
లారీ కింద పడి ఇద్దరు మహిళా కూలీలు మృతి
రామకిష్టాపూర్(టి)లో ఘటన
సాయంత్రం పనికి వెళ్లకుంటే బతికేవారేమో..
జయశంకర్: రెక్కాడితే గాని డొక్కాడని రెండు నిరుపేద కుటుంబాలను మృత్యువు వెంటాడింది. ఉదయం కూలీకి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. ఖాళీగా ఉంటే ఏముంటుంది..? అదనపు కూలీకి వెళ్తే పూట అయినా గడుస్తుంది కదా అనే ఆశతో సాయంత్రం కూడా వెళ్లారు. అయితే ఈ కూలే వారికి చివరిది అవుతుందని అనుకోలేదు. పాపం.. పని వెళ్లకున్నా బతికేవారేమో. మృత్యువు లారీ రూపంలో ఇద్దరు మహిళా కూలీలను కబలించింది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రామకిష్టాపూర్(టి)లో మంగళవారం చోటు చేసుకుంది. ప్రత్యక్షుల కథనం ప్రకారం..
రామకిష్టాపూర్(టి) గ్రామానికి చెందిన మోకిడి పూలమ్మ(45), మోకిడి సంధ్య(30)తోపాటు మరో ఆరుగురు కూలీలు ఉదయం పనులకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చారు. సాయంత్రం వేళలో కూడా మళ్లీ అదే గ్రామానికి చెందిన సల్పాల బుచ్చయ్య అనే రైతు పొలంలోని పని చేయడానికి వెళ్తున్నారు. సరిగా పొలం వద్దకు చేరుకునే సమయానికి చిట్యాల మండలం శాంతినగర్ శివారు కాటన్ మిల్లు నుంచి అతివేగంగా పత్తి గింజల లోడ్‌తో మూలమలుపు వద్ద నుంచి వస్తున్న లారీని గమనించిన కూలీలు కొంత దూరం పరుగులు తీశారు.
ఇందులో ముగ్గురు పొలంలోకి వెళ్లడంతో అక్కడే లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పత్తి గింజల బస్తాలు పడడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తృటిలో తప్పించుకుంది. తోటి మహిళా కూలీలు భయంతో కేకలు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఏఎస్సై అమరేందర్‌రెడ్డి సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకుని జేసీబీ సాయంతో లారీని లేపారు. మృతదేహాలను పత్తి గింజల బస్తాల కింద నుంచి బయటకు తీసి 108లో చిట్యాల సివిల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అప్పటి వరకు అందరి మధ్యలో ఉన్న ఇద్దరు విగత జీవులుగా మారడంతో తోటి మహిళా కూలీల రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారైనట్లు మహిళా కూలీలు తెలిపారు.
పిల్లలు ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా..
మన పిల్లలు ఇక నుంచి ఎవరిని అమ్మా అని పిలవాలి సంధ్యా.. ఒక్కసారి చూడు సంధ్యా.. నా ప్రాణం పోయేలా ఉంది.. అయ్యో దేవుడా ఒక్కసారి బతికించమంటూ సంధ్య భర్త రాజు రోదించిన తీరు చిట్యాల సివిల్ ఆస్పత్రిలో ప్రతీ ఒక్కరిని కంట తడి పెట్టించింది. అమ్మా లే.. అమ్మా లే.. అంటూ చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పూలమ్మ భర్త, కూతురు సైతం కన్నీరుమున్నీరయ్యారు. సంధ్య, పూలమ్మ కుటుంబ సభ్యులు పెద్దఎత్తున చిట్యాల సివిల్ ఆస్పత్రికి చేరుకుని వారి మృతదేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు.