worms
-
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం వస్తువులతో ప్రసాదం తయారీ అవుతోంది.కాగా.. గత నెలలో హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
మాదాపూర్: చికెన్ ఫ్రైలో పురుగులు.. షాకైన కస్టమర్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో తినే ఫుడ్‌లో పురుగులు, బొద్దింకలు, బల్లులు, జెర్రులు రావడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. పరిశుభ్రత పాటించకపోవడంతో రెస్టారెంట్లకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. తాజాగా ఇలాంటి మరో సంఘటన చోటుచేసుకుంది.మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్లో చికెన్ ఫ్రైలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. సైబర్ టవర్ ఎదురుగా ఉన్న హోటల్ నుంచి ఓ కస్టమర్ ఆర్డర్ తెప్పించుకున్నారు. పార్శిల్ ఓపెన్ చేయగానే పురుగులు దర్శనమిచ్చాయి. దీంతో షాక్ తిన్న కస్టమర్ అనిరుధ్ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశారు. రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
'కెల్లాగ్స్ చాకోస్'లో పురుగులు..స్పందించిన కంపెనీ..!
ఇటీవల ఎక్కువగా కెల్లాగ్స్ బ్రాండ్‌కి చెందిని చాకోస్ (కార్న్ ఫ్లాక్స్)ని బ్రేక్ ఫాస్ట్ లేదా స్నాక్ రూపంలో వినియోగిస్తున్నారు. ఇటీవల కాలంలో వీటి వినియోగం బాగా ఎక్కువయ్యింది. ఎందుకంటే? సరిగ్గా తినేందుకు రెడీగా ఏమి అందుబాటులో లేకపోతే ఇది బెస్ట్ ఆప్షన్‌గా పనిచేస్తాయి. పైగా కడుపు నిండిన ఫీల్ ఉండటంతో చిన్నా పెద్దా అంతా వీటినే ఇష్టంగా తింటున్నారు. పైగా ఇవి తృణధాన్యాలకు సంబంధించినవి కూడా కావడంతో మంచి పోషకాలు కూడా లభిస్తాయన్న ఉద్దేశ్యంతో వీటికే ప్రాధాన్యత ఇస్తుంన్నారు. అలాంటి కెల్లాగ్స్ బ్రాండ్ చాకో ఫ్లాక్స్కి సంబంధించిన షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి కెల్లాగ్స్ చాకోస్ని కొనుగోలు చేశానని, తిందామని ఓపెన్ చేయగా ప్రతీదాంట్లో పురుగులు కనిపించాయని చెప్పాడు. అందుకు సంబంధించిన వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేస్తూ "ఎక్స్ట్రా ప్రొటీన్ ఆయా క్యా" అనే క్యాప్షన్ కూడా పెట్టాడు. అలాగే వీడియోలో ఆ ప్రొడక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ డేట్ కూడా మార్చి 2024 అని రాసి ఉన్న ప్రూఫ్‌ని కూడా చూపించాడు. ఐతే సదరు వీడియో నెట్టింట తెగ హల్చల్ చేయడంతో కెల్లాగ్స్ కంపెనీ స్పందించి.." మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. వినియోగదారుల వ్యవహారాల బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందని, సంప్రదించిన వివరాలను పంపించాల్సిందిగా పేర్కొంది". కెల్లాగ్స్ కంపెనీ. కాగా, నెటిజన్లు దయచేసి ఇంట్లో చేసినవే తినండి, తాము కూడా ఇలాంటి చేదు అనుభవాలే ఎదుర్కొన్నామంటూ పోస్టులు పెట్టారు. ఇదిలా ఉంటే ఇలాంటి పరిస్థితే హైదరాబాద్‌కి చెందిన వ్యక్తి కొనుగోలు చేసిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ బార్ విషయంలో ఎదురవ్వడం గమనార్హం. View this post on Instagram A post shared by CUMmentWala (@cummentwala_69) (చదవండి: లండన్ వీధుల్లో లెహెంగాతో హల్చల్ చేసిన మహిళ!) -
National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష
నులిపురుగులు చిన్న సమస్య కాదు. అలాగని పెద్ద సమస్యా కాదు. చిన్న పిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. మన దేశంలో 65 శాతం మంది చిన్నారులు నులిపురుగులతో బాధ పడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నులిపురుగుల మందు వేసే వారు. ఇప్పుడు తల్లులకు వ్యవధి ఉండటం లేదు. కాని తప్పదు జాగ్రత్త. నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెబుతుంటారు. పదేపదే అక్కడ గీరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా ‘కడుపులో నులిపురుగులున్నాయేమో’ అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరుబయలులో విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లల్లో టాయిలెట్లు వాడి ఫ్లష్ చేయడం వల్ల నులి పురుగులను గమనించే అవకాశం లేదు. పెద్దల కంటే పిల్లలకు నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. నులి పురుగులంటే? నులి పురుగులు పేగుల్లో చేరి మన ΄ోషకాలను దొంగిలించి తినే పరాన్న జీవులు. వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘అస్కారియాసిస్’ అంటారు, మన దేశంలోదాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అకలి మందగిస్తుంది. ‘మా పిల్లవాడు ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినడం లేదు’ అని తల్లులు కంప్లయింట్ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరిగా నిద్ర΄ోలేక ఇబ్బంది పడతారు. ఎలా ప్రవేశిస్తాయి? చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా ΄పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత ΄ాటించక΄ోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు. ఏం చేయాలి? ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో అల్బెండజోల్ మాత్రలు వాడాలి. ప్రకృతి వైద్యంలో ఎనిమా ద్వారా కూడా ఈ నులి పురుగుల బెడద తొలగిస్తారు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా కూడా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక ΄ాత్ర ΄ోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాగించడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. బొప్పాయి పండును తినిపించడం, సన్నగా ఉండే ఆవాలను వేయించి ΄పొడిచేసి మజ్జిగలో కలిపి తాగించడం వంటి వాటి ద్వారా నులిపురుగుల బెడదను అధిగమించేలా చేయవచ్చు. అన్నింటికీ మించి వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం అవసరం. -
మహిళ కళ్లల్లో 60కి పైగా సజీవ పురుగులు!
ఇటీవల కాలంలో చాలా అరుదైన ఘటనలు జరుగుతున్నాయి. వైద్యుల సైతం రోగుల స్థితిని చూసి కంగుతింటున్నారు. మొన్నటికి మొన్న స్కానింగ్‌లో పెద్దపేగులో సజీవంగా ఉన్న ఈగను చూసి విస్తుపోయారు. అది మరువకమునుపే చైనాలో మరో వింత ఘటన చోటు చేసుకుంది. వైద్యులు సైతం ఇదేలా సాధ్యం అని షాకయ్యారు.! అసలేం జరిగిందంటే..చైనాకి చెందిన ఓ మహిళ భరించలేని కళ్ల దురదతో బాధపడింది. ఇది సాధారణమైన సమస్యగానే భావించి వైద్యులను సంప్రదించలేదు. ఒక రోజు ఆ బాధను తట్టుకోలేక కళ్లను గట్టిగా నలుపుకుంది. ఇంతలో ఒక పురుగు కిందపడటం చూసి కంగుతింది. దీంతో ఒక్కసారిగా ఆమె తీవ్ర భయాందోళనకులోనై సమీపంలో ఆస్పత్రికి వెళ్లింది. వాళ్లు ఆమె కంటిని పరీక్షించగా కనురెప్పలు, కనుబొమ్మల మధ్య చాలా పురుగులు ఉన్నట్లు గుర్తించి ఆశ్చర్యపోయారు. దీంతో తక్షణమే వాటిని తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు వైద్యులు. ఆమె కుడి కన్ను నుంచి 40కి పైగా సజీవ పురుగులను తీయగా, ఎడమ కన్ను నుంచి 10కి పైగా సజీవ పురుగులను తొలగించారు. మొత్తంగా ఆమె కళ్ల నుంచి దాదాపు 60కి పైగా సజీవ పురుగుల(పరాన్నజీవులు) తొలగించరు. ఇలా అసాధారణ స్థాయిలో పరాన్నజీవులు ఉండటం అనేది చాలా అరుదని. ఇది చాలా అసాధారణమైన కేసు అని డాక్టర్ గువాన్ అన్నారు. ఆమె కంటిలో ఫిలారియోడియా రకానికి చెందిన పరాన్నజీవులు ఉన్నట్లు భావిస్తున్నారు వైద్యులు. ఇవి ఎక్కువగా కుక్కలు, పిల్లలు శరీరాలపై ఉండే లార్వాలని, అవే ఆమెకు సంక్రమించి ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే చాలామంది తమ పెంపుడు జంతువులను తాకి ముద్దు చేసి మళ్లీ ఆ చేతులనే కళ్లను తాకడం, రుద్దడం వంటివి చేస్తారు. అందువల్ల ఆమెకు ఈ వ్యాది సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు వైద్యులు. అలాగే సదరు మహిళను కంటిలో అవశేష లార్వాలు ఏమైనా ఉన్నాయా? లేదా? అని దాని గురించి తరుచుగా చెక్ చేయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అలాగే ఆమెను పెంపుడు జంతువులను తాకితే గనుక వెంటనే కడుక్కోవాలని సూచించారు వైద్యులు. (చదవండి: ఆమె నవయుగ సావిత్రి!) -
ఆకలితో బిర్యానీ కోసం వెళ్తే.. చాలా దారుణంగా..
భద్రాద్రి: ఆకలితో ఉన్న వారు రెస్టారెంట్‌కు వెళ్తే బిర్యానీతో పాటు పెరుగు పురుగులు రావడంతో ఆందోళనకు దిగారు. టేకులపల్లికి చెందిన లక్ష్మణ్‌రావు, సురేశ్, రమేశ్ కొత్తగూడెంలోని ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి పనిముగిశాక కొత్తగూడెం సెవెన్‌హిల్స్ ఏరియాలోని రెస్టారెంట్‌కు వెళ్లారు. ముగ్గురు బిర్యానీ తీసుకుని తినే క్రమాన బిర్యానీతో పాటు పెరుగులోనూ చిన్నచిన్న పురుగులు కనిపించడంతో సిబ్బందిని ప్రశ్నించారు. అయితే, వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో నిలదీశారు. పోలీసులు చేరుకుని వివరాలను సేకరించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి తనిఖీలు చేపట్టారు. -
చైనా ఆకాశం నుంచి పురుగుల వాన.. వీడియో వైరల్..!
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో పురుగుల వాన కురిసిందని ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇందులో రోడ్డుపై ఎటుచూసినా పురుగులే దర్శనమిస్తున్నాయి. ఆకాశం నుంచి కుప్పలుకుప్పలుగా వచ్చి పడుతున్నాయి. కార్లు, ఇతర వాహనాలపై మొత్తం ఇవే నిండిపోయాయి. పురుగులు తమపై పడకుండా చాలా మంది గొడుగులతో కన్పించారు. WATCH 🚨 China citizens told to find shelter after it looked like it started to rain worms pic.twitter.com/otVkuYDwlK — Insider Paper (@TheInsiderPaper) March 10, 2023 అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్టు ఇందుకు సంబంధించి వార్త ప్రచురించింది. వేలి పొడవు, బ్రౌన్ కలర్లో కన్పిస్తున్న ఈ పురుగులు విరక్తి కలిగించేలా ఉన్నాయి. అయితే పురుగుల వానకు కారణం ఏమై ఉంటుందనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. బలమైన ఈదురుగాలుల ధాటికి ఈ పురుగులన్నీ సుడిగాలిలో కొట్టుకుపోయి ఒక్కసారిగా ఆకాశం నుంచి వర్షం రూపంలో పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్వర్క్ తెలిపినట్లు న్యూయార్క్ పోస్టు పేర్కొంది. అయితే ఈ వీడియో ఫేక్ అని చైనా జర్నలిస్టు కొట్టిపారేశాడు. తాను చాలా రోజులుగా బీజింగ్‌లోనే ఉంటున్నానని, అసలు ఇక్కడ వర్షమే కురవలేదని చెప్పాడు. చదవండి: ఇంత బరువున్నావ్.. ఎక్కువ రోజులు బతకవ్.. దెబ్బకు 165 కిలోలు తగ్గాడు.. -
చీమలు పెట్టవు... పాములు ఉండవు!
చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లని సుమతీ శతకకారుడు బద్దెన సెలవిచ్చినా నిజానికి చీమలు పుట్టలను తయారు చేయవు.. పాములూ వాటిని ఆక్రమించి నివసించవు. పుట్టలు చెదపురుగుల ఆవాసాలు. కొన్ని రకాల చీమలు చెదపురుగులను ఆహారంగా తీసుకునే క్రమంలో పుట్టల్లోకి చొరబడతాయి. పాములు, ఇతర సరీసృపాలు రక్షణ కోసం తాత్కాలికంగా పుట్టల్లో తలదాచుకుంటాయి. – (సాక్షి, ఏపీ నెట్వర్క్, ఆత్మకూరు రూరల్) మండు వేసవిలోనూ గది ఉష్ణోగ్రత.. పంట పొలాలు, అడవుల్లో భిన్న ఆకారాల్లో పుట్టలు సాధారణం. పిరమిడ్ ఆకారం, భూమికి కొద్ది ఎత్తులో మట్టి కుప్పల్లా పుట్టలు ఏర్పడుతుంటాయి. పైకి ఎంత ఎత్తులో కనిపిస్తాయో భూగర్భంలోనూ అంతే లోతులో గదులుంటాయి. మండు వేసవైనా, ఎముకలు కొరికే చలి కాలమైనా పుట్టల్లో కచ్చితంగా 24 డిగ్రీల సాధారణ గది ఉష్ణోగ్రత ఉంటుందంటే ఆశ్చర్యం కలగక మానదు. కుండపోత వర్షాలకు సైతం ఒక్క చుక్క నీరు కూడా పుట్టల్లోకి వెళ్లకపోవడం, మట్టితో నిర్మించినవే అయినా కరిగిపోకుండా ఉండటం మరో విశేషం. పుట్టల నిర్మాణంపై శాస్త్రవేత్తలు ఇప్పుడు విస్తృత పరిశోధనలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ.. అడవుల్లో వృక్షాలకు అవసరమైన సేంద్రియ పోషకాలను పుట్టల్లో ఉండే చెద పురుగులే అందిస్తాయి. చెదపురుగులు కీటక విభాగానికి చెందిన జీవులు. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40 వేల జాతులున్నాయి. రాలిపోయిన ఆకులు, పడిపోయిన చెట్ల భాగాలను అత్యంత వేగంగా తింటూ విసర్జకాలను విడుస్తుంటాయి. తద్వారా వృక్షాలకు కంపోస్టు ఎరువు లభ్యమవుతుంది. కొన్ని రకాల వృక్ష జాతుల కణజాలంలోని సెల్యులోజ్‌ను ఆహారంగా తీసుకోవడం ద్వారా వాటిలో పరిమితికి మించి పీచు (ఫైబర్) పదార్థం పెరగకుండా నిరోధిస్తాయి. సరీసృపాలకు రక్షణ దుర్గాలు.. సరీసృపాలైన పాములు, తొండలు, బల్లులు, ఉడుములు తమ సహజ శతృవులు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకునేందుకు మాత్రమే పుట్టల్లో తలదాచుకుంటాయి. ఎలుగుబంట్లు పుట్టలను తవ్వి చెదలను ఆహారంగా తీసుకుంటాయి. ప్రకృతి ఇంజనీరింగ్.. జింబాబ్వే రాజధాని హరారేలో ఓ సంస్థ తన కార్యాలయం, షాపింగ్ మాల్ కోసం నిర్మించిన బహుళ అంతస్థుల భవనంలో సాధారణ ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఎలాంటి విద్యుత్ ఉపకరణాలను వినియోగించకుండా నిర్మాణం పూర్తి చేసింది. సివిల్ ఇంజనీర్ మైక్ పియర్స్ పుట్టలను అధ్యయనం చేసి ప్రకృతి ఇంజనీరింగ్‌ను అనుసరించడంతో ఇది సాధ్యమైంది. భూతాపం, కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు ఇప్పుడు ప్రపంచమంతా ఏసీలు, హీటర్లు అవసరం లేని ఇళ్ల నిర్మాణం వైపు మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో పుట్టల నిర్మాణంలో దాగున్న ప్రకృతి ఇంజనీరింగ్ విధానాలను అధ్యయనం చేస్తున్నారు. పర్యావరణానికి జీవధాతువులు ప్రకృతి పచ్చగా ఉందంటే వృక్షాలే కారణం. ఎవరూ ఎరువులు వేయకుండా అడవుల్లో అపార వృక్ష సంపద విస్తరించటానికి కారణం పుట్టలు, అందులో ఉండే చెద పురుగులే. రాలిన ఆకులు, వృక్ష సంబంధ వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చి తిరిగి చెట్లకు అందించడంలో చెద పురుగులు అద్భుతమైన పాత్ర నిర్వహిస్తున్నాయి. వృక్షాల ఎదుగుదలకు అవసరమైన సూక్ష్మ పోషకాలన్నీ చెద పురుగులు అందించే సేంద్రియ ఎరువుల్లో ఉన్నాయి. – అలెన్ చోంగ్ టెరాన్, డిప్యూటీ డైరెక్టర్, టైగర్ప్రాజెక్టు, ఆత్మకూరు పుట్టలు ధ్వంసం చేయొద్దు పుట్టల్లో పాములుంటాయని చాలామంది అపోహ పడుతుంటారు. పొలం గట్లపై ఉండే పుట్టలను రైతులు ధ్వంసం చేస్తుంటారు. అది సరికాదు. పుట్టల్లో ఉండే చెదలు వ్యర్థాలను సేంద్రియాలుగా మార్చి సాగు భూమిని సారవంతం చేస్తాయి. – విజయకుమార్, డైరెక్టర్, ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ -
‘పురుగులు పడితే’ బతుకుతారు..!
జంతువులు, మనుషులు.. శరీరం ఏదైనా సరే తీవ్రంగా గాయాలై తగిన చికిత్స చేయకపోతే పురుగులు పట్టడం చూస్తూనే ఉంటాం. సాధారణంగా కుళ్లిన, చనిపోయిన మాంసానికే (మృత కణాలకే) పురుగులు పడతాయి. కానీ అదే పురుగులు తీవ్రమైన గాయాలు మానడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే గుర్తించిన ఈ విధానాన్ని వినియోగించడం ఇటీవల మళ్లీ పెరిగింది కూడా. మరి ఈ వివరాలు ఏమిటో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ యాంటీ బయాటిక్స్‌కు లొంగకుండా.. సరైన విధంగా మందులు వాడకపోవడం, పరిశుభ్రత పాటించకపోవడం, చికిత్స అందుబాటులో లేకపోవడం, పలు రకాల అనారోగ్య సమస్యలు వంటివాటి వల్ల గాయాలు మానవు. గాయాల్లో బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది. అవి మరింత తీవ్రమై పుండ్లు పడటం, చీమురావడం, కణాలు చనిపోయి కుళ్లిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతాయి. మరోవైపు పలురకాల బ్యాక్టీరియాలు ఔషధాలకు నిరోధకత (రెసిస్టెన్స్)ను పెంచుకోవడంతో.. చికిత్స చేసినా ఫలితం లేకపోవడం లేదా సుదీర్ఘకాలం పట్టడం జరుగుతోంది. ఈలోగా సమస్య ముదిరి.. ఆ శరీర భాగాలను తొలగించాల్సి రావడంగానీ, ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించి ప్రాణాలు పోగొట్టుకోవడంగానీ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ‘పురుగుల’ చికిత్సతో ఫలితం ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలోనే.. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో కాల్పులు, బాంబు దాడుల్లో లక్షలాది మంది సైనికులు గాయపడ్డారు. యుద్ధ క్షేత్రాల్లో సరైన చికిత్స అందక గాయాలు పుండ్లు పడి, ఇన్ఫెక్షన్లు పెరిగి.. అవయవాలు కోల్పోయినవారు, చనిపోయినవారు ఎందరో. అయితే యుద్ధంలో గాయపడిన ఫ్రెంచ్ సైనికుల్లో కొందరికి గాయాలపై పురుగులు పట్టడం, వారి గాయాలు త్వరగా మాని కోలుకోవడాన్ని వైద్యులు గుర్తించారు. గాయాల్లోని మృత కణాలను ఆ పురుగులు తినేయడం, అదే సమయంలో బ్యాక్టీరియాను హతమార్చే రసాయనాలను విడుదల చేయడమే దీనికి కారణమని తేల్చారు. ఇది తెలిసిన చాలా మంది వైద్యులు సైనికులకు పురుగుల చికిత్స చేశారు. కానీ తర్వాతికాలంలో యాంటీ బయాటిక్స్ రావడం, పురుగుల పట్ల ఏవగింపు వంటివి ఈ చికిత్స మరుగునపడిపోవడానికి కారణమయ్యాయి. పురుగులు ఏం చేస్తాయి? ఈగలు, తేనెటీగలు వంటి ఎగిరే కీటకాలు గుడ్డు నుంచి ఎదిగే క్రమం భిన్నంగా ఉంటుంది. అవి మొదట గుడ్డు నుంచి పురుగుల రూపంలోని లార్వాగా జన్మించి.. తర్వాత పూర్తిస్థాయి కీటకాలుగా మార్పు చెందుతాయి. ఇందులోని లార్వా దశ పురుగులనే గాయాలను మాన్పడానికి వినియోగిస్తారు. ఈ పురుగులు నేరుగా మన మృతకణాలను తినవు. ముందుగా వాటి నోటి నుంచి వివిధ ఎంజైమ్‌లు ఉండే లాలాజలాన్ని (సలైవా) విడుదల చేస్తాయి. ఈ ఎంజైమ్‌లు మృతకణాలను కరిగించి పోషక ద్రవంగా మారుస్తాయి. ఇదే సమయంలో అక్కడ ఉండే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులు కూడా చనిపోయి పోషక ద్రవంగా మారుతాయి. పురుగులు ఈ పోషక ద్రవాన్ని పీల్చుకుని జీవిస్తాయి. మొత్తంగా గాయంపై మృతకణాలు, బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులు నశించడంతో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. మరోవైపు పురుగుల సలైవా వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి చురుగ్గా మారుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనితో సమస్య నుంచి వేగంగా కోలుకున్నట్టు తేల్చారు. ఇంగ్లండ్‌లోని సౌత్‌వేల్స్‌కు చెందిన బయోమోండే సంస్థ ‘గ్రీన్ బాటిల్ బ్లోఫ్లై’ రకం ఈగల లార్వాలను టీబ్యాగ్‌ల తరహాలో ప్యాక్ చేసి అమ్ముతోంది. ఏటా 9 వేల బయోబ్యాగ్లను చికిత్సల కోసం కొంటున్నారని చెబుతోంది. నర్సుల భయమే సమస్యట! సాధారణంగా పురుగులను చూస్తే చాలా మందికి ఒళ్లు జలదరిస్తుంది. కొందరైతే భయంతో కెవ్వున కేకలు కూడా పెడుతుంటారు. ప్రస్తుతం గాయాలకు పురుగుల చికిత్సలోనూ ఇదో సమస్యగా మారిందని ఇంగ్లండ్ వైద్యులు చెప్తున్నారు. చాలా మంది నర్సులు పురుగులను చూసి అసహ్యం, భయం వ్యక్తం చేస్తున్నారని.. ఆ చికిత్స చేయడానికి ముందుకు రావడం లేదని అంటున్నారు. అందువల్ల కొందరు నర్సులకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఈ చికిత్సల్లో వినియోగిస్తున్నామని చెప్తున్నారు. కొన్నాళ్లుగా ఇంగ్లండ్‌లో మళ్లీ వినియోగం గాయాలు, పుండ్లకు చికిత్సలో పురుగుల వినియోగానికి ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ 2004లోనే అధికారికంగా అనుమతి ఇచ్చింది. కొన్నాళ్లుగా ఈ విధానానికి ఆదరణ వస్తోందని, 2009–19 మధ్య ఈ తరహా చికిత్సలు 50శాతం పెరిగాయని ఆ దేశ అధికారులు చెబుతున్నారు. పుళ్లుపడి, చీముపట్టిన గాయాలైనా.. సాధారణంగా గాయాలు తీవ్రమై పుళ్లుపడటం, చీముపట్టడం (గ్యాంగ్రిన్) వంటివి జరిగితే.. అంతమేర ఆపరేషన్ చేసి కండరాన్ని కోసి తీసేయాల్సిందేనని వైద్యులు చెప్తుంటారు. చాలా సందర్భాల్లో ఇలాంటి కారణాలతో కాళ్లు, చేతులు, వేళ్లు వంటివి తొలగించిన ఘటనలూ మనకు కనిపిస్తుంటాయి. అలాంటి తీవ్రమైన గాయాలు కూడా మానిపోయేందుకు పురుగుల చికిత్స తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా గ్యాంగ్రిన్ సమస్యతో 7లక్షల మంది వరకు చనిపోతున్నట్టు అంచనా. వారిలో చాలా మందిని ‘పురుగుల చికిత్స’తో కాపాడవచ్చని అంటున్నారు. ఏదో ఓ పురుగు వేసుకుంటే డేంజర్ పురుగులతో గాయం తగ్గిపోతుందికదా అని ఏదో ఒక పురుగును వేసుకుంటే మొదటికే మోసం వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పురుగులు అంటేనే వివిధ బ్యాక్టీరియాలు, వైరస్లు, సూక్ష్మజీవులకు అడ్డాలు అని.. వాటితో మరిన్ని ఇన్ఫెక్షన్లు సోకుతాయని స్పష్టం చేస్తున్నారు. ఏవైనా ప్రత్యేకమైన ఈగ జాతులకు చెందిన గుడ్లను యాంటీ బ్యాక్టీరియల్ ద్రావణంతో శుద్ధిచేసి, ప్రయోగశాలలో వాటిని పొదిగి.. లార్వా దశకు వచ్చాక గాయాలపై వినియోగించాలని స్పష్టం చేస్తున్నారు. ఈ పురుగులను కూడా గాయాలపై నేరుగా వేయరు. టీబ్యాగ్ తరహా ప్రత్యేకమైన పలుచని రంధ్రాలున్న బయోబ్యాగ్లో వాటిని ఉంచుతారు. ఈ బ్యాగ్‌లను గాయాన్ని తాకేలా పెట్టి.. పైన వదులుగా పట్టీకడతారు. ఇలా రెండు నుంచి నాలుగు రోజులు ఉంచుతారు. -
సేంద్రియ విధానం... కొత్త పురుగు.. పరుగో పరుగు
పిఠాపురం: ‘త్రిప్స్ పార్విస్పైనస్’.. ఇండోనేషియా నుంచి వచ్చిన కొత్త రకం తామర పురుగు. ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో విధ్వంసం సృష్టిస్తోంది. రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిరప, మామిడి, చింత, పత్తి, మునగ, దోస, సొర, క్యాప్సికమ్, బంతి, చామంతి వంటి ఉద్యాన పంటలను చిదిమేస్తోంది. ఈ పురుగు ఉధృతిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ పరిశోధనా సంస్థలు రంగంలోకి దిగి అధ్యయనం చేపట్టాయి. కాగా, ఈ కొత్త పురుగును తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ రైతులు సేంద్రియ విధానాలతో కట్టడి చేస్తున్నారు. గ్రామంలో 650 ఎకరాల్లో మిరప సాగు చేయగా.. సేంద్రియ పద్ధతులు పాటించిన 80 ఎకరాల్లో మిరప చేను కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. దీంతో మిగిలిన రైతులు కూడా సేంద్రియ మందుల వాడకం ప్రారంభించి సత్ఫలితాలు సాధిస్తున్నారు. కుళ్లిన ఉల్లితో కషాయం దుర్గాడ గ్రామంలో కొంత విస్తీర్ణంలో ఉల్లి కూడా పండిస్తుంటారు. ఉల్లి కుళ్లి పోతే పనికి రాదని పారేసేవారు. ఇప్పుడు ఆ కుళ్లిన ఉల్లి మరో పంటకు ప్రాణం పోస్తోంది. కుళ్లిన ఉల్లితో రైతులు కషాయం తయారు చేస్తున్నారు. 70 కేజీల ఉల్లి, 20 కేజీల వేపాకు, 20 కేజీల సీతాఫలం ఆకు, 70 లీటర్ల దేశవాళీ ఆవు మూత్రం, 5 కేజీల ఉమ్మెత్త ఆకు, 4 లీటర్ల నీరు కలిపి 4 గంటలు ఉడకబెట్టి జీవామృతం తయారు చేస్తున్నారు. దీనినుంచి సుమారు 100 నుంచి 110 లీటర్ల జీవామృతం తయారవుతుండగా.. ఎకరానికి 6 లీటర్ల కషాయాన్ని 100 లీటర్ల నీటితో కలిపి మిరప పంటపై పిచికారీ చేస్తుంటే కొత్త పురుగుతోపాటు ఇతర పురుగులు సైతం చనిపోతున్నట్టు రైతులు చెబుతున్నారు. దీనిని వారానికి ఒకసారి చొప్పున మూడు వారాలపాటు పంటకు పిచికారీ చేస్తున్నారు. దీనివల్ల కొత్త తామర పురుగు పూర్తిగా పోతోందని, దెబ్బతిన్న పంట కూడా తిరిగి ఊపిరి పోసుకుంటోందని ఇక్కడి రైతులు చెబుతున్నారు. నాలుగో వారంలో పులియబెట్టిన మజ్జిగ పిచికారీ చేస్తున్నామని, దీనివల్ల పంటకు చల్లదనం వస్తుందని చెబుతున్నారు. దేశవాళీ ఆవు పాలతో తయారైన మజ్జిగ మాత్రమే ఇందుకు ఉపయోగపడుతుందంటున్నారు. కాగా, ఉల్లి కషాయాన్ని పొరుగు రైతులకు లీటరు రూ.30 చొప్పున అమ్ముతున్నారు. కుళ్లిన చేపలతో మీనామృతం మరోవైపు ఇతర చీడపీడల నుంచి రక్షించుకునేందుకు మీనామృతాన్ని ఇక్కడి రైతులు వినియోగిస్తున్నారు. పిండినల్లి, పూత రాలడం వంటి సమస్యకు కుళ్లిన చేపలతో మీనామృతం తయారు చేస్తున్నారు. 70 కేజీల కుళ్లిన చేపలు, 70 కేజీల పాత బెల్లం, 70 లీటర్ల నీరు కలిపి 21 రోజులు ఊరబెడుతున్నారు. ఊరిన తరువాత 10 లీటర్ల నీటికి 100 మిల్లీలీటర్ల మీనామృతం చొప్పున కలిపి పిచికారీ చేస్తున్నారు. మీనామృతంను లీటరు రూ.100కు విక్రయిస్తున్నారు. అల్లం, వెల్లుల్లితో అగ్ని అస్త్రం మరోవైపు రసం తొలిచే పురుగు, గొంగళి పురుగు, కాయ తొలిచే పురుగుల నుంచి కాపాడుకునేందుకు అల్లం, వెల్లుల్లి కషాయాన్ని వినియోగిస్తున్నారు. కేజీ అల్లం, 500 గ్రాముల వెల్లుల్లి, కేజీ పొగాకు, 2 కేజీల వేపాకులను 48 గంటలపాటు నీటిలో నానబెట్టి దానిని మిర్చి పంటలపై పిచికారీ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నట్టు ఇక్కడి రైతులు చెబుతున్నారు. పరిశీలిస్తున్నాం కొత్త పురుగు ఉధృతి ఇటీవల బాగా పెరిగింది. దీనిపై ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సూచనలు, సలహాలు ఇస్తున్నాం. సేంద్రియ మందులతో కొత్త పురుగు ఉధృతి తగ్గినట్టు కనిపిస్తోంది. దుర్గాడలో రైతులు పాటిస్తున్న సేంద్రియ విధానాలపై ఉద్యాన శాస్త్రవేత్తలకు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి నిర్ధారిస్తే సేంద్రియ మందుల తయారీ మరింత పెరిగే అవకాశం ఉంది. – శైలజ, ఉద్యాన అధికారి, పిఠాపురం కొత్త పురుగును తరిమికొడుతున్నారు స్థానిక రైతులు సేంద్రియ పద్ధతులతో కొత్త పురుగును తరిమికొడుతున్నారు. రసాయనక ఎరువులు, మందుల కంటే ఇవి బాగా పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. ఉల్లి కషాయం వాడిన పొలాల్లో మిరప పంట కొత్త పురుగును తట్టుకుని నిలబడింది. అలా వాడిన పొలాల్లో పంట మళ్లీ పుంజుకుంటోంది. – అనంతకుమార్, డిజిటల్ మాస్టర్ ట్రైనర్, ప్రకృతి వ్యవసాయం పరిశీలించి నిర్ధారిస్తాం సేంద్రియ మందుల వినియోగం వల్ల కొత్త పురుగు తగ్గుతున్నట్లు చెబుతున్నారు. అయితే వాటిని పరిశీలించి ఎంతవరకు తగ్గుతుంది, ఎలా పని చేస్తుందనేది నిర్ధారించాల్సి ఉంది. త్వరలో తూర్పు గోదావరి జిల్లా పర్యటించి పంటలను పరిశీలించి నిర్ధారిస్తాం. – శిరీష, ఉద్యాన శాస్త్రవేత్త, గుంటూరు ఉల్లి కషాయం కొత్త పురుగును కట్టడి చేస్తోంది కుళ్లిన ఉల్లి, వేపాకులతో తయారు చేస్తున్న కషాయం కొత్త పురుగును బాగా కట్టడి చేస్తోంది. ఇలా చేయడం వల్ల ఇప్పటివరకు సుమారు 80 ఎకరాల్లో మిర్చి పంటలు కొత్త పురుగును తట్టుకుని నిలబడ్డాయి. దీంతో మిగిలిన రైతులు సేంద్రియ మందులు వాడటం ప్రారంభించారు. సొంతంగా దేశవాళీ ఆవులను పెంచుతూ బారీగా ఉల్లి కషాయం, మీనామృతం, అగ్ని అస్త్రం వంటి మందులు తయారు చేసి స్థానిక రైతులకు అందుబాటులోకి తెస్తున్నాము. దీనివల్ల మా ఏరియాలో కొత్త పురుగు ఉధృతి చాలా వరకు నియంత్రించబడింది. – గుండ్ర శివచక్రం, రైతు, దుర్గాడ -
బాల్యాన్ని ‘నులి’పేస్తోంది..!
పాలమూరు: కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. రక్తహీనత, కడుపునొప్పి వాంతులు శారీరక, మానసిక ఎదుగుదల, ఇతర సమస్యలు ఎదురవుతాయి. ఈ నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లోని 1 నుంచి 19 సంవత్సరాలలోపు ఉండే చిన్నారులకు, యువతీ యువకులకు అల్బెండజోల్ మాత్రలు వేయాల్సి ఉండగా.. ఈ ఏడాది కరోనాతో పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు బంద్ ఉండటంతో ప్రభుత్వం ఈ సారి ఈ కార్యక్రమం చేపట్టడం లేదు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1నుంచి 19ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు 2,71,117 బాలబాలికలు ఉన్నారు. ఇందులో సుమారు లక్ష మంది పిల్లలు రక్తహినత, పోషకాహార లోపంతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. రక్తహీనత ఉన్నవారిలో ఆకలి లేకపోవడం, బలహీనంగా, నీరసంగా, ఆందోళన ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. తరచూ కడుపునొప్పి రావడం జరుగుతుంది. వికారంగా ఉండటం, మలంలో రక్తం వస్తుంది. మాత్రలతో ప్రయోజనాలు : నులి పురుగులను నిర్మూలించడానికి ప్రత్యేకంగా మందులు తీసుకోవడంతో వాటిని పూర్తిగా నాశనం చేస్తే ప్రత్యేక్షంగా రక్తహీనత సమస్య తీరుతుంది. రక్తహీనతను నియంత్రిస్తుంది, రక్తశాతం పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత్త పెరుగుతుంది. పోషకాహార లోపాన్ని నివారిస్తుంది. చిన్నారుల్లో పోషక విలువలు పెరుగుతాయి. పిల్లలు తీసుకునే పోషక, ఆహార పదార్థాలు వారి శరీరానికి సరిగ్గా అందుతాయి. పరోక్షంగా పిల్లల్లో వ్యాధి నిరధోక శక్తి పెరుగుతుంది. ఏకాగ్రత, అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది. ఈ ప్రయోజనాలు సాధించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రతి ఏడాది ఆగస్టు 10న జాతీయ నులిపురుగు నిర్మూలన దినం నిర్వహించాలని నిర్ణయించింది. నులిపురుగు నిర్మూలనకు ఒక్క అల్బెండజోల్ మాత్రను నోట్లో వేసుకొని చప్పరిస్తే చాలని వైద్యులు తెలియజేశారు. కరోనా వైరస్ వ్యాప్తితో చేయడం లేదు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో నులి పురుగు నివారణ దినం చేయడం లేదు. వైరస్ కారణంగా మాత్రల స్టాక్ కూడా రాలేదు. ప్రస్తుతం అన్ని రకాల పాఠశాలలు, కళాశాలలు మూతపడి ఉన్నాయి. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత పిల్లలకు మాత్రలు పంపిణీ చేస్తాం. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్ఓ ♦ అంగన్వాడీ సెంటర్లు 1,185 ♦విద్యార్థులు 43,353 ♦ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,240 ♦విద్యార్థులు 2,02,220 ♦కళాశాలలు 30 ♦విద్యార్థులు 25,544 ♦జిల్లాలో 1 నుంచి 5 ఏళ్ల వారు 49,725 ♦6 నుంచి 9 ఏళ్ల వారు 1,04,567 ♦10 నుంచి 19 ఏళ్ల వారు 1,11,937 ♦బడిబయట చిన్నారులు 4,888 మంది -
థమ్సప్‌లో పురుగులు..
తూర్పుగోదావరి, సీతానగరం: మండలంలోని వెదుళ్లపల్లి ఇసుక ర్యాంపు వద్ద గల షేక్ మహ్మద్ నజీమా థమ్స్ అప్ కూల్‌డ్రింక్ తాగి, అపస్మారకస్థితికి చేరుకుని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యసేవలు పొందుతున్న ఘటన ఇది.(చిన్న జీతం.. పెద్ద మనసు) వివరాల్లోకి వెళితే.. శుక్రవారం వెదుళ్లపల్లి ర్యాంపు వద్ద నజీమా చిన్నపాటి టిఫిన్ హోటల్ ఉంది. అందులో అల్పాహారం వండుతూ అలసిపోయిన ఆమె పక్కనే ఉన్న కూల్ డ్రింక్ షాపు నుంచి అరలీటర్లు థమ్స్ అప్ బాటిల్ తెప్పించుకుంది. బాటిల్ అందుకుని కూల్‌డ్రింక్ తాగుతుండగా దుర్వాసన రావడంతో బాటిల్‌ను పరిశీలించింది. అందులో పురుగులు కనిపించాయి. డ్రింక్ తాగిన నజీమాకు వాంతులు మొదలై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను సీతానగరం బస్టాండ్ వద్దగల శ్రీరమా నర్సింగ్ హోమ్‌లో చేర్చగా, వైద్యసేవలు పొందుతోంది. ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలపడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.(విషం కలిసిన కూల్‌డ్రింక్ తాగిన చిన్నారులు) -
నులి పురుగులకు చెక్
శరీరంలోని పేగుల్లో చేరిన నులిపురుగులకు ఒక్క ఆల్బెండజోల్ మాత్రతో చెక్ పెట్టవచ్చని డాక్టర్లు పేర్కొంటున్నారు. పిల్లల్లో ఎక్కువగా నులిపురుగులు ఉంటాయి. నులిపురుగుల వల్ల రక్తహీనత, నీరసం, కడుపులోనొప్పి కలగడమే కాకుండా విద్యార్థులు చదువులో వెనుకబడిపోయే అవకాశం ఉంది. నులిపురుగులను నివారించి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం అన్ని పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించేందుకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నెల్లూరు(అర్బన్): జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు, బ్రిడ్జి స్కూళ్లు, ఇతర సెంటర్లలో 2 నుంచి 18 ఏళ్ల లోపు వయస్సు గల 6,39,774 మందికి నులిపురుగుల నివారణ మందు ఆల్బెండజోల్ మాత్రలు మింగించేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. సోమవారం రోజు(10వ తేదీన) ఈ మాత్రలను మింగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆ రోజు మాత్రలు వేయించుకోని వారిని గుర్తించి ఈ నెల 17వ తేదీన ఈ మాత్రలను మింగిస్తారు. అలాగే గ్రామాల్లో ఇంటి వద్ద ఉండే పిల్లలకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ మాత్రలు మింగించేలా చర్యలు చేపట్టారు. నులిపురుగులు వ్యాపించే మార్గాలు ♦ కలుషిత ఆహార పదార్థాలు, ఈగలు వాలిన తినుబండారాలు, దుమ్ము, ధూళి పడిన పదార్థాలు తినడం వల్ల నోటి నుంచి పొట్ట, పేగుల్లోకి నులిపురుగులు చేరుతాయి. ♦ బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు లేకుండా మరుగుదొడ్లు వినియోగించడం ద్వారా శరీరంలోనికి నులిపురుగులు చేరుతాయి. ♦ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, వంట సరుకులు శుభ్రమైన నీటితో కడగకపోవడం. ♦ భోజనం వండే వారు, వడ్డించే వారు తినే ముందు, తిన్న తరువాత చేతులను శుభ్రం చేసుకోకపోవడం. ♦ చేతి వేళ్ల గోళ్ల ద్వారా.. ♦ వ్యక్తిగత పరిశుభ్రత లోపించడం ద్వారా.. ♦ ఇంటి పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం, ఆయా ప్రాంతాల్లో పిల్లలు ఆడుకోవడం అక్కడ ఉండే నులిపురుగులు, వాటి లార్వాలు జీర్ణకోశంలోనికి ప్రవేశించడం వల్ల నులిపురుగులు వ్యాప్తి చెందుతాయి. 50 నుంచి 60 శాతం మందికి నులిపురుగులు మన దేశంలో 50 నుంచి 60 శాతం మంది ఏదో ఒక రకం నులిపురుగుల బారినపడి రక్తహీనతకు గురవుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. నులిపురుగుల్లో ప్రధానంగా ఏలిక పాములు, నులిపురుగులు, కొంకి పురుగులు అనే మూడు రకాల వల్లనే ఎక్కువగా రక్తహీనతకు గురవుతున్నారు. మాత్రకు దూరంగా ఉండాల్సిన వారు పూర్తిగా అనారోగ్యంతో ఉన్న వారు కోలుకున్న తరువాతనే ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలి. ఒక సంవత్సరం లోపు వయసున్న వారు, గర్భిణులు, బాలింతలు, కాలేయ వ్యాధిగ్రస్తులు, ఉదర సంబంధ కేన్సర్ ఉన్న వారు, పుట్టుకతో గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారు ఈ మాత్రలు వేసుకోకూడదు. నులిపురుగులతోకలిగే నష్టాలు నులిపురుగులు పేగుల్లోని రక్తాన్ని తాగి తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఫలితంగా రక్తహీనత వస్తుంది. నీరసించి పోతుంటారు. దగ్గు, ఆయాసం రావచ్చు. విద్యార్థి చదువులో ఏకాగ్రత కోల్పోతాడు. బిడ్డ ఎదుగుదల తగ్గిపోతుంది. చర్మంపై ఎర్రని దద్దులు రావచ్చు. బరువు తగ్గిపోతారు. తరచూ కడుపునొప్పి వస్తూ ఉంటుంది. వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం పడడం, తలనొప్పి, ఆకలి తగ్గిపోవడం జరుగుతాయి. నివారణ చర్యలు భోజనానికి ముందు, ఆటలు ఆడిన తరువాత, మలవిసర్జన తరువాత సబ్బుతో 2 నిముషాలు చేతులు శుభ్రం చేసుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 400 మి.గ్రా. మాత్ర ఒక్కటి నోటిలో చప్పరించాలి. లేదా నమిలి మింగాలి. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలల్లో ఈ మాత్రలు ఇస్తారు. ఈ నెల 10వ తేదీన అనగా సోమవారం ఈ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ రోజు మాత్రలు వేయించుకోని వాళ్లను గుర్తించి మరలా ఈ నెల 17వ తేదీన మాత్రలు మింగిస్తారు. -
నులిపేద్దాం!
గద్వాల న్యూటౌన్: నులిపురుగుల సంక్రమణను నిరోధించేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టనుంది. ఈనెల 19న జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 1–19 ఏళ్లలోపు ఉన్న 2,02,763 మందికి అల్బెండజోల్ మాత్రలు వేయించాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఇప్పటికే వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులకు అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ మాత్రలను ఆయా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్‌సీలకు సరఫరా చేశారు. వాస్తవానికి మనిషి పేగుల నుంచి పోషకాలను గ్రహించి వృద్ధిచెందే పరాన్న జీవులే నులిపురుగులు. ముఖ్యంగా పిల్లల్లో ఏలికపాములు, నులి, కొంకి పురుగులుగా ఉంటాయి. ఆరుబయట ఒట్టికాళ్లతో ఆడుకోవడం ద్వారా, చేతులు శుభ్రం చేసుకోకుండా భుజించడం, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, అపరిశుభ్రమైన పరిసరాల వల్ల వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించేందుకు షూ ధరించడం, భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయొద్దు. పండ్లు, కూరగాయలను శుభ్రం చేసి తినాలి. పరిశుభ్రమైన నీటిని తాగాలి. ఆరుబయట మలవిసర్జనకు వెళ్లరాదు. ఆహార పదార్థాలపై మూతలు పెట్టాలి. వీధుల్లో విక్రయించే ఆహారాన్ని భుజించరాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలపై ప్రభావం నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత, పోషకాల లోపం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, బలహీనంగా మారడం, తీవ్రమైన కడుపునొప్పి, విరేచనాలు కలుగుతాయి. దీంతోపాటు శారీరక, మానసిక పెరుగుదల తగ్గిపోతుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గిపోతుంది. అల్బెండజోల్ మాత్రలు వేసుకోవడం ద్వారా వీటిని నిర్మూలించవచ్చు. రక్తహీనతను నియంత్రించడమేగాక వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. మాత్రలు ఇలా ఇవ్వాలి అల్బెండజోల్ మాత్రలు 1–2 ఏళ్లలోపు చిన్నారులకు సగం మాత్రను పొడి చేసి నీటిలో కలిపి తాగించాలి. జబ్బుతో ఉన్న, ఇతర మందులను తీసుకుంటున్న వారికి ఇవ్వరాదు. 2–19 ఏళ్లలోపు వారు మాత్రను చప్పరించి, నమిలి మింగాలి. కాగా, జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో మొదటి, ఆగస్టులో రెండో విడత నిర్వహిస్తారు. మొదటి విడతలో భాగంగా ఈనెల 19న అల్బెండజోల్ మాత్రల పంపిణీకి వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లాస్థాయిలో గత నెల 22న కలెక్టర్ శశాంక అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు. దీనికి ఐసీడీఎస్, విద్యాశాఖ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ తదితర 16 శాఖల అధికారులు హాజరయ్యారు. ఆ తర్వాత ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించి మాత్రలు వేసే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యసిబ్బంది, ఉపాధ్యాయులకు వివరించారు. నులిపురుగుల వల్ల వచ్చే ఇబ్బందులు, నివారణ చర్యలతో కూడిన కరపత్రాలు, వాల్‌పోస్టర్లు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి పది రోజుల క్రితమే చేరాయి. పీహెచ్‌సీల వారీగా వీటిని సరఫరా చేశారు. ఇదిలాఉండగా జిల్లావ్యాప్తంగా 1–19 ఏళ్లలోపు వారికి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల వారీగా గుర్తించారు. బడిబయట ఉన్న పిల్లలను సైతం ఆశా కార్యకర్తలు గుర్తించి అంగన్వాడీ కేంద్రాల్లో వేస్తారు. మిగిలిన వారికి ఈనెల 23న వేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పకడ్బందీగా నిర్వహిస్తాం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినో త్సవం రోజు అల్బెండజోల్ మాత్రల పంపిణీని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశాం. ఈపాటికే 1–19 ఏళ్లలోపు ఉన్న వారిని గుర్తించాం. తల్లిదండ్రులు తప్పక తమ పిల్లలకు ఈ మాత్రలు వేయించాలి. – డాక్టర్ రాజేంద్రకుమార్, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ -
చిరుధాన్యాలకూ ‘కత్తెర’ బెడద!
మొక్కజొన్నకు తీవ్ర నష్టం కలిగిస్తున్న కత్తెర పురుగు (ఫాల్ ఆర్మీవామ్) ఈ రబీ సీజన్లో తొలిసారిగా జొన్నతోపాటు సజ్జ, రాగి, ఊద వంటి చిరుధాన్య పంటలను ఆశించి నష్టం కలిగిస్తోంది. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 30 వేల హెక్టార్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో చిరుధాన్య పంటలు సాగవుతున్నాయి. కర్ణాటకలో గత ఏడాది మే నెలలో మొక్కజొన్న, జొన్న, రాగి పంటలను కత్తెర పురుగు ఆశించింది. అమెరికా, ఆఫ్రికా దేశాల్లో గత కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న, జొన్న, చెరకు, వరి, గోధుమ సహా 27 కుటుంబాలకు చెందిన 100కు పైగా ఆహార పంటలను కత్తెర పురుగు తీవ్రస్థాయిలో ఆశిస్తూ పౌష్టికాహార, ఆహార భద్రతకు ముప్పుగా పరిణమించిన సంగతి తెలిసిందే. మన దేశంలో కర్ణాటకతో ప్రారంభమైన కత్తెర పురుగు ఈ ఏడాది ఇతర రాష్ట్రాలకూ వేగంగా విస్తరించింది. అధిక విస్తీర్ణంలో చిరుధాన్య పంటలు సాగవుతున్న అనేక రాష్ట్రాలకు విస్తరించడం గమనార్హం. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో చిరుధాన్య పంటలను ఈ ఏడాది రబీ సీజన్లో తొలిసారి కత్తెర పురుగు ఆశించినట్లు భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ (ఐ.ఐ.ఎం.ఆర్.) సంచాలకుడు డాక్టర్ తొనపి ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లోని ఐ.ఐ.ఎం.ఆర్. ఆవరణలోని 110 ఎకరాల్లో 9 రకాల చిరుధాన్య పంటలకు సంబంధించి కొన్ని పదుల సంఖ్యలో వంగడాలపై పరిశోధనలు కొనసాగుతూ ఉన్నాయి. వీటిలో దాదాపు అన్ని పంటలనూ ఈ రబీలో తొలిసారి కత్తెర పురుగు సోకిందని, జొన్న, రాగి, సజ్జ, ఊద పంటలపై తీవ్రంగా ఆశించినట్లు డా. తొనపి వివరించారు. ఇవన్నీ ఏక పంటలుగానే సాగువుతుండటం గమనార్హం. అయితే, ఏక దళ పంటలైన చిరుధాన్యాలను ద్విదళ పంటలైన పప్పు ధాన్యాలు, నూనె గింజ పంటలతో మిశ్రమ సేద్యం చేస్తే కత్తెర పురుగు బెడద అంతగా ఉండదని ప్రకృతి వ్యవసాయవేత్తలు చెబుతున్నారు. ఖరీఫ్‌లో స్వల్పం.. రీబీలో తీవ్రం.. ఈ ఏడాది ఖరీఫ్‌లో జొన్న, రాగి, సజ్జ, ఊద తదితర పంటలపై (1–2%) అక్కడక్కడా కనిపించిన కత్తెర పురుగు.. ఈ రబీ పంటకాలంలో తీవ్రంగా ఆశించిందని ఐ.ఐ.ఎం.ఆర్.లో ప్రధాన కీటక శాస్త్రవేత్తలుగా పనిచేస్తున్న డాక్టర్ పి. జి. పద్మజ, డాక్టర్ జి. శ్యాంప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కత్తెర పురుగు లార్వాలు ఆవురావురుమంటూ ఆకులను తినేసి ఈనెలను మాత్రం మిగుల్చుతున్నాయి. ప్రతి మొక్క సుడి(మొవ్వు)లో ఒకటి, రెండు పురుగులు కనిపించాయన్నారు. పరిసర ప్రాంతాల్లో మొక్కజొన్న పంట అందుబాటులో లేకపోవడం కూడా రబీలో చిరుధాన్య పంటలను ఎక్కువగా ఆశించడానికి ఒక కారణమన్నారు. కత్తెర పురుగు యాజమాన్యానికి అనేక విధాల చర్యలు తీసుకున్నందున ఫలితాలు బాగున్నాయని, జొన్న పంటలో నష్టాన్ని 18–40% వరకు తగ్గించగలిగామని వారు వివరించారు. జీవనియంత్రణ, సమగ్ర కీటక యాజమాన్య చర్యలపై అధ్యయనం కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాది నాటికి మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. కత్తెర పురుగు యాజమాన్య చర్యలు కత్తెర పురుగును అదుపు చేయడానికి రైతులు తీసుకోవాల్సిన 7 చర్యలను ఐ.ఐ.ఎం.ఆర్. శాస్త్రవేత్తలు సూచించారు. ► కత్తెర పురుగు గుడ్లను కుప్పలు కుప్పలుగా పెడుతుంది. మొక్కల కాండం, ఆకులపైనే కాకుండా మట్టి పెడ్డల మీద కూడా గుడ్లు పెడుతున్నట్లు గమనించారు. వీటిని రైతులు గుర్తించిన వెంటనే నాశనం చేయాలి. ► పురుగు ఉనికిని గుర్తించడానికి ఎకరానికి 8 లింగాకర్షక బుట్టలు పెట్టాలి. పురుగు తీవ్రంగా ఉంటే ఎకరానికి 24 లింగాకర్షక బుట్టలు అమర్చి, అందులో పడిన పురుగులన్నిటినీ నాశనం చేయాలి. ► ఇసుక పది కేజీలు, 50 గ్రాముల సున్నం కలిపిన మిశ్రమాన్ని మొక్క సుడిలో నిండుగా కూలీలతో వేయించాలి. ఈ మిశ్రమం ఎకరానికి ఎంత అవసరమవుతుందన్నది పంట వయసును బట్టి ఆధారపడి ఉంటుంది. ► కత్తెర పురుగును అదుపు చేయడానికి పంట పొలంలో ట్రైకో కార్డులను ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాల బయోకంట్రోల్ లేబరేటరీలు వీటిని రైతులకు అందుబాటులోకి తెచ్చాయి. ► పురుగు తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు అజాడిరక్టిన్ 5% (వేప నూనె)ను లీటరు నీటికి 0.5 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ► నోమురా రిలేయి అనే శిలీంధ్రాన్ని లీటరు నీటికి 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. ► పురుగు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుమందు కలిపిన వరి తవుడు మిశ్రమాన్ని సుడుల్లో వేయాలి. తవుడు మిశ్రమం తయారీ పద్ధతి తవుడు మిశ్రమం తయారీకి కావాల్సిన పదార్థాలు: 50 కిలోల వరి తవుడు, 4 కిలోల బెల్లం, 8 లీటర్ల నీరు, క్లోరిపైరిఫాస్ 20 ఇ.సి. అర లీటరు. 50 కిలోల వరి తవుడును నేలపై పోసి.. 4 కిలోల బెల్లాన్ని 2 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని చల్లాలి. రెండు లీటర్ల నీటిలో పురుగుమందును తగుమాత్రంగా కలిపి తవుడుపై చల్లాలి. చేతికి రబ్బరు తొడుగులు తొడుక్కొని తవుడు మిశ్రమాన్ని 4 లీటర్ల నీటిని చల్లుతూ బాగా కలపాలి. తవుడు మిశ్రమాన్ని గన్నీ బ్యాగులలో నింపి, రెండు రోజులు పులియబెట్టాలి. ఇలా తయారు చేసుకున్న తవుడు మిశ్రమాన్ని సాయంత్రం వేళల్లో మొక్కల సుడుల్లో వేయండి. లేదా మొక్క పైన చల్లండి. ► పురుగు మరీ తీవ్రమై అదుపు చేయలేని పరిస్థితుల్లో ఆఖరి అస్త్రంగా మాత్రమే రసాయనిక పురుగుమందులు చల్లాలి. ఎమామెక్టిన్ బెంజోట్ 5 ఎస్.జి.ను లీటరు నీటికి 0.4 గ్రాముల చొప్పున లేదా క్లోరోయాంత్రిప్రినోల్ 18.5 మందును లీటరు నీటికి 0.3 ఎం.ఎల్. చొప్పున లేదా ఫ్లుబెండమైడ్ 20% డబ్ల్యూ. జి.ని లీటరు నీటికి 0.4 ఎం.ఎల్. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. హై వాల్యూమ్ స్ప్రేయర్‌ను వాడాలి. మందు మొక్కల సుడుల్లో పడేలా చేయాలి. పురుగు తీవ్రతను బట్టి అవసరమైతే 10–15 రోజుల తర్వాత మరోసారి పిచికారీ చేయాలి. ఇతర వివరాలకు.. ఐ.ఐ.ఎం.ఆర్. ప్రధాన శాస్త్రవేత్తలు, కీటక శాస్త్ర నిపుణులు డా. పి. జి. పద్మజ – 99631 01952, డా. జి. శ్యాంప్రసాద్ – 98664 31157 సంప్రదాయ పద్ధతులే మేలు కత్తెర పురుగు ప్రధానంగా ఆకులను చాలా వేగంగా తినేస్తుంటుంది. ఆ తర్వాత సుడిలో చేరి లేలేత ఆకులను తింటుంది. దీన్ని సంప్రదాయ పద్ధతుల్లో వేప నూనె, ఇసుక +సున్నం మిశ్రమం, తవుడు మిశ్రమం వంటివి వాడుతూ అదుపు చేయడమే ఉత్తమం. కత్తెర పురుగు తీవ్రస్థాయిలో ఆశించిన పక్షంలో ఆఖరి అస్త్రంగా మాత్రమే ఒకటి, రెండు సార్లు పురుగుమందులు వాడాలి. మొదటి నుంచే రసాయనిక పురుగుమందులు వాడితే పురుగు వాటికి త్వరగా అలవాటు పడే ప్రమాదం ఉంది. జీవనియంత్రణ పద్ధతులు, కత్తెర పురుగును తినే కీటకాలపై వచ్చే ఏడాది నాటికి పూర్తిగా అందుబాటులోకి తెస్తాం. రైతులు అప్రమత్తంగా ఉండాలి, బెంబేలు పడాల్సిన అవసరం లేదు. – డా. విలాస్ ఎ. తొనపి, సంచాలకులు, భారతీయ చిరుధాన్య పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్, హైదరాబాద్ కత్తెర పురుగు ఆశించిన సజ్జ పంట లార్వా తుది రూపం ఇసుక, సున్నం మిశ్రమం ఇసుక, సున్నం మిశ్రమాన్ని ఐ.ఐ.ఎం.ఆర్‌లో చిరుధాన్య పంటలపై వేస్తున్న కూలీలు -
కత్తెర పురుగుకు కళ్లెం
మొక్కజొన్నను ఖరీఫ్‌లో ఆశించిన ఫామ్ ఆర్మీ వార్మ్ (కత్తెర పురుగు) తెలుగు రాష్ట్రాల్లో జొన్నకూ పాకింది. మొక్కజొన్నను అమితంగా ఇష్టపడే ఈ లద్దెపురుగు ఆ పంట అందుబాటులో లేనప్పుడు ఇతరత్రా 80 రకాల పంటలకు పాకే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతోంది. చాలా ఏళ్లుగా అమెరికా, ఆఫ్రికాలలో పంటలను ఆరగిస్తున్న ఈ పురుగు మన దేశంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే చాలా రాష్ట్రాలకు పాకింది. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఇది మొక్కజొన్న పంటను ఆశించింది. మొక్కజొన్న నుంచి కొన్ని చోట్ల జొన్నకు, ఇతర రాష్ట్రాల్లో చెరకుకు కూడా పాకినట్లు చెబుతున్నారు. రసాయనిక పురుగుమందులతో ప్రయోజనం లేదని, కషాయాలు, మట్టి ద్రావణం, రాక్ డస్ట్ వంటి రసాయనికేతర పద్ధతుల ద్వారానే సమర్థవంతంగా నియంత్రించగలుగుతున్నామని, రైతులు భయపడ వద్దని ఏపీలో పర్యటిస్తున్న ఎఫ్.ఎ.ఓ.కి చెందిన సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ, రైతు సాధికార సంస్థలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు డాక్టర్ జాకీర్ హుస్సేన్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కత్తెర పురుగు వల్ల దిగుబడి నష్టాన్ని నిలువరించడవచ్చంటున్నారు. అంతరపంటలు, కంచె పంటగా నేపియర్ గడ్డి మొక్కజొన్న, జొన్న పొలాల్లో ఖచ్చితంగా అంతరపంటలు వేయటం మేలన్నారు. రబీలో మొక్కజొన్న వేస్తున్న రైతులు 2 సాళ్లు మొక్కజొన్న, 1 సాలు మినుము/పెసర అంతరపంటలుగా వేసుకోవాలి. కంచె పంటగా నేపియర్ గడ్డిని 4 వరుసలు వేసుకోవాలని డాక్టర్ జాకీర్ హుస్సేన్ సూచించారు. అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్.. ఈ పురుగు సోకిన మొక్కజొన్న మొక్కల మొవ్వుల్లో అగ్ని అస్త్రం, ఎర్రమట్టి నీరు, బూడిద, సాడస్ట్ వేయడం, నీమాస్త్రం, వేపగింజల కషాయం (మార్కెట్లో అమ్మే వేపనూనె అంత బాగా పనిచేయటం లేదు) పిచికారీ ద్వారా ప్రకృతి వ్యవసాయదారులు కత్తెర పురుగు వ్యాప్తిని ఖరీఫ్‌లో సమర్థవంతంగా అరికట్టి, దిగుబడి నష్టాన్ని నివారించుకోగలిగారన్నారు. రసాయనిక వ్యవసాయం చేసే రైతులు పురుగు సోకగానే దున్నేశారని డా. జాకీర్ హుస్సేన్ తెలిపారు. కత్తెర పురుగు లేత ఆకులను తినేస్తుందని, కండెలను ఏమీ చేయదని అంటూ ఇది కనిపించగానే రైతులు తోటలను తొలగించాల్సిన పని లేదన్నారు. గుడ్డు దశలో ఉన్నప్పుడు గుడ్లను ఆకులపై గుర్తించి, నలిపేసి నిర్మూలించుకోవడం మంచిదన్నారు. విష ముష్టి (నక్స్ వామిక) కాయలను ముక్కలు కోసి 5 రోజులు మురగబెట్టి.. 10 లీటర్ల నీటికి చిన్న గ్లాసుడు చొప్పున ఇది చల్లాలని ఆయన తెలిపారు. పంచదార పొలంలో చల్లితే చీమలు వచ్చి ఈ పురుగులను తినేస్తాయి. 16 లీటర్ల స్రేయర్ ట్యాంకు నీటిలో 20 గ్రాముల పంచదార కలిపి పంటపై పిచికారీ చేస్తే.. ఈ తీపికి వచ్చే చీమలు పురుగులను తినేస్తాయని డా. జాకీర్ హుస్సేన్(88268 97278) అన్నారు. ఇప్పట్లో నిర్మూలించలేం: ఎఫ్.ఎ.ఓ. ‘కత్తెర పురుగు చాలా ఏళ్ల నుంచే అమెరికా, ఆఫ్రికా సహా 60 దేశాల్లో ఉంది. భారత్‌లో అనేక దక్షిణాది, ఉత్తరాది రాష్టాలకు ఈ ఏడాది పాకింది. మొక్కజొన్న, జొన్న, చెరకుకు కూడా సోకింది. ఒకేసారి తుడిచిపెట్టడలేం. చాలా సంవత్సరాలు కొనసాగుతాయి. కానీ, జీవన పురుగుమందులు, ఎర్రమట్టి ద్రావణం, బయో పెస్టిసైడ్స్ తదితరాలతో అదుపు చేసుకోవచ్చు. రసాయనిక పురుగుమందులు చల్లితే సమస్య తీరదు. ప్రకృతి వ్యవసాయంలో వివిధ పద్ధతుల ద్వారా దీన్ని సమర్థవంతంగా నివారించగలుగుతున్నట్లు రైతుల పొలాల్లో జరిపిన అధ్యయనంలో గుర్తించాం..’ అని ఎఫ్.ఎ.ఓ. సుస్థిర వ్యవసాయ నిపుణురాలు అన్నే సోఫీ(70427 22338) వివరించారు. డా. జాకీర్ హుస్సేన్, అన్నే సోఫీ -
కరాచీ బేకరీ స్వీట్స్‌లో పురుగులు
సాక్షి, హైదరాబాద్: పండుగ రోజు షాకింగ్ న్యూస్. దీపావళి అంటేనే స్వీట్స్‌కు ప్రత్యేకం. బిజీబిజీ గందరగోళ జీవితంలో పండుగలకు, పబ్బాలకు స్వీట్ షాప్‌లు, బేకరీలపైనే ఆధారపడటం నగరవాసులకు తప్పనిసరి. అందులోనూ పేరున్న షాపులను ఎంచుకోవడం కూడా పరిపాటి. అయితే అలాంటి పెద్ద పేరున్న కంపెనీల్లోనే చెడిపోయిన, అనారోగ్యకరమైన పదార్థాలను వినియోగదారులకు అంటగడితే.. వినియోగదారుల పరిస్థితి బెంబేలే. సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే హైదరాబాద్ కస్టమర్‌కు ఎదురైంది. అతి పెద్ద పేరున్న కరాచీ బేకరిలో. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని కరాచీ బేకరీనుంచి దీపక్ అనే వినియోగదారుడు చాకొలెట్ స్వీట్లు కొనుగోలు చేశారు. తీరా ఇంటికెళ్లి పరిశీలిస్తే...పురుగులు పలకరించాయి. దీంతో దీపక్ ఫ్రెండ్ దోనితా జోష్ ట్విటర్లో పోస్ట్ చేశారు. హ్యాపీ వార్మీ దివాలీ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. దీనిపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) అధికారులు స్పందించారు. జీహెచ్ఎంసీ వెస్ట్‌జోన్ కమీషనర్ హరిచందన ఈ విషయాన్నిసీరియస్‌గా తీసుకుని దర్యాప్తునకు ఆదేశించారు. కలుషితమైన స్వీట్లు ఇచ్చినట్టుగా తేలిందనీ, నిబంధనలను ఉల్లంఘించినందుకు బేకరీ యజమానికి 25వేలరూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. కాగా హైదరాబాద్ 65 సంవత్సరాల చరిత్ర కలిగిన ఐకానిక్ కరాచీ బేకరీ అంటే హైదరాబాదీయులకు ఎనలేని నమ్మకం. కానీ ఇదే ఆరోపణలతో, నిర్దేశించిన ప్రమాణాలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ 2014లో, బంజారా హిల్స్ బేకరీ ఔట్‌లెట్‌ను అధికారులు మూసివేయడం గమనార్హం. అలాగే కేవలం రెండు నెలల క్రితం, హైదరాబాదులోని ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన ఐకియా షోరూంలోని రెస్టారెంట్ బిర్యానీలో గొంగళి పురుగు కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. Happy wormy Diwali from @KarachiBakery Found these worms in at least 4 chocolate pieces. They even move... Not sure how many batches are even impacted by this 😞@GHMCOnline pic.twitter.com/nwK7So1Z8y — Donita Jose (@DonitaJose) November 6, 2018 #TeamGHMC Penalty imposed & samples of the same collected pic.twitter.com/I38tOIbhRa — Musharraf Faruqui (@musharraf_ias) November 6, 2018 -
డెయిరీ మిల్క్ చాకొలెట్లో పురుగులు
-
క్యాడ్బరి చాకొలెట్లో పురుగులు
సాక్షి, హైదరాబాద్ : మోర్ సూపర్మార్కెట్లో చాకొలెట్ కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. చాకొలెట్లో పురుగులు దర్శనమివ్వడంతో సదరు వ్యక్తి షాక్ తిన్నాడు. వివరాలు.. వెంకటరమణ కాలనీకి చెందిన సుబ్బారావు ఎర్రమంజిల్ మోర్ సూపర్మార్కెట్లో మూడు రోజుల క్రితం క్యాడ్బరి డెయిరీ మిల్క్ చాకొలెట్ కొనుగోలు చేశాడు. గురువారం ఆ చాకొలెట్ తిందామని కవర్ ఓపెన్ చేసిన ఆయన కుమారుడికి అందులో పురుగులు కనిపించాయి. సుబ్బారావు మోర్ సిబ్బందిని వివరణ కోరగా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చాకొలెట్లో పురుగులతో తమకు సంబంధం లేదని మోర్ సిబ్బంది తేల్చిచెప్పడంతో.. ఆయన విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. -
గులాబీ/కత్తెర పురుగులపైముష్టి యుద్ధం!
పత్తి, మొక్కజొన్న పంటల్లో గులాబీ/ కత్తెర పురుగులకు ముష్టి ద్రావణంతో చెక్. తెలుగు రాష్ట్రాల్లో ఏటా పత్తి పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ఈ పంటకు ఇప్పుడు అంతో ఇంతో ఆశించిన మద్దతు ధరలు ఉండటంతో రైతులు ఈ ఏడాది బోరుబావుల కింద, నదీ తీరా ప్రాంతాల్లో అధికంగా సాగు చేశారు. అయితే ఈ పంటను మూడు నాలుగేళ్లుగా గులాబీ రంగు పురుగు నాశనం చేస్తోంది. పంట పూత దశలో ఈ పురుగు ఆశించి పూత, పిందెలను తినేసి ఏ మాత్రం దిగుబడి రాకుండా చేస్తోంది. ఈ పంటను రక్షించుకోవడానికి తెలుగు రాష్ట్రాల్లోని రైతులు రకరకాల మందులు పిచికారీ చేసినా ఆయా పురుగులు, తెగుళ్లు అదుపులోకి రాక పంటలను వదిలేయడం లేదా దున్నేయడం రైతుకు ఆనవాయితీగా మారింది. పత్తి, మొక్కజొన్న రైతులను కష్టనష్టాల నుంచి గట్టెక్కించే ‘ముష్టి ద్రావణా’న్ని వైఎస్సార్ జిల్లా వేంపల్లె మండలం టి. వెలంవారిపల్లెకు చెందిన రైతు శాస్త్రవేత్త, సేంద్రియ వ్యవసాయ నిపుణుడు కొమ్ములూరి విజయకుమార్ రైతులకు సూచిస్తున్నారు. పొలాల గట్లపైన, బంజరు భూముల్లో లభించే కొన్ని మొక్కలను, కాయలు, పండ్లు తీసుకుని పలు రకాల ద్రావణాలను తయారు చేసి, పంటలపై పిచికారీ చేయించి అద్భుత ఫలితాలను రాబడుతున్నారు. ఈ కోవలోనే పత్తిలో గులాబీ రంగు పురుగు, మొక్కజొన్నలో లద్దె పురుగు(కత్తెర పురుగు) నివారణకు ‘ముష్టి ద్రావణం’ తయారు చేసి మంచి ఫలితాలు సాధించారు. ముష్టి పండ్లను అత్యధిక మోతాదులో వాడి దీన్ని తయారు చేస్తున్నందున దీన్ని ముష్టి ద్రావణం అని పిలుస్తున్నారు. ఆ ద్రావణం తయారీ, వినియోగం, పనితీరు విజయకుమార్ మాటల్లో తెలుసుకుందాం.. పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు, మొక్కజొన్న, వరి తదితర పంటలను ఆశించే కత్తెర పురుగుల నివారణకు ముష్టికాయలు, వెర్రి పుచ్చ, జముడు, నల్లేరు, సునాముఖి ఆకులు.. ఇవి పొలాల గట్ల మీద ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. ముష్టి పండ్లు : గుట్టలు, కొండలపై ముష్టి చెట్లు విరివిగా ఉంటాయి. ఈ చెట్ల పండ్లు జూన్ నుంచి సెప్టెంబర్, అక్టోబర్ వరకూ దొరుకుతాయి. బాగా మాగి పక్వానికి వచ్చిన ముష్టి కాయలు తీసుకుంటేనే రసం, గుజ్జు బాగా వస్తుంది. ఈ పండ్లు 10 కిలోలు తీసుకుని ప్లాస్టిక్ సంచిలో వేసి చితగ్గొట్టి ఒక పాత్రలో ఉంచుకోవాలి. వెర్రి పుచ్చకాయలు: చెరువులు, నదీ తీరాలు, వాగులు, వంకల వద్ద వెర్రిపుచ్చ కాయలు లభిస్తాయి. ఈ కాయలు పండుబారినవి 5 కిలోలు తీసుకుని బాగా దంచి నిల్వ చేయాలి. జముడు : జముడు చెట్టు అన్నీ ముళ్లతో కొమ్ములు కలిగి ఉంటుంది. ఈ కొమ్ములు రెండున్నర కిలోలు తీసుకొని ఆ కొమ్ములను కొడవలితో చిన్న ముక్కలుగా కోసి ఉంచాలి. నల్లేరు: నీటి పారుదల సదుపాయం ఉండే ఉద్యాన తోటల గట్లపైన, గుట్టల్లో, పొలాల వద్ద నల్లేరు మొక్కలు పెరుగుతూ ఉంటాయి. నల్లేరు కనుపులను రెండున్నర కిలోలు తీసుకొని ప్లాస్టిక్ సంచిలో వేసి దంచాలి. సునాముఖి : ఈ మొక్కలు రోడ్ల వెంట ఉంటాయి. పూలు పసుపు పచ్చగా ఉంటాయి. సునాముఖి ఆకులను, పూలను రెండున్నర కిలోలు తీసుకొని గ్రైండర్లో గానీ, రోలులో గానీ వేసి రుబ్బి నిల్వ చేసుకోవాలి. ద్రావణం తయారీ విధానం: 200 లీటర్ల డ్రమ్మును తీసుకుని ఆ డ్రమ్ములో దంచి ఉంచుకున్న ఆయా పదార్థాలు పోయాలి. ఇలా పోసిన వాటిని 12 రోజుల పాటు మురగబెట్టాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒకే కర్రతోనే కలియబెట్టాలి. ద్రావణం డ్రమ్మును నీడలోనే ఉంచి, గోనె సంచిని కప్పి ఉంచాలి. పత్తి చేలలో పిచికారీ విధానం పత్తిని ఆశించే గులాబీ రంగు పురుగు నిర్మూలన కోసం పత్తి మొక్కలకు మొగ్గలు రాక ముందు రెండుసార్లు, మొగ్గ దశలో రెండుసార్లు, పూత నుంచి కాయలు తయారయ్యే సమయంలో ఒకసారి చెట్టు అంతా బాగా తడిచేలా పిచికారీ చేయాలి. మొదటిసారి పిచికారీకి ద్రావణం లీటరు తీసుకుని 10 లీటర్ల నీటికి కలుపుకోవాలి. రెండోసారి.. 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, మూడోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం, నాలుగోసారి 10 లీటర్ల నీటికి ఒకటిన్నర లీటరు ద్రావణం కలుపుకొని పిచికారీ చేస్తే పురుగు నిర్మూలన జరగడమే కాకుండా అధిక దిగుబడి వస్తుంది. మొక్కజొన్నకు నాలుగైదు సార్లు.. మొక్కజొన్న పంట విత్తిన 15 రోజుల పంట నుంచి మొదళ్లు బాగా తడిచేలా.. నాలుగైదు సార్లు పిచికారీ చేస్తే కత్తెర పురుగు(మక్క లద్దె పురుగు) రానే రాదు. కర్ర చేదెక్కుతుంది కాబట్టి గుడ్లు పెట్టే పరిస్థితే ఉండదు. వరిలోనూ.. వరిలో కాండం తొలిచే పురుగుతోపాటు అగ్గి, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం పారదోలుతుంది. తీగజాతి, కూరగాయ, పండ్ల తోటలను పట్టి పీడించే పండుఈగ (బంగారు ఈగ)ను కూడా ఈ ముష్టి ద్రావణం మట్టుబెడుతుంది. రసం పీల్చే పురుగులను, రెక్కల పురుగులను, తెలుపు, పసుపు పచ్చ పురుగులను ఈ ద్రావణంతో నివారించవచ్చని విజయకుమార్ చెబుతున్నారు. మత్తు వచ్చి.. విరేచనాలై.. ముష్టి ద్రావణం పిచికారీతో పంటలపై పురుగులకు మత్తు రావటంతోపాటు విరేచనాలు అవుతాయని, బలహీనమైన పురుగులు మొక్క మీద నుంచి నేల రాలుతుందని, నేల రాలిన పురుగులను చీమలు తినేస్తాయని.. ఈ విధంగా విష రసాయనాలను వాడకుండానే పురుగులను ముష్టి ద్రావణంతో నివారించుకోవచ్చని, నిర్మూలించుకోవచ్చని విజయకుమార్ వివరించారు. పూత దశలో పవర్ స్ప్రేయర్లు వాడొద్దు ద్రావణాలను ఎండ వేళల్లో పిచికారీ చేయొద్దని చెబుతూ.. ఉదయం 5 గం. నుంచి 8 గం.లోగానే పిచికారీని పూర్తి చేయాలని విజయకుమార్(98496 48498) అన్నారు. పూత దశలో ద్రావణాలు పిచికారీ చేయకుండా ఉంటే పూత రాలకుండా ఉంటుందని రైతులు ముఖ్యంగా గమనించాలన్నారు. పూత దశలోనూ పిచికారీ అవసరమైతే.. పవర్ స్ప్రేయర్ల ద్వారా కాకుండా సాధారణ స్ప్రేయర్లను వినియోగించి నెమ్మదిగా పిచికారీ చేసుకుంటే పూత రాలకుండా ఉంటుందన్నారు. రైతులు గత ఏడాది నుంచి దోమ నివారణకు వివిధ పంటలపై వాడుతున్న ‘బమావె’ ద్రావణం వంటి ఏ ఇతర ద్రావణాలతోనైనా ముష్టి ద్రావణాన్ని కూడా కలిపి పిచికారీ చేయవచ్చునని ఆయన తెలిపారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి (అగ్రికల్చర్), వైఎస్సార్ జిల్లా -
‘అరుదైన’ పదవిలో తెలుగుతేజం
తెనాలి: ఆచార్య నాగార్జున వర్సిటీ జంతుశాస్త్ర పరిశోధకుడు, బయోస్పీయాలజిస్ట్ డాక్టర్ షాబుద్దీన్ షేక్ ‘వరల్డ్ రిజిస్టర్ ఆఫ్ మెరైన్ స్పీసిస్’ (వార్మ్స్) ఎడిటర్‌గా నియమితులయ్యారు. భూమిపైనున్న జంతు జాతుల పేర్ల జాబితాతో డేటాబేస్ నిర్వహణ ‘వార్మ్స్’ సంస్థ ప్రధాన కార్యక్రమం. 2008లో ఏర్పాటైన ఈ ప్రపంచ సంస్థ, బెల్జియంలోని ఓస్టెండ్ నగరంలోని ప్రధాన కార్యాలయం కేంద్రంగా పనిచేస్తోంది. ఈ జాబితా తయారీకోసం 40 దేశాలకు చెందిన 300 మంది శాస్త్రవేత్తలతో కూడిన సంపాదక బృందం నిరంతరం కృషిచేస్తోంది. ఈ బృందంలో భారతదేశం నుంచి ఎంపికైన తొలి శాస్త్రవేత్తను తానేనని డాక్టర్ షాబుద్దీన్ సోమవారం వెల్లడించారు. ‘బేథినిల్లేసియా’ అనే నీటి కీటక జాతికి ప్రాతినిథ్యం వహిస్తూ, కొత్త జాతులు, అధికారిక సమాచారం, ఆసక్తికరమైన ప్రాంతీయ జాతుల కొరత, వాటి ఆవాసాలు వంటి అదనపు సమాచారాన్ని పొందుపరిచేందుకు ‘వారŠమ్స్’ ఒప్పందం చేసుకున్నట్టు డాక్టర్ షాబుద్దీన్ వివరించారు. మెకానిక్ కొడుకుగా.. షాబుద్దీన్ షేక్ స్వస్థలం గుంటూరు. తండ్రి అమానుల్లా సాధారణ మెకానిక్. తల్లి రహమతూమ్ గృహిణి. షాబుద్దీన్ చిన్నతనంనుంచి తెనాలిలోని తాతయ్య, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ షేక్ మొహిద్దీన్ బాచ్చా దగ్గర పెరిగాడు. ఇంటర్ తర్వాత గుంటూరు హిందూ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. జువాలజీలో బంగారుపతకం సాధించి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. దేశంలోనే తొలిసారిగా నాగార్జున యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న ‘వార్మ్స్’ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోగా షాబుద్దీన్‌కు అవకాశం లభించింది. డాక్టర్ రంగారెడ్డి నేతృత్వంలో షాబుద్దీన్ ప్రకృతి సహజ గుహల్లో కటిక చీకటి మాటున దాగున్న జీవరాశులను అన్వేషిస్తూ డాక్టర్ షాబుద్దీన్, ఆంధ్రాలోని బెలూమ్, బొర్రా, గుత్తికొండ గుహలు, మేఘాలయాలోని భారీ గుహల్లో పరిశోధన సాగించారు. ఇప్పటివరకు 40 కొత్త జీవులను కనుగొన్నారు. అందులో ఒక జీవికి ‘ఆంధ్రా కొయిడస్ షాబుద్దీన్’గా నామకరణం చేశారు. 18 జీవుల గురించి అంతర్జాతీయ ప్రీ రివ్యూ జర్నల్స్‌లో పబ్లిష్ చేశారు. గుహలలోని జీవవైవిధ్యంపై షాబుద్దీన్ చేసిన పరిశోధనకు నాగార్జున యూనివర్సిటీ 2017లో పీహెచ్డీ ప్రదానం చేసింది. ఆ థీసిస్‌ను అధ్యయనం చేసిన ‘ఎడ్యుడికేటర్స్’, ఉత్తమ థీసిస్ అవార్డుకు సిఫార్సు చేయటం మరో విశేషం. జాతీయస్థాయిలో ప్రతిష్టాకరమైన డాక్టర్ కేవీరావ్ యంగ్ సైంటిస్ట్ అవార్డు (2016), డాక్టర్ నాగరాజు మెమోరియల్ రీసెర్చ్ అవార్డును షాబుద్దీన్ అందుకున్నారు. విశాఖలో ఏపీ సైన్స్ కాంగ్రెస్ సభల్లో ‘యంగ్ సైంటిస్ట్’ అవార్డు స్వీకరించారు. ఈ యువశాస్త్రవేత్తకు వివిధ అంతర్జాతీయ శాస్త్ర సంస్థలోనూ సభ్యత్వముంది.ఇటీవలే ఆయనకు జువాలజీ సొసైటీ ఆఫ్ లండన్ ఫెలోషిప్ లభించింది. -
‘మక్క లద్దెపురుగు’ నోట్లో మట్టి!
మిత్రపురుగులే రైతు సైన్యం. మిత్రపురుగులకు హాని చేసే రసాయనిక పురుగుమందుల కంటే.. ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోనే చీడపీడలను అరికట్టడం అన్నివిధాలా మేలు. మొక్కజొన్న మొక్క ఆకు సుడుల్లో పొలంలోని మట్టిని వేస్తే చాలు, నూటికి నూరు శాతం దీన్ని అరికట్టగలమని మెదక్ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కేవీకే తెలిపింది. మట్టిని సుడుల్లో వేసిన తెల్లారి నుంచే పురుగు చురుకుదనాన్ని, ఆకలిని కోల్పోయింది. పంటకు నష్టం జరగటం ఆగిపోతుంది. నాలుగైదు రోజుల్లోనే పురుగు చనిపోయిందని కేవీకే అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’కి వెల్లడించారు. మొక్కజొన్న రైతులు భయభ్రాంతులకు గురికావాల్సిన పని లేదని, రసాయనిక పురుగుమందుల ఖర్చు లేకుండానే రైతులు ఈ పురుగు బెడద నుంచి పంటను నిస్సందేహంగా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క లద్దెపురుగు తీరుతెన్నులు, నియంత్రణ మార్గాలపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం.. మక్క(మొక్కజొన్న) లద్దెపురుగు.. ఇటీవల కొత్తగా కనిపిస్తున్న విదేశీ జాతి విధ్వంసక లద్దెపురుగు ఇది. మొక్కజొన్న చేలల్లో లేత ఆకులను, మొవ్వు(ఆకు సుడు)లను, కండెలను ఆవురావురుమంటూ కరకరా నమిలేయడం, అత్యంత వేగంగా కొత్త ప్రాంతాలకు పాకటం దీనికున్న అత్యంత ప్రమాదకర లక్షణాలు. ఖరీఫ్ మొక్కజొన్న పంటను నమిలేస్తున్నది. మూడు నెలల్లోనే.. మన దేశంలో తొలిసారి కర్ణాటకలో మేలో కనిపించి కలకలం రేపింది. ఆగస్టు తొలివారంలో తెలుగురాష్ట్రాల్లో వర్షాభావ వాతావరణ పరిస్థితుల్లో బయటపడింది. ఖరీఫ్ మొక్కజొన్న సాగవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో మక్క లద్దెపురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నట్లు రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆశించిన కొద్ది రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పురుగు కావడంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐ.సి.ఎ.ఆర్.) అప్రమత్తమైంది. తక్కువ ప్రమాదకరమైన రసాయనిక పురుగుమందులు వాడమని సూచిస్తోంది. ఏక పంటలకే ముప్పు ఎక్కువ! రెక్కల పురుగు రోజుకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, ఆడ రెక్కల పురుగు వెయ్యి వరకూ గుడ్లు పెట్టడం ద్వారా సంతతిని వ్యాపింపజేస్తుందని ఎఫ్.ఎ.ఓ. తెలిపింది. పొలం అంతా ఒక మొక్కజొన్న పంట(మోనోకల్చర్)ను మాత్రమే సాగు చేసే పొలాలకే ఇతర చీడపీడల మాదిరిగా మక్క లద్దెపురుగు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నతోపాటు (పప్పుధాన్యాలు, నూనెగింజ, చిరుధాన్యాల) ఇతర పంటలను కలిపి సాగు చేసే పొలాల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందదని గుర్తించారు. రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏక పంటల సాగుకు ప్రసిద్ధి పొందిన అమెరికా ఖండంలోని కెనడా(దక్షిణ ప్రాంతం), చిలి, అర్జెంటీనా వంటి వివిధ దేశాల్లో కొన్ని ఏళ్ల నుంచి ఇది వివిధ పంటలను ఆశిస్తూ నష్టపరుస్తున్నది. రెండేళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోకి పాకి చాలా దేశాలను చుట్టుముట్టింది. ఈ పురుగు మొక్కజొన్నతోపాటు వరి, జొన్న, చెరకు, గోధుమ, పత్తి, కొన్ని రకాల కూరగాయలు సహా 80 రకాల పంటలను ఆశించి ఆహార భద్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. మక్క లద్దెపురుగు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో మొక్కజొన్న పొలాలను గుల్ల చేస్తున్నది. అయితే, రైతుకు ఖర్చులేని, సులువైన, ప్రకృతికి అనుగుణమైన మట్టితో పురుగు నిర్మూలన పద్ధతులు ఉన్నాయి. మొక్కజొన్న రైతులు ఈ పురుగుకు భయపడాల్సిన పని లేదు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో 5 రకాల పద్ధతుల్లో మక్క లద్దెపురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చని అనుభవపూర్వకంగా గుర్తించాం.. 1. మట్టి 100% అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది! మాది ఎర్రమట్టి పొలం. ఆ మట్టినే చేతితో తీసి లద్దెపురుగు ఉండే ఆకు సుడుల్లో వేశాం. మట్టి వేసిన తెల్లారికి మక్క లద్దెపురుగు ఆకులను తినటం, లద్దెలు(విసర్జితాలు) వేయటం ఆగిపోయింది. మూడో రోజుకు పురుగు నశించడం ప్రారంభమైంది. 4–5 రోజులకు పురుగు చనిపోయింది. వర్షం పడుతున్నందు వల్ల లొట్టపీచు కషాయాలు అంతగా పనిచేయలేదు. నేల మీద మట్టినే తీసి నేరుగా సుడుల్లో వేశాం. మట్టి పెళ్లలు సుడుల్లో వేసిన తర్వాత వర్షం కురవకపోతే, ఆ మట్టి పెళ్లలపై నీరు పిచికారీ చేశాం. దీన్ని బట్టి మాకు అర్థమైందేమిటంటే.. రైతు రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ పురుగుమందూ పిచికారీ చేయకుండా.. మట్టిని తీసుకొని సుడిలో వేస్తే చాలు. పురుగు ఆకలి తగ్గి, కృశించి 4–5 రోజుల్లో చనిపోతుంది. 2. మట్టి వేయకుండా.. రాతి పొడిని సుడుల్లో చల్లాం. ఇది 98% ఫలితం కనిపించింది. 3. బొగ్గు పొడిని సుడుల్లో చల్లాం. పురుగును అరికట్టడంలో దీని ప్రభావం 90% ఉంది. 4. కర్ర బూడిద చల్లాం. 86% ప్రభావం ఉంది. 5. లొట్టపీచు కషాయం(లీ. నీటికి 100 ఎం.ఎల్. కషాయం) పిచికారీ చేశాం. వర్షం లేనప్పుడు దీని ప్రభావం 80% ఉంది. వీటన్నిటిలోకీ ఎర్రమట్టి అద్భుతమైన ప్రభావం చూపింది. నల్ల రేగడి లేదా బంకమన్ను ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించి చూడాల్సి ఉంది. మక్క లద్దెపురుగును ప్రకృతిసిద్ధంగా అదుపు చేసే బదనికలు మన వాతావరణంలో అభివృద్ధి చెందేవరకు కొన్ని సీజన్లు గడుస్తాయి. ఈ లోగా రసాయనిక పురుగుమందులు వాడితే మిత్రపురుగులు చనిపోయే ప్రమాదం ఉంది. మేము అనుసరించిన పద్ధతుల వల్ల గండు చీమలు, సాలెపురుగులు, తూనీగలు వంటి మిత్రపురుగులకు హాని కలగదు. కాబట్టి, ఈ మిత్రపురుగుల సహాయం తీసుకొని పదింతలు శక్తితో కొత్త పురుగుపై పోరాడే శక్తి మనకు చేకూరుతుంది. ప్రకృతి సహకారం మనకు తోడవుతుంది. మట్టి సుడుల్లో వేసి ఎదిగిన లద్దెపురుగులను మొక్కజొన్న రైతులంతా నాశనం చేయగలిగితే.. ఈ పురుగు సంతతి వృద్ధిని సమర్థవంతంగా అరికట్టవచ్చన్న గట్టి విశ్వాసం మాకుంది. ఇతర దేశాల్లో రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల దీని వ్యాప్తిని నిలువరించలేకపోయిన విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. – డా. జి. శ్యాంసుందర్ రెడ్డి (99082 24649), సీనియర్ శాస్త్రవేత్త, అధిపతి, డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కేవీకే, తునికి, కౌడిపల్లి, మెదక్, తెలంగాణ–502316 వివరాలకు: శాస్త్రవేత్త నరేశ్ (9290615952) ‘కత్తెర పురుగు’ కాదు ‘మక్క లద్దెపురుగు’ అంతర్జాతీయంగా ఈ లద్దెపురుగు ఇంగ్లిష్ పేరు ‘ఫాల్ ఆర్మీవార్మ్’ (ఊఅఔఔ అఖM్గగిఅఖM టఞౌఛీౌp్ట్ఛట్చ జటuజజీp్ఛటఛ్చీ). మొక్కజొన్న పంట అందుబాటులో ఉంటే ఇది ఇతర పంటల జోలికి పోదు. అందుకే దీన్ని ‘మక్క (మొక్కజొన్న) లద్దెపురుగు’ అని మనం పిలుచుకోవచ్చు. పొగాకు లద్దెపురుగు, రాగి లద్దెపురుగుల మాదిరిగా తొలుత ఏ పంట మీద కొత్త పురుగు కనిపిస్తే.. ఆ పంట పేరుతో పిలవటం ఆనవాయితీ. అందువల్ల మొక్కజొన్నను ఆశిస్తున్న ‘ఫాల్ ఆర్మీవార్మ్’ ను కొందరు పిలుస్తున్నట్లుగా ‘కత్తెర పురుగు’ అనటం కన్నా.. ‘మక్క లద్దెపురుగు’ అని పిలవటమే సులువు అని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సుడిలో మట్టి వేసిన ఐదవ రోజుకు చనిపోయిన మక్క లద్దె పురుగు – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
