పత్తి రేటుకు విపత్తు! | Cotton prices fell in the market farmers worry | Sakshi
Sakshi News home page

పత్తి రేటుకు విపత్తు!

Published Tue, Oct 15 2024 3:58 AM | Last Updated on Tue, Oct 15 2024 3:58 AM

Cotton prices fell in the market farmers worry

మార్కెట్లో పడిపోయిన ధరలు.. తక్కువ రేటుకు కొంటున్న వ్యాపారులు, దళారులు 

మద్దతు ధర రూ.7,521.. రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్నది రూ. 5 వేల నుంచి రూ.7 వేలలోపే..

పత్తి పంట రాక పెరిగితే ధరలు ఇంకెంత తగ్గిస్తారోనని రైతుల ఆందోళన 

రాష్ట్రంలో ఇంకా కొనుగోళ్లు ప్రారంభించని సీసీఐ.. కేంద్రాల ఏర్పాటు సన్నాహాలే లేని దుస్థితి..

సర్కారు స్పందించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారంటున్న నిపుణులు 

బంగ్లాదేశ్, పశ్చిమాసియాలలో అశాంతితో ఎగుమతులు తగ్గడమూ రేట్ల పతనానికి కారణమంటున్న అధికారులు! 

గుజరాత్‌లో మాత్రం మద్దతు ధరకు మించి రూ.8,257 రేటుతో కొనుగోళ్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పత్తికి ధరల విపత్తు వచ్చింది. సీజన్‌ మొదట్లోనే, మార్కెట్లోకి పత్తి రావడం మొదలవుతుండగానే రేటు తగ్గిపోయింది. వ్యాపారులు, దళారులు ధరలు బాగా తగ్గించేశారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.7,521 అయితే.. సోమవారం వరంగల్‌ మార్కెట్‌లో కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ. 6,950 వరకు మాత్రమే పలికింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోనూ రూ.5,500 నుంచి గరిష్టంగా రూ.7,000కు మించి చెల్లించలేదు. దీనితో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రెండు, మూడు వారాల క్రితం క్వింటాల్‌కు రూ. 8,250 వరకు ధర చెల్లించినా.. ఇప్పుడు ఒక్కసారిగా తగ్గించేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లోకి పత్తి రాక పెరిగితే.. ధరలను ఇంకెంత తగ్గిస్తారోనని వాపోతున్నారు. మార్కెట్‌కు పత్తి రాక ప్రారంభమైనా ‘కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)’ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో.. వ్యాపారులు, దళారులు రేటు తగ్గించేస్తున్నారని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే.. రైతులు తీవ్రంగా నష్టపో­వాల్సి వస్తుందని వ్యవసాయ, మార్కెటింగ్‌శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. రెండేళ్ల క్రితం పత్తి ధరలు రూ. 10–15 వేల వరకు పలికాయని.. ఇప్పు­డు దారుణంగా పడిపోయాయని అంటున్నాయి.  

పత్తి విస్తీర్ణంలో రాష్ట్రం మూడో స్థానం 
వానాకాలం సీజన్‌లో దేశవ్యాప్తంగా 2.74 కోట్ల ఎకరాల్లో పత్తి సాగైంది. మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రలో అత్యధికంగా 98.47 లక్షల ఎకరాల్లో.. రెండో స్థానంలో ఉన్న గుజరాత్‌లో 56.56 లక్షల ఎకరాల్లో సాగవగా.. తెలంగాణ 43.76 లక్షల ఎకరాల సాగుతో మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా 1.60 కోట్ల మెట్రిక్‌ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేయగా.. అందులో తెలంగాణలో 25.33 లక్షల మెట్రిక్‌ టన్నుల మేర వస్తుందని రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ వర్గాలు అంచనా వేశాయి. నిజానికి ఖరీఫ్‌ సీజన్‌ మొదట్లో పత్తి విత్తనాలు వేసేందుకు అనువైన వర్షాలు పడలేదు. 

విత్తనాలు వేసినా, వర్షాల్లేక రెండు, మూడు సార్లు వేయా­ల్సి వచ్చింది. పత్తి పూత దశకు వచ్చిన సమయంలో భారీ వర్షాలు పడ్డాయి. చేన్లు నీట మునిగి.. పూత, కాయ నేలరాలాయి. కొమ్మలు నీటిలో నాని, తెగుళ్లు సోకి దెబ్బతిన్నాయి. అంతేకాదు.. ఈసారి పత్తి విత్తనాల ధరలు, ఎరువులు, డీజిల్, ఇతర ఖర్చులు పెరిగి.. పెట్టుబడి తడిసిమోపెడైంది. ఇలాంటి సమయంలో పత్తి ధరలు తగ్గించేస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వాస్తవంగా తేమ 8 శాతం, ఆలోపు ఉంటే పూర్తి మద్దతు ధర లభిస్తుంది. 9 శాతం నుంచి 12 శాతం మధ్యలో ఉంటే.. శాతాన్ని బట్టి అదే తరహాలో ధర తగ్గుతూ వస్తుంది. కానీ నాణ్యత బాగున్నా వ్యాపారులు, దళారులు తక్కువ ధర చెల్లిస్తున్నారని రైతులు వాపోతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో రంగు మారిన పత్తికి కూడా కనీస మద్దతు ధర దక్కేలా చూడాలని కోరుతున్నారు. 

ఇప్పటికీ తెరుచుకోని సీసీఐ కొనుగోలు కేంద్రాలు... 
ఈ నెలాఖరు నుంచి మార్కెట్లోకి పెద్ద ఎత్తున పత్తి రానుంది. ఈ ఏడాది 351 పత్తి కొనుగోలు కేంద్రాలు పెట్టాలని నిర్ణయించారు. కానీ ‘కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)’ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలేవీ ప్రారంభించలేదు. జిన్నింగ్‌ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా పెట్టి సీసీఐ పత్తి కొనుగోళ్లు చేస్తుంది. మిల్లులు ఆ పత్తిని జిన్నింగ్‌ చేసి సీసీఐకు అప్పగించాల్సి ఉంటుంది. 

టెండర్ల ద్వారా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి టెండర్లు ఇటీవలే పూర్తయినా.. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ప్రారంభం కాలేదు. పైగా ఏటా వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేశాక.. సీసీఐ వచ్చి ప్రైవేట్‌ వ్యాపారుల నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారిందని.. అందులో భారీగా సొమ్ము చేతులు మారుతోందనే ఆరోపణలు ఉన్నాయి. 

రైతుల అవసరం.. వ్యాపారుల సాకులు.. 
రైతులు చేన్లలో మూడు దశల్లో పత్తిని తీస్తారు. అందులో మొదటి, రెండోసారి ఎక్కువ పత్తి వస్తుంది. రైతులు ఇందులో మొదట ఏరే పత్తిని నిల్వ చేయకుండా మొత్తంగా విక్రయిస్తారు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చేందుకు, ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటున్న వ్యాపారులు, దళారులు పత్తిని తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. 

ఇందుకోసం తేమ శాతం అధికంగా ఉందని, ఇటీవలి భారీ వర్షాలు, వరదలకు పంట నాణ్యత కోల్పోయిందని సాకులు చెప్తున్నారు. పలు దేశాల్లో సంక్షోభ పరిస్థితులతో పత్తికి మార్కెట్‌ తగ్గిందని.. టెక్స్‌టైల్‌ మిల్లులు మూతపడ్డాయని చెబుతూ తక్కువ రేటు చెల్లిస్తున్నారు. చాలాచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను దోచుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

బంగ్లాదేశ్‌ సంక్షోభమూ కారణమే! 
మన దేశంలో పండే పత్తి అధికంగా బంగ్లాదేశ్, చైనా, వియత్నాం, టర్కీ, పాకిస్తాన్‌ దేశాలకు ఎగుమతి అవుతుంది. కొన్నాళ్లుగా బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం, పశ్చిమాసియా దేశాల్లో అల్లకల్లోలంతో ఎగుమతులు తగ్గుతున్నాయి. దీనితో పత్తికి డిమాండ్‌ తగ్గి, ధరలు పడిపోతున్నాయని మార్కెటింగ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కానీ గుజరాత్‌ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కంటే అధిక రేట్లకు పత్తి కొనుగోళ్లు జరుగుతుండటం, తెలంగాణలో తగ్గిపోవడం ఏమిటన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. 

మార్కెటింగ్‌ శాఖ వర్గాలు చెప్తున్న మేరకు.. గుజరాత్‌లో ప్రస్తుతం పత్తి క్వింటాల్‌కు రూ.8,257 పలుకుతోంది. వచ్చే నెలలో రూ.8,321 వరకు, డిసెంబర్‌ నెలలో రూ.8,260 వరకు ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. గుజరాత్‌లో వస్త్ర పరిశ్రమలు, మిల్లులు, వ్యాపారులు ఎక్కువగా ఉండటం వల్ల.. కొనుగోళ్లు ఎక్కువగా ఉండి, పత్తి ఎక్కువ రేటు పలుకుతోందనే వాదనలూ ఉన్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం గుజరాత్‌పై ఫోకస్‌ పెట్టి.. ఇతర రాష్ట్రాల రైతులను పట్టించుకోవడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. 

కనీస ధర కూడా ఇవ్వడం లేదు 
ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం పత్తికి రూ.7,521 మద్దతు ధర ప్రకటించింది. కానీ మార్కెట్లో ఆ ధర దక్కడం లేదు. వ్యాపారులు రూ.6,500 నుంచి రూ.7,000కు మించి ధర పెట్టడం లేదు. అంతేకాదు నాణ్యత పేరిట మరింతగా తగ్గిస్తున్నారు. సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మద్దతు ధర లభిస్తుంది. అందుకోసమే ఎదురుచూస్తున్నాం. 
– బానోత్‌ రామా, బీసురాజుపల్లి తండా, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మంజిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement