మళ్లీ ‘పత్తి’ బాట
గతేడాది నిరుత్సాహం.. ఈసారి ప్రోత్సాహం
- 38.75 లక్షల ఎకరాలకు పత్తి సాగు పెంచాలని సర్కారు నిర్ణయం
- ధరలపై అంచనాలు తారుమారవడంతో చర్యలు
- కంది, సోయాబీన్ సాగు లక్ష్యాలు తగ్గింపు
- 2017–18 వ్యవసాయ ప్రణాళికలో వ్యవసాయ శాఖ స్పష్టత
- వరి విస్తీర్ణం మాత్రం పెంచాలని యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తిరిగి పత్తి పంటను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయంగా పత్తికి డిమాం డ్ పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కంది, సోయాబీన్ పంటలను తగ్గించేందుకు సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ శాఖ 2017–18 వ్యవసాయ ప్రణాళికలో ఈ అంశాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. వానా కాలం, యాసంగి పంటల సాగు, ఉత్పత్తి లక్ష్యాలను అందులో పేర్కొంది. ఒక్క వరి విస్తీర్ణాన్ని మాత్రం పెంచాలని నిర్ణయించింది.
ప్రత్యామ్నాయ పంటలన్నీ ఢమాల్
రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ధరలు బాగా పడిపోవడంతో పత్తి పంట వేయవద్దంటూ రైతులను నిరుత్సాహపర్చిన విషయం తెలిసిందే. ‘అంతర్జాతీయంగా పత్తి ధరలు గణనీయంగా పడిపోనున్నాయి. రాష్ట్రంలో రైతులకు పత్తి ధరలు గిట్టుబాటయ్యే పరిస్థితి ఉండదు. అందువల్ల రైతులను ఇతర పంటల వైపు మళ్లించాలి..’అని అప్పట్లో వ్యవసాయ శాఖను ఆదేశించింది. దాంతో వ్యవసాయశాఖ చర్యలు చేపట్టి.. రైతులను పత్తికి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించింది. దాంతో పత్తి సాగు తగ్గి.. సోయా, పప్పు ధాన్యాల సాగుపెరిగింది. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42.21 లక్షల ఎకరాలు కాగా.. 2015–16లో 41.71 లక్షల ఎకరాల్లో సాగైంది. ప్రభుత్వం నిరుత్సాహపరచడంతో 2016–17లో 30.52 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది.
అంటే 11 లక్షల ఎకరాలు తగ్గింది. అదే సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.98 లక్షల ఎకరాలు కాగా.. 2015–16లో 6.27 లక్షల ఎకరాలకు, 2016–17లో 7.36 లక్షల ఎకరాలకు పెరిగింది. కానీ పరిస్థితి పూర్తిగా తారుమారైంది. పత్తి గరిష్ట ధర క్వింటాలుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెరగగా.. ప్రత్యామ్నాయంగా వేసిన పంటల ధరలన్నీ బాగా పడిపోయాయి. సోయాబీన్ ధర అంతకుముందు క్వింటాలుకు రూ. 3,700 వరకు ఉండగా.. ఈసారి రూ.2,800 కు పడిపోయింది. కంది గతంలో క్వింటాలుకు రూ.10 వేల వరకు ఉండగా.. ఈసారి రూ.4 వేలకు పడిపోయింది. దీంతో ప్రభుత్వం గతేడాది వద్దన్న పంటలనే ఈసారి ప్రోత్సహించాలని నిర్ణయించడం గమనార్హం.
పత్తి పెంపు.. ప్రత్యామ్నాయం తగ్గింపు!
పత్తి సాగు లక్ష్యం 2016–17లో 26.6 లక్షల ఎకరాలుకాగా, 2017–18కుగాను 38.75 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. అంటే గతేడాది లక్ష్యంతో పోలిస్తే అదనంగా 12.15 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని భావిస్తోంది. అలాగే 2016–17 ఖరీఫ్, యాసంగిల్లో 21.42 లక్షల ఎకరాల్లో పప్పుధాన్యాల సాగు లక్ష్యం పెట్టుకోగా.. 2017–18లో 6 లక్షల ఎకరాలు తగ్గించి 15.52 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఇందులో కంది సాగు లక్ష్యం 2016–17లో 12.17 లక్షల ఎకరాలుకాగా.. 2017–18లో 8.02 లక్షల ఎకరాలకు తగ్గించాలని భావిస్తోంది. ఇక 2016–17లో సోయాబీన్ సాగు లక్ష్యం 12.55 లక్షల ఎకరాలు కాగా... 2017–18లో కేవలం 6 లక్షల ఎకరాలకే పరిమితం చేయాలని నిర్ణయించింది. మొత్తంగా ఆహారధాన్యాల సాగు విస్తీర్ణం 2016–17లో 87.60 లక్షల ఎకరాలుండగా.. ఈసారి 81.25 లక్షల ఎకరాలకు తగ్గించనుంది. ఒక్క వరి విస్తీర్ణాన్నే కాస్త పెంచాలని.. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేయాలని నిర్ణయించింది.