జిల్లాలో రైతులు ఈసారి కూడా పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయశాఖ అంచనా మేరకు ఈ ఖరీఫ్‌లో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 72,123 హెక్టార్ల (63 శాతం)లో వివిధ పంటలు వేశారు. అయితే.. కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 50,499 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న, మిగతా ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రైతులు ఈ ఖరీఫ్‌లోనూ పత్తిసాగుపైనే మొగ్గు చూపుతున్నారు. రెండేళ్ల క్రితం వరకు తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడగా.. అత్యధికంగా పత్తి సాగైంది. గతేడాది, ఈసారి అనుకూలంగా వర్షాలు పడుతున్నా.. రైతులు పత్తిసాగుపైనే ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగైన పంటల వివరాలను పరిశీలిస్తే అత్యధికంగా పత్తిసాగే కనిపిస్తోంది. వర్షాకాలం ఆరంభమై రెండు నెలలు కావస్తున్నా ప్రాజెక్టులు, చెరువులకు నీరు రాకపోవడం కూడా వరిసాగుకు ప్రతికూలంగా మారిందని, అందుకే ఆరుతడి పంటలవైపు మొగ్గు చూపుతున్నారని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో మొత్తం 16 మండలాలకు గాను ఇంకా 5 మండలాల్లో లోటు వర్షపాతం నమోదైనట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు పత్తి, ఆ తర్వాత మొక్కజొన్న, ఆరుతడి పంటలు వేశారని అంటున్నారు.
వ్యవసాయశాఖ అంచనా ఇదీ.. ఇప్పటికి సాగు 63 శాతమే..
గత ఖరీఫ్ సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు 2017 ఖరీఫ్ యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. ఈ మేరకు జిల్లాలో 1,13,839 హెక్టార్ల సాగు లక్ష్యంగా పేర్కొన్నారు. ఇప్పటివరకు 72,123 హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. అయితే.. 36,347 హెక్టార్లకు కేవలం 13,005 హెక్టార్లలో వరి సాగు కాగా, 47,523 హెక్టార్లలో పత్తి సాగు లక్ష్యానికి ఇప్పటికే 50,499 హెక్టార్ల (106 శాతం)లో పత్తి పంట వేశారు. మిగిలిన 8,619 హెక్టార్లలో 7,415లలో మొక్కజొన్న వేయగా, మిగతా 1,204 హెక్టార్లలో ముతకధాన్యాలు తదితర పంటలు వేశారు. జిల్లాలో ఏడాది సగటు వర్షపాతం 898.3 మిల్లీమీటర్లు కాగా, గతేడాది జూలై 31 వరకు 347.90 మిల్లీమీటర్లు నమోదైతే, ఈసారి 252 మి.మీటర్లుగా ఉంది.
ఫలితంగా ఖరీఫ్ ఆరంభమై రెండు నెలలు కావస్తుండగా ఇప్పటికీ జిల్లాల్లో సగటు సాగు 63 శాతంగా ఉంది. ఇదిలా ఉంటే జిల్లా ఆయకట్టుకు జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ఎల్‌ఎండీలకు గతేడాదితో పోలిస్తే ఈసారి ఆశించిన నీరు చేరలేదు. దీంతో వరి రైతులు పొలాలు, నారుమళ్లు, వరినారు సిద్ధం చేసుకున్నా.. వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. రబీలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆచీతూచీ సేద్యం వైపు కదులుతున్నారు. ఈ ఖరీఫ్‌లో తొలకరి జల్లులు కొన్ని మండలాల్లో ఆశాజనకంగానే ఉన్నా.. ఇప్పటికీ ప్రాజెక్టులు, చెరువుల్లోకి నీరు చేరలేదు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో వర్షపాతం పూర్తిగా తగ్గిపోయింది. సాధారణ వర్షపాతం, గత రెండేళ్లలో నమోదైన వర్షపాతంతో పోల్చిచూస్తే వర్షాలు పడుతున్నా పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో వరి తదితర పంటలకు స్వస్థి చెప్పి ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారని, వరిసాగుపై వేచిచూసే ధోరణితో ఉన్నారని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment