వ్యాపారులు ధర తగ్గించి కొనుగోలు చేయడంపై ఆందోళన
8–12 శాతం తేమను పరిగణనలోకి తీసుకుని కొనుగోలుకు సీసీఐ నిర్ణయం∙
రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులతో 8–25 శాతం వరకు తేమ నమోదు
తేమ శాతం సవరించాలని రైతుల వినతి
సాక్షి ప్రతినిధి, వరంగల్: పత్తి రైతులకు ఈసారి కూడా గిట్టుబాటు కాదు కదా కనీస మద్దతు ధర (ఎమ్మెస్సీ) కూడా దక్కేటట్లు లేదు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి తీసే దశలో వర్షాలు, తద్వారా నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా పత్తిలో తేమ 15 నుంచి 18 శాతంగా నమోదవుతోంది. దీన్ని సాకుగా తీసుకుని వ్యాపారులు తక్కువ ధరకు పత్తిని కొనుగోలు చేస్తున్నారు. తేమ పేరిట భారీగా ధరలు తగ్గించడంపై వరంగల్, ఆదిలాబాద్ మార్కెట్‌లలో రైతులు ఆందోళనకు దిగారు.
2024–25 సంవత్సరంలో పత్తి ఎమ్మెస్సీ క్వింటాల్‌కు రూ.7,521 అని కేంద్రం ప్రకటించింది. 8–12 మధ్య తేమను పరిగణనలోకి తీసుకుని కొత్త పత్తిని కొనుగోలు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ణయించింది. అయితే వ్యాపారులు తేమ ఎంత ఎక్కువ ఉంటే అంత ధరలో కోత విధించడం, రైతులు పెద్దయెత్తున ఆందోళనలకు దిగడంతో పత్తి కొనుగోళ్ల ప్రారంభం దశలోనే గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 15 నుంచి 18 శాతం తేమను పరిగణనలోకి తీసుకుని కొనుగోలు చేయాలని కోరుతూ శుక్రవారం తెలంగాణ కాటన్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాసింది.
ఆదిలోనే కష్టాలు
ఈ వానాకాలంలో మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా, మిగతా అన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో 43.76 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా, ఎకరానికి 8 క్వింటాళ్ల చొప్పున 35,00,800 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆ మేరకు కొనుగోళ్లు చేసేందుకు సీసీఐ ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ బ్రాంచిల పరిధిలోని 30 జిల్లాల్లో 115 సెంట్లరను ప్రతిపాదించింది. ఇప్పుడిప్పుడే పత్తి తీసే పనులు ముమ్మరం కాగా, మార్కెట్లోకి కొత్త పత్తి వస్తున్న నేపథ్యంలో వ్యాపారులు తేమను సాకుగా చూపుతూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మద్దతు ధరకు తూట్లు
పత్తిలో ఉన్న తేమ, రంగును బట్టి వ్యాపారులు ధరను నిర్ణయించాల్సి ఉంది. తేమశాతం ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం 8 నుంచి 12 వరకు తేమ శాతం ఉన్న పత్తిని మాత్రమే కొనుగోలు చేసేందుకు దళారులు ఆసక్తి చూపిస్తున్నారు. 8 శాతం కన్నా ఎక్కువగా ఉన్న ఒక్కో శాతానికి కిలో ధర చొప్పున కోత విధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న వాతావరణ పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో పత్తిలో తేమ 18–25 శాతం వరకు నమోదవుతోంది. ఆ స్థాయిలో ఉన్న పంటకు క్వింటాల్‌కు రూ.5,500 వేల నుంచి రూ.6,300 మధ్య మాత్రమే ధర పలుకుతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
15–18 శాతంగా సవరించాలి
తేమ శాతం 15–18గా సవరించాలని కోరుతూ కేంద్రమంత్రికి లేఖ రాశాం. ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు పత్తి రైతులకు మద్దతు ఇవ్వకపోతే దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ దీర్ఘకాలిక ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. రాష్ట్ర పత్తి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 15–18 శాతం తేమతో ఎమ్మెస్పీకి కొనుగోలు చేయాల్సిందిగా సీసీఐని కేంద్రం ఆదేశించాలి. – బొమ్మినేని రవీందర్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ కాటన్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment