పీల్చిపిప్పి చేస్తున్నాయ్!
పీల్చిపిప్పి చేస్తున్నాయ్!
Published Mon, Aug 28 2017 11:49 PM | Last Updated on Sun, Sep 17 2017 6:03 PM
- పంటలపై పురుగులు, తెగుళ్ల దాడి
-ఎడతెరిపి లేని వర్షాలే కారణం
- పసుపు పచ్చగా మారిన వేరుశనగ
- పత్తిలో తీవ్రమైన ‘గులాబీ’ బెడద
- రైతులకు సలహాలు, సూచనలు కరువు
- పెస్టిసైడ్స్ డీలర్లకు కాసుల పంట
కర్నూలు (అగ్రికల్చర్) : పంటలపై పురుగులు, తెగుళ్లు దండెత్తాయి. ఈ నెల మొదటి నుంచి వర్షాలు పడుతుండటం, పంటలు నీట మునగడం, తేమ ఆరకపోవడం, రోజూ ఆకాశం మేఘావృతం అవుతుండటంతో పురుగులు, తెగుళ్ల ఉధృతి పెరిగింది. వీటి నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 6.36 లక్షల హెక్టార్లు. ఇప్పటి వరకు దాదాపు 4.53 లక్షల హెక్టార్లలో పంటలు వేశారు. ఇవి నెల నుంచి 80 రోజుల దశలో ఉన్నాయి. ఈ నెల ఒకటి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాదాపు అన్ని మండలాల్లో వర్షాలు పడ్డాయి.
వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. మిగిలిన పంటలు నీట మునగకపోయినప్పటికీ పంట పొలాల్లో తేమ మాత్రం ఆరలేదు. దీనివల్ల పంటలకు పురుగులు, తెగుళ్లు ఆశిస్తున్నాయి. వేరుశనగ, కంది, పత్తి, ఉల్లి, మిరప, మొక్కజొన్న తదితర పంటల్లో వేరుకుళ్లు వ్యాప్తి చెంది తీవ్రంగా నష్టపరుస్తోంది. అధిక వర్షాల వల్లనే వేరుకుళ్లు బారిన పడినట్లు అధికారులు చెబుతున్నారు. ఆగస్టు సాధారణ వర్షపాతం 135 మిల్లీమీటర్లు (మి.మీ) ఉండగా.. ఇప్పటికే 169.7 మి.మీ నమోదైంది. అంటే 26 శాతం అధిక వర్షపాతం నమోదు కావడంతో తెగుళ్లు, పురుగుల బెడద పెరగడానికి కారణమవుతోంది. అంతేగాక కలుపు సమస్య కూడా పెరుగుతోంది.
పత్తిలో గులాబీ రంగు పురుగులు
ఇప్పటి వరకు పత్తి 2,18,424 హెక్టార్లలో సాగు చేశారు. పంట పొలాల్లో తేమ శాతం ఎక్కువ కావడంతో గులాబీ రంగు పురుగు తీవ్రమవుతోంది. ముందుగా వేసిన పంట పూత, కాయదశకు చేరుకుంటోంది. దీనికి గులాబీ రంగు పురుగు ఆశించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పురుగు 2015లోనూ పత్తి రైతులను నట్టేట ముంచింది. 2016లో మాత్రం కొంతవరకు తీవ్రత తగ్గింది. ఈసారి మళ్లీ ప్రబలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. అలాగే వేలాది ఎకరాల్లో పంట నీట మునగడంతో వేరుకుళ్లు పెనుసమస్యగా మారింది. దీనికి తోడు లద్దె పురుగుల బెడద కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మెగ్నీషియం లోపం ఏర్పడటంతో పంట ఎదుగూ బొదుగు లేకుండా పోయింది. కంది, ఆముదం, ఉల్లి, మిరప, మొక్కజొన్న, మినుము తదితర పంటల్లోనూ వేరుకుళ్లు సమస్య ఎక్కువగా ఉంది. మిరపలో పైముడత తెగులు కారణంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎర్ర నేలలతో పోలిస్తే నల్లరేగడి నేలల్లో పురుగులు, తెగుళ్ల బెడద ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
పుసుపు పచ్చగా వేరుశనగ
జిల్లాలో ఈసారి 76,215 హెక్టార్లలో వేరుశనగ వేశారు. వర్షాల వల్ల నత్రజని కొట్టుకుపోవడం, ఇనుపధాతు లోపం ఏర్పడటంతో పంట పసుపు పచ్చగా మారింది. ఫలితంగా ఎదుగుదల లోపిస్తోంది. వేరుకుళ్లు తెగులు కూడా సోకడంతో రైతులు నష్టపోతున్నారు.
సలహాలు ఇచ్చే వారేరీ?!
పంటలను పురుగులు, తెగుళ్లు నాశనం చేస్తున్నా రైతులకు తగిన సలహాలు, సూచనలు ఇచ్చే వారు కరువయ్యారు. దీంతో వారు పెస్టిసైడ్స్ డీలర్లను అశ్రయించి వారిచ్చిన మందులు వాడుతూ నష్టపోతున్నారు. దాదాపు 80 శాతం మంది రైతులు డీలర్లు సూచించిన వాటినే వాడుతుండడం గమనార్హం. అవి పనిచేయడం లేదని, తెగులు తీవ్రత మరింత పెరిగిందని పురుగుమందు డీలర్ దగ్గరకు వెళితే.. ‘ఈ మందు వాడు.. బాగా పనిచేస్తుంది’ అంటూ మరొకటి కట్టబెడుతున్నారు. ఇలా పురుగు మందు వ్యాపారుల కాసుల పంట పండుతుండగా.. రైతులకు మాత్రం పెట్టుబడి వ్యయం రెట్టింపవుతోంది.
సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
- నరసింహుడు, ప్రధాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి
అధిక వర్షాలకు నీటమునగడం, తేమ ఆరకపోవడంతో పంటల్లో సమస్యలు పెరిగాయి. ఇది రైతులకు ఆర్థిక నష్టాన్ని కలుగజేస్తున్నాయి. అయితే.. తగిన చర్యలు తీసుకుంటే పంటలను కాపాడుకోవచ్చు. నీట మునిగిన వెంటనే ఆ నీటిని బయటకు పంపే ఏర్పాటు చేయాలి. వేరుకుళ్లు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు కొంత తెరిపిస్తే ఎకరాకు పై పాటుగా 10 నుంచి 15 కిలోల యూరియా చల్లాలి. ఉష్ణోగ్రతలు పెరిగితే సమస్యలు తగ్గుతాయి. పత్తిలో గులాబీ రంగు పురుగు తీవ్రం కాకుండా వేపనూనె 5 ఎం.ఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే గుడ్డు దశలోనే నివారించుకోవచ్చు.
Advertisement
Advertisement