వద్దంటే వినరే! | cotton crop in rangareddy district | Sakshi
Sakshi News home page

వద్దంటే వినరే!

Published Thu, May 26 2016 4:15 PM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

వద్దంటే వినరే! - Sakshi

వద్దంటే వినరే!

యాచారం : రంగారెడ్డి జిల్లాలో రైతులు పత్తి పంటను వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. వారం పదిరోజులుగా గ్రామాల్లో ‘మన తెలంగాణ- మన వ్యవసాయం’ సదస్సులు నిర్వహిస్తున్న వ్యవసాయాధికారులు పత్తి సాగు తగ్గించి సోయాబిన్, ఆముదం, మొక్కజొన్న, జొన్న, కంది తదితర పంటలను సాగుచేసుకోవాలని రైతులకు సూచిస్తున్నారు. ఈ ప్రాంత భూముల భూసార పరీక్షల ఆధారంగా పత్తి పంటకు ఏ మాత్రం అనుకూలం కావని, పంట సాగు కోసం రూ.వేలల్లో పెట్టుబడులు అవ్వడం, దిగుబడిలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుందని అవగాహన కల్పిస్తున్నారు.

 30 వేల హెక్టార్లల్లో పత్తి సాగుకు సిద్ధం
పత్తి సాగు వద్దని పదే పదే అధికారులు చెబుతుండడంతో కొద్దిమేర మాత్రమే మార్పు కన్పిస్తోంది. పూర్తిస్థాయిలో మాత్రం మార్పు కనిపించని పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 44,084 హెక్టార్లు ఉండగా 2013లో 55035 హెక్టార్లు, 2014 లో 49335 హెక్టార్లు, 2015లో 49664 హెక్టార్లలో పత్తిని సాగు చేశారు. పత్తి సాగు విస్తీర్ణాన్ని ఈ ఏడాది 19147 హెక్టార్లకు తగ్గించాలని భావిస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా జిల్లా తూర్పు డివిజన్‌లోనే యాచారం మండలంలో పత్తి సాగు అత్యధికంగా సాగైంది. అతివృష్టి, అనావృష్టి వల్ల పత్తి సాగులో నష్టాలు వస్తున్నప్పటికీ.. రైతులు మాత్రం మూడేళ్లుగా పత్తి సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గతేడాది యాచారం మండలంలో 1,378 హెక్టార్లల్లో పత్తి సాగు చేశారు. నక్కర్త మేడిపల్లి, మల్కీజ్‌గూడ, కొత్తపల్లి, తక్కళ్లపల్లి, నందివనపర్తి, చౌదర్‌పల్లి, చింతుల్ల, ధర్మన్నగూడెం, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో 90 శాతానికి పైగా రైతులు పత్తి సాగే చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది కేవలం 400 హెక్టార్ల మేర మాత్రమే పత్తి సాగు తగ్గే అవకాశం ఉంది.
 
అంతర్జాతీయ మార్కెట్లోకి ఎగుమతి చేసే పత్తిపై ఇచ్చే రాయితీని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి రద్దు చేసింది. భారతదేశంలో పండించిన పత్తిని అమెరికా, చైనా, యూరోప్ తదితర దేశాల అంతర్జాతీయ మార్కెట్లోకి ఎగుమతి చేసి విక్రయాలు జరుపుతారు. కేంద్ర ప్రభుత్వం రాయితీని రద్దు చేయడం వల్ల మన పత్తిరేటు ఎక్కువగా ఉంటుంది. అంతర్జాయ వ్యాపారులు తక్కువ ధర ఉన్న మార్కెట్లలోనే కొనుగోళ్లకు ఆసక్తి చూపుతారు. దీంతో మనదేశంలో పండిన పత్తికి సరైన ధర, డిమాండ్ ఉండదు. పత్తి పండించిన రైతులకు సరైన ధర రాకపోవడం వల్ల నష్టపోయో అవకాశం ఉంది. దేశంలో అత్యధికంగా రైతులు పత్తి పంటపైనే దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో పప్పు దినుసులు, ఇతర ఆహార ధాన్యాల పంటల సాగు గణనీయంగా తగ్గిపోతున్నది. వాటి ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. పత్తి సాగు విస్తీర్ణం పెరగడం, పప్పు దినుసులు, ఆహార ధాన్యాల పంటలు తగ్గిపోవడం, కేంద్ర ప్రభుత్వం కూడా పత్తి ఎగుమతులపై రాయితీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం పత్తి సాగు పెంచకుండా, పప్పు దినుసులు, ఆహార ధాన్యాల పంటల సాగు పెంపుపై రైతుల్లో చైతన్యం  కల్పించాలని వ్యవసాయాధికారులకు ఆదేశాలిచ్చింది.

వర్షాలు కురిస్తే విత్తడమే..!
వారం క్రితం కురిసిన వర్షాలకు రైతులు పలు గ్రామాల్లో దుక్కులను సిద్ధం చేసుకున్నారు. నక్కర్తమేడిపల్లి, చౌదర్‌పల్లి, తాడిపర్తి, కొత్తపల్లి, మాల్, నల్లవెల్లి, తమ్మలోనిగూడ తదితర గ్రామాల్లో ఎకరాల కొద్ది పొలాల్లో పత్తిని సాగు చేయడం కోసం రైతులు  వేలాది రూపాయలు ఖర్చు చేసి పత్తి విత్తనాలు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దళారుల వచ్చి విత్తనాలు పెద్ద మొత్తంలో సరఫరా చేయకపోయినా రైతుల ఆసక్తిని బట్టి పంటముడి ఒప్పందం ప్రకారం దొంగ చాటుగా వచ్చి విత్తనాల ప్యాకెట్లు ఇచ్చి వెళ్తున్నారు. మాల్, యాచారంలోని స్థానిక వ్యాపారులు సైతం పెద్ద మొత్తంలోనే పత్తి విత్తనాలు నిల్వ చేసి ఉంచారు. కొన్ని గ్రామాల్లో అనుమతి లేకుండానే విత్తనాలు తెచ్చి ఇళ్ల నుంచి రైతులకు అమ్ముతున్నారు. రెండు, మూడేళ్లుగా పత్తి సాగులో నష్టాలు చవిచూసిన రైతులు ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని భావిస్తున్నారు. దీంతో పత్తిని సాగు చేసేందుకు ఆసిక్త  చూపుతున్నారు.


గతేడాది 15 ఎకరాల్లో పత్తి సాగు చేసిన. ఈ ఏడాది పత్తి ధర తక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు, అందుకే కేవలం ఐదు ఎకరాలు తగ్గించి 10 ఎకరాల్లో పత్తి సాగు ఏర్పాట్లు చేస్తున్నా. రూ.లక్షకు పైగా ఖర్చు చేసి ఎరువులు, విత్తనాలు నిల్వ చేసుకున్నా. 5 ఎకరాల్లో మొక్కజొన్న, సోయాబిన్ పంటలు వేస్తున్నా. - కలకొండ బీరప్ప, నక్కర్తమేడిపల్లి, యాచారం మండలం
 
 కొంత మందిలో మార్పు వచ్చింది..
రైతులు గతేడాది కంటే పత్తి సాగుపై దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఈ ఏడాది సగం వరకు పత్తి సాగు తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వర్షాలు కురిసి విత్తనాలు విత్తేది ప్రారంభిస్తే కాని విషయం తెలుస్తుంది. సోయాబిన్, మొక్కజొన్న తదితర పంటల వల్ల మంచి ఆదాయం వస్తుందన్న విషయం రైతులు మర్చిపోవద్దు.
 - సందీప్‌కుమార్, వ్యవసాయాధికారి, యాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement