయాయి. అన్నదాతను ఆదుకునేందుకు రెయిన్గన్ల ప్రతిపాదన వచ్చినా.. అది ప్రకటనలకే పరిమితమైంది. మరోవైపు జిల్లాలో విస్తారంగా పండే ఉల్లి, టమాట ధరలు పడిపోయి.. రైతులురోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు. పెట్టుబడి రూ. 946 కోట్లు.. జిల్లాలో ప్రధానంగా పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న, ఆముదం, మినుము, ఉల్లి, మిరప, కొర్ర తదితర పంటలు సాగు చేశారు. కొర్ర, మొక్కజొన్న, సజ్జలు పొట్ట, కంకి దశలో ఉన్నాయి. కీలకమైన తరుణంలో చినుకు జాడ లేకపోవడంతో కంకి పొట్టదశలోనే ఎండిపోయింది. పొట్ట నుంచి బయటికి వచ్చిన కంకిలో గింజలు లేవు. వేరుశనగ పంట దాదాపు 60 నుంచి 75 రోజుల దశలో ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల చెట్టుకు 2, 3 కాయలు కూడ లేవు. పత్తి పూత, పిందె, కాయ దశలో ఉంది. వర్షాలు లేక తేమ శాతం పడిపోవడంతో పూత మాడిపోయింది. పిందెలు, కాయలు వాడి నేలరాలుతున్నాయి. అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఎకరాకు సగటును రైతులు పెట్టుబడి రూ.20వేలు పెట్టారు. ఈ ప్రకారం పెట్టుబడి రూ.946 కోట్లు పెట్టారు. ఇదంతా మట్టిపాలు అయింది. గత రెండేళ్లుగా కరువుతో పీకల్లోతు కష్టాల్లో మునిగిన రైతులకు ఈ ఏడాది కూడా అదే పరిస్థితులు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంటలకు నిప్పు .. వర్షాలు లేకపోవడం, బోర్లలో నీటి మట్టం పడిపోవడంతో రైతులు పంటలను కాపాడుకోలేకపోతున్నారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే రైతు ఎండిన వరినారును శనివారం తగులపెట్టడం జిల్లాలో కలకలం లేపింది. మూడు ఎకరాల్లో వరిసాగు కోసం వరినారు పోసుకున్నాడు. రెండు బోర్లు ఉన్నా ఉన్నట్టుండి నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో నారుపూర్తిగా ఎండిపోయింది. నారును కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో శనివారం ఎండిన వరినారును తగులపెట్టారు. నల్లరేగడి నేలల్లో వేసిన కొర్ర, పత్తి, మినుము వంటి పంటలు ఎండుతుండటంతో దున్నేసి రబీ సీజన్లో శనగ సాగుకు సిద్ధం అవుతున్నారు. కేసీ కెనాల్, ఎల్ఎల్సీలకు నీళ్లు విడుదల నిలిచిపోవడంతో వరిపంట ఎండిపోతోంది. జిల్లాలో వరి..14వేల హెక్టార్లలో వేయగా, సగం విస్తీరణంలో పంట ఎండిపోయింది. దాదాపు నెల రోజులుగా రెయిన్‌గన్‌లంటూ జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా..ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో ప్రధాన పంటల సాగు ఇలా ఉంది... (హెక్టార్లలో) ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– పత్తి 1,92,248 1,49,744 వేరుశనగ 1,04,237 94,999 కంది 48,228 85,300 మొక్కజొన్న 30,154 22,929 ఉల్లి 20,746 19,147 మిరప 15,576 17,251 ఆముదం 54,406 17,146 వరి 79,018 14,407 మినుము 3,544 11,032 కొర్ర 13,613 10,017 సజ్జ 7,844 8,174 ––––––––––––––––––––––––––––– అన్ని పంటలు 6,21,155 4,73,368 –––––––––––––––––––––––––––––