సాక్షి, హైదరాబాద్: ‘గులాబీ రంగు పురుగు ప్రళయం ముంచుకొస్తోంది’.. ఈ మాటలన్నది స్వయానా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీనియర్ శాస్త్రవేత్త. గులాబీ పురుగు వల్ల పత్తి పంటకు ఈసారి భారీ నష్టం జరగనుందని ఆయన ఆవేదన. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో గులాబీ రంగు పురుగు కనిపిస్తోందని, వర్షాలతో మున్ముందు దాని విస్తరణ మరింత వేగం కానుందని ఆ శాస్త్రవేత్త హెచ్చరించారు. సాధారణంగా కాయ దశలో కనిపించాల్సిన ఆ పురుగు.. మొక్క దశలోనే దాడి చేయడంపై అన్నదాతల ఆందోళనలో పాలు పంచుకుంటున్నారు. దీన్ని నియంత్రించేందుకు పరిశోధనలు విస్తృతం చేయాలని, పురుగుపై యుద్ధం చేయాలని సూచిస్తున్నారు. ఒకచోట గులాబీరంగు పురుగుంటే ఆ చుట్టుపక్కల 30–40 కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుందని చెబుతున్నారు.
ఆదిలాబాద్‌లో అనేకచోట్ల గులాబీ పురుగును గుర్తించినట్లు వ్యవసాయాధికారుల నుంచి వర్సిటీకి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో గతేడాది రాష్ట్రంలో 10 లక్షల ఎకరాలకు గులాబీ పురుగు సోకిందని.. ఈసారి రెండు వారాల్లోనే దాని ఉధృతి కనిపించిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది గుజరాత్ రైతులను అతలాకుతలం చేసిన ఆ పురుగు.. జాగ్రత్తలు తీసుకోకుంటే ఈసారి తెలంగాణ రైతులను తీవ్రంగా నష్టపరిచే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
ఐదు లక్షల ఎకరాల్లో?
రాష్ట్రంలో ఖరీఫ్ పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలు. ఇప్పటివరకు 52.72 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. వాటిలో అధిక భాగం పత్తి పంటదే. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42 లక్షల ఎకరాలు కాగా ఇప్పటివరకు 30.30 లక్షల ఎకరాల్లో సాగైంది. విస్తీర్ణం ఇంకా పెరగనుంది. ఇప్పుడు సాగైన 30 లక్షల ఎకరాల్లో దాదాపు 5 లక్షల ఎకరాల పత్తిలో గులాబీ పురుగు ఉండే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వారం రెండు వారాల్లో ఉధృతి పెరిగితే అడ్డుకోవడం కష్టమైన వ్యవహారమంటున్నారు.
గులాబీ పురుగు తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్య పత్తి మొక్కపైకి వస్తుంది. ఆ సమయంలో చూడలేం. కాబట్టి లింగాకర్షక బుట్టలు వీలైనన్ని వేస్తే అందులో వచ్చి పడతాయి. అలా పురుగును గుర్తించవచ్చు. ఒక బుట్టలో 4 పురుగులు పడితే తీవ్రత ఎక్కువగా ఉందని అంచనా వేస్తారు. పురుగును గుర్తించాక క్రిమిసంహారక మందులతో అరికట్టవచ్చు. లింగాకర్షక బుట్టలను ఇప్పటికే రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అందించలేదు సరికదా వాటిని తెప్పించడంలోనూ విఫలమైందని వ్యవసాయ శాస్త్రవేత్తలే విమర్శిస్తున్నారు. 10 రోజుల క్రితమే జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద నిధులు కేటాయించి బుట్టలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని,ఇంకా కొనలేదని విమర్శలున్నాయి. మరోవైపు పత్తి సరఫరా చేసే జిన్నింగ్ మిల్లుల నుంచి కూడా పంట వైపునకు పురుగు వ్యాపిస్తుందని చెబుతున్నారు.
బీటీ–2 వైఫల్యమే
బీటీ–2 టెక్నాలజీ వైఫల్యం వల్లే పత్తి పంటను గులాబీ రంగు కాయతొలుచు పురుగు పీడిస్తోంది. దాన్ని నివారించేందుకు బీటీ టెక్నాలజీలో ఓ కణాన్ని జొప్పించి 2002లో బీటీ–1 పత్తి విత్తనాన్ని మోన్‌శాంటో మార్కెట్లోకి తీసుకొచ్చింది. అయితే 2006 నాటికి బీటీ–1 గులాబీ పురుగును నాశనం చేసే శక్తి కోల్పోయింది. దీంతో రెండు కణాలు జొప్పించి బీటీ–2ను తీసుకొచ్చారు. 2012 నాటికి దీనిలోనూ గులాబీ పురుగును తట్టుకునే శక్తి నశించింది. కానీ దాన్ని రద్దు చేయకుండా 3 కణాలు జొప్పించి బీటీ–3 తీసుకొచ్చారు. దానికితోడు పత్తి కలుపును నాశనం చేసేందుకు గ్లైఫోసెట్ పురుగుమందును తీసుకొచ్చారు. దీని వల్ల జీవ వైవిధ్యానికి నష్టం జరుగుతుందని తెలియడంతో కేంద్రం అనుమతివ్వలేదు. అయినా రహస్యంగా రైతులకు అంటగడుతూనే ఉన్నారు.
బీటీ టెక్నాలజీ విఫలమైనా గులాబీ పురుగు పీడిస్తున్నా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలున్నాయి. ఎకరాకు పత్తి దిగుబడి సరాసరి 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా గులాబీ పురుగు కారణంగా గతేడాది రాష్ట్రంలో అనేకచోట్ల 6–7 క్వింటాళ్లకు మించి రాలేదు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్న వాదనలున్నాయి. మరోవైపు గులాబీ పురుగుతో పత్తి పంట పోతే రైతుకు బీమా పరిహారం రాదు. మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం గతేడాది గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందించింది. పత్తి విత్తన కంపెనీల నుంచీ పరిహారం ఇప్పించింది. రాష్ట్రంలో అలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
‘గులాబీ’ విలయం
Published Sat, Jul 14 2018 2:15 AM | Last Updated on Mon, Oct 1 2018 2:24 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment