Support price for cotton
-
పత్తి రేటుకు విపత్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పత్తికి ధరల విపత్తు వచ్చింది. సీజన్ మొదట్లోనే, మార్కెట్లోకి పత్తి రావడం మొదలవుతుండగానే రేటు తగ్గిపోయింది. వ్యాపారులు, దళారులు ధరలు బాగా తగ్గించేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 అయితే.. సోమవారం వరంగల్ మార్కెట్లో కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ. 6,950 వరకు మాత్రమే పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనూ రూ.5,500 నుంచి గరిష్టంగా రూ.7,000కు మించి చెల్లించలేదు. దీనితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు, మూడు వారాల క్రితం క్వింటాల్‌కు రూ. 8,250 వరకు ధర చెల్లించినా.. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గించేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లోకి పత్తి రాక పెరిగితే.. ధరలను ఇంకెంత తగ్గిస్తారోనని వాపోతున్నారు. మార్కెట్‌కు పత్తి రాక ప్రారంభమైనా ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. వ్యాపారులు, దళారులు రేటు తగ్గించేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండేళ్ల క్రితం పత్తి ధరలు రూ. 10–15 వేల వరకు పలికాయని.. ఇప్పుడు దారుణంగా పడిపోయాయని అంటున్నాయి. పత్తి విస్తీర్ణంలో రాష్ట్రం మూడో స్థానం వానాకాలం సీజన్లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగైంది. మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో అత్యధికంగా 98.47 లక్షల ఎకరాల్లో.. రెండో స్థానంలో ఉన్న గుజరాత్లో 56.56 లక్షల ఎకరాల్లో సాగవగా.. తెలంగాణ 43.76 లక్షల ఎకరాల సాగుతో మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల మెట్రిక్ టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేశాయి. నిజానికి ఖరీఫ్ సీజన్ మొదట్లో పత్తి విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు. విత్తనాలు వేసినా, వర్షాల్లేక రెండు, మూడు సార్లు వేయాల్సి వచ్చింది. పత్తి పూత దశకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు పడ్డాయి. చేన్లు నీట మునిగి.. పూత, కాయ నేలరాలాయి. కొమ్మలు నీటిలో నాని, తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. అంతేకాదు.. ఈసారి పత్తి విత్తనాల ధరలు, ఎరువులు, డీజిల్, ఇతర ఖర్చులు పెరిగి.. పెట్టుబడి తడిసిమోపెడైంది. ఇలాంటి సమయంలో పత్తి ధరలు తగ్గించేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా తేమ 8 శాతం, ఆలోపు ఉంటే పూర్తి మద్దతు ధర లభిస్తుంది. 9 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉంటే.. శాతాన్ని బట్టి అదే తరహాలో ధర తగ్గుతూ వస్తుంది. కానీ నాణ్యత బాగున్నా వ్యాపారులు, దళారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రంగు మారిన పత్తికి కూడా కనీస మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు. ఇప్పటికీ తెరుచుకోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు... ఈ నెలాఖరు నుంచి మార్కెట్లోకి పెద్ద ఎత్తున పత్తి రానుంది. ఈ ఏడాది 351 పత్తి కొనుగోలు కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు. కానీ ‘కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)’ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలేవీ ప్రారంభించలేదు. జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా పెట్టి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేస్తుంది. మిల్లులు ఆ పత్తిని జిన్నింగ్ చేసి సీసీఐకు అప్పగించాల్సి ఉంటుంది. టెండర్ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి టెండర్లు ఇటీవలే పూర్తయినా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రారంభం కాలేదు. పైగా ఏటా వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేశాక.. సీసీఐ వచ్చి ప్రైవేట్ వ్యాపారుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిందని.. అందులో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. రైతుల అవసరం.. వ్యాపారుల సాకులు.. రైతులు చేన్లలో మూడు దశల్లో పత్తిని తీస్తారు. అందులో మొదటి, రెండోసారి ఎక్కువ పత్తి వస్తుంది. రైతులు ఇందులో మొదట ఏరే పత్తిని నిల్వ చేయకుండా మొత్తంగా విక్రయిస్తారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు, ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు, దళారులు పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం తేమ శాతం అధికంగా ఉందని, ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పంట నాణ్యత కోల్పోయిందని సాకులు చెప్తున్నారు. పలు దేశాల్లో సంక్షోభ పరిస్థితులతో పత్తికి మార్కెట్ తగ్గిందని.. టెక్స్టైల్ మిల్లులు మూతపడ్డాయని చెబుతూ తక్కువ రేటు చెల్లిస్తున్నారు. చాలాచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ సంక్షోభమూ కారణమే! మన దేశంలో పండే పత్తి అధికంగా బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, టర్కీ, పాకిస్తాన్ దేశాలకు ఎగుమతి అవుతుంది. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో అల్లకల్లోలంతో ఎగుమతులు తగ్గుతున్నాయి. దీనితో పత్తికి డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతున్నాయని మార్కెటింగ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ గుజరాత్ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కంటే అధిక రేట్లకు పత్తి కొనుగోళ్లు జరుగుతుండటం, తెలంగాణలో తగ్గిపోవడం ఏమిటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెటింగ్ శాఖ వర్గాలు చెప్తున్న మేరకు.. గుజరాత్లో ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు రూ.8,257 పలుకుతోంది. వచ్చే నెలలో రూ.8,321 వరకు, డిసెంబర్ నెలలో రూ.8,260 వరకు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. గుజరాత్లో వస్త్ర పరిశ్రమలు, మిల్లులు, వ్యాపారులు ఎక్కువగా ఉండటం వల్ల.. కొనుగోళ్లు ఎక్కువగా ఉండి, పత్తి ఎక్కువ రేటు పలుకుతోందనే వాదనలూ ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌పై ఫోకస్ పెట్టి.. ఇతర రాష్ట్రాల రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కనీస ధర కూడా ఇవ్వడం లేదు ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. కానీ మార్కెట్లో ఆ ధర దక్కడం లేదు. వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7,000కు మించి ధర పెట్టడం లేదు. అంతేకాదు నాణ్యత పేరిట మరింతగా తగ్గిస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మద్దతు ధర లభిస్తుంది. అందుకోసమే ఎదురుచూస్తున్నాం. – బానోత్ రామా, బీసురాజుపల్లి తండా, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మంజిల్లా -
పత్తికి ‘మద్దతు’ గగనమే..!
సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: పత్తి పంట పండించిన రైతులకు ఏటా తిప్పలు తప్పడం లేదు. గిట్టుబాటు ధర పక్కనపెడితే మద్దతు ధర కూడా అందని పరిస్థితి నెలకొంది. రైతులు ప్రతియేడు ఏదో విధంగా నష్టపోతూనే ఉన్నారు. ప్రకృతి కన్నెర్రజేసినా, వ్యాపారులు నట్టేట ముంచినా చివరకు రైతుకే కన్నీళ్లు తప్పడం లేదు. ఈ యేడాది ఖరీఫ్ సీజన్ ఆగస్టులో భారీ వర్షాలు కురవడంతో పంటలకు తీవ్రం గా నష్టం వాటిల్లింది. జిల్లాలో దాదాపు 30వేల ఎకరాల వరకు పంట నష్టం సంభవించింది. కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది మద్దతు ధర పెంచడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుండగా, ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్ కావడంతో మద్దతు ధర లభించడం గగనంగా మారే పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం జాయింట్ కలెక్టర్ సంధ్యారాణితో జరిగిన సమావేశంలో వారి తీరును చూస్తే కనీసం క్వింటాలుకు రూ.5వేలు చెల్లించే పరిస్థితి కూడా కనిపించేటట్లు లేదు. ఈ ఏడాది సీసీఐ రంగంలోకి దిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీసీఐ అధికారులు తేమ కొర్రీ పెట్టనుండడంతో రైతులకు అవస్థలు తప్పేట్లు కనబడడం లేదు. 8 నుంచి 12 శాతం తేమ మించి ఉన్నట్లయితే సీసీఐ కొనుగోలు చేయని విషయం తెలిసిందే. పత్తి కొనుగోళ్ల కోసం సీసీఐ అధికారులు ప్రైవేట్ జిన్నింగ్ మిల్లుల యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఇంకా పూర్తి కాలేదు. గతంలో ఇచ్చిన టెండర్లలో విధించిన నిబంధనలు వ్యాపారులకు గిట్టుబాటు కాకపోవడంతో లీజుకు ఇచ్చేందుకు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. దీంతో పత్తి కొనుగోళ్లు సందిగ్ధంలోనే ఉన్నాయి. ఈ నెల 17 నుంచే పత్తి కొనుగోళ్లు చేస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు మాత్రం 15న కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర పడిపోగా, వ్యాపారులు మద్దతు ధరతో కొనుగోలుకు ముందుకు వస్తారో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తేమ.. ధరలో కోత ఈ యేడాది పత్తి రైతుకు గిట్టుబాటు ధర లభించడం గగనంగానే కనిపిస్తోంది. గతేడాది క్వింటాలు పత్తి మద్దతు ధర రూ.4320 ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ యేడాది క్వింటాలుకు రూ.5,450 మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కంటే ఈ యేడాది క్వింటాలు పత్తికి రూ.1130 పెంచింది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో పత్తి కొనుగోళ్లు జరుగుతున్నాయి. గతేడాది పండించిన పత్తి క్వింటాలుకు రూ.5,200 నుంచి రూ.4,600 వరకు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. అదే ఈ ఖరీఫ్‌లో పండించిన పత్తికి రూ.5,250 నుంచి రూ.4,600 వరకు కొనుగోలు చేస్తున్నారని సమాచారం. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం ఈ ధరతో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా లేమని కొంతమంది వ్యాపారులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ల ధర రూ.22వేలు, పత్తి గింజలు క్వింటాలుకు రూ.2100 ఉందని వారు చెబుతున్నారు. రూ.5వేల వరకే తమకు గిట్టుబాటు అయ్యేవిధంగా ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. దీంతో ఈయేడు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. సీసీఐ తేమ కొర్రీ విధించనుండడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారే అవకాశాలు లేకపోలేదు. 8శాతం తేమ వరకు మాత్రమే సీసీఐ రూ.5450 ధర చెల్లించనుంది. ఆపై తేమ శాతం ఉంటే క్వింటాలుకు రూ.54.50 కోత విధించనున్నారు. 12శాతం తేమ మించితే మాత్రం పత్తిని కొనుగోలు చేయరు. దీంతో గత్యంతరం లేక రైతులు వ్యాపారులకు పంటను అమ్మి నష్టపోవాల్సిన పరిస్థితి. అధికారులు స్పందించి వ్యాపారులకు నచ్చజెప్పి ఒప్పిస్తే తప్పా రైతులకు మద్దతు ధర లభించే పరిస్థితి కానరావడంలేదు. గతేడాది లభించని వైనం.. గత ఏడాది రైతులు వ్యాపారుల చేతిలో తీవ్రంగా నష్టపోయారు. వ్యాపారులు సిండికేట్‌గా మారడంతో మద్దతు ధర కరువైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు వారిని నచ్చజెప్పినా ధరలో మాత్రం మార్పు జరగలేదు. వ్యాపారులు నిర్ణయించిన ధరకే కొనుగోళ్లు జరిపారు. గతేడాది పత్తి క్వింటాలుకు మద్దతు ధర రూ.4320 ఉండగా, మొదటి రోజు క్వింటాలుకు రూ.4వేలు మాత్రమే చెల్లించారు. ఆ తర్వాత రోజుకు రూ.10 నుంచి రూ.20 వరకు పెంచుతూ కొనుగోళ్లు జరిపారు. రైతుల వద్ద పత్తి పంట ఉన్నప్పుడు ధర పెంచని వ్యాపారులు పంట విక్రయించిన తర్వాత చివరిలో పత్తి పంట ధరను పెంచుతూ రావడం ఆనవాయితీగా మారుతోంది. దీంతో ఆరుగాలం పంట పండించిన రైతులు నష్టాలను చవిచూడగా, వ్యాపారులు మాత్రం లాభాల బాటలో పయనిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సీసీఐ ద్వారానే కొనుగోళ్లు.. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈ నెల 17 నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించనున్నారు. గత రెండేళ్ల నుంచి ఆదిలాబాద్‌లో ప్రైవేట్ వ్యాపారుల ద్వారానే అధికంగా కొనుగోళ్లు జరుగుతుండగా, సీసీఐ నామ్‌కే వాస్తేగా కొనుగోళ్లు జరుపుతోంది. కానీ ఈసారి వ్యాపారులు వెనక్కి తగ్గే అవకాశాలు అధికంగా ఉండడంతో సీసీఐ రంగంలో ఉండే పరిస్థితి నెలకొంది. కాగా సోమవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ నెల 10 నుంచే పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించినప్పటికీ తాము ఎలాంటి ఏర్పాట్లు చేసుకోలేదని, 17వ తేదీ నుంచే కొనుగోళ్లు చేస్తామని జేసీకి విన్నవించారు. ఇంకా కార్మికులు అందుబాటులో లేరని, విద్యుత్ సౌకర్యం ఈ నెల 20 నుంచి అందుబాటులోకి వస్తుందని జేసీ దృష్టికి తీసుకెళ్లారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర లేదు గతేడాది కంటే ఈయేడాది అంతర్జాతీయ మార్కెట్లో పత్తి బేళ్ల ధర పడిపోయింది. ప్రస్తుతం దూది ధర కండికి రూ.44వేలు పలుకుతోంది. క్వింటాలు పత్తి గింజలకు రూ.2100 మాత్రమే ఉంది. ఈ లెక్కన చూస్తే పత్తి క్వింటాలుకు రూ.5వేల నుంచి రూ.5100 వరకు చెల్లించే అవకాశం ఉంది. ఆపై ధర పెంచితే మాకు గిట్టుబాటు కాని పరిస్థితి. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే ధర పెంచి కొనుగోలు చేయడంలో మాకెలాంటి అభ్యంతరం లేదు. – అజీజ్, ప్రైవేట్ వ్యాపారి, ఆదిలాబాద్ -
తెల్ల బంగారమేనా..!
సాక్షి, ఆదిలాబాద్: కేంద్ర ప్రభుత్వం పత్తికి గత ఏడాది కంటే ఈసారి మద్దతు ధర పెంచడం ఊరటనిచ్చినా.. కొనుగోళ్లలో రైతుకు గిట్టుబాటయ్యే ధర లభిస్తేనే లాభం చేకూరుతుంది. ఏటా కొనుగోళ్లలో తేమ, నాణ్యత కారణంగా ధరలో కోత విధించడంతో న్యాయం చేయాలంటూ రైతులు ఆందోళనలు చేపట్టడం జిల్లాలో జరుగుతూనే ఉంది. ఈ యేడాది ప్రకృతి రైతుపై కన్నెర్ర చేసింది. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే పంట నష్టం చవిచూశారు. దిగుబడిపై తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభిస్తేనే పత్తి రైతుకు న్యాయం జరిగే పరిస్థితి ఉంది. తెల్ల బంగారం ఈసారి రైతు మోములో తళుక్కుమనిపిస్తుందా అనే సందేహం వ్యక్తమవుతోంది. 23లక్షల క్వింటాళ్ల దిగుబడి అంచనా.. జిల్లాలో ఈయేడాది 1.28 లక్షల హెక్టార్లలో పత్తి పంట సాగైంది. గతేడాది 1.21 లక్షల హెక్టార్లలో సాగు కాగా, మార్కెట్లో 23లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు జరిగాయి. ఈయేడాది సుమారుగా అంతే దిగుబడులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా గతేడాది హెక్టార్‌కు 15 నుంచి 16 క్వింటాళ్ల దిగుబడి రాగా, ఈ యేడాది 20 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ప్రధానంగా జిల్లాలో ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో1.24 లక్షల ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. ఇందులో అత్యధికంగా 93వేల ఎకరాల్లో పత్తి పంటకే నష్టం చేకూరింది. మిగిలిన పంటలోనూ పత్తి దిగుబడిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మద్దతు ధరపైనే వారు ఆశలు పెట్టుకున్నారు. మద్దతు ధర రూ.5,450 2018–19 కోసం కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధరలో నాణ్యమైన పత్తి క్వింటాలుకు రూ.5,450 ప్రకటించడం జరిగింది. సాధారణ పత్తి క్వింటాలుకు రూ.5,150 ప్రకటించారు. గతేడాది నాణ్యమైన పత్తికి రూ.4320 ఉండగా, సాధారణ పత్తికి రూ.4,020 ఇవ్వడం జరిగింది. కాగా ప్రస్తుతం పెంచిన మద్దతు ధరలతో రైతుకు అదనంగా రూ.వెయ్యికి పైగా లభిస్తున్నప్పటికీ పత్తి తేమ, నాణ్యత విషయంలో మళ్లీ రైతుకు కొర్రీలు పెట్టిన పక్షంలో రైతుకు మద్దతు ధర లభించడం గగనమే. పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు.. పత్తి కొనుగోళ్ల కోసం మార్కెట్ కమిటీల్లో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఆదిలాబాద్–బి, బేల, ఇచ్చోడ, ఇంద్రవెల్లి, బోథ్, నేరడిగొండ, పొచ్చర, సొనాల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆయా మార్కెట్ యార్డుల్లో పత్తి తూకం యంత్రాలను సరిచేయాల్సి ఉంది. కాగా జిల్లాలో సాధారణంగా దసరాకు పత్తి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. అక్టోబర్ 1 నాటికి మార్కెట్ యార్డులన్ని సిద్ధంగా ఉంచాలని మార్కెటింగ్ శాఖ నుంచి ఆదేశాలు వెలబడ్డాయి. ఈ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. మరోపక్క సీసీఐకి జిన్నింగ్ మిల్లు అద్దెకు ఇచ్చే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సోమవారం నాటికి టెండర్ల గడువు ముగిసినప్పటికీ జిన్నింగ్ మిల్లు అద్దె వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అక్టోబర్ 10 నాటికి పత్తి మార్కెట్‌కు.. అక్టోబర్ 10 నాటికి పత్తి మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉంది. గతేడాది కూడా ఇదే సమయంలో దిగుబడులు రావడం జరిగింది. మార్కెట్ యార్డుల్లో ఏర్పాట్లు చేస్తున్నాం. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు పనులు ప్రారంభించాం. – శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి, ఆదిలాబాద్ -
మద్దతు దక్కేలా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పత్తి కొనుగోళ్లకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీ ఐ) ఏర్పాట్లు చేస్తోంది. పత్తికి మద్దతు ధర కల్పించడానికి సీసీఐ ప్రత్యేక కేంద్రాలు నెలకొల్పేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. జిల్లా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 11 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఆయా జిన్నింగ్ మిల్లుల్లోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. గతేడాది ఏర్పాటు చేసిన ప్రాంతాల్లోనే ఈ సారి కూడా కొనుగోలు కేంద్రాలు తెరుచుకోనున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 68 వేల హెక్టార్లలో సుమారు లక్ష మందికిపైగా రైతులు పత్తి సాగు చేశారు. సుమారు 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారుల అంచనా ప్రస్తుతం పత్తి వివిధ దశల్లో ఉంది. మాడ్గుల, కొందర్గు, చౌదరిగూడ తదితర ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. వర్షానికి వర్షానికి మధ్య చాలా రోజుల విరామం ఉండడంతో మొక్కల్లో ఎదుగుదల లోపించింది. దీనికితోడు పోషకాల లేమి కూడా ఎదురైంది. దీంతో పూర్తిస్థాయిలో పూత దశకు చేరుకోలేదు. నవంబర్ రెండో వారం నుంచి పత్తి దిగుబడి మొదలవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ లోగా అంటే న వంబర్ ఒకటి కల్లా కొనుగోలు కేం ద్రాలు తెరచాలన్న యోచనలో సీసీఐ ప్రతిని ధులు ఉన్నారు. గతేడాది వరకు దిగుబడి ప్రారంభ దశలో సీసీఐ కేంద్రాలు తెరచుకోలేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించి తీవ్రంగా నష్టపోయారు. వారు నిర్ణయించిందే ధరగా రైతు లు అమ్ముకున్నారు. ఈసారి ఇటువంటి పరిస్థితి రాకుండా దిగుబడి ఆరంభానికి ముందే కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రైతుకు ‘మద్దతు’.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పత్తి మద్దతు ధరను పెంచిన విషయం తెలిసిందే. గతేడాది వరకు క్వింటా పత్తి రూ.4,320 ఉండగా దీన్ని తాజాగా రూ.5,450కు పెంచడం విశేషం. ఈ పెంపు రైతులకు ఊరట కలిగించే అంశం. రైతులు పత్తిని వ్యాపారులకు కాకుండా సీసీఐ కేంద్రాల్లోనే విక్రయిస్తే మేలు జరుగుతుంది. ఈ మేరకు త్వరలో రైతులకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది రైతుల పేరిట వ్యాపారులు సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రైతుల నుంచి వివిధ సాకులతో తక్కువ ధరకు పత్తిని వ్యాపారులు సేకరించారు. ఆ తర్వాత సీసీఐ కేంద్రాల్లో అమ్మి మద్దతు ధరకు కాస్త అటుఇటుగా లాభపడ్డారు. అయితే రైతుల సమగ్ర వివరాలతో రూపొందించిన క్యూఆర్ బార్ కోడ్ కార్డులు రైతులకు ఆలస్యంగా అందజేయడంతో పెద్దగా వారికి ఒరిగిందేమీ లేదు. గతేడాది అందజేసిన క్యూర్ బార్ కోడ్ కార్డుల ద్వారానే రైతుల నుంచి సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయించేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో సుమారు 80 వేల మంది రైతుల వద్ద ఆ కార్డులు ఉన్నాయి. ఐదేళ్లపాటు ఈ కార్డులు మనుగడలో ఉంటాయని జిల్లా మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఛాయదేవి తెలిపారు. కార్డులు లేని రైతులు ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం, వ్యవసాయ అధికారుల ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగా పత్తిని విక్రయించుకోవచ్చని పేర్కొన్నారు. -
తేమ శాతం ఆధారంగా మద్దతు ధరలు
సీసీఐ, మార్క్ఫెడ్లకు పూనం మాలకొండయ్య ఆదేశం హైదరాబాద్: పంటలో ఏర్పడిన తేమ శాతం ఆధారంగా పత్తికి మద్దతు ధరలు చెల్లిస్తున్నామని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. కనీస మద్దతు ధరల అమలుపై ఆమె ఆదివారం సంబంధిత మార్కెటింగ్, వ్యవసాయ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మద్దతు ధర చెల్లింపులపై సమీక్షించారు. ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మద్దతేది... మహాప్రభో’ కథనానికి స్పందించిన మాలకొండయ్య ఈ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 8 శాతం తేమ ఉంటే రూ. 4,050 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు. 9 శాతం ఉంటే రూ. 4,009.50, 10 శాతం ఉంటే రూ. 3,969, 11 శాతం ఉంటే రూ. 3,929.50, 12 శాతం ఉంటే రూ. 3,888 చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. తెలంగాణలో 16.76 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయగా 205.77 లక్షల క్వింటాళ్లు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశామని తెలిపారు. పత్తి, మొక్కజొన్న, వరి రైతులకు కనీస మద్దతు ధర చెల్లించే విషయంలో ధాన్యం అయిపోయేంత వరకు కొనుగోళ్లు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), మార్క్‌ఫెడ్ సహా వివిధ కొనుగోలు సంస్థలను మాలకొండయ్య ఆదేశించారు.