వరుణుడు రాసిన కరువు శాసనం
వరుణుడు రాసిన కరువు శాసనం
Published Sun, Aug 28 2016 12:21 AM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
– వెన్నాడుతున్న వర్షాభావం
– పెరిగిన ఉష్ణోగ్రతలు
– ఎండుతున్న పంటలు
– ఊసేలేని రెయిన్‌గన్‌లు
– పెట్టుబడంతా నేలపాలు
– అప్పుల ఊబిలో అన్నదాతలు
కర్నూలు(అగ్రికల్చర్): ఒకటి కాదు..రెండు కాదు..నెల రోజులుగా వర్షాలు లేవు. రోజు రోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భూమిలో తేమ శాతం తగ్గిపోయింది. బోర్లలో నీటి మట్టం పడిపోయింది. కాల్వలకు నీరు విడదల నిలిచిపోయింది. ఆశల పైర్లు ఎండుతున్నాయి. వేలాది రూపాయల పెట్టుబడి మట్టిపాలవుతుండడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు 6.21 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు 4.73 లక్షల హెక్టార్లలో పంటలు సాగు అయ్యాయి. జూన్, జూలై నెలల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. కీలకమైన తరుణమైన ఆగస్టులో చినుకు జాడ కరువైంది. ఆగస్టు నెల సాధారణ వర్షపాతం 135 మిమీ ఉండగా 25 మిమీ మాత్రమే నమోదైంది. దీంతో కర్నూలు, ఆదోని రెవెన్యూ డివిజన్‌లలో రెండు లక్షల హెక్టార్లకు పైగా పంటలు ఎండిపోయాయి. అన్నదాతను ఆదుకునేందుకు రెయిన్‌గన్‌ల ప్రతిపాదన వచ్చినా.. అది ప్రకటనలకే పరిమితమైంది. మరోవైపు జిల్లాలో విస్తారంగా పండే ఉల్లి, టమాట ధరలు పడిపోయి.. రైతులురోడ్డెక్కి ఆందోళనలు చేపడుతున్నారు.
పెట్టుబడి రూ. 946 కోట్లు..
జిల్లాలో ప్రధానంగా పత్తి, వేరుశనగ, కంది, మొక్కజొన్న, ఆముదం, మినుము, ఉల్లి, మిరప, కొర్ర తదితర పంటలు సాగు చేశారు. కొర్ర, మొక్కజొన్న, సజ్జలు పొట్ట, కంకి దశలో ఉన్నాయి. కీలకమైన తరుణంలో చినుకు జాడ లేకపోవడంతో కంకి పొట్టదశలోనే ఎండిపోయింది. పొట్ట నుంచి బయటికి వచ్చిన కంకిలో గింజలు లేవు. వేరుశనగ పంట దాదాపు 60 నుంచి 75 రోజుల దశలో ఉంది. వర్షాలు లేకపోవడం వల్ల చెట్టుకు 2, 3 కాయలు కూడ లేవు. పత్తి పూత, పిందె, కాయ దశలో ఉంది. వర్షాలు లేక తేమ శాతం పడిపోవడంతో పూత మాడిపోయింది. పిందెలు, కాయలు వాడి నేలరాలుతున్నాయి. అన్ని పంటల పరిస్థితి ఇలాగే ఉంది. ఎకరాకు సగటును రైతులు పెట్టుబడి రూ.20వేలు పెట్టారు. ఈ ప్రకారం పెట్టుబడి రూ.946 కోట్లు పెట్టారు. ఇదంతా మట్టిపాలు అయింది. గత రెండేళ్లుగా కరువుతో పీకల్లోతు కష్టాల్లో మునిగిన రైతులకు ఈ ఏడాది కూడా అదే పరిస్థితులు కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
పంటలకు నిప్పు ..
వర్షాలు లేకపోవడం, బోర్లలో నీటి మట్టం పడిపోవడంతో రైతులు పంటలను కాపాడుకోలేకపోతున్నారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి అనే రైతు ఎండిన వరినారును శనివారం తగులపెట్టడం జిల్లాలో కలకలం లేపింది. మూడు ఎకరాల్లో వరిసాగు కోసం వరినారు పోసుకున్నాడు. రెండు బోర్లు ఉన్నా ఉన్నట్టుండి నీటి మట్టం పూర్తిగా పడిపోవడంతో నారుపూర్తిగా ఎండిపోయింది. నారును కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో శనివారం ఎండిన వరినారును తగులపెట్టారు. నల్లరేగడి నేలల్లో వేసిన కొర్ర, పత్తి, మినుము వంటి పంటలు ఎండుతుండటంతో దున్నేసి రబీ సీజన్‌లో శనగ సాగుకు సిద్ధం అవుతున్నారు. కేసీ కెనాల్, ఎల్‌ఎల్‌సీలకు నీళ్లు విడుదల నిలిచిపోవడంతో వరిపంట ఎండిపోతోంది. జిల్లాలో వరి..14వేల హెక్టార్లలో వేయగా, సగం విస్తీరణంలో పంట ఎండిపోయింది. దాదాపు నెల రోజులుగా రెయిన్‌గన్‌లంటూ జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా..ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
జిల్లాలో ప్రధాన పంటల సాగు ఇలా ఉంది...
(హెక్టార్లలో)
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
పత్తి 1,92,248 1,49,744
వేరుశనగ 1,04,237 94,999
కంది 48,228 85,300
మొక్కజొన్న 30,154 22,929
ఉల్లి 20,746 19,147
మిరప 15,576 17,251
ఆముదం 54,406 17,146
వరి 79,018 14,407
మినుము 3,544 11,032
కొర్ర 13,613 10,017
సజ్జ 7,844 8,174
–––––––––––––––––––––––––––––
అన్ని పంటలు 6,21,155 4,73,368
–––––––––––––––––––––––––––––
Advertisement