‘కత్తెర’ కాటు
సాక్షి, హైదరాబాద్:‘గులాబీ’గుబులు రేపుతోంది. ‘కత్తెర’కాటు వేస్తోంది. పురుగులు చేల వైపు పరుగులు తీస్తున్నాయి. పంటలపై దాడి చేస్తున్నాయి. పత్తిని గులాబీరంగు పురుగు, మొక్కజొన్నను కత్తెర పురుగు పీల్చి పిప్పి చేస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో ఆ రెండు పంటల పరిస్థితి దయనీయంగా మారింది. మెదక్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో పూత దశలో ఉన్న పత్తి పంటకు గులాబీ పురుగు సోకినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. మిగిలిన జిల్లాల్లోనూ దాని ఛాయలు కనిపిస్తున్నాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 42.99 లక్షల(102%) ఎకరాల్లో సాగైంది. అందులో దాదాపు 15 శాతం వరకు గులాబీ రంగు పురుగు సోకినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో మొక్కజొన్న పంటను తీవ్రంగా నష్టపరుస్తున్న కత్తెర పురుగు ఉధృతిని కేంద్రం అత్యవసర పరిస్థితిగా గుర్తించిందని కేంద్రీయ సమగ్ర సస్యరక్షణ కేంద్రానికి చెందిన మొక్కల సంరక్షణ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు ఇటీవల సిద్దిపేట జిల్లా గజ్వేల్, వర్గల్ మండలాల్లో మొక్కజొన్న చేలను పరిశీలించారు. ఎక్కడ చూసినా కత్తెర పురుగు ధాటికి తీవ్రంగా ధ్వంసమైన పంటలే కనిపించాయి. వాటిలో మొక్కలకు ఆశించిన పురుగులను, వాటి గుడ్లను, లార్వాను పరిశీలించారు. విదేశాల నుంచి వచ్చిన ఈ కత్తెర పురుగు(ఫాల్ ఆర్మీ వామ్)పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లాల్లో 50 శాతం మేర మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. దీనిపై కేంద్రానికి ఆ బృందం నివేదిక సమర్పించనుంది. తెలంగాణ మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.40 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 10.88 లక్షల ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఏ స్థాయిలో కత్తెర పురుగు సోకిందోనన్న ఆందోళన రైతులను పట్టి పీడిస్తోంది. ఆసియాలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ఈ పురుగు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో వరినాట్లు పుంజుకున్నాయి. 17.52 లక్షల (74%) నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. 12 జిల్లాల్లో లోటు వర్షపాతమే... రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నా ఇప్పటికీ 13 జిల్లాల్లో లోటు వర్షపాతమే ఉంది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, యాదాద్రి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీం, పెద్దపల్లి, జయశంకర్, భద్రాద్రి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదుకాగా, మిగిలిన జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డు అయింది. విదర్భ, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి శుక్రవారం ఉదయానికి నైరుతి మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 19న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో తెలంగాణలో శని, ఆదివారాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కొమురంభీం, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలతోపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. అనేకచోట్ల భారీవర్షాల కారణంగా పెద్ద ఎత్తున పంటలు మునిగిపోయాయి. దాదాపు 50 వేల ఎకరాల్లో పంటలు మునిగినట్లు అంచనా వేస్తున్నారు. పంటలు మునుగుతుంటే పట్టించుకునే నాథుడే లేకుండా పోయారన్న విమర్శలున్నాయి. -
స్ప్రైట్ డ్రింక్‌లో కప్ప, పురుగులు
రాయగడ : రాయగడ డైలీమార్కెట్‌లో గల దేవ్బంగళా దుకాణాలలో ఉండే కటక్ పాన్‌షాప్‌లో స్ప్రైట్ కుల్‌డ్రింక్ బాటిల్లో పురుగులు, కప్పలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ స్ప్రైట్ కంపెనీపై, బాటిల్‌ను విక్రయించిన హోల్‌సేల్ ఏజెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. స్ప్రైట్ కూల్‌డ్రింక్ పెద్ద బాటిల్ కార్టన్‌ను హోల్‌సేలర్ వద్ద తీసుకుని రిటైల్‌గా విక్రయించేందుకు కటక్ పాన్‌షాప్‌లో ఓపెన్ చేసి ఒక బాటిల్ తీసి చూడగా డ్రింక్‌లో కప్పతో సహా పురుగులు తేలి ఉన్నాయి. దీనికి సంబంధించి పాన్‌షాప్ యజమాని రాజును ప్రశ్నించగా ఈ ఘటనపై తనకేమీ తెలియదని కొత్త కార్టన్ ఓపెన్ చేసి చూడగా పురుగులు ఉన్నాయని దీనిపై హోల్‌సేల్ ఏజెంట్‌కు ఫిర్యాదు చేస్తానని వివరించాడు. వాస్తవంగా కూల్‌డ్రింక్స్ విక్రయాలపై హెల్త్ ఇన్స్పెక్టర్తో సహా ఫుడ్ ఇన్స్పెక్టర్, సివిల్ సప్లయిస్ విభాగం తరచూ దాడులు చేసి తనిఖీ చేయాలని పేరుమోసిన కంపెనీలు ప్రమాదకరమైన డ్రింక్‌లను సరఫరా చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
పత్తి.. ముంచెత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతన్నలు తెల్ల బంగారంపై మోజు పెంచుకున్నారు. గులాబీ రంగు పురుగు భయపెడుతున్నా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నష్టమైనా కష్టమైనా పత్తే మేలు చేస్తుందని భావిస్తున్నారు. వ్యవసాయ శాఖ అంచనాలకు మించి ఈసారి పత్తి సాగవడాన్ని బట్టే పత్తిపై రైతులు ఎంత ధీమాగా ఉన్నారో తెలుస్తోంది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 42.66 లక్షల ఎకరాల్లో (102 శాతం) పంట సాగు చేశారు. అన్నీ అనుకూలిస్తే ఈ సీజన్లో దిగుబడి భారీగా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు పీకేస్తున్న రైతులు గులాబీరంగు పురుగు దాడి గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది 10 లక్షల ఎకరాల్లో పురుగు దాడి చేయగా ఈసారి ఉధృతి ఇంకా ఎక్కువ ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గులాబీ ఉధృతికి ఇప్పటికే పలుచోట్ల రైతులు మొక్కలు పీకేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాదికేడాది గులాబీ పురుగు దాడి పెరుగుతోందని, దీన్ని ప్రాధాన్యంగా గుర్తించి పురుగుపై యుద్ధం చేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గతేడాది సకాలంలో వర్షాలు కురవక, గులాబీ పురుగు వల్ల పెద్ద ఎత్తున దిగుబడులు తగ్గిపోయాయని.. గత సీజన్లో 3.30 కోట్ల క్వింటాళ్ల దిగుబడి అంచనా వేస్తే 2 కోట్ల క్వింటాళ్లకు మించి రాలేదని, కాబట్టి పత్తి రైతులకు మున్ముందు పెను సవాళ్లు పొంచి ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు అనుమతిలేని బీజీ–3ని పావు శాతం విస్తీర్ణంలో వేసినట్లు అంచనా. గ్లైఫోసెట్ నిషేధంతో బీజీ–3లో పెరిగే కలుపును నివారించే పరిస్థితి కూడా ఉండదు. ఇది కూడా పత్తి రైతుపై వ్యతిరేక ప్రభావం చూపే ప్రమాదముంది. దిగుబడి పెరిగినా ధర పలకదే! భారీ దిగుబడులొచ్చిన ప్రతిసారీ పత్తి ధరలు తగ్గుతుండటం చూస్తూనే ఉన్నాం. పైగా అంతర్జాతీయ పరిస్థితులూ పత్తిపై ప్రభావం చూపుతుంటాయి. మరోవైపు వ్యాపారుల మాయాజాలంతో రైతులను నిలువునా ముంచుతున్న పరిస్థితులూ కనబడుతున్నాయి. గతేడాది పత్తి కనీస మద్దతు ధర రూ. 4,020 కాగా, కీలక సమయంలో క్వింటాకు రూ. 3 వేల వరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేశారు. పైగా భారత పత్తి సంస్థ (సీసీఐ) కూడా వివిధ కారణాలు చూపి ధర తగ్గించిన పరిస్థితులున్నాయి. దీన్ని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. అయితే పత్తి మద్దతు ధరను కేంద్రం రూ. 5,150కు పెంచడం రైతులకు మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలో పత్తి చేతికి వస్తున్నందున ప్రభుత్వం జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇప్పటికే మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి కూడా ఖరీఫ్ పంటల కొనుగోలుపై తాజాగా సమావేశం ఏర్పాటు చేశారు. పుంజుకోని వరి నాట్లు ప్రస్తుత ఖరీఫ్‌లో వరి నాట్లు పుంజుకోలేదు. ఖరీఫ్ వరి సాధారణ సాగు విస్తీర్ణం 23.75 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 14.87 లక్షల ఎకరాల్లోనే నాట్లు పడినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం 10.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 8.91 లక్షల (85%) ఎకరాల్లో సాగయ్యాయి. అందులో కంది సాగు 92 శాతానికి చేరుకుంది. ఈసారి లోటు వర్షపాతం రాష్ట్రంలో ఈసారి లోటు వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 423.5 మిల్లీమీటర్ల (ఎంఎం) వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 338 ఎంఎంలే నమోదైంది. 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. జిల్లాల వారీగా చూస్తే 17 జిల్లాల్లో లోటు, 14 జిల్లాల్లో సాధారణ వర్షపాతం రికార్డయిందని పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే పత్తి సహా ఇతర పంటలపైనా వ్యతిరేక ప్రభావం ఉంటుందని, వరి నాట్లు వేయడానికి వాతావరణం అనుకూలంగా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.