సాక్షి, రంగారెడ్డి జిల్లా: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీ ఐ) ఏర్పాట్లు చేస్తోంది. పత్తికి మద్దతు ధర కల్పించడానికి సీసీఐ ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా జిన్నింగ్ మిల్లుల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. గతేడాది ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఈ సారి కూడా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 68 వేల హెక్టార్లలో సుమారు లక్ష మందికిపైగా రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ప్రస్తుతం పత్తి వివిధ దశల్లో ఉంది.
మాడ్గుల, కొందర్గు, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. వర్షానికి వర్షానికి మధ్య చాలా రోజుల విరామం ఉండడంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. దీనికితోడు పోషకాల లేమి కూడా ఎదురైంది. దీంతో పూర్తిస్థాయిలో పూత దశకు చేరుకోలేదు. నవంబర్ రెండో వారం నుంచి పత్తి దిగుబడి మొదలవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ లోగా అంటే న వంబర్ ఒకటి కల్లా కొనుగోలు కేం ద్రాలు తెరచాలన్న యోచనలో సీసీఐ ప్రతిని ధులు ఉన్నారు. గతేడాది వరకు దిగుబడి ప్రారంభ దశలో సీసీఐ కేంద్రాలు తెరచుకోలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. వారు నిర్ణయించిందే ధరగా రైతు లు అమ్ముకున్నారు. ఈసారి ఇటువంటి పరిస్థితి రాకుండా దిగుబడి ఆరంభానికి ముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది.
రైతుకు ‘మద్దతు’..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల పత్తి మద్దతు ధరను పెంచిన విషయం తెలిసిందే. గతేడాది వరకు క్వింటా పత్తి రూ.4,320 ఉండగా దీన్ని తాజాగా రూ.5,450కు పెంచడం విశేషం. ఈ పెంపు రైతులకు ఊరట కలిగించే అంశం. రైతులు పత్తిని వ్యాపారులకు కాకుండా సీసీఐ కేంద్రాల్లోనే విక్రయిస్తే మేలు జరుగుతుంది. ఈ మేరకు త్వరలో రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది రైతుల పేరిట వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రైతుల నుంచి వివిధ సాకులతో తక్కువ ధరకు పత్తిని వ్యాపారులు సేకరించారు. ఆ తర్వాత సీసీఐ కేంద్రాల్లో అమ్మి మద్దతు ధరకు కాస్త అటుఇటుగా లాభపడ్డారు.
అయితే రైతుల సమగ్ర వివరాలతో రూపొందించిన క్యూఆర్ బార్ కోడ్ కార్డులు రైతులకు ఆలస్యంగా అందజేయడంతో పెద్దగా వారికి ఒరిగిందేమీ లేదు. గతేడాది అందజేసిన క్యూర్ బార్ కోడ్ కార్డుల ద్వారానే రైతుల నుంచి సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 80 వేల మంది రైతుల వద్ద ఆ కార్డులు ఉన్నాయి. ఐదేళ్లపాటు ఈ కార్డులు మనుగడలో ఉంటాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయదేవి తెలిపారు. కార్డులు లేని రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, వ్యవసాయ అధికారుల ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగా పత్తిని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